జలాశయాన్ని నిర్మించాల్సిందే
నీళ్లను ఆపాల్సిందే
నిప్పులాంటి నిజాలు
వంతుగా చెప్పాల్సిందే
ముంపు గ్రామం గోస
విషాదంగొంతు విప్పాల్సిందే
మీరు పైసలు ఇవ్వచ్చు
పరిహారం ఇవ్వచ్చు
ప్రాణానికి ప్రాణమైన ఊరును ఇవ్వలేరు కదా
ఇంటికి ఇంత పొలానికి ఇంత
మనుషులకి ఇంత తోటకు ఇంత అని
పైకం చేతిలో పెట్టవచ్చు
మనుషుల చుట్టూ అల్లుకున్న పచ్చటి తీగలాంటి జ్ఞాపకాలను
అరొక్క తీరు పక్షుల తీయని గానాన్ని గుట్టను చెట్టును పుట్టను వాగును వంతను
తేనెపట్టు యాదులను తెచ్చి ఇవ్వలేరుకదా
మోసే వాడికి తెలుసు కావడి బరువు
ఊరును ఖాళీ చేయడం
పుట్టి పెరిగిన ఇల్లును విడిచి పెట్టడం అంటే మాటలు కాదు
అనుభవిస్తే తెలుస్తుంది బాధ
ఎన్ని ఇకమతులు అయినా చెప్పు
బుద్ధి భరిస్త లేదు
మనసుకు కుదార్థం అయితలేదు
మనసు నిండుతలేదు
బతుకు బెదిరిపోతుంది
మనుషులు చెదిరి పోతున్నారు
ఆగమాగం అంగట్ల పడ్డట్టయింది
హర్రాజు పాట పాడి నట్టయింది
గుండె కలుక్కుమంటుంది
కళ్ళల్లోనే తెల్లారుతుంది
కళ్ళల్లోనే పొద్దూకుతుంది
మనసుల మనసులేక కలి కలి అవుతుంది
సరే
ఇక్కడ మేము మునిగితే
అక్కడ ఎక్కడనో తేలుతరట
నిజమే కావచ్చు
మంచి గానే విచారం చేసిండ్రు
మా బతుకు ఇమరస చేయక పోతిరి
ఎన్ని లక్షలు కోట్లు ఇచ్చినా
ఊరు మల్ల ఎట్లా నిలబడాలె
మనుషులు ఎట్లా మనుషుల్లో కలవాలె
కలలు కష్టాలు సుఖాలు దుఃఖాలు సంతోషాలు ఎవరితో కలబోసుకోవాలి
ఎవరి భుజం మీద వాలి ఎత తీరా ఏడవాలి
ఏ చెయ్యి కన్నీళ్ళు తుడిచి
కడుపులో దాచుకోవాలి
ఊరు మునుగుతుంది అని తెలిసినంక ఎక్కడోల్లు అక్కడ బీరి పోయిండ్రు
పట్టపగలు ఇళ్లల్లో చీకట్లు నిండుకున్నాయి
కళ్ళలో సముద్రాలు పొంగుతున్నాయి
బాధ అనుభవిస్తేగానీ ఎరుక కాదు
ఏడుపు పట్టవశం అయితలేదు
మా పోచమ్మ తల్లి అందర్నీ కాపాడుతుంది
మమ్మల్ని మాత్రం కరుణిస్త లేదు
నీళ్లు దగ్గరి దాకా వచ్చినయ్
ఖాళీ చేయకుంటే మీరే మునిగిపోతారు బెదిరిస్తారు అదిరిస్తారు భయ పెడతారు
ఎన్ని తరాలను
తన వశం కాకున్నా మోసిందో నీడనిచ్చిందో
ఎవరి ఇళ్లను వారే
చేతులారా కూలగొట్టుకుంటున్నారు
తలుపులు కిటికీలు శేరేర్లు గూనపెంకలు ఇప్పుకు పోతుండ్రు
అంతా గోస గోస
పందులు తొక్కిన మక్క పెరడు అయింది
రేపు ఎట్లనే
రేపు ఏమి చేసుకు బతుకుడనే జన్మరంధి అన్నీ సదురుకొని ట్రాక్టర్లలో తరలిపోతున్నారు
ఖాళీ చేసిన ఇండ్లను చూసి బావురుమని
కుక్కలు గొంతెత్తి ఏడుస్తున్నాయి
చింతచెట్టు మీదనుంచి పెద్ద చింతనతో పూరేడు పిట్ట అలవికాని విషాదాన్ని
మనసు దరులను కోసే పాట పాడుతుంది
రేపు ఎట్లా అనే ప్రశ్న
వాళ్లను కాల్చుకు తింటుంది
మూడేళ్ల కింద వచ్చిన పరిహారం
పెళ్లిళ్లకు చావులకు దావఖానకు చదువులకు ఒడిసి పోయినవి
చేతిలో చిల్లిగవ్వ లేక పరిహారం
పరిహాసం చేస్తుంది
భూమికి భూమి కొందామంటే
అగ్గి లో చేయి పెట్టినట్టుంది ధర
భూమిలేని కూలీలది వొడువని కన్నీటి కథలు
అనంతగిరి అంతులేని వేదనతో
బొంగురు పోయిన గొంతుతో
బహుశా కాదు నిజంగానే
రేపు పట్టణంలో
లేబర్ అడ్డా మీద
కూలి కోసం సమాయత్తమవుతోంది
మనసు సుదురాయించక సతమతమవుతోంది.
(అన్నపూర్ణ ప్రాజెక్టులో అంతగిరి ముంపు గ్రామం ఖాళీ చేస్తున్న వేదన నుంచి …)