అధర్మ బంటువే…!!

కెమెరా కాదు సే..
కెమెరాలు పెట్టమను

ఒకటి గాదు
ఒక్క జైల్లనే గాదు

సెల్లు సెల్లుల
టేషన్ టేషన్ ల
మూడేసి కెమెరాలు
పెట్టియ్యి…

లైను లేదు
లైటు లేదు
పనిచేయలేదనే
వొగల బొంకులకు
తావు లేకుండా
ఇరవై నాలుగుగంటల్లో
ఒక్క సెకండు ఆఫైనా
థర్డ్ డిగ్రీ అమలు జరిగిందని
సెల్ఫ్ యాక్సెప్టెడ్
క్రిమినల్ కేసు
ఆటోమాటిక్ గా బుక్కయ్యేట్లు
సెట్టింగులు జేసెయ్…

జవాన్నుండి ఐజీ దంకా
ఊస్టింగులు జేసేసి

ఉసిగొల్పి నోడు
ఉప్పేసి నోడూ
వాడెంతటి
హోమైనా.. పియ్యమైనా
జైలులేసెయ్…

లీడరుకు పనికిరాడని
పర్మనెంట్ గా..
అవును పర్మనెంటుగా
ఓట్లకు
డిస్క్వాలిఫై జేసెయ్…

ఎట్ల కంట్రోల్ కాదో చెప్త
న్యాయం ఎట్లా
పట్టాల్ దప్పుతదో
నేరం ఎట్లా
నక్రాల్ జేస్తదో
సూస్తా..ఇగ జూస్తా…

దుత్త
న్యాలన బడి
ముక్కలైపోయి

ఒలికి పాలు
ఇంకి పోయాయనుడు గాదు

దుత్తెట్ల వల్గిందో
దూడెట్ల జచ్చిందో
తల్ల్యాడి కోయ్యిందో
తెలజూపి జెప్పాలె…

గప్పుడు.. అద్గప్పుడు…
నువ్ సుప్రీమైతవ్
భేత్రీనవ్ తవ్..

వాన లేదు గాని
న్యాలంతా తడిసింది

తెల్లారింది గాని
పొద్దు బొడవనంటుంది

అన్నట్లు
యవ్వారమొద్దు..

యేలును
ట్రిగ్గరు కానించి
ఏకునాదం
వినిపించుడాపు..

మా నెత్తుర్లు తాగి తాగి
యెవనెవని పాటనో
ఎత్తెత్తి పాడుడాపు..

ఏలెటోని
ఊడిగంల
ఎగిరెగిరి దుంకేటి
బైరూపి యేసాలు
కట్టుడాపు..

కడుపులో దాసిన
కత్తులు ఎలజూపు…

గాంధారి రూపులో
అందాలు వొలికేటి
షికారి పిట్టవు
అపర బలి పీఠమీవు

కళ్ళొక్కటే గాదు
గుండె లేని
బండవూ

ఆకాశ దాడులూ
నీ సెవుల సోకవూ..
ఆండాల సెగ శ్వాస
అస్సలే పట్టదూ..

స్టాను స్వాములు
సాయి బాబలు
సైతానుల సంతతందువు..

సత్యమును
సత్యమనగ
మనసొప్పలేని
పరమ
దుర్గంధ బొందవు..

యాపార రుసి
మైకాలు మరిగి
కార్పోరేటు కౌగిట్ల
సోలి సొరిగేటి
ఓ అన్యాయ మౌళీ..

పండ్లు ఫలములు
దండి గుండి గూడ
పస్తులున్నోళ్లు
కాళ్లకింది నేలకోసం
నెత్తుర్లు పారిచ్చినోళ్లు

ఆ అడవి బిడ్డల
ఆకలిపేగుల గానపు
కడుపు తీపెరుగవు
పరమ తీరుపెట్లైతవే..

ధర్మయుద్ధమును
ద్రోహముగ
తలచేటి
తల పొగరు
తలకెక్కి
నర్తించే దానవు..

ధర్మ కాంటవు గాదు
నీవధర్మ బంటువే…!!!

పుట్టిన ఊరు కొల్లాపూర్ - వరిదేలవీధి(1960లో), ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా. నేపథ్యం: దోయబడ్డ బాల్యం, కష్టాలు కన్నీళ్లు, ఆకలి అవమానాలే తోబుట్టువులు. చెమట సౌరభాల మడి అమ్మవడే బడిగా... తలాపున నల్లమల అడవే ఆట మైదానంగా... ఎలుగెత్తి పారే కృష్ణా నది చేతికందే దూరంలో ఉండీ గొంతు తడవని దాహంతో ఏళ్లకేళ్లు కురవని మేఘాలతో పరుగు తీసే మేకలతో, చెట్టు పుట్టలతోచెట్టా పట్టాలేసుకు సాగిన సాహచర్యం. వృత్తి: న్యాయవాదం. ప్రవృత్తి : సాహిత్య అధ్యయనం. 1978 నుండి కవిత్వం, పాట, వ్యాసం, కథా, చిత్ర, నాటిక రచన, నటన. రచనలు : 1. 'స్పందన'( కవితా సంకలనం) 1985 గద్వాల్ విరసం రాష్ట్ర సభల్లో ఆవిష్కరణ. 2. 'సేద్యం' (కవితా సంకలనం), 3. 'కఫన్' (కథా సంకలనం), 4. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (కవిత్వం) ( ఆంగ్లానువాదం: అర్విణి రాజేంద్రబాబు గారిచే), 5. 'రాహేc', 6. 'జాబిలి ఖైదు', 7. 'దగ్ధ స్వప్నం' (కవితా సంకలనాలు ప్రచురించారు.)

Leave a Reply