ఆంధ్రజ్యోతి సాహిత్యవేదికలో 1983లో అచ్చయిన కవిత ఒకటి చదివి లోలోపలి నుంచి కదిలిపోయి, ఆ తర్వాత బెజవాడ వెళ్లినప్పుడు ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వెతుక్కుంటూ వెళ్లి కవి అఫ్సర్ ను కలుసుకున్నాను. ‘అంతిమస్పర్శ’ అనే ఆ కవిత ప్రతిభావంతుడైన హిందీకవి సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా మరణవార్త విని, ఆయన చనిపోయేటప్పటికి గుండెలమీద తెరిచిన పుస్తకం ఉన్నదని విని రాసినది.
ఆ నాటినుంచీ అఫ్సర్ నూ అఫ్సర్ కవిత్వాన్నీ చాల సన్నిహితంగానూ, ప్రేమతోనూ, ఒక్కోసారి నిర్మమకారమైన దూరం నుంచీ చూస్తూ వస్తున్నాను. ఆనాడు బందరు రోడ్డు మీద మూడేళ్లు (మూడేళ్ల ఇరవైఒకటి కాదు, నిజంగా పసితనపు మూడేళ్లే) నిండని కవికుమారుడు అఫ్సర్ ఎలా ఉన్నాడో, ఎలా మాట్లాడాడో, ఎలా కవిత్వం రాశాడో ఇన్నేళ్ల తర్వాత ఇవాళ కూడ అలాగే ఉన్నాడు. ఆ పసితనంలోనే, పసితనంతోనే ఉన్నాడు. అభివ్యక్తిలో అసాధారణమైన ప్రజ్ఞనూ పరిణతినీ కనబరుస్తూనే వ్యక్తిత్వంలో అమాయకత్వాన్నీ పసితనాన్నీ కాపాడుకుంటున్నాడు. ఈ ఇరవైఆరేళ్లలో నేను తనతో తీవ్రంగా విభేదించిన సందర్భాలూ ఉన్నాయి గాని చెక్కుచెదరని స్నేహబంధం గత జ్ఞాపకంగా మారిపోలేదు. ఎప్పటికీ వెలిసిపోని పాత వర్ణచిత్రంలా తాజాగానే ఉంది.
తెలుగు కవిత్వంలోకి 1980లలో దూసుకొచ్చిన కొత్తతరం కవులలో భాగమైన అఫ్సర్ కు ఆ తరంతో పోలికా ఉంది, కొన్ని అదనపు లక్షణాలూ ఉన్నాయి. చాలమంది 1980ల కవుల్లో ఉన్న నిర్దిష్టత, కొత్త కవితావస్తువుల కోసం నిరంతర అన్వేషణ, పదచిత్రాల అల్లిక మీద, కొత్త అభివ్యక్తి మీద శ్రద్ధ వంటి లక్షణాలతోపాటు అఫ్సర్ సాధించిన మరొక లక్షణం ఉంది. అది కవిత్వానికి తప్పకుండా ఉండవలసిన పొరలు పొరలుగా విచ్చుకునే లక్షణం. అది ఒనగూరాలంటే కవి బహుముఖ, బహుళార్థ బోధక, సంకీర్ణ ప్రతీకలను ఉపయోగించాలి, దృశ్యాలను రూపొందించాలి. పదచిత్రాలను చిత్రిక పట్టాలి. ఒక కవితను చదివిన ప్రతిసారీ పాఠకులకు కొత్తలోతులు స్ఫురణకు వచ్చేలా చెక్కుతూ ఉండాలి. బహుశా ‘శక్తిమంతమయిన ఉద్వేగాల తక్షణ విస్ఫోటనం’లో అది సాధ్యం కాకపోవచ్చు. ‘ప్రశాంతంగా గుర్తుతెచ్చుకున్న ఉద్వేగం’ అన్నప్పుడే అది సాధ్యం కావచ్చు.
ఆ ఇంగ్లిషు సాహిత్యవిమర్శ ఇచ్చిన కవిత్వ నిర్వచనం మాత్రమే కాదు, మన సమాజపు శ్రమజీవుల వేలసంవత్సరాల ఆచరణ కూడ ఆ చిత్రికను నేర్పుతున్నది. ‘చిత్రిక పట్టని/ ఒకే వొక్క గరుకు పదం కోసం చూస్తున్నా’ అనీ ‘అలంకారాలన్నీ వొలుచుకున్న మాటకోసం చూస్తున్నాను’ అనీ అఫ్సర్ అన్నప్పటికీ చిత్రిక మీద, అలంకారం మీద అఫ్సర్ శ్రద్ధ అపారమైనది. ఒకరకంగా చిత్రిక గురించీ, అలంకారం గురించీ తెలియకుండానే, మాటలు చెప్పకుండానే అద్భుతమైన చిత్రికనూ అలంకారాన్నీ సాధించిన ఈ దేశంలోని సహస్రవృత్తుల శ్రమజీవుల ఆచరణ లాంటిదిది. ఈ చిత్రిక పట్టడంలో వచ్చే కొత్త అర్థాలు బైటి ప్రపంచంలోని మార్పులవల్ల కూడ స్ఫురించవచ్చు గాని వస్తువులోనే, కవితానిర్మాణంలోనే అందుకు అవకాశాలు కల్పించడం అసాధారణమైన నేర్పు. సాధన మీద, శిల్ప నిర్మాణం మీద శ్రద్ధ పెట్టడం వల్ల మాత్రమే సాధ్యమయ్యే ప్రక్రియ అది.
ఏ లోహాన్నయినా బంగారంగా మార్చే రసవిద్య ఉన్నదో లేదో, అసలు బంగారానికి అంత విలువ ఇవ్వడం అవసరమో లేదో అనుమానించవచ్చుగాని, ఏ వస్తువునయినా కవిత్వంగా మార్చగలగడం మాత్రం రసవిద్యే. అందులోనూ జ్ఞాపకాన్ని కవిత్వంగా మార్చడం తప్పనిసరిగా రసవిద్యే. ఆ విద్యలో నిష్ణాతుడినయ్యానని అఫ్సర్ ఈ సంపుటంలో నిరూపించుకుంటున్నాడు.
కవిత్వానికి ఎన్నెన్ని నిర్వచనాలున్నాయో, అవన్నీ ఏదో ఒక సందర్భంలో ఎంత నిజమనిపిస్తాయో, ఎంత నిజం కాదనిపిస్తాయో తెలియదుగాని, ఇక్కడ అఫ్సర్ సంకలించిన మూడుపదుల కవితలను మళ్లీ మళ్లీ చదివినకొద్దీ ఇక్కడ జ్ఞాపకమే కవిత్వమయినట్టు కనబడుతోంది. ప్రతి కవితలోనూ, ప్రతి పదచిత్రంలోనూ, ప్రతి అక్షరంలోనూ అఫ్సర్ ఒక జ్ఞాపకాన్ని, తలపోతను ప్రకటిస్తున్నాడు. అది తన వ్యక్తిగత అనుభవపు జ్ఞాపకమే కానక్కరలేదు. తరతరాల సామూహిక జ్ఞాపకం ఐన పురాస్మృతీ కావచ్చు. తక్షణ జ్ఞాపకమూ సుదూర జ్ఞాపకమూ కలగలిసి చేతనలోనో, అంతశ్చేతనలోనో భాగమై కవిత్వంగా పెల్లుబుకుతున్న జ్ఞాపకం కావచ్చు. ఒక్కక్షణం కింద అనుభవంలోకి వచ్చి మెదడు అట్టడుగుపొరల్లోకి జారిపోతున్న ఇంకా తడి ఆరని, ఇంకా పొగలు చల్లారని జ్ఞాపకం కావచ్చు. వేల ఏళ్లకింద తన పూర్వీకులెవరో అనుభవించి, రక్తంలోకీ, ఆలోచనలలోకీ ఇంకి ఇంకా అక్కడ మిగిలిపోయి ప్రవహిస్తూ వస్తున్న ఆత్మవిశ్వాసమో, అవమానభారమో కావచ్చు. ‘వందేళ్లక్రితం కన్నుమూసీ ఆ రాళ్లలోంచి మళ్లీ కళ్లు తెరుచుకుంటున్న’ సూఫీ ముని పాతకాలపు అరబ్బీ పుస్తకం జ్ఞాపకం కావచ్చు. ‘నా చరిత్ర అంతా వొకానొక కలత కల’ అనిపించే విషాద జ్ఞాపకమూ కావచ్చు. ఎప్పుడో చిన్నప్పుడు ‘ఆ కుండమీద కూర్చోబెట్టి కోసిన’ ఆ తెగిన ముక్క రాల్చిన నెత్తుటి జ్ఞాపకం కావచ్చు. లేదా నిన్నటికి నిన్న తన కాళ్లకింద కదిలిపోయిన కొలరాడో నది మిగిల్చిన తడీ కావచ్చు. ఆ తడి జ్ఞాపకం శరీరానికంటినదీ కావచ్చు, మనసుకంటినదీ కావచ్చు. అది ప్రకృతిదీ కావచ్చు, సమాజానిదీ కావచ్చు. జ్ఞాపకమంటే గతమే కానక్కరలేదు, గతం వర్తమానంలోకీ, వర్తమానం గతంలోకీ అటూ ఇటూ నిరంతరం ప్రవహిస్తున్న చోట, పరిభ్రమిస్తున్న వేళ జ్ఞాపకమే జీవితం. జ్ఞాపకమే కవిత్వం.
మొత్తం మీద ‘నాకు నేనే వొక జ్ఞాపకంలా పడి వున్నాను’ అంటాడు అఫ్సర్. ఈ నేను అఫ్సర్ మాత్రమే కాదు, అఫ్సర్ కవిత మాత్రమే కాదు. ఈ అక్షరాలు చదివే, బహుశా చదవలేని ప్రతి ఒక్కరికీ కూడ ఇది అనుభవైకవేద్యమే. ప్రతి మనిషీ తనకు తానే ఒక జ్ఞాపకంలా పడి ఉన్నాడు. తలచుకోవడానికి ఇష్టపడే జ్ఞాపకాలు కొన్నీ, మరచిపోవడానికి ఇష్టపడే జ్ఞాపకాలు కొన్నీ. జీవించి ఉంటే బాగుండుననిపించే జ్ఞాపకాలు కొన్నీ, మరణిస్తే బాగుండుననిపించే జ్ఞాపకాలు కొన్నీ. కాలపు వడపోత జరిగి మనకు ఇష్టమయినట్టు గుర్తుండే జ్ఞాపకాలు కొన్నీ. ముఖం మీద గుద్దినట్టు జరిగింది జరిగినట్టుగా గుర్తుండే జ్ఞాపకాలు కొన్నీ.
జ్ఞాపకం నిజంగానే గొప్ప కవిత్వధాతువు. దానికదిగానే దానిలో భావోద్విగ్నత ఉంటుంది. ఆనందదాయకమైన జ్ఞాపకమైనా, విషాదకరమైన జ్ఞాపకమైనా అది మనిషిని కదిలించగలుగుతుంది. పెదాలమీద చిరునవ్వు పూయిస్తుంది, కంట తడి పెట్టిస్తుంది. అటువంటి వస్తువును తీసుకుని, దాన్ని కవితాత్మకం చేయడం అఫ్సర్ సాధించిన నైపుణ్యం.
జ్ఞాపకం ఒక ఆదిమ జ్ఞాపకం కావచ్చు. అది నేరుగా మాట్లాడుతున్న వ్యక్తి జ్ఞాపకమే కాకపోవచ్చు. లేదా అది ఒక శైశవ ఉద్వేగం కావచ్చు. అనుభవించినప్పుడు ‘ఎదియొ అర్థమ్ము కాని మధుర భావం’లా ఉండి కాలం గడిచినకొద్దీ అది ఊరబెట్టిన పచ్చడిలా, మాగిన పండులా, పేరిన నెయ్యిలా ఒక కొత్త రుచిని సంతరించుకోవచ్చు. అందులో అప్పటివరకూ తట్టని కొత్త అర్థాలు తెలియవచ్చు. అది ఒక నిగూఢ లిపిలా కనిపిస్తూ చదవడానికి ఎంత ప్రయత్నించినా ఇంకా మిగిలిపోయినదేదో ఉండవచ్చు. లేదా అది ఒక అమాయక స్ఫురణ అయినా కావచ్చు. ఇటు ఏ కల్మషమూ అంటని స్వచ్ఛమైన జ్ఞాపకమైనా, అటు కాలంమీద పదునుదేరిన, వడబోసిన జ్ఞాపకమైనా అది ఒక అద్భుతమైన కవితావస్తువు.
‘లాగూ చొక్కా ఇంకా అట్లా జ్ఞాపకానికి వేలాడుతున్నాయి’, ‘చిన్నప్పటి వాసన’, ‘చిన్నప్పటి సరదా’, ‘గతం తీసి గట్టు మీద పెట్టరా’, ‘యాదిని చంపి బొందిని ఊరేగించడం’, ‘యేదో వొక యాది/వెంటపడి యాతన పెడితేగాని/ఇవాళ బతికి బట్టకట్టలేను’, ‘వెంటాడ్తుంది నిద్రలోనూ/నిద్ర కళ్లు వాలకుండా’, ‘ప్రతి మెలకువ వొక ఎండమావి’, ‘జన్మాంతరాల దిగుళ్ల మాయాజాలాలమధ్య,’ ‘కూలిపోయిన నాస్టాల్జియా’, ‘నిన్నటి క్షణం ఇప్పటి పురాస్మృతి’, ‘చరిత్ర హడావుడి పరుగులు’, ‘కాసేపు అంతా మరచిపోవడమే సుఖంగా వుంటుందనుకుంటా’, ‘ఏ నెత్తుటి జ్ఞాపకమూ కలవరపెట్టకుంటేనే సుఖంగా వుంటుందనుకుంటా’, ‘నరకహింసని విస్మృతిలోకి జారనిచ్చి’, ’గతం నీ అందమయిన కల’, ‘ఆ విస్మృతి అందంగానే వుంది’, ‘తలపోతల్లో తడిసి ముద్దయిపోతున్నాంలే’, ‘నాదంతా నెత్తుటి తలపోత’, ‘అప్పుడప్పుడూ ఈ నెమలీకల్ని మరిచిపోతేనే బాగుణ్ణు’, ‘వొక్క క్షణాన్నయినా మరపులోకి జారిపోలేనివాణ్ని’, ‘ఇరవై వొకటో శతాబ్దంలో/ప్రతిధ్వనిస్తున్న వొకేవొక్క ఆదిమ గతాన్ని’, ‘నా చరిత్ర అంతా వొకానొక కలత కల’ అని ఈ ముప్పై కవితల్లోనూ కనీసం ఇరవై ఒక్క కవితల్లో అఫ్సర్ వాచ్యంగానో, ధ్వనిలోనో జ్ఞాపకాన్ని పలికించాడు.
కచ్చితంగా ఇదంతా వ్యక్తిగత జ్ఞాపకం కావడానికి అవకాశం లేదు. రక్తమజ్జాస్థిగతంగా సాగివచ్చిన తల్లి జ్ఞాపకాలు కావచ్చు. తండ్రి జ్ఞాపకాలు కావచ్చు. పుట్టిపెరిగిన నేల జ్ఞాపకాలు కావచ్చు. పాల్గొన్న ప్రజాసంచలనాల జ్ఞాపకాలు కావచ్చు. చదివిన కవిత్వాల, పుస్తకాల, చేసిన ఆలోచనల జ్ఞాపకాలు కావచ్చు. ఇటీవల తన ఊరి జ్ఞాపకాలను రాస్తూ అఫ్సర్ వాటిలో కొన్నిటిని చెప్పుకున్నాడు. తల్లి పుట్టింటి వైపు తెలంగాణ సాయుధపోరాట భాగస్వామ్య జ్ఞాపకాలున్నాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో, ముఖ్యంగా సాంస్కృతికోద్యమంలో పాల్గొన్న జ్ఞాపకాలున్నాయి. తండ్రి స్వయంగా కవి, రచయిత, కమ్యూనిస్టు ఉద్యమంలో, అభ్యుదయ రచయితల సంఘంలో సాంస్కృతిక కార్యకర్త, గొప్ప విలువలతో జీవించిన ఉపాధ్యాయుడు. ఈ నేలమీద తొలికమ్యూనిస్టు భావాల వైతాళికుడు మఖ్దూం మొహియుద్దీన్ కు సన్నిహితుడు. జ్ఞాపకాలు ఎప్పుడూ ఒకేరకమయినవి కూడ కానక్కరలేదు. తాత ఎరుపాలెంలో నాకాను నిర్వహించిన నిజాం ప్రభుత్వోద్యోగి, తండ్రి కమ్యూనిస్టు అయినప్పుడు ఎదురుబొదురు జ్ఞాపకాలు కూడ ఉండకతప్పదు. పరస్పరం సంఘర్షించే జ్ఞాపకాల కలయికా ఉండకతప్పదు. ఆ జ్ఞాపకాలన్నీ తప్పనిసరిగా అఫ్సర్ వ్యక్తిత్వ వికాసంలో భాగమయ్యే ఉంటాయి.
ఇక తొలియవ్వనంలో అఫ్సర్ గడిపినది ప్రజాఉద్యమాల గని ఖమ్మంలో. స్వయంగా పాటలు రాసి, పాడి, చిన్ననాటనే ఇంగ్లిషు కవిత్వం రాసి ఇలస్ట్రేటెడ్ వీక్లీ వంటి పత్రికలలో అచ్చుపడి, ఇవన్నీ చేస్తూనే విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్న అనుభవం అఫ్సర్ ది. ఆ తొలిరోజుల కవిత్వకృషిలో అఫ్సర్ సర్వేశ్వర్ దయాళ్ సక్సేనాను అనువదించాడు. ఆ కవిత్వంతో ప్రభావితమయ్యాడు. నాలుగైదేళ్లు గడిచేసరికి అవతార్ సింగ్ పాష్ కవిత్వాభిమాని అయి, ఆ కవిత్వాన్నీ అనువదించాడు.
తెలంగాణ మాగాణంలో ఖమ్మం పోరాట స్ఫూర్తిలో ముస్లిం నేపథ్యంతో ప్రగతిశీల భావాల కుటుంబంలో సాహిత్య వాతావరణంలో అధ్యయనంతో ఆచరణతో అనేకానేక జ్ఞాపకాలను జీర్ణించుకున్న మనిషిలో ఇన్ని జ్ఞాపకాలూ కవిత్వంలోకి ప్రవహిస్తే ఇటువంటి సాంద్రమైన కవిత్వం రాక ఏమవుతుంది?
పుట్టుకతో వచ్చిన అస్తిత్వం, చదువువల్ల, అనుభవాలవల్ల, విలువలవల్ల, జీవితాచరణవల్ల వచ్చిన వేరువేరు అస్తిత్వాలు ప్రతి మనిషికీ వ్యక్తిగతంగా కొన్ని జ్ఞాపకాలను ఇస్తూ ఉంటాయి. ఈ కవికీ ఇచ్చాయి. అలాగే ఆ అస్తిత్వాలు తరతరాలుగా పొందిన సామూహిక అనుభవాల జ్ఞాపకాలూ కవి మనసు మీద ముద్రలు వేసి ఉంటాయి. ఆ అస్తిత్వంతో మనకూ ఏదో ఒక సంబంధం ఉన్నప్పుడు ఆ జ్ఞాపకం మన జ్ఞాపకం కూడ అవుతుంది. ఆ సంబంధం మనం ఆ అస్తిత్వంలో భాగమయినందువల్ల వచ్చినదీ కావచ్చు, ఆ అస్తిత్వవేదన పట్ల మన సహానుభూతి వల్ల వచ్చినదీ కావచ్చు. ఆ జ్ఞాపకంతో ఆ జీవితం మన జీవితం కూడ అవుతుంది. ఆ కవిత్వం మనమే మనకోసమే రాసుకున్నట్టూ అనిపిస్తుంది. ఆ పాఠక మమేకతకు సాధనంగా, వాహికగా ఉండడమే కవి సాఫల్యానికి గీటురాయి.
ఇవి అస్తిత్వ జ్ఞాపకాలు అన్నప్పుడే అఫ్సర్ ముస్లిం అస్తిత్వం ఈ జ్ఞాపకాలలో ఎక్కువభాగాన్ని ఆక్రమించడం సహజమే. కనీసం పద్నాలుగు కవితల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముస్లిం జ్ఞాపకాలున్నాయి. తెలంగాణలో నిరుపేద ముస్లిం జీవిత అస్తిత్వం అరవై ఏళ్ళకింద అనల్ మాలిక్ సిద్ధాంతపు తప్పుడు భావజాలంలో అణగారిపోగా, ఇప్పుడు తెలంగాణలో ‘పుట్టిన చిగురుకొమ్మయిన చేవ’ అనుకుని ‘చరిత్రను నిలువునా వంచించే అస్తిత్వ వున్మత్త ప్రేలాపన’లో అణగిపోతోంది. ఆ సమయంలో నెత్తుటి నెమలీకను చూపుతూ ‘ధిక్కారం నా మతం, నీ గతం కాల్మొక్కలేను’ అని స్పష్టంగా అనాలంటే అస్తిత్వపు అవకాశాలూ తెలియాలి, పరిమితులూ తెలియాలి.
అలాగే కొన్ని ఏళ్ళుగా తాను అనుభవిస్తున్న అమెరికన్ జీవితం, కోల్పోతున్న భారత జీవితం, ఒక జీవిత మనుగడను మరొక జీవిత అభివ్యక్తితో చిత్రించే ప్రయత్నం, రెండు జీవితాల మధ్య ఊగిసలాట – ఇవి మరొక రకం అస్తిత్వ జ్ఞాపకాలు. ఇవీ కనీసం ఆరు కవితల్లో ప్రతిఫలించాయి. అలాగే అస్తిత్వంలో కూడ జంగమ అస్తిత్వమూ స్థావర అస్తిత్వమూ ఉన్నాయి. వాటిమధ్య అభివ్యక్తిని అటూ ఇటూ ఊగిసలాడించాలంటే కవిత్వసృజనలో నేర్పు మాత్రమే కాదు, రాజకీయార్థిక, తాత్విక దృష్టి కావాలి. అందుకే అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో గృహరుణాల సంక్షోభంలో ఫోర్ క్లోజ్డ్ అనే అప్పు చెల్లించలేక ఖాళీ చేసిన నిస్సహాయ నిర్దిష్ట రాజకీయార్థిక స్థితి తాత్విక స్థాయిలో జంగమ అభివ్యక్తిగా ప్రవహించి ‘జంగమం నా నిజ స్థావరం/ స్థావరం నా సమాధి ఫలకం’ అని గొప్ప తాత్విక దృష్టితో ముగిసింది. అలాగే జాఫ్నా మరణాల జ్ఞాపకమూ తెలంగాణ మరణాల జ్ఞాపకమూ కలగలిసి ‘కొన్ని మరణాలు నాలుగు జన్మల వెయ్యి జననాల కేరింతలు’ అని మరణానికి కొత్త నిర్వచనం ఇచ్చాయి.
నిజానికి ఇలా ప్రతి ఒక్క కవితనూ తీసుకుని ఈ వస్తుచర్చను కొనసాగించాలని ఉంది గాని కవిత్వానికీ మీకూ మధ్యన ఎక్కువసేపు ఉండడం భావ్యం కాదు. అఫ్సర్ శిల్పం గురించి కూడ ఎంతో చెప్పాలని ఉంది. ‘మృగశిరని మింగలేక/ బయటికి కక్కలేక/ కడుపులో పొగుల్తున్న దుంపనేల/ నీటి చినుకు పడంగానే ముందు పొగలు చిమ్ముతుంది/ తరువాత/ మళ్లీ గతాన్ని తవ్వి తోడేసి పచ్చి వగరు వాసనవుతుంది’ అన్నచోట జాగ్రత్తగా చదవండి. అవి మాటలు మాత్రమే కాదు, చెయితిరిగిన కవి పదచిత్రాలను నిర్మించి ఒక సంపూర్ణ దృశ్యాన్ని సృష్టించడం మాత్రమే కాదు. వానకాలం తొలిరోజుల్లో, చినుకులలో తడుస్తూ మట్టివాసన పీల్చగలిగిన, మట్టి చిమ్మే ఆవిర్లను చూడగలిగిన పల్లెటూరి పిల్లలకు తప్ప మరొకరికి ఈ వర్ణమయ, వాసనామయ, శబ్దమయ ప్రపంచం అనుభవానికి రాదు. ప్రకృతి నుంచీ, సమాజం నుంచీ, మానవజీవితం నుంచీ ఇటువంటి ఆర్ద్రమైన, విశ్వసనీయమైన, సాధికారికమైన ప్రతీకలను ఎన్నుకోవడం, విభిన్న ప్రతీకలను ఒక రసాయనిక ప్రక్రియలో మిళితం చేసి కొత్త సృష్టి చేయడం అఫ్సర్ సాధించిన విజయం.
ఇంత లోతయిన కవిత్వం రాస్తూ కూడ అఫ్సర్ పసితనపు నైసర్గికత్వాన్నీ, అమాయకత్వాన్నీ, ఆర్ద్రతనూ పోగొట్టుకోలేదనడానికి సురయాను ఉద్దేశించి అఫ్సర్ రాసిన పంక్తులే నిదర్శనం.
కాస్త ప్రేమా, కాస్త స్నేహమూ
కాస్త సంతోషమూ…నీ కోసమే వీచే గాలీ
నీ వెంటే నడిచే ఆకాశమూ
నిన్ను మాత్రమే పాడేపాటా
చిటికెనవేలు వొదలని నీడా
ఒక అర్థంలో కూడూ గూడూ గుడ్డా అన్నా, మరొక అర్థంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నా మనిషికి కావలసింది అవే. వాటికోసమే మనిషి ప్రయత్నం. వాటికోసమే మనిషి పోరాటం. అదే ఊరిచివర కోరిక. ఊరు ధ్వంసమైపోతూ, ఎక్కడికిపోతున్నామో తెలియని ప్రయాణం ప్రారంభించిన మనకు ఊరిచివర నిలబడిన సూఫీ తత్వవేత్త తన గానం వినిపిస్తున్నాడు. మనిషికి చిట్టచివరికి మాత్రమే కాదు అసలు మనుగడకే ఏమి కావాలో చెపుతున్నాడు. అవి అందరికీ అందకుండా చేయడానికి కట్టిన వర్గాల, కులాల, మతాల, స్త్రీపురుషభేదాల, ప్రాంతాల, ఆధిపత్యాల గోడలను పగులగొట్టాలని స్పార్టకస్ నాటినుంచీ సాగుతున్న పోరాటం ఎప్పటికీ తొలగని జ్ఞాపకం. మానవజాతి జ్ఞాపకంలో అనవరతంగా సాగుతున్న పోరాటం. ఆ జ్ఞాపకం, పోరాటం కవిత్వం నిండా అల్లుకున్నాయి. ఆ వేల ఏళ్ల కవితావృక్షానికి మరొక అందమైన, ఆలోచనాప్రేరకమైన మారాకు అఫ్సర్.