ఇదంతా ఏమిటని అనుకోకండి
ఎప్పుడు ఏది ఎలా మొదలవుతుందో మరి
వర్షం కురుస్తున్న ఉదయంలో
కిటికీకి అటు వైపు కూర్చొని
వర్షాన్ని తడిమే కన్నుల మౌనమిది.
చినుకు చినుకు మధ్య తప్పిపోయిన పరవశమిది.
ఆకు మధ్య తొంగిచూసే
లేత చిగురు నవ్వుల ఇది
ఎన్నో రాత్రులు తరువాత
ఎంతో వసంతాన్ని మోసుకొచ్చి
విరగపూసిన వెదురుపువ్వు పరిమళమిది
ఒక్కో రాయి వేసి పైకి తెచ్చిన నీళ్ళని
గులకరాళ్లు దాహంతో మింగేస్తే
కొట్టుకులాడుతూ అల్లాడిన
కాకి పిల్ల చేసిన కావు కావు శబ్దమిది
నావికుడి ప్రాణప్రదమైన నావ
నడిసముద్రంలో
తీరం పై దుఃఖంతో, బెంగతో విడిచిన నిట్టూర్పు ఇది.
అందరినీ మోసుకువెళ్ళే
చెక్క రంగులు బల్ల కట్టు
తను చెట్టు నుండి వేరుచేయబడిన కొమ్మనని
నడిరాతిరిలో వేదనతో పాడుకునే పాట ఇది
తీరాలతో కొట్లాడి అలసిన అలలు
అయిష్టంగా, నెమ్మదిగా
ఇక చేసేదేమీ లేక
సముద్రంలో కలిసిపోయిన స్తబ్దత ఇది.
ఏడు చేపల కథలో
చెప్పుకోలేని, చేతకాని
పారిపోలేని
ప్రాణం విడువలేని
ఎండని ఏడవ చేప మాటిలివి
తమ పుట్టలో
నిద్రపోయిన పామును
కరవలేని, పుట్టని వదులుకోలేని చీమల కోపమిది
చుట్టూ తిరుగుతూ
కాళ్లకు అడ్డుపడి నలిగే
పిల్లి హృదయంలో
ఏముందో తెలుసుకోలేని నిస్సహాయత ఇది.
చదరంగపు ఆటలో
తిరగబడ్డ సైనికుడి గుండెతో
తుళ్లిపడి ఎగిరిన చదరంగపు బల్ల ఇది
ముసుగులేని నాటకంలో
హృదయాన్ని పరిచిన నగ్న రంగస్థలమిది
వరుసల్లేని వరుసల్లో
మనుషులు, మనసులు, కోరికలు చిన్నాభిన్నమైన చోట
కొత్త వరుస చేసుకొని మొదలయ్యే కథ ఇది
నేలలో, నెత్తురులో
గాలిలో, నీరులో అలసిన ప్రాణం
అదే సంతోషం, దుఃఖం, వెలితి, తపన, ఎరుకలతో
గుప్పిట్లో చికించుకున్న అనంతమైన శూన్యంతో
ఏమీ లేనీ, అన్నీ ఉన్న
ఎవరికీ చెందనీ, అందరిదీ ఐన
అంతులేని రహస్య గాఢతల్లో
దరి దొరకని
అతి చిన్న జీవితమిది
ప్రవాహ సందిగ్ధాల్లో
ఉన్మత్త ఉదాత్తతలతో
ఊపిరి సలపని
ఊహకందని
భాషకెరుగని
భావాన్ని చిక్కించుకోలేని
నిశ్చలమైన అనిశ్చితితో కొట్టుకుపోయిన
నిజంగా, నిజమైన ముగింపెరుగని
హృదయమిది
అవును, ఓ హృదయమిది.
బాగుంది