హంసలు పొడుస్తున్నాయి

నగరం భక్తితో ఊగిపోతుంది. ఉత్సాహంగా పరుగులు తీస్తుంది. కొత్త కొత్త అలంకారాలతో మెరిసిపోతుంది. దక్షిణం వైపు కృష్ణమ్మ ఎన్నడూ లేనంత ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఆ సవ్వడి గంభీరంగానూ భీతిగొల్పుతూనూ వుంది. కొత్తవారికి అంతే! ఇది మాకు అలవాటేలే అన్నట్టు ఏమైనా జరిగితే ఆ సంగతంతా ఆ కొండపై ఉన్న అమ్మవారే చూసుకొంటుందిలే అన్న నమ్మకంతో జీవనం సాగిస్తున్న ప్రజలు.

ఆ రోజు మూలానక్షత్రం. కొండపైన అమ్మవారిని సరస్వతీ రూపంలో దర్శించుకోవాలనుకునే భక్తులు రాత్రి పదిగంటలు నుండే క్యూలైన్లలో నిండివున్నారు. కంటికెదురుగా కిలోమీటర్ దూరం వరకూ క్రౌడ్ మేనేజ్మెంట్ తో సమూహాలుగా విడగొట్టబడిన భక్తజన సమూహాలు. వినాయకుడి గుడి దగ్గరనుండి తాత్కాలికంగా ఏర్పాటు చేయబడిన క్యూలైన్లు.కాలం కదులుతుంటే లైన్లు కదిలాయి. చీకటిపోయి వెలుగు వచ్చింది. క్యూ మాత్రం మరింత కిటకిటలాడుతోంది.

రాత్రి రష్ మరీ ఎక్కువగా వుంటుంది అని ఉదయం తొమ్మిదింటికి బయలుదేరారు సుభద్ర అర్జున రావు దంపతులు. వారిది ఏటి అవతల వొడ్డు. లంక పొలాలు. అప్పటివరకూ పెళ్ళున కాసిన యెండ నిమిషాల్లో మాయమైంది. ఆకాశం మేఘావృతమై సన్నగా చినుకులు పడుతున్నాయి..

ఇంతలోనే యెండ అంతలోనే వాన ఏం తుఫానులో ఏమో! నిరుడుజూస్తే బుడమేరు వరదలో మునిగిపోయిన పంటపొలాలు. ఈ యేడు చూస్తే వదిలిపెట్టని తుఫానులు. పచ్చని వరి పొలాలు కంకి పోసుకుంటున్నాయి. అన్నాడొక రైతు. ఏ ఊరండీ మీది? మాట కలిపాడు అర్జునరావు.
“నిడమానూరు గూడవల్లి మధ్య” అన్నాడతను.

‘‘మా పసుపు తోటలు నడుమెత్తు పెరిగాయి. అరటి గెలలు కార్తీకంలో నరకడానికి సిద్ధంగా వున్నాయి. ఏటికి వరద పెరిగితే మా ఉరి పొలాలన్నీ మునకే. పైనుండి వచ్చి పడే వరద రోజూ దంచి కొడుతున్న వాన. ఇట్టాంటి వానలు నా ఎరుకలో లేవండి బాబు’’ వాపోయాడు.

సుభద్ర మనసులో కూడా సుడులు తిరుగుతూన్న ఆలోచనలు. పంటలు మునిగితే ఆ నష్టాన్ని తట్టుకోవడం కష్టం. భార్య ముఖం చూసి ఆమె ఏం ఆలోచిస్తుందో కనిపెట్టాడు. అహే! ఏం కాదులే! గవర్నమెంట్ బాగా చూసుకుంటుంది లే! పనోడి పని వంక పెట్టటానికి వీల్లేకుండా వుంటంది. ఎక్కడిక్కడ గట్టి ఏర్పాట్లు చేయిస్తున్నారు. ముంపు భయం లేదు ఏం లేదు. ఇక్కడ చూడు, ఏడన్నా ఇబ్బంది వుందా? లచ్చలమంది వత్తా వుండారు పోతావుండారు. అన్నిచోట్లా అట్టే వుంటది ఆయన పనితీరు.అర్జునరావు మాటల్లో నమ్మిన ప్రభుత్వం పనితీరు పట్ల విశ్వాసంతో పాటు ఒకింత గర్వం అతిశయం కూడా తొంగి చూస్తున్నాయి.

చుట్టూ బారికేడ్లు, పైన షామియానా కప్పి వున్న టెంట్ లోని భక్తజనంతో పాటు లా అండ్ ఆర్డర్ నిర్వహిస్తున్న పోలీసులు కూడా అతని మాటలను వింటున్నారు. పక్కనే తిరుగుతున్న ఆవులు కూడా వింటున్నట్టు వున్నాయి. ఒక పోలీసు అసహనంగా ముఖం పెట్టాడు. ఇదివరకంతా ఇలా లేదు. డ్యూటీల పేరుతో అరగరుద్ది మాపై పెత్తనాలు చేస్తున్నారు అని అశ్లీల భాషలో గవర్నమెంట్ ని తిట్టాడు.

ఇంతలో కపిల గోవును పసుపు కుంకుమలతో అలంకరించుకుని వచ్చి పుట్ పాత్ కి ఆనుకుని వున్న కాలువ రైలింగ్ దిమ్మెకు కట్టేసి ఆ పోలీస్ వంక చూసాడు. మీరు భక్తులను వదిలితే గోమాతను పూజించుకుంటారు. పుణ్యం వాళ్లకు చిల్లర నాతోపాటు మీక్కూడా అన్నట్టు. బస్తాలో పెట్టి తెచ్చుకున్న గడ్డి మోపును ఆవుకు దూరంగా పరిచాడు. గుంపులో ఉన్న ఒకామె చీరను మోకాళ్ల పైకెత్తి బారికేడ్లను దాటుకుంటూ అవతలకు వెళ్ళింది. పర్స్ లో నుంచి పది రూపాయలు తీసి ఆవు యజమానికి ఇచ్చి పిడికెడు గడ్డి పుచ్చుకుని ఆవుకి తినిపించి మూడు ప్రదక్షిణలు చేసింది. ఇవాళ లక్ష్మి వారం సప్తమి కూడా నయ్యే! ఇంత మంచి రోజున కపిల గోవును పూజిస్తే మంచిది. పసుపు కుంకుమతో అలంకరిస్తే మరీ మంచిది అంటూ బారికేడ్లను దాటుకుని తిరిగి లోపలికి వచ్చింది.

పసుపు కుంకుమ కూడా వున్నాయి. బైటికి తీసి పెట్టేదాక మీరు ఆగితేనే కదా! అంటూ భుజం సంచిలో నుండి డిస్పోజబుల్ ప్లేట్స్ వాటర్ బాటిల్ తీసి పసుపు కుంకుమ పొట్లాలు చింపి ప్లేట్లలో విడిగా పోసాడు. పసుపు లో నీళ్ళు కలుపుతూ దగ్గరకొచ్చిన మరొక భక్తురాలిని చూస్తూ “పసుపు కుంకుమ కి పది, గడ్డికి పది. ఒకరికి ఇరవై రూపాయలమ్మా” అన్నాడు.

ఆమె ఆశ్చర్యంగా చూస్తూ.. “ఏంటి చిటికెడు పసుపు కుంకుమ పది రూపాయలా!? దేనికైనా హద్దుండాలయ్యా” అంటూ పది కాగితాన్ని లోపలికి తోసి ఇరవై తీసి ఇచ్చింది. పోలీస్ ఆవు యజమాని ని చూసి నర్మగర్భంగా నవ్వాడు.

దవడ బిగించిన అప్రసన్న ముఖంతో గోవును పసుపు కుంకుమతో అలంకరించి గడ్డి తినిపించి ప్రదక్షిణలు చేసి వస్తూ.. “మరీ దోచుకు తింటున్నారు” అంది. ‘‘అవును” అంటూనే మరికొందరు బారికేడ్లను దాటారు.

అక్కడికి కొద్ది దూరం నుండి కాళ్లకు చేతులకు బేండేజ్లు చుట్టుకుని వున్న బిక్షకుడి అర్ధింపులు
“అమ్మా ఆకలి, అయ్యా ఆకలి! దానం చేయండి” అంటూ. అతని తాలూకూ మనిషిని అంటూ ఓ ఏడెనిమిదేళ్ల కుర్రాడు బ్యారికేడ్లు మధ్య నున్న భక్తజనం మధ్య తిరిగి డబ్బులు సేకరిస్తున్నాడు. చిల్లర నాణేలతో ఆ కుర్రాడి దోసిలి నిండుతుంది. భిక్షుకుడి ముందు డబ్బాలోకి చేరుతుంది.. గంట తర్వాత డబ్బుల డబ్బా సంచీలో వేసుకుని పోయిన పిల్లాడి ఆచూకీ లేదు. బిక్షకుడు అమ్మా, అయ్యా ఆకలి! అని అరుస్తూనే వున్నాడు.

మూడు గంటలనుండి క్యూ లైన్ కదలడం లేదు. మెట్లమార్గం నుండి వచ్చే వారిని కొండ వెనుక నుండి వచ్చే జనాలను వదులుతున్నారట. విఐపి దర్శనాల వల్ల కాదు ఆగడం అని ఎవరో భక్తుల అపోహలను తొలగిస్తున్నారు.

“దర్శనం అయ్యేటప్పటికి ఆలస్యం అయ్యేట్టుంది. అప్పటిదాకా ఏం తినకుండా వుంటే షుగర్ డౌన్ అయిపోద్ది, ఏమన్నా తినవే” సుభద్రను బతిమలాడుతున్నాడు భర్త. ఆమె అతని వంక చూసి తల అడ్డంగా తిప్పింది. పెదవులు కదలకుండా లలితాసహస్రం పఠిస్తుంది. అప్పుడప్పుడూ చేతిలో వున్న మొబైల్ చూసుకుంటుంది. “నీ దేవి కడుపు మాడ్చుకుని ఆకలితో కొండకి రమ్మని చెప్పిందా ఏం? ఆమె ఏమీ అనుకోదు లే! ఏదో వొకటి కొద్దిగా ఎంగిలిపడు” పక్కన పెట్టిన సంచీలో నుండి బ్రెడ్ పేకెట్ అరటి ఆకులో కట్టిన పొట్లాలు బయటకు తీసాడు. ఆమె చేత్తో వద్దని వారించి నీళ్ళ సీసా తీసుకుని రెండు గుటకలు తాగి బ్రెడ్ పేకెట్ భర్త చేతికిచ్చి భిక్షుకుడి వంక చూపించింది. అది తీసుకుని అర్జునరావు బారికేడ్లు దాటబోతుండగా పోలీసు అడ్డుకున్నాడు.

“ఆ భిక్షగాడు ఆకలి అని అరుస్తున్నాడు. వాడికి ఇచ్చి వస్తానయ్యా”

అర్జునరావు చేతిలో బ్రెడ్ పేకేట్ తీసుకుని ముష్టివాడి వైపుకు గిరవాటు వేసి నువ్వు లోపలికి పో అన్నట్టు చూసాడు. ముష్టి వాడికి అందకుండా పడిన బ్రెడ్ పేకెట్ ని కుక్క ఒకటి వచ్చి నోట కరుచుకుని అవతలకి పోబోయింది. ఆకలితో మండిపోతున్న ముష్టివాడు తన పక్కన వున్న కర్రతో కుక్కను గట్టిగా కొట్టాడు. అది కుయ్యో మని అరుచుకుంటూ అవతలకు పోయింది. చేతులతో డేకుతూ పోయి బ్రెడ్ పాకెట్ ని అందుకుని గబగబా మూడొంతులు పైనే తినేసాడు. ఆకలితో అలమటించి పోయాడు పాపం! ఆ డబ్బు దండుకు పోయిన వాడు ఏమయ్యాడో! ఆలోచిస్తున్నాడు అర్జునరావు.

సుభద్ర పదే పదే మొబైల్ చూసుకుంటుంది.
కొడుకు కూతురు ఇద్దరూ ఈ రోజు కలుసుకుంటారు. రెండు రోజులు ఇద్దరూ కలిసి ఇష్టమైన వంటలు చేసుకుంటూ తమతో మాట్లాడుతూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూ సరదాగా ఉంటారు. తామందరూ ఒకేచోట వున్నట్టు ఆనందం వ్యక్తం చేసుకుంటూ లోపలి బెంగలను మర్చిపోతారు. కూతురు పూజ అమెరికా వెళతానంటే వద్దని అనలేదు. అదే బాటలో కొడుకు వెళ్తానని అంటే ఇద్దరూ వొప్పుకోలేదు. అర్జునరావు గట్టిగానే చెప్పాడు..

“ఒరేయ్ అవినాష్! ఐదు తరాల నుండి ఈ లంకల్లోనే పడి బతుకుతున్నాం. పాడి పైరు వేటికి కొదవలేదు. మా నాన్నకు ఐదురుగురు సంతానం. అందరం మోకాళ్ళ లోతు బురదలో నడుచుకుంటూ పోయి పడవెక్కి రోడ్డెక్కి పోయి చదువుకున్నాం. కూటికి గుడ్డకి ఆరోగ్యానికి అన్నింటికీ బాగానే వున్నాం. మీ కాలానికి బండ్లు వచ్చే, బైకులొచ్చే, కారులొచ్చే, ఆఖరికి బస్ లు కూడా వచ్చే. నీకు ఉద్యోగం హైదరాబాద్ కాకపోతే చెన్నయ్, బెంగుళూరు లైనా వచ్చే.. ఈడనే వుండరా” అని బతిమాలాడు.

వినలేదు కొడుకు. ఏవో పరీక్షలు రాసి అమెరికా యూనివర్సిటీ లో సీటు తెచ్చుకున్నాడు. నువ్వేం డబ్బులు ఇవ్వవద్దు నేను లోను పెట్టుకుంటాను అన్నాడు. లోను రాకూడదు అని మొక్కుకుంది అట్లా అయినా ఆగిపోతాడని. లోను కూడా ఇచ్చారు. విమానం ఎక్కాడు అవినాష్.

పోయినేడు ముంపు వచ్చినప్పుడు వచ్చాడు. “నాన్నా! నువ్వీ దండగ మారి వ్యవసాయం మానమంటే మానవు. నా చదువు పూర్తై ఉద్యోగం వచ్చాక నువ్వు వ్యవసాయం మానేయ్. తెనాలి లో ఇల్లు తీసుకుని అమ్మ నువ్వు హాయిగా వుందురుగాని” అని పదేపదే చెప్పాడు.

పశువులు కాడ చేసి చేసి విసుగొస్తుంది ఓపిక సన్నగిల్లింది సుభద్రకి . అవినాష్ కి ఉద్యోగం రాగానే పూజకి పెళ్ళి చేసేయాలి అని తను అంటుంటే.. ఆడపిల్ల భర్త ఎక్కడ ఉంటే అక్కడుంటుంది. కొడుకు మాత్రం ఊరి పట్టునే వుండాలి. ఏం!? మన అమరావతి లో ఆడికి ఆ మాత్రం ఉద్యోగం రాకపోద్దా? అంటాడు భర్త.

“ఆ రోజులు వస్తే నేను వచ్చేస్తానులే నాన్నా! ముందు రానీయ్, రాకముందే నస పెట్టి చంపకు”అని విసుక్కున్నాడు.

“కడుపున పుట్టిన బిడ్డలిద్దరూ అమెరికాలో భవిష్యత్తు కోసం గొడ్డులా కష్టపడుతున్నారని
మీ నాన్నకు బాధ. పండగొస్తే ప్రతి ఇంటి ముందు కారు వుంటుంది ఇంటినిండా పిల్లాజెల్లా వుంటున్నారు. మనిల్లు వొక్కటే బోసిపోయి ఉంటుంది. ఏ తల్లిదండ్రులు మాత్రం కన్నబిడ్డలు పై గుబులు పడకుండా వుంటారు ? అని మందలించింది కొడుకుని.

“ఈసారి ఎప్పుడు వస్తానో చెప్పలేనమ్మా!. ట్రంప్ వస్తే అన్నీ మార్చేస్తాడు. అందుకే ఇప్పుడు ఎక్కువ రోజులు వుంటున్నా.” అన్నాడు ప్రేమగా హత్తుకుని. తల్లి తండ్రితో ఎన్నో సెల్ఫీలు తీసుకున్నాడు అవినాష్.

పోయినేడు ఇదే రోజున కొడుకు తనూ ఇట్టాగే అమ్మ వారి దర్శనానికి వచ్చారు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో! కన్నపేగు కదిలింది.” అమ్మా! బిడ్డలను చల్లగా చూడమ్మా” కొండ వైపు చూసి చేతులు జోడించింది.

భిక్షగాడు మళ్ళీ అరుస్తున్నాడు. అమ్మా ఆకలి అంటూ. చిల్లర ఇవ్వబోతే వద్దు పండో ఫలహారమో పెట్టమని అడుగుతున్నాడు. ఇదంతా సాధారణమే అన్నట్లుగా చూస్తున్నారు జనం. ఎవడి ఆకలి వాడిది. ఎవడి ఆశ వాడిది. గోవు యజమాని, పోలీస్ వాడు, భిక్షకుడు, పెద్దబొట్టు ధరించిన భక్తుడు, ఆఖరికి సుభద్ర ది కూడా! ఎండ పెళ్ళున్న కాస్తుంది. సుభద్ర కు తలనొప్పి మొదలైంది. ఏమిటో గుండెల్లో చెప్పలేని అలజడిగా వుంది.

బ్యారేజీ దగ్గర నుండి వినాయకుడి గుడి మధ్య వీధులవెంట తిరుగుతూనూ చెత్త కుండీల దగ్గర జేరి అక్కడ పోసిన కుళ్లిన ఆకు కాయగూరలు హోటళ్ళు నుండి వచ్చిన ఎంగిలి విస్తరాకులు తింటూ తిరిగే వీధి ఆవులమంద ఆ ముందు రోజు రాత్రి బారికేడ్ల అవతలకు వెళ్లి అక్కడ చిక్కుకొని వున్నాయి. మనుషులు అదుపు తప్పుతారని అతి జాగ్రత్తగా కాపలా కాస్తున్న పోలీసులు పారిశుద్ధ్య సిబ్బంది వాటిని పట్టించుకోవడం మానేసారు. రెండు రోజుల నుండి స్వేచ్ఛగా తిరిగే వీలులేక తిండి నీళ్ళు లేక బందీల దొడ్డిలో వున్న పశువుల్లా అవి కొంత దీనంగా మరికొంత అసహనంగా వున్నాయి. ఎటుచూసినా జనం. ఎర్ర రంగు దుస్తులు ధరించిన భక్తులు. వారి కేకలు చిడతలు మ్రోగిస్తూ డప్పు వాయిస్తూ పాటలు పాడుకుంటూ వాటి ప్రశాంతత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంటే ఊరుకుంటాయా.. ? వాటిల్లో వున్న ఓ గంగిగోవుకి పూనకం వచ్చింది. పక్కనే వున్న ఆవుని కుమ్మింది. అంబా అని అరిచిన ఆవు ఊరుకుంటుందా? ప్రతీకారం తీర్చుకుంది. ఆవులన్నీ చెల్లాచెదురు అయ్యాయి. పరిగెత్తుతూ బారికేడ్లను విరక్కొట్టుకుంటూ అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్నాయి..కంగారుపడిన కొంతమంది బారికేడ్లను దాటి రోడ్డు డివైడర్ ను దాటి అవతలికి వెళ్ళసాగారు.

భిక్షుకుడు కూడా ఎక్కడలేని ప్రాణ భయంతో చేతులతో చక్రాల పీటను తోసుకుంటూ ఆవులను మనుషులనూ తప్పించుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. సుభద్ర అర్జునరావు భయంగా ఒక పక్కకు వొదిగిపోయారు. కళ్ళెదురుగా దూరంగా పారిపోతున్న భికకుడి కళ్లలో మెదిలిన భయం అప్రమత్తత జీవనకాంక్షను తొట్రపాటుతో గమనిస్తూనే వీళ్ళు కూడా డివైడర్ ఎక్కి కూర్చున్నారు. అంతలోనే సుభద్ర ఫోన్ మోగుతోంది. మోగుతూనే వుంది. కొద్ది నిమిషాల్లోనే ఆవులమంద ని విడగొట్టి వంతెనపై నుండి అవతలకు తోలేస్తున్నారు. పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చింది.

“ఇంతలోనే ఎంత ఉపద్రవం వచ్చిపడింది!? ఏదో చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు జనం. ఇంకా నయం ఆవులు వాటిల్లో అవే కొట్లాడుకున్నాయి మనుషుల జోలికి రాకుండా”
అనుకుని హమ్మయ్య అని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

సుభద్ర తెప్పరిల్లింది.సంచీలో వున్న బ్యాగు తీసి ఫోన్ చేతిలోకి తీసుకుంది. తెల్లవారినప్పటి నుండి ఎదురు చూస్తున్న వీడియో కాల్ అది. ఆత్రంగా తెరిచింది. ఎదురుగా కన్నీరు కారుస్తూన్న కూతురు పూజ. ఏమైందమ్మా ! ఆందోళనగా అడిగింది. ఏడుపే కూతురు సమాధానం అయింది.

అర్జునరావు ఫోన్ తీసుకుని ఏమైందమ్మా.. బుజ్జమ్మా! తమ్ముడు నీదగ్గరికి వచ్చి వుండాడా? మనసులో ఏదో కీడు శంకిస్తూ వుండగా గాబరాగా అడిగాడు.
‘‘నాన్నా! తమ్ముడు, తమ్ముడూ’’ అంటూ చెప్పకుండా మళ్ళీ భోరుమంది.
‘‘ఏమైందమ్మా! చెప్పు తల్లీ! చెప్పకుండా ఏడిస్తే మేము ఏమి అనుకోవాలి. మీ అమ్మ పడిపోయేట్టు వుంది.’’
‘‘నాన్నా! గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తున్న తమ్ముడి పై గన్ పేలింది నాన్నా! తమ్ముడు చచ్చిపోయాడు నాన్నా! అరగంట క్రితం కాల్ చేసి నెక్స్ట్ డ్యూటీ కి రావాల్సిన అబ్బాయి ఇంకా రాలేదు. వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందేమో అన్నాడు నాన్నా! ఇంతలోనే ఇలా!’’ గట్టిగా ఏడుస్తుంది. ఆ మాటలు వింటున్న సుభద్రకి స్పృహ తప్పింది.

‘‘అయ్యో! దేవుడా.. మేము ఏమి అపకారం చేసామని ఈ శిక్ష వేసావ్ తండ్రీ!’’ గొల్లున ఏడుస్తూ గుండె పట్టుకున్నాడు అర్జునరావు.

ఎక్కడో వస్తుందనుకున్న తుఫాను దుఃఖపు తుఫానులా భార్యాభర్తలిద్దరిని ముంచెత్తింది. కన్నీరుమున్నీరవుతూనే భార్య ను వొడిలోకి తీసుకుని ముఖాన నీళ్ళు చిలకరిస్తున్నాడు.

‘‘సుభద్రా! నేను వద్దంటే విన్నావటే! పిల్లల ఇష్టప్రకారం పోవాలి అంటివి. ఇప్పుడు చూడు ఏమైందో! ఒరే అవినాష్! బిడ్డా! అమెరికాకి పోవద్దంటే కాదు, పోవాలంటివి. అటు నుండి అటు గానే పోయినవా బిడ్డా! మా కడుపున ఇంత దుఃఖం పెట్టి పోయినావా కొడుకా!’’ గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు.

చుట్టూ జనం చుట్టుకున్నారు. అయ్యో పాపం! అని విచారపడ్డారు. ఆ దేశంలో ఇట్టా జరుగుతున్నా కూడా ఆశపోతు తల్లిదండ్రులు పంపుతూనే వున్నారని కొందరు యెగతాళిగా వ్యాఖ్యానించారు. “ఆ!! మరణం ముందు చెప్పి వస్తుందా? ఇంట్లో వున్నా ముంచుకొస్తుంది. అట్టా జరగాలని వుంది జరిగింది” వైరాగ్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగిపోయారు కొందరు. సుభద్ర కళ్ళు తెరవడం లేదు. పోలీసులు అంబులెన్స్ పిలిపించారు. అది భార్యభర్తను ఎక్కించుకుని హాస్పిటల్ వైపు దూసుకువెళుతుంది.

తమ జీవితాన్ని అతలాకుతలం చేసిన ఆ భయంకర సంఘటన ఎలా జరిగివుంటుందో ఊహించుకున్నాడు అర్జునరావు. చికాగో లో అర్ధరాత్రి సమయం. గ్యాస్ స్టేషన్ లో అవినాష్ ఎదురుగా నిలబడిన నల్ల జాతీయుడు. మాట్లాడుతూ మాట్లాడుతూనే గన్ తీస్తే ఏం జరుగుతుందో అని ఊహించేలోగానే గుండెలోకి దూసుకుపోయిన బుల్లెట్. ఆ క్షణంలో కొడుకు కళ్ళల్లో కదలాడిన ప్రాణభీతి.ఇందాక భిక్షగాడి కళ్ళలో కనబడిన ప్రాణభీతి వొకటే! ప్రాణం అంటే తీపి లేనిది ఎవరికీ? ఏ మాత్రం అవకాశం చిక్కినా ప్రాణం కాపాడుకోవడానికే ప్రయత్నిస్తారు. ఎంత దురదృష్టవంతుడు తమ కొడుకు!!

ఇప్పుడు భార్య స్థితి ఏమిటి? భయంతో భార్య వైపు చూసాడు. ఆమె కొద్దిగా కదిలింది.
ఆందోళన పడ్డవద్దని నర్స్ దైర్యం చెప్పింది. కాసేపటికి చిన్నగా కళ్ళు తెరిచింది సుభద్ర. ఇద్దరి కళ్ళనుండి ధారగా కారిపోతున్న నీళ్ళు. ఆమెను తానెలా ఓదార్చ గలడో అన్నది అర్థం కాక అయోమయంగా చూస్తూ ఏటిదాపున పుట్టి పెరిగిన తన అనుభవంతో
గొణుకున్నాడు అర్జునరావు.

‘‘హంసలు తాము తిరగాలనుకున్న తావుల్లో వలస పక్షులను, కొంగలను కాలూననివ్వవు. పొడిచి పొడిచి తరుముతాయి, చంపుతాయి.’’

** **

రచయిత, కవి, బ్లాగర్. స్టోరీ టెల్లర్. పాతికేళ్ళగా కవిత్వం కథలు రాస్తున్నారు. సాహిత్య వ్యాసాలు, అనేక సమీక్షలు రాసారు. “వెలుతురు బాకు” కవితా సంపుటి “రాయికి నోరొస్తే”, “కుల వృక్షం”, “ఈస్తటిక్ సెన్స్”, “దుఃఖపు రంగు” కథా సంపుటాలు వెలువరించారు. రచయిత కథలపై ఇద్దరు phd విద్యార్థులు పత్ర సమర్పణ చేసారు. తన రచనలు, వ్యాసాలు, కవిత్వం అంతా https://vanajavanamli.blogspot.comలో భద్రపరిచారు. @VanajaTatineni YouTube channel నిర్వహిస్తున్నారు.

Leave a Reply