అడవిని దోసిట్లో పట్టుకుని
అతని రాక కోసం వాళ్లు ఎదురుచూస్తూనే ఉన్నారు
లోలోపల చెకుముకి రాళ్ళతో
అగ్గి రాజేసుకుంటూనే ఉన్నారు
తొణకని ప్రేమతో సొరకాయ బుర్ర నింపి
విశ్వాసపు స్ట్రా వేసి
వణకని గుండె ధైర్యం కోసం
వాళ్ళింకా ఎదురు చూస్తూనే ఉన్నారు
ఆధిపత్యాన్ని నట్టడివిలో నిలబెట్టి
మట్టి దాహాన్ని తీర్చిన ప్రశ్న
ఇక లేదని వాళ్ళనెలా నమ్మించేది?
వృద్దాప్యం ఛాయలు తొంగి చూడ్డానికి
సాహసం చెయ్యలేని ఎనభై ఏళ్ల యువకుడి పాదముద్రలు
కుట్రపూరిత ఊబిలో కూరుకుపోయాయని
అడవిని ఎలా మభ్య పెట్టేది?
అడవంటే మీకు వనరుల మీద మోహమో
నిటారుగా నిలబడి ప్రశ్నిస్తున్న గూడెం మీద కోపమో కావొచ్చు
కానీ అడవంటే అతనికి అంతులేని ఆత్మవిశ్వాసం!
దట్టమైన చీకట్లు అడవిని కమ్మేసిన ప్రతిసారీ అతనో మిణుగురై వెలుగుతాడు
నెత్తుటి మరకలు అంటకుండా
ప్రశ్నను హతమార్చామనుకుంటున్నారు మీరు
అడవి భాషలో చెప్పాలంటే
చైతన్యాన్ని అంగుళానికో చెట్టులా నాటి
అమరుడయ్యాడని వాళ్లనుకుంటున్నారు…
మట్టి దాహాన్ని తీర్చిన ప్రశ్న
ధన్యవాదాలు సర్