ಓ బిడ్డ తనని కన్నవారి కోసం కవిత్వం రాస్తే, అది ఆనందమే కానీ మహదానందమైతే కాదు. ఓ శిష్యుడు తన గురువుగారి పట్ల కవిత్వం రాస్తే అభినందనీయమే కానీ ఆశ్చర్యమైతే కాదు. ఓ కార్యకర్త తమ నాయకుడిపై కవిత్వం రాస్తే అది అభిమానమే కానీ ఆరాధనైతే కాదు. పైన పేర్కొన్న అన్ని బంధాల కలయిక బలీయమైన శక్తిగా మారితే తప్ప ఓ అన్నపై తమ్ముడు కవిత్వం రాయడం ఊహించలేం. ఇంతకన్నా గొప్ప బంధాలు పెనవేసుకున్నట్లుగా ఆధారాలు పురాణాల్లో చాలానే ఉన్నాయని ఎవరైనా అంటే అనవచ్చు గాక. అందులో చాలావరకు వాస్తవ విరుద్ధంగా ఉండి అసహజంగా అతికించబడినందున వాటిలో బంధాల యొక్క దృఢత్వాన్ని, అందులోని నిజాయితీని వెతికి పట్టుకోవడం కష్టమే. అక్క చెల్లెల్లు ప్రేమను పంచుకుంటారు కాబట్టి కలివిడిగా ఉంటారు. అన్నదమ్ములు ఆస్తులు పంచుకుంటారు కాబట్టి విడివిడిగా ఉంటారనేది ఆర్థిక సంబంధాల నేపథ్యంలోంచి పుట్టుకొచ్చినదే.
అన్ని రకాల మానవ సంబంధాలు సందర్భానుసారంగా తనవితీరా వ్యక్తమవుతాయి. కానీ ఒక్క అన్నదమ్ముల సంబందాలు మాత్రమే తడి పొడి మాటలతో, తచ్చాడినట్లుగా వ్యక్తమవుతాయి. బహుశా అందుకు కారణం వారసత్వ ఆస్తుల నేపథ్యం, వారి వివాహానంతరం వచ్చిన కొత్త సంబంధాల కలయిక తెచ్చిన పరిమితులు కావచ్చు.అయితే ఆ తడి పొడి మాటల్లోని సమాచారం మాత్రం చేరాల్సిన వారికి చేరాల్సినంతగా చేరుతూనే ఉంటుంది. ఆ భాష అందులోని భావోద్వేగం వారికి మాత్రమే అర్థమవుతుంది.
ఏదేమైతే నేమి మాట్లాడుకున్నా, పోట్లాడుకున్నా జీవిత చరమాంకంలోపు ఎప్పుడో ఒకప్పుడుమనసులో గడ్డకట్టుకపోయినా బంధాలు మంచులా కరిగి నెర్రెలు బారిన హృదయాల్ని మళ్ళీ అర్హతతో తడిపేస్తాయి. వంశానుబంధాలు కలిసి ఉండకపోవచ్చు కానీ అంత తేలికగా విడిపోనూ లేవు.
చరిత్రలో చూసినట్లయితే అన్నదమ్ముల మధ్య అనురాగ బంధాల కంటే రక్తపాతాలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ తవ్వి చూస్తే అక్కడక్కడ భావోద్వేగాలతో చెమ్మగిల్లిన చెలిమలూ, తడిసిన హృదయాలూ లేకపోలేదు. వాటిని మనకు చూపించే ప్రయత్నంలో కవి, రచయిత అయిన గాదె వెంకటేష్ తన అన్నగారైన గాదె లక్ష్మణ్ పై తన అనుబంధాన్ని చాటుతూ రూపొందించిన దీర్ఘ కవితా గ్రంథమే ఇది.
దాదాపు ఇరవైయైదు సంవత్సరాల క్రితం నేను రామన్నపేటలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నప్పుడు, సాయంత్రం పాఠశాల ముగియగానే స్థానిక గ్రంథాలయంలోకి వెళ్లి, పత్రికలు చదవటం అలవాటుగా ఉండేది. అక్కడికి నాతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మరో మిత్రుడు పెరుమాళ్ల ఆనంద్ కూడా వస్తుండేవారు. ఆ క్రమంలో అదే గ్రంథాలయానికి క్రమం తప్పకుండా వస్తున్న గాదె లక్ష్మణ్ మాకు ఏర్పడిన పరిచయం స్థానికంగా సాహిత్య కార్యక్రమాలు కలిసి నిర్వహించేందుకు తోడ్పడింది.
ఓవైపు వామపక్ష భావజాలం, మరోవైపు దళిత బహుజన ఉద్యమ భావాజాలం యువతను ప్రభావితం చేస్తున్న సమయమది. లక్ష్మణ్ భువనగిరి నుంచి వస్తూ రామన్నపేటలో బస్సు దిగి, నేరుగా గ్రంథాలయానికి రావటం, మేము అతనితో తారసపడటం జరిగేది . ఈ సందర్భంలో అనేక సామాజిక అంశాల మీద చర్చలు జరిగేవి. వీటిని ప్రజలలో విస్తరింప చేసేందుకుగాను ఓ వేదిక అవసరమని భావించి, స్థానికంగా ఉన్న సాల్వేర్ వెంకటేశ్వర్లుతో కలిసి ‘మూసి సాహితి వేదిక’ను ప్రారంభించడమైనది. అందులో లక్ష్మణ్ క్రియాశీలక పాత్ర మరువలేనిది. అప్పటి నుండి కండక్టర్ ఉద్యోగం చేస్తూనే ఇప్పుడున్న భువనగిరి నల్గొండ జిల్లాలోని అనేక గ్రామాల్లో కలియ తిరుగుతూ సామాజిక ఉద్యమాలలో పనిచేస్తూనే ఉన్నాడు. విప్లవ సంస్థలతో సఖ్యతగా ఉంటూనే అంబేద్కర్, పూలే భావజాలాన్ని నెత్తికెత్తుకుని తిరిగాడు. తిరుగుతూనే ఉన్నాడు. ఎదుటివారి హృదయాన్ని గాయపరచకుండానే, తన వాదాన్ని సున్నితంగా వినిపించగల నేర్పు, ఓర్పు అతనిలో మనం చూస్తాం. అలా అతనిలోని సామాజిక ఉద్యమకోణాల్ని, తాను చూసిన కుటుంబ బాంధవ్యాల్ని రచయితగా అందరికంటే చిన్నవాడైనా అతని తమ్ముడు గాదె వెంకటేష్ కవిత్వీకరించి గ్రంథస్థం చేయడం హర్షించదగిన విషయం.
ఇందులో, సోదరుడు గాదె వెంకటేష్ కవి కాబట్టి కర్తగా తాను కవిత్వీకరించాడే గానీ, ఆ అనుబంధాల సౌరభం మిగిలిన సోదరులందరిదీ కూడా అనే విషయం మనకు ఈ గ్రంథంలో అక్కడక్కడ వ్యక్తమవుతూనే ఉంది.
వృత్తిరీత్యా ఉద్యోగిగా, ప్రవృత్తిరీత్యా కవిగా రాణిస్తున్న గాదె వెంకటేష్, ఆధునిక జీవన శైలితో, మానవ సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న నేటి సమాజంలో తన అన్నగారైన గాదె లక్ష్మణ్ పై తనకున్న అనుబంధాలు గాఢతను లోకానికి చాటుతూ చేసిన కవితాభిషేకమిది.
కేవలం ఆయా సందర్భాలలో అన్నదమ్ముల మధ్య అడపాదడప సాగే అనుబంధాల వ్యక్తీకరణ, మాటలూ, చేతలూ దాటి కవిత్వమై ఓ పుస్తక రూపంలో అచ్చోసుకుని బయటికి రావడమనేది ఓ బలీయమైన బంధాన్ని చాటుతుంది. కాకుంటే ఓ తమ్ముడు ఓ అన్నపై దీర్ఘ కవిత రాయడం ఏమిటి? ఇది ఏ మొహమాటానికో లేదా ఆరాటానికో రాసింది కాదు. తీర్చుకోలేని రుణమేదో తీరుబడినివ్వకుండా తరుముతుంటే, దాచుకోలేని బావమేదో గుండెనిండి పొంగుతుంటే, బారులు కట్టి వచ్చిన అక్షరాలు బంధాలతో అల్లుకున్న ఫలితమే ఈ కవిత్వం. తనకు తెలియకుండానే తన మనసు అన్న కోసం మెలకువలో సైతం ఎన్నోసార్లు కలవరింతలు, పలవరింతలతో పరితపిస్తే తప్ప, అన్న కోసం “అన్న” అన్న పేరుతో ఓ గ్రంథం పురుడు పోసుకోవడం అరుదైన విషయం.
పుస్తకం మొదట్లోనే “తండ్రి కాకముందే తండ్రి”…. అని తన అన్నను ఉద్దేశించి అంటూ….” కుటుంబ బాధ్యతలను మోసే అన్నలకు”…. అని మిగిలిన అన్నల అందరిపట్ల గౌరవాన్ని చాటుకొని, తమ్ముడిగా తాను వినయంలో మహావృక్షంలా ఎదిగి అన్నలపై అత్యంత గౌరవంగా అక్షర సుమాలను రాలుస్తున్నాడు.
సాధారణంగా పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటూ, తల్లేమో తనకు బిడ్డ పుట్టాలని కోరుకుంటుంది. కారణం తన రెక్కలకు ఆసరా అవుతుందని. తండ్రేమో కొడుకు పుట్టాలని కోరుకుంటాడు. కారణం అతను కుటుంబ జీవనాధారం కోసం తన చేస్తున్న పనికి కాస్త సపోర్టుగా ఎదిగి వస్తాడని. కొడుకు పుడితే తన తర్వాత తను కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడంలో, బరువు బాధ్యతలను మోయడంలో ఉపయోగపడతాడని ప్రతి తండ్రి కోరుకుంటాడు. అయితే ఆ తరవాత కోరుకున్నట్టు జరగనూ వచ్చు, లేదా జరగకపోవచ్చు. కానీ గాదె లక్ష్మణ్ కుటుంబంలో రెండవ కుమారుడిగా పుట్టి, అమ్మానాన్న భుజాల నుంచి భారాన్ని తన భుజాల మీద ఎత్తుకొని, తండ్రి చూపుతో తమ్ముళ్ళని తన రెక్కల కింద పొదుపుకొని, వారి చదువు సందెల పట్ల శ్రద్ధవహించి, తన తమ్ముళ్లు దారం తెగిన గాలిపటాలు కాకూడదని, సమాజంలో ఉండే రుగ్మతల బారిన పడకూడదని, పెద్ద పెద్ద చదువులు ఉద్యోగాలకై ఆలోచించకుండా, ఓ కండక్టర్ ఉద్యోగంలో చేరి, తనను తాను నిలబెట్టుకుంటూ, తమ్ముళ్ల ఎదుగుదలకు మార్గదర్శకుడుగా వ్యవహరిస్తూ కుటుంబ అనుబంధాలను అల్లడంలో… కవి మాటల్లోనే చెప్పాలి అంటే “గిజిగాడిలా సూదిలా /ఆరెలా /సురుకుడు బద్దలా /కూలిపోకుండా”…… ఎక్కడా పొరపచ్చాలు రాకుండా, నేటికీ తన కుటుంబాన్ని నిలుపుకోవడమనేది అభినందించ దగ్గ విషయం.
అన్నగారి ఈ ఆచరణాత్మకమైన జీవితాన్ని “తండ్రి కాకముందే తండ్రి” అనే ఒక్క వాక్యంలో కవిత్వీకరించి, అన్న అంటే ఇలా ఉండాలని లోకానికి చాటుతున్నాడు. మొత్తం ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మనకు రెండు విషయాలు అర్థమవుతాయి. తన జీవితంలో ఇద్దరు హీరోలు ఉన్నారని, అందులో మొదటి హీరో అంబేద్కర్ అయితే, రెండవ హీరో తన అన్న లక్ష్మణ్. మధ్యన పూలే దంపతులు తారాజువ్వల్లా మెరుస్తుంటారు. అందుకే అడుగడుగునా ఈ పేర్లు కనిపిస్తూనే ఉంటాయి. ఇదిగో
ఇలా…
“జన్మనిచ్చింది అమ్మా నాన్న అయితే జీవితాన్ని, అంబేద్కర్ చూపు నిచ్చింది మా “అన్న” అంటూ…
“కొందరుంటారు మన చుట్టూ ఉన్న ఇరుకును /కొంత విశాలం చేస్తూ/ చీకటి బతుకుల్లో / వెలుగు పూలు పూయించడానికి” …”నోరులేని వాళ్ళ తరపున గొంతెత్తడానికి మా లక్ష్మన్న లాగా”…. అంటాడు అన్నపట్ల ఎంతో గర్వాన్ని ప్రకటిస్తూ. కుటుంబ పరంగా ఆలోచిస్తే అన్నపట్ల తమ్ముడి ఇంతటి గౌరవానికి కారణం, కేవలం కుటుంబ పరమైన బాధ్యతలు నెరవేర్చడమొక్కటే కారణం కాదు. కుటుంబ సంబంధాలను తడుముతున్న ప్రతిసారి సామాజిక సంఘటనలు దర్శనమిస్తాయి.
ఓ రకంగా చెప్పాలంటే రక్తసంబంధం నుండి సామాజిక సంబంధాలను విడగొట్టుకోలేనంత స్థాయిలో పెనవేసుకున్న చైతన్యపూరిత దృష్టి రచయితదిగా తోస్తుంది. ఇక్కడ అన్నగారి సామాజిక నేత్రము నుండి ఎదిగిన వ్యక్తిగా కనిపిస్తాడు డా. గాదె వెంకటేష్, అన్నగారి వ్యక్తిగత, సామాజిక జీవనశైలిని పరిశీలిస్తూ పెరగటం వల్ల కావచ్చు… మొత్తానికి ఆయన స్వభావాన్ని…”పలకరింపులకు చిన్నోడు పెట్టి పోతలకు పెద్దోడు చేతికి ఎముక లేనోడు” అన్న మూడు వాక్యాలలో చెప్పి, “బోనగిరి బొడ్రాయిగా…అన్న గది ఉద్యమ చౌరస్తా
ఎన్నో సైద్ధాంతిక చర్చల కిస్తా” అంటూ ఆయన క్రియాశీలతను ఎంతో ఉన్నతంగా చెప్పాడు.
కన్నందుకు తల్లులకైతే మాతృత్వం దక్కుతుంది. తండ్రులకూ ఓ గుర్తింపు దక్కుతుంది. ఇది సహజమే. కానీ వారి తరువాత అన్నలు చేసిన త్యాగాలు సోదిలో లేకుండా పోవడంలోని బాధను వ్యక్తం చేస్తూ “తండ్రిలా తండ్లాడే అన్నకు గుర్తింపేది అన్న ఆత్మ సంఘర్షణకు తూనికేది” – అన్నప్పుడు పరిగెత్తే పాఠకుడు ఆగిపోక తప్పని స్థితిని, ఆలోచించక తప్పని స్థితిని కలిగిస్తుంది. “పుక్కిటి పురాణాల నుండి/ ఇతిహాసాలు చివరికి చరిత్ర కవిత్వం వరకు / అన్నత్వానికి దక్కిందెంత” అన్న ప్రశ్న వేసుకొని, ఆర్థిక సంబంధాల నేపథ్యంలో మసకబారిన అన్నదమ్ముల మధ్య అనురాగ బంధాలపై కొత్త చర్చను రేకెత్తిస్తున్నాడు.
పెద్దవాడిగా పుట్టినందుకు గోరంతలు చేసి కొండంతలుగా చెప్పుకునే వారు ఉన్నారు. తన ఎదుగుదల కోసం తమ్ముల శ్రమను పెట్టుబడిగా వాడుకొని, పైగా పెద్ద కొడుకునంటూ జేష్ట భాగంకై ప్రయత్నించిన వాళ్లు ఉన్నారు. కానీ పెత్తనానికి దర్పానికి, తమ్ముల కోసం తానేదో చేస్తున్నానన్న భావనకు చోటివ్వని తత్వాన్ని పసిగట్టి “ఇతరుల ముఖంలో ఆనందం చూడాలని /ఓడిపోయే వారిని ఎన్నడూ గెలవలేం”… అంటూ అన్న గారి నిజాయితీ పట్ల, చేసిన తమ్ముని విశ్వాస ప్రకటన అన్నగారిని మరింత ఎత్తుకు నిలిపినట్టయితే…” మేమెదుగుతుంటే /గుసగుసగా పొగిడి/ లోలోపల దాచుకున్న మురిపెం /మాకు తెలిసిపోయేది” అనే పంక్తుల్ని చదువుతున్నప్పుడు అన్న గురించి కవిత్వం రాయాలన్న అవసరంలోంచి, అన్న గురించిన ఆలోచనల్ని తొవ్వుకునే క్రమంలో అదేపనిగా ఆలోచించడం వల్ల కాబోలు కవి పరిణతి విస్తరించి, దానిముందు అనుకోకుండానే అన్న చిన్నపిల్లవాడైపోయినట్టుగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ బిడ్డ పట్ల తల్లిదండ్రులకు కలిగే అనుభూతులు అన్నపట్ల తమ్ముడికి కలగడం మనం కొత్తగా చూస్తాం.
ఇది కేవలం అన్న కోసం రాయబడిందే కాదు. బాల్యం నుంచి తన చుట్టూ పెనవేసుకున్న కుటుంబ బంధాలు, పెరిగిన వాతావరణ పరిస్థితులు, అరకొర వసతులతో హాస్టల్లో చదువులు, ఎదుర్కొన్న కులపరమైన వివక్షత, అన్న చూపుడు వేలుననుసరించి తాను చూసిన రాజకీయాలు, తనను ప్రభావితం చేసిన దళిత బహుజన అస్తిత్వ ఉద్యమాలు, అల్లంత దూరంలో తన చుట్టే తిరుగుతున్న విప్లవ సంఘాల భావజాలం, అంబేద్కర్ సంఘ నిర్మాణంలో అన్నగారి పాత్ర, అమ్మానాన్నలతో విభేదించి చేసుకున్న ఆదర్శ వివాహం, ముఖ్యంగా తన చదువుల కోసమే కాక అట్టడుగు వర్గాల పిల్లల చదువులకై అన్న పడిన తపన, అందించిన సహకారం, ప్రత్యక్షంగా పరిశీలించిన వాడు కాబట్టి, అన్నగారి ప్రతి చర్యను, ప్రతి ఆలోచనను కవిత్వంలో పొదిగేందుకు చేసిన ప్రయత్నం, పడ్డ తపన చూస్తే, ఔరా! ఇంతగానా…? ఇప్పుడు కూడా ఇలాంటి తమ్ములు ఉన్నారా…? అనిపిస్తుంది.
ఓ రకంగా చెప్పాలి అంటే అన్న చుట్టూ కెమెరాలు పెట్టి అన్నను అన్ని కోణాల్లో చూపించాలనే తపన లోంచి, అన్నగారి జీవితాన్ని స్కానింగ్ చేసి రాసిన రిపోర్టులా వుంది. ఇందులో బంధాల మాట అటుంచితే, అతి సాధారణ పదాలతో కవి చెక్కిన కవిత్వంలోని దృశ్యాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇదిగో చూడండి
“పచ్చి పులుసు కచ్చపెక్క బువ్వే ఆదెరువై చల్లబోసుకుంటే తేలిన తెల్ల పురుగులు జిలకరయ్యి నలిగిన లక్క పురుగులు” అన్న పదాలని వ్యాఖ్యానించ వలసిన అవసరం లేకుండానే అధ్వాన్నమైన హాస్టల్ బతుకుల్ని కళ్ళ ముందు ఉంచుతూ, పాఠకుడి భృకిటిపై ప్రశ్నల ముద్రల్ని వేస్తాయి. అయితే ఈ గ్రంథంలో రచయిత కేవలం తన అన్నపట్ల అభిమానాన్ని చాటుకోవడానికే పరిమితం కాకుండా, ఇతర సామాజిక ఇతివృత్తాలతో సమన్వయం చేయడం ద్వారా వెలితి నివారించబడింది.
కవి మనసులో భావోద్వేగాల విస్తృతి కవిత నిర్మాణంలో ఒదగలేనంత పెద్దదై, రాజీ పడలేక తనని ఉక్కిరి బిక్కిరి చేయడం వల్ల కాబోలు, చెప్పింది మళ్ళీ చెప్పినా దాహం తీరని తనమే కనిపిస్తుంది. ఇది కాస్త పాఠకుడిని అవహించి, ఏది ముందు ఏది వెనక చెప్పాలి అన్న దానితో సంబంధం లేకుండా ముందుకు వెళ్లేలా చేస్తుంది. ఏవేవో కారణాలతో సోదరుల మధ్య అనుబంధాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, లేదా నిర్లక్ష్యం చేసిన వాళ్లకు కొంత వెక్కిరింతగా, కొంత హెచ్చరికగా, కొంత ఓదార్పుగా మనసుకు ఆర్ద్రతనిస్తూ, కళ్లకు చెమ్మనిస్తుంది. పాఠకుల రక్తసంబంధాలను సైతం గుర్తు చేస్తూ వారి వారి ఉద్విగృక్షణాలను వెతుక్కునేలా చేస్తుంది.
ఆకాశంలో సగాన్ని వేరుగా ఎలాగైతే ఊహించలేమో, రచయిత కుటుంబ బాంధవ్యాల నిలకడలో వారి వారి శ్రీమతుల పాత్ర లేకుండా సాధ్యమైందని భావించలేము. అందుకు వారు కూడా సదా అభినందనీయులు.
“తన భవిష్యత్తునే చమురు చేసి మమ్మల్ని వెలిగించి దన్నుగా దందెడగా ఉన్నాడు మా అన్న” అన్న వ్యక్తిగత బంధంతో ప్రారంభించి “ఒక్క కవిత తోనో కాళ్లు కడిగో అన్న నడిచిన దారిని కొనసాగించలేము”
“ప్రతి వేకువలో జడత్వాన్ని జయించి” “రాజ్య హింస, పౌరహింసను వ్యతిరేకించడంలో… రాజ్యాధికార సాధనలో ఉంటాం గతిని చరిత్ర గతిని మార్చే వేగంలో అన్నతోనే ఉంటాం” అన్న సామాజిక బంధంతో ఈ పుస్తకం ముగించడాన్ని బట్టి, రచయిత వ్యక్తిగత ఆరాధన చట్రంలో ఇరికి పోకుండా పురోగమన దృష్టికోణాన్ని సారించటం అభినందించదగ్గ విషయం.
తమ్ముడు వెంకటేష్, తాను సృజించిన ఈ కవిత ద్వారా పాలివాండ్ల మీద పగ పెంచుకునే రోజులు పోయి, పావురం పెంచుకునే రోజులకు తెర లేపుపుతున్నాడనడంలో సందేహం లేదు. నిజంగా ఈ బంధాలు బలపడితే అన్ని కుటుంబాలలో శాంతి విరియకుండా ఉంటుందా? ఎప్పుడు అమ్మ కోసం… నాన్న కోసమేనా..? అన్న రోజులు కూడా రావచ్చు. బహుశా “మా అన్న లాంటి అందరు అన్నల త్యాగాలు ఆవిష్కరించాలి” అన్న రచయిత వాక్యాన్ని నిజం చేస్తూ, ఇలాంటి రచనలే మరిన్ని రావడానికి ఈ రచన దారి చూపినా చూపవచ్చు.
✊🏼