ఎటు చూసినా…
కంటికి గుత్తులు గుత్తులుగా
పూస్తున్న అశ్రువులు
అసహాయతలో
నానిన శనగలల్లే
ఉబ్బిన జతల జతల చూపులు
అపహాస్యాల, అసహ్యాల జ్వాలలో
ఆహుతైన ఆత్మలు
కొలతలను చేరలేక భంగపడ్డ ఆశలు
శిథిలమౌతున్న మూలాల్లో
మగ్గుతున్న బంధాలు
వేకువ కూడ
వెలుగునివ్వలేని వేదనలు
అన్నింటి మధ్య
ఒక్కసారి ఒకేఒక్కసారి
నిటారుగా నిలవాలనుంది
అవనతమౌతున్న ఆత్మలను మళ్ళీ ఎగిరేయాలనుంది
బలంగ స్వచ్ఛంగ ఒక్కసారి ఉక్కులాంటి ఒక్కమాట పలకాలనుంది
‘నేనున్నానని’