ఎర్రని కలలు
దట్టమైన అరణ్యాల్లో
ఎత్తైన చెట్లకే పూస్తాయి
ఒక మార్పును శ్వాసిస్తూ
దశాబ్దాలకు దశాబ్దాలు వెలుగుతాయి
అడవి అండవుతుంది
అడవి అన్నం ముద్దవుతుంది
అడవి అమ్మవుతుంది
*
అప్పుడప్పుడూ తుపాకుల గాలి వీస్తుంది
తూటాల జల్లు కురుస్తుంది
నెత్తురుతో చిత్తడైన నేల
మళ్లీ నీళ్ళోసుకుని
తిరిగి పోరాటాన్నే కంటుంది
రుతువులు మారుతాయంతే!
అణచివేతలూ
అసమానతలున్నంత కాలం
అడవి
ఒక ప్రసూతి వార్డు
*
వీరుడా… నీకు సలాం
నీ దారేదైనా
నీ కలల్ని.. ఇక ప్రపంచం మోస్తుంది
కానీ, ఇంత వెలితి..
ఇదెలా పూడుతుంది?
అడవి ప్రశ్నవుతుంది
అడవి జవాబవుతుంది
అడవి పాఠమవుతుంది
*
కొన్నాళ్ళకు
పూలూ రాలిపోతాయి
కలలు మాత్రం రాలిపోవు
మోదుగుచెట్లు
ముందుకు నడుస్తాయి
కొండ మల్లెలు
పాటలందుకుంటాయి
గుండెలు మళ్లీ
డప్పుల మోతలవుతాయి
అర్ధరాత్రి మోసపు నిద్రలో
అడవి ఉలిక్కిపడిన ప్రతిసారీ
కొండలు
వీరుడి పేరు చెప్పి
అరణ్యాలవెన్ను నిమురుతాయి
అడవి ఎప్పటికీ వొట్టిపోదు
✊✊
మా సత్యం (01-11-2021)
అడవి వొట్టిపోదు
November, 2021
సాంబమూర్తి లండ గారు రాసిన కవితా చరణాలలోని పద ప్రయోగం, Universalization అనే భావానికి దగ్గరగా ఉంది.
కవితలోని సూటిదనం, నిర్భీకత, నిజాయితీ, స్పష్టత, కవిత అత్యంత ఉత్సాహంగా చదవడానికి ప్రేరేపించడం,వర్ణనా చాతుర్యంతో ఇమిడ్చిన పద్ధతి అద్వితీయం.
“తూటాల జల్లు కురుస్తుంది
నెత్తురుతో చిత్తడైన నేల
మళ్లీ నీళ్ళోసుకుని
తిరిగి పోరాటాన్నే కంటుంది
రుతువులు మారుతాయంతే!
అణచివేతలూ
అసమానతలున్నంత కాలం
అడవి
ఒక ప్రసూతి వార్డు”
నవీన పదప్రయోగం.
సందర్భోచితంగా భావసౌందర్యంతోపాటు, భావానికి తగిన భాష తో ప్రదర్శించిన భావానుగుణమైన
పద ప్రయోగం ఇది. పాల కుల నియంతృత్వాన్ని అంతర్లీనంగా తెలియజేస్తుంది.
ఈ సందర్భంగా సోమన పద్య వాక్యాలు గుర్తుకొస్తున్నాయి.
“బీరపు బొత్తయు గట్టుకుని పోయె, పోయిన పోకై” అంటాడు సోమన. బీరము అంటే డొల్ల గాంభీర్యము. యుద్ధంలో నిలవనూ లేడు, ఓటమి ఒప్పుకోనూ లేడు. దేశ ప్రజలకు అబద్ధాలు చెబుతూ దొంగ, బడాయితనంతో
భారత పాలకవర్గం పరిపాలిస్తుంది.మోడీ అమిత్ ద్వయం రాజకీయాలని సమర్థించక పోతే If you are not whith us,you aren’t a patriot !
అన్నట్లు! నిర్బంధానికి గురి చేస్తున్నారు.
ఉద్యమ అభినందనలు.
ధన్యవాదాలు సర్ …