దేహమే నాది, హృదయం పాలస్తీనా

ఒక కవిగా, పాలస్తీనా మీద ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణ హోమం పట్ల గత ఇరవై రోజులుగా కలతపడుతున్నాను. ఎక్కడో మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న ఈ మానవ హననం ఇక్కడ ఎంతో ప్రశాంతంగా బతుకుతున్న నాలాంటి కవిని ఎందుకు ఇంత వ్యథకు గురిచేసింది? ఏదో రోజువారి కార్యక్రమాలు, ఏవో ఉద్యోగ బాధ్యతలు, కాలక్షేపపు చదువులు, రాతలు.. వీటన్నింటి మధ్య అనుక్షణం నన్ను పట్టి పిడిస్తోంది పాలస్తీనాక్షోభ. అక్కడ కురుస్తున్న బాంబులు ఏదో మా ఇంటి మీదే పడుతున్నట్టు, అక్కడ మోగుతున్న సైరన్లు మా వీధిలోనే ప్రతిధ్వనిస్తున్నట్టు, నా చుట్టూ ఇళ్ళన్నీ శరణార్థ శిబిరాలుగా మారిపోయినట్టు, ప్రతి వీధి మలుపులో ఒక ఆసుపత్రి.. అందులో రోదిస్తున్న క్షతగాత్రులు, నా వైపే చూస్తున్నట్లు ఎవరెవరో హాహాకారాలు చేసుకుంటూ ఎటుపోవాలో తెలియక ఏదీక్కూ తోచక ప్రాణాలనూ పసిపిల్లలనూ రెండు చేతులతో పట్టుకొని పరుగులు తీస్తున్నట్టు నాకంతా ఒకటే అ యోమయం.. ఆందోళన.

ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య జరుగుతున్నది ఏమిటి? ఎందుకు అక్కడ ఇంత బీభత్సం దశాబ్దాలుగా కొనసాగుతోంది? ఆ ఘర్షణ విషయంలో ప్రపంచ దేశాలు ఎందుకు స్పష్టంగా విడిపోయాయి? ఎవరు ఎటువైపు మాట్లాడుతున్నారు? ఆ మాటల్లో ఏ ప్రయోజనాలు ఉన్నాయి? ఎవరు ఎవరి మద్దతు కోసం ఏ మతలబుతో అడుగులు కదుపుతున్నారు? ఏ ఆలోచనలు చేస్తున్నారు? ఒక సాధారణ జీవిగా ఒక మామూలు కవిగా నన్ను ఏవేవో అర్థం కాని స్పష్టాస్పష్టమైన భావావేశాలు ముప్పిరిగొంటున్నాయి. చరిత్ర తెలిసి కొందరు, చరిత్ర తెలియక కొందరు, చరిత్ర తెలిసి కూడా దాన్ని వక్రీకరించి తమ స్వప్రయోజనాల స్వార్థ సంకుచిత ఆలోచనల పరిధిలో సాగించే విశ్లేషణలు, అందరినీ గందరగోళ పరిచే విద్వేష ప్రచారాలు, ప్రకటనలు సాగుతున్నాయి. ఎందుకిలా? అంతిమంగా మనిషి, శాంతి వైపు సామరస్యం వైపు జాతుల మతాల దేశాల మధ్య చెరగని ప్రేమ వైపు నిలబడాలి కదా! మరి పాలస్తీనా విషయంలో అలా ఎందుకు జరగడం లేదు? ఇలా ఏవేవో ఆలోచనలు నాకు నిద్ర పట్టనీయడం లేదు.

ఒక నిజాయితీతో ఒక నిబద్ధతతో ఎలాంటి స్వార్థ ప్రయోజనం లేకుండా నిష్పక్షపాతంగా చరిత్రను పరిశోధించి, సత్యాన్ని పరిశీలించి, న్యాయం వైపు, మానవ హక్కుల వైపు, ఒక జాతి సాధికారతవైపు ప్రతి వ్యక్తి నిలబడాల్సిన సమయం కదా ఇది. అలాగే ఒక కవిగా నేను కూడా చూస్తున్నాను. ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ బీభత్సాన్ని యుద్ధం అని వర్ణించలేను. లేని దేశాన్ని ప్రపంచ పటంలో ఉనికిలోకి తీసుకొచ్చిన పశ్చిమ దేశాల కుట్ర స్పష్టంగా అర్థమైంది. ఇజ్రాయిల్ ఉనికి లోకి వచ్చాక, శతాబ్దాలుగా ఉనికిలో ఉన్న పాలస్తీనా తన ఉనికి కోల్పోతున్న సంక్షోభంలోకి నిరంతరం నెట్టివేయబడుతుంది. అమెరికా లాంటి అగ్ర రాజ్యాలు అరబ్ దేశాలలో తమ ఆయిల్ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి సాగిస్తున్న దురాక్రమణ నీతిలో ఇజ్రాయిల్ ఎంతో శక్తివంతమైన ఆయుధంగా మారిపోయింది. అందుకే చరిత్రను నిష్పక్షపాతంగా అధ్యయనం చేస్తే అర్థమవుతున్నదొకటే. ఇజ్రాయిల్ చేస్తున్నది యుద్ధం కాదు, అతి దురాక్రమణ. పాలస్తీనా చేస్తున్నది కూడా యుద్ధం కాదు, అది ప్రతిఘటన. ఒక దురాక్రమణదారుడికి ఒక ప్రతిఘటనకారుడికి మధ్య సాగుతున్న నెత్తుటి సంఘర్షణే ఇదంతా. పాలస్తీనా ఆస్తిత్వాన్ని చరిత్ర నుంచి చెరిపేయడానికి ఇజ్రాయిల్ సాగిస్తున్న అతికిరాతక హింసాత్మక దురాక్రమణ ఒకవైపు, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తమ నేలను తాము రక్షించుకోవడానికి, తమకు తమ పిల్లలకు రానున్న తరాలకు ఒక దేశాన్ని సురక్షితం..సునిశ్చితం చేసుకోవడానికి పాలస్తీనా సాగిస్తున్న ఆత్మరక్షణ పోరాటం మరోవైపు. జరుగుతున్న ఈ మారణహోమం వెనక అసలు సత్యాన్ని గ్రహించకపోతే మనం ఎటువైపు నిలవాలో మనకే తెలియక ఒక్కోసారి అసత్యం వైపు అన్యాయం వైపు కొమ్ముకాసే దుర్బలులమైపోతాం.

అందుకే ఆత్మ రక్షణ కోసం పాలస్తీనా ప్రజలు సాగిస్తున్న పోరాటం నన్ను బలంగా తన వైపు లాగేసుకుంది. అక్కడ యుద్ధంలోనే పిల్లలు పుడతారు. యుద్ధంలోనే తల్లులు పిల్లలకు పాలు తాపుతారు. యుద్ధంలోనే సంసారాలు.. యుద్ధంలోనే సంభోగాలు.. యుద్ధంలోనే ప్రేమలు.. యుద్ధంలోనే పెళ్లిళ్లు.. యుద్ధంలోనే చదువులు.. యుద్ధంలోనే బతుకు పోరాటాలు.. యుద్ధం కానిది పాలస్తీనా మట్టిలో ఒక రేణువు కూడా ఉండదు. అందుకే నేనేదో శాంతి కోసం మాట్లాడదామంటే నా అక్షరాలు అలజడిగా కనిపిస్తుంటాయి. ఒక పక్షిని చూస్తే అది పాలస్తీనా దుఃఖాన్ని పాడుతున్నట్టు వినిపిస్తుంది. ఒక చెట్టును చూస్తే అది పాలస్తీనా దగ్ధ గీతంలా తగలబడుతున్నట్టు కనిపిస్తుంది. ఏ పసిపిల్లాడిని చూసినా అయోమయ భవితవ్యాన్ని కళ్ళకు వేలాడదీసుకొని, కాళ్ళ చుట్టూ ఒక దేశాన్ని చుట్టుకుని దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న పాలస్తీనా అనాధ బాల్యమే అనుపిస్తుంది. ఇప్పుడింక హాయిగా ఎలా నిద్రపోగలం! ఆహ్లాదంగా ఎలా ఏం రాయగలం! నా ఇంటి నుంచి నా నేల నుంచి, నన్ను అల్లుకున్న నా జ్ఞాపకాల నుంచి, నా అమ్మనాన్నల నుంచి, నా అక్కచెల్లెళ్ల నుంచి, నాదైన నా నుంచి నన్ను ఎవరో ఎటో దూరంగా విసిరేస్తుంటే నన్ను నేనే గట్టిగా పట్టుకుని విలపిస్తున్న ఒక విషాద దృశ్యాన్ని రోజూ కలగంటున్నాను.

కళ్ళ ముందే ఇంత బీభత్సం, ఇంత అమానుషం, ఇంత దారుణం జరిగిపోతోంది. కానీ జరుగుతున్న దాన్ని తలకిందులు చేసి, దురాక్రమణదారులను.. నిందితులను.. దోషులను.. వీరులుగా మార్చి, బాధితులను అణచివేతల అగ్ని తుఫానులో మలమల మాడుతున్న పీడితులను దోషులుగా చిత్రించే దుర్మార్గం ప్రపంచం అంతటా చూస్తున్నాం. అంతకంటే ఎక్కువగా ఇక్కడ నేను నా దేశంలో చూస్తున్నాను. కేవలం ఒక మైనారిటీ మతస్తులను లక్ష్యం చేసుకుని తమ సుదీర్ఘ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని వ్యూహాలను రచించే వర్గాల దుర్మార్గపు ఆలోచనలు ఆచరణలు కళ్ళ ముందు చూస్తున్న కాలం ఇది. ఇక్కడ దేశంలో ఒక భాగమైన మణిపూర్ మంటల్లో తగలబడి పోతుంటే ఒక్క మాటైనా మాట్లాడని వాళ్లు, ఇజ్రాయిల్ మీద హమాస్ చేసిన దాడి పట్ల తీవ్రంగా కదిలిపోయారు. ఇజ్రాయిల్ పక్షాన తమ సర్వస్వాన్ని రాసిపెట్టినట్టు సానుభూతి రచనలు చేశారు. హమాస్ దాడి తర్వాత ఈ 20 రోజులుగా ఇజ్రాయిల్ పాలస్తీనాపై సాగిస్తున్న మరణకాండను ఖండించే మనసు మెత్తనైన ఒక ఉదాహరణ మచ్చుకైనా కానరాదు. ఆఖరికి ఐక్యరాజ్యసమితి తీర్మానానికి కూడా మన దేశం దూరంగా ఉండి, ఏ జాతి అణచివేత పునాదుల మీద తమ ప్రయోజనాల కోటలు నిర్మించుకుంటున్నారో ప్రపంచానికి అంతటికీ స్పష్టంగా చాటి చెప్పారు. ఈ దేశంలో ముస్లిం మైనారిటీల హక్కుల హననం మీద తమ సింహాసనాలు నిలబెట్టుకునే నాయకులకు మన విదేశాంగ విధానమే వికృతంగా కనిపించి ఉంటుంది. ఈ దేశంలో ఉంటున్న మైనారిటీల మీద వ్యతిరేకతను పాలస్తీనా వ్యతిరేకతగా మార్చుకొని ఒక ఒక పాపిష్టి విధానానికి తెర తీశారు. గాజాను పాలిస్తున్న హమాస్ మిలిటెంట్ దళాలు ఏదో ఉన్నట్టుండి ఉబుసుపోక కాలక్షేపం కోసం ఇజ్రాయిల్ మీద అమాంతం దాడి చేసినట్టుగా మీడియా మొత్తం కోడై కూస్తోంది. దానికి ప్రతిఘటన గానే ఇజ్రాయిల్ ఈ దాడులు చేస్తోందని, పాలస్తీనా వాసులకు ఈ శాస్తి జరగాల్సిందేనని, అది సమంజసమే అనే వాదన కొనసాగుతోంది. అది సత్యం కాదు. అది చరిత్ర కాదు.. మనుషుల పట్ల, మానవత్వం పట్ల కొంచెం కరుణ గా ఉండండి.. కొంచెం దయగా ఉండండి అంటాను.

ఇప్పుడు ఇక ఏది న్యాయం.. ఏది అన్యాయం.. ఏది సత్యం.. ఏదసత్యం.. ఏది చరిత్ర.. ఏది వక్రీకరణ.. ఒక సగటు మానవుడు ఎలా వింగడించుకోగలడు? అణచివేతకు గురవుతున్న జాతుల పట్ల, ఆక్రమణకు గురవుతున్న దేశాల పట్ల, హక్కుల కోసం అల్లాడుతున్న మనుషుల పట్ల, కాస్త స్వేచ్ఛ కోసం అలమటిస్తున్న ప్రాంతాల పట్ల ఆత్మల పట్ల సానుభూతిగా నా గుండె నుండి రెండు అక్షరాలు ఉబికి వస్తే వాటిని విద్వేష కత్తుల అద్దాలతో చూసే కపట కాలంలో ఒక కవి గా ఇక నేనేం కలలు కనగలను? అయినా కలలే కంటాను. అందుకే భూగోళంలో ఎక్కడ మానవ హక్కులకూ ఆక్రమణలకూ మధ్య యుద్ధం చెలరేగినా, శాంతి శిరస్త్రాణ ధరించి అక్కడ నేనుంటాను. మనిషిని మనిషి పట్ల కొంచెం దయగా ఉండమంటాను. మనిషిని మనిషి కొంచెం కరుణగా చూడమంటాను. శాంతి కోసం కరుణ కోసం అనివార్యమైతే యుద్ధమే చేయమంటాను. ప్రస్తుతానికి దేహమే నాది. హృదయం పాలస్తీనా.

పుట్టిన ఊరు నిడమర్రు, పశ్చిమ గోదావరి జిల్లా. ఎంఏ(తెలుగు), ఎంఏ(ఇంగ్లిష్), శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి పీహెచ్ డీ చేశారు. ఐదేళ్లు ప్రింట్, పదేళ్లు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేశారు. రచనలు: 1. కలనేత(1999), 2. మాట్లాడుకోవాలి(2007), 3. నాన్న చెట్టు(2010), 4. పూలండోయ్ పూలు(2014), 5. చేనుగట్టు పియానో(2016), 6. దేశం లేని ప్రజలు(2018), 7. మిత్రుడొచ్చిన వేళ(2019), ప్రసాదమూర్తి కవిత్వం(2019) కవితా సంకలనాలు. సగం పిట్ట(2019) కథా సంపుటి ప్రచురించారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.

3 thoughts on “దేహమే నాది, హృదయం పాలస్తీనా

Leave a Reply