పసితనపు ప్రాయంలో మొట్టమొదట
పలకపై పూసిన అక్షరంతో
ప్రేమలో పడ్డాను
నాకప్పుడు తెలీదు
అక్షరాల నడుమ ఎత్తైన గోడలుంటాయని
అవి కొందరికే అందుబాటులో ఉంటాయని
నాన్న
మీసాలకే అక్షరాలు
పట్టుబడతాయన్నారు
వాటి కోసమే
అక్షరాలు పుట్టాయన్నారు
నా గుప్పెట్లో
గరిటను ఇరికించి
ఇది నీకు
బ్రతుకంత బహుమతన్నారు
దానితో నువ్వు
సహజీవనం చెయ్యాలన్నారు
నిజమే
కర్ణుడికి కవచకుండలాల్లా
అప్పటి నుండీ గరిట నన్ను
అవిభక్త కవలలా అతుక్కుంది
నా యౌవనపు రంగుల ఊహల్లో
నా నడివయసువేసవి మిట్టమధ్యాహ్నాలలో
ఎప్పుడుని చెప్పను ఎంతని చెప్పను
అది నన్ను వదలకుండా అనుసరించింది
కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి
ఎన్ని ముళ్ళకంచెలు
నడిచే దారిలో మొలిచినా
అక్షరం నాకు
ఆటవిడుపు అయ్యిందని ఒప్పుకోవాలి
అక్షరమో పద్యమో
పేరేదైతేనేం
అది నా సమస్త దుఃఖాలనూ
ఒక లిపిగా అనువదించి పెట్టింది
నా సంతోష క్షణాలను పదిలంగా పోగేసి
ముత్యాలహారంగా అల్లింది
ఋుతువులు వస్తూ పోతూ ఉన్నాయి
చిన్నముల్లును పెద్దమల్లును
భుజాన వేసుకుని
కాలం తిరుగుతూ ఉంది
నేను అందమైన అక్షరాలను
వెతుక్కుంటూ నడుస్తూనే ఉన్నాను
నా అన్వేషణను కొనసాగిస్తూనే ఉన్నాను
అందుకే అప్పటికీ ఇక ఎప్పటికీ
అక్షరమే నన్ను లాలించే
మెత్తని అమ్మఒడి
కవిత్వం
నా హృదయలయలను
శృతి చేస్తూ ప్రవహించే జీవనది.
పద్మావతి గారూ బాగుందండి కవిత .
Chala bavundi padma ee kavitha.