నిన్నటిని దిగమింగింది పడమర దిక్కు
రేపటిని హామీ ఇచ్చింది తూర్పు దిక్కు
దిక్సూచి కుడి ఎడమల్లో ఉత్తర దక్షిణం
నిదుర ఊయలూపుతుంది కాలం
నిప్పుల వర్షం కురిపిస్తుంది కాలం
కొత్త చివురులు మేసి మత్తెక్కి పోయింది కోయిలమ్మ
లేత గడ్డిని మేసి చెంగుమన్నదొక జింక పిల్ల
మట్టికి ప్రాణముందని పూసింది గోగు పువ్వు
అనేక గ్రీష్మాల్లో ఎండిన చెట్టు చీలిపోయి
వేడి గాలుల్ని పీల్చుకుంటాడు అతడు
ఒక్క సినుకు పడితే చాలు పంచ ప్రాణాలను మేల్పొల్పుతడు
కౌగిలించుకుంటడు వసంత కన్యను తన హరిత బాహువుల్లో
అతడు శరత్కాలపు జాబిలి నవ్విండు
ముందు
ఆమె కార్తీక వెన్నెలై పరచుకున్నది
అతడు కష్టాలను మోసిండు
ఆమె చేదును భరించింది
అతడు తన రక్తాన్ని చెమట గా మార్చింది
ఆమె తీపిని పంచింది
అతడు ఆకలై అలమటించినపుడు
ఆమె ఉప్పుకారమైంది
అతడు రేపటి వైపు చూసినపుడు
ఆమె వగరూ పులుపైంది
అతడు ఆరుగాలం శ్రమగా నడిచి చెమట చుక్కలు రాల్చిండు
ఆమె పది కాలాలు తడైంది పచ్చగా
మన్నును కన్నుల కద్దుకొని దుక్కిదున్ని అలసిన అతని మీద
ఆమె నల్ల మబ్బు జల్లులు కురిపించింది
అతడు హిమమై కురిసిండు