అది జూలై 4.
దేశం నుంచి వలస పాలకులను తరిమివేయడానికి అవసరమైన అరణ్యయుద్ధాన్ని నిర్వహించిన అల్లూరి సీతారామరాజు పుట్టిన రోజు.
తెలంగాణను భూస్వామ్య బంధనాల నుంచి విముక్తి చేసే మహా యుద్ధంలో తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య నేలకొరిగిన రోజు.
పాత వలస వాదుల మీద కొత్త వలస వాదుల పోరాటమే అయినప్పటికీ, ఇరుపక్షాలూ స్థానిక జాతులను ఊచకోత కోసినప్పటికీ, ప్రపంచానికంతా ప్రజాస్వామ్యపు ఆశలు పంచిన అమెరికా స్వాతంత్ర్యం సాధించిన రోజు.
అది 1970.
మహత్తర చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం, అనంత బలశాలి అమెరికాను ఢీకొంటూ విజయవాగ్దానం కురిపిస్తున్న వియత్నామ్ జాతీయ విముక్తి పోరాటం, అంతర్జాతీయంగా కోపోద్రిక్త అసంతృప్త విద్యార్థి యువజనుల తిరుగుబాట్లు, నక్సల్బరీ శ్రీకాకుళ విప్లవోద్యమాలు పెల్లుబుకుతున్న సందర్భం.
అది 1970 జూలై 4.
తెలుగు సమాజానికీ సాహిత్యానికీ సంబంధించినంతవరకు అది ఒక చరిత్రాత్మక సందర్భం.
ఇంగ్లిష్ నుడికారంలో చెప్పినట్టు రెడ్ లెటర్ డే. అరుణాక్షర దినం.
నిజంగానే అరుణాక్షర చరిత్రకు ఆవిష్కార దినం.
హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లి స్టేషన్ రోడ్డులో ఇంపీరియల్ హోటల్ లో ఒక గదిలో ముందురోజు రాత్రి తొమ్మిది నుంచీ ఎడతెగకుండా జరిగిన చర్చోపచర్చల సమావేశం అనంతరం జూలై 4 ప్రవేశించాక ఉదయం ఒంటి గంటా పది నిమిషాలకు సమయం వేసి మరీ శ్రీశ్రీ సంతకం చేసిన ప్రకటనతో విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించింది.
అలా జూలై 4 ప్రజా పోరాటాలనుంచి ప్రేరణ పొంది ప్రజలకు విప్లవ సందేశం అందించేందుకు ఏర్పడిన తొట్టతొలి సాహిత్యకారుల సంస్థ పుట్టినరోజు.
‘ప్రజల నుంచి ప్రజలకు’ అనే మార్క్సిస్టు తత్వాన్ని అక్షరాల్లోకి అనువదించిన వందలాది మంది సాహిత్య కారులను సృష్టించిన, వేలాది మంది సాహిత్యకారులను ప్రభావితం చేసిన, లక్షలాది మంది ప్రజలకు చేరుకున్న ఏకైక సాహిత్య సంస్థ పుట్టిన రోజు.
నలబై తొమ్మిది సంవత్సరాలు నిండిన విప్లవ రచయితల సంఘం 2019 జూలై 4న యాభయ్యో సంవత్సరంలో, అర్ధశతాబ్ది ఉత్సవ సంరంభంలో అడుగు పెడుతున్నది.
విప్లవ సాహిత్య ప్రస్తావన లేకుండా, విప్లవ సాహిత్యానికి అగ్రగణ్య ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ అర్ధ శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్ర రచనే అసాధ్యం.
కవిత్వం, పాట, కథ, నవల, నాటకం, సాహిత్య విమర్శ వ్యాసం, రాజకీయార్థిక సామాజిక సాంస్కృతిక విశ్లేషణా వ్యాసం, పత్రికా రచన, ఉపన్యాసం, అనువాదం… ఏ ప్రక్రియ తీసుకున్నా తెలుగు సాహిత్యానికి విప్లవ రచయితల సంఘం అందించిన కానుకలు అపారమైనవి, అత్యంత సంపన్నమైనవి. స్వయంగా సభ్యులే రచించిన కవితల, పాటల సంపుటాలు కనీసం రెండు వందలు, కథా సంపుటాలు వంద, నవలలు యాబై, వ్యాస సంపుటాలు రెండు వందలు, అనువాద రచనలు వంద, పుస్తక రూపంలోకి రాని, పత్ర్రికల్లో మిగిలిపోయిన రచనలు వేలాది, తెలుగు సీమ అంతా విస్తరించిన ఉపన్యాసాలు కొన్ని వేలు – ఏ ఒక్క ప్రక్రియ చరిత్ర రూపంలోనైనా విస్తారమైన విరసం చరిత్ర రాయవచ్చు.
నక్సల్బరీ శ్రీకాకుళ ఉద్యమాల నాటి నుంచి ఇవాళ్టిదాకా సాగిన, సాగుతున్న అనేక ప్రజా ఉద్యమాలు విప్లవ సాహిత్యానికి, విరసం రచయితల సాహిత్య సృజనకు ప్రేరణనిచ్చాయి. అవి తిరిగి విప్లవ సాహిత్యంతో ప్రేరణ పొందాయి. ఈ సమాజ సాహిత్య గతితార్కిక సంబంధాన్ని ఈ ఐదు దశాబ్దాల తెలుగు సమాజ చరిత్రతో కలిపి రాసినా మహోజ్వలమైన విరసం చరిత్ర రాయవచ్చు.
అటు ప్రభుత్వం నుంచీ రాజ్య శక్తుల నుంచీ ఇటు భిన్న సాహిత్య స్రవంతుల నుంచీ విమర్శలు, నిందలు, అబద్ధాలు, ఆరోపణలు, ఆంక్షలు, నిర్బంధాలు, పుస్తక నిషేధాలు, జైలు శిక్షలు, కుట్ర కేసులు, హత్యా ప్రయత్నాలు, హత్యలు ఇంతగా ఎదుర్కొన్న సాహిత్య సంస్థ ప్రపంచంలోనే మరొకటి ఉండదు. మొత్తంగా సంస్థనే 2005లో నిషేధానికి గురి అయి, న్యాయపోరాటం చేసి, నిషేధం నుంచి బైటపడింది. ఈ నిర్బంధాల చరిత్ర రూపంలోనైనా విరసం చరిత్ర రాయవచ్చు.
విప్లవ పూర్వ దశలో రష్యాలో మేధావుల, రచయితల కదలికలున్నాయి గాని ఒక సాహిత్యకారుల సంస్థ రూపొందలేదు. విప్లవ పూర్వ చైనాలో 1931లో వామపక్ష రచయితల సమాఖ్య ఏర్పడింది గాని నిర్బంధం వల్ల ఐదు సంవత్సరాల్లో మూతబడవలసి వచ్చింది. ఇతరదేశాల విప్లవ చరిత్రలలోనూ సాహిత్యకారుల సంఘటిత నిర్మాణ కృషి కనబడదు. ఇరవైకి పైగా ద్వైవార్షిక మహాసభలు, ఇరవైకి పైగా ద్వైవార్షిక సాహిత్య పాఠశాలలు, ఎన్నెన్నో కవిత్వ, కథా, వ్యాస శిక్షణా పాఠశాలలు, నిజనిర్ధారణ, సమాజ అధ్యయన పర్యటనలు, అన్ని జిల్లాలలోనూ, అన్ని ముఖ్య పట్టణాలలోనూ, గ్రామాలలోనూ సామాజిక, సాహిత్య అంశాలపై సభలు, సమావేశాలు, ఇంత విస్తృతమైన నిర్మాణ చరిత్ర గల సాహిత్య సంస్థ ప్రపంచంలోనే మరొకటి ఉండదు. ఈ నిర్మాణ చరిత్రగానైనా విరసం చరిత్ర రాయవచ్చు.
“ఈ మహోజ్వల వీర శ్రీకాకుళము పేర
లిఖియించు చరితకు నిర్మాత ఎవరన్న
నేటి విప్లవ కవుల కావ్యాలు వినిపించి
సత్యమును పూర్తిగా తెలుసుకోనివ్వాలి” అని యాబై సంవత్సరాల కిందనే అన్న కవి వాక్కును నిజం చేసింది విప్లవ రచయితల సంఘం.
ఈ యాబై సంవత్సరాల విప్లవ సాహిత్య చరిత్ర, విప్లవ రచయితల సంఘం చరిత్ర ఆసక్తిదాయకమైనది, అద్భుతమైనది, ఉద్వేగభరితమైనది, రోమాంచకమైనది, ఆదర్శపూరితమైనది, ఉత్తేజకరమైనది.
ఆ అసాధారణ చరిత్ర శకలాలను ఈ ఏడాది పొడవునా ప్రతి సంచికలోనూ ధారావాహికంగా ప్రచురించాలని ‘కొలిమి’ తలపెడుతున్నది.
వచ్చే సంచిక నుంచే ప్రారంభం.
‘అరుణాక్షర అద్భుతం.’
mamchi prayatnam.
ఆతురుతతో వేచి చూస్తున్నా