బీఆరెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన మంత్రులను, MLA లను ఉద్దేశించి ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన 9 సంవత్సరాల కాలంలో తెలంగాణా ఎంత ప్రగతిని సాధించిందో, వ్యవసాయ రంగంలో విద్యుత్ రంగంలో ఎంత అభివృద్ధి జరిగిందో, ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టారో ప్రజలకు గుర్తు చేయాలని కోరాడు. తెలంగాణ అభివృద్ధి మోడల్ ను వివిధ రాష్ట్రాల ప్రజలు హర్షిస్తూ తమ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నాయని అన్నాడు. కాళేశ్వరం, మిషన్ భగీరద వంటి నీటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావించాడు. హైదరాబాదు నగరంలో మరీ ముఖ్యంగా ఐటి హబ్ గా ఉన్న హై టెక్ సిటి, పైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట వైపు జరుగుతున్న రోడ్ల విస్తరణ, సరికొత్తగా కల్పిస్తున్న హంగులు, పంట భూములపై లేచిన రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆకాశహర్మ్యాలు, ప్లైఓవర్లు, ఎంతో అట్టహాసంగా నిర్మించిన సచివాలయం, కనిపించే ఈ పై పై మెరుగులను మాత్రమే చూసేవాళ్ళకు ముఖ్యమంత్రి చెప్తున్నది నిజమే కదా అనిపిస్తుంది. ఇదంతా పాలకులు మనకు చూపించే ఒక పార్శ్వం కాగా దీని వెనుక కనిపించని మరో పార్శ్వం కూడా ఉంది. ఈ అభివృద్ధి మోడల్ కింద జీవితాలు విధ్వంసమై మాయమైపోయిన బడుగు బలహీనవర్గాల ప్రజలున్నారు. రోడ్డు విస్తరణ పేరిట, నీటి ప్రాజెక్టుల పేరిట తరతరాలుగా నమ్ముకున్న భూములను నివాసాలను, వృత్తులను, పుట్టిన గడ్డను కోల్పోయిన పేద రైతులున్నారు. పొట్ట చేతపట్టుకుని బ్రతుకుతెరువును వెతుక్కుంటూ నగరాలకు వలస వచ్చి కూలీలుగా బిచ్చగాళ్ళుగా మారిన గ్రామీణులున్నారు. ఉన్న ఊళ్ళు తరుముతే ఉపాధికోసం నగరాలకు వచ్చి ఆగమైపోయిన దళితులు, యువకులు ఉన్నారు. అభివృద్ధిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమ్యుక్తంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు బాధితులను, మహబూబ్ నగర్ కోయిల్ సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రాంతంలో నిర్మించబడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ పరిధిలోని గ్రామస్తులను మానవ హక్కుల వేదిక కలిసిన తర్వాత తెలంగాణా మోడల్ అసలు స్వరూపం ఏమిటో మరింత తేటతెల్లమయ్యింది. తెలంగాణ అభివృద్ధి నమూనాకు తాజా ఉదాహరణ ఐలాపూర్ సంఘటన.
మే 10 వ తేదీ దాదాపు రెండువందల మంది పోలీసులు, ఎస్సైలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పి స్థాయి అధికారి, రెవెన్యూ అధికారులు, పంచాయితీరాజ్, మున్సిపల్ సిబ్బంది అంతా కలిసి షుమారుగా నలబై జెసీబి లతో అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల ప్రాంతంలో ఐలాపూర్ గ్రామస్తులపై హఠాత్తుగా దాడి చేశారు. అక్కడి ఇళ్ళను కూల్చడానికి ముందు కరెంట్ కనెక్షన్ తీసివేశారు. సెలవు మీద వెళ్ళమని స్థానిక MRO కి ఆ ముందు రోజే ఆదేశాలందాయి. ఆ రాత్రి ఇంట్లో ఉండకుండా తప్పుకోమని గ్రామ సర్పంచ్ ని పోలీసు అధికారులు ముందే హెచ్చరించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జెసీబి లను అధికారులు సమీకరించుకున్నారు. విషయాలన్నింటినీ క్రోడీకరించి చూస్తే చాలా పై స్థాయిలో ఉన్న వాళ్ళ ప్రమేయంతోనే ఈ దాడి జరిగిందనే అభిప్రాయం కలుగుతుంది. ఈ గ్రామం సంగారెడ్డి జిల్లా అమీన్ పుర మండలంలో ఉంది. పగలంతా కాయకష్టం చేసి ఆదమరిచి నిద్రపోతున్న ప్రజలను బయటకు లాక్కొచ్చి వారి ఇళ్ళను కూల్చడం మొదలెట్టారు. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జరుగుతున్న దాడి ఎందుకోసమో మొదట వాళ్ళకు అర్ధం కాలేదు. విషయం ఏమిటో వాళ్ళు గ్రహించే లోపు 500 పైగా ఇళ్ళు నేలమట్టమయ్యాయి. తమ ఇళ్ళను కూల్చవద్దంటూ అధికారుల కాళ్ళా వేళ్ళా పడ్డ వాళ్ళను నిర్దాక్షిణ్యంగా లాగి పడేశారు. మహిళలు వృద్ధులు అన్న విచక్షణ లేకుండా వాళ్ళ ఒంటిపై దుస్తులు ఊడిపోతున్నా లెక్కచేయక రోడ్ల మీద చాలా దూరం పాటు ఈడ్చుకుంటూ వెళ్ళారు. పిల్లా పాపల ఏడ్పులు, పెద్దవాళ్ళ రోదనలు అభ్యర్ధనలు తిట్లు, పోలీసుల అరుపులు కేకలు బూతులతో ఆ గ్రామం అంతా రణరంగంగా మారింది. ప్రతిఘటించిన వాళ్ళపై లాఠీలు సమాధానం చెప్పాయి. 60 మందిని అరెస్టు చేసి స్టేషన్ కి తీసుకు వెళ్ళారు. కూల్చిన ఇళ్ళల్లో నుంచి బట్టలు, వంట సామాగ్రిని తీసుకుని పసిబిడ్డలతో వృద్ధులతో మండుటెండలో చెట్ల కింద ఆ ప్రజలు నిలబడ్డారు. ప్రజలు తమ కష్టార్జితంతో పైస పైస కూడేసుకుని ఆ స్థలాన్ని కొనుగోలు చేసిన ఎస్సి ఎస్టి బిసి వర్గాలకు చెందిన ప్రజలు కట్టుకున్న ఇళ్ళు అవి.
ఐలాపూర్ గ్రామం 1-220 సర్వే నెంబరులో 1250 ఎకరాల సర్ఫేకాస్ భూమి ఉంది. నిజాం ప్రభుత్వం 56 సంవత్సరాలకుగాను దీన్ని ఇమాం ఆలీ అనే వ్యక్తికి లీజుకి ఇచ్చింది. ఇమాం మరణించిన తర్వాత అతని భార్య నుంచి ఆలీ హుస్సేన్ అతని సోదరులు ఈ భూమిని కొనుగోలు చేశారు. ఆ తదుపరి కాలంలో ఇమాం వారసులు ఆలీ హుస్సేన్ వారసుల మధ్య భూమిపై హక్కుకు సంబంధించిన వివాదం తలెత్తి ఇరువురు కోర్టును ఆశ్రయించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డిఓ, సర్ఫ్-ఎ-కాస్ కమిటీ, సివిల్ కోర్టు, సబ్ కలెక్టర్ చుట్టూ తిరుగుతూ మరింత జఠిలమై ఈ వివాదం చివరికి హై కోర్టుకు చేరింది. ఇప్పుడున్న స్టేటస్కో ఆర్డర్ రావడానికి ముందు సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భీంలా నాయక్ సాగులో ఉన్న కొన్ని భూములను గుర్తిస్తూ కొంత మంది స్థానికులకు 1982 లో పట్టాలు ఇచ్చాడు. అంతేకాక విద్యుత్ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు కొన్ని ప్లాట్లు కేటాయించాడు. స్థానికులు దీన్ని వ్యతిరేకించడంతో ఈ ఉద్యోగస్తులంతా విద్యుత్ ఎంప్లాయిస్ కొ-ఆపరేటివ్ హవుసింగ్ సొసైటీ పేరిట తమ ప్లాట్ల మీద హక్కును క్లైం చేస్తూ కేసులో ఇంప్లీడ్ అవుతూ పిటీషన్ వేశారు. ప్రభుత్వం కూడా ఈ భూమి తనదేనంటూ ఈ వివాదంలో మరో పార్టీగా చేరి పిటీషన్ వేసింది. అప్పటి నుంచీ ఈ సమస్య హైకోర్టు మెట్లు ఎక్కుతూ దిగుతూ అంతిమంగా, అంతకు ముందు 1982, 1994 లో జాయింట్ కలెక్టర్లు ఇచ్చిన తీర్పులన్నిటినీ పక్కకు పెట్టేసింది. ఫిర్యాదు దారులందరినీ పరిగణన లోకి తీసుకుని వారి విజ్ఞప్తులపై మళ్ళీ తాజాగా విచారణ నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్ని ఆదేశిస్తూ హైకోర్టు 2013 లో తీర్పు చెప్పింది. అంతవరకూ స్టేటస్కో మెయింటేన్ చేయాలని ప్రకటించిన ఆర్డర్ ఇంకా అమలులో ఉంది.
ఈ వివాదం ఇలా ఉండగానే స్థానిక రాజకీయ నాయకులు, బ్రోకర్లు, దళారులు ఏకమై సర్వే నెంబరు 119 లో ఉన్న 25 ఎకరాల భూమిపై తమకే హక్కు రాబోతుందని ప్రజలను నమ్మించి నోటరీలు రాసిచ్చి అమ్మడం ప్రారంభించారు. గజం 10 వేల నుంచి మొదలుపెట్టి 18 వేల వరకు అమ్మారు. స్థానిక ఎమ్మెల్లే మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ భర్త రవి స్వయంగా ఈ ప్లాట్లను అమ్మడంతో వాళ్ళను నమ్మి ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో బిజినేపల్లి, నాగర్ కర్నూల్, గద్వాల వనపర్తి నుంచి వచ్చిన ప్రజలు కొనుగోలు చేశారు. పాలమూరు ఎత్తిపోతల పధకంలో ఉన్న ఎకరం రెండెకరాల భూములు కోల్పోయిన రైతాంగం అందులో వచ్చిన నష్టపరిహారంతో కుటుంబానికి వంద గజాల చొప్పున కొనుకున్నారు. ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, ఆటో డ్రైవర్లు, వివిధ రకాల వృత్తులు చేసుకుంటున్న వాళ్ళుకూడా ఇందులో ఉన్నారు. పరాయి ప్రాంతంలో నెత్తిమీద గూడు కోసం గత మూడేళ్ళ నుంచి అప్పులు సప్పులు చేసి ఇల్లు కట్టుకోవడం ప్రారంభించారు. ప్రభుత్వం పోల్స్ వేసి ఈ ఇళ్ళకు కరెంట్ కనెక్స్షన్ ఇచ్చింది. ట్రాన్స్ఫార్మర్లను బిగించింది. ఇంటింటికి కరెంట్ మీటర్లను బిగించారు. గ్రామ పంచాయతీ బోర్డు ఇంటి నెంబర్లను ఇచ్చి టాక్స్ వసూలు చేస్తోంది. రోడ్లు వేశారు. ఇక్కడ ఒక గుడి కట్టారు. దాన్ని ప్రారంభించింది స్థానిక TRS MLA మహిపాల్ రెడ్డి. ప్రజలు ఏ సందేహాలను వ్యక్తం చేసినా అన్నింటికీ మేమున్నాం కదా అని ఈయన, ఈయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ భర్త రవి భరోసా ఇచ్చే వాళ్ళని, ఆ భరోసాతోనే తాము ఇక్కడ స్థలం కొనుకున్నామని ప్రజలు చెప్పారు. కానీ ఈ రోజు వీళ్ళంతా మొహం చాటేసి ఎందుకు కొన్నావని మమ్మల్నే బెదిరిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కోర్టులో వివాదం ఉన్నప్పటికీ ప్రజలను నమ్మించి మోసం చేసి కోట్ల రూపాయలను గడించిన వాళ్ళను ప్రభుత్వం తప్పు పట్టలేదు. ఈ వ్యవహారమంతా చూస్తే రాజకీయనాయకులు దళారులు, ప్రభుత్వ యంత్రాంగం, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంతా ఏకమై ఉన్నట్లు కనిపిస్తుంది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం గత మూడేళ్ళ నుంచి ప్రజలు అక్కడ పక్కా ఇళ్ళు నిర్మించుకుంటుంటే అధికార యంత్రాంగం ఏనాడు ఎందుకు అడ్డుకోలేదు? ఇంటి పన్నులు ఎలా వసూలు చేసింది? ఇన్ని వసతులు కల్పించిన యంత్రాంగం ఇంత హఠాత్తుగా కూల్చడానికి కారణం ఏమిటి? అది తెలుసుకోవాలంటే మరికొన్ని వాస్తవాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
పటాంచెరు నియోజకవర్గం అమీన్ పురా మండలం లో ఉన్న ఐలాపూర్ మొదటి నుంచీ ఒక తండా గ్రామం. ఇక్కడ ST లు గణనీయ సంఖ్యలోనే ఉన్నారు. నిజాం తర్వాత అనేక వివాదాలలో కూరుకుపోయి 1250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గ్రామం పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూలీ నాలీ చేసుకుని జీవించే సామాన్య ప్రజలు. ఈ గ్రామాన్ని ఆనుకుని ఉన్న నాలుగు దిక్కులలో పెద్ద పెద్ద భవనాలు లేచాయి. ఇక్కడ గజం భూమి ఖరీదు 70 నుంచి 80 వేలకు పైన ఉందని స్థానికులు చెప్పారు. అక్రమంగా నిర్మించిన కట్టడాలకు ప్రభుత్వం లో ఉన్న వారి అండదండలున్నాయి. గతంలో ప్రజలకు ఇచ్చిన అసైండ్ ల్యాండ్స్ ను కూడా ప్రజల నుంచి ప్రభుత్వం ఈ మధ్య కాలంలో వెనక్కు తీసుకుంటోంది. ప్రాజెక్టుల పేరిట, రోడ్డు విస్తరణ పేరిట రైతులను భయపెట్టి బెదిరించి నిర్బంధాన్ని ప్రయోగించి అవసరానికి మించి భూమిని సేకరిస్తున్నది. సేకరించిన భూమికి రైతులకు చెల్లించిన దానికంటే పదిరెట్లు ఎక్కువకి అమ్ముతూ ప్రభుత్వం వేలకోట్ల రూపాయలను ఆర్జిస్తున్న అనుభవం మనముందున్నది. రీజనల్ రింగ్ రోడ్ విషయంలో భువనగిరి ప్రాంతంలో వందల ఎకరాల వెంచర్స్ ఉన్న TRS పెద్దల భూములకు నష్టం జరగకుండా పేద రైతుల భూముల వైపు రాష్ట్ర ప్రభుత్వం అలైన్మెంట్ మార్చి ఈ రోజు వాళ్ళ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోడానికి సిద్ధపడింది. తెలంగాణా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారి అవతారమెత్తిన నేపధ్యంలోనే ఐలాపూర్ సంఘటనను కూడా చూడవలసి ఉంటుందేమో! బంగారు తెలంగాణ అంటే కాకులను కొట్టి గద్దలకు పెట్టడమా!