అక్షరం ఎప్పటికీ కుట్ర కాదు

అక్షరం ఎప్పటికీ కుట్ర కాదు
అది నిప్పే
కానీ నివురుగప్పి వుంది
నిరసనల ఒత్తిడికి
జైల్లే కాదు
న్యాయస్థానాల గదులు సైతం
కదిలి పోవాల్సిందే
కమిటీలు, కమీషన్ లు , అండర్ ట్రైల్లు
నిరసనల హోరులో ఇక వినిపించవు
అక్షరం వికసించి
కవిత్వం రెపరెపలాడుతున్నప్పుడు
రాజ్యం గుండెలో చలి మొదలవుతుంది
ఎంతకూ నిద్ర పట్టని అధికారం
పదే పదే తలుపు తడుతుంది
పుస్తకాల్లోని నల్ల రంగు చూసి బెదిరిపోతుంది
రూపాయి చేసిన ఎగతాళికి
ప్రజలు రువ్విన రాళ్ళై వెంటాడుతుంటే
తప్పును నిస్సిగ్గుగా మోయక
స్వరం మార్చుకొని
కొత్తది కాని పాత కథను వినిపిస్తుంది –
మిత్రులు మాటలతో దూరమైనా
శత్రువులు ఆయుధాలతో దరి చేరినా
కాళ్ళ కింది నేల కాదని వెళ్ళి పోయినా
అక్షరం ఇస్తున్న భరోసానే
ఉద్యమానికి ఊపిరవుతుంది
నేటి మనిషికి రేపటి శ్వాసవుతుంది.

పుట్టింది హన్మకొండ మండలం ఇనుగుర్తి. " గ్లోబల్ ఖడ్గం" సంకలనానికి సహ సంపాదకత్వం (2001), "దుఃఖానంతర దృశ్యం" కవితా సంపుటి (2014), ఈ కవితా సంపుటికి రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం లభించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు.

5 thoughts on “అక్షరం ఎప్పటికీ కుట్ర కాదు

  1. చిక్కనైన కవిత్వం రాసే వద్దిరాజు ప్రవీణ్ కుమార్ కు అభినందనలు

    ప్రచురించిన మీకు ధన్యవాదాలు.

    ప్రవీణ్ కవిత్వంలో ముగింపు అద్భుతంగా ఉంది…

    కొత్తగా కవిత్వం రాసే వారు ఈ కవితను చూసి నేర్చుకోవాలి

  2. బాగుంది ప్రవీణ్, వాక్యాలలో ధాటి వుంది.
    అభినందనలు

  3. చాలా బాగుంది సార్..ఆలోచనత్మకం

  4. Brevity is the secret of iddaraju poetry.

  5. నా కవిత పై స్పందించిన పెద్దలకు కృతజ్ఞతలు.

Leave a Reply