ఆధునిక నాగరిక సమాజాల్లో రాజ్యాంగబద్ధ పాలన ఉంటుంది. ఈ ప్రాథమిక లక్షణాన్నే మనం ప్రజాస్వామ్యం అంటున్నాం. ఇందులో రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి ప్రజలచేత ఎన్నికైన ప్రజాప్రతినిధుల పాలన. రెండు ఆ పాలనకు దిశా నిర్దేశం చేసి గాడి తప్పకుండా నియంత్రించే న్యాయ వ్యవస్థ, పత్రికారంగం. ఈ రెండు పార్శ్వాలు చక్కగా పనిచేసినప్పుడే అది ఆధునిక ప్రజాస్వామిక సమాజం అవుతుంది. ఇవేగాక సమాజంలోని స్వతంత్ర సంస్థలు ప్రజాస్వామికీరణకు దోహదం చేస్తాయి, దానిని వేగవంతం చేస్తాయి. కానీ మనదేశంలోనే కాక చాలా దేశాలలో ఎన్నికల ప్రక్రియ ద్వారా గద్దె ఎక్కిన పాలకులు ఆధునిక ప్రజాస్వామిక విలువలను ధ్వంసం చేస్తున్నారు. ఏం చేసైనా అధికారంలోకి రావడమే వారికి పరమావధిగా మారింది. దీంతో రాజ్యాంగ నైతికత, రాజ్యాంగ మౌలిక ఆదర్శాలు, విలువలు మాయమవుతున్నాయి.
భారత రాజ్యాంగం ప్రకారం కులం, మతం, ప్రాంతం, భాష, జెండర్, వర్గం వంటి భేదాలు లేకుండా దేశ పౌరులందరూ సమానులే. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలతో కూడిన నిజమైన లౌకిక ప్రజాస్వామిక దేశాన్ని నిర్మించవలసిన బాధ్యత ప్రభుత్వాలదే. దీని కోసం సమాజంలో హేతుబుద్ధిని, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంచి, దేశాన్ని ఆధునికంగా తీర్చిదిద్దవలసి ఉన్నది. కానీ అనేక అసమానతలు, అంతరాలు, ఆధిపత్యాలు దేశంలో కొనసాగుతూనే ఉన్నాయి. అధికశాతం ప్రజలు కుల, మత, పితృస్వామిక అణచివేతలకు గురవుతున్నారు. బహుళ అస్తిత్వాలకు, భిన్న ఆహారపు అలవాట్లకు, ఆహార్యాలకు, భిన్న భాషా సంస్కృతులకు, విశ్వాసాలకు చోటు లేకుండా పోతున్నది. వైవిధ్యంతో ప్రజలు జీవించటాన్ని సహించని వాతావరణం తీవ్రమవుతున్నది. మన సామాజిక రాజకీయ పరిస్థితులు అసహనాన్ని, విద్వేషాన్ని, సాంస్కృతిక ఆధిపత్యాన్ని రోజురోజుకూ పెంచుతున్నాయి.
మొత్తంగా ఉపశ్రేణి సమూహాల భిన్న సంస్కృతులను ఆధిపత్య సంస్కృతి నిరంకుశంగా అణచివేస్తున్నది. పీడిత ప్రజా సమూహాల మధ్య విద్వేషాలను సృష్టిస్తున్నది. వీటి నుంచి ప్రజలలో రేకెత్తే భావోద్వేగాలను పాలకులు ఓట్లుగా మలుచుకుంటూ ఉన్నారు. అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ మౌలిక స్ఫూర్తినే దెబ్బ తీస్తున్నారు. ఏకరూప సంస్కృతిని అందరి మీదా రుద్దుతున్నారు. మతతత్వ ధోరణులను ప్రవేశపెట్టి అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు. చారిత్రకంగా భిన్న మత సముదాయాల మధ్య కొనసాగుతున్న సామరస్య, సహజీవన విలువలన్నిటినీ పాతర వేస్తున్నారు. చరిత్రలోని వైరుధ్యాల, వైషమ్యాల జ్ఞాపకాలను మాత్రమే నొక్కి చెబుతున్నారు. వీటి ప్రాతిపదిక మీద దేశ చరిత్రను తిరగరాస్తున్నారు. పౌర సమాజ సంబంధాలలో, రాజ్య నిర్వహణలో మతప్రసక్తి ఉండరాదనే లౌకిక వాదాన్ని దెబ్బతీస్తున్నారు. అల్ప సంఖ్యాకుల మతాలను శత్రువుగా చూపెడుతూ అధిక సంఖ్యాక మతస్తులను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. లౌకికవాదమంటే మైనారిటీలను బుజ్జగించటం అనే విపరీత అర్థాన్ని ఫాసిస్టు పాలకులు సృష్టించారు. తద్వారా మతతత్వాన్ని రెచ్చగొట్టి ప్రజల మెదళ్లలో హింసోన్మాదాన్ని నింపటానికి ప్రయత్నిస్తున్నారు.
దీనినే దాదాపు యాభై ఏళ్ల క్రితం ప్రజాకవి కాళోజీ ఏకీభవించనోడి పీక నొక్కు సిద్ధాంతమే ఫాసిజం అని చెప్పాడు. ఏకీభవించని వాళ్ళు ఎవరు? రాజ్యాంగం పట్ల స్పృహ, హక్కుల చైతన్యం, ఆధునిక ప్రజాస్వామిక విలువలపట్ల అవగాహన ఉన్నవాళ్లు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలతో వీళ్లు ఏకీభవించడం లేదు. సమాజంలోని సమస్త అసమానతలను ప్రశ్నిస్తున్నారు. అనేక రూపాల్లోని ఆధిపత్యానికి, హింసకు, అణచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజల పోరాటాలకు స్పందిస్తున్నారు. నిరంకుశత్వాన్ని నిరసిస్తున్నారు. అదే దేశద్రోహ నేరం అవుతున్నది. శిక్షార్హం అవుతున్నది. ఇలాంటి వర్తమానంలో మనం ఉన్నాం.
ఈ నేపథ్యంలో హేతుబద్ధత, సమానత్వం, స్వేచ్ఛ, వైజ్ఞానిక చింతన మొదలైన విలువలను, లౌకికవాద స్పృహను సమాజంలో వ్యాపింప చేయటం కవులుగా, కళాకారులుగా, చింతనాపరులుగా మనముందున్న కర్తవ్యం. స్నేహం, ప్రేమ, సహృదయత, సానుభూతి, సహానుభూతి, మానవత్వం వంటి సున్నిత విలువల ఉమ్మడి స్వరాన్ని బాధిత సమూహాల తరపున వినిపించాల్సి ఉన్నది. వ్యక్తులుగానూ, వేరువేరు సంస్థల్లో భాగంగానూ సృజనకారులుగా మనం ఆ పని చేస్తూనే ఉన్నప్పటికీ అది ఇంకా బలహీనంగానే ఉన్నది. దాన్ని బలోపేతం చేయాలంటే మనం ఏకం కావాలి. అలాంటి అత్యవసరమైన సమకాలీన చారిత్రక సందర్భంలో మనం ఉన్నాం. ఈ అవసరాన్ని తీర్చడానికే ఈ వేదిక నిర్మాణం.
ప్రపంచ మార్కెట్ కోసం దేశాల మధ్య చెలరేగిన ఆధిపత్య పోరుకు పుట్టిన వికృత శిశువు ఫాసిజం. ఇది దేశకాల పరిస్థితులనుబట్టి మారుతూ వస్తున్నది. మన దేశంలో భిన్న జాతులను, భిన్న ఆచార సంప్రదాయాలను, భిన్న అభిప్రాయాలను, ప్రతివాదాలను, ప్రతిపక్షాలను సహించని పెను ఉప్పెనగా ఫాసిజం బలపడుతున్నది. బహుళత్వానికి, ప్రజాస్వామ్యానికి ప్రబల శత్రువు ఇది. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారీ వర్గపు ప్రయోజనాల కోసం అది పనిచేస్తున్నది. కాలంచెల్లిన భూస్వామ్య అంధ కుల మత విశ్వాసాలను జాతీయత పేరుమీద ప్రచారం చేస్తున్నది.
మానవతకు, సహనానికి శత్రువు అయిన ఫాసిజం ప్రమాదాన్ని గుర్తించి ప్రతిఘటించటంలో సాహిత్యకారులు వంద సంవత్సరాల నుంచి ముందు భాగాన ఉంటున్నారు. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో ఇటలీ, జర్మనీ స్పెయిన్ దేశాలలో పెచ్చరిల్లిన ఫాసిజం ప్రమాదం నుంచి ప్రజలను, ప్రజా సంస్కృతిని రక్షించాలని అంతర్జాతీయంగా రచయితలు పిలుపు నిచ్చారు. దాన్ని అందుకొని భారతదేశంలో రచయితలు ప్రతి సందర్భంలోనూ ఫాసిస్టు వ్యతిరేక కూటమి వైపు నిలబడ్డారు. అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్యమండలి, ఇప్టా ఏర్పడక ముందే ఈ కృషి ప్రారంభమైంది. ఆ తరువాత మరెన్నో ప్రగతిశీల సాహిత్య సంస్థలతో ఈ ఒరవడి ముందుకు సాగింది. దేశంలో ప్రతిపక్షాన్ని, ప్రతివాదాన్ని తుడిచిపెట్టిన ఎమర్జెన్సీ నిరంకుశత్వాన్ని కూడా తెలుగు సాహిత్యకారులు నిరసించారు. ఆ తర్వాత ఫాసిస్టు ధోరణులు పడగ విప్పినప్పుడల్లా కవులు, రచయితలు ఐక్యమవుతూనే ఉన్నారు.
గుజరాత్ మారణకాండలోని గాయపు నొప్పిని తెలుగు కవులు, రచయితలు, సాంస్కృతిక కార్యకర్తలు తమదిగా అనుభవించారు. ఉమ్మడి నిరసనల రూపంలో కవిత్వంగా వ్యక్తమయ్యారు. పత్రికా రచయితలు పరిశోధనాత్మక నివేదికలు సమర్పించారు. జాతి విద్వేష ఘటనలకు వ్యతిరేకంగా వేదికలు పెట్టి పనిచేసిన అనుభవం మనకు ఉంది. ఆ అనుభవాల నుండి గుణపాఠాలు నేర్చుకొంటూ హేతు దృష్టితో, సత్యశోధనకు, స్వతంత్ర పరిశోధనలకు పూనుకొనాలి. స్వేచ్ఛగా, నిక్కచ్చిగా రాయటానికి, తినటానికి, బతకటానికి అవకాశం రోజురోజుకు తగ్గిపోతున్న పరిస్థితులతో తలపడాలి. మూఢత్వానికి, నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని నిర్మించాలి. పోరాటాలకు సంసిద్ధం చేయాలి. ఆ లక్ష్యాలతోనే ఇప్పుడీ వేదికను నిర్మించుకొంటున్నాం.
వేదిక లక్ష్యాలు :
- స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మౌలిక రాజ్యాంగ విలువలను సామాజిక జీవిత విలువలుగా గుర్తించటం, గౌరవించటం, అమలు కావటానికి ప్రయత్నించటం.
- కులం, మతం, జెండర్, భాష, ప్రాంతం, వర్గం, వయసు, వరుస వంటి అనేక అసమానతలు ప్రజల లోకజ్ఞానంలో వారికి తెలియకుండానే ఇంకిపోయాయి. వారి ప్రవర్తనలను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి రక రకాల ఆధిక్య, న్యూనతా భావనల గురించి, వివక్షను గురించి అవగాహనలను అభివృద్ధిపరచటం.
- వ్యక్తిగత జీవితానికి మాత్రమే పరిమితం కావాల్సిన మతపరమైన భక్తి విశ్వాసాలను సామాజిక ఆవరణలో ఉన్మాదస్థాయిలో ప్రేరేపిస్తున్న పాలకవర్గ దుర్మార్గాన్ని గురించి అవగాహన కల్పించటం.
- కులోన్మాదానికి, మతోన్మాదానికి, అసహనానికి, ద్వేషానికి, మారణహోమానికి కారణమవుతూ ప్రజలను నిలువునా చీలుస్తున్న స్వార్థ అధికార రాజకీయాల గురించి పౌర సమాజంలో చైతన్యాన్ని కలిగించటం. సమాజాన్ని మరింత మానవీయంగా మార్చుకొనే సంసిద్ధతను పెంచడం.
- సమాజంలో ఆధిక్యతా న్యూనతల సంబంధాలు అనుక్షణం ఉత్పత్తి అవుతుంటాయి. స్థిరీకరించబడుతూ ఉంటాయి. వివిధ సంస్థల ద్వారా, రకరకాల మాధ్యమాల ద్వారా అవి కొనసాగుతూ ఉంటాయి. ప్రచారమవుతూ ఉంటాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది విద్యా వ్యవస్థ. ఆధిపత్య వర్గాలకు విద్యావ్యవస్థ భావజాల ప్రచార సాధనంగా మారింది. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనే నైతికతను, శాస్త్రీయతను అభివృద్ధి పరచటం మీద కేంద్రీకరించి పనిచేయటం.
- విద్యారంగం నుంచి నుండి ప్రభుత్వ వ్యవహారాల దాకా సంస్కృతం, హిందీ భాషల ఆధిక్యాన్ని, ఆధిపత్యాన్ని స్థాపించటానికి జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకొనటం.
- అసమానతలతో కొనసాగుతున్న సంస్కృతిని, నాగరికతను ఆధునికత, ప్రజాస్వామికత గీటురాయిగా తీర్చిదిద్దటానికి భావజాలరంగంలో కృషి చేయటం.
వేదిక కార్యక్రమాలు:
రచయితల కోసం అంతర్గతంగా చేయవలసినవి, జనంలోకి తీసుకుపోవటానికి బహిరంగంగా చేయవలసినవి అనే రెండు కోణాలలో వేదిక కార్యక్రమాలు రూపొందించుకొంటుంది.
రచయితల కోసం కార్యక్రమాలు:
- ఫాసిస్టు భావజాల ధోరణులు, ప్రక్రియల గురించి రచయితలుగా మనం సరైన జ్ఞాన చైతన్యాన్ని పెంచుకోవాలి. దీనికి కనీసం దేశవిభజన కాలం నుంచి అయినా దేశ చరిత్రను తిరిగి అధ్యయనం చేయాలి. అందులో భాగంగా భారతీయ ఫాసిజాన్ని అన్ని వైపుల నుండి సమగ్రంగా అర్థం చేసుకోవాలి. దీనికి అవసరమైన అవగాహనా తరగతులను, కార్యశాలలను నిర్వహించుకోవాలి.
- ఫాసిజం గురించి మాట్లేడేటప్పుడు, రాసేటప్పుడు వాడే పదాలు, భాష, పరిభాషల విషయంలో ఎక్కువమందికి ఆమోదయోగ్యంగా, ఎక్కువ మందిని కలుపుకు వచ్చేలా తీసుకోవలసిన జాగ్రత్తలు, సూత్రాలు నిర్దేశించుకొనటానికి చర్చలు నిర్వహించుకోవాలి.
- మనకు తెలియకుండానే మన లోకజ్ఞానంలో కూడా ఇంకిపోయి మనలను నడిపిస్తున్న ఆధిక్య అధికార లక్షణాల గురించి, వివక్ష, న్యూనత భావాల గురించి హెచ్చరికగా ఉండటానికి నిరంతరం సంభాషణలకు అవకాశం కల్పించుకోవాలి. ఎప్పటికప్పుడు మనలను మనం సరిచేసుకొనటానికి సిద్ధంగా ఉండాలి.
- ఈ క్రమంలో మనం ఎదుర్కొనే ఆంతరంగిక, బహిరంగ సంఘర్షణలను సాహిత్య వస్తువు చేయగలిగితే మన సంభాషణ, చర్చ మరింత విస్తారం, అర్థవంతం అవుతాయి.
- ఫాసిజానికి వ్యతిరేకంగా మనం చేసే రచనలను ఎక్కడికక్కడ అధ్యయన సమూహాలను ఏర్పరచుకొని చర్చించుకొనటం ద్వారా రచయితలం నిరంతర సంభాషణలో మరింత సన్నిహితం కావచ్చు.
రచయితల చేత కార్యక్రమాలు:
- ఊడలమర్రిలా సమాజ సంబంధాలలో వేళ్లూనుకొని విస్తరించిన ఫాసిజం బహురూపాలను గుర్తిస్తూ వాటిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో పాటో, కవిత్వమో, కథో, నవలో, నాటకమో, వ్యాసమో రాయటం. పాటలు పాడటం, ప్రదర్శన రూపాలను అభివృద్ధి చేయటం రచయితలుగా, కళాకారులుగా మన మొదటి పని.
- కవి సమ్మేళనాలు, కథా పఠనాలు, పాటల జాతరలు, సాహిత్య పండుగలు, అవగాహనా సదస్సులు, చర్చా గోష్టులు, నాటక ప్రదర్శనలు నిర్వహించటం. వీటిని పాడ్ కాస్టుల ద్వారా, వీడియోల ద్వారా ప్రచారంలో ఉంచటం.
- సృజన విమర్శన విశ్లేషణా రచనలు, కరపత్రాలు ప్రచురించటం.
- సాంకేతిక మాధ్యమాల్లో వివిధ రూపాలను తయారుచేసుకోవడం. తద్వారా సహనశీలమైన సహజీవన విలువలతో కూడిన, సరైన ప్రజాస్వామిక ఆలోచనా విధానానికి ప్రాచుర్యం కల్పించటం.
- అసహన, విద్వేష సంస్కృతిపాలు కాకుండా యువతను హెచ్చరించి సరైన ఆలోచనా విధానం వైపు మళ్లించాలి. దానికి వినూత్న, సృజనాత్మక కార్యక్రమాలతో పాఠశాలలను, కళాశాలలను కార్యక్షేత్రాలుగా చేసుకొని పని చేయటం.
- వైవిధ్య పూరితమైన బహుళ సాంస్కృతిక విలువలను విద్యార్థులలోకి, యువతరంలోకి తీసికెళ్లడానికి తగిన కార్యక్రమాలు రూపొందించుకోవడం.
- కులోన్మాదంతో, మతోన్మాదంతో మారణహోమాలు జరిగిన ప్రతిసారీ మహిళలే మరింత క్రూరమైన దాడులకు గురవుతున్నారు. కాబట్టి ఫాసిస్టు నేపథ్యంలో వివిధ వర్గాల స్త్రీల అనుభవాలను మరింత నిశితంగా అధ్యయనం చేయటం. దానిని సాహిత్య కళా వస్తువుగా మలిచి చర్చలోకి తేవటం.
- రచయితలను, కళాకారులను సమీకరించటానికి జిల్లా స్థాయి రచయితల సమావేశాలు నిర్వహించటం.
- బుద్ధిజీవులను, సామాజిక శాస్త్ర, విజ్ఞాన రంగాలకు సంబంధించిన నిపుణులను, పత్రికా రచయితలను, ప్రగతిశీల ప్రచురణ సంస్థలను వేదికలో చేర్చుకొంటూ వేదికను విస్తరించటం, బలోపేతం చేసుకొనటం.
- మనలాగే ఆలోచించే సంఘాలను, వ్యక్తులను సమీకరించడం.
- తక్షణ అవసరాలపై పని చేస్తూనే దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా వేదిక పని విధానాన్ని రూపొందించుకోవడం.
- వేదిక పక్షాన మూడు నెలలకు ఒక బులిటెన్ ప్రచురించటం.