స్వాతంత్య్రం సరే… ఫలాలు దక్కిందెవరికి?

1857 నుంచి 1947 వరకు బ్రిటిష్‍ వలస పాలనకు వ్యతిరేకంగా, సంస్థానాల్లో భూస్వామ్య దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ఈ దేశ ప్రజలందరూ ఉద్యమించారు. దేశంలో ఆర్థిక, రాజకీయ, సాంఘీక, సాంస్కృతిక దోపిడీ పీడనలన్నీ అంతం కావాలని ఆకాంక్షించిన ఉద్యమం అది. ప్రముఖ చరిత్రకారుడు సుమిత్‍ సర్కార్‍ అధికార మార్పిడిని విశ్లేషిస్తూ ప్రజా ఉద్యమం, జాతీయ ఉద్యమం, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మారిన అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బ్రిటిష్‍ వలస పాలకులు పెంచి పోషించిన దేశీయ బడా దళారీ బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలకు బ్రిటిష్‍ పాలకులకు మధ్య కుదిరిన రాజీ వల్ల ఆగష్టు 15న అధికారం బదిలీ జరిగింది. పశ్చిమ దేశాల్లో జరిగినటువంటి భూస్వామ్య వ్యతిరేక ప్రజాతంత్ర ఉద్యమాన్ని మనదేశ బడా బూర్జువా వర్గం నిర్వహించలేదు. అది భూస్వామ్య వర్గంతో కలిసిపోయింది. అందువల్ల రూపంలో పాలకులు మారారు, సారంలో విధానాలు మారలేదు. ‘స్వేచ్ఛా, స్వాతంత్య్రపు’ ముసుగులో సామ్రాజ్యవాద ప్రయోజనాలకు, వనరుల దోపిడీకి భంగకరం కాని విధంగా మన పాలకులు నాటి నుండి నేటివరకు సామ్రాజ్యవాద పెట్టుబడిదారులతో వ్యవహరిస్తున్నారు.

బ్రిటిష్‍ వలస పాలకుల నుండి అధికార బదిలీ జరిగిన రోజున అంటే ఆగష్టు 14 అర్థరాత్రి నెహ్రూ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ‘‘ప్రపంచం నిద్రపోతుంటే భారత్‍ స్వేచ్ఛలోకి, జీవనంలోకి మేల్కొంటుంది’’. భవిష్యత్తు మనల్ని పిలుస్తుంది. దేశంలోని కర్షకుడు, శ్రామికుడు.. ఇలా అన్ని వర్గాలకు స్వేచ్ఛా స్వతంత్రాలు రావాలి. పేదరిక నిర్మూలన జరగాలి. అసమానతలు రూపా మాపాలి. రోగాలను నివారించాలి. మన దేశం సుసంపన్నమైన, ప్రజాస్వామ్యయుత, ప్రగతిశీల దేశంగా ఎదుగాలి. సాంఘీక, రాజకీయ, ఆర్థిక సంస్థలను నెలకొల్పి దేశంలోని ప్రతి పౌరునికి సమన్యాయం, ఫలప్రదమైన జీవితం అందేలా చూడాలి. సమాజంలో ఉన్న దారిద్య్రం, అజ్ఞానం, అనారోగ్యం, అవకాశాల్లో అసమానతలు నిర్మూలించడం తక్షణ అవసరంగా నెహ్రూ పేర్కొన్నాడు. తదనుగుణ్యమైన పరివర్తన సత్వరం సాధ్యం కాకపోతే కాగితం మీద మనం రాసుకున్న రాజ్యాంగ సూత్రాలన్నీ పనికి రానివి, అర్థం లేనివి అవుతాయని నెహ్రూ పేర్కొన్నాడు.

75 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు తీరలేదు. స్వాతంత్య్రం, స్వేచ్ఛ అంటే ఒకరు మరొకరిని ఇబ్బంది పెట్టకుండా తను ఇతరుల వలన ఇబ్బంది పడకుండా స్వేచ్ఛగా, సుఖంగా, ఆనందంగా జీవించడానికి లభించిన హక్కును స్వతంత్రం అంటారు. స్వతంత్రం అనేది ఒక వ్యక్తికే కాకుండా దేశానికి సంబంధించినదై ఉంటుంది. సామాజిక ఆర్థిక విధానాలు మారకుండా పాలించే వ్యక్తులు మారినంత మాత్రాన ప్రజల జీవన విధానాల్లో ఎలాంటి మార్పు రాదు. ఆయన ఉదాత్తమైన మాటలకు ఏడున్నర దశాబ్ధాల ఆచరణకు ఏమైనా పొంతన ఉందా? ఆర్థిక, రాజకీయ పరిణామాలను గమనిస్తే మనకు ‘స్వాతంత్రం వచ్చిందా’? వచ్చిన స్వాతంత్రం ప్రజలకా? లేక బడా దళారి బూర్జువా వర్గాలకా? అన్న సందేహం రాక మానదు. అంతేకాదు 1947 ముందు ఒక బ్రిటిష్‍ వలస దేశంగా ఉంటే ఇవాళ అనేక సామ్రాజ్యవాద దేశాలకు ముడిసరుకులు అందించే వనరుగా, వాళ్ల ఉత్పత్తులు అమ్ముకునే మార్కెటుగా మన దేశం మారిపోయింది.

స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు బూర్జువా భూస్వామ్య వర్గాలకే గానీ ప్రజలకు కాదని ఏడున్నర దశాబ్దాల అనుభవం రుజువు చేస్తోంది. 75 సంవత్సరాల స్వపాలనలో ఆర్థిక, రాజకీయ పరిణామాలను గమనించినప్పుడు దేశంలో నిరక్షరాస్యత, నిరుద్యోగం, పేదరికం, ఆకలికేకలు కనిపిస్తుండడం విషాదకరం. సంపన్నుల సంపద అనూహ్యంగా పెరిగిపోతుంటే సామాన్యుడి కనీసావసరాలు తీరని దుస్థితి కనబడుతుంది. అధికార మార్పిడితో భారత సామాజిక ఆర్థిక వ్యవస్థలో నాటి నుండి నేటివరకు ఎలాంటి మౌలిక మార్పులు జరుగలేదు. అందువల్లనే చెరబండరాజు ఆగష్టు 15 విద్రోహం గురించి చెప్పకపోతే నాకు అన్నం ముద్ద నచ్చదు అన్నాడు. దేశంలో రావల్సిన సాంఘిక విప్లవానికి సామాజిక అసమానతల నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు లోహియా.
సారాంశంలో పేదలకు ఉపయోగపడని రాజ్యాంగం :-

రాజ్యాంగ పీఠికలో – ‘‘భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, ఆలోచన భావప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలో స్వేచ్ఛను, అంతస్తు(హోదా)లోను, అవకాశములోనూ సమానత్వమును చేకూర్చుటకు, అందరిలో వ్యక్తి గౌరవమును, జాత్యైక్యతను అఖండతను తప్పక సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకొని 26 నవంబరు 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము’’ అని చెప్పుకున్నాం.

గ్రాన్విల్‍ ఆస్టిన్‍ చెప్పినట్లు ‘‘జాతీయోద్యమ కాలంలో రెండు విప్లవాలు జరిగాయి. ఒకటి, రాజకీయ విప్లవం, రెండోది సామాజిక విప్లవం సమాంతర రేఖలో నడిచాయి. అధికార బదిలీ జరగడంతో రాజకీయ విప్లవం ముగిసింది. కాని సామాజిక విప్లవం మిగిలే ఉంది’’. మన అనుభవం నెహ్రూ మాటలను గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. ఏడున్నర దశాబ్దాల తర్వాత అంతరాలు అనూహ్యంగా పెరిగాయి. దేశీయంగా దిగువన ఉన్న యాభై శాతం జనాభాతో పోలిస్తే పై అంచున ఉన్న పదిశాతం జనాభా సంపాదన 96 రెట్లు అధికంగా ఉన్నట్లు చెబుతున్న ప్రపంచ అసమానతలు నివేదిక-2022 అధ్యయనాంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

భారత రాజ్యాంగం చాల గొప్పదన్న ప్రచారం సాగుతోంది. రాజ్యాంగ రూపకల్పనలో ప్రజల పాత్ర ఏమైనా ఉన్నదా? అంటే శూన్యం అని చెప్పవచ్చు. ‘భారత ప్రజలమైన మాకు మేము ఇచ్చుకుంటున్నా’ మని చెప్పుకోవడమే ఒక పెద్ద దగా. భారత రాజ్యాంగ నిర్మాణం కోసం ఏర్పడిన ‘రాజ్యాంగ నిర్ణయ సభ’ (కాన్‍స్టిట్యూఅంట్‍ అసెంబ్లీ) లో ఉన్నవారు బ్రిటిష్‍ పార్లమెంటు రూపొందించిన 1935 భారత ప్రభుత్వ చట్టం కింద 1946లో రాష్ట్ర శాసన సభలకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన ‘ప్రజా ప్రతినిధులు’ ఎన్నుకున్న ప్రతినిధులు. సంస్థానాదీశుల ప్రతినిధులు. అప్పటికి దేశంలో సార్వత్రిక ఓటు హక్కు లేదు. అలా రాజ్యాంగ నిర్ణయ సభ రూపొందిన తీరే దానికి ప్రజానుకూల భూమికను ఇవ్వలేదు. భారత సమాజానికున్న ప్రత్యేకతల రీత్యా విభిన్న కులాల, మతాల, జాతుల, ప్రాంతాల ప్రజలకు ప్రాతినిధ్యమే లేదు. రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షులుగా డా.బి.ఆర్‍ అంబేద్కర్‍ ఉండడం వల్ల, రాజ్యాంగ సభలో కొందరు ఉదార ప్రజాస్వామికవాదులు ఉండడం వల్ల అర్థవంతమైన ‘రాజ్యాంగ ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు’ వంటి ఉదాత్త అంశాలకు రాజ్యాంగంలో చోటు దక్కింది. ఆదేశిక సూత్రాలు న్యాయ వ్యవస్థ ద్వారా అమలు చేసుకోవడానికి వీలులేనివిగా ప్రకటించడం వల్ల అవి కాగితానికి పరిమితమైనవి. మొత్తంగా మన రాజ్యాంగం 1935 బ్రిటిష్‍ ఇండియా చట్టానికి ప్రతిరూపంగా రూపొందింది. అందువల్ల సామాజిక న్యాయం, సమానత్వం, చట్టబద్ధపాలన వంటి ఆదర్శాలు మాటలకే పరిమితమై చేతల దాక రాలేదు.

రాజ్యాంగ నిర్మాణ సభ ప్రాతినిధ్య స్వభావం పట్ల పలు విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా అది ప్రజాస్వామికంగా సార్వత్రిక ఓటింగ్‍ ద్వారా ఎన్నిక కాలేదన్నది మొదటి విమర్శ. భారత కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు పార్టీలకు రాజ్యాంగ నిర్మాణ సభలో ప్రాతినిధ్యం లేదన్నది రెండవ విమర్శ. భారత రాజ్యాంగం ‘రాజీలు-రాయితీ’ల ఫలితంగా ఏర్పడిందని మరి కొంతమంది అభిప్రాయం. స్వేచ్ఛ స్వాతంత్య్రాలు అనుభవించే ప్రజల రాజ్యాంగ సభకు ఉండవల్సిన లక్షణాలలో ఒక్కటి కూడా దీనికి లేకుండా పోయాయన్నది ప్రజాతంత్రవాదుల విమర్శ. ఆశ్చర్యమేమిటంటే ఒకప్పుడు 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని పూర్తిగా తిరస్కరించిన నాయకులే రాజ్యాంగ రచనకు పూనుకొన్నప్పుడు ఆ చట్టం నుంచి దాదాపు 80 శాతం అంశాలను గ్రహించడానికి వెనుకాడలేదు. మనది బూర్జువా పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన దేశంలో అపసవ్య ఎన్నికల విధానం ఉండడం వల్ల మైనారిటీలో ఉన్న పార్టీనే పాలన సాగిస్తోంది. పేరుకు ప్రాతినిధ్య వ్యవస్థ కాని ఏకపార్టీ పాలన కొనసాగుతోంది. ఏ పార్టీకి ఎంత ప్రజా మద్ధతు ఉందో ఆ దామాషాలో చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండదు. అందువల్ల భారత సామాజిక, రాజకీయార్థిక వ్యవస్థ మార్పు రాజ్యాంగ పీఠికలోని ఆదర్శాల అమలుకు ఏమాత్రం అవకాశమే లేదు.

మనదేశంలో ప్రస్తుతం ఉన్నది ధనస్వామ్యం, మెజారిటీ మతస్వామ్యం తప్ప ప్రజాస్వామ్యం ఎంతమాత్రం కాదు. రాజ్యాంగం ఆమోదం పొందడానికి ఏర్పాటైన రాజ్యాంగసభ చివరి సమావేశంలో 1949 నవంబర్‍ 26న డా.బి.ఆర్‍. అంబేద్కర్‍ మాట్లాడుతూ మన రాజ్యాంగం ప్రతినిషికి ఒక ఓటు ద్వారా రాజకీయ సమానత్వం ప్రసాదించింది. ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం సఫలీకృతం కాదన్నారు. ఈ వైరుధ్యాలను పరిష్కరించకపోతే ప్రజాస్వామ్యం నిలువదని అనాడే అంబేద్కర్‍ హెచ్చరించారు. ఇవాళ అదే నిజమవుతోంది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక వ్యవస్థలో, ఆర్థిక, సామాజిక న్యాయం దారుణంగా తిరస్కరించబడుతోంది. రాజకీయ ప్రజాస్వామ్యం కూడా వక్రీకరించబడుతోంది. అందువల్ల భారత రాజ్యాంగం అధునిక ప్రజాస్వామ్యాన్ని సంతరించుకున్నదని చెప్పడం సబబు కాదు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, చట్టబద్ధపాలన, అవకాశాల్లో సమానత్వం వంటి ఆదర్శాలు ఆచరణలోకి రాలేదు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే సామాజికార్థిక మార్పు అనివార్యం.
నెహ్రూ పాలనలో ఆర్థిక విధానాలు :

నెహ్రూ అనుసరించిన మిశ్రమ ఆర్థిక విధానం దేశీయ దళారీ బూర్జువా, సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలకు తోడ్పడింది. దీర్ఘకాలంగా నలుగుతున్న భూసంబంధాల్లో ఎటువంటి మార్పు తీసుకురాలేదు. స్వతంత్ర, స్వయం పోషక, అభివృద్ధికరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించే పేరుతో సామ్రాజ్యవాదుల పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడ్డారు. ప్రథమ ప్రధాని నెహ్రూ ముందున్న తక్షణ కర్తవ్యాలు రెండు. ఒకటి, దేశ స్వావలంబన కోసం సామ్రాజ్యవాదులపై ఆధారపడని స్వతంత్ర ఆర్థిక విధానం అనుసరించడం. రెండు, గ్రామీణ ప్రజలను భూస్వామ్య కబంధ హస్తాల నుండి విముక్తి చేసే భూసంస్కరణలు అమలు చేసి అంతరంగిక మార్కెట్‍ను అభివృద్ధి చేయడం. ఈ రెండు లక్ష్యాలు అంతసంబంధం కలవి. ప్రజాతంత్ర వ్యవస్థ ఏర్పాటుకు దోహదపడేవి కూడ. అయితే ప్రధాని నెహ్రూ విధానాలు మాటల్లో సోషలిజం చేతల్లో పెట్టుబడిదారీ విధానం కొనసాగింది.

1948 ఫిబ్రవరి 17న నెహ్రూ ‘‘ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో ఏలాంటి మార్పులుండవు. 1948 ఏప్రిల్‍ 6న విదేశీ, స్వదేశీ పరిశ్రమలు ఏవి జాతీయం చేయబడవు, రైల్వేలు, విద్యుత్తు, అణుశక్తి, రక్షణ రంగాలు తప్ప మిగిలిన రంగాల్లో ప్రైవేట్‍ రంగానికి అవకాశముంటుదని’’ ప్రకటించాడు. 1950 నాటికి పూర్వపు సంస్థానాధిపతుల భూభాగాలను వారి సామాజిక, ఆర్థిక ప్రత్యేక హక్కులకు ఎట్టి భంగం లేకుండా కలుపుకొన్నారు. ‘‘దౌత్యం, బుజ్జగింపులు, లంచగొండితనం’’ లాంటివి భారత యూనియన్‍లో సంస్థానాధిపతులు చేరేలా ప్రోత్సహించడానికి వినియోగపడ్డాయి. ప్రజాతంత్ర వ్యవస్థ స్వభావానికి భిన్నంగా పన్నుల మినహాయింపులు, రాజభరణాలు, బిరుదులు ఇచ్చి భారత యూనియన్‍లో కలుపుకున్నారు. మరోవైపు అధికార బదిలీ జరిగిన (మూడు సంవత్సరాల కాలంలో) 1947 ఆగష్టు 15 నుంచి రాజ్యాంగం అమలులోకి రాకముందే, అంటే 1949 డిసెంబర్‍ నాటికి నెహ్రూ ప్రభుత్వం, దాని సైన్యం ప్రజలపై 1982 సార్లు కాల్పులు జరిపింది. 5874 మందిని కాల్చి చంపారు. పదివేల మందిని గాయపరిచారు. 82 మంది ఖైదీలను జైళ్లలోనే కాల్చి చంపారు. బ్రిటిష్‍ పాలన నాటి ‘ప్రివెంట్యూ డిటెన్షన్‍ (పిడి) యాక్ట్’ను ఫిబ్రవరి 1950 నుంచి కమ్యూనిస్టులపై ఉపయోగించాడు.

నెహ్రూ విధానాలతో అభివృద్ధి లక్ష్యాలు, సామాజిక న్యాయాన్ని సాధించడంలో విఫలమైనట్లు 1964లో మహలనోబిస్‍ కమిటీ, 1964లో గుత్త సంస్థలపై కెసి దాసు కమిటి నివేదిక సంపద పెట్టుబడిదారుల చేతుల్లో కేంద్రీకృతమైందని స్పష్టం చేశాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు సంక్షోభంలో పడ్డాయి. వనరుల కోసం నెహ్రూ ప్రభుత్వం విదేశీ సహాయాన్ని ఆర్జించింది. విదేశీ సహాయం పేరుతో సామ్రాజ్యవాద జోక్యం పెరిగింది. నయా వలస తరహాలో ఈ జోక్యం సాగింది. అందువల్ల మనదేశం ‘అర్థవలస-అర్థభూస్వామ్య’ దేశంగా ఉందన్నారు సునీత్‍ కుమార్‍ ఘోష్‍. అధికార బదిలీ జరిగి స్వపాలన ఆరంభమైన రెండు దశాబ్దాల పాలన తీరు తెన్నులు ప్రజలు అర్థం చేసుకున్నారు. 1960 దశకం మధ్యకాలం నాటికి ఆహార సంక్షోభం, నిరుద్యోగం, ఆర్థిక తిరోగమనం, ప్రజల కష్టాలు పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రజా ఆందోళనలు పెల్లుబికాయి. వ్యవస్థలో మార్పు రావాలన్న ఆకాంక్షతో దేశంలో పలురకాల సామాజిక, వర్గ, జాతి, పర్యావరణ ఉద్యమాలు వెల్లువెత్తాయి.

1967లో నక్సల్‍బరిలో (ప.బెంగాల్‍) భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన రైతుల సాయుధ పోరాటానికి చార్‍ మజుందార్‍, కాన్‍ సన్యాలు, జంగల్‍ సంతాల్‍ నాయకత్వం వహించారు. దావానలంగా ఆ ఉద్యమం బీహార్‍, జార్ఖండ్‍, ప.బెంగాల్‍, ఒడిషా, మహారాష్ట్ర, ఆంధప్రదేశ్‍ రాష్ట్రాలకు విస్తరించింది. ఈ ఉద్యమంలో గ్రామీణ రైతులు, పట్టణ యువత చేరింది. జె.పి.నారాయణ్‍ 1970 దశకంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పు రావాలని సంపూర్ణ విప్లవం ఆరంభించాడు. 1974లో బీహార్‍లో ఉద్యమం ఉధృతంగా సాగింది. అందరికి సమాన అవకాశాలు, స్వేచ్ఛా, ప్రజాస్వామ్యం పేరుతో జాతుల ప్రజాస్వామిక హక్కును కాలరాచి స్వయం ప్రతిపత్తి, స్వాతంత్య్రం కోసం పోరాడిన కశ్మీర్‍, ఈశాన్య భారత రాష్ట్రాల నాగో, జోడో, అస్సామీ జాతుల ఉద్యమాలను అణిచి వేశారు. ఉత్తరాఖండ్‍లో చిప్కో ఉద్యమం, తెహ్రీడామ్‍, కర్ణాటకలో అప్పికో, మధ్యప్రదేశ్‍లో నర్మదా బచావో, కేరళలో సైలెంట్‍ వ్యాలీ ఉద్యమం, మత్స్యకారుల ఉద్యమం, ఆదివాసీల జల్‍ జంగల్‍ జమీన్‍ ఉద్యమం, బలహీన వర్గాల రిజర్వేషన్‍ ఉద్యమం, దళితుల వర్గీకరణ ఉద్యమం. అణు విద్యుత్తు కేంద్రాల నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, రైతు ఉద్యమాలు, కార్మికుల, నిరుద్యోగుల ఉద్యమాలు. ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం, పౌర హక్కుల ఉద్యమం వంటివి నిరంతరం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.

1966లో అధికారంలోకి వచ్చిన ఇందిరా గాంధీ ప్రణాళిక విధానాలకు విరామం ఇచ్చింది. ప్రభుత్వ వ్యయం కుదింపు, సస్య విప్లవం విధానాలు చేపట్టింది. పెరిగిన అసమానతలు, నిరుద్యోగం, ఫాసిస్టు విధానాల అమలు, అన్నీ తానై ఒక నియంతగా మారింది. సమస్యలు పరిష్కరించే ఆలోచన చేయకుండా, 1975లో అత్యవసర పరిస్థితి ప్రకటించి, పౌర హక్కులను అణచివేసింది, ప్రతిపక్ష నాయకులను జైళ్లో నిర్బంధించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రాజీవ్‍గాంధీ 21వ శతాబ్దపు అవసరాలు అంటూ ప్రపంచ పెట్టుబడి, సాంకేతికతను ఆహ్వానించాడు, పి.వి. నర్సింహ్మ రావు, మన్మోహన్‍ సింగ్‍లు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను ఆహ్వానించారు. దీన్ని దేశీయ దళారీ బడా బూర్జువా వర్గం ఆహ్వానించింది. లైసెన్స్ విధానం రద్దు చేసి, పెట్టుబడులు, సేవలు, వస్తువులు స్వేచ్ఛగా దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించారు. దీంతో మన ఆర్థిక వ్యవస్థపై విదేశీ పెట్టుబడి ఆధిపత్యం పెరిగింది. దీంతో ఒక పక్క దేశీయ గుత్తా పెట్టుబడి, సామ్రాజ్యవాద పెట్టుబడి అనుసంధానం కాగా, మరోవైపు మొత్తం సమాజం, వనరులు, శ్రమ, మార్కెట్‍ దోపిడీకి గురవుతున్నారు.

ఈ పూర్వ రంగంలో వలస పాలకుల నుండి అధికార బదిలీ జరిగి 75 సంవత్సరాలు పూర్తి అయి 76వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ జాతీయత, దేశభక్తి అంటూ ‘అజాదీ కా అమృత్‍ మహోత్సవ్‍’ హడావుడి చేస్తోంది. ఆర్‍ఎస్‍ఎస్‍ ప్రచార పటాటోపం చూస్తుంటే బ్రిటిష్‍ సామ్రాజ్యవాద వలస పాలకులకు వ్యతిరేకంగా సాతంత్య్రోద్యమంలో ఘనమైన పాత్ర పోషించి ఉండొచ్చని ఎవరైనా భ్రమ పడితే పప్పులో కాలేసినట్టే. ఆర్‍ఎస్‍ఎస్‍ 1925లో ఆవిర్భవించినా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ఒక్క ఎన్నదగిన నాయకుడైనా దానికి లేకపోవడం యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే బ్రిటిష్‍ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన భారత స్వాతంత్య్ర సమరంలో ఆర్‍ఎస్‍ఎస్‍ శక్తులు ఏనాడూ భాగస్వామి కాలేదు. పరాయి పాలన నుంచి విముక్తి పొందేందుకుగాను… ప్రజానీకం కారాగార శిక్షలకు, ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడిన వేళ… ఆర్‍ఎస్‍ఎస్‍ వారు క్షమాపణ లేఖలతో పీడక బ్రిటిష్‍ ప్రభుత్వ కటాక్ష వీక్షణలకు పాకులాడారు. ప్రజలు దేశవ్యాప్తంగా బ్రిటిష్‍ వలస వ్యతిరేకంగా ఉవ్వెత్తున పోరాటాలు చేస్తున్న సమయంలో ఆర్‍ఎస్‍ఎస్‍ వంటి మితవాద, మతోన్మాద శక్తులు బ్రిటీష్‍ వారికి అనుకూలంగా వ్యవహరించాయి. ముఖ్యంగా ఆర్‍ఎస్‍ఎస్‍ నాయకత్వం బ్రిటిష్‍ వారి ముందు పూర్తిగా సాగిలపడింది.

మూడు రంగుల జాతీయ జెండాను, స్వేచ్ఛాయుతమైన, అధునిక భారత దేశ రూపకల్పనకు మార్గదర్శకత్వం చేసే భారత రాజ్యాంగాన్ని ఆర్‍ఎస్‍ఎస్‍ అంగీకరించలేదు. మనుస్మృతిని మౌలిక స్మృతిగా గుర్తించాలని, తమ కాషాయ జెండాను జాతీయ జెండాగా గుర్తించాలని నానా యాగి చేశారు. 1948 జనవరి 30న గాంధీని హత్య చేసింది. ఆ తరువాత అయోధ్యలో 1949 డిసెంబర్‍ 22వ తేదీ రాత్రి మరో కుట్రపూరితమైన సంఘటన కూడా జరిగింది. 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని లాంఛనపూర్వకంగా అమలులోకి తీసుకురావడానికి నెల రోజుల ముందుగా, అయోధ్య నగర మేజిస్ట్రేట్‍ గురుదత్‍ సింగ్‍, ఆ జిల్లా మేజిస్ట్రేట్‍ కె.కె.నాయర్‍ల ఆశీర్వాదాలతో రహస్యంగా బాబ్రీ మసీదులో శ్రీరాముడి విగ్రహాన్ని ఉంచారు. ఈ తర్వాత గురుదత్‍, నాయర్‍ ఇద్దరూ భారతీయ జన సంఘ్‍ బ్యానర్‍ కింద క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఆ జనసంఘ్‍ వారసత్వ పార్టీయే ఈనాటి భారతీయ జనతాపార్టీ.

దేశమంటే మట్టి కాదోయి… దేశమంటే మనుషులోయి అన్నాడు గురజాడ. అయితే భారత్‍లో ప్రజలు స్వేచ్ఛాలేమితో, అభద్రతతో బాధపడుతున్నారు. మరోవైపు ఆదాయం, సంపద పంపిణిలో అసమానతలు అనూహ్యంగా తీవ్రమవుతున్నాయి. ఆధిపత్య ధోరణులు బలపడుతున్నాయి. లింగ వివక్ష, జాత్యహంకారం, కుల వివక్ష, మైనారిటీల మీద దాడులు వికృతంగా పెరుగుతున్నాయి. అమానవీయత, పెత్తనం, క్రూరత్వం, హింస, నేటి వ్యవస్థ సహజ లక్షణాలైనాయి. ఇవన్నీ అత్యధిక ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తున్నాయి. సామాజిక పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే, ఆర్‍ఎస్‍ఎస్‍ శ్రేణులు ప్రధాని మోడీ హయాంలో భారతదేశం విశ్వగురువుగా ఆవిర్భవిస్తోందనే ప్రచార హోరెత్తిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్య పాత్ర వహించిన నేషనల్‍ హెరాల్డ్ పత్రిక కేంద్రానికి ఈ సమయంలోనే తాళాలు పడ్డాయి. ఎగువసభ నడుస్తుండగానే అక్కడి ప్రతిపక్ష నాయకుడిని సమన్లు ఇచ్చి పిలిపించి ఎన్‍ఫోర్స్మెంట్‍ డైరక్టరేట్‍ (ఇ.డి) విచారణ జరిపింది.

అజాదీకా అమృతోత్సవ్‍ పేరిట సంబురాలు జరుపుకుంటున్న వేళ గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో దేశంలో నెలకొన్న పరిస్థితులను గమనంలోకి తీసుకుంటే హక్కులు హరించబడుతున్నాయి. స్వేచ్ఛకు సంకెళ్లు పడుతున్నాయన్నది వాస్తవం. ఇది ముమ్మాటికీ తిరగోమనమే. ప్రశ్నించే తత్వాన్ని చంపేయాలన్న భావన అధికార వర్గాల్లో క్రమేపి బలపడుతున్నది 75 ఏళ్ల స్వాతంత్ర భారతం తిరోగమిస్తున్నదా, పురోగమిస్తున్నదా అన్న సంశయం జనం మదిలో మెదులుతుంది. వజ్రోత్సవ వేళ స్వేచ్ఛకు సంకెళ్లు చేయడంతో పాటు క్రమేపి హక్కులు హరించబడుతున్నాయి. స్వాతంత్య్ర పూర్వపు పరిస్థితులు దాపురిస్తున్నాయా అన్న భావన మదిలో మెదులుతున్నది. అవసరమైతే ప్రశ్నించే వారిని లేకుండా చేయాలనే తత్వం బలపడుతుంది. చట్టసభలే కాదు బాహ్య సమాజంలోనూ ప్రశ్నించే వారిని జైళ్లలో బంధిస్తున్నారు. రాజద్రోహం కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెడుతున్నారు. రాజ్యాంగ స్వతంత్ర వ్యవస్థలు ఇప్పుడు తమకు నచ్చని వారిని వేధించే ఆయుధాలుగా మారుతున్నాయి. అన్నింటికీ మించి అధికార పక్షం నేతలు మాకు తల వంచకపోతే జైలేనన్న హెచ్చరికలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

భారత స్వాతంత్య్రానికి 75 సంవత్సరాలు నిండి అమృతోత్సవాలు జరుపుకొంటున్న ఈ తరుణంలో గాంధీని పొట్టన పెట్టుకున్న గాడ్సేను కొలవమని పోస్టర్ల ద్వారా ప్రచారం చేయడాన్ని అనుమతించిన పాలకులను ప్రజలు క్షమించగలరా? కనుకనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఏ రాజకీయ పార్టీ అయినా ‘కాలుగాలిన పిల్లి’లా మౌనంగా ఉంటోందే గానీ, ‘గజ్జె కట్టడానికి’ ముందుకు రావడం లేదని విమర్శించాల్సి వచ్చింది. ‘హిందూత్వ’ వాదులు ఇతర మత మైనార్టీలపై స్వేచ్ఛగా జరుపుతున్న దాడులను పాలకులు అదుపు చేయడంలేదు సరికదా… మరోవైపు న్యాయం కోసం కోర్టు మెట్లెక్కిన పిర్యాదుదారులనే (తీస్తా సెతల్వాడ్‍, హిమాన్స్ కుమార్‍) నేరస్థులుగా కోర్టు ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ఈ సందర్భంగా న్యాయశాఖామంత్రి కిరణ్‍ రిజిజూ అన్న మాటలనైనా పాలకులు పట్టించుకోవాలి. ‘‘దేశంలో కోర్టులున్నది సంపన్న వర్గాల కోసమే కాదు. న్యాయస్థాన ద్వారాలు అందరికీ సమంగా తెరచి ఉండాలి. ఒక కేసు వాదించడానికి కక్షిదారుల వద్ద లాయర్లు 10-15 లక్షల రూపాయలు వసూలు చేస్తుంటే సామాన్య మానవుడికి న్యాయం దక్కేదెలా?’’ అని ఆయన అన్నారు.

మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, రాజకీయ విధానాల ఫలితంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ప్రస్తుతం అవసరం లేని యాంత్రీకరణ వల్ల వ్యవసాయ కూలీలకు పనులు 140 రోజుల నుండి 60 రోజులకు తగ్గిపోయాయి. ఫలితంగా గ్రామీణ పేదల ఆదాయం గణనీయంగా తగ్గి, గ్రామీణ పేదరికం పెరుగుతూ ఉంది. వ్యవసాయ పనులు తరిగిపోవటంతో పొట్ట నింపుకోవటానికి పట్టణాలకు వలస పోతున్నారు. పారిశ్రామిక రంగం సామ్రాజ్యవాదులు, బడా పెట్టుబడిదారుల అజమాయిషీలో ఉండటం వలన పారిశ్రామిక అభివృద్ధి జరగక దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. పాలకుల ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సంస్థలు మూతపడటం లేదా వాటాలు అమ్మివేయటం జరుగుతున్నది. పరిశ్రమల్లో యంత్ర వినియోగం కార్మికుల శ్రమను తగ్గించేది కాకుండా కార్మికుల తొలగింపునకు దారితీసింది. మోడీ ప్రభుత్వ పాలనలో నేడు పరిశ్రమల అమ్మివేత, ప్రైవేటీకరణ శరవేగంతో సాగుతున్నది. అనేక పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధిని కోల్పోయారు. కార్మికులు సాధించుకున్న హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాయటం వలన శ్రమ దోపిడీకి కార్మికులు గురౌతున్నారు. వచ్చే ఆదాయం చాలక పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఫలితంగా పట్టణ పేదరికం పెరుగుతూనే ఉంది.

1857 నుంచి మనదేశ శ్రామిక వర్గం స్వాతంత్య్ర ఉద్యమంలో తిరుగులేని పాత్రను పోషించడమే గాక, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. తన వర్గ ప్రయోజనాలను కాపాడుతూనే, దేశ ఐక్యత మరియు సమగ్రత కోసం కార్మిక వర్గం సమరశీలంగా పోరాడింది. బ్రిటిష్‍ సామ్రాజ్యవాదానికి తొత్తులుగా ఉండి, స్వాతంత్య్ర పోరాటానికి ద్రోహం చేసిన శక్తుల మూలంగా దేశ ఐక్యతకు, జాతీయ సమగ్రతకు సార్వబౌమాధికారానికి నేడు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. నేటికీ వలస పాలకులు చేసిన చట్టాలనే మెరుగుపర్చి వాటికన్నా కఠినంగా దేశీయ పాలకులు అమలు జరుపుతున్నారు. సామ్రాజ్యవాదుల ప్రయోజనాలు కాపాడుతూ దాని ప్రశంసలు పొందేందుకు పాకులాడుతున్నారు. బడా పెట్టుబడిదారుల, భూస్వాముల దోపిడీ ప్రయోజనాలకు రక్షణగా ఉన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. దేశంపై సామ్రాజ్యవాదుల పట్టు యధాతథంగా కొనసాగుతున్నది. విదేశీ రుణభారం, నిరుద్యోగం, పేదరికం పెరుగుతూ ఉంది. రక్షణ రంగంతో సహా అన్ని రంగాల్లోకి ప్రైవేట్‍ పెట్టుబడులకు అవకాశం కల్పించారు. ప్రజా ఉద్యమాల అణచివేతలో వలస పాలనను మించిపోయారు. ప్రజల ఆహార అలవాట్లపై కూడా దాడులు జరుగుతున్నాయి.

తరచుగా నరేంద్ర మోడీ మాట్లాడుతున్న నూతన భారతం నిజంగానే యుపిఎ పాలనలో లేనిది. ప్రజాస్వామ్యం రానురాను నిరంకుశత్వంగా మారుతోంది. సెక్యులరిజం మెజారిటీవాదానికి దారితీస్తోంది. ఒకే నేత, ఒకే దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి వంటి ఆర్‍ఎస్‍ఎస్‍ ఫాసిస్టు తరహా నినాదాన్ని సమాజంలో పాతుకుపోయేలా చేయాలని చూస్తున్నారు. సర్వసత్తాక ప్రజాస్వామిక భారత్‍ అనే రాజ్యాంగ గమ్యం స్థానంలో-లౌకిక భారత్‍ను ఫాసిస్టు హిందూ రాష్ట్రంగా మార్చాలన్న ఆర్‍ఎస్‍ఎస్‍ వందేళ్ల నాటి కలను ఆచరణలో ప్రవేశపెట్టే ప్రయత్నం జరుగుతోంది. పరాయి పాలన పోయి స్వపాలన వచ్చి 75 సంవత్సరాలు గడిచింది. ప్రజల మౌలిక సమస్యలలో ఏ ఒక్క సమస్య నేటికి పరిష్కారం కాలేదు సరికాద! మరిన్ని కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. స్వపాలనలో విదేశీరుణాలు, పెరిగిపోతున్న నిరుద్యోగం, పేదరికం విలసిల్లుతున్న దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని దళారీ పాలకులు సంబరాలు చేయటం ప్రజా వంచన కాదా! స్వతంత్య్రం వచ్చింది బడా పెట్టుబడిదారులకు, భూస్వాములకు, ప్రజావ్యతిరేక పాలకులకే గాని ప్రజలకు కాదు!

ముగింపు :

ప్రొ. జి.కె. గాల్‍బ్రెత్‍. ‘‘సాంప్రదాయిక ప్రజాస్వామ్యం పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రయోజనాలు కాపాడుతుంది. ఇలాంటి ప్రజాస్వామ్యంలో సంపన్న వర్గమే విధాన నిర్ణయాలు చేస్తుంది. మిగతా వర్గాలను రాజకీయాల నుండి తరిమివేస్తుంది. నిజం చెప్పాలంటే అధికారం ప్రజల నుండి కొనబడుతుంది. అందుకే బూర్జువా ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం అంటారు’’. ‘‘ఆదాయం, సంపదలో అసమానతలున్న సమాజం ప్రజాస్వామిక సమాజం ఎలా అవుతుందని’’ డెమోక్రసీ-1988 గ్రంథ రచయిత మైఖేల్‍ ఫెర్నిటి ప్రశ్నించారు. భారతదేశంలో జరుగుతున్నది కూడా ఇదే. దీన్ని బట్టి మనకు తెలిసేదేమిటంటే ఆర్థిక సంబంధాలు మారాలంటే రాజకీయ సంబంధాలు మారాలి. ఆర్థికాధిపత్యం ఎవరి చేతుల్లో ఉంటుందో రాజ్యాధికారం కూడా వారి చేతుల్లోనే ఉంటుంది. అందుచేత రాజ్యసారం వర్గ దోపిడీ, వర్గాధిపత్యం. ప్రస్తుత రాజకీయ వ్యవస్థను పరిశీలిస్తే విషయమింత సూటిగా, సరళంగా అర్థం కాదు. రాజకీయాలు పైకి చాలా గందరగోళంగా కనిపిస్తాయి. అయితే వాటిని నడిపించేవి మౌలికమైన, స్థిరమైన వర్గ ప్రయోజనాలే.

ఇంతకాలం కేంద్రంలో అధికారం చలాయించిన కాంగ్రెసు, యుపిఎ, ఎన్‍డిఎ కూటములు ప్రజాస్వామ్య ఉదాత్త విలువలను విస్మరించాయి. కాలక్రమంలో విలువలు అన్నీ తలక్రిందులై పోయాయి. మార్పును ప్రతిఘటించే ప్రతిఘాత శక్తులుగా ఏలికలూ చలామణీ అవుతున్నారు. మరోవైపు మనదేశ రాజకీయ పార్టీలు సొంత సామ్రాజ్యాలుగా మారిపోయాయి. ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, కుల, మత, ధన రాజకీయాలు కలగా పులగం కావడం. వ్యక్తుల చేతిలో విపరీతమైన అధికార కేంద్రీకరణ సమస్యలుగా ఘనీభవించిపోయాయి.

రాజ్యాంగం నాలుగవ భాగం, ఆదేశిక సూత్రాలు అర్టికల్‍ 36-51 వరకు పేర్కొనబడ్డాయి. సమాజంలోని బలహీన వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పౌరుల ఆర్థిక సంక్షేమాన్ని పరిరక్షించాలని రాజ్యాంగ అధికరణం 39-ఎ చెబుతుంది. లింగ బేధం లేకుండా ప్రజలందరు జీవనోపాధి హక్కు కలిగి ఉంటారు. 39-బి ప్రకారం సహజ వనరులు సమాజ శ్రేయస్సుకు వినియోగించాలి. 39-సి ప్రకారం సంపద కొద్దిమంది వద్ద పోగుపడకూడదు. అలా పోగుపడితే ఆ సంపదను సమాజ శ్రేయస్సుకు వితరణ చేయాలి. 39-డి ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. 39-ఇ ప్రకారం ప్రజలందరి ఆరోగ్యాన్ని రక్షించాలి. 39-ఎఫ్‍ ప్రకారం బాలల స్వేచ్ఛను పరిరక్షించాలి. ఇంత ఉదాత్తమైన రక్షణలకు సంబంధించి పౌరులు న్యాయం కొరకు న్యాయస్థానాలను ఆశ్రయించే విధంగా రాజ్యంగ సవరణ కోసం డిమాండ్ చేయాలి. అంటే రాజ్యాంగం నాల్గవ భాగంలో పేర్కొన్న ఆదేశిక సూత్రాలు పాలకులకు మార్గదర్శకాలు మాత్రమే కాదు, ప్రజల హక్కుగా గుర్తించాలని ఈ సందర్భంలో పాలకవర్గం మీద పౌరసమాజం ఒత్తిడి తీసుకురావాలి.

ఏడున్నర దశాబ్దాల కాలాన్ని ప్రమాణంగా తీసుకుని ఆ కాలంలో ఏ వర్గ ఆధిపత్యం, దోపిడీ, సంపద పెరిగిందనేది పరిశీలిస్తే రాజ్యసారం వర్గ దోపిడీలో ఉందనే విషయం సులభంగా అర్థమవుతుంది. అందువల్ల దేశంలో సామ్రాజ్యవాదుల ఆధిపత్యం తొలగి, బడా పెట్టుబడిదారుల సంపద ప్రజలపరమై, దున్నే వానికే భూమి దక్కి, ప్రజలకు ఉద్యోగ, ఉపాధి లభించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వస్తుంది. సంపద సృష్టికర్తలైన కార్మికులు, అన్నదాతలైన కర్షకులు, శ్రమజీవుల ప్రయోజనాలకు ద్రోహపూరితంగా దేశీయ, విదేశీ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న ‘దళారీ పాలకుల’ ఆట కట్టించేందుకు… తమ చారిత్రాత్మక బాధ్యతను నిర్వర్తించేందుకు… కార్మిక, కర్షక కష్టజీవులంతా మళ్లీ ముందుకు రావాలి. ఇవాళ దేశంలో మోడీ ప్రభుత్వం ఫాసిస్టు పాలనను రుద్దుతున్నది. ఈ పాలన కేవలం లౌకిక, ప్రజాస్వామిక శక్తులు ఏకమనడంలో తొలగిపోదు. ఐక్యత అవసరమే కాని బలంగా ఉన్న హిందూత్వ ఫాసిజాన్ని ఓడించడానికి, దానికి కారణ భూతమైన తీవ్ర సంక్షోభాన్ని సృష్టించిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలను, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని ఓడించడం అసవరం. ఇంత కష్టతరమైన పనిని కార్మికవర్గ నాయకత్వంలో ప్రజాతంత్ర విప్లవాన్ని విజయవంతం చేయడానికి ప్రజలందరు ఐక్యంగా ఉద్యమించాల్సిన చారిత్రక సందర్భం ఇది.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

4 thoughts on “స్వాతంత్య్రం సరే… ఫలాలు దక్కిందెవరికి?

  1. బాగుంది. కాని, కార్మిక నాయకత్వ ఐక్యత సాధ్యం అవుతుందా ? సమస్యలు మరింత తీవ్రమైతే తప్ప ప్రజలు ఏకం కారేమో.

  2. Narasimha Reddy Sir,
    Totally review the Governance and the undemocratic rule and pro rich policies of all the Governments that ruled India.
    The analysis is very good. He should have touched the Russian Five year plans model and its results.
    Jeevan Kumar
    Human Rights Forum

  3. Reddy Garu —so so article —not. Clear
    Nehru is not elected p.m —Gandhi selected—Patel got more votes in c.w.c meeting
    Due to Nehru And congress party —reddys —agrakulalu benefitted
    Nehru made so many mistakes — UNO seat given to china —putting Kashmiri issue in UNO -plus planted the seed
    Family ruling (varasathvam )the family ruined the country — by emergency indira Gandhi RAPED -democracy —still Sonia playing dirty politics in the party -one family ruling the country —that is not democracy
    75 years independence —-
    Poor is. Very poor
    Rich is very rich
    Most states are ruled by family –
    Still economic. Differences
    Caste feeling
    MONEY -RELIGION plays big politics in the elections
    NO land reforms
    Kumbakonaalu..?
    More deposits in swisbanks
    NO CHANGE AT ALL

    =======================
    Buchireddy gangula

Leave a Reply