స్వీయ అస్తిత్వ ఆవిష్కరణ నుంచి మూలాల అన్వేషణ వరకు

పాఠకుల పఠనానుభవం రచయిత రచనానుభవం కలిసే ఉమ్మడి క్షేత్రం వొకటి సాహిత్య తలంలో వుంటుంది. అక్కడ రచయితా పఠితా వొకరికొకరు సన్నిహితమౌతారు. సామీప్యాన్ని అనుభూతి చెందుతారు. భావాలు వినిమయం చేసుకుంటారు. దృక్పథాల్ని పంచుకుంటారు. ఒకరి మనస్సుని మరొకరు స్పృశిస్తారు. రచన మాధ్యమంగా వొక సంభాషణకు పూనుకుంటారు. ఒక చైతన్య ధార వొకరి నుంచి మరొకరికి ప్రవహిస్తుంది. నిజానికి రచన యేదైనా రచయిత తన పాఠకులతో యెదురెదురుగా కూర్చుని చేసే సంభాషణే. కాల్పనిక సాహిత్యంలో ఆ సంభాషణ సంవాదంగానో ప్రవచనంగానో మారకుండా దాన్ని కళాత్మక వ్యక్తీకరణగా రూపొందించటంలో రచయిత అనేక వ్యూహాలతో ముందుకు రావడం చూస్తాం. అదే ఆ రచనలో శిల్పంగా భాసిస్తుంది. ఆ యా స్థల కాలాలకు లోబడి పాఠకులకు చేరువ కావడానికి రచయిత యెంచుకుని నిర్మించుకునే సాధనం అది. నిర్దిష్ట జీవిత అనుభవాల్ని సాధారణీకరించడం ద్వారా వాస్తవాన్ని కాల్పనీకరించడం ద్వారా పాఠకుల్ని రచనలో తాదాత్మ్యం చేసే రస విద్య అది. దాని రహస్యం తెలుసుకోడానికి చేసే ప్రయత్నం నిరంతరం జరుగుతూనే వుంటుంది.

*

“మీ టూ” కథా సంకలనంలో ఉమా నూతక్కి ‘మిట్ట మధ్యాహ్నం నీడ’ కథ వచ్చినప్పుడు దాని నిర్మాణంలో చూపిన నైపుణ్యంతో పాటు వ్యక్తీకరణలో వినిపించిన విలక్షణమైన కంఠస్వరం చాలా మందిని ఆకట్టుకుంది. అది బాధిత స్వరం కూడా కావడంతో చదువరుల్ని వుద్వేగానికి గురిచేసింది. ఆ గొంతుక సొంతదారు తానే అని చెప్పడానికి రచయిత యెక్కడా సంకోచించలేదు. అది ఆమె రాసిన రెండో కథే (తొలి కథ ‘శిశిర’ సారంగ – 2019) గానీ అప్పటికే సామాజిక మాధ్యమంలో చెప్పే mahimusings, భూమికలో రాస్తున్న మంకెన పువ్వు కాలమ్, ఉమా మహేశ్వరి పేరుతో చేసిన పుస్తక సమీక్షల ద్వారా వాటిలోని శైలి ద్వారా వ్యక్తం చేసిన భావాలద్వారా రచయితగా తనకొక ప్రత్యేకమైన గుర్తింపు పొంది వున్నారు. voracious reader గా విస్తృతమైన పఠనానుభవాన్ని/అధ్యయన ఫలాన్ని ఆమె సృజనాత్మక సాహిత్యానికి అన్వయించడం వల్ల నిర్మాణపరంగా కథ చిక్కగా తయారైందని నాకనిపించింది. బాల్యంలోనో కౌమార దశలోనో లైంగికంగా యెదుర్కొన్న చేదు అనుభవాన్ని పొరలు పొరలుగా రివీల్ చేసిన పద్ధతి అబ్బురపరిచింది. తొలుత పీడ కల రూపంలోనూ తర్వాత యెదురింటి పాప పాత్ర నెపంతోనూ ఆ తర్వాత భర్తకి అందివ్వకుండా చించేసిన వుత్తరం ద్వారా చివరికి ఫ్యామిలీ కౌన్సిలర్ లాంటి అమ్మమ్మ ముఖతా ప్రత్యక్షంగానూ భిన్న సందర్భాల్లో గతాన్ని చెప్పడం దగ్గర ఆగిపోకుండా పాత్రల వర్తనకి కొంత మనోవైజ్ఞానిక స్పర్శని జోడించడంతో కథ విశిష్టంగా రూపొందింది. ‘తులిప్ తోటలా తుళ్ళి పడాల్సిన చిన్నారి మిథునలు యెందరో దేశంలో ప్రతి గంటకీ మూర్ఛ, హిస్టీరియా వంటి జబ్బుల పాలవుతున్నారు. పిచ్చాసుపత్రుల్లో మగ్గిపోతున్నారు. నేరం లేకుండానే శిక్షలు భరిస్తూ, ఆయాచిత పాపాలు మోస్తూ, మొండిగా, బండగా, మనుషుల్ని ద్వేషించే వాళ్లుగా అయిపోతున్నారు’ (మిట్ట మధ్యాన్నపు నీడ) అని స్వీయానుభవాన్ని సాధారణీకరించడంతో కథ సామాజిక ప్రయోజనాన్ని సాధించినట్లైంది.

అప్పట్నుంచీ ఉమా నూతక్కి స్వాంతం నుంచి వెలువడే కథ కోసం యెదురుచూసి దాదాపు పబ్లిష్ అయిన ప్రతి కథా చదివినప్పటికీ ఆమె యిప్పటివరకూ రాసిన డజను కథల్నీ యింత తొందరగా వొకచోట యిలా ముందేసుకుని తేరిపారా చూస్తానని అనుకోలేదు. ఇంటా బయటా అనునిత్యం స్త్రీలు యెదుర్కొంటున్న అనేక సమస్యలకీ కుటుంబంలో సమాజంలో పాతుకుపోయిన సాంస్కృతిక విలువలకీ మధ్య వున్న దుర్మార్గమైన క్రూరమైన సంబంధాన్ని అదిమిపెట్టుకున్న క్రోధంతో అతి సున్నితంగా ఆవిష్కరించిన ఉమా కథ చెప్పే తీరు అబ్బూరి ఛాయాదేవి పి. సత్యవతి గార్ల శైలిని గుర్తు చేసింది. చాలా గంభీరమైన విషయాన్ని కూడా సున్నితంగా మృదువుగా చెప్పటం ఆమె తత్వం అనిపించింది. అయితే సున్నితంగానే వుండడానికి ఆమె ఘర్షణకు లోనౌతున్నట్టుగా కూడా వాక్యాల మధ్య కనిపించింది.

ఒక కథని కన్సీవ్ చేయడానికి ‘లోపల… లోలోపలే కుప్పలు పడిపోయి వున్న ఎన్నో పదాలని గొంతు దాటి రాకుండా లోనికి తోయడానికి చేసే యుద్ధంలో’ (హుక్) యెంతో వేదన అనుభవిస్తున్నట్టు తోచింది. ఆ వేదననంతటినీ ఆమె తన పాత్రల అంతరంగ మథనం ద్వారానో శోధన ద్వారానో వెలిబుచ్చి బరువు దించుకుంటున్నట్టు కూడా అనిపించింది. కథంటే వేదనకి పర్యాయ పదమూ దాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నమే కదా! ‘నొప్పి ఫీల్ అయ్యే తీరిక లేదు. ఏడిచే తీరుబడి అంతకన్నా లేదు. గట్టిగా ఊపిరి పీల్చి, బాధ తొక్కి పెట్టి’ చెప్పిన కథలివి. ఆ ఫీల్ ని తన పాఠకులకు కన్వే చేయడంలో రచయితగా ఆమె సక్సెస్ అయ్యారనే భావిస్తాను.

తొలి కథల్లో కథల చివర పాత్రలద్వారా స్త్రీల శారీరక, మానసిక ఆరోగ్యానికి మహా హానికరమైన – బంధాల్లా కనిపించే – బండగొలుసుల గురించి, రెక్కలు నరికి కట్టడి చేసే రాజకీయాల గురించి వాచ్యంగా చెప్పినప్పటికీ తర్వాతి కాలంలో రచయిత ఆశయాన్ని ప్రతీకాత్మకంగా అంతర్లీనంగా వ్యక్తం చేయడం గమనిస్తే కథా శిల్పం పట్ల ఉమా చూపిన అప్రమత్తతని అర్థం చేసుకోగలం. ‘నీడ తొక్కిన ఆట’ లో ప్రధాన పాత్రలైన మహి గౌరీల ముఖతా కథ నడిపి చివరికి రచయిత చెప్పాల్సిన కథనాన్ని తాను చొరబడకుండా పుష్ప నోటి ద్వారా చెప్పించే కాన్షియస్ ఎఫర్ట్ అందుకు మంచి వుదాహరణగా కనిపిస్తుంది.
ఉమా కథల్లో స్త్రీలు భద్ర జీవితాల్లో వున్నట్టు కనిపిస్తున్నప్పటికీ తీరని అశాంతితో వేగిపోతూ వుంటారు. ఆ అశాంతి కథ నుంచి కథలోకి జాలువారి అంతటా అలుముకొని వుంటుంది. వాటిలోని అంతస్సూత్రం వల్ల ఆమె వొకే కథని రాస్తున్నారా అని కూడా అనిపిస్తుంది. ‘హుక్’,‘25వ గంట’, ‘Block the Life’, ‘నిర్జన’ – యీ కథలన్నీ ఒకదానికి మరొకటి కొనసాగింపో ఎక్స్టెన్షనో అనిపిస్తాయి. అన్ని చోట్లా ప్రధానపాత్ర ‘నేను’ గానీ ‘ఆమె’ గానీ అనేక నామవాచకాలకు సర్వనామాలే. ఆత్మాశ్రయ కథనాన్నే థర్డ్ పర్సన్ నెరేషన్ లోకి మార్చిన టెక్నిక్ యీ కథలకీ బాగా నప్పింది. ఇంటా బయటా విరామం లేని పనులతో రుద్దిన విలువల కోసమో గుర్తింపు కోసమో మెప్పు కోసమో గొప్ప కోసమో నిరూపించుకోవడం కోసమో కెరీర్ కోసమో తమను తాము కోల్పోయిన ‘ఆమె’లు తాము కోల్పోయిందేంటో తెలుసుకుని దాన్ని పొందడానికి పూనుకునే దిశగా కథలు ముగియడం (వత్తిడికి గురిచేసి గాయపరుస్తున్న బంధాలు, బంధనాల నుంచి కూసింత విముక్తి పొందాలన్న ఆలోచన వచ్చాక నెప్పి తగ్గుతుందన్న ధైర్యంతో – హుక్, మూలాలు అర్థం అవుతున్న అవగాహనతో- 25వ గంట, తను దుఃఖించడానికి కారణం ఏమన్నా ఉండి ఉంటుందా? అన్న ప్రశ్నతో – నిర్జన) గమనించండి: స్వీయ అస్తిత్వ ఆవిష్కరణ నుంచి మూలాల అన్వేషణ వరకూ చేస్తున్న ప్రయాణం యీ కథల్లో స్పష్టంగా కనిపిస్తుంది. వస్తు – రూపాలు రెండింటిలోనూ రచయితగా ఉమా నూతక్కి సాధించిన విస్తృతి యిది. ఆ విస్తృతిలోనే ఆమె సాధించిన వొక పరిణతి కూడా గోచరమవుతుంది.

ఉమ కథల్లోని మార్దవత్వం కారణంగా తిరుగుబాటు కన్నా పెనుగులాట యెక్కువ కనిపిస్తుంది. అది సాధారణంగా వుద్వేగ భరితంగా ఉంటుంది. ఆ వుద్వేగమే పాఠకుల్ని కథకు దగ్గర చేస్తుంది. మనుషుల మధ్య వుండాల్సిన మానవీయ సంవేదనల్ని మేల్కొల్పడమే రచయిత వుద్దేశం. పెనుగులాట కూడా ధిక్కారమే, చిన్నపాటి నిరసన కూడా పోరాట రూపమే అన్న స్పృహతో రాసిన కథలివి. తన రచనల ద్వారా సంస్కారవంతమైన వొక సమాజాన్ని ఆమె ఆశిస్తున్నట్లు ప్రతి కథా తెలియజేస్తుంది.

అయితే ఆధునిక మహిళ తనకు తాను పరాయి కావడమే గాక తక్కిన ప్రపంచం నుంచి కూడా ఐసొలేట్ అవుతున్న క్రమాన్ని రచయిత గుర్తించింది. ఆమె యిప్పుడు రెండు యుద్ధాలు చేయాలి. తనని తాను నిర్మించుకోవాలి. బయటి ప్రపంచంతో తన సంబంధాన్ని నిర్వచించుకోవాలి. ఈ రెండూ ఘర్షణ పూరితమైనవే. అలవోకగా సాధించేవి కావు. ఎక్కువ కథల్లో వుద్యోగినిలుగా ఆర్ధిక స్వావలంబన అనుభవిస్తున్నామనుకునే స్త్రీలు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు దూరమై లోపలి ముడుచుకుపోయే నిస్సహాయ స్థితిని ఉమా దగ్గరగా గమనించారు. ఇల్లూ ఆఫీసూ 24 గంటల పని వొత్తిడిలో తన కోసం తన సాహిత్యాభిరుచుల కోసం తన ఆరోగ్యం కోసం సొంత space కోసం వొక్క గంట కూడా కేటాయించుకోలేని దుస్థితిని ‘25వ గంట’ గా చిత్రిస్తే సాహిత్య వ్యాసంగం ద్వారా బయటి ప్రపంచంతో యేర్పడ్డ ఇంటరాక్షన్ కేవలం స్త్రీ అయినా కారణంగా జుగుప్సాపూరితంగా అసహ్యకరమైన ట్రోలింగ్ గా పరిణమించిన వైనాన్ని Block The Life లో బలంగా వర్ణించారు. ఆడవాళ్లు పబ్లిక్ లోకి రావడమే వాళ్ళు చేస్తున్న పాపం అన్నట్టు ప్రవర్తించే వ్యవస్థలన్నిటినీ ఆమె ఆ కథలో గుండె లోపలి నుంచి ద్వేషించింది.

కట్టే కట్టు మార్చాలి… పెట్టుకునే బొట్టు మార్చాలి…నడిచే తీరు మార్చాలి… నలుగురిలో నవ్వే నవ్వు మార్చాలి… ఫోన్ నంబర్ మార్చాలి…’ అని అంటుంటే ఎన్నని మార్చుకుంటూ వెళ్ళగలం.’
ఈ మాటలు చట్ట సభల్లో, న్యాయ పీఠాలపై కూర్చొని స్త్రీని కట్టడి చేసే మనువాదుల్ని వుద్దేశించి చేసింది కూడా అనుకున్నప్పుడు ఆమె ఆగ్రహంలోని సామంజస్యం అర్థమౌతుంది.
రచయిత స్వీయ అనుభవ పరిధిని అధిగమించి కొత్త వస్తువుల్ని కొత్త టెక్నిక్ తో కథీకరించే నైపుణ్యం రచనానుభవ – పఠనానుభవాల మేలు కలయిక ద్వారా సాధ్యమని – విలువలని మనం నమ్మినవి వేరే వాళ్ళకి మూసలని తోచవచ్చనీ భద్రమని మనం కోరే బతుకు యితరులకి బందిఖానాలా అనిపించవచ్చనీ గట్టిగా చరిచి తెలియజెప్పిన ‘వాన మబ్బుల కాలం’, బయటి ప్రపంచంతో సంబంధం కోల్పోవడం ద్వారా తన వునికినే కోల్పోతున్న మహిళ మనో వేదనని తాత్వికంగా ఆలోచనాత్మకంగా వెల్లడించిన ‘నిర్జన’, ఆశయాలకీ ఆరాటాలకీ ఆకలికీ అనైతకతకీ అవసరాలకీ ఆత్మాభిమానానికీ సహజాతానికీ సానుభూతికి ప్రేమకీ కోరికకీ మధ్య గీతల్ని కొత్తగా నిర్వచించిన ‘అవ్యక్తం’ దేహంతో మనసుతో అయిన వాళ్ళతో బయట సమాజంతో యుద్ధాలు చేస్తూ సొంత వ్యక్తిత్వం కోల్పోని మహేష్ అనబడే మహి ఆత్మ గౌరవాన్ని ఆవిష్కరించిన ‘నిశ్శబ్ద స్వరం’ కథల్ని లోతుగా చూసినప్పుడు మరోసారి రుజువౌతుంది…

*

ఉమా కథలన్నీ వొకచోట చూసినప్పుడు వాటి సారమంతా ఆమె బయటికీ లోపలికీ చేస్తున్న ప్రయాణంలా గోచరిస్తుంది. అయితే ఆ ప్రయాణంలో ఆమె రెండు అడుగులు బయటికీ నాలుగు అడుగులు లోపలికీ వేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆమె దృష్టి పరిసరాల మీద కంటే లోపలికి యెక్కువ ప్రసరిస్తుంది. ఆమె స్వరంలో బాహిర శబ్దాల కంటే లోపలి అలజడి యెక్కువ వినిపిస్తుంది. అంతర్లోకంలో చోటుచేసుకునే ఆ అలజడికి కారణాల్ని బయటి ప్రపంచంలో వెతుక్కోవాల్సి వుంటుంది. అందుకు ఆమె పాత్రలు పరోక్షంగా దోహదం చేస్తాయి. ఒక్కోసారి ప్రయత్నపూర్వకంగా చేయి పట్టుకుని లాక్కెళతాయి. మిథున మయూర శిశిర మహి … వీళ్ళ మానసిక ప్రపంచాన్ని శాసించే గడప లోపలి శక్తులేవి వాటిని నిర్వచించి నిర్ధారించే గడప బయటి సామాజిక ప్రమేయాలేవి సాంస్కృతిక విలువలేవి అని విడివిడిగా చూడలేం. వ్యక్తుల చుట్టూ పాతిన విలువల కంచెలు యెన్నో. అయితే వాటిలో కొన్ని స్వయంగా నిర్మించుకున్నవి కూడా. ముందుగా మనకు మనం తగిలించుకున్న సంకెళ్లు తెంచుకోవాలనే ఆలోచన కావాలి. వాటిని ఛేదించాలనే పూనిక యీ కథల్లో కనిపిస్తున్నప్పటికీ అది యింకా బలపడాల్సి వుంది. ముడుచుకున్న రెక్కలను విదుల్చుకునే ప్రయత్నం మొదలైంది. ఇక ఆకాశంలోకి స్వేచ్ఛగా యెగరడమే తరువాయి. అటువంటి స్వాతంత్ర్యమే రచయితగా ఉమా నూతక్కి కోరుకుంటుందని యీ కథాసంపుటి నిరూపిస్తుంది. బాహ్యావరణంలోని అనేక దృగంశాలు రచయిత లోపలి ఆవరణలోకి ప్రవేశించి కథగా పరిక్షేపం చెందే ప్రక్రియని అధ్యయనం చేసినప్పుడు ఉమా యెంచుకున్న సంఘర్షణ పూరితమైన మనోవిశ్లేషణాత్మక శైలి వెనక వున్న సామాజిక నేపథ్యం అవగతమౌతుంది. వాస్తవ జీవితానుభవాన్నుంచి దూరం జరిగే సాహిత్యం కాలానికి యెదురెక్కి నిలబడలేదు అన్న స్పష్టమైన యెరుకతో రాసిన కథలివి.

*

సాహిత్యంలో వివక్షతలకు అసమానతలకు వ్యతిరేకంగా విచ్చుకునే కొత్త గొంతుకలని వినిపించాలనే బాధ్యతలో భాగంగా ప ర్ స్పె క్టి వ్స్ ఉమా నూతక్కి కథల్ని అందిస్తోంది. ఇది ఆమె తొలి కథల సంపుటి. ఆధునిక స్త్రీ మనోభావాలకు అద్దంపట్టే అచ్చమైన సమకాలీన కథలివి. కొత్త తరం ఆలోచనల ప్రాతినిధ్య వాచకాన్ని పాఠకులు వీటిలో చూడొచ్చు. ఉమా చెప్పిన కథల కంటే చెప్పకుండా వున్న కథలే యెక్కువ. ఇక్కడ నేనీ నాలుగు మాటలు రాస్తున్న సందర్భంలో ఆమె తన యింటి ముంగిట రంగు రంగుల చుక్కల ముగ్గులు చెక్కి యే గొబ్బి పాటలు పాడుతూనో బలిచక్రవర్తిని ఆహ్వానిస్తూ వుండొచ్చు. వామనుడి మూడో పాదపు ఆధిపత్యం కింద అధిక పాతాళానికి నెట్టబడ్ద అనేక సమూహాల వేదనని ఆమె తన రాబోయే కథల్లో అక్షరీకరిస్తారని ఆశిస్తూ …

  • హైదరాబాద్,
    15 జనవరి 2023,
    టీమ్ పర్‌స్పెక్టివ్స్

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

Leave a Reply