ఎప్పటిలాగే మంచు బిందువులు
అడవి తడిసిన జ్ఞాపకాల్ని మోస్తున్నాయి
అతనిపై అల్లుకున్న
ఎర్రెర్రని పచ్చపచ్చని బంతిపూలు
కొండగోగులతో గుసగుసలాడుతున్నాయి
రాత్రి కురిసిన వానకు
తళతళలాడుతున్న ఆకుల నడుమ
పూర్ణ చంద్రబింబాల్లా
విచ్చుకున్న ఎర్రనిమోదుగపూలు
అవును
అతను నిదురిస్తున్నాడు
ఎప్పటిలాగే గిజిగాళ్ళు
ఆదివాసీ నుడికారంలో
అడవితో మాట్లాడుతున్నాయి
అడవి వాకిళ్ళన్నీ
పూలగుఛ్ఛంలా ఒక చోట చేరినట్టు
గూడాలకు గూడాలు కదిలొచ్చాయి
అక్కడ పుట్టి పెరగని ధీరుడొకడు
నాలుగు దశాబ్దాల ముందు యీ అడవికొచ్చి
లోకానికి పచ్చదనాన్ని పంచే పనిలో తలమునకలై ఇంతకాలానికి సేదతీరుతున్నాడు
అవును
అతను నిదురిస్తున్నాడు.
ఎవరతను?
గుప్పెడు మట్టి లాంటి వాడు
పిడికెడు గింజల్లాంటివాడు
రైతు నుదుటన మొలకెత్తిన పైరులాంటివాడు
కూలీ చేతి కొడవలి వంటివాడు
సముద్రకెరటాలకి సామూహిక కదనం నేర్పినవాడు
మానవతా సుగంధాల్ని పూవు పూవుకు పంచిన సీతాకోకచిలుక వంటివాడు
అడవితల్లి నులివెచ్చని మమతలవొడిలో
నా కామ్రేడ్ నిదురిస్తున్నాడు
ఆర్.కె. నిదురిస్తున్నాడు…
కంట్లోచెమ్మ కొలకులు దాటనీకు
గుండెనిబ్బరం సడలనీకు
నడకలో వేగం తగ్గనీకు
అతను వెలిగించిన కాగడా అందుకో
అతను పాడిన వెలుతురు పాటల నెగరేద్దాం!