అరుణాక్షరావిష్కార పూర్వరంగం

(అరుణాక్షర అద్భుతం – 2)

విప్లవ రచయితల సంఘం 1970 జూలై 4 తెల్లవారు జామున ఏర్పడిందని అందరికీ తెలుసు. తెలుగు ప్రకటన మీద 1.07 ఎ ఎం అనీ, ఇంగ్లిష్ ప్రకటన మీద 1.10 ఎ ఎం అనీ శ్రీశ్రీ తన తొలి సంతకం తర్వాత వేసిన సమయాన్ని బట్టి తెలుగు సమాజంలో, సాహిత్యంలో అరుణాక్షర అద్భుతం ఆ తెల్లవారుజామున సూర్యోదయం కన్న ముందే ఆవిష్కృతమయిందని చరిత్ర నమోదు చేసింది. అయితే అది ఆ నిమిషానో, ఆ రోజునో హఠాత్తుగా సంభవించిన ఘటన కాదు. అసలు సమాజ పరిణామంలో ఏ ఒక్క ఘటనా, ఏ ఒక్క పరిణామమూ అలా హఠాత్తుగా ఆవిర్భవించవు. ప్రతి ఘటనకూ, ప్రతి పరిణామానికీ ఒక పూర్వరంగం ఉంటుంది. అది తరతరాల వారసత్వాన్ని తనలో రంగరించుకున్న సుదీర్ఘ నేపథ్యమూ కావచ్చు, కొన్ని సంవత్సరాలో, నెలలో, కనీసం రోజులో తీసుకున్న పరిణామమైనా కావచ్చు. ఆ కాలంలో పరస్పరం సంఘర్షించిన చారిత్రక శక్తుల, ఆలోచనల మథనం నుంచే, భౌతిక పరిస్థితుల, స్వీయమానసిక శక్తుల రసాయనిక సమ్మేళనం నుంచే ఏ ఘటన అయినా, పరిణామమైనా తలెత్తుతుంది. అది అప్పుడే పుట్టుకు వచ్చింది గనుక తప్పనిసరిగా దాన్ని కొత్తదిగా చెప్పుకుంటాం. కాని పాతలోని గౌరవించదగిన సంప్రదాయానికంతా వారసురాలిగానే అది ఉనికిలోకి వచ్చి ఉంటుంది. పాత కొత్తల మేలు కలయికగానే అది తనను తాను ప్రకటించుకుని ఉంటుంది.

విప్లవ రచయితల సంఘం తెలుగు నేల మీద, తెలుగు సాహిత్య చరిత్రలోని ధిక్కార ధోరణులన్నిటికీ సగర్వమైన వారసురాలు. అది కాలం కన్నబిడ్డ. ప్రత్యేకించి తెలుగు సమాజంలో, మొత్తంగా భారత సమాజంలో, అసలు స్థూలంగా దేశదేశాలలో జరిగిన, జరుగుతున్న ఎన్నో పరిణామాల భౌతిక పరిస్థితి అర్థం చేసుకోకపోతే విరసం ఆవిర్భావాన్ని కూడ అర్థం చేసుకోలేం. అలాగే, ఇది ప్రధానంగా సాహిత్య రంగపు పరిణామం గనుక ఆ రంగంలో జరిగిన ఎన్నెన్నో జ్ఞాత, అజ్ఞాత పరిణామాలు విరసం ఆవిర్భావానికి తమ వంతు పాత్ర వహించి ఉంటాయి. తెలుగు జాతి సామూహిక జ్ఞాపకంలో మిగిలిన అన్ని రకాల, ఛాయల, పాయల ప్రశ్నా సంప్రదాయాలు, ధిక్కార సంప్రదాయాలు 1960ల దందహ్యమాన దశాబ్దంలో కోపోద్రిక్త యువతరపు ప్రేరణతో విప్లవ రచయితల సంఘంగా పర్యవసించాయి. అందువల్ల విప్లవ రచయితల సంఘం రూపొందిన చారిత్రక మూలాలను సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే కనీసం వెయ్యి సంవత్సరాల తెలుగు సీమ సామాజిక చరిత్రనూ, సాహిత్య చరిత్రనూ, అందులోని ప్రగతిశీల, విప్లవకర, ప్రజాస్వామిక, ప్రజానుకూల ధోరణులన్నిటినీ అన్వేషించవలసి ఉంటుంది. సమ్మక్క సారలక్క వంటి ఆదివాసి తిరుగుబాటు ధోరణుల నుంచి, చరిత్రకు ఎక్కిన, ఎక్కని అపారమైన మౌఖిక ప్రజా కళా సంప్రదాయాల నుంచి, పోతన, ధూర్జటి వంటి ఆస్తిక రాజధిక్కార ధోరణుల నుంచి, భక్త రామదాసు వంటి భక్తి కవుల నుంచి, పోతులూరి వీరబ్రహ్మం, వేమన వంటి నైసర్గిక ప్రజాంతర్గత ధిక్కార ధోరణుల నుంచి పందొమ్మిదో శతాబ్ది ఆధునిక తెలుగు సాహిత్య ప్రశ్నా స్వభావం దాకా, 1930ల నాటి ఫాసిస్టు వ్యతిరేక, వలస వ్యతిరేక, అభ్యుదయ ధోరణుల దాకా ఎన్నెన్నో తమ సమకాలీన సమాజపు కొత్త గాలుల నుంచి తెలుగులో విప్లవ సాహిత్య స్వభావం రూపు దిద్దుకున్నది. కనుక నిజమైన, సమగ్రమైన విప్లవ రచయితల సంఘం చరిత్ర నిజానికి తెలుగు సమాజ, సాహిత్య చరిత్రలోని జ్ఞాత, అజ్ఞాత, ప్రకటిత, విస్మృత జనజీవన సాహిత్య కళా సంచలనాలన్నిటినీ తనలో భాగం చేసుకోవలసి ఉంటుంది.

అది విస్తారమైన పరిశోధన అవసరమైన విశాల చరిత్ర గాని, విరసం ఆవిర్భావానికి తక్షణ ప్రేరణగా నిలిచిన తక్షణ సందర్భాన్ని మాత్రం ఇక్కడ చెప్పుకోవడం అవసరం. ఆ తక్షణ ప్రేరణ నక్సల్బరీ శ్రీకాకుళ విప్లవ పోరాటాలు అని ఇప్పటికే అనేక సార్లు నమోదై ఉంది. కాని ఆ నక్సల్బరీ శ్రీకాకుళాలకు కూడ చారిత్రక ప్రేరణలూ, వాటిని అనివార్యం చేసిన సామాజిక పరిణామాలూ ఉన్నాయి. అందువల్ల విరసం చరిత్రను వలసానంతర భారత సమాజ చలనంలో భాగంగా అధ్యయం చేసినప్పుడు మాత్రమే అది సక్రమంగా అర్థమవుతుంది. ఆ సమాజ చలనంలో సామాజిక, రాజకీయార్థిక, సాంస్కృతిక అంశాలెన్నో కలగలిసి ఉన్నాయి. విరసం ఒక సాహిత్య సంస్థగా సాంస్కృతిక చలనాల పర్యవసానం మాత్రమే కాదు. రాజకీయార్థిక, సామాజిక చలనాలు మొత్తంగా సాంస్కృతిక రంగం మీద, ప్రత్యేకించి విరసం ఆవిర్భావ కారణాల మీద ప్రభావం వేశాయి.

మొత్తంగా దేశంలో 1947కు ముందరి అవ్యవస్థకు – అన్ని అవకతవకలకూ, అక్రమాలకూ, దోపిడీకీ, పీడనకూ, అవిద్యకూ, అనారోగ్యానికీ, నిరుద్యోగానికీ, వసతుల లేమికీ, వనరుల దుర్వినియోగానికీ – ఏకైక కారణంగా వలస పాలనను చూపే ఒక ధోరణిని వలసవ్యతిరేక ఉద్యమం అవలంబించింది. భారత సమాజానికీ బ్రిటిష్ వలస పాలనకూ మధ్య వైరుధ్యం ప్రధానమైనదే గాని, భారత సమాజం లోపలనే తక్షణం పరిష్కారం కోరుతున్న అనేక వైరుధ్యాలుండిన మాట అంతకన్న కఠినమైన వాస్తవం. ఆ అంతర్గత వైరుధ్యాలు తీవ్రస్థాయి ఘర్షణకు లోనవుతున్నాయనీ, సాహిత్య కళా రంగాలలో ప్రతిఫలిస్తున్నాయనీ కూడ చరిత్రలో నమోదై ఉంది. కాని “జాతీయోద్యమం” పేరుతో సాగిన ఉద్యమం ఆ అంతర్గత వైరుధ్యాలన్నిటినీ విస్మరించి, మూసివేసి, వాయిదావేసి, దేశం నుంచి బ్రిటిష్ పాలన తొలగిపోతే చాలు, దేశంలోని అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయన్న భ్రమలు కల్పించింది. ఆ భ్రమలు కల్లలని రుజువు కావడానికి 1947 ఆగస్ట్ 15 తర్వాత ఎక్కువ రోజులు పట్టలేదు.

బ్రిటిష్ వలస వ్యతిరేక జాతీయ ప్రజా ఉద్యమంలో విభిన్న శక్తులు పాల్గొన్నప్పటికీ, త్యాగాలు చేసిన అసంఖ్యాక ప్రజాసమూహాల ఆశలేమో వమ్మయిపోయాయి, భూస్వామ్య, బడాపెట్టుబడి, దళారీ పెట్టుబడికి ప్రాతినిధ్యం వహించే శక్తులకు నాయకత్వం చేజిక్కింది. ఆ నాయకత్వం ప్రజలను వంచించడానికి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనీ, సోషలిజం అనీ, ప్రభుత్వ రంగం అనీ, ప్రణాళికా బద్ధ అభివృద్ధి అనీ అనేక బూటకపు ప్రకటనలు చేసింది. ఈ వాగాడంబరం మధ్యతరగతి బుద్ధిజీవులను భ్రమల్లో ముంచి ప్రజల నుంచి దూరం చేసింది గాని వాస్తవంగా ప్రజల స్థితిగతుల్లో ప్రగతిశీలమైన మార్పులేమీ రాలేదు. భౌతిక పరిస్థితుల్లో రోజురోజుకూ సాగుతున్న దిగజారుడువల్ల ఒక దశాబ్దం లోపలే దేశవ్యాప్తంగా అసంతృప్తులు, ఆగ్రహావేశాలు, ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ ఆందోళనలకు నాయకత్వం వహించి, మార్గదర్శకత్వం ఇచ్చి, సామాజిక పరివర్తన వైపుగా నడిపించవలసిన శక్తులు అప్పటికే అనేక అంతర్జాతీయ, దేశీయ పరిణామాల వల్ల నిష్క్రియలోకి జారిపోయాయి. అంతర్జాతీయ పరిణామాలలో వర్గపోరాటానికి సెలవు ప్రకటించి, శాంతియుత పోటీ, శాంతియుత సహజీవనం, శాంతియుత పరివర్తన అని కొత్త వర్గసామరస్య సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన సోవియట్ కమ్యూనిస్టు పార్టీ ఇరవయో మహాసభ (1956) ఆలోచనలు, ఆచరణవ్యతిరేకతలు, దేశీయ పరిణామాలలో అప్పటికి నాలుగైదేళ్ల ముందే అద్భుతంగా నిర్వహిస్తున్న మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని విరమించి (1951), వర్గపోరాటాన్ని వదిలి, పార్లమెంటరీ పంథా చేపట్టిన భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజలను గాలికి వదిలాయి. ఒకవైపు స్వాతంత్ర్యం నిజం కాదని తెలిసి వచ్చిన నిరాశా నిస్పృహలు, ఈ పాలకులపై పోరాడడానికి మార్గదర్శకత్వం ఇచ్చి, నాయకత్వం వహించవలసిన శక్తుల విద్రోహం వల్ల వలసానంతర భారత సమాజంలో ఇరవై సంవత్సరాలు, ఒక తరం గడిచేసరికి అప్పటి యువతరం కోపోద్రిక్త యువతరం కాక తప్పని స్థితి ఏర్పడింది. విప్లవ రచయితల సంఘం ఆవిర్భావానికి వనరూ, కారణమూ, పోషకమూ ఈ కోపోద్రిక్త యువతరం ఆలోచనలే.  

సరిగ్గా ఆ సమయానికే ప్రపంచవ్యాప్తంగా కూడ యుద్ధానంతర ఆశల వైఫల్యం వల్ల 1960 దశకం కోపోద్రిక్త దశకంగా పరిణమిస్తున్నది. అమెరికాలో వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, ఫ్రెంచి, మెక్సికన్ విద్యార్థి తిరుగుబాట్లు, లాటిన్ అమెరికాలో కొత్త తరహా సాయుధ విప్లవోద్యమాలు, ఆగ్నేయాసియాలో, ఆఫ్రికాలో జాతి విమోచనోద్యమాలు, వీటన్నిటికీ శిఖరాయమానంగా చైనాలో మహత్తర శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం, వీటన్నిటికీ నేపథ్యంలో రష్యా చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య నడిచిన మహత్తర చర్చ రూపంలో ప్రపంచ భవిష్యత్తు, ప్రజా ఉద్యమాల గమనం గురించి జరిగిన చర్చ – ఇదీ 1960ల దృశ్యం. ఈ రంగస్థలం మీదికి భారత సమాజం నక్సల్బరీ రూపంలో ప్రవేశించింది. సహజంగానే అది ఆ దశకపు కోపోద్రిక్త యువతరాన్ని అమితంగా ఆకర్షించింది. విప్లవ రచయితల సంఘం, ఒక సంఘంగా రూపు దిద్దుకోవడానికి, దానికి ఒక ప్రాపంచిక దృక్పథం స్పష్టం కావడానికి వెనుక ఉన్న విశాల అంతర్జాతీయ, దేశీయ వాతావరణం ఇది.

ఈ వాతావరణానికి తెలుగుసీమలో వీస్తున్న ప్రత్యేకమైన గాలులు తోడయ్యాయి. ఈ ప్రత్యేకమైన గాలులు ఇటు పునాదిలోని ప్రజా జీవనంలో, రాజకీయ చలనంలో, అటు సాహిత్య, సాంస్కృతిక రంగాలలో ఇప్పుడు సులభంగా గుర్తించవచ్చు. వలసానంతర భారత చరిత్ర కన్న విశిష్టమైనది తెలుగు సీమ చరిత్ర. వలస పాలనా కాలంలో తెలుగు భాషా ప్రాంతాలన్నీ ఒకే పాలన కింద లేవు. పందొమ్మిదో శతాబ్ది నుంచి ఇరవయో శతాబ్ది మధ్యదాకా అటు బ్రిటిష్ పాలనలోని మద్రాసు రాష్ట్రపు తెలుగు ప్రాంతాలలో, ఇటు అసఫ్ జాహీ పాలనలోని హైదరాబాద్ రాజ్యపు తెలుగు ప్రాంతాలలో భిన్నమైన పాలనల కింద భిన్నమైన రాజకీయార్థిక సామాజిక జీవనం, భిన్నమైన సాంస్కృతిక ధోరణులు వికసించాయి. రెండు ప్రాంతాలలోనూ భిన్నమైన జనజీవన సంచలనాలు సాగాయి.

భారత దేశంలో వలస పాలన ముగియడానికి కొద్దిముందు మొదలై, వలస పాలనానంతరం కూడ ఒక సంవత్సరం పాటు సాగి, వలసానంతర ప్రభుత్వపు దుర్మార్గాన్ని కళ్లకు కట్టిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం హైదరాబాద్ రాజ్యంలో సాగింది. ఈ దేశంలో ప్రజావిముక్తికి అత్యవసరమైన భూస్వామ్య వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంగా అది మూడు నాలుగు సంవత్సరాల్లోనే అంచెలంచెలుగా ఎదుగుతూ దేశానికే వేగుచుక్కలా విస్తరించింది. సరిగ్గా అప్పుడే విజయం దిశగా పురోగమిస్తున్న చైనా విప్లవ మార్గంలో ఆ సాయుధ పోరాటం దేశానికి దిశా నిర్దేశం చేసింది. మూడు వేల గ్రామాలను భూస్వామ్య దోపిడీ పీడనల నుంచి విముక్తి చేసింది. దున్నేవారికి భూమి నినాదం కింద పదిలక్షల ఎకరాల భూమి పంచింది. ఈ విజయాలు సాధించే క్రమంలో తెలంగాణ ప్రజానీకం, కమ్యూనిస్టు పార్టీ అపారమైన త్యాగాలు చేయవలసి వచ్చింది. నాలుగు వేల మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, రైతుకూలీలు తమ ప్రాణాలు బలిపెట్టి, లక్షలాది మంది ప్రజలు చిత్రహింసలు అనుభవించి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లారు. కాని ఆ పోరాట నాయకత్వమే భ్రమలకు లోనై ఆ పోరాటానికి విద్రోహం చేసి, అధికారికంగా పోరాట విరమణ ప్రకటించాక, తెలుగు పోరాట ప్రజానీకానికి నాయకత్వ లేమి ప్రారంభమయింది. సమస్యలు పెరుగుతున్నప్పటికీ, ఆ సమస్యల పరిష్కారానికి పోరాడవలసిన అవసరం పెరుగుతున్నప్పటికీ, ప్రజా అసంతృప్తినీ ఆందోళనూ క్రమబద్ధంగా మార్గదర్శకత్వం ఇచ్చి ఉద్యమంగా మార్చవలసిన శక్తులు లేకపోవడంతో ప్రజలు నిరాశలోకో, నిర్లిప్తతలోకో జారిపోయారు.

సాయుధపోరాట విరమణ ఆఘాతం నుంచి తేరుకోకముందే తెలంగాణ యువతరంలో ఆంధ్ర ప్రాంతంతో విలీనపు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు భయసందేహాలు మొదలయ్యాయి. ఆ భయసందేహాలు ఒక దశాబ్దం తిరిగేసరికి అక్షరసత్యాలని అర్థమై, తిరుగబడినప్పటికీ, ఆ తిరుగుబాటు కూడ విద్రోహానికి గురై, మరొకసారి నిరాశ వ్యాపించింది. ఆ నిరాశను పటాపంచలు చేస్తూ, మరొకసారి మౌలిక అంశాలపై సాయుధపోరాటపు కొత్త ఆశలు కల్పిస్తున్న వాతావరణం విప్లవ రచయితల సంఘం ఏర్పడడానికి ముందున్న స్థితి.

ఈ సామాజిక, రాజకీయ వాతావరణం సాహిత్యంలోకీ, కళల్లోకీ ప్రవహించడం, ప్రతిఫలించడం చాల సహజంగా జరిగిపోయింది. వలసానంతర భారత సమాజంలో, తెలుగు సమాజంలో 1950ల దశకంలో తొలి అర్ధభాగం ఆశనిరాశల దోబూచులాటలో సాగిందేమో గాని, రెండో అర్ధభాగానికి వచ్చేసరికి బుద్ధిజీవులలో, ఆలోచనాపరులలో కూడ నిరాశ, పోరాటం పట్ల నిర్లిప్తత, తామే అంతకు ముందు ఒక దశాబ్దం పాటు ప్రకటించిన, ప్రజలను చైతన్యవంతం చేసిన అవగాహనల నుంచి వైముఖ్యం మొదలయ్యాయి. పాలనకూ ప్రజలకూ, సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకూ వారిని సంఘటితం చేయవలసిన నాయకత్వాలకూ, ప్రజా జీవనానికీ బుద్ధిజీవుల ఆలోచనలకూ సంబంధం తెగిపోయింది. కవిత్వంలో ఏమి ఉండాలనే చర్చ పక్కకు పోయి, కవిత్వ రూపం ఎలా ఉండాలనే చర్చ ప్రధానమైంది. అక్షరాస్యతా శాతం పెరుగుతూ, కొత్తగా విద్యావంతులైన వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ పత్రికలు పెరుగుతూ అవి పాలకవర్గ భావజాలానికి వాహికలుగా మారిపోయాయి. పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలయ్యాయి. వాటిని నింపడానికి కథ, నవలా ప్రక్రియల్లో ఎక్కువభాగం కాలక్షేపపు సాహిత్యం చొరబడింది. సమాజ సాహిత్య సంబంధాలలో ప్రవేశిస్తున్న ఈ తప్పుడు ధోరణులను ఎత్తిచూపి, సవరించి, మార్గనిర్దేశనం చేయవలసిన విమర్శా రంగం పాండిత్య ప్రకర్షకూ, సమాజానికి సంబంధం లేని చర్చలకూ పరిమితమై పోయింది.

స్థూలంగా అభ్యుదయానంతర ధోరణులు అనే పేరుతో పిలవబడుతున్న ఈ 1950 దశకం, 1960 దశకం మధ్యభాగం వరకూ సాహిత్యం సమాజానికీ, సమష్టికీ, చైతన్యానికీ, పోరాటానికీ దూరమవుతూ వచ్చింది. అందువల్లనే ఈ కాలాన్ని సాహిత్య చరిత్రలో స్తబ్దతా కాలం అని పిలుస్తున్నాం. ఈ స్తబ్దత గురించి మొట్టమొదటిసారి గుర్తించి, దాన్ని బద్ధలు కొట్టడానికే తమ శక్తి సామర్థ్యాలన్నీ వెచ్చించి ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో అజరామరంగా నిలిచిన వారు దిగంబరకవులు. ఆ దిగంబర కవుల్లోనే ఇద్దరు వారు దిగంబర కవులుగా మారకముందు ప్రచురించిన సంపుటాలు చూస్తే ఆ కాలపు స్తబ్దత అర్థమవుతుంది.

వారిలో ఒకరు దిగంబరకవిగా నగ్నమునిగా మారిన కేశవరావు (మానేపల్లి హృషీకేశవరావు)

“జీవితాన్ని నిర్వచించకు

దోసిట్నిండా నింపబడిన ఈ జీవితాన్ని గటగటా తాగెయ్యనియ్యి

బ్రతుకు గురించి పాడకు

రక్తంతో కన్నీళ్లతో ఈ హృదయం ఎప్పుడో గడ్డకట్టుకుపోయింది” అని,

”ఎవడి కన్నీళ్లు

వాడి సొంత ఆస్తి” అని ఆ నాటి సమాజంలో బుద్ధిజీవి నిర్లిప్తతను, నిరాసక్తతను, ఒంటరితనాన్ని ప్రకటించారు.

మరొకరు మహాస్వప్నగా మారిన కమ్మిశెట్టి వెంకటేశ్వర రావు

”ఇది నల్లని తెల్లని రాత్రి

ఇది తెల్లని నల్లని రాత్రి

ఇకలేదు ఉషఃప్రసక్తి ఇది అనంత చరమరాత్రి

ఇది స్మశానశాంతి ఆవహించిన రహస్య రాత్రి” అనీ,

”పద నేస్తం తల వొంచ్కు వెళిపోదాం

ఏవేవో ఊహిస్తాం అంతా మన చాదస్తం

లోకపు కీకారణ్యంలో నడుస్తున్న

చీకటి బాటసారులం మనం

పద నేస్తం తలవొంచుకు వెళిపోదాం

మన గమ్యం మన తీరం మృత్యువు

ఈ లోకం మన పాలిటి శత్రువు” అనీ నిరాశనూ, విషాద భరిత పలాయనత్వాన్నీ ప్రకటించారు.

ఈ కవితలు రాసిన 1962-64 నాటికి వీళ్లిద్దరూ ఇరవైల్లోని యువకులని గుర్తుంచుకుంటే నాటి యువతరపు మనఃస్థితి అర్థమవుతుంది. ఈ సామాజిక విలువల నిరాకరణను, కసిని, ఉక్రోషాన్ని, నిరాశను, ఒంటరితనాన్ని గుర్తించి, సరిచేసి, సామాజిక చైతన్యాన్ని, సమష్టి తత్వాన్ని, ఆశావాదాన్ని ప్రబోధించవలసిన పాతతరం అభ్యుదయ సాహిత్య నాయకులు కూడ అదే స్థితిలో ఉండడం, తమ గత భావాలను తామే విమర్శించుకోవడం ఈ దశకపు స్తబ్దతకు మరింత కొట్టవచ్చినట్టు కనిపించే చిహ్నం. కేశవరావు ప్రచురించిన ‘ఉదయించని ఉదయాలు’ కవితా సంపుటికి ముందుమాట రాస్తూ, అప్పటికి పది సంవత్సరాల కిందనే త్వమేవాహం కావ్యంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని సమర్థించిన కవి, అభ్యుదయ రచయితల సంఘం నాయకుడు ఆరుద్ర, “అభ్యుదయ కవుల ధర్మమా అని వర్గ చైతన్యం గురించి పాడితేనే తప్ప మిగతాది కవిత్వం కాదేమోనన్న అపోహ ఆంధ్రదేశంలో అనవసరంగా ఊపిరి పీలుస్తోంది” అని వర్గ చైతన్యాన్ని కించపరిచే మాట రాశాడు.

ఈ స్తబ్దతను బద్దలు కొట్టిన దిగంబర కవులు విప్లవ రచయితల సంఘం ఆవిర్భావానికి ఒక కర్టెన్ రెయిజర్ .

(మిగతా వచ్చే సంచికలో… )

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు.
ర‌చ‌న‌లు: 'స‌మాచార సామ్రాజ్య‌వాదం', 'క‌ల్లోల కాలంలో మేధావులు - బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌', 'అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌', 'క‌థా సంద‌ర్భం', 'క‌డ‌లి త‌ర‌గ‌', 'పావురం', తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, 'పోస్ట్‌మాడ‌ర్నిజం', 'న‌వ‌లా స‌మ‌యం', 'రాబందు నీడ‌', 'క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌', 'ప‌రిచ‌యాలు', 'తెలంగాణ‌ - స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, వాస్త‌వాలు', 'శ్రీశ్రీ అన్వేష‌ణ‌', 'లేచి నిలిచిన తెలంగాణ‌', 'ప్ర‌తి అక్ష‌రం ప్ర‌జాద్రోహం - శ్రీకృష్ణ క‌మిటీ నివేదిక‌', 'రాబందు వాలిన నేల‌', 'ఊరి దారి- గ్రామ అధ్య‌య‌న ప‌రిచ‌యం', 'విద్వేష‌మే ధ్యేయంగా విశాలాంధ్ర మ‌హార‌భ‌స‌', 'క‌విత్వంతో ములాఖాత్‌', 'సమాజ చలనపు సవ్వడి', 'కాషాయ సారం', 'విద్వేషాపు విశ్వగురు', 20కి పైగా అనువాదాలు.
సంపాద‌క‌త్వం: 'Fifty Years of Andhrapradesh 1956-2006', 'Telangana, The State of Affairs', '24గంట‌లు', 'హైద‌రాబాద్ స్వాతంత్య్ర సంరంభం', 'జ‌న హృద‌యం జ‌నార్ద‌న్‌', 'స‌మ‌గ్ర తెలంగాణ' పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

Leave a Reply