హమస్‌ ప్రతిఘటనకు కారణం సామ్రాజ్యవాదుల కుట్రలే

పాలస్తీనా-ఇజ్రాయెల్‌ వివాదం ఇప్పటిది కాదు. దీనికి వందేళ్ల మానని గాయాల చరిత్ర ఉంది. ప్రపంచ మతాలన్నీ ఆసియా ఖండంలోనే పుట్టాయి. జుడాయిజం, క్రైస్తవం, ఇస్లాం మతాలు ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలు కలిసే అరబ్‌ ప్రాంతంలో ఆవిర్భవించాయి. మూడు మతాలు సెమిటిక్‌ భాషలైన హెబ్రూ, అరబ్బి, అరామిక్‌లను పవిత్ర భాషలుగా భావిస్తారు. యూదుల పవిత్ర గ్రంథమైన తోరా, క్రైస్తవుల పవిత్ర గ్రంథమైన బైబిల్‌, ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ ప్రకారం ఈ ముగ్గురి దేవుడు ఒక్కడే. ఈ మూడు మతాలకూ ఆదిపురుషుడు అదాము, ఆధ్యాత్మిక మూల పురుషుడు ప్రవక్త అబ్రహాం ఒకరే కావడంతో వీటిని ‘అబ్రహామిక్‌ మతాలు అంటారు. మూడు మతాల వారికి జెరూసలేం పవిత్ర స్థలం. యూదుల ఘట్టాలు హెబ్రూ బైబిల్‌ (పాత నిబంధనల)లో ఉంటాయి. క్రైస్తవులకు సంబంధించిన ఘట్టాలు బైబిల్‌ కొత్త నిబంధనల్లో ఉంటాయి. ముస్లింలు ఖురాన్‌ను పవిత్ర గ్రంథంగా భావిస్తారు. ఇస్లాంలో వడ్డీ తీసుకోవడం, వడ్డీ చెల్లించడం రెండూ నేరమే. ఇటువంటి నిబంధన జూడాయిజంలో లేదు. దీంతో యూదులు వడ్డీ వ్యాపారులుగా మారి 1500 సంవత్సరాల క్రితమే. యూరప్‌లో, ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు.

చరిత్రలో పాలస్తీనా :
గత 75 ఏండ్లుగా ఒక దేశం ప్రజలను వాళ్ళ స్వంత దేశం నుండే వెళ్లగొట్టి, కాందిశీకులను చేసి, చెట్టుకొకరిని గుట్టకొకరిని చేసి, వాళ్ళ దేశమే వాళ్లకు కాకుండా చేసి, ఆక్రమించుకున్న ఇజ్రాయెల్‌ కుట్రపూరిత చరిత్రను అర్థం చేసుకోవడం అవసరం. అందుకు ప్రచారమైన అబద్దాలు, సృష్టించిన మిథ్యలు అన్నింటినీ ఛేదించాల్సిన అవసరమున్నది. లేకపోతే హమస్‌ ఉత్తి ముస్లిం తీవ్రవాదులుగా, వారు చేసింది ఒక దుర్మార్గమైన తీవ్రవాద చర్యగా మాత్రమే కనబడుతుంది. ప్రతిగా ఇజ్రాయెల్‌ చేస్తున్నది న్యాయ సమ్మతమైన ఆత్మరక్షణగా, సమర్థనీయంగా కనిపిస్తుంది. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. కారణం తెలియకుంటే కార్యం మంచిచెడ్డలు అర్థం కావు. ప్రతి కార్యం గురించి ఒక నిర్ధారణకు రావాలి. అంటే నిర్ధారణకు రావడానికి, విచక్షణ చేయడానికి మనకు కొన్ని వాస్తవాలు, చరిత్రను కొంచెమైనా తెలుసుకోవాలి. ఏదీ శూన్యంలోంచి ఊడిపడదు. ఏదీ హఠాత్తుగా జరగదు. ప్రతి సంఘటనకు ఒక సందర్భమూ, చరిత్రా ఉంటాయి. దాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. జరిగే ఏ సంఘటైనా అది ఒక చారిత్రక సందర్భంలో జరుగుతుందని అర్థం చేసుకోవాలి. గతంలో జరిగిన అనేకానేక కుట్రలు, కుతంత్రాలు, ప్రచారమైన అనేకానేక అబద్ధాలు, అలుముకున్న భ్రమలను, మిథ్యలను ఛేదించకుండా, చరిత్రను సక్రమంగా అర్థం చేసుకోలేము. చరిత్రను అర్థం చేసుకోకపోతే ప్రస్తుత సందర్భాన్నీ అర్థం చేసుకోలేము.

నిజానికి పాలస్తీనా రోమన్ల కాలం నుండి ఒక దేశంగా ఉన్నది. రోమన్లే పాలస్తీన్‌ను పాలస్తీనాగా పేరు పెట్టారు. రోమన్ల కాలంలో తర్వాత బైజాంటైన్‌ సామ్రాజ్యంలో ఒక భాగంగా సార్వభౌమ ప్రాంతంగా ఉండింది. తర్వాత 14వ శతాబ్దం ప్రారంభం నుండి ఐదు వందల ఏళ్లదాకా ఒట్టోమన్‌ సామ్రాజ్యంలో భాగమైంది. ఒట్టోమన్‌ సామ్రాజ్యంలో భాగంగా పాలస్తీనా ఒక స్వయంసమృద్ధి గల ప్రాంతంగా, వ్యవసాయిక ప్రాంతంగా అభివృద్ధి చెంది, ఆధునీకరణకు ద్వారాలు తెరిచింది. హైఫా, షెఫామ్ర్‌, టిబెరియాన్‌, ఏకర్‌ లాంటి పట్టణాలు అభివృద్ధి చెంది, రేవు పట్టణాలు ఏర్పడి ఇతర ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలు ఏర్పర్చుకుని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా, ఐదు లక్షల జనాభాతో అలరారింది.

అవలోటియాలో ఉస్మాన్‌ పాలనలో కేంద్రీకృతమైన సామ్రాజ్యాన్ని ఒట్టోమన్‌ (1299-1922) సామ్రాజ్యం అంటారు. ఈ సామ్రాజ్యంలో పశ్చిమాసియా దేశాలు, తూర్పు యూరప్‌ దేశాలు, ఉత్తర ఆఫ్రికా దేశాలు ఉండేవి. మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918) నాటికే ఒట్టోమన్‌ సామ్రాజ్యం బలహీనపడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాలు(ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, రష్యా, అమెరికా) విజయం సాధించాయి. జర్మనీ, ఇటలీ, జపాన్‌ కూటమి ఓటమి పాలయ్యింది. దీంతో ఒట్టోమన్‌, ఆస్ట్రో-హంగేరియన్‌ సామ్రాజ్యాలు పతనమయ్యాయి. యూరప్‌, పశ్చిమాసియాలో కొత్తదేశాల ఏర్పాటు జరిగింది. దేశాల సరిహద్దులు మారాయి. ఎవరు ఎక్కడివరకు పాలించాలి అన్న దానిపై వివాదాలు ప్రారంభమయ్యాయి. వర్సైల్స్(28-6-1919) ఒప్పందం ప్రకారం జర్మనీ తన భూభాగంలో పదవ వంతు కోల్పోయింది. ఆ తర్వాత బల్గేరియా, ఆస్ట్రియా, హంగేరీ కూడ తమ భూభాగాలను కోల్పోయాయి. ఆ తర్వాత పారిస్‌లో లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌ సమావేశమైంది. ఆ సమావేశంలో శాంతి ఒప్పందాలు, 26 ఆర్టికల్స్ తో రూపొందించబడిన ఒడంబడికపై జనవరి 1919లో అంగీకారం కుదిరింది. అదే సమావేశంలో పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసి బాధ్యతను బ్రిటన్‌కు అప్పగించారు.

థియోడల్‌ హెర్జెల్‌, ఆస్ట్రియన్‌ జియోనిస్టు (ప్రస్తుత హంగేరి) 1896లో దేశంలేని యూదు జాతి కోసం మాతృభూమిని స్థాపించే ఉద్యమం ప్రారంభించాడు. అతని ‘ది జ్యూయిష్‌ స్టేట్‌’ అనే కరపత్రాన్ని అమెరికా యూరప్‌ దేశాలలో పంపిణీ చేశాడు. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో ఆగష్టు 1897లో జియోనిస్టుల ప్రపంచ కాంగ్రెస్‌ను నిర్వహించాడు. ఆ సమావేశంలో జియోనిస్టు ఆర్గనైజేషన్‌ స్థాపించబడింది. జియోనిజాన్ని ప్రపంచ ప్రాముఖ్యత గల రాజకీయ ఉద్యమంగా మార్చారు. ఆస్ట్రిలియా, సెర్బియాల మధ్య 1914 జులైలో మొదలైన చిన్న యుద్ధం క్రమంగా మొదటి ప్రపంచ యుద్ధంగా మారింది. అమెరికా, ఐరోపావాళ్ళు ఆయుధ సామాగ్రి కోసం యూదు పెట్టుబడిదారుల నుండి పెద్ద ఎత్తున నిధుల్ని స్వీకరించారు. దీనికి ప్రతిఫలంగా యూదులు ‘ఇజ్రాయెల్‌ దేశ ఏర్పాటు’ను డిమాండ్‌ చేయడం జరిగింది. దీనికి యూరప్‌ , అమెరికా వాళ్ళు అంగీకరించారు.

మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాలు విజయం దిశలో ఉన్నాయి. త్రైపాక్షిక కూటమి ఓటమికి చేరువలో ఉన్న సందర్భంలో ఇటలీ-రష్యా సమ్మతితో ఒట్టోమన్‌ సామ్రాజ్యంలోని అరబ్‌ ప్రాంతాలను ఇంగ్లాండ్‌, ఫ్రెంచ్‌ ప్రభావ ప్రాంతాలుగా విభజించడానికి 1916లో రహస్య ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం మధ్యప్రాచ్యాన్ని స్కేలుతో గీతగీసి ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌లు పంచుకొన్నాయి. సైక్స్‌- పికోట్‌ ఒప్పందం ప్రకారం పాలస్తీనా భూభాగం బ్రిటిష్‌ పాలనలోకి వచ్చింది. ఆ సమయంలో మధ్య ప్రాచ్యంలోని చాలాభాగం టర్కీ ఒట్టోమన్‌ సామ్రాజ్య ఆధీనంలో ఉండేది. ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చల్లో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల తరపున దౌత్యవేత్త సర్‌మార్క్‌ సైక్స్‌, ఫ్రెంచ్‌ సామ్రాజ్యం తరుపున దౌత్యవేత్త ఫ్రాంకోయిస్‌ జార్జెస్‌ పికోట్‌లు పాల్గొన్నారు. ఒప్పందాన్ని మే 19, 1916 నుండి అమలులోకి తెచ్చారు. సైక్స్‌-‘పీకోట్‌ ఒప్పందానికి ఒక ప్రాతిపదిక అంటూ లేదు, కేవలం సామ్రాజ్య విస్తరణకాంక్ష, విభజన తప్ప. ఈ ఒప్పందం కోసం శాస్త్రీయ దృక్పథం గానీ, మతం, భాష, జాతీయత, ప్రజల ఆచార వ్యవహారాలు’ సంప్రదాయాలు పరిగణనలోకి తీసుకోలేదు. ఆరు శతాబ్దాల పాటు ఏలిన ఒట్టోమన్‌ సామ్రాజ్యం 1922లో పతనమైంది.

సామ్రాజ్యవాదుల వ్యూహత్మకంగానే ఇజ్రాయెల్‌ను ఏర్పరిచారు :
టర్కీకి దక్షిణాన ఉన్న సిరియా, లెబనాన్‌, ఉత్తర ఇరాక్‌లోని కొంతభాగం ఫ్రెంచ్‌ ఆధీనంలోకి పోయింది. దక్షిణ, మధ్య ఇరాక్‌ భాగం, జోర్డాన్‌, పాలస్తీనా ప్రాంతం బ్రిటిష్‌ ఆధీనంలోకి వచ్చాయి. ఇరాక్‌, మెసోపోటేమియా ప్రాంతం బ్రిటిష్‌ తీసుకోటానికి కారణం మధ్యధరా సముద్రం నుండి భారతదేశానికి భూమార్గం కోసమే. పాలస్తీనాలోని కొంత భూభాగంలో యూదులకు చోటు కల్పించారు. ఈ భూభాగమే తదనంతర కాలక్రమంలో ఇజ్రాయెల్‌గా మారి పాలస్తీనాను కబళించి లక్షలాది పాలస్తీనియన్లను పొట్టనపెట్టుకొంటోంది. బ్రిటిష్‌, ఫ్రెంచ్‌ సామ్రాజ్యాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం వలన ఇప్పటికీ మధ్య ప్రాచ్యంలో ఆరని మంటలా మత ఘర్షణలు, భౌగోళిక రాజకీయ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా షియాలు, సున్నీల మధ్య, దక్షిణ టర్కీ, ఉత్తర సిరియా, పశ్చిమ ఇరాక్‌లో వ్యాపించి ఉన్న కుర్ధులతో కుర్థిస్తాన్‌ ఏర్పాటు కోసం పోరాడుతున్నారు.

పశ్చిమాసియా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మేరకు ”పశ్చిమాసియా దేశాలపై అమెరికా, ఫ్రెంచ్‌, బ్రిటన్‌ సామ్రాజ్యవాద అహంతోనే ఆధిపత్యం చేస్తోన్నాయి. అదే సమయంలో పశ్చిమ దేశాలపై అరబ్బుల వ్యతిరేకత ఇప్పటికీ సెంటిమెంటుగా కొట్టొచ్చినట్లు కనబడుతుందని” అంటున్నారు. మొదటి ప్రపంచయుద్ధ సమయాన అరబ్బు సేనల సహకారాన్ని అర్థించిన బ్రిటిష్‌ సామ్రాజ్యవాద ప్రభుత్వం యుద్ధానంతరం స్వతంత్ర అరబ్బు పాలస్తీనా దేశాన్ని, సిరియా, జోర్డాన్‌, లెబనాన్‌లతో కలిపి ఇస్తామని ప్రకటించినప్పటికీ అందుకు భిన్నంగా రహస్య సైక్స్‌-పికోట్‌ ఒప్పందం కుదుర్చుకొందని, ఇప్పటికీ ఈ ఒప్పందాన్ని నమ్మక ద్రోహంగానే అరబ్బులు పరిగణిస్తారు. బ్రిటిష్‌ వారు చేసిన రెండవ నమ్మక ద్రోహం 1917లో బ్రిటన్‌ విదేశాంగ కార్యదర్శి బెల్‌ఫోర్‌ పాలస్తీనా భూభాగంలో యూదుల రాజ్యస్థాపనకు బ్రిటన్‌ ఆమోదం ఉందని ప్రకటించాడు. 1936 నాటికి బ్రిటిష్‌ పాలకుల పట్ల అరబ్బుల తీవ్ర అసంతృప్తి తిరుగుబాటుగా మారింది. ఈ నేపథ్యంలో పాలస్తీనా అరబ్బులు, యూదుల మధ్య అశాంతికి గల కారణాలను తెలుసుకోవడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం లార్డ్‌ రాబర్ట్‌ పీల్‌ నేతృత్వంలో ఒక కమిషన్‌ వేసింది. ఈ కమిషన్‌ 1937లో తన నివేదికను సమర్పించింది. పాలస్తీనాలో యూదు-అరబ్‌ల లక్ష్యాలు విరుద్ధంగా ఉన్నందున ఇజ్రాయెల్‌ ఏర్పాటు ఆచరణ సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

వలసవాద ముసుగులో ప్రపంచాన్ని ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలను తమ ఆధీనంలో ఉంచుకొన్న సామ్రాజ్యవాద దేశాలు ఆయా ఖండాల్లో వలసవాదం నుంచి విముక్తి, స్వాతంత్య్రం ప్రకటించేటప్పుడు ‘విభజించు పాలించు’ సూత్రాన్ని అమలుపర్చాయి. అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వలసవాద దోపిడీ రొంపిలోకి లాగి, పోరాటాల అనంతరం స్థానిక తైనాతీ పెత్తందారులకు అధికారం అప్పగించారు. ఈ విధంగా స్వాతంత్య్రం ఇచ్చినట్లే ఇచ్చి ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ స్వేచ్ఛలను హరించటమే ఇలాంటి రహస్య ఒప్పందాల ఆశయం. తద్వారా ఎప్పుడూ ప్రపంచాన్ని సామ్రాజ్యవాద ముసుగులో ఉంచుకోవాలనేదే వారి ధ్యేయం, లక్ష్యం. తత్ఫలితంగా స్వాతంత్య్రానంతరం కూడా దేశాల మధ్య చిచ్చు పెట్టి అభివృద్ధి జరగనీయకుండా నయా వలసవాద దోపిడీ కొనసాగించడానికి, ఆయుధాల విక్రయాలకు, లాభార్జనలకు యుద్ధాల చిచ్చు రగిలించి, ముడి సరుకులను ఎప్పటి వలెనే దోచుకొనే విధానాన్నీ అవలంబిస్తున్నాయి. ఈ విధంగా సరికొత్తగా నయా వలసవాదాన్ని ప్రవేశపెట్టారు.

రెండవ ప్రపంచ యుద్ధం నాటికి పశ్చిమాసియాలో చమురు పరిశ్రమ వృద్ధి చెందింది. మధ్యదరా సముద్రం – పాలస్తీనా దేశం భౌగోళికంగా ఆసియా, ఆఫ్రికా, యూరప్‌ ఖండాలకు కూడలిగా ఉంది. దీంతో ఆ ప్రాంతం భౌగోళిక – రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌ తన ప్రపంచ ఆధిపత్య స్థానాన్ని కోల్పోయింది. అమెరికా అగ్రరాజ్యంగా ముందుకొచ్చింది. డాలర్‌ ప్రపంచ కరెన్సీగా గుర్తింపు పొందింది. ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలను ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషించింది. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ నాయకురాలిగా అమెరికా తన స్థానాన్ని స్థిరపరుచుకుంది. యుద్ధంలో నష్టపోయిన దేశాలకు రుణాలు ఇచ్చింది. సాంకేతికంగా, సైనికంగా, ఆర్థికంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే దాని దృష్టి చమురు సంపన్నమైన పశ్చిమాసియాపైన పడింది. అందువల్లనే అరబ్‌ దేశాలను తన యుద్ధభూమిగా మార్చుకొన్నది. అరబ్‌ దేశాల చరిత్ర సమస్తం అమెరికా పీడన పరాయణత్వంగా మారింది.

ఇదే అదునుగా భావించిన అమెరికా యూదులు ఒక దేశం కావాలని పోరాడుతున్న స్థితిని గమనించి తన పలుకుబడితో 1947 నవంబర్‌ 29న ఐరాస 181 తీర్మానం ద్వారా పాలస్తీనాలో కొంత భూభాగంలో ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేయాలని సిఫార్స్‌ చేయించింది. ఈ తీర్మానం అరబ్‌ పాలస్తీనియన్లు యూదులకంటే రెండింతలు ఉన్నప్పటికీ 55 శాతం భూభాగం ఇజ్రాయెల్‌కు, 42 శాతం భూభాగం పాలస్తీనాకు, 3 శాతం భూభాగం జేరూసలేం నగరానికి, దానికి ప్రత్యేక అంతర్జాతీయ పాలనను సిఫార్స్‌ చేసింది. దీంతో ఇజ్రాయెల్‌కు అమెరికా ఎంతగా మద్ధతు ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఐక్యరాజ్యసమితి పాలస్తీనా విభజనకు తగిన ఏర్పాట్లు చేయకముందే మే 14న నాలుగు గంటలకు, టెల్‌ అవీవ్‌లోని రోతస్‌ చైల్డ్‌ బౌలేవార్డ్‌లోని లిటిల్‌ ఆర్ట్‌ మ్యూజియంలో 62 ఏండ్ల యూతు జాతీయ కౌన్సిల్‌ నాయకుడు డేవిడ్‌ బెన్‌-గురియన్‌ 19 శతాబ్దాల చరిత్రలో మొదటి స్వతంత్ర యూదుల రాజ్యమైన ఇజ్రాయెల్‌ ఏర్పాటును ప్రకటించాడు. అదేరోజు రాత్రి అమెరికా ప్రభుత్వం ఇజ్రాయెల్‌ను స్వతంత్ర రాజ్యంగా గుర్తించింది. 1949లో ఐరాస కూడ గుర్తించింది.

ఇజ్రాయెల్‌తో 75 ఏళ్ళుగా ఉద్యమిస్తున్న పాలస్తీనియన్లు :
ఇజ్రాయెల్‌ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడంతో మొదటి అరబ్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం (1948-49) ప్రారంభమైంది. ఇజ్రాయెల్‌ చర్యను నిరసిస్తూ, ఐదు అరబ్‌ దేశాలు ఈజిప్ట్‌, ఇరాక్‌, జోర్డాన్‌, లెబనాన్‌, సిరియాలు పాలస్తీనాకు మద్దతుగా యుద్ధం చేశాయి. ఆ యుద్ధంలో అరబ్‌ దేశాలు పరాజయం పొందడంతో పాటు కొన్ని భూభాగాలను ఇజ్రాయెల్‌కు కోల్పోయాయి. ఇజ్రాయెల్‌ జియోనిజం, దురాక్రమణకు వ్యతిరేకంగా అరబ్‌ పాలస్తీనియన్ల జాతీయవాదం మాతృభూమి విముక్తి కోసం ఏడున్నర దశాబ్దాలుగా పోరాడుతూనే ఉంది. అమెరికా సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్‌ విషయంలో అనుకూలంగా 40 సార్లు ఐరాసలో వీటో చేసిందంటే అమెరికా ఇజ్రాయెల్‌కు ఎంతగా మద్ధతిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ యుద్ధ సమయంలో జియోనిస్టు ఇజ్రాయెల్‌ గుండాలు పాలస్తీనా గ్రామాలపై పడి గృహ దహనాలు, హత్యలు, అత్యాచారాలకు పాల్పడ్డారు. ప్రజలు భయభ్రాంతులకు గురై ఏడు లక్షల మంది పాలస్తీనియన్లు పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. ఆ తర్వాత 1956, 1967, 1973, 1982, 2006లో ఇరు జాతుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఐరాస తీర్మాణాలను వేటిని ఇజ్రాయెల్‌ అమలు చేయలేదు సరికదా పాలస్తీనా భూభాగాలకు క్రమంగా ఆక్రమించుకుంటూ వస్తోంది. మరోవైపు పాలస్తీనియన్లపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే హమస్‌ జాతి విముక్తి కోసం సాయుధ దళాలుగా 1987లో ఏర్పడింది. దీన్నే ఇస్లామిక్‌ రెసిస్టెంటు మూవ్‌మెంట్‌ అని కూడ పిలుస్తారు. 2007లో నెతన్యాహు ఇజ్రాయెల్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టాక మరో నాలుగు యుద్ధాలు 2008, 2012, 2014, 2021లో జరిగాయి.

‘సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం’ అంటాడు లేనిన్‌. సామ్రాజ్యవాద అమెరికా యుద్ధోన్మాది, ఆయుధ బేహారి. 1945 తర్వాత అమెరికా ప్రపంచమంతటా కమ్యనిస్టు వ్యతిరేకత, రాజకీయ భౌగోళిక ఆధిపత్యం కోసం, ఆయా దేశాలలోని సహజ వనరులను కొల్లగొట్టడానికి ప్రజాస్వామ్యం ముసుగులో పదుల సంఖ్యలో యుద్ధాలు చేసి దాదాపు 2 కోట్ల మంది మరణానికి కారణమైంది. 1947 నుంచి ఇజ్రాయెల్‌కు అమెరికా డబ్బు, ఆయుధాలు అందజేస్తూనే ఉంది. జియోనిస్టు ఇజ్రాయెల్‌ పాలస్తీనా వ్యతిరేక ప్రతిచర్యను అమెరికా సమర్థిస్తోంది. పశ్చిమాసియాలో తన ఔట్‌ పోస్టుగా ఇజ్రాయెల్‌ను అమెరికా పెంచి పోషిస్తోంది. ఇజ్రాయెల్‌ పాలస్తీయన్ల అణచివేతను, వారు అనుభవిస్తున్న ఇబ్బందులను, వెస్ట్ బ్యాంక్‌ వంటి ఆక్రమిత ప్రాంతాలలో జరుగుతున్న జాతిహననాన్ని అమెరికా పట్టించుకోలేదు. గత పదహారు సంవత్సరాలుగా గాజా, వెస్ట్ బ్యాంకులో కొనసాగుతున్న అమానవీయ ఆంక్షలను, దిగ్బంధాన్ని సమర్థిస్తూ వస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో వెస్ట్ బ్యాంక్‌లో యూదు ఆవాసాలను విస్తరించడం ద్వారా రెండు దేశాలు ఏర్పాటు (ఐరాస) తీర్మానాన్ని దెబ్బతీస్తూ, వర్ణ వివక్ష వంటి వ్యవస్థను అమలు చేస్తున్నప్పుడు, ఈ ద్వంద్వ ప్రణాళికతో అమెరికా, పశ్చిమ దేశాలు కుమ్మక్కయ్యాయి. పాలస్తీనా నుండి పక్క దేశాలకు శరణార్థులుగా వెళ్లిన వారు పాలస్తీనాకు తిరిగి రావడానికి వీల్లేదని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. పారిపోయిన వారి భూములను ఇజ్రాయెల్‌ స్వాధీనం చేసుకుని యూదులకు పంచుతున్నది. ఐరాస తీర్మానం, ఓస్లా ఒప్పందాలు ఏవి ఇజ్రాయెల్‌ అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో హమస్‌ ఉద్యమాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది.

1967లో అక్రమంగా తూర్పు జెరూసలేంను ఆక్రమించిన ఇజ్రాయెల్‌ వైఖరిని ప్రపంచమంతా ఖండించింది. జెరూసలేం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా దేశం ఆవిర్భవించాలనేది పాలస్తీనా ప్రజల ఆకాంక్ష. ప్రపంచ ప్రజల మద్దతు పాలస్తీనాకే ఉంది కాని అమెరికా సహకారంతో ఇజ్రాయెల్‌ దానిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టింది. 2009 జనవరిలో గాజా నగరంపై క్రూరమైన దాడిచేసి ఇజ్రాయెల్‌ గాజా నగరాన్ని ఆక్రమించింది. తమ స్వతంత్రం కోసం పోరాడుతున్న పాలస్తీనా ప్రజలను తీవ్రవాదులుగా చిత్రించి ప్రచారం చేసింది. దానికి అమెరికా వంతపాడుతూ వస్తున్నది. పాలస్తీనా ప్రజలపై అమానుషమైన దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ వైఖరిని నిరసిస్తూ ఇస్లామిక్‌ దేశాలన్ని ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నాయి. అయినా పాలస్తీనాలోని తూర్పు జెరూసలేం, వెస్టుబ్యాంక్‌లలో అక్రమ నివాసాల నిర్మాణాన్ని ఇజ్రాయెల్‌ కొనసాగిస్తూనే ఉంది. పాలస్తీనా భూభాగం చుట్టూ గోడ కడుతున్నది. చివరికి మధ్యధరా సముద్రతీరాన్ని కబ్జా చేసి పాలస్తీనా ప్రజలకు సముద్రం కనబడకుండా గోడ నిర్మించింది.

హమస్‌ ప్రతిఘటన న్యాయమైనది, ధర్మమైనది :
ఐక్యరాజ్యసమితి తీర్మానాన్నీ, ద్వైపాక్షిక ఒప్పందాలు వేటిని ఇజ్రాయెల్‌ ఖాతర్‌ చేయకుండా అమెరికా అండతోనే పాలస్తీనాకు చెందిన వెస్ట్‌బ్యాంక్‌, తూర్పు జెరూసలేంలలో పాలస్తీనీయులను గెంటివేసి, దౌర్జన్యంగా ఇజ్రాయిలీ సెటిలర్లు అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, ఏదో ఒక సాకుతో అల్‌ అక్సా మసీదు, పరిసరాలలో ఉన్న పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకోవడం, ఈ సెటిలర్ల గ్యాంగులు, ఇజ్రాయిలీ ఆర్మీ కలిసి పాలస్తీనీయుల ఇండ్లనూ, కార్లను తగులబెట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడిన పర్యవసానమే హమస్‌ చేసిన ‘ఆపరేషన్‌ అల్‌ ఆక్సా ఫ్లడ్‌’ అని పేర్కొంటున్నది. ”మాది ఆత్మరక్షణ తప్ప, దాడి కాదని, మా లక్ష్యం ఇజ్రాయెల్‌ సైన్యం తప్ప, ఇజ్రాయెల్‌ ప్రజలు కాదని” హమస్‌ ప్రకటించింది.

అణచివేతలు- ఆక్రమణలు ఉన్నప్పుడు తిరుగుబాట్లు – ప్రతిఘటనలు తప్పవు. రాజ్యహింసకు ప్రతిహింస చెలరేగక మానదు. ఆత్మరక్షణ పోరాటం అనేది మానవ స్వభావంలోనే ఉంటుంది. ఒక్కోసారి ఈ దాడులు – ప్రతిదాడులు చినికి చినికి గాలివానగా మారి యుద్ధ రూపాలుగా సంతరించుకుంటాయి కూడా. పాలస్తీనియన్ల గాజా ప్రాంతం 41 కి.మీ. పొడవు 20 కి.మీ. వెడల్పు గల చిన్న భూభాగం. అంటే, ఒక మండల విస్తీర్ణం కంటే చిన్నది. ఆ చిన్న భూభాగంలో 23 లక్షల జనాభా నివసిస్తున్నది. ఒంటే-గుడారం కథ మాదిరి యూదులు పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకుంటున్నారన్న విషయం అందరికి తెలిసిందే. అమెరికా, దాని మిత్రదేశాలు పాలస్తీనాను గుర్తించకుండా కేవలం ఇజ్రాయెల్‌ను మాత్రమే ఒక దేశంగా గుర్తించడమే సమస్యకు బీజం. తమ సొంత భూభాగంలోనే తాము పరాయివాళ్ళుగా, పరాధీనులుగా బతకడం ఎంత నరకమో అది అనుభవించే వారికే తెలుస్తుంది. ఇజ్రాయెల్‌ సైన్యం అవకాశం దొరికినప్పుడల్లా పాలస్తీనియన్లపై ఆంక్షలను, అణచివేతను ప్రయోగించడం ఏడున్నర థాబ్ధాలుగా పరిపాటైపోయింది. చివరకు గాజాలోని మసీదుకు వెళ్ళాలన్నా ఇజ్రాయెల్‌ సైన్యం అనుమతి తీసుకోవల్సి రావడం వారికి భరింపరాకున్నది.

ఏ జాతి అయినా ఆకలి భరిస్తుంది కాని, అవమానాన్ని అణచివేతను భరించలేదు. అందువల్లనే తమ మాతృభూమి విముక్తి కొరకు, పాలస్తీనియన్ల స్వేచ్ఛ కొరకు, తమ జాతి రక్షణ కొరకు ఏడున్నర దశాబ్ధాల ఇజ్రాయెల్‌ దురాక్రమణను, నిర్బంధాన్ని వీరోచితంగా ఎదిరిస్తున్నారు. అమెరికా సామ్రాజ్యవాదం, జియోనిస్టు జాత్యహంకార నెతన్యాహు గాజా వాసులకు సురక్షిత స్థలమన్నదే లేకుండా చేస్తున్నారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం, ఇజ్రాయెల్‌ బలవంతంగా తమ భూభాగాలను ఆక్రమించుకుంటున్నప్పుడు సాయుధ ప్రతిఘటనతో సహా అన్ని రకాలుగా ఎదుర్కొనే హక్కు పాలస్తీనియన్లకు ఉంది. 1983లో ఐరాస సర్వసభ్య సమావేశం తీర్మానం ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించింది. ”తమ స్వాతంత్య్రాన్ని, సరిహద్దులను, జాతీయ సమైక్యతను కాపాడుకోవడానికి, వలసాధిపత్యం నుండి, జాతి వివక్షత నుండి, విదేశీ దురాక్రమణ నుండి విముక్తి సాధించుకోవడానికి, సాయుధ పోరాటంతో సహా అన్ని రకాల పోరాటాలనూ చేపట్టే అధికారం బాధిత ప్రజలకు ఉంటుంది” అని ఆ తీర్మాణం స్పష్టం చేసింది.

హమస్‌ను సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, జియోనిస్టు దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక సంస్థగా చూసే బదులు, ఒక తీవ్రవాద సంస్థగా పరిగణించడం అంటే ఐరాస తీర్మాణాన్ని ఉల్లంఘించడంతో బాటు ఇజ్రాయెల్‌ సాగిస్తున్న అన్ని రకాల దుర్మార్గాలనూ సమర్థించడమే అవుతుంది. అది అన్యాయమే కాదు, అనైతికం కూడా. మాతృభూమి కోసం, పాలస్తీనా జాతి విముక్తి కోసం పోరాడుతున్న హమస్‌పై తీవ్రవాద ముద్ర వేయడంతో అమెరికా సామ్రాజ్యవాద, పశ్చిమ దేశాల కుట్ర దాగి ఉంది. జాతి విముక్తి ఉద్యమాన్ని తీవ్రవాద ఉద్యమంగా పేర్కొంటూ దాని మూలాలు తుంచి వేయాలనడం ద్వారా అసలు విషయాన్ని దాచి ప్రజాభిప్రాయాన్ని పక్కదారి పట్టించడం తప్ప మరోకటి కాదు. 1947 ఐరాస తీర్మానం ప్రకారం రెండు దేశాలుగా గుర్తిస్తే పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌తో యుద్ధం చేయాల్సిన అవసరమే ఉండేది కాదు.

అక్టోబర్‌ 7న హమస్‌ ఇజ్రాయెల్‌ సెటిల్మెంట్‌పై రాకెట్లతో మెరుపు దాడి చేసింది. హమస్‌ దానిని ఆపరేషన్‌ అల్‌ అక్సా తుఫాన్‌ అని పేర్కొంది. హమస్‌ దాడికి స్పందనగా ఇజ్రాయెల్‌ ప్రకటించిన యుద్ధం దురాక్రమణ యుద్ధమే. వియన్నా తీర్మాణాలు, జెనివా ఒప్పందాలకు వ్యతిరేకంగా నివాస స్థలాలపై, శరణార్థుల శిభిరాలపై, హాస్పిటల్స్‌, పాఠశాలల పైన ఇజ్రాయెల్‌ సైన్యం బాంబుదాడులు చేస్తూ మారణహోమాన్ని సృష్టిస్తోంది. ఐరాస సాధారణ సభ యుద్ధాన్ని ఆపాలని అక్టోబర్‌ 27న చేసిన తీర్మానాన్ని ఇజ్రాయెల్‌ ఖాతర్‌ చేయడం లేదు. ఈ తీర్మానాన్ని 120 దేశాలు ఆమోదించాయి. అమెరికా సహా 14 దేశాలు వ్యతిరేకించాయి. 45 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. అందులో భారత్‌ ఒకటి. గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభమైన 40 రోజుల తరువాత (నవంబర్‌ 15) తొలిసారిగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మానవతా పూర్వక కోణంలో దాడులను ఆపాలని యూదు దురహంకారులను కోరుతూ 12-0 ఓట్లతో వేడుకోలు తీర్మాణాన్ని ఆమోదించింది. అనేక దఫాల చర్చల అనంతరం మల్టా ప్రతిపాదించిన ఈ తీర్మానంలో హమస్‌ను ఖండించలేదు గనుక తాము బహిష్కరించినట్లు అమెరికా, బ్రిటన్‌ ప్రకటించాయి. ఇజ్రాయెల్‌ను ఖండించకుండా వేడుకోవటం ఏమిటంటూ రష్యా నిరసనతో ఓటింగ్‌కు దూరంగా ఉంది.

ఇజ్రాయెల్‌ దాష్టీకానికి వ్యతిరేకంగా దేశ విదేశాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. గాజాలో గత 50 రోజులుగా ఇజ్రాయెల్‌ సాగిస్తున్న నరమేధాన్ని ఆపాలని కోరుతూ అమెరికా, బ్రిటన్‌, ప్రాన్స్‌తో సహా అరబ్బు దేశాల్లో నిషేధాలు, నిర్బంధాలను లెక్కచేయకుండా అన్ని రంగాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. గాజాపై ఇజ్రాయెల్‌ సాగిస్తున్న మారణహోమాన్ని వెంటనే ఆపాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇరవై ఒకటో శతాబ్దంలో వలసవాదానికి ఇంకెంతమాత్రమూ స్థానం లేదు అని ప్రదర్శకులు నినదించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ఇజ్రాయెల్‌ ఊచకోత యథేచ్ఛగా సాగుతున్నా దీనిని ఆపేందుకు అమెరికా ససేమిరా అంటోందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలస్తీనాలో కనివిని ఎరుగని రీతిలో సాగుతున్న మారణహోమానికి బైడెన్‌ కారణమని నిందించారు. అమెరికాలో గాజా ప్రజలకు ఆత్మస్థైర్యం నింపడానికి అమెరికా రచయితలు 24 గంటలు ప్రదర్శనలు చేశారు. కవిత్వంలో పులిట్టర్‌ గ్రహీత న్యూయార్క్‌ టైమ్స్‌ కవిత్వ విభాగం ఎడిటర్‌ అన్నేబోయార్‌ తన పదవికి రాజీనామా చేశారు.

పాలస్తీనా సమరయోధుల సంస్థ హమస్‌-ఇజ్రాయెల్‌ మధ్య మరోసారి చెలరేగిన పోరు ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తుందా అని ఒకవైపు ప్రపంచం ఆందోళన చెందుతుంటే, మరోవైపు అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో ఆయుధ ఉత్పత్తి కంపెనీల వాటాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇల్లు కాలుతుంటే బొగ్గులేరు కొనటం అంటే ఇదే. ఇజ్రాయెల్‌కు మరింతగా సాయం చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించటంతో ఆయుధ కంపెనీలకు చేతినిండా పని అన్నది తెలిసిందే. దాడి ఎవరు ముందు ప్రారంభించారు, ఎవరు ప్రతిఘటిస్తున్నారు అన్న విచక్షణలోకి పోతే పైకి హమస్‌ దాడులు కనిపించవచ్చుగానీ అంతకు ముందు ఇజ్రాయెల్‌ చేసిన దారుణాలు తక్కువేమీ కాదు. ఇది ప్రారంభం కాదు, అంతము కాదు. ఆకస్మికంగా జరిగిన ఈ పరిణామాలను గమనిస్తే పాలస్తీనా ఏర్పాటును అడ్డుకోవటమే కాదు, ఐరాస దానికి కేటాయించిన ప్రాంతాలను క్రమంగా ఆక్రమించుకుంటున్న ఇజ్రాయెల్‌, దానికి మద్ధతు ఇస్తున్న పశ్చిమ దేశాల వైఖరి ప్రధాన కారణంగా అర్థమవుతుంది.

సహజ వనరుల కోసం ఇజ్రాయెల్‌ కుట్ర :
గాజాలోనూ, వెస్ట్‌బ్యాంక్‌లోనూ అపారమైన గ్యాస్‌, చమురు నిక్షేపాలు ఉన్నాయి. వీటి పైన కన్నేసిన ఇజ్రాయెల్‌ పాలస్తీనియన్లను ఆ ప్రాంతం నుండి వెళ్ళగొట్టడానికి భీకర దాడులు జరుపుతోంది. తూర్పు మద్యధరా ప్రాంతంలో… ముఖ్యంగా ఇజ్రాయెల్‌కు చెందిన జోర్హ్‌ బేసిన్‌ సమీపంలో 3.4 ట్రిలియన్‌ (లక్ష కోట్లు) క్యూబిక్‌ మీటర్ల (టిసిఎం) గ్యాస్‌ ఉన్నదని 2010లోనే అమెరికా భూగర్బం విభాగం ఓ సర్వేలో తెలిపింది. పాలస్తీనా అథారిటీ అభ్యర్థన మేరకు బ్రిటిష్‌ గ్యాస్‌ కంపెనీ 2000వ సంవత్సరంలో అన్వేషణ జరిపింది. అక్కడ 20 బిలియన్‌ (రెండు వందల కోట్లు) క్యూబిక్‌ మీటర్ల (బిసిఎం) గ్యాస్‌ నిల్వలు ఉన్నాయని గుర్తించింది. ఆ ప్రాంతంలో 45 బిసిఎంల గ్యాస్‌ నిల్వలు ఉన్నాయని అమెరికా ఇంధన సమాచార విభాగం అంచనా వేసింది. గాజా తీరంలో సుమారు 30-45 బిసిఎంల గ్యాస్‌ నిల్వలు ఉన్నాయి. ఆక్రమిత పాలస్తీనా ప్రాంతంలో 1,525 బిలియన్‌ బ్యారల్స్‌ చమురు నిల్వలు ఉన్నాయి. ఇతర క్షేత్రాలతో పోలిస్తే గ్యాస్‌ నిల్వలు తక్కువగానే ఉన్నప్పటికీ చమురు నిల్వలు మాత్రం గణనీయంగానే ఉన్నాయి.

1999 నుండి తూర్పు మధ్యధరా ప్రాంతంలో ఇజ్రాయెల్‌ గ్యాస్‌ నిక్షేపాలను అన్వేషిస్తూనే ఉంది. 2000ల నుండి ఉత్పత్తి ప్రక్రియ ఊపందుకుంది. గ్యాస్‌ ఉత్పత్తిని పెంచుకోవాలన్న ఇజ్రాయెల్‌ లక్ష్యమే దురాక్రమణ యుద్ధానికి దారితీసింది. లక్షలాది పాలస్తీనా ప్రజలు నిరాశ్రయులవ్వడానికి కారణమైంది. గ్యాస్‌, చమురు కోసం ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణహోమం పాలస్తీనా ప్రజల హక్కులను కాలరాస్తోంది. గాజా, వెస్ట్‌బ్యాంక్‌, తూర్పు జెరూసలేంపై పూర్తి ఆధిపత్యం చెలాయించాలన్నది ఇజ్రాయెల్‌ ఆకాంక్ష. ముందుగా గాజాపై పట్టు బిగించి, ఆ తర్వాత అక్కడి గ్యాస్‌ నిక్షేపాలను సొంతం చేసుకోవాలని ఇజ్రాయెల్‌ భావిస్తోంది.

ముగింపు :
ఇజ్రాయెల్‌ ఏడున్నర థాబ్ధాలుగా పాలస్తీనియన్లపై దాడులు చేస్తున్నది. పాలస్తీనా వాసులు పోరులోనే పుట్టి, పోరులోనే పెరిగి, పోరులోనే మరణిస్తున్నారు. అంతకంటే వారికి పొయేదేమీ లేదు. వారి మాతతృదేశ కాంక్ష మరింతగా పెరుగుతుందే తప్ప నిర్బంధంతో అణిగేది కాదు. జెరూసలేంతో సహా అరబ్బులకు నిర్దేశించిన ప్రాంతాలను పూర్తిగా తిరిగి వారికి అప్పగించకుండా, వారి ప్రాంతాలలో యూదుల నివాసాలను ఖాళీ చేయించకుండా సమస్య పరిష్కారం కాదు. పాలస్తీనియన్ల మాతృదేశ కాంక్ష తీరదు.ఈ ఘర్షణ పాలస్తీనా- ఇజ్రాయెల్‌ లకు పరిమితమవుతుందని కూడా చెప్పలేం. ఇప్పటికే లెబనాన్‌ హెజ్బుల్లా స్థావరాల మీద ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. అమెరికా విమానాలు సిరియాలోని ఇరాన్‌ స్థావరంపై దాడి చేశాయి. ఇజ్రాయెల్‌ గాజా నుండి వెనుదిరగకపోతే ఇరాన్‌ ఉద్యమంలో దిగవలసి వస్తుందని హెచ్చరించింది. చైనా, రష్యా దేశాలు కూడ తమ ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.

ఇప్పటికే మాతృగడ్డమీద శతాబ్దాల తరబడి బంధీలుగా మారిన పాలస్తీనియన్ల భవితవ్యం గురించి ఒకవైపు ప్రపంచం ఆలోచిస్తుంటే మరోవైపు వారిని మరింతగా అణచివేసేందుకు అవసరమైన ఆయుధాలను అమ్ముకొనేందుకు అమెరికా పూనుకుంది. యుక్రెయిన్‌ వివాదంలో తటస్థ విధానాన్ని అనుసరించిన మనదేశం పశ్చిమాసియాలోనే కాదు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే ఇజ్రాయెల్‌ దుశ్చర్యలను ఖండించాల్సింది పోయి ఇప్పుడు ఇజ్రాయెల్‌కు మద్ధతు ప్రకటించింది. ఇది గడచిన ఏడు శతాబ్ధాలుగా అనుసరిస్తున్న మన విదేశాంగ విధానానికే విరుద్ధం. సమస్యను పరిష్కరించవలసిన ఐరాస ఇప్పుడు చేష్టలుడిగి నిస్సహాయంగా ఉండిపోయింది. భద్రతా మండలిని పనిచేయనివ్వకుండా సామ్రాజ్యవాదులు అడ్డుకోవడమే దీనికి కారణం. ఆక్రమణవాదమే ఏకైక అజెండాగా పేట్రేగిపోతున్న ఇజ్రాయెల్‌ను, మద్దతిస్తున్న అమెరికా, పశ్చిమ దేశాలను ఎవరు ఒప్పించగలరు? అమానవీయ యుద్ధనేరాలకు గాను ఆ దేశాన్ని ఎవరు బోనులో నిలబెట్టగలరు? ఈ పరిస్థితుల్లో సామ్రాజ్యవాద అమెరికా, పాశ్చాత్య దేశాల కుట్రలకు వ్యతిరేకంగా ప్రపంచ ప్రజలందరినీ కదిలించడమే ఏకైక మార్గం.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply