మానవ హక్కుల జయకేతనం: స్వామి అగ్నివేశ్

వేపా శ్యాం రావు అంటే ఎంతమందికి తెలుసు? ఎవరో తెలుగు పెద్దాయన అంటారు. ఒక మామూలు పేరు. అదే స్వామి అగ్నివేశ్ అనండి. ఆ పేరులోని వేడికి, ఆ శబ్దంలోని నిప్పుకి సెగ తగిలినట్లు ఉలిక్కిపడతారు. స్వామి అగ్నివేశ్ గా మారిన శ్యాం రావు చివరివరకు ఆ నిప్పుని తనలో అలా భద్రంగా దాచుకున్నాడు.

చాలా కొద్దిమంది మాత్రమే తమ జీవితం కన్నా పెద్ద ప్రొఫైల్ కలిగివుంటారు. అది వారి అనన్య సామాన్యమైన వ్యక్తిత్వం వల్లనే సాధ్యమవుతుంది. స్వామి అగ్నివేశ్ ఖచ్చితంగా అటువంటి వ్యక్తుల జాబితాలోకి చేరతారు. వారు తాము విశ్వసించిన భావజాలానికి మించి ఎదుగుతారు. సమాజం మీద తమ భావజాలాల్ని రుద్దటం కన్నా తక్షణంగానూ, శాశ్వతంగానూ సమాజానికి ఏది చేస్తే మంచిదనే ఆరాటంలో వుంటారు. వారి ఆరాటమే వారిని గొప్ప పోరాటశీలురుగా రూపొందిస్తుంది. నల్లవారి హక్కుల కోసం నిరంతరం పోరాడి హత్యకి గురైన మార్టిన్ లూథర్ కింగ్, ఇటలీ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడి ఉరికంబం మీద అమరుడైన ఒమర్ ముక్తర్ వంటి వారి కోవలోకి అగ్నివేశ్ కూడా వస్తారు. అలాంటి వారికి అగ్నివేశ్ కి వున్న వ్యత్యాసమల్లా వారు శత్రువుల చేతిలో హతమైతే ఈయన అనారోగ్యంతో మొన్న సెప్టెంబర్ 11న మరణించారు. అయినప్పటికీ ఈయన ఎన్నో సార్లు తన ప్రాణాల్ని రిస్కులో పెట్టాడు.

ఆయన పుట్టుకరీత్యా తెలుగువాడన్న ఒక్క విషయం తప్పిస్తే నిజానికి బతికున్నప్పుడు ఆయన వ్యక్తిగత విషయాలు బైట ప్రపంచానికి పెద్దగా తెలియదు. 21 సెప్టెంబర్, 1939న శ్రీకాకుళంలో పుట్టిన వేపా శ్యాం రావు నాలుగో ఏటనే తండ్రి మరణించటంతో ఇప్పటి చత్తిస్ గఢ్ ప్రాంతంలో వున్న సక్తి అనే సంస్థానంలో దివానుగా పనిచేస్తున్న తన మాతామహుడి ఇంటికి చెరాడు. వాళ్ల సంరక్షణలోనే ఉన్నత చదువులు చదివాడు. న్యాయ శాస్త్రం, వాణిజ్య శాస్త్రం చదివాడు. కలకత్తాలోని సెయింట్ జెవియర్స్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసాడు. తదనంతర కాలంలో సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టీస్ గా చేసిన సభ్యసాచి ముఖర్జీ దగ్గర జూనియర్ అడ్వొకేటుగా కూడా పనిచేసాడు. 1968లో ఆయన ఆర్యసమాజ్ లో చేరాడు. సరే! ఈ సమాచారంలో పెద్ద విశేషం ఏమీ లేదు. ఏ పరిణామాల వల్ల ఏ అనుభవాల వల్ల, ఏ అంతరంగిక కల్లోలం లేదా సంచలనం వల్ల శ్యాం రావు 1968లో ఆర్యసమాజ్ ద్వారా సన్యాసం స్వీకరించి స్వామి అగ్నివేశ్ గా మారాడో మనకి తెలియదు కానీ అక్కడి నుండి ఆయన ప్రయాణం మహోద్వేగభరితం. ఇక్కడ మనం ఆర్యసమాజ్ గురించి కొంత తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన ఆర్యసమాజంలో జీవితాంతం సభ్యుడిగా లేనప్పటికీ ఆ సిద్ధాంతాలు, తాత్వికతని మరణించే వరకు పాటించాడు.

వేదాలే మూలంగా కలిగినటువంటి “ఆర్య సమాజ్” స్వామి దయానంద సరస్వతిచే 1875లో స్థాపించబడినది. వేదాల్లో విగ్రహారాధనకి స్థానం లేదు. ఆర్యసమాజ్ భగవంతుడు ఒకడేనని, నిరాకారుడని చెబుతుంది. ఆర్య సమాజ్ ఏకేశ్వరోపాసనని విశ్వసిస్తుంది. వివిధ రకాల దేవుళ్ల పేరుతో అనేక రకాల పూజల్ని అంగీకరించదు. కేవలం వేదాల్లో వున్న యజ్ఞ యాగాది క్రతువుల్ని మాత్రమే ఆమోదిస్తుంది. వాళ్లకి రాముడు, కృష్ణుడు, శివుడు వంటి దేవతలుండరు. గుళ్లు, గోపురాలు, బ్రహ్మోత్సవాలు…. వేటినీ అంగీకరించరు. కుల, మత బేధాల్ని పాటించదు. హిందూ సంస్కృతిపై బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తుంది. అన్ని రకాల మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. స్త్రీ పురుష సమానత్వాన్ని కాంక్షిస్తుంది. ప్రస్తుత్వం హిందూ సంస్కృతిగా చెప్పబడుతున్న అనేక అంశాల్ని ఆర్య సమాజ్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. రామాయణ, మహాభారతాల వంటి ఇతిహాసాల కన్నా ముందు నెలకొన్న సమానత్వ వ్యవస్థని తిరిగి సమాజంలో సాధించాలని అభిలషిస్తుంది. ఆర్యసమాజ్ అవలంభించే సనాతన ధర్మం ఇప్పటి హిందూత్వ సంస్థలైన విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ కి పూర్తి విరుద్ధమైనవి. యువకులకి యోగాలోనూ, ఆత్మరక్షణ విద్యల్లోనూ తర్ఫీదునిచ్చేవారే. చంద్రశెఖర్ అజాద్, రాం ప్రసాద్ బిస్మిల్ వంటి స్వాతంత్ర్య పోరాటంలో అనేకమంది ఈ దళాల నుండి వచ్చినవారే. అజ్ఞానాన్ని, దారిద్ర్యాన్ని, అన్యాయాన్ని సమాజం నుండి రూపుమాపటానికి ఓ పది సూత్రాలను తయారు చేసింది. ఇందులో భాగంగా వాళ్లు విద్యకు పెద్ద పీట వేస్తారు. అంతర్జాతీయంగా ప్రముఖమైన దయానంద్ ఆంగ్లో వేదిక్ (డీఏవి) పబ్లిక్ స్కూళ్లు వీరి నిర్వహణలోనివే.

ఈ పై ఆదర్శాలనన్నింటినీ పుణికి పుచ్చుకున్న వ్యక్తి అగ్నివేశ్! నిజానికి ఆయన ఆర్యసమాజ్ పరిధిని దాటి చాలా దూరంగా వెళ్లాడు. ఆయన కార్యాచరణకి ఆకాశమే హద్దుగా మారింది. వ్యక్తిగతంగా సర్వసంగ పరిత్యాగి అయినప్పటికీ సామాజిక కళ్యాణం కోసం ఆయన ఏర్పరుచుకున్న రాజకీయ స్పృహ, ఇతర సాంఘీక కార్యకలాపాలు బహుశా ఆర్యసమాజ్ ధార్మిక పరిధిని దాటిపోయిన కారణంగా ఆయన ఆర్య సమాజ్ నుండి 1976లో బహిష్కరించబడ్డాడు. అప్పటికే ఆయన 1970లో ఆర్య సమాజ్ సిద్ధాంతాల ప్రాతిపదికన “ఆర్య సభ”అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. 1977లో హర్యానా ఎన్నికల్లో పోటీ చేసి విద్యా శాఖ మంత్రిగా కేబినెట్ హోదాలో పనిచేసాడు. ఆయన దృష్టి వెట్టి చాకిరీ నిర్మూలన మీదకి మళ్లింది. ఆయన మంత్రిగా వున్న కాలంలోనే “బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్” (బంధువా ముక్తి మోర్చా – బీ.ఎం.ఎం) ని స్థాపించాడు. అప్పటికి భారతదేశంలో వెట్టి చాకిరీ వ్యవస్థ బలంగా వుంది. (వెట్టి చాకిరీ అంటే భూస్వాముల దగ్గర తీసుకున్న అప్పుకి కుటుంబం మొత్తం వడ్డీ కింద ఆ భూస్వామి దగ్గర ఆజీవాంతం చాకిరీ చేయాల్సి వచ్చేది) ఢిల్లీ చుట్టుపక్కల వున్న వేలాదిమంది క్వారె కార్మికులు, ఇటుక బట్టీలు, కార్పెట్ తయారీ పరిశ్రమలలో కొనసాగుతున్న వెట్టి నుండి విముక్తి అయ్యారు ఆయన కృషి వల్ల. ఈ సందర్భంగా ఆయన మీద ఒక హత్యా నేరం కూడా మోపబడింది. అప్పటికి ఆయన మంత్రి పదవిని వదిలేసాడు. రెండుసార్లు అరెస్ట్ అయి 14 నెలలు జైల్లో గడిపాడు.

ఎక్కడ అన్యాయం మీద తిరుగుబాటు జరిగితే అక్కడ అగ్నివేశ్ ప్రత్యక్షమయ్యేవారు. ప్రతిఘటనా పోరాటాల్లో ముందు వరసలో నిలబడేవాడు. అప్పట్లో పీపుల్స్ వార్ నక్స్లలైట్స్ నిర్వహించిన “జగిత్యాల జైత్రయాత్ర”లో ఆయన అగ్రభాగాన నడిచాడు. పౌరహక్కుల ఉద్యమాల్లో కూడా ఆయన ముందున్నాడు. 19887లోనో, 1988లోనో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల ఉద్యమం నిర్వహించిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆ మీటింగ్ కి నేను కూడా హాజరయ్యాను. ఆయన ఒక అద్భుతమైన వక్త. పాలకుల నిర్లక్ష్యం మీద ఆయన నిప్పులు చెరిగాడు ఆ సభలో. మావోయిస్టులు పోలీసులకి మధ్య జరిగిన ఘర్షణల్లో అమాయక ఆదివాసీలు నలిగిపోవటాన్ని చూసిన ఆయన నక్సలైట్లతో చర్చలు జరపమని ప్రభుత్వాల మీద ఎన్నోసార్లు ఒత్తిడి తెచ్చాడు. మావోయిస్టులు ఐదుగురు పోలీసుల్ని చత్తీస్ ఘఢ్ రాష్ట్రంలో అపహరించినప్పుడు ఆయన మావోయిస్టులతో చర్చలు జరిపి వారి విడుదలకు సహకరించాడు. 2011లో మావోయిస్టుల చేతిలో ముగ్గురు పోలీసులు చనిపోయినప్పుడు పోలీసులు సృష్టించిన బీభత్సానికి వెరవక ఆ బీభత్సానికి గురైన ఆదివాసీ గ్రామాల్ని సందర్శించినప్పుడు ఆయన బృందం మీద దాడి జరిగింది.

అగ్నివేశ్ అంతర్జాతీయ స్థాయిలో మానవహక్కుల కోసం నినదించారు. జెనీవాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ప్రసంగించారు. 1987లో రూప్ కన్వర్ సతీ సహగమనం జరిగినప్పుడు సాంప్రదాయ బంధాల నుండి స్త్రీల విముక్తిని ప్రభోదిస్తూ ఆయన దేశమంతా సంచరించారు. అలాగే 2005లో రెండువారాల పాటు బాలికా భ్రూణ హత్యకి వ్యతిరేకంగా కూడా దేశమంతా ప్రచారం చేసారు. ఆయనలో గొప్ప ప్రజాస్వామికవాది వున్నాడు. కొన్ని ఇస్లామిక్ గ్రూప్స్ నిర్వహించిన ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ కాన్ ఫరెన్స్ కి హాజరైన ఆయన మైనారిటీల మీద దాడిని ఖండిస్తూ వారి మానవహక్కుల కోసమెలుగెత్తాడు. కొంతమంది ఇస్లామిక్ తీవ్రవాదుల ఇస్లాం ని విశ్వసించే వారందిరినీ బాధ్యుల్ని చేయటాన్ని ఆయన నిరసించాడు. ఆ సభలో అమెరికాని మించిన ఉగ్రవాది ఎవరూ లేరని అన్నారు. ఆయన గిరిజనులు, ఇతర బడుగు వర్గాల హక్కుల కోసం జరిగిన అనేక ర్యాలీల్లో పాల్గొన్నారు. జార్ఖండ్ లో జరిగిన ఒక ర్యాలీలో ఆయనని హత్య చేసేందుకు జరిగిన దాడి నుండి స్థానికుల సహాయంతో కొద్దిలో తప్పించుకున్నారు. 2018 సెప్టెంబర్లో గౌరీ లంకేష్ హత్యకు నిరసనగా ఆమె వర్ధంతి రోజున బెంగుళూరులో జరిగిన “ఛలో రాజ్ భవన్”కి నాయకత్వం వహించాడు.

ఇతర మతస్తులకి హిందూ ఆలయ ప్రవేశాన్ని నిరాకరించటాన్ని ఆయన నిరసించాడు. 2005లో పూరీ జగన్నాథ్ ఆలయంలోకి ఇతర మతస్తులని అనుమతించాలని ఆయన డిమాండ్ చేసినప్పుడు అక్కడి పూజారులు పెద్దెత్తున నిరసన తెలియచేసారు. అమర్ నాథ్ లో వున్న మంచు శివలింగం కేవలం ఒక మంచు గడ్డ అని అన్నందుకు హిందుత్వ వాదులు ఆయన దిష్టిబొమ్మని తగలబెట్టారు. హిందూ జాతీయవాద రాజకీయ పార్టీ ఐన “హిందూ జాతీయ మహాసభ” ఆయన్ని చంపినవారికి రెండు మిలియన్ల రూపాయిలని బహుమతిగా ప్రకటించింది. ఇవన్నీ ఆయనలోని సనాతన హిందూ నిబద్ధతకి, ఆధునిక రాజకీయ హిందుత్వ వ్యతిరేకతకి తార్కాణాలు. 17 జులై, 2018న జార్ఖండ్ లో ఆయన మీద మరోసారి బీజేపీ కార్యకర్తలచే దాడి జరిగింది. చివరికి వాజ్పేయి మరణించినప్పుడు కడసారి చూపుకి వచ్చిన ఆయన మీద మరోసారి దాడి జరిగింది. జీవితమంతా అలుపెరగని, ఊపిరి సలుపని పోరాటం చేసిన ఆ మహావీరుడు ఎన్నో చావుల్ని తప్పించుకొని చివరికి ఈ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన లివర్ సిరోసిస్ వల్ల మరణించారు.

ఆయన ఒక ఆధ్యాత్మిక వేత్త. కానీ మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా ఉద్యమించిన వాడు. స్త్రీలు, అణగారిన వర్గాలు, హక్కులు నిరాకరించబడ్డవారి కోసం, ప్రత్యేకించి ఆదివాసీల కోసం, జీవితకాల బానిసత్వంలో మగ్గిపోతున్నవారి కోసం పోరాడిన సర్వసంగ పరిత్యాగి. రాజకీయం ప్రజాశ్రేయస్సు కోసం కృషి చేయాలని ఉదహరణాత్మకంగా నిరూపించిన రాజకీయ వేత్త. కులమతాల మురికి అంటకు మునుపటి నిజమైన ప్రజాస్వామిక హిందువుకి ఒక నమూనాగా బతికినవాడు. మతాన్ని రాజకీయాలకి వాడుకోవటాన్ని తీవ్రంగా నిరసించి ఎండగట్టినవాడు. ఒక అరుదైన వజ్ర ఖచిత వ్యక్తిత్వం. ప్రజల కోసం పనిచేయాల్సిన సందర్భంలో ఆయన ఎవరితో అయినా, ఏ భావజాలపు సంస్థతో అయినా చేతులు కలిపిన ఉదారవాది. సమాజం పట్ల, ప్రజల పట్ల ఇంతగా నిబద్ధతని జీవితాంతం నిలుపుకున్న, నిరూపించుకున్న వ్యక్తి మరొకరు కనబడతారా అంటే సందేహమే. అందుకే ఆయన “లార్జర్ దేన్ ద లైఫ్ ప్రొఫైల్” గా చివరిశ్వాస వరకు జీవించగలిగాడు.

హిందూ కాషాయానికి, హిందూత్వ జాతీయవాద కాషాయానికి మధ్యనున్న వైరుధ్యాన్ని ఎత్తిచూపిన ఆయన చిట్టచివరి నిజమైన హిందువు. ఆయనకి నా నివాళి.

(డిస్క్లెయిమర్: నేను ఈ నివాళి వ్యాసంలో ఆయన విశ్వాసాల్ని భౌతికవాద దృక్కోణం నుండి విశ్లేషించదలుచుకోలేదు. ఆర్య సమాజ్ మీద కూడా విమర్శనాత్మక వ్యాఖ్యలకి ఇది సందర్భం కాదు)

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

3 thoughts on “మానవ హక్కుల జయకేతనం: స్వామి అగ్నివేశ్

  1. స్వామీ అగ్నివేశ్ గురించి తెలియని విషయాలు అనేకం చెప్పారు. స్వామీ అగ్నివేశ్ స్ఫూర్తి ని ప్రచారం చేయాల్సిన సందర్భం ఇది.

  2. సంఘీయులు ఆయన్ను కాషాయ వేషంలో ఉన్న మావోయిస్టు గా తీర్మానించారు

Leave a Reply