హోళీ

కుంకుమపూల తోటనడిగీ ..
‘కాషాయం’ కట్టుకున్నాను
హిందువన్నారు
అనాది ‌హరితవనాలనడిగీ ..
‘ఆకుపచ్చని’జుబ్బా వేసుకున్నాను
ముస్లిమన్నారు
‌మల్లెపొదల్ని బతిమాలీ ..
‘తెల్లని’అంగీ తొడుక్కున్నాను
క్రైస్తవుడన్నారు !

బంతిపూల తోటనడిగీ ..
పసుపురంగు పూసుకున్నాను
‘పచ్చ’పార్టీవాడన్నారు
మోదుగుపూల చెట్టుకింద మోకరిల్లీ ,.
మెడలో ‘ఎరుపు’తువ్వాలేసుకున్నాను
కమ్యునిష్టన్నారు
నురగల సంద్రంముందు నిలబడీ ..
‘నీలి’ఆకాశాన్ని చుట్టుకున్నాను
బహుజనుడన్నారు !

యింతకీ .. నా ప్రాకృతిక రంగుల్ని
నాక్కాకుండా జేసిందెవడు ?
పార్టీల భవంతులమీదో ..
ప్రార్ధనా మందిరాలమీదో ..
రంగురంగులజెండాగా నన్నెగరేసిందెవడు ?
వర్ణవర్ణాలుగా వెలగాల్సిన నన్ను
వెలిసిపోయిన ఆకాశాన్ని చేసిందెవడు ?

అన్ని రంగుల్నీ దోచుకొనీ
నన్ను అనాధను జేసిందిక జాలు
మీ కుహనాజెండాల్ని కూలగొట్టీ ..
సమస్త రంగుల్నీ నా ఒంటికి పులుముకొని
నడివీధుల్లో నేనిక హోళీ ఆడతాను !!

One thought on “హోళీ

Leave a Reply