అననుకూల పరిస్థితుల్లో ప్రజల్ని కదిలించే బాధ్యత రచయితలదే! – పి.చంద్‍

ఆధునిక సామాజిక మాద్యమాల ప్రభావంలో ఒక పుస్తకం వేస్తేనే  తాము గొప్ప రచయితగా అయిపోయినట్లు కొందరు బీరాలు పలుకుతారు. కానీ ఇరవై ఐదు నవలలు, నాలుగు కథా సంపుటాలు రాసినప్పటికీ బయటి ప్రపంచానికి తెలియని రచయిత పి.చంద్‍. సుమారు ఇరవై కలం పేర్లతో రచనలు చేసిన అసామాన్య రచయిత. ఆయన అసలు పేరు ఊరుగొండ యాదగిరి. పుట్టింది వరంగల్‍ ఉరుసులోని సామాన్య కార్మిక కుటుంబం. తెలుగునేల మీద ప్రజా పోరాటాలు తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసాయని ఆయన పూర్తి నమ్మకం. నలభై ఏళ్లుగా సాహితీ సృజనరంగంలో ఉన్నప్పటికి అంతగా ప్రచారంలో కనిపించని పి.చంద్‍ తో ఇంటర్వ్యూ ఆయన మాటల్లో చదవుకుందాం…

1. మీ బాల్యం గురించి వివరించండి.

 నేను పుట్టిన ఊరు వరంగల్‍ లోని ఉరుసు. మా నాయిన ఊరుగొండ మల్లయ్య. అజంజాహి మిల్లు కార్మికుడిగా పనిచేసేది. మా అమ్మ పేరు వీరమ్మ బీడి కార్మికురాలుగా పనిచేసేది. సెప్టెంబరు 9, 1954లో జన్మించాను. ఉరుసులో గమర్నమెంట్‍ స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకున్నాను. హన్మకొండ ప్రభుత్వ జూనియర్‍ కాలేజీలో ఇంటర్మీడియట్‍ పూర్తి చేశాను. వరంగల్‍లోని లాల్‍ బహదూర్‍ డిగ్రీ కాలేజీలో బీకాం చదివాను. 1977లో సింగరేణిలో క్లర్కుగా ఉద్యోగ జీవితం మొదలైంది. ముప్పయి రెండు సంవత్సరాలు వివిధ ప్రాంతాల్లో పనిచేసాను. చివరకు గోదావరిఖనిలో సూపరింటెండెంట్‍గా 2009లో పదవీ విరమణ చేసాను.

2. మీరు సాహిత్యంలోకి ఏ విధంగా అడుగులు వేశారు.

నేను విద్యార్థిగా ఉన్నపుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. అటు తర్వాత కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో  విప్లవ విద్యార్థి ఉద్యమాలు వచ్చాయి. వాటి ప్రభావం ఉంది. దానికితోడు మొదటి నుండి నాకు సాహిత్యం చదవడం ఒక వ్యసనంగా ఉండేది. దానికితోడు నేను కార్మిక కుటుంబంలో పుట్టి, ఉద్యోగ రీత్య సింగరేణి  కార్మికులతో కలిసి మెలిసి బ్రతకడం కూడా కావచ్చు. అదేసమయంలో సింగరేణిలో కార్మికుల పోరాటాలు రావడం మొత్తంగా నా మీద, నా రచనల మీద ప్రభావాలు చూపింది. అందుకే నా సాహిత్య సృజనలో ఎక్కువగా కార్మికుల మీదే కనిపిస్తుంది.

3. మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయితలు ఎవరు.

జీవితాన్ని పట్టించుకొని రాసిన సాహిత్యం నున్ను ఎక్కువగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా ప్రేమ్‍చంద్‍, మాక్సిమ్‍ గోర్కి లాంటి రచయితల రచనలు. ప్రేమ్‍చంద్‍ ఎంతగా ప్రభావితం చేసిండంటే నా కొడుకు పేరు ప్రేమ్‍చంద్‍ అని, నాకలం పేరు పి.చంద్‍ అని పెట్టుకునేంతగా ఆకట్టుకున్నాడు. అతని రచనల్లో సామాన్య, మధ్య తరగతి వర్గాల జీవిత దృశ్యం కనిపిస్తుంది.

4. మీరు చాలా మారు పేర్లతో రచనలు చేశారు. అందుకు కారణాలు ఏమిటి ?

నిజమే! నేను దాదాపుగా ఇరవై కలం పేర్లతో సాహిత్య సృజన చేసాను. అందుకు ఒక్కటి పి.చంద్‍. ఎందుకంటే అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలు చేసే న్యాయమైన పోరాటాలు సహజంగానే పాలకులకు అస్సలు మింగుడు పడదు. ప్రజా పోరాటాలను వాళ్ల న్యాయమైన ఆకాంక్షలను వ్యక్తీకరించే సాహిత్యం కూడా పాలకులకు నచ్చదు. ఫలితంగా నిర్భందం అమలు జరుపుతారు. నిర్భందం నుంచి తప్పించుకోవటానికి ఎప్పటికి అపుడు మారుపేర్లతో రాయాల్సివచ్చింది.

5. మీ తొలి రచన ఏదీ.

కథల పరంగా చేస్తే ‘సమ్మె’ కథ సృజనలో తొలిసారిగా ‘కార్మిక’ అనే కలం పేరు మీద అచ్చయింది.1981లో సింగరేణి కార్మికులు మస్టర్ల కోత చట్టానికి వ్యతిరేకంగా సమ్మె చేసారు. ఆ సమ్మె ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో ఆ కథ వివరిస్తుంది. ఇక నవల విషయానికి వచ్చినట్లయితే ‘శేషగిరి’ నా తొలి నవల. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు దేవూరి శేషగిరి రావు. ఆయన జీవిత నేపథ్యంలో సింగరేణిలో తొలినాటి కార్మికోద్యమాన్ని చిత్రించింది. ఆ నవల కార్మికుల మీద చాలా ప్రభావం చూపించింది. ఎంతగా అంటే మొదటిసారి ఆ నవల గోదావరిఖని నుంచి వెలువడే స్థానిక దినపత్రిక ‘చర్చ’లో సీరియల్‍గా వచ్చినపుడు ఆ పత్రికను కార్మికులు బొగ్గు బావుల మీద గుంపులు గుంపులుగా చేరినపుడు చదువుకునే వాళ్లు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చిన కార్మికవర్గ సాహిత్యంగా విమర్శకుల ప్రశంసలు పొందినది.

6. మీరు ఇంతవరకు ఎన్ని కథలు, నవలలు రాసారు.

 దాదాపు వంద కథల వరకు రాశాను. ‘భూనిర్వాసితులు’, ‘జులుం’, ‘గుమ్మన్‍పూర్‍ గ్రామస్తుడు’(2013), ‘సమ్మె’ కథలు సంపుటాలుగా వచ్చినవి. ఇంకా నాలుగు ఐదు సంపుటాలు రావాల్సి ఉంది. ఇక నవల విషయానికి వస్తే దాదాపు ఇరవై ఐదు నవలలు రాసాను. అందులో పదిహేను నవలలు ప్రచురించాను. మరో పది నవలలు ప్రచురించాల్సి ఉంది. 1. శేషగిరి 2. హక్కుల యోధుడు బాలగోపాల్‍ 3.శ్రామిక యోధుడు 4.నెత్తుటి ధార 5.విప్లవాగ్ని 6.నల్లమల 7. శృతి 8.అంతర్జాతీయ శ్రామిక యోధుడు కె.ఎల్‍.మహేంద్ర 9. మేరా సపర్‍ 10. దిక్కార కెరటం 11.ఒక కన్నీరు 12. తెలంగాణ తల్లి 13. సకల జనుల సమ్మె 14. తలాపున పారే పాట 15.బండ్రు నర్సింహులు.

7. మీరు రచనలు ఎక్కువగా జీవిత చరిత్రలుగా ఉండటానికి ప్రధాన కారణం.

 నిజమే నా రచనలు ఎక్కువ భాగం జీవిత చరిత్రలుగానే ఉన్నాయి. కానీ కేవలం వారి జీవిత చరిత్రలు చెప్పటమే నా ఉద్దేశం కాదు. వాళ్లు నడిచివచ్చిన, లేదా వాళ్ళు నిర్మించిన ఉద్యమాల గురించి చెప్పటం. ఆ అనుభవాలను సాహిత్యపరంగా నమోదు చేయటం తద్వార ఆ సామాజిక చరిత్రను ముందు తరాలకు అందిండమే లక్ష్యంగా రచనలు చేసాను.

8. మీ సాహిత్యానికి ప్రేరణ ఏమిటి.

ప్రజల జీవితమే… ప్రజలు చేస్తున్న  పోరాటాలు చూస్తూ వాటి గురించి చెప్పాలనే తాపత్రయమే నాతో రచనలు చేయించింది.

9. మీ రచనలు ప్రజలను ఎట్లా ప్రభావితం చేసింది.

 రచయిత ఎవరన్నదీ కాదు. అతను సృష్టించిన సాహిత్యం ప్రజల జీవితాన్ని ఎంతలోతుగా, ప్రతిభావంతంగా చిత్రించాడు అన్నదానిపై ఆ సాహిత్యం యొక్క ప్రభావం అంతగా ఉంటుంది. మన ముఖం మనమే అద్దంలో చూసి తీర్చిదిద్దుకున్నట్టే మంచి సాహిత్యం ప్రజల మీద ప్రభావం చూపుతుంది. అందుకే మంచి సాహిత్యానికి ఎల్లలు లేవు. అది దేశాలు, భాషలు దాటుకొని వచ్చి మనల్ని కదిలిస్తాయి. ఎందు••ంటే మౌళికంగా మనిషి స్వభావం ఒక్కటే కాబట్టి.

10. తెలుగు నేల మీద విప్లవ సాహిత్య ప్రభావం ఏమిటి.

చాలా మేరకు విప్లవ సాహిత్య ప్రభావం సమాజం మీద ఉంది. రోజురోజుకు ప్రజల బతుకులు అధ్వాన్నం అవుతున్నాయి. దోపిడి, అసమానతలు పెరిగి పోతున్నాయి. ఈనేపథ్యంలో ప్రజలు తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. ఈ పోరాటాలు సహజంగానే సాహిత్యకారుల మీద ప్రభావం చూపి విప్లవ సాహిత్యం వచ్చింది. అట్లా వచ్చిన సాహిత్యం మళ్ళీ ప్రజల మీద ప్రభావం తప్పకుండా చూపుతూ ఉద్యమాలు మరింత రాటు తేలుతాయి. ఈ పరిణామం తెలుగు నేల మీద ఎక్కువగా ఉంది. ముఖ్యంగా విరసం ఏర్పడిన తర్వాత ఇంకా కనిపిస్తుంది. సాహిత్య ప్రభావ పరిణామాలను అధ్యయనం చేసినవారికి మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. విరసం పాత్రను విస్మరించడానికి వీలులేదు.

11. ప్రస్తుతం తెలుగు సాహిత్య పరిస్థితి ఎట్లా ఉంది. ఏలా ఉండాలనుకుంటున్నారు.

గతంలో అయితే మంచి సాహిత్యాన్ని ఆదరించటానికి పత్రికలు ఉండేవి. కాని ప్రస్తుత ‘గ్లోబల్‍’ పరిస్థితిలో మంచి సాహిత్యాన్ని ప్రచురించే పత్రికలు కనుమరుగై పోయాయి. మనుష్యులను భౌతికంగానే కాకుండా భావజాల పరంగా అణచివేసే పరిస్థితులు ఉన్నవి. ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో మంచి సాహిత్యాన్ని బ్రతికించుకోవడానికి రచయితలు కూడా పోరాటం చేయక తప్పదు. అననుకూల పరిస్థితిలోనే ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత కవులు, రచయితలు, కళాకారుల మీద ఉంది.

12. నవతరం రచయితలకు మీరు ఇచ్చే సూచనలు ఏమిటి.

సాహిత్య సృష్టి అనేది పూర్వజన్మ సుకృతం అన్నది బూజు పట్టిన ఆలోచన విధానం. ఎవరైనా సాహిత్య సృజన చేయవచ్చు. అందుకు ప్రధానంగా నాలుగు అంశాలుండాలని నేను భావిస్తాను. మొదటిది జీవితాన్ని చాలా లోతుగా పరిశీలించాలి. రెండోది, సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేయడం నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా ప్రముఖ రచయితల రచనలు, తద్వారా మనకు వాళ్లు జీవితాన్ని ఎట్లా సాహితీకరించారో అర్థం అవుతుంది. మూడోది, అభ్యాసం మనం పరిశీలించిన దాన్ని అధ్యయనం చేసిన అంశాలను మళ్లీ మళ్లీ రాయడం ద్వారా నైపుణ్యం మెరుగుపడుతుంది. నాలుగోది, అన్నింటికంటే ముఖ్యమైంది దృక్పథం. మన రచన ఏ దృక్పథంలో రాస్తున్నాం. ఎవరి కోసం రాస్తున్నామో, రచయితకు స్పష్టమైన అవగాహన ఉండాలి. స్పష్టమైన దృక్పథంలేని రచనలు చీకట్లో సాము చేయడమే అవుతుంది.

12. రచయితగా మీకు మంచి గుర్తింపు తెచ్చిన నవలలు.

కార్మిక, విప్లవోద్యమం మీద రాసిన నవలలే మంచి గుర్తింపు తెచ్చింది. వాటిలో ‘శేషగిరి’(2000) నవల సింగరేణి కార్మిక ఉద్యమం మీద రాసింది కావడం చాలా సంతోషం. చాలా మంది పాఠకులు సభల్లో కలిసినపుడు తమ అపూర్వ స్పందన వెలుబుచ్చారు. ఇక ‘నల్లమల’ నక్సల్బరి ఉద్యమం మీద రాసింది. చాలా మంది మిత్రుల ప్రశంసలు నాకు తృప్తినిచ్చాయి.

13. మలిదశ తెలంగాణ ఉద్యమం మీద ఏమైనా రచనలు చేశారా.

మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని అక్షరీకరించాను. ‘తెలంగాణ తల్లి’ (2011) పేరుతో ప్రచురితమైంది. ఈ నవల సీరియల్‍గా జనపక్షం అనే పత్రికలో పూర్తిగా వచ్చింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ‘సకల జనుల సమ్మె’ ఒక గొప్ప మలుపు. సింగరేణి కార్మికులు ముప్పయి ఐదు రోజులు చేసిన సమ్మె నేపథ్యంగా ‘సకల జనుల సమ్మె’(2018)లో ప్రచురించడం జరిగింది. ఈ నవలను వరంగల్‍ నుంచి వచ్చిన గోదావరి సాహితీ పత్రికలో ముద్రించారు.

14. పర్యావరణం మీద నవలలు ఏమైనా చిత్రించారా.

 పర్యావరణ విధ్వంసం మీద ఒక నవల రాసాను. ‘భూదేవి’ నవలలో ప్రధానంగా పర్యావరణ నేపథ్యంగానే ఒపెస్‍కాస్టు నిర్వాసితుల జీవన విధ్వంసాల గురించి చిత్రించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన నవలా పోటీల్లో ఉత్తమ నవలగా ఎంపికై బహుమతి వచ్చింది. అదేవిధంగా కరీంనగర్‍ జిల్లాలో విధ్వసమవుతున్న గుట్టల తీరును చూశాక, గ్రానైట్‍ పరిశ్రమ వల్ల ఏవిధంగా పర్యావరణం విధ్వంసానికి గురవుతుందో ఒక రిటైర్డు ఉపాధ్యాయుని పాత్ర నేపథ్యంగా ‘దేవునిగుట్ట’ నవలలో చిత్రించాను.

15. తెలంగాణ సాయుధ పోరాటం మీద మీరేమైనా రచనలు చేశారా.

‘శేషగిరి’ నవల తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంగా వచ్చిన కార్మిక దృక్పథంలో వచ్చినదే. అదేవిధంగా అరుణోదయ సాంస్కృతిక కళాకారిణి విమల తండ్రి బండ్రు నర్సింహులు జీవితాన్ని తీసుకొని ఒక పుస్తకం వచ్చింది. వేలాది మంది సామాన్యులైన ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా చిత్రించాము. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కె.ఎల్‍.మహేంద్ర, హైదరాబాద్‍ సి.పి.ఐ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన జీవితం ఆధారంగా ‘అంతర్జాతీయ శ్రామిక యోధులు’ నవలలో సగభాగం తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర వుటుంది.

16. విప్లవోద్యమ నేపథ్యంగా  నవలల గురించి ఏమైనా చెబుతారా

తెలుగు నేల మీద విస్తరించిన విప్లవోద్యమం రచయిలందరి మీద తీవ్రమైన ప్రభావం వేసింది. ఆ ప్రభావాలతో ‘నెత్తుటి ధార, విప్లవాగ్ని( నల్ల ఆదిరెడ్డి జీవితం మీద), బొగ్గులు( సికాస ఆవిర్భావ నేపథ్యంగా), శృతి, నల్లమల, ఒక మావోయిస్టు జీవిత కథ, శ్రామిక యోధుడు నవలలు వచ్చాయి. వీటిలో కొన్నింటిని ముద్రణ దశలో కూడా ఉన్నాయి.

16. మీ రచనలు ఎందుకు ప్రచారం పొందలేక పోయాయి.

 చాలా మంది రచయితలకు ఈ సమస్య ఉంది. నామేరకు అయితే  నా రచనలు స్వంత ప్రచురణలు కావడం వల్ల ప్రధాన ప్రచార స్రవంతిలోకి రాలేక పోయాయి. ప్రచురణ సంస్థలకు కూడా కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటవి. ప్రచారం పొందడం వెనక చాలా అంశాలు ఉంటవి.

పుట్టింది వడ్డిచర్ల, జనగామ జిల్లా. నెల్లుట్లలో పెరిగాడు. జనగామలో సదివిన మట్టి పెడ్డ. వరంగల్లు నగరంలో వలస బతుకు మనుగడ. ఉపాధ్యాయ బోధన విద్యలో నల్లబల్ల మీద అక్షరాలకు అభద్ర కూలీ గొంతుకవుతాడు. చాయ్ నీళ్లు లేకున్నా సాహిత్య సాన్నిహిత్యాన్ని కోరుకుంటాడు. కవి, రచయిత, జర్నలిస్ట్, పరిశోధకుడు, అధ్యాపకుడు. ప్రముఖ తెలుగు పత్రికల్లో పాత్రికేయుడిగా పని చేశాడు. ప్రస్తుతం ఉస్మానియా యునివర్సిటీలో 'తెలుగు సాహిత్యంలో చేనేత వృత్తి జీవనచిత్రణ'పై పరిశోధన చేస్తున్నాడు.

3 thoughts on “అననుకూల పరిస్థితుల్లో ప్రజల్ని కదిలించే బాధ్యత రచయితలదే! – పి.చంద్‍

  1. శేషగిరి నవల వచ్చినప్పుడు చందన్న తో నేను చేసిన ఇంటర్వ్యూ వార్త దినపత్రిక ఆదివారం అనుబంధం లో ప్రచురితమైంది. సెల్ఫ్ ప్రమోషన్ లేక చందు కథలు ప్రాచుర్యంలోకి రాలేదు.

Leave a Reply