అన్న దేవన్న కళ్ళ జూడన్న

అన్న దేవన్న కళ్ళ జూడన్న
పల్లెలే ఘోల్లుమన్నాయి – ఈ
అడవులే సిన్నబోయినాయి
అన్న భరతన్న తిర్గి సూడన్న
దునియెట్ల మారుతున్నాది – ఆ
యుద్ధాల్లో మున్గుతున్నది
అన్నా దేవన్న-అన్నన్న భరతన్న
నీతోటి ముగ్గురికి ఇరవై ఐదేళ్ళు

||ఇరవై ఐదేళ్ళు||

మీ రక్తాలు ఈ నేల త్యాగాల జల్లు
కళ్ళ జూసెనయ్య మన ఓరుగల్లు

||మన ఓరుగల్లు||

ఊరుకొక్కటన్న అమరుల ఇల్లు

||అన్నా||

1)

కొక్కొర కోయంటు కోడిగూయంగా
తెల్లారెనమ్మా ఎంచగూడెంలో

||తెల్లారెనమ్మా||

భగభగ సూర్యుడు మండుతుండంగా
బండి కొమురవ్వ కడుపు పండిందో

||బండి కొమురవ్వ||

గొల్లోల్ల అల్లోరు ముల్లుగట్టిడిసి
జంగుసైరానూదే జనములో గల్సీ
జబ్బకు బందూకు బైలెల్లెనమ్మా
కొండకోనల దళము గట్టినాడమ్మ
దండమో దండాలు-అన్నా భరతన్న
నీతోటి వీరులకు-శణార్థులన్నా

2)

సుక్కల పర్వతమెక్కి సూడంగా
శంకరన్న ఎర్ర సుక్కల్ల ఉండే ||శంకరన్న||
దిక్కులన్ని గూడి ముచ్చటాడంగా
రంగవల్లి పోరు పాఠమైతుండే. ||రంగవల్లి||
రామనరసయ్య ఉదయిస్తూ ఉండే
సిలుకల గుట్టడివి సిందేస్తుండే
నీతోటి ఇద్దరు నేలరాలిండ్రే
నీ ఎన్క చంద్రం రామన్నలుండ్రే
దండమో దండాలు-అన్నా భరతన్నా
నీతోటి వీరులకు-శణార్థులన్నా

||అన్నా||

3)

పోడుభూమి పోలికేక వెట్టంగా
ఆదివాసులు పంచ ప్రాణాలయిరి

||ఆదివాసులు||

మేడారం జన జాతర రాంగా
రైతాంగమంతా రణరంగమైరీ

||రైతాంగమంతా||

బైలెల్లి పోతిరీ గోదారిలాగా
పచ్చని పంటకు నీళ్ళయినట్టు
నిలిసిరి గుడిసెకు నిట్టాడులాగా
మన ఊళ్ళో మన రాజ్యమైనట్లు
దండమో దండాలు-అన్నా భరతన్నా
నీతోటి వీరులకు-శణార్థులన్నా

||అన్నా||

4)

సూడుండ్రి పల్లెల్ని కళ్ళ నిండుంగా
మత్తులోన మునిగి ఊగుతున్నాయో
తిరగబడే యువత తాగి ఊగంగా
పోరాట దారెట్ల సిన్న బోయిందో
పదిమంది కోసం ప్రాణాలనిచ్చే
త్యాగాల తరము మళ్ళెప్పుడొచ్చూ
ఎదిరి చూస్తున్నాయి స్థూపాలు మీరై
సరసన పల్లి సమరనాదాలై

దండమో దండాలు-అన్నా భరతన్నా
దండాలు నీకు కృష్ణారెడ్డన్న
దండమో రాజు-పోరు దండాలు
అందరికీ ఎర్రెర్ర దండాలు

(జులై 19, 2025న సరసన పల్లి అమరులు కామ్రేడ్స్ భరత్, కృష్ణారెడ్డి, రాజు ల 25వ వర్ధంతి ఎంచగూడెం,పల్లెపాడు లలో జరుగుతున్న సందర్భంగా….)

పుట్టింది కరీంనగర్ జిల్లా వేములవాడ. కవి, రచయిత, గాయకుడు. విప్లవోద్యమ నాయకుడు. అసలు పేరు కూర దేవేందర్. కలం పేరు మిత్ర. అమర్ పేరుతో సీపీఐ(ఎం.ఎల్.) జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రచనలు : 1. మిత్ర తెలంగాణ పాటలు, 2. పొదుగు, 3. వరుపు, 4. మిత్ర జనం పాటల సవ్వడి (పాటలు); 5. చితాభస్మంలోంచి...(కవిత్వం); 6. తెలంగాణ డప్పు దరువు, 7. తెలంగాణ ధూం ధాం, 8. తెలంగాణ కోలాటం పాట, 9. ముంబై తెలంగాణం, 10. బహుజన బతుకమ్మ, 11. వీరతెలంగాణ (నృత్యరూప గానాలు).

Leave a Reply