అభిమతం

రాళ్లను కరిగించే భక్తి మార్గంలో
రంకుతనం రక్తి కడుతుంది
విముక్తి మనసులు మంచులా కరుగుతూ విషమిస్తున్నాయి
పునీతం కావలసిన మనసులు
కుళ్ళు కంపు కుట్రలవు తున్నాయి
గాండ్రిస్తున్న పులిలా మారి మనుష్యులనే వేటాడుతున్నారు

భక్తిప్పుడు దేశమంతా వ్యాపించిన అసహానపు జ్వాలలు
రాష్ట్రాల్ని వేపుకు తింటున్నాయి.
రక్తాలు సెలయేరై విరక్తిగా పారుతున్నాయి
తలలు నిర్జీవంగా తెరిచిన నోటితో నింగిని మింగాలనుకుంటున్నాయి

ఇదం మూలం మతం జగత్ అనీ
బుల్లెట్లను కురిపిస్తూ బాలెట్లు భయంతో గెంతుతున్నాయి

పెట్టుబడిదారునికి మతం ఎంతో కమతమూ అంతే
నేతల తలల్నే కాదు రేపటి తలపుల్ని తూకమేసికొనెటోడు
కర్కుశ హృదయుడై
దేశభక్తి చిరునామగా దేదీప్యమానమవుతున్నాడు
పెట్టుబడి నోట్లో చిక్కుకున్న నేతలు విలవిల్లాడుతూనే దేశ ప్రజల స్కీములను వల్లిస్తున్నారు
నక్క వినయాలతో ఓటర్ల గంగడోలు నిమురుతూనే
కసక్కన మెడ బతుకు కోసే వరకు తెలియదు
మతవిప్పుడు మధ్యయుగం నాటి విద్వేషం
మెజారిటీని మేల్కొల్పే
ధ్వంసరచన సాంగత్యంతో
కత్తుల కవాత చేస్తూ ఏకత రాగం వల్లిస్తూనే
కత్తికొక ఖండగా నరికేస్తుంది
తలల దండలు ధరించిన భుజబలాలు మత చిహ్నాలయి
నెత్తురు తిలకాలు దిద్దుకొని
పెయిడ్ చానల్లో పేటెంట్లు పొందుతారు
మొండి వాదనలకు తొండి నిరూపణలు
నిజాలకు గండి కొడుతూ
కత్తులు కట్టుకున్న రెక్కలై రంగు రంగులుగా
పచ్చి అబద్ధాలు కచ్చిత నిజాలని కడక్ గ్గా నినదీస్తుంటాయి

మత శాంతిని వెదజల్లే అశాంతమూర్తులు అవతార పురుషులై ఆవేశాల్ని కక్కుతుంటారు
అధికార తోలు కప్పుకున్న తోడేళ్ల రూపసులు పురాణపురుషుల వారసులై వాసికెక్కుతారు
నెత్తురు శ్రవిస్తున్న గాయాల సాక్షిగా విషం వీరత్వం
ఆహాకారాలు ఆర్త నాదాలు
కోకిల రాగాలలో కాకుల గోల కనిపించదు
కనిపించేదంతా ఆహార్యం మారుతూ మనుగడ సాగిస్తుంటుంది
మస్తిష్కాన్ని కాకుంటే మనుషుల నరికే మతం అఖండ భారతాన్ని పవిత్రంగా ప్రవచిస్తుంటది

ఇప్పుడు దేశానికి కావాల్సింది మతంగాదు
మనమంతా ఒక్కటనే అభితం
పవిత్ర గ్రంథమైన రాజ్యాంగం పారాయణం కావాలి
కులం పేరా మతం కుళ్ళు నింపుతూ విడదీసేటోడి బట్టలూడదీసి కొట్టగలగాలి
విశ్వమానవ ప్రేమ ఒక్కటని చాటాలి

జ‌న‌నం: గోనెప‌ల్లి, సిద్ధిపేట జిల్లా. క‌వి, రచ‌యిత, ఉపాధ్యాయుడు. 'మా తొవ్వ‌'(క‌విత్వం), 'బ‌తుకు పాఠం'(క‌విత్వం), 'త‌ప్ష‌'(క‌థ‌) ప్ర‌చురించారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నుంచి 'తెలంగాణ‌ పాట‌ల్లో సామాజిక చిత్ర‌ణ' అనే అంశంపై ప‌రిశోధ‌న చేశారు. ప్ర‌స్తుతం వేముల‌ఘాట్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో స్కూల్ అసిస్టెంట్‌(తెలుగు)గా ప‌నిచేస్తున్నారు.

Leave a Reply