అమ్మా అడివమ్మా – మన రాజ్యం మనదమ్మా

అతడు :
ఆకాశ పందిరి కిందా
పూసిన అడివమ్మో – ఎన్నెల
కాసిన అడివమ్మా
నీ బిడ్డ లేమయ్యిండ్రు
నువ్వే జెప్పమ్మా – మమ్ముల
తట్టి లేపమ్మా
కాలమెంత కఠినమైనా
కగార్ కావొద్దు – మిమ్ముల
కాల్చి చంపొద్దు
రాజ్యం మీ క్షేమం మర్సి
రాబందుల వాలొద్దు – పైబడి
పీక్కు తినవద్దు
||ఆకాశ||

అమ్మ అడవి :
రాములవారు తిర్గిన నేలట
దండాకారణ్యం – బిడ్డా – దండాకారణ్యం
గణ రాజ్యాలు పుట్టిన అడవి
కోయోల్ల రాజ్యం – ఈడ- గోండోల్ల రాజ్యం
మొగులను అంటే కొండలు మావే
ముప్పయ్యారు కోటలు మావే
కాకులు దూరని అడవులు మావే
మందులు మాకులు లేక పండే
మక్క జొన్నల పంటలు మావే
కాల్లకింది ఖనిజ సంపద
శాపమయ్యిందో – మాకు – శాపమయ్యిందో
కార్పొరేట్ల దోపిడి కోసం
బందీ అయ్యిందో – అడవి – బాధలు పడుతుందో

                                          ||కాల్లకింది||

అతడు :
ఏడ్వకమ్మ తూడ్వకమ్మా
అమ్మా అడివమ్మా – మన – భారత్ పెద్దమ్మ
కరువులొ కప్పం కట్టమంటూ
బాణాలైరమ్మా – అడవి
ప్రాణాలైరమ్మా
తెల్లవాడిపై భూంకాల్
తిరుగుబాటువమ్మా – మన్యం
పితూరి నీవమ్మా
కొమురం భీమై లేస్తిరమ్మ
రాంజీ గోండులమ్మా – మీరు
రగల్ జెండలమ్మా

                                       ||ఏడ్వకమ్మ||

అమ్మ (అడవి) :
నాగరికతకు పట్టం గట్టిన
మూలవాసి నేనే అసలు భారతమ్మ నేనే
లాభం కొరకు చెరబడ్తారా
అంబాని ఎవరూ – మరి ఆదాని ఎవరూ
చిప్కో ఉద్యమ పాఠం వుంది
అడవి రక్షణ చరిత్ర ఉంది
లక్షల చెట్ల హస్దేవ్ అడవిని
పెళపెళ కూల్చిన ఘనత ఎవరిది
అండగ నిలిచిన అన్నలక్కల
కాల్చి చంపిన పాలనెవరిది
అడవి బిడ్డలను బంధిస్తుంటే
పెసా చట్టమేదో – అది – పేరుకె మిగిలిందో
మా ఊళ్ళో మా రాజ్యం అంటూ
అడుగు ముందుకేద్దాం – మీరు – అండాగుండండో

ఇద్దరు కలిసి :
ఆకాశ పందిరి కిందా
పూసిన అడివమ్మా – ఎన్నెల
కాసిన అడివమ్మా
కగార్ యుద్ధం ఆగాలంటూ
కల్సి పాడెదాము మనం –
నిల్సిపోరుదాము…

పుట్టింది కరీంనగర్ జిల్లా వేములవాడ. కవి, రచయిత, గాయకుడు. విప్లవోద్యమ నాయకుడు. అసలు పేరు కూర దేవేందర్. కలం పేరు మిత్ర. అమర్ పేరుతో సీపీఐ(ఎం.ఎల్.) జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రచనలు : 1. మిత్ర తెలంగాణ పాటలు, 2. పొదుగు, 3. వరుపు, 4. మిత్ర జనం పాటల సవ్వడి (పాటలు); 5. చితాభస్మంలోంచి...(కవిత్వం); 6. తెలంగాణ డప్పు దరువు, 7. తెలంగాణ ధూం ధాం, 8. తెలంగాణ కోలాటం పాట, 9. ముంబై తెలంగాణం, 10. బహుజన బతుకమ్మ, 11. వీరతెలంగాణ (నృత్యరూప గానాలు).

2 thoughts on “అమ్మా అడివమ్మా – మన రాజ్యం మనదమ్మా

  1. Okappudu…Naati samaji paristitulu, raajakeeja paristitulaku vyathirekanga vaama paksha vaada udyamalu avasaram ayyayi… ippudu samajam marindi, rastram marindi, desham marindi mottham prapanchame marindi. Vyaktulu mararu… vyavasta marindi (Manchi-Chedu edaina). Neti kaalaniki Vaamapaksha thupaki udyamalu paniki raavu. Expired …
    Udyamalu avasaram eppudaina untai… Kaaani vaati theeru thennulu, vidhi vidhanaalu maaraali.

    VAAMAPAKSHA UDYAMALAKU KAALAM CHELLINDI… MUNDU ADI VAALLU ARTHAM CHESUKOVALI

Leave a Reply