అరుదైన మేధావి, అపురూపమైన మనిషి

యస్‌కె యూనివర్సిటీలో రీసెర్చ్ కోసం ఎన్‌ట్రెన్స్ పరీక్ష రాయడానికి అనంతపురం వెళ్ళాను. అప్పటికి శశికళ గారు పరిచయం. శేషయ్య గారు తెలుసు. అడ్రస్ కోసం ఫోన్ చేస్తే అక్క ఏవో గుర్తులు చెప్పి ‘అక్కడే మనిల్లు’ అన్నారు. రాయలసీమలో ‘మనింటికి పోదాంరా’ అని పిలవడం మామూలు విషయమే. కానీ ఆ ఇంటికి ఎవరు పోయినా ‘మన ఇల్లు’ అనుకుంటారని, దాన్ని అల్లుకొని ఎన్నో సామాజిక, ఉద్యమ అనుబంధాలున్నాయని తెలుసుకున్నాను.

‘మొదటిసారి ఇక్కడికొచ్చినప్పుడు…’ అంటూ ఇదే అనుభవాన్ని శేషయ్య గారి అమరత్వం సందర్భంలో ఒక మిత్రుడు గుర్తుచేసుకున్నాడు. కొన్ని పరిచయాలు మీటింగ్ హాల్ వరకే ఉంటాయి. కొన్ని పరిచయాలు ఇంటిదాకా పోయి హాలు దగ్గర ఆగిపోతాయి. కొన్ని పరిచయాలు వంట గదిదాకా, ఇంటి మూలమూలలా అల్లుకుపోతాయి. అనంతపురం విద్యుత్ నగర్ లో ఇంటి నెంబర్ 49 ప్రజాసంఘాల మిత్రులందరికీ అటువంటిది.

‘కలెక్టరేట్ దగ్గర బస్సు దిగి మరో ఆలోచన లేకుండా శేషయ్య సార్ దగ్గరికి పోయేవాడిని. ఇప్పుడెక్కడికెళ్ళాలి…’ అని సంస్మరణ సభలో చిన్నపిల్లవాడిలా ఏడ్చారు పౌరహక్కుల సంఘం నాయకుల్లో ఒకరు. ‘సార్ అంటే మా పిల్లలకు చాలా ఇష్టం’ అని ఒకరు, ‘శేషయ్య సార్ అంటే మా నాన్న లాగే’ అని ఒకరు… అంతా వేరువేరు ప్రాంతాల్లో పౌరహక్కుల సంఘం బాధ్యులు, ఇతర ప్రజాసంఘాల కార్యకర్తలు. శేషయ్య సార్ అంటే వీళ్లందరికీ కుటుంబ సభ్యుడిలాగా. సార్ జ్ఞాపకాలు రాయమని అడగడానికి ఆయనతో కలిసి హక్కుల ఉద్యమంలో పనిచేసిన మిత్రుడికి ఫోన్ చేస్తే ‘ఆయన మా ఇంట్లో మనిషే…’ అంటూ బోరుమని దు:ఖిస్తుంటే ఏం మాట్లాడాలో అర్థంకాని స్థితి. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, ఒక హక్కుల ఉద్యమకారుడు, ఒక మేధావి, ఒక నాయకుడు అంతకు మించి ఏదో ప్రత్యేక ఆకర్షణ ఆ వ్యక్తిత్వంలో.

70ల తరం ఉద్యమకారుల జ్ఞాపకాల వెంట పోతే ఒక్కో మనిషీ ఒక్కో అద్భుతం. శేషయ్య గారు 70లలో రాడికల్ విద్యార్థి ఉద్యమంలోకి వచ్చారు. ఆ ప్రభావం తనపై ఎంత గాఢంగా ఉందో ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. లోతైన అధ్యయనం, పదునైన ఆచరణ, గ్రామీణ ప్రాంతాల అట్టడుగు జీవితాల్లో ఉండే అసలైన భారతాన్ని విప్పి చూపిన ఉద్యమం ఒక సాహసోపేత తరాన్ని దేశానికిచ్చింది. తిరుపతి కేంద్రంగా నిర్మాణమైన విద్యార్థి ఉద్యమంలో యూనివర్సిటీ గోడల్ని ఎరుపెక్కించినవారిలో శేషయ్య ఒకరు. ఎప్పుడన్నా ఒకసారి ఆర్ఎస్‌యూ రోజుల్లో… అని వెనక్కి వెళ్లి ఆనాటి సాహసాల్ని చెప్పేవారు. ఇదంతా తీరిగ్గా ఒకసారి రికార్డు చేయాలని అనుకుంటూ వాయిదా వేస్తూ వచ్చాను. విప్లవ విద్యార్థి, కార్మిక, రైతుకూలీ సంఘాలతో కలిసి నడిచిన అనుభవాలెన్నో ఆయన ప్రయాణంలో ఉన్నాయి. ఇక ఆ పాదముద్రలు ఎక్కడ దొరకబట్టాలి?

ఆ ఇంటి చుట్టూ కూడా ఎన్ని సంగతులు, ఎంత చరిత్ర! అదయితే నిన్నమొన్నటిదే. ప్రజాసంఘాలు చురుగ్గా పనిచేస్తున్న రోజుల్లో ఎప్పుడూ ఇంటినిండా కార్యకర్తలే. విశాఖలో చలసాని-విజయ ఇంటి గురించి ఎట్లయితే చెప్తారో, అనంతపురంలో శశికళ-శేషయ్య ఇంటి గురించి అలా చెప్పగా విన్నాను. శేషయ్య గారి జేజి ఉండేవారని, ఆమె అందర్నీ గడగడలాడించేదని, తిట్లతోపాటు కాఫీలు, టిఫిన్లు కూడా పెట్టేదని మిత్రులు సరదాగా చెప్పేవారు. శశికళగారి ‘అమ్మమ్మ మనసు’ కథ చదువుతున్నంత సేపూ ఆమెనే ఊహించుకున్నాను.

అనంతపురం ఎన్నో ఎడారి తుఫాన్ల వంటి పాలక దాడులకు గురైనా ఆ ఇల్లు అలా ఉండిపోయింది. బహుషా అడ్రస్ ఒకటే మారి ఉండొచ్చు. అదే రూపం, అదే హృదయం, అదే సందడి. కాలక్రమంలో ప్రజాసంఘాలపై విపరీతమైన రాజ్యహింస ప్రయోగించబడింది. ఎన్నో భౌతిక, మానసిక దాడులకు, కుట్రలకు ఆ ప్రాంతం ప్రయోగశాల అయింది. 2005 లో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం విప్లవకారులతో శాంతి చర్చలను భగ్నం చేశాక ప్రజాసంఘాలపై ప్రైవేటు హంతక ముఠాల చేత ముసుగుదాడులు చేయించింది. శేషయ్య గారి ఇంటి మీద దుండగులు పెట్రోల్ క్యాన్లతో దాడి చేసి ఆయన కారును తగలబెట్టారు. నిన్ను కూడా ఇలా కాల్చేస్తామన్నారు. ఇదంతా గతమయ్యాక, నేనా ఇంటికి వెళ్ళాను. ఆయన జేజి ఫోటో చూసి సార్ వాళ్ళ అమ్మనా అని అడిగితే జేజి అని చెప్పారు.

శేషయ్య గారి తండ్రి చిన్న వయసులోనే చనిపోతే ఆయనతో సహా నలుగురు పిల్లల్ని ఇద్దరు జేజిగారు, తల్లి పెంచి పెద్ద చేశారట. తొమ్మిదేళ్ళ వయసు నుండే కష్టం చేసి కుటుంబానికి తన లేత భుజం ఆసరాగా ఇచ్చారు శేషయ్య. అన్న ఎస్ఎస్ఎల్‌సి లో స్కూల్ ఫస్ట్ వచ్చి మెడికల్ సీటు తెచ్చుకుంటే ఆయన చదువు, కుటుంబ పోషణ కోసం చేతికందిన పని ఏదైనాసరే చేయడానికి సిద్ధపడ్డారు. అట్లా తన జేజి తనను తయారుచేసిందని చెప్పారు. సెలవుల్లో పనిచేస్తూ రోజుకు ఏడు రూపాయలు కూలి సంపాదించుకుని కొనసాగించిన తన చదువు, ఆర్జించిన మేధస్సు జీవితాంతం శ్రామికవర్గం కోసమే ధారపోశారు. చిన్నతనంలో కఠినమైన శ్రమ కూడా ఆయనకు తోటి శ్రామికుల ప్రేమానురాగాల మధ్య ఆనందంగా ఉండేదట. పనిని ఎంజాయ్ చేసేవారట. ఇంటర్మీడియట్ అవ్వగానే టి.బి. బారిన పడ్డారు. అప్పటికీ ఇప్పటికీ పోషకాహారానికి ఆమడ దూరం ఉండే పేదవాళ్ళను వెన్నంటే జబ్బు. శేషయ్యగారు మృత్యువుతో చివరి పోరాటం చేస్తున్నప్పుడు ఆయన ఊపిరితిత్తులు ఇరవై శాతం మాత్రమే పనిచేస్తున్నాయని మిత్రులు చెప్పారు. ఎంత అపురూపమైన మనిషి. స్మోకింగ్ అనే ఒక్క బలహీనత లేకుంటే ఎంత బాగుండేది అని ఎంతమందో అన్నారు. ఆయన మీద ఆఖరి దాడి చేసింది కరోనాయేనా, కరోనా రూపంలో విధ్వంసక వ్యవస్థనా? కరోనా పొలిటికల్ ఎకానమి గురించి ఆయనతో ఫోన్ సంభాషణ గుర్తుకువస్తుంది. ఆ చివరి ఊపిరి బహుషా ఖరీదైన వైద్యం అందుకోలేని అసంఖ్యాక ప్రజల గురించి తపిస్తూ ఉండి ఉంటుంది. ఆరోజు శశికళ గారు అంత దు:ఖంలోనూ వైద్యం రూపంలో జరుగుతున్న దోపిడిని, హింసను గురించి మనం మాట్లాడాలి అన్నారు.

పౌరహక్కుల సంఘంలో తలమునకలుగా ఉన్నప్పుడు, ఎన్నో ఒడిదుడుకులతో ఉద్యమాలు, సమాజం కల్లోలభరితంగా ఉన్నప్పుడు ఒక మేడే రోజున ఆయన కుప్పకూలిపోయారట. ముప్పై ఏళ్ళనాటి మాట కావొచ్చు. అప్పుడే ఆయన గుండె జబ్బు బైట పడింది. హరగోపాల్ గారు గుర్తుచేసుకున్నట్లు ‘తన గుండె కంకర్రాడులా ఉందని డాక్టర్లు చెప్పారని’ ఆయన జోక్ చేసేవారట. అది ఏ శస్త్రచికిత్సకూ దొరకని విచిత్రమైన అమరికలో ఉండేదట. బహుషా మృత్యువుతో పోరాటం లోపలి నుండి బైటి నుండీ ఆయనకు నిరంతరం.

***

ఎన్‌ట్రెన్స్ ఎగ్జామ్ లో నాకు సింగిల్ డిజిట్ ర్యాంకే వచ్చింది. అడ్మిషన్ కోసం వెళ్ళాను. సార్ సంతోషంగా కేంపసు తీసుకుపోయి మా డిపార్ట్మెంట్ దగ్గర దిగబెట్టారు. తిరిగొచ్చాక పిఎచ్‌డి మీద, రీసెర్చ్ ల మీద బోలెడు జోకులేసుకున్నాం. అక్కడ కొంత ఇక్కడ కొంత తీసితీసి రాసేది థీసీస్ అని నవ్వుకున్నాం. ఆయన అంత సరదాగా మాట్లాడతారని అంతకు ముందు తెలీదు. శేషయ్య గారి పిఎచ్‌డి థీసీస్ గురించి నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. కాని న్యాయశాస్త్రంలో ఆయన సిద్ధాంత పత్రం ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ లా ఇన్ డెవలప్‌మెంట్ నిపుణుడు క్లారెన్స్ డయాస్ చేత అపురూపంగా ప్రశంసించబడిందని, ఆ రంగంలోని దేశ విదేశీ మేధావుల దృష్టిని ఆకర్షించిందని తెలిసింది. భారత ప్రణాళికా వ్యవస్థ, అభివృద్ధి నమూనా, రాజ్యాంగం అనే అంశాలను జోడిస్తూ ఆయన రాసిన పిఎచ్‌డి కి కొంతకాలం ప్రొ. గౌస్ గైడ్ గా ఉన్నా, తర్వాత గైడ్ లేకుండానే పూర్తి చేసి, ఇండిపెండెంట్ సబ్‌మిషన్ చేశారట (బహుశా ఇదొక రికార్డు). ది రోల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ ది ప్లాన్డ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా. గొప్ప సైద్ధాంతిక గ్రంథం.

ఇది గాక ఆయన పేరుతో పుస్తకాలేవీ ఆయన ప్రచురించలేదు. పౌరహక్కుల సంఘం పేరుతో వచ్చిన నివేదికలు, స్వేచ్ఛ పత్రిక సంపాదకీయాలు సరే, ఆయన వ్యాసాలు గాని, మౌలిక సైద్ధాంతిక అంశాల మీద ఆయన రచనలు గాని విడిగా పబ్లిష్ చేయలేదు. దిన పత్రికలకు వ్యాసాలు రాసే అలవాటు కూడా ఉండేది కాదు. అద్భుతమైన ఆయన ఉపన్యాసాలు కూడా యూట్యూబ్ వంటివాటిలో దొరకవు. పాపులర్ ఎక్స్పోజర్లన్నిటికీ ఆయన దూరంగా వున్నారు. అది స్వాభావికమా, అలా వుండాలని ఎంచుకున్నారా అంటే రెండూ అనాలేమో.

ఒక సీరియస్ చర్చ ఏదైనా చేస్తున్నప్పుడు ఆయన పదునైన ఆలోచనలు, సూటిగా, ఏ శషబిషలు లేకుండా చేసే వాదన మిరుమిట్లు గొలుపుతుంది. మరుక్షణమే ఆయన అందులోనుండి బైటికొచ్చి ‘అదిసర్లే గాని…’ అని మామూలు సంభాషణల్లోకి వస్తారు. ఆయనతో నేరుగా మాట్లాడినా, ఫోన్లో మాట్లాడినా ఇది అత్యంత సహజంగా జరుగుతూ ఉంటుంది. ఒక గొప్ప ఆలోచనాపరుడితో మాట్లాడుతున్నామని ఇక మనకు ఏమాత్రం అనిపించదు. మనుషుల పట్ల ఆపేక్ష ఎంత సహజంగా వుంటుంది అంటే అది వ్యక్తమయ్యే క్షణం మనకు తెలియదు గాని ఆయన ఆత్మీయుడైపోయి ఉంటాడు.

ప్రీ పిఎచ్‌డి పరీక్షతో నా రీసెర్చ్ కొండెక్కింది. అసలే పార్ట్ టైం బిఎడ్ ప్రోగ్రాం కాబట్టి నాకు స్వేచ్ఛ ఎక్కువ. అదీగాక ఈలోగానే చాలా జరిగిపోయాయి. విరసం కార్యదర్శిగా బాధ్యత తీసుకోవడం, కొన్ని నెలల్లోనే అరెస్టు కావడం, పేపర్లలో ప్రచారం కావడం మా గైడ్ కొంత ఇబ్బంది పెట్టింది గాని శేషయ్య గారున్నాక ఇవేవీ అసలు సమస్యలు కావు. మట్టి, బ్యాక్టీరియా మీద ఆసక్తిపోయింది. లాబొరేటరీ రీసెర్చ్ మీద తెలీని విరక్తి ఏదో వచ్చింది. నా పిఎచ్‌డి గురించి చలసాని ప్రసాద్ గాక, శేషయ్య గారే అడిగేవారు. ఇక చెయ్యలేను అని చెప్పాను. నీ పేరు ముందు డాక్టర్ అని వుంటే మాకెంత గొప్పగా ఉంటుంది, పూర్తి చేయి అన్నారు. అటువంటి కన్సర్న్ ఉంటుంది గనక శేషయ్య గారంటే మా నాన్నలాగే అని ఆయన కొడుకు వయసువాళ్లంటారు. రెండు మూడు కలయికల్లోనే నేనూ దానిని అనుభూతి చెందాను. రీసెర్చ్ మిషతో అనంతపురం ప్రయాణాలు ఇప్పుడు తిరిగి చూసుకుంటే అపురూపమైన జ్ఞాపకాలనిచ్చాయి.

ప్రతి ఫోన్ సంభాషణలో ‘అనంతపురం ఎప్పుడు వస్తున్నావు’ అనే ప్రశ్న తప్పనిసరిగా వుండేది. శశికళ గారికి ఫోన్ చేసినా ఆయన చివర్లో అందుకుని సంగతులు అడిగేవారు. నేను రీసెర్చ్ మానేసిన తర్వాత కూడా, ఏం సంగతి, ఎప్పుడొస్తున్నావు అని అడిగేవారు. పొట్టి పేరుతో నాయన పిలిచినట్లే పిలిచేవారు. వెళితే పిల్లలు ఇంటికొస్తే సందడి చేసినట్లు ఐస్ క్రీం, చిరుతిండ్లు, కబుర్లతో చిన్నపాటి సెలబ్రేషన్ ఉండేది. వెళ్లేటప్పుడు ‘ఇంకో పూట ఉండొచ్చు కదా’, ‘మళ్లీ ఎప్పుడొస్తావ్’ అనే మాటలు సాధారణం. వీకెండ్ ఎంతలో అయిపోతుంది! ‘వుద్యోగం లేకపోతే వుండిపోదును, ఏం చేద్దాం’ అనేదాన్ని.

కలిసి పనిచేయాలి అంటే ముందు కలవడం తెలియాలి. మనుషుల కలయికే ఒక వేడుకలా చేయగలరు ఆయన. పౌరహక్కుల సంఘం కార్యకర్తలంతా ఆయన కుటుంబం అంటే ఆశ్చర్యం ఏముంది. శేషయ్య సారు గొంతు పెంచి మాట్లాడ్డం కాని, ఆగ్రహం ప్రదర్శించడం గాని ఎప్పుడైనా చూశారా అని సిఎల్‌సి మిత్రుల్ని అడిగాను. ఎందుకంటే నేనెప్పుడూ చూడలేదు. బాగా ఇబ్బంది పెడితే విసుస్కునేవారు గాని అది మన ఇంట్లో పెద్దవాళ్ళు చేసినట్లుగానే ఉంటుందని అన్నారు.

పౌరహక్కుల సంఘం లోపల జరిగిన సైద్ధాంతిక చర్చ ఎంత హుందాగా, ప్రజాస్వామికంగా జరిగిందంటే నిజానికి అదొక మోడల్. సంవత్సరాల తరబడి సుదీర్ఘంగా అభిప్రాయాలను చర్చించుకుంటూ చిట్టచివరికి మెజారిటీ నిర్ణయం దగ్గరికి వచ్చారు. అప్పటిదాకా భిన్నాభిప్రాయాలను గౌరవంచారు, ఓపిగ్గా చర్చించారు. సంస్థలు విడిపోయేటప్పుడు ఎంత రప్చర్ ఉంటుందో చరిత్రలో చాలా ఉదాహరణలున్నాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కూడా చూశాం. కానీ ఇక్కడ నిజమైన ప్రజాస్వామిక స్ఫూర్తి కనపడుతుంది. పౌరహక్కుల సంఘం నుండి బాలగోపాల్ తదితరులు వెళ్ళిపోయాక పత్రికలు చేసిన ప్రచారం, హడావిడి ఎంత ఉన్నా ఆ సంఘం మాత్రం నిబ్బరంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది. రెండు సంఘాలు (పౌరహక్కుల సంఘం, మానవ హక్కుల వేదిక) అంతే హుందాతనం పాటిస్తూ అవసరమైన సందర్భాల్లో కలిసి నడిచాయి, నడుస్తున్నాయి.

శేషయ్య గారు పాపులర్ ప్రచార ఆర్భాటాలకు దూరంగా జిల్లాలన్నీ తిరిగి సంస్థ నిర్మాణాన్ని తిరిగి పటిష్టం చేసే పని తీసుకున్నారు. రెండేళ్ళకే పురుషోత్తంను పోగొట్టుకోవడం, తేరుకునే లోపనే ఆజం అలీ కూడా ప్రభుత్వ హత్యకు గురికావడం చిన్న విషయం కాదు. బహుషా ముందూ వెనకగా ఈలోగానే ఆనారోగ్యమూ ఆయనపై దాడి చేసింది. అన్ని సవాళ్ళ మధ్యా సంఘం నిలిచిందంటే దానిలోని అంతర్గత శక్తితో పాటు శేషయ్య గారి నాయకత్వం కూడా దోహదం చేసింది. దేశ పౌరహక్కుల ఉద్యమ చరిత్రలో గొప్పగా గుర్తించుకోదగిన త్యాగాలను సిఎల్‌సి చేసింది. శేషయ్యగారు దానిని ముందుకు తీసుకుపోడానికి అహరహం శ్రమించారు. తాను కాదు, సంఘం ఫోకస్ కావాలి, రెండో తరం నాయకత్వం ఎదగాలి అని ఎప్పుడూ ఆరాటపడేవాడని సిఎల్‌సి మిత్రులు చెప్తారు.

కానీ సంఘం లోపల జరిగిన చర్చ హక్కుల భావనకు సంబంధించిన అనేక అంశాలను లోతుగా చర్చించినా, మొత్తం హింస అహింసల చుట్టూ మీడియా ప్రచారం చేయడం, అసలైన స్పిరిట్ ఏమిటో ఎక్కువ మందికి తెలియకపోవడం గురించి ఆయన చివరి దాకా బాధపడేవారు.

***

త్రిపురనేని మధుసూదనరావు మాటల్లో ఉండే షార్ప్‌నెస్ శేషయ్య మాటల్లో కనపడేది. నేను, అక్క (శశికళ) సుదీర్ఘంగా ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళం. ఆమె స్కూలు పిల్లల గురించి చెప్పే విషయాలు ఎంతసేపైనా వినబుద్దవుతాయి. శేషయ్య గారితో అరుణతార ఇంటర్వ్యూ కోసం తప్ప సుదీర్ఘంగా మాట్లాడిన సందర్భాలు తక్కువ. కానీ ఆయన పరిశీలనలు మన స్పృహ నుండి జారిపోయే విషయాలను అలా గాలం వేసి పట్టి ఇచ్చేవి. ముగ్గురం సాహిత్యం గురించి మాట్లాడుకునేవాళ్లం. అరుణతార క్రమం తప్పకుండా చదివి కామెంట్ చేస్తూ ఉంటారు. ‘భలే ఉంది సార్ మీ అబ్జర్వేషన్’ అంటే ‘నేను సాధారణ పాఠకున్నే… అనేవారు’. నేను రాసిన ఒక నివాళి వ్యాసం గురించి కనీసం మూడునాలుగు సార్లు ప్రస్తావించి మెచ్చుకున్నారు. ఎందుకంటే నేను ఎవరి గురించైతే రాశానో ఆయన అంత ప్రసిద్ధవ్యక్తి కాదు. ఆ వ్యక్తిలోని అసాధారణ తెగువ, మానవీయ విలువలు ఎంతగా కదిలించాయో, ఆ వ్యాసం తనను కన్నీళ్లు పెట్టించిందని ఆయన చెప్తే ఆశ్చర్యం వేసింది. ఇంకో సందర్భంలో ‘చాలా రాస్తావని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఏమీ రాయలేదే’ అని కామెంట్ చేశారు. ఊరికే కామెంట్ చేయడమే కాదు, దాన్నెలా డెవలెప్ చేయాలో చెబుతూ స్టడీ చేయడానికి పుస్తకాలను కూడా సూచించారు.

ఏదైనా విషయం గురించి ఆయనను రాయమనో, చెప్పమనో అడిగితే ‘నువ్వేమనుకుంటున్నావు దీని గురించి’ అని అడిగేవారు. నేను ఒకవైపు నుండి వస్తే ఆయన ఇంకోవైపు నుండి వచ్చి చర్చిస్తారు. ఇలా కూడా ఆలోచించాలి అని చెప్పకనే చెప్పినట్లు ఉంటుంది. లేదా ‘నువ్వు చెప్పిన పాయింటేదో బాగుంది, ఆలోచిద్దాం’ అంటారు. అలా ఆయన బోధిస్తున్నట్లుగా కాకుండా చర్చిస్తున్నట్లుగా సంభాషణను నడుపుతారు. ఎంత ప్రజాస్వామికంగా ఉన్నప్పటికీ మనకన్నా వయసులో బాగా పెద్దవాళ్ళతో, అనుభవజ్ఞులతో మాట్లాడేటప్పుడు ఎక్కడో బెరుకు ఉంటుంది. ఆయనతో ఏ విషయమైనా మాట్లాడ్డానికి ఏ సంకోచమూ ఉండేది కాదు.

వాళ్ళబ్బాయి అరుణ్ దగ్గరికి (అమెరికాలో ఉంటాడు) వెళ్ళినప్పుడు కూడా అక్క, సారు ఫోన్ చేసేవారు. అందరి గురించి అడిగేవారు. వచ్చినాక కలుద్దాం, చాలా విశేషాలుంటాయి కదా అనేవారు. ఏడాది క్రితం కలిసినప్పుడు వివిని చూశానని, కర్ణాటక కేసులో ఆయన్ని కోర్టుకు తీసుకొచ్చినప్పుడు కలిసానని, కావలించుకుని బాగా ఎమోషనల్ అయ్యానని చెప్పారు. ఆ కేసులో బెయిల్ ఏర్పాటు చేస్తున్నానన్నారు. జైలు నిర్బంధంలో ఉన్న వివికి శేషయ్య గారిక లేరన్న విషయం సుమారు నెలన్నర తర్వాత, అది కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండగా ఆయన కుటుంబ సభ్యులు కలిసినప్పుడు గాని తెలియలేదు. తెలియగానే ఆ చివరి కలయికను గుర్తుచేసుకొని కంటనీరు పెట్టుకున్నారట.

శేషయ్య గారు చాలా సున్నితమైన మనిషి, తోటి మనుషుల బాధలు, కష్టాల పట్ల ఆయన హృదయం లోలోపలి నుండి కదిలిపోతారు. ఎంత ఎమోషనల్ గా ఉంటాలో విషయాల పట్ల అంత సైంటిఫిక్ గా కూడా ఉంటారు. ఆయన హ్యూమన్ ఎమోషన్స్ మనుషులతో ఆయన గాఢమైన సంబంధాల్లో ఉంటాయి. విషయాల పట్ల అవగాహన, కార్యాచరణలో చాలా సైంటిఫిక్ గా ఉంటారు. పౌరహక్కుల ఉద్యమం ఎదుర్కొన్న సైద్ధాంతిక సవాళ్ళు, నిర్మాణ సమస్యలు, హింసాత్మక దాడుల మధ్య ఆయన అందించిన నాయకత్వం, ప్రదర్శించిన తెగువ, సాహసంలో ఇవన్నీ మిళితమై ఉన్నాయి. ఒక విధంగా శేషయ్య గారు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత ఆ సంస్థ బాధ్యులు ఇద్దరు హత్యకు గురవ్వడం, నాయకత్వాన్ని చంపుతామనే బెదిరింపులు, సభ్యుల ఇళ్లపై దాడులు, స్వయంగా తన ఇంటి మీదే దాడి, ఇదంతా విరామం లేకుండా నిరంతరం కొనసాగుతూ వచ్చింది. నిజానికి నలభై ఏడు సంవత్సరాల పౌరహక్కుల సంఘం చరిత్ర పొడవునా ఎంతో గొప్ప తెగువ, సాహసం ఉన్నాయి. శేషయ్యగారు ఒకానొక సంక్లిష్ట దశలో దానిని అందుకున్నారు. న్యాయశాస్త్ర పరిశోధన నుండి పౌరహక్కుల కార్యాచరణ దాకా దాని సారాన్ని తనలోకి తీసుకున్నారు.

సాహిత్య ప్రయోజనం మీద ఆయనకు కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. సాహిత్యం గురించి నాకేం తెలుసు అంటూనే… అరుణతార ఇంటర్వ్యూలో సామాజిక శాస్త్రాలు ప్రవేశించలేని ఆవరణలోకి సాహిత్యం ఎలా వెళుతుందో, జీవన వాస్తవికతను ఎలా పట్టి ఇస్తుందో చెప్పారు. తెలుగు సాహిత్యంతో పాటు ఇంగ్లీషు సాహిత్యాన్ని కూడా బాగా చదివేవారు. దొరికందంతా చదవడం కాకుండా ఆయన తనకిష్టమైన వాటిని ఎంచుకునేవారు. ఎప్పుడూ లావుపాటి పుస్తకాలు పక్కన ఉండేవి. ఒక్కోసారి ఒక పుస్తకం తీసి ఆ పేజీ చదవమని చేతికిచ్చేవారు. న్యాయవ్యవస్థ మీద, కోర్టు ప్రొసీడింగ్స్ మీద ఇంగ్లీష్ సాహిత్యంలో వచ్చిన నవలల్ని మన రచయితలు అధ్యయనం చేయాలని, మన సాహిత్యం నుండి ఆ కృషి చాలా తక్కువ జరిగిందని చెప్పేవారు. విరసం యాభై ఏళ్ల సందర్భంలో విప్లవ సాహిత్యం ఇంకా ఏం చేయవలసి ఉందో విలువైన సూచనలిచ్చారు. సాహిత్య విమర్శ మీద మరో ఇంటర్వ్యూ కోసం ఆయనకు ప్రశ్నలు పంపించాము. ఆయన తీర్చని బాకీల్లో అదొకటి.

ప్రజాస్వామిక హక్కుల భావనను ఆయన తాత్విక స్థాయిలో ఎట్లా చర్చిస్తాడో ఆయన ఉపన్యాసాలు విన్నవాళ్లందరి అనుభవంలో ఉండి ఉంటుంది. రాజ్యాంగం గుర్తించిన హక్కులు సరే. ప్రజాస్వామిక హక్కుల భావన అంతకన్నా విస్తృతమైనది, లోతైనది. మానవ నాగరికతా వికాసంలో ఎంతో సంఘర్షణ పడి సాధించుకున్నవి సగటు మనిషి చైతన్యంలో భాగం కావడం, కాలేకపోవడం గురించి ఆయన మాట్లాడేవాడు. భారత సమాజం మరెంతో సంఘర్షణకు లోనుకావలసిందే. ఎందుకంటే మనం నేరుగా పారిశ్రామిక విప్లవ వారసులం కాము. (ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘వియార్ నాట్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్’) అందువల్ల మన సమాజానికి హక్కుల భావన అంత సులభంగా అర్ధం కాదు అంటారు. రాజ్యం, దాని అణచివేత వైపు నుండే కాదు, హక్కులను సమాజ మౌలిక స్థాయిలో అన్వయించి చూడాలి. అలాగే సామాజిక పరిణామంలో నిన్న గుర్తించని హక్కులను ఇవాల రాజ్యం కూడా గుర్తించడానికి దోహదం చేసే ప్రజాపోరాటాలే మౌలికమైనవని, పౌరహక్కుల ఉద్యమం అందులో అంతర్భాగమేనని అంటాడాయన. అడవిపై మూలవాసుల హక్కులు (వన్ ఆఫ్ సెవెన్లీ వంటివి) అలా గుర్తించినవేనని మనకు తెలుసు.

అందుకే హక్కుల సంఘాలు రాజ్యహింసను ఖండిస్తే సరిపోదు. ‘విప్లవహింస’ను కూడా వ్యతిరేకించాలని చర్చ వచ్చినప్పుడు పౌరహక్కుల ఉద్యమం చేయలవలసింది పాలకులు, ప్రజా ఉద్యమాల మధ్య తీర్పులు చెప్పడం కాదు అని స్పష్టంగా ప్రకటించారు. చట్టం, న్యాయవ్యవస్థతో సహా రాజ్యం పాలకవర్గ సాధనమని, అది ప్రయోగించే అణచివేతను, దానిని ప్రతిఘటించే ప్రజలను ఒకేలా చూడకూడదని ఆయన అంటారు. వ్యవస్థలోని వివిధ ఆధిపత్య శక్తులు ప్రయోగించే హింసను ఎదుర్కోవడం చట్టం ద్వారా, న్యాయవ్యవస్థ ద్వారా సాధ్యం కాదు. అవి చాలా సందర్భాల్లో ధనవంతులు, అగ్రకులాలు, పురుషుల పక్షం వహించి వ్యవస్థీకృత హింసను ప్రోత్సహిస్తాయి. అటువంటప్పుడు ప్రజలు చట్ట పరిధి దాటి ఉద్యమిస్తారు. ప్రజాస్వామిక హక్కుల సాధన కోసం అనుసరించవలసిన మార్గాలను నిర్ణయించేది ప్రజాపోరాటాలు, వాటి సంబంధించిన నిర్మాణాలే. ప్రజా ఉద్యమాలు ముందుకు తెచ్చిన ప్రజాస్వామిక హక్కుల ఆకాంక్షను పౌరహక్కుల ఉద్యమం తనలో ఇమడ్చుకుంటుంది అంటారాయన.

రాజ్యానికి అన్ని హంగులూ ఉంటాయి. పోలీసులు, సైన్యం, న్యాయస్థానాలు, ప్రచార సాధనాలు వగైరా. మరి ప్రజలకు ఆసరా ఏమిటి? రాజ్యం వేయి గొంతులతో మాట్లాడుతుంది. కానీ ప్రజా ఉద్యమం గొంతుపై నిషేధం ఉంటుంది. ఉదారవాదం రాజ్యహింసను వ్యతిరేకిస్తూనే ప్రజా ఉద్యమాల నైతికతను ప్రశ్నిస్తుంది. ఇది చాలా ప్రమాదకరం అని చెప్పేవారు.

మరి చట్టాలు, న్యాయవ్యవస్థ ప్రజలకు పనికి రావా అంటే వాటితో పనిచేయించుకోవలసింది కూడా ప్రజలే. ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న వ్యవస్థలు (ఇన్స్టిట్యూషన్స్) అవి. కోర్టుల్లో న్యాయపోరాటం చేయవలసిందే. కానీ న్యాయస్థానాల వర్గ స్వభావాన్ని జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. కోర్టు తీర్పులు కూడా ప్రజాచైతన్యాన్ని అనుసరించి ఉంటాయి. ప్రజాపోరాటాల ఒత్తిడి ఉంటే తప్ప కోర్టుల్లో జనన్యాయం సఫలం కాదు. ఈ అవగాహనతోనే ఆయన పౌరహక్కుల సంఘం తరపున స్వయంగా కోర్టుల్లో పిటీషన్లు వేశారు. ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో పిటిషనర్ శేషయ్య గారే. తర్వాత దానిని సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇదే కాదు, ఆయన లా ప్రొఫెసర్‌గా ఉంటూనే న్యాయస్థానాల్లో పలు కేసులు నడిపారు.

అయితే ఏదైనా ప్రజాసమస్య మీద కోర్టుకు పోయేముందు జాగ్రత్తగా ఆలోచించాలని, కోర్టులు ప్రభుత్వం తీసుకునే అప్రజాస్వామిక నిర్ణయాలకు, చర్యలకు లెజిటమసీ ఇస్తే ప్రజలకు మరింత నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసేవారు. న్యాయం చేయమని కోర్టుకు పోయి దానిమీద ఆశపెట్టుకుని పోరాటాన్ని పక్కన పెడితే చివరికి కోర్టు ప్రజావ్యతిరేక తీర్పులిచ్చిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

రాజ్యం, దాని స్వభావం, పనితీరు గురించి ఆయన మాటల్లో వినాల్సిందే. పితృస్వామిక కుటుంబం దగ్గరి నుండి చట్టసభలు, పాలనా యంత్రాంగం దాకా అన్ని రంగాల్లో అది ఎలా పనిచేస్తుందో చెప్తారాయన. స్టేట్ అంటే ప్రభుత్వం, పోలీసులే కాదు. దానిని మౌలిక స్థాయిలో అర్ధం చేసుకోవాలి. అందుకు శేషయ్య గారి ప్రసంగాలు, రచనలు ఎంతగానో దోహదం చేస్తాయి. ఫేస్ బుక్ లో ఒకాయన ‘ఈ కమ్యూనిస్టులు రాజ్యం రాజ్యం అంటారేంది? అందరిలా ప్రభుత్వం అనో ఇంకా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వమనో, కేంద్ర ప్రభుత్వమనో అనొచ్చు కదా?’ అని రాశాడు. బహుషా అందులో కమ్యూనిస్టుల మీద అలవాటైన వ్యంగ్యం, ఎత్తిపొడుపు ఉంది. అది చూసినప్పుడు నాకు శేషయ్య గారే గుర్తొచ్చారు. నిజానికి కమ్యూనిస్టు పరిభాషలోనే కాదు, పౌరహక్కుల పరిభాషలో, న్యాయ పరిభాషలో కూడా రాజ్యం అనే మాట ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం మీదో, చర్య మీదో కోర్టుకు పోతే స్టేట్ ఆఫ్ తెలంగాణ అనో, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనో వ్యవహరిస్తారు. ప్రభుత్వాలు మారినా రాజ్యం మారదు. అది వ్యవస్థతో, ఉత్పత్తి సంబంధాలతో ముడిపడి ఉండేది. రాజ్యం అనే దాన్ని నిర్వచించడం చాలా లోతైన వ్యవహారం అని, రాజ్యాంగం కూడా రాజ్యం అనే దాన్ని వివరించిందే గాని, నిర్వచించలేదని శేషయ్య గారు చెప్పేవారు. ఇదంతా ఇక్కడ రాయడం ఈ వ్యాసపరిధికి మించినది.

చరిత్ర, రాజకీయార్థిక పరిణామాల నుండి మానవ సమాజపు మౌలిక భావనలను పొరలు పొరలుగా విశ్లేషించగలిగిన ఆయన నుండి మేము కొన్ని రచనలను ఆశించాం. వాటి కోసం ఒక ప్రణాళిక తయారుచేసుకుంటూ ఉన్నాం. ఒక సందర్భంలో మీరు అరుణాతారకు పది వ్యాసాలివ్వాలి అని డిమాండ్ చేశాను. భారత రాజ్యాంగం – అంబేద్కర్ మీద ఒక అద్భుతమైన ప్రసంగం, వ్యాసం ఇచ్చాక, ‘ఒకటయింది, ఇంక తొమ్మిదున్నాయి కదా’ అని నవ్వుతూ అడిగారు. ‘మీ ఒక్క వ్యాసం పదింటితో సమానం. అయితే మిగిలినవి ఇవ్వకుండా ఉండేరు’ అన్నాను. ఆ వ్యాసం గురించే ఆయన, ‘ఇంకా చాలా రాయాల్సింది గాని ఇప్పటికిది చాల్లే తర్వాత చూద్దాం’ అన్నారు. యాభై ఏళ్ళ విరసం సావనీర్ కోసం ఆయన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ (మాట్లాడిన దానికన్నా ఆయన రాసిచ్చింది తక్కువ), సిఎఎ వ్యతిరేక ఆందోళనల సందర్భం, రెండేళ్ళ భీమా కోరేగాం కుట్ర కేసు సందర్భం ఆయనతో మేం ఎన్నో విషయాలను పంచుకునే అవకాశం ఇచ్చాయి. ఇటువంటివి మాట్లాడే ప్రతిసారీ ఈ విషయాలు బేసిక్స్ నుండి వివరంగా రాయాలి అనేవారు. ఈ ఎండాకాలం ఆయనతో కొన్ని రోజులు గడపాలనుకున్నాం. చాలా ముచ్చటించుకోవాలి, రికార్డు చేయాలి, కలిసి అన్వేషించాలి అనుకున్నాం. వేసవి సెలవులను కోరోనా తీసుకుపోయింది. ఇంకో వేసవి లేకుండా మన శేషయ్య సారును కూడా కరోనా తీసుకుపోయింది.

ఆయన ఆలోచనలు, ఆయన పంచిపెట్టిన విలువలు మనతోనే ఉన్నాయి. వాటిని అందరికీ చేర్చడం, మరింత ముందుకు తీసుకుపోవడం ఆయనను ప్రేమించినవాళ్ళందరి కర్తవ్యం.

సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేస్తూ సాహిత్యాన్ని, మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తున్న క్రమంలో విరసంతో పరిచయం ఏర్పడింది. 2005 నుండి విరసం సభ్యురాలిని. ప్రస్తుతం అరుణతార వర్కింగ్ ఎడిటర్ గా ఉన్నాను. నా రచనల్లో సామాజిక రాజకీయ పర్యావరణ సంబంధమైన వ్యాసాలే ఎక్కువ. సాహిత్య వ్యాసాలు, కొన్ని కథలు, చాలా తక్కువగా కవిత్వం రాశాను. కూడంకుళం అణువిద్యుత్ కు వ్యతిరేకంగా ప్రజాఉద్యమం జరిగుతున్నప్పుడు అక్కడి ప్రజలను జైల్లో కలిశాక రాసిన 'సముద్రంతో సంభాషణ' నా మొదటి పుస్తకం.

One thought on “అరుదైన మేధావి, అపురూపమైన మనిషి

  1. చాలా అభిమానంతో ఆర్ద్రంగా రాస్తూనే ఆయన కృషిని కళ్ళకి కట్టారు.

Leave a Reply