పల్లవి :
హక్కుల కోసం ఉక్కునగారా-మోగిద్దాం రండి
జీవించే హక్కే నేడు-ప్రమాదంలో ఉందండి
నలుదిక్కుల నేకం జేయండి
జన రక్షణకే గిరిగీయండి
వర్ధిల్లాలి హక్కుల సంఘం-పౌరా హక్కుల సంఘం
వర్ధిల్లాలి ప్రజా ఉద్యమం-పీడిత ప్రజా ఉద్యమం
||హక్కుల కోసం||
చరణం : 1
వ్యక్తి స్వేచ్ఛకు సమాజ మార్పుకు
సంబంధాన్ని తెల్సుకుందామా
అణిచివేతకు రాజ్యహింసకూ
అనుబంధాన్ని నిరసిద్దాము
సంపద ఎవరి చేతులో ఉందో
రాజ్యం వారి చేతులో ఉంది
సమాన వాటా కోసం మనము
సంఘర్షించక తప్పదు లేండి
వర్ధిల్లాలి హక్కుల సంఘం-పౌర హక్కుల సంఘం
వర్ధిల్లాలి ప్రజా ఉద్యమం-పీడితుల ఉద్యమం
||హక్కుల కోసం||
చరణం : 2
సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును
అనుసరించదా పాలకవర్గం
చట్టం ఎవరికి చుట్టమో గానీ
సామాన్యులకే శిలా శాసనం
ప్రకృతి సంపద ధ్వంసం చేస్తూ
లాభాలకే పట్టం గడుతూ
బ్యాంకులనన్నీ లూఠీ చేస్తూ
విదేశాలకె పయనం గడ్తే
దోపిడీదార్లలను ఎదిరిస్తేనే నేరం అంటారా-మహాగోరం అంటారా
దేశద్రోహులను ప్రతిఘటిస్తే నిర్మూలిస్తారా-సాంతం అంతం జేస్తారా
||వర్ధిల్లాలి||
చరణం : 3
హక్కులు ఎవ్వరి బిక్షం గాదు
పోరాటం లేనిది రానేరావు
హక్కుల కోసం సంఘర్షించని
ప్రపంచమెక్కడా కానరాదు
మాగ్నా కార్టా ఫారిస్ కమ్యూన్
లిబర్టి ఆఫ్ స్టాచ్యూ చూడు
బానిసత్వమును పారదోలినది
స్త్రీలు పురుషులు సమానమన్నది
వర్ధిల్లాలి మానవ హక్కులు-వర్ధిల్లాలి పౌర హక్కులు
నశించాలి నియంతృత్వము-నశించాలి పితృస్వామ్యము
||వర్ధిల్లాలి||
(‘పౌర హక్కుల సంఘం’ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 08 నవంబర్, 2025న జరిగిన సందర్భంగా…)