అడవి ముట్టడించిన నిప్పు

1.

వాళ్ళ పాదాల క్రింద అడవి
అడవి గుండెల మీద ఇనుప వల
ప్రయోగాల భాషతో బురద అయిన అడవి
భాష రాని కళ్ళ అమాయక చూపులు
చీకటి గూటితో ప్రయాణం
ఎక్కడికో తెలియని అడుగులు
ఏడ్చిన ప్రాణాల గుండెలో దిగులు
అడవి తగలబడి దిగులుతో ప్రయాణించింది

2.

భయం వెనుక మూసుకున్న తలుపులు
తలుపు సందులోంచి దిగులు చూపులు
రోగాలు దేహంలోకి ఎక్కించబడ్డాయి
ఓపలేని ప్రాణం విలవిలమంది
ఏడుపు ప్రయాణించీ వెన్నెలకి కబురు అందించింది
కబురు అందుకున్న అడవి చీకటిని పోగుచేసింది
చీకటిలో అడవి మండిపడింది

3.

మండుతున్న ఆకాశం
ప్రయోగశాల తలుపు తోసింది
అంగ వైకల్యంతో కుంటి నడక నడిచిన నడకలు
జన్యు రోగాలతో ఎర్రబడ్డ ముఖాలు
మందు కుదరక బిగుసుకున్న ఉరిలో వేల్లాడిన మెడలు
రోగాల గుహలో ఆర్తనాదం
కబురు అందుకున్న నది
నీటిని దాచుకుంది

4.

ఎండిన అడవి మెడలో నది
నదిలో ముఖంలో దిగులు చిత్రం
ఆర్తనాదం ఒడిలో ప్రపంచం
చేతులు కడుక్కుంటున్న జనం
మూతులు మూసుకుంటున్న ప్రజ
ప్రజల మెదడులో వైరస్
పుట్టుక వెదుకుంటున్న కరోనా
అడవి నిద్రలో అలజడి…

రేణుక అయ్యలసోమయాజుల. కటక్ (ఒరిస్సాలో) జన్మంచారు. హైదరాబాదులో నివసిస్తున్నారు. రేణుక అయోల అన్న కలంపేరుతో ఇప్పటివరకు ప్రచురించిన పుస్తకాలు, 'పడవలో చిన్ని దీపం' (2006), 'రెండు చందమామలు' (2008, కధాసంపుటి), 'లోపలి స్వరం' (2012), 'మూడవ మనిషి' (2015, దీర్ఘ కావ్యం (హిజ్రాల వ్యధ)), అంతః తీరాల అన్వేషణ (2018), సౌభాగ్య (రేణుక అయోల కవిత్వ విశ్లేషణ), ఎర్ర మట్టి గాజులు (2019).

Leave a Reply