ప్రధాన దృశ్యం…
రెండు నిలువు కమ్మీలు అనేక అడ్డ బద్దెలు రైలు నడిచే దారంతా సోషల్ డిస్టెన్స్… కానీ ఇప్పుడు రైలు నడిస్తేనేమో భయం వైరస్… ఇంజన్ ఎక్కడుందో తెలీదు. గార్డెవరూ జెండా వెలగరు. అయినా పట్టాల మీదుగా కూ చుక్ చుక్ కూలీ బోగీలు…
కుదురు లేని బతుకంటేనే కాళ్ళల్లో చక్రాలని కదా అర్థం…. వలస చీమల కాళ్ళందుకే జాల్నా నుంచి మహరాష్ట్ర కు పట్టాలపై నడక…
రావి చెట్టు నీడకో రచ్చబండ కాడికో పంచాయతాఫీసుకో పశువుల దొడ్లకో, కాలనీకో కరణం గారింటికో పొలానికో చెరువుకో ఊరిన ఎక్కడినుండైనా ఓయ్ అని కేకేసి ఎవ్వరికైనా వినిపించినట్టు…
దేవుడినీరాత్రికి గట్టిగా పిలిస్తే పలుకుతాడేమో… దేవుడి ఊరు చానా దూరం.. గొంతు పేటల్ని ఎన్ని ఎదురేసి ఒక్క పురి పేనినా ఆయనకు ఆ అరుపు వినపడదు.. ఫోన్ కొడదామన్నా పోస్ట్ పెడదామన్నా అప్డేట్ వెర్షన్ లేని మోస్ట్ పాతకాలం దేవుడు..
కానీ తను తలుచుకుంటే ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు ఊరూరా దేవుడు.. ఆయన అన్ని కథలు చూస్తాడు అన్నీ కంఠాలనూ వింటాడు అయినా.. మనపట్ల తన స్పందనేంటో మనల్ని పుట్టిస్తున్నప్పుడే మన నుదుటిన అతికిస్తాడు.. ఒక్కసారి లిఖించటం తప్ప చెరపటమో సరి చేయటమో దేవుడెప్పటికీ నేర్చుకోడు..
తమకు తాము రాసుకొని ఆ రాత్రి మధ్యప్రదేశ్ రాష్ట్రపు అట్టడుగు బుసావల్ జనం తమ జానపదాన పాడుకున్న హృదయార్తిభరిత ఆవేదనా గీతం అది..
తమ ఆకలి నిద్రకు నీడ లాంటిది.. పేగులు కళ్ళు తెరిచీ తెరవగానే ఇంకొంచెం ఆకలీ మేల్కుంటుంది.. ఫర్వాలేదు ఇంకొన్ని నూనంటని రొట్టెలున్నాయ్.. తొక్కో పచ్చడొ తోడుగా ఎప్పుడూ ఉంటుంది.. ఫర్వాలేదు సంచుల్లో ఇంకొంచెం ఆడించిన పిండి సంపదుంది.. మూడు రాళ్ళూ ఎండు కట్టెలూ దారెంట దొరుకుతూనే ఉన్నయ్. చేతుల్లో కాళ్ళల్లో సత్తువుంది.. ఇంకొంత గడిస్తే పగళ్ళు రాత్రుళ్ళు రాళ్ళ నోళ్ళకు రక్తం తాపుతూ ఇంకొంత నడిస్తే కాళ్ళు సొంతూర్లో పడతాయ్..వాళ్ళంతా ఉక్కు కర్మాగారపు కూలీలు.. ఊరు చేరి తీరాలనే ఉక్కుసంకల్పం వారిది..
నలభయ్యో కిలోమీటర్ రాయినోడించాక..ఔరంగాబాద్ సమీపాన కర్మాద్ పట్టాలపై ఆరాత్రి అందరూ సామూహిక నిద్ర.. ఆరాత్రి అందరిదీ సహపంక్తి కల.. రైలొస్తుందని కాదు తమ ఊరొస్తుందని.. అలుపు దేహాల ఆదమరుపు వేళ రైలు కదలిక అమ్మ ఊయల పాటయ్యింది..
ఎక్కించుకోవాల్సిన రైలు చెమట గడలనెక్కిపోయింది.. పట్టాలు తప్పి పానాలమీద పరుగెత్తింది… ఇపుడక్కడంతా చిందిన ఎగిరిపడిన చెమట పిప్పి.. పట్టాల పొడుగూతా ఒలికిన ప్రాణంమాత్రం ఎరుపు, చెమట చుక్కలని చిదిపితే ఎరుపే కదా…
* * *
రెండో దృశ్యం…
తిండిగింజలకూ తిప్పలవుతోంది..
పని దొరకని తావున ఇక మనకేం పని.. ఎలాగూ వలస పక్షులమే కదా ఎగిరిపోదాం.. మరలిపోదాం మనచోటుకు..
అయితే ..
ఇప్పుడు కాళ్ళను ముక్కలుగా కత్తిరించుకొని రెక్కలుగా అతికించుకుందాం…
నాకు ఇంకో రెండుకాళ్ళుంటే నీ నడకా నేనే నడుద్దును బిడ్డా..
మీ నాయిన నెత్తిన మూటలు, నా భుజాల సంచులు మన బతుకులెంత బరువూగుతున్నయో సూస్తన్నవ్ గా .. జరింత ఓపికపట్టు అదిగో మనూరు ఇంకో నాలుగడుగులెయ్యి…
అమ్మా మనూరెప్పుడస్తదే… పిల్ల ప్రశ్న..
ఆ తల్లి ఇదే సమాధానం … ఆ భరోసా విన్నప్పుడల్లా చిన్న కళ్ళల్లో పెద్ద ఆశ.
నడుస్తూ నడుస్తన్నదల్లా ఆ చిన్నది మునివేళ్ళపై నిలబడి దూరంగానైనా ఊరు కనిపిస్తుందేమోనని నిక్కి చూడటం…. ఏ బండో, ఎత్తో ఎక్కి వెతకటం.
అడుగుల వెంట పిల్ల పాదాలు సాగుతున్నాయ్ ప్రశ్నలవెంట జవాబులూ సాగుతున్నయ్.. మభ్యపుచ్చటం తప్ప తల్లికి మరేం దోవలేదు..
అదిగో మనూరు అల్లదిగో మనూరు అగ్గో మనూరు అగ్గగ్గో మనూరు.
విన్నప్పుడల్లా ఉస్సురు ప్రాణంలో ఉత్సాహం.
రోజుల తరువాత ఇక ఆపాప ప్రశ్న ఆగిపోయింది… ఎండకు వాడీవాడీ పాపం ఆ చిట్టిమొక్క చచ్చిపోయింది… దాని అరికాళ్ళ నిండా అనేక ప్రశ్నలు.. ఊరు బొమ్మతో ఆడుకోవాలన్న ఆశలు.
భవిష్యత్ పటం గీసేందుకు చిత్రకారుడొకడు కన్నీళ్ళ కుంచె కదుపుతున్నాడు….ఒక కరాళ కథకు సంబందించి మచ్చుకు ఇవొ రెండు దృశ్యాలు.. ట్రక్కు బోల్తా పడి, గుండె అలసిపోయి, ఇంకా ఇంకా దార్ల పొడుగూతా కూలుతున్న కారుతున్న కన్నీళ్ళ కథలెన్నో వలస వెతలెన్నో…