ఎలక్సన్ లంటేనే బలముండే వోడిదే రాజ్జిం ఇంగ పంచాయతీ ఎలక్సన్లంటే మాటలా? గొడవల్తో మొదులై గొడవల్తో ముగిస్తిందనే సంగతి తెల్సిందే ఈటి వొల్ల గ్రామున్సీపు అట్టా పెద్దోళ్ళకు తప్పించి,మా బోటి పేదా సాదకు వొరిగేదేం ఉండదు.ఇప్పుడే గాదు మనకు సొసంత్రం వొచ్చిన కాణ్ణించి
అయితే ఈ సారి మా ఎస్సీ లకు వొచ్చిందంట అందుకే మా మాలా మాదిగోళ్ళు నువ్వా నేనని పోటీ పడతా ఉండారు మా ఊళ్ళో ఎంగిటిగోడు, దడిగోడు, గెరిగిదల సుబ్బరమణి గోడు, మాదిగిండ్ల ముని కిష్టడు, ఇంత మంది ఎగుర్లాడతా ఉండారు.నేను సరపంచి నేను సరపంచని, దీంట్లో మా ఎంగిటి గాడు అంతో ఇంతో సదువు కున్నోడు ఆఫీసులు ఆడికీ ఈడికి తిరిగి కొంచెం వాలాయ ముంది దడిగోడికి, సుబ్బరమణి, గోడికి పొట్ట బొడిస్తే అచ్చరం ముక్క రాదు.మాదిగిండ్లల్లో మునికిష్టడికి అంత జనకట్టు లేదు వాళ్ళవి మొత్తం గలిపి ఇరవై ఇండ్లే మా వోళ్ళు నాలుగైదు ఊళ్ళుండాయిలే.
ఇంగ సుట్టు పక్కలుండే అగ్ర కులపోళ్ళుకు మా కులపోళ్ళ కుండే వాలాయం జాస్తి. మేము వాలిండ్ల కాడ సావులు గీవులూ చూస్తాం, సచ్చింది పుచ్చింది తెచ్చుకుంటాం, వాళ్ళకి సేద్దెం పన్లు ఎగేస్తాం మిగిల్నోళ్ళు ఉండినా వాళ్ళతో పెద్దగా పనుండదు.
మా ఎస్సీలే పోటీలు సెయ్యాలని రూలైతే జేసుండొచ్చు ఆమాటలంతా ఉళిక్కే మా సేతల్లో ఏమీ ఉండదు.అంతా ఈ పదూళ్ళ పెద్దమడుసుల చేతల్లో ఉంటాది,అందురూ సరేననాల్సిందే.అట్ట సరే అన్నా గ్రామున్సీపు ఒక డుండాడు.ఆయన సరేమనాల ఈ పదూళ్ళ పెద్ద మడుసులు ఆయన సెప్పు సేతల్లోనే ఉంటారు. ఆయన్ని ఎగటాయించి పోటీ చెయ్యాలంటే కాని పని. కొరివితో తల గోక్కునట్టే.
** **
మన్లో మాట ఇక్కడ గ్రామున్సీపంటే గూడా శానా మందికి గిట్టదు. అయితే ఎవ్వురూ బయట పడరు మన కెందుకులే అని సర్దక పోతా ఉంటారు.పైకి బయిపడి నట్టే నటిస్తా ఉంటారు గాని లోలోపల రగిలి పోతా ఉంటారు కిస్తీలు కట్టమని జనాన్ని పీడిస్తాడని.
పోటీ సెయ్యలను కునే ఈ నలుగురూ గ్రామున్సీపింటికి బాట గట్టుకొని తిరగతా ఉండారు.లోపల ఏం జరిగిందో తెల్దు గాని బయటి కొచ్చినాక నన్ను నిలవ మన్నాడని ఒకడంటే లేదు లేదు నన్నే ఉండమన్నాడని ఇంకొకడు ఇట్ట పచారం జేసుకుంటా ఉండారు.
అయితే ఈళ్ళు ఆయన దగ్గిరికి పొయ్యి ఏం మాట్లాడినారో మాత్రం తెల్సింది.నన్ను సరపంచిని జెయ్యిస్తే నువ్వు యాడ ఏలి ముద్రలెయ్య మంటే ఆడేస్తానని ఒకడంటే నన్ను గెలిపిస్తే నీ కాళ్ళ దగ్గిర పడుంటానని ఇంగొకడన్నా డంట ఇంగొకడికి సేతిలో గూడా సెయ్యేసి నాడని సెప్పుకొని తిరగతా ఉండాడు.
ఎంగిటిగోడు ఒకనాడు మమ్మల్నంతా పిల్సక పొయ్యినాడు గ్రామున్సీపు నామనేసన్ ఏసేదానికి రమ్మన్నాడని మేమంతా పొయ్యి ఆయని దగ్గర మడిజేతులు గట్టుకొని నిలబడి”అయ్యా!మా ఎంగిటిగోడు అంతో ఇంతో సదువుకున్నోడు ఈ సారికి ఈడిని సరపంచిని జేస్తే మా ఊరికి మంచి జరిగి తింది మేము మీ మాటకు జవదాటం” అని అడుకున్నాము.
ఆయన శానాసేపు ఏమీ మాట్లాడ లేదు మల్ల ఏం ఆలోసెనొచ్చిందో నాతో అన్నాడు”ఒరే బుడ్రంగా మొత్తం నలుగు రెదుగురు పోటీ బడతా ఉండారు.మీలో ఒకర్తో ఒస్తే ఒకరికి బాద మీరు పొయ్యి నామినేసన్ ఏసెయ్యండి,మల్ల నేను సూసు కొంటాను” అంటే అదీ నిజమే గదా అని పొయ్యి నామినేషన్ ఏసేసి వొచ్చేసి నాము.
** **
రెండోరోజో మూడోరోజో విత్తుడ్రా అంటే పోతిమి ఎందుకంటే గెట్టో పొట్టో ఎవురుండేది ఎవురు పోయేది ఆపొద్దిటితో తేలి పోతింది కదా అందుకని కాని అక్కడికి పొయ్యినాక తెల్సింది దడిగోడు సుబ్బరమణిగోడు ననికిష్టడు ముగ్గురూ నామినేసన్లు ఎనక్కి తీసుకొనేసి నారని దాంతో మాకు ఎక్కడలేని ఆనంద మయ్యి పొయ్యింది ఎందుకంటే అందురూ వాపస్ తీసుకొనేస్తే ఇంగ మిగులుండేది మా ఎంగిటి గోడే గదా వాడు సరపంచిని అయినట్టేనని.
ఈ ఆనందంలో మేం ఎగుర్లాడు కొంటాఉంటే అదే యాళకు గ్రామున్సూపు దగ్గర్నంచి కబురొచ్చింది మిమ్మల్నదర్నీ ఉన్న పళంగా పిల్సక రమ్మన్నాడని ఆయన ఎందుకు రమ్మన్నాడే మా కెరుకై పోయ్యింది.వాళ్ళ ముగ్గర్నీ నిలిపేయించినాను ఇంగ సరపంచి నువ్వేనని చెప్పే దానికేమోనని.
కాని అడికి పోతే సెప్పినాడు సావు కబురు సల్లంగా సెప్పినట్టు అందురూ వాళ్ళోల్ల నామినేసన్లు వాళ్ళు ఎనక్కి తీసుకొనేసి నారు నువ్వుగూడా ఎనక్కి తీసేస్కో అని ఎంగిటి గాడితో. మాకేమీ అర్థం కాలేదు ఎందుకిట్టా సెప్తా ఉండాడని.ఇంగుండేది ఒకడు వాడూ వాపస్ తీసు కొనేస్తే ఇంగ సరపంచి ఎవురని ఇదే మాట ఆయన్ని గూడా అడిగి నాము.
ఆయన ముందు ఎనక్కు తీసుకొంటే మల్ల జెప్పతా నంటాడు.ఇట్ట కొంచేపు మల్లగుల్లాలు పడినాము.అప్పుడు జెప్ప కొచ్చినాడు మీరు నలుగురే గాదు అయిదో వోడు గూడా ఏసినాడు అది ఎవురో గాదు మా నాగూరుగోడని ఆవుల కింద పేడ కళ్ళు ఎత్తతా ఉండే వాళ్ళ సేదెగాణ్ణి సూపించి.మాకు గ్రామున్సీపు జెప్పిన మాట లిన్నాక దిమ్మదిరిగి నట్టయ్యింది ఈ గ్రామున్సీపు మానెక్కనిచ్చి నిచ్చన తీసేసి నాడు గదరా అని.
ఆ నాగూరు గోడు ఎవురో గాదు మా వోడే మావూరోడే వాడు సిన్నప్పట్నించి ఆయనింటి కాడనే గొడ్ల మేపతా ఉండాడు పెండ్లి గూడా ఆయనే సెయ్యించి నాడు అయితే ఆ పిల్ల గ్రామున్సీపు పెట్టే బాదలు తట్టుకోలేక మొగుణ్ణి వొదిలేసి ఎళ్ళిపొయ్యి మారు మనుము జేసు కొని పిలకాయలు గూడా.
** **
ఎంగిటి గాడు ఇప్పుడు ఒంటిగోడు ఎనకా ముందు ఎవురూ లేదు గ్రామున్సీపు ఇంటికే శాస్పితం అయి పొయ్యినాడు కాల్తొ సెప్పిన పని చేత్తో చేస్తాడు నమ్మిన బంటు ఏలి ముద్రలు యాడ ఎయ్యమంటే ఆడేస్తాడు అందుకే వాడి దగ్గిర మూడో కంటికి తెలవ కుండా నామినేషన్ ఎయ్యించేసి నట్టుంది.
గ్రామున్సీపు చేసింది తల్సుకొని ఎంగిటిగాడు కోపంతో రగిలి పోతా ఉండాడు.ఏందిరా నీకే నీకే అని ఇంతపన్సేసి నాడే అని. పాపం వాడికేం తెల్సు దొరల చిత్తం మాకల నీడని.ముందు నించే ఎంగిటి గోడంటే గ్రామున్సీపుకు పడదు ఎందుకంటే ఎంగిటిగోడు తయారైనాక మా మాలపల్లోళ్ళు ఎవురూ ఆయని దగ్గరి కొచ్చేది లేదు కార్ణం అంతపని ఇంతపని ఎంగిటిగోడే సేసకొస్తా ఉండాడు.
నేను గ్రామున్సీపుతో “అయ్యా! ఏందయ్యా! ఇట్ట జేస్తిరి ఈ మాట ముందే సెప్పుంటే ఎంగిటి గోణ్ణి నిలిపే సుందుము గాదా”అని అడిగి నాను.
అందు కాయన “ఇప్పుడు మాత్రం ఏ మయ్యింది? వాళ్ళు ముగ్గురికి ఎంతోకొంత దుడ్లిచ్చి పంపేస్తిని మిమ్మల్ని గూడా ఊరికా పంపించనులే,” అని అన్నాడు.
దాంతో మా ఎంగిటి గోడు ఒక్క చ్చనం ఆగలేదు” రా మామా పోదాం ఇంత నమ్మించి మొసం జేసినాక ఇంగా ఏంది ఆయన్తో మాట్లడేది” అనేసి ఎలబారేసి నాడు మేమూ వాడి ఎనకమ్మిటే ఎలబారి వొచ్చేస్తిమి. అంతటితో వొదిల్నాడ అంటే లేదు ఇంగొక పెద్ద మడిసిని పంపించినాడు.ఆ పెద్ద మడిసి “గ్రామున్సీపుతో పోటీ జేసి తట్టుకొనేది మీ వల్ల కాని పని కొంచెం ఎక్కువగానే ఇయ్య మంటాను” నిల్సిపోండని సెప్పినాడు మేము దేవుడు ఎట్టబెతే అట్ట కానీయని కాదనేస్తిమి.
ఆ సంగతి మాకూ తెల్సు ఎందుకంటే ఇక్కడ నాగూరు గోడికి మా ఎంగిటి గోడికి పోటీ అయితే మా వోడే గెలస్తాడు కాని వాడెనక ఉండేది గ్రామున్సీపు గదా అందుకే ఆయన్ని గాదని ఈ అగ్ర కులపోళ్ళె లెవురూ మా వోళ్ళెవురికీ ఓటెయ్యరు అందుకే ఎలక్షన్ మొక్కుబడి గానే జరిగింది యదారాజ తదా ప్రజని గ్రామున్సీపు తరపన నాగూరోడే గెల్సి సర్పంచి అయినాడు.అయితే వాడు సరపంచి అయినాడన్న మాటే గాని పేడకళ్ళెత్తేది తప్పలేదు ఆయనికి ఊడిగిం జేసేది తప్ప లేదు. సొసంత్రం వొచ్చిందే గాని అర్ధ రాత్రప్పుడొచ్చిన సొసంత్రంతో మా బతుకులింకా తెల్లారనే లేదు.కాని ఎప్పుడు తెల్లర్తుందో సూద్దామని ఏకువ పొద్దుకై ఎదురు సూస్తానే ఉండాం.
** **