స్థూపం

“స్థూపాన్ని కూల్చేస్తాండ్లు” అంటూ పెద్దగా అరుచుకుంటు పూసల వెంకటయ్య మనుమడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు.

పశువులను మందకు తోలుతామని కట్టువిప్పుతుంటే వాని అరుపు వినిపించి అంటు వైపు చూసాను.

వెంకటయ్య మనుమనికి పది పన్నెండేండ్ల వయసుంటుంది. మూడేండ్ల క్రిందట వెంకటయ్య కొడుకు రాజేశం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. బ్రతికి ఉన్నప్పుడు వాళ్లకున్న మూడెకరాల చెలకను సాగు చేసుకుంటూ చాలిచాలని బ్రతుకు బ్రతికేవాడు.

వ్యవసాయం చేసుకుంటూ చిన్న రైతులు బ్రతికే పరిస్థితులు లేకుండా పోయింది. బయట పరిస్థితులు చూడబోతనో కొనబోతే కోరివి, అమ్మబోతే అడివిలా ఉంది. విత్తనాలు, పురుగుల మందులు వంటి అరొక్కదానికి ధరలు పెరిగిపోయినవి. వాటితోడు కల్తీ విత్తనాలు రైతుల ప్రాణాలు తీసినవి. వరుసగా మూడు సంవత్సరాలు కాలం కలిసిరాలే.. ఒక సంవత్సరం సకాలంలో వర్షాలు కురువక నాటిన విత్తనాలు మొలకేత్తలేదు. మరో సంవత్సరం పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు కురిసి నాశనమైనవి. పోయిన సంవత్సరం మిర్చి పంట బాగానే వచ్చింది. కాని అమ్ముకోవటానికి మార్కేటుకు తీసుకపోతే రెండు రోజుల్లో క్వింటాలుకు ఎనిమిది వేలున్న ధర సగానికి సగం పడిపోయింది. ఇదేం అన్యాయమని మార్కేటుకు వచ్చిన రైతులు నెత్తినోరు కొట్టుకున్న సిండికేటు అయిన అడ్తిదారులు గింజముట్టుకోలే, కొనటానికి ముందుకు రాలే.. రైతులు అందోళనకు దిగితే ఎవ్వరు పట్టించుకోలే… చేసేదేమిలేక రైతులు అడ్డికి పావుషేరు ధరకు పంటలను అమ్ముకోవలసి వచ్చింది. దాంతో చేసిన కష్టం కూడా గిట్టుబాటు కాలే… ఇట్లా వరస నష్టాలు రావటం, అప్పులు ఇచ్చిన షావుకార్లు ఒత్తిడి చెయ్యటంతో తట్టుకోలేక చేనుకాడ పురుగల మందు తాగి చనిపోయిండు!

పదేండ్ల క్రితమే వెంకటయ్య భార్య చనిపోయింది. ఉన్న ఒక్క కొడుకు చనిపోవటంతో వెంకటయ్య తట్టుకోలేకపోయిండు. గుండెదిటువు చేసుకొని చాతనై చాతకాకున్న కూలోల్లను పెట్టుకొని వ్యవసాయ పనులు చేయిస్తూ, కోడలుకు మనుమనికి పెద్ద దిక్కయిండు.

రివ్వున ఉరికివస్తున్న వాన్ని రెక్కపట్టుకొని అపి “ఏమైందిరా… ఏమంటానవు” అని అడిగాను.

“అక్కడ పెద్దలొల్లి అయితాంది.. అయిలన్న స్థూపాన్ని బుల్‍ డోజర్‍తో కూల్చేస్తాండు” అన్నాడు.

“ఎవలుర్రా”

“ఏమో తెలియదు చాలమంది పోలీసులు వచ్చిండ్లు ఎవరెవరో చాల మంది ఉన్నరు” అంటూ పరుగుపెట్టిండు.

అప్రయత్నంగానే నేను అటువైపు పరుగుపెట్టాను. మనసులో ఎన్నో ఆలోచనలు సుళ్లు తిరగాయి.

**

మాదిగ బక్కసాయిలు కొడుకు అయిలయ్య నేను ఒకే ఈడు వాళ్ళం.. మా ఊరి గవర్నమెంటు స్కూల్లో ఏడోతరగతి చదివిన తరువాత ఇద్దరం పోయి కాబ్వ శ్రీ రాంపూర్‍ గవర్నమెంటు హాస్టల్లో కలిసి చదువుకున్నాం. అయిలయ్య చదువులోనే కాదు, ఆట పాటలందు కూడా హుషారుగా ఉండేవాడు. ఎంత బాగా పాటలు పాడేవాడంటే ఎంత సేపు విన్నా వినాలనిపించేది…

ఇప్పుడు విచిత్రం అనిపిస్తుంది కాని మా చిన్నప్పుడు ఊరిలో దొరతనం బాగా ఉండేది. ఆ మాటకు వస్తే ఒక్క మా వూరేకాదు తెలంగాణలోని చాలావూర్లలో కూడా దొరల రాజ్యం కొనసాగేది.

ఊరిలోని మూడోవంతు భూములు మా వూరి దొర రామచంద్రరావుకు చెందినవి. ఆ రోజుల్లో ఆయన చాలా జులుం చెలాయించేవాడు. ఆయనకు ఎదురు పడితే తప్పుకొని పోవాల్సివచ్చేది. ఊరి మధ్య సోలు చిలతల చెట్ల మధ్య డంగు సున్నంతో కట్టిన రెండు అంతస్థుల బంగ్లాలోనే ఆయన ఉండేది. అమురుకుంటే అమరనటువంటి వంకీలు తిరిగిన పెద్ద కమాన్లతో రామచంద్రరావు దొరతండ్రి ఎనకటెప్పడో కట్టించిన గడి ఇప్పటికింకా చెక్కు చెదరలేదు. ఊరిలోని సమస్త కులాలవాళ్ళు దొరకు ఎట్టి చెయ్యాల్సి వచ్చేది. చెఱువు క్రింద పారకం అయ్యే పొలాలు అన్ని దాదాపు దొరవే… ముందుగా ఆయన పొలాలు సాగు చేసిన తరువాతే రైతులు తమ పనులు చేసుకోవాలి. వూరిలో భార్యభర్తల పంచాయితీ మొదలు ఏ పంచాయితీ అయినా దొరే తీర్పు చెప్పేవాడు. ఆయన చెప్పిందే వేదం…

ఎవరైనా తన మాట వినలేదంటే ఇక వానికి మూడినట్టే… దొర మనషులు అటువంటి వాన్ని పట్టుకపోయి గడిలోవేసి రోజుల తరబడి హింసించేటోళ్ళు… ఒక్క మాటలో చెప్పాలంటే అప్పటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏండ్లు గడిచినా మా వూరిలో దొర రాజ్యమే నడిచేది. చివరికి ఊరి సర్పంచ్‍ మొదలుకొని పెద్ద పెద్ద ప్రజాప్రతినిధుల వరకు ఆయన కనుసన్నల్లో మెదిలేవాళ్ళే… ఆయన్ని కాదని మనుగడ సాగించటం కష్టమయ్యేది. ఎందుకంటే దొర పలుకుబడి ఒక్క మా వూరికే పరిమితమయి లేదు. చుట్టూ పదహారు ఉళ్ళలో ఆయనకు చాలా భూములున్నవి. ఆ వూర్లల్లో పెత్తనం కూడా ఆయనదే.. ఆయనకు ఎంత భూమి ఉందో ఎవరు నిర్ఠిష్టంగా చెప్పలేకపోయేవారు. కాని మొత్తానికి వేల ఎకరాలున్నయని కొందరంటే, లేదు లేదు లక్షల ఎకరాల భూమి ఉందనే వాళ్ళు కూడా లేకపోలేదు.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా చాలా ఏండ్ల వరకు మా వూరిలో బడిలేదు. పోరగాండ్లు చదువకుంటే తెలివి మీరుతరని ముందు చూపుతో పెద్దొర కమలాకర్‍ రావు బ్రతికున్నప్పుడు తన పలుకుబడి ఉపయోగించి ఊరిలోకి బడిని రానివ్వలేదు. ఆయన కాలం చేసిన తరువాతనే ఊరిలోకి గవర్నమెంటు వారి అప్పర్‍ ప్రైమరి స్కూలు వచ్చింది. అవిధంగా మాకు చదువుకునే అవకాశం కలిగింది. అట్లా మేం ఏడో తరగతి వరకు వూరిలో చదువుకొని అటు తరువాత పై చదువులుకు గవర్నమెంటు హాస్టల్‍కు పోయినం.

కొంత కాలం చీకటి కొంత కాలం వెలుగు అన్నట్టుగా ఏ దొరతనమైనా, దౌర్జన్యమైన ఎల్లకాలం సాగదు. ఈ బాధలు పడలేక జనం ఎదురుతిరిగే రోజు ఒకటి వస్తుంది. అవిధంగా ఎనుబై దశకంలో జగిత్యాల మీదుగా వీచిన విప్లవ గాలులు తెలంగాణ అంతటా విస్తరించింది. దొరల దొరతనం క్రింద నలిగిపోయి ఎండుటాకుల్లా రెపరెపలాడుతున్న జనం మధ్యకు విప్లవ భావాలతో తొణికిసిలాడుతున్న చదువుకున్న పిల్లలు వచ్చి, వాడ వాడ మీటింగ్‍లు పెట్టి దొర ఏందిరో వాని పీకుడేందిరో అని పాటలు పాడుతూ దొరల దొరతనం గుట్టువిప్పి సంఘం పెట్టుకొని సంఘటితమై పోరాడితే తప్ప మన బత్రుకులు బాగుపడవని చెప్పిండ్లు. మావూరిలో కూడా మీటింగ్‍ పెట్టినప్పుడు దొరకు ఆ విషయం తెలిసి అగ్గిమీద గుగ్గిలం అయ్యిండు. తన గుండాలను పంపించి మీటింగ్‍ మీద దాడి చేయించిండు. అందినోన్ని అందినట్లు చితకబాదిండ్లు… కాని సంఘల నిర్మాణం కాకుండా ఆపలేకపోయిండు.

దొర భూముల్లో వెట్టిమందులు పెట్టేకాడ తన మాటకు ఎదురు తిరిగాడని గొల్ల మల్లయ్యను పట్టుకపోయి దొర గడిలో వేసి కొడ్తే వారం రోజులు లేవలేదు. ఆ సంఘటన మల్లయ్య కొడుకు ఏసోబును తీవ్రంగా కలిచివేసింది. ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో కోపంతో కుతకుతలాడుతున్న ఏసోబుకు ఆ ప్రాంత ఆర్గనైజర్‍ ‘రామన్న’ కలువటంతో ఓ దారి దొరికినట్టయింది.

ఆ తర్వాత కొద్ది రోజులకే ఏసోబు ఊరి సంఘం బాధ్యతలు తీసుకున్న తరువాత ఊరి పరిస్థితి మారిపోయింది. కూలీనాలీలనంత ఏకం చేసి చేసిన పనికి కూలి ఇవ్వకుంటే ఏ పనులు చేసేది లేదు అంటూ ఎట్టి పనులు బందుపెట్టించిండు. అంత వరకు దొర కబ్జాలో ఉన్న బంజరు భూములు, చెఱువు శిఖం భూములు, గుట్ట బోరు ప్రజలపరం చేసిండు… దాంతో దొర అగ్గిమీద గుగ్గిలం అయిపోయి తన అనుచరులతో గుండాదాడులు చేయించిండు. కాని ఏసోబు నాయకత్వంతో సంఘ సభ్యులు ఎదురు తిరిగి గుండాలను గట్టిగా బుద్ధి చెప్పటంతో, దొర పోలీసులను ఎగదోసి దొంగకేసులు పెట్టించిండు… ఏసోబు పోలీసులకు దొరకలేదు… కొంత మంది సంఘ సభ్యులను పట్టుకపోయి పోలీసుస్టేషన్ల రోజుల తరబడి చిత్రహింసలు పెట్టి దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించిండ్లు…

దొర మునపటి లెక్క అదరించి బెదిరించి దారిలోకి తెచ్చుకోవటానికి వేసిన ఎత్తులేవి పనిచేయ్యలేదు. సరికదా మరింత ముదిరి పోయింది. సంఘం నాయకత్వంలో దొరను సాంఘీక బహిష్కరణ చేసిండ్లు… పని చేసేవాళ్ళు లేక దొరభూములు బీడు పడ్డాయి. చివరికి దొరగడీలో కసువు ఉడ్చేవారు పశువులకు మేత వేసేవాడు కూడా కరువైండ్లు. దాంతో దొర కాలికింద దుమ్ము కంటపడట్టు అయి ఏమి చేయ్యలేక కుతకుతలాడిండ్లు…

అటువంటి సమయంలో దొరలంతా అందరికందరు కలిసి పోయి… ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఏండ్లకు ఏండ్లు దొరల దౌర్జన్యాలకు జనం బలైపోతుంటే పట్టించుకోని ప్రభుత్వం దొరలకాళ్ళ క్రింద భూమి కదల బారే సరికి దొరలను కాపాడటానికి ఉళ్ళమీదికి పోలీసు బలగాలను పంపింది. ఆవిధంగా మావూరి దొరగడిలో పోలీసుక్యాంపు వచ్చింది. బారు తుపాకులు వేసుకొని పోలీసులు ఊరిమీదపడి కనిపించినోన్ని కనిపించినట్టుగా పట్టుకపోయి కొట్టిండ్రు. కొంతమంది మీద కేసులు పెట్టి జైలుకు పంపింరు… ఈలోపు ఏసోబు దళనాయకుడుగా ఎదిగిండు ఇంత చేసినా ఏసోబు దొరకక పోయే సరికి దొరకు నిదుర కరువైంది.

ఈలోపున రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వచ్చినవి.

స్వాతంత్య్రం వచ్చిన కాన్నుంచి ఎదురు సదురు లేకుండా రాష్ట్రంలో అధికారం కొనసాగించిన కాంగ్రెసు పార్టీకి ఎన్టిరామారావు తెలుగు దేశం పార్టీ పెట్టడం, తనకున్న సినీ గ్లామర్‍తో పాటు, తెలుగువారి ఆత్మగౌరవం, నక్సలైట్లు దేశభక్తులు వంటి ఆకర్షణీయమైన నినాదాలతో ఊరూర తిరిగి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిండు… కాని అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ఆయన అస్సలు స్వరూపం బయటపడసాగింది.

ఎన్టిరామారావు రెండవ సారి ముఖ్యమంత్రి అయిన తరువాత అంతవరదాక కప్పుకున్న ముసుగులన్ని తొలగిపోయి ఆయన వర్గస్వభావం బయట పడింది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే దేశంలోని బార్డర్‍ సెక్యూర్టి పోర్సు, ఇండోటిబెటియన్‍ బార్డర్‍ పోర్సు వంటి అర్థ సైనిక బలగాలను పెద్ద సంఖ్యలో తెలంగాణ పల్లెలో మోహరించి అక్రమ అరెస్టులు, చిత్రహింసలతో కనిపించిన కార్యకర్తలను పట్టుకొని కాల్చిచంపుతూ, కార్యకర్తల ఇండ్లుకూల్చి వేస్తూ చివరికి దాచుకున్న తిండిగింజలను కూడా బావుల్లో పోస్తూ, తీవ్ర నిర్భందం అమలు జరిపిండు.

ఇంత చేసిన ఏసోబు దొరకకపోయే సరికి, పోలీసులు వాళ్ళ ఇంటిని నేలమట్టంచేసిండ్లు. ఆయన తండ్రిని తీస్కపోయి నీకొడుకును పట్టించకుంటే నిన్ను చంపుతామని చిత్రహింసలు పెట్టిండ్లు… కాని ఇవేవి కూడా ఏసోబుకు తన పోరుబాటనుండి మళ్ళించ లేకపోయినయి. ఆయన మరింత పట్టుదలగా ఉద్యమాన్ని ముందుకు తీసుక పోయిండు.

ఏసోబు పై నిర్భందం తీవ్రం కావటంతో పార్టీ ఆయన్ని వేరే ప్రాంతంలో ఉద్యమ విస్తరణ కోసం పంపించింది. అప్పటికే ఏసోబు దళంలో పని చేస్తున్న అయిలన్న దళనాయకుడుగా ఉద్యమ బాధ్యతలు చేపట్టిండు. నీళ్ళలో చేపలాగా ప్రజల మధ్య తిరుగుతూ నిర్భందాన్ని ప్రతిఘటిస్తూ మళ్ళీ పోరాటాలను ముందుకు తీసుకు పోవటంలో అయిలన్న కీలకంగా వ్యవహరించిండు.

దాంతో గ్రామాల్లో సంఘాలు బలపడి భూపోరాటాలు ఉన్నతస్థాయికి చేరుకొని, దొరల పట్టా భూములు కూడా అక్రమించుకొనే స్థాయికి చేరుకున్నది. అయిలన్న నాయకత్వంలో జనం దొర భూముల్లో ఎర్రజెండాలు పాతిండ్లు.

దొర భూముల ఆక్రమణ పోరాటం ఒక జాతరలా సాగింది. ఈ పరిణామం ఉహించని దొర ఉగ్రనర్సింహుడై పోయిండు. ఈ లోపున రాష్ట్రంలో తెలుగు దేశం ప్రభుత్వం పోయి కాంగ్రేసు పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెసు పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు చెన్నారెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామిక వెసులుబాటు కల్పించింది. ఆ కాలంలో పార్టీ నిర్ణయించిన బహిరంగ సభలకు లక్షలాదిగా జనం కదిలివచ్చిండ్లు. విప్లవోద్యమానికి ప్రజల్లో ఉన్న ఆదరణ అందరికి తెలిసింది.

దాంతో వెర్రెత్తిన పాలక వర్గాలు రాయలసీమ ఫాక్షనిష్టులు కలిసి హైద్రాబాద్‍లో మతకలహాలు సృష్టించి దాన్ని సాకుగా చూపి చెన్నారెడ్డిని అధికారం నుండి దించి, నేదురుమల్లి జనార్థన్‍ రెడ్డిని అధికారంలోకి తెచ్చిండ్లు. ఆయన వచ్చిన కొద్ది నెలలకే విప్లవోద్యమం మీద ఉక్కు పాదం మోపిండు. రెండవ దశ నిర్భందం అమలు జరిపిండు. ఆ రోజుల్లో మా లాంటి యువకులు ఎవరు కూడా ఊరిలో ఉండే పరిస్థితి లేకుండా పోయింది.

తీవ్రనిర్భంద పరిస్థితిని ఆసరగా చేసుకొని దొర మళ్ళీ తోక ఆడించిండు. దళనాయకుడు అయిలన్నను చంపితే కాని తనకు సుఖంలేదని భావించిన దొర కుట్రలు చేసిండు. ఒక రోజు అయిలన్న దళం మావూరి ప్రక్క ఊరైన గుండ్రాతిపల్లెలో ఉన్న సంగతి తెలుసుకున్న దొర, ఆ సమాచారం పోలీసులకు చేరవేసిండు.

దళం అర్థరాత్రి ఆద మరిచి నిదురపోతున్న సమయంలో దొంగచాటుగా వచ్చిన పోలీసులు దాడి చేసిండ్లు… అది కనిపెట్టిన సెంట్రీ అప్రమత్తమయ్యే సరికి పోలీసులు హౌజ్‍ సెల్టర్‍ను చుట్టేసిండ్లు. ఆనాడు జరిగిన కాల్పుల్లో నలుగురు దళ సభ్యులు చనిపోగా దళనాయకుడు అయిలన్నతో సహా మరో నల్గురు దళ సభ్యులు తప్పుకోగలిగిండ్లు.

ఆ సంఘటన తరువాత దొర ఊరు విడిచి హైద్రాబాద్‍ పట్నంకు పారిపోయిండు. అటు తరువాత చాటు మాటుగా వచ్చి, దొంగ దొంగతనంగా తన గుమాస్తాలతోని కొంత కాలం పనులు సాగించిండు. ఒక రోజు దొర వచ్చిన సంగతి తెలిసి అయిలన్న దళం దొర మామిడితోటలో కావువేసి దాడి చేసిండ్లు. కాని దొర అదృష్టం బాగుండి బ్రతికిపోయిండు… అప్పటి నుంచి దొర మళ్ళీ ఊరు మొఖం చూడలేదు.

పార్టీ నాయకత్వంలో ఊరిలోని భూమిలేని పేదరైతులకు, కూలీనాలీలకు దొర భూముల పంపకం చేసింది.

“నిజమే ఇవ్వాళ దొర భూములు పంచుతాండ్లు కాని మళ్ళీ దొర వచ్చి నా భూములు నాకు కావాలంటే ఎట్లా?” అంటూ కొంత మంది భయపడ్డారు.

కాని తమకంటూ గుంటెడు భూమి లేకుండా ఏండ్లకు ఏండ్లుగా కూలినాలి చేసుకుంటూ బ్రతికిన చాల మంది జనం “దొరలు ఏమన్న ఈ భూములు బొడ్లెవేసుకొని పుట్టిండా! ఇదంత పేద ప్రజలను అదిరించి బెదిరించి అక్రమించుకున్నడు. దొరరాని వాని జేజమ్మ రాని భూమి మాత్రం వదిలేది లేదు” అంటూ ముందుకు వచ్చిండ్లు…

ఆక్రమించుకున్న భూములు దున్ని పంటలు వేసిండ్లు… పంట చేతికివచ్చే సమయానికి దొర పట్నం నుండి పోలీసులను పంపిండు. ఆ రోజు నిజంగా పెద్దలొల్లే జరిగింది. సంఘం నాయకత్వంలో ఊరు ఊరంతా ఒక కట్టు మీద నిలబడి పోలీసులను ఎదిరించి, పంట కాపాడుకున్నారు.

అట్లా కొన్ని ఏండ్లు సాగింది. నడిచినంత కాలం నడిపించుకున్న దొర కాలం కలిసిరాకపోయే సరికి ఊరు మీద అశ వదులుకొని పట్నంలో ఏవేవో వ్యాపారాలు చేసి బాగా సంపాదించిండు. ఆయన కొడుకులిద్దరు పెద్ద చదువులు చదువుకొని అమెరికాకు పోయి అక్కడే స్థిరపడ్డారు.

తెలంగాణ గ్రామాల్లో ఏండ్లకు ఏండ్లుగా సాగిన భూస్వామ్య దొరతనం పోయి పార్టీ నాయకత్వం సంఘాలు బలపడి గ్రామాల్లో రైతుకూలీలదే రాజ్యం కావటం దోపిడి పాలకులకు మింగుడు పడలేదు. విప్లవ పోరాటాన్ని అణచివేయటానికి నిర్భందం తీవ్రతరం చేసిండ్లు. వందలాది మందిని ఎన్‍కౌంటర్ల పేర కాల్చి చంపుతూనే రకరకాలుగా కుట్రలు చేసి నర్మగర్బితమైన దాడులకు దిగింది. ఉద్యమానికి నాయకత్వం లేకుండా చేయటానికి దళం మీద ప్రత్యేక శ్రద్ద పెట్టి ఏరివేసే చర్యలు చేపట్టింది.

అటువంటి తీవ్ర నిర్భంద పరిస్థితిలో ఒక రోజు అయిలన్న దళం ప్రయాణంలో ఉండగా ఇన్‍ఫార్మర్స్ ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు మాటుగాసి జరిపిన కాల్పుల్లో అయిలన్న అమరుడైండు.

ఆ విషయం తెలిసి జనం తమ ప్రియమైన నాయకుని కడసారి చూపుకోసం చుట్టు పది ఊళ్ళ జనం కదిలిండ్లు… అయిలన్న దహన కార్యక్రమాలకు హాజరు కాకుండా చూడాలని వందలాది మంది అదనపు సాయుధ బలగాలను దించి, కట్టడి చెయ్యాలని చూసినా సాధ్యం కాలేదు. వేలాది మంది జనం విప్లవ నినాదాల మధ్య అయిలన్న అమరత్వాన్ని కీర్తిస్తూ పాటలతో తమ ప్రియమైన నాయకునికి నివాళి అర్పించి దహన సంస్కారాలు నిర్వహించారు.

అటు తరువాత కాలంలో సంఘం నాయకత్వంలో అయిలన్న స్మారకస్థూపం నిర్మించి, ప్రతి సంవత్సరం సంస్మరణ దినం జరపటం ఆనవాయితీగా మారింది.

కుట్ర పూరితంగా సాగించి ఎత్తుగడలతోనైతేనేమి, నిర్భందం వల్లనైతేనేమి క్రమంగా ఉద్యమం వెనుక పట్టుపట్టింది. అనేక మంది అమరుల త్యాగాల మధ్య దాదాపు పాతికేండ్లుగా సాగిన ఉద్యమం ఫలితంగా తెలంగాణ ప్రాంతంలో లక్షలాది ఎకరాల భ్యూములు రైతు కూలీలు స్వాధీనం చేసుకున్నారు.

ఉద్యమం వెనక పట్టుపట్టడంతో పోలీసులు అండ చూసుకొని కొంత మంది దొరలు భూములు, తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని చోట్ల రాజీకి వచ్చిన భూస్వాములు కొంత భూమిని అక్రమించుకున్న వారికి వదిలి, మిగతా భూమిని స్వాధీనం చేసుకున్నారు. కాని చాలా చోట్ల ఆక్రమించుకున్న భూములు ఇంకా రైతు కూలీల చేతులోనే ఉండిపోయింది. ఏండ్లకు ఏండ్లుగా చేసుకుంటూనే ఉన్నారు. ఆ విధంగా మా వూరిలో కూడా దొర భూములు ఆక్రమించుకున్న కూలీల చేతిలోనే ఉండిపోయినవి.

**

ఊపిరి సల్పని నిర్భందంతో తల్లడిల్లిన తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొత్త ఆశలు కల్పించింది. ఆంధ్ర వలస వాద దోపిడికి అన్ని రకాలుగా అన్యాయంకు గురైన ప్రజలు తమ రాష్ట్రం తమకు ఏర్పడితేనే, నీళ్ళు, నిధులు, నియామాకాల్లో న్యాయం జరుగుతుందని భావించి ఊరువాడా కదిలి పెద్ద ఎత్తున ఉద్యమించిండ్లు.. ఉద్యమంలో చొరపడ్డ అవకాశవాదులు, రాజకీయ నిరుద్యోగులు ఉద్యమాన్ని తమ చెప్పుచేతుల్లో నుండి జారిపోకుండా ఎప్పటికప్పుడు కర్రవిరగవద్దు, పాము చావద్దు అన్న ధోరణిలో ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు సాగకుండా కుట్రలు చేసిండ్లు…

నిజాం ఫ్యూడల్‍ దొరతనం క్రింద తెలంగాణ ప్రజలు ఎన్ని బాధలుపడ్డా, ఆత్మహత్యలు చేసుకోలేదు. సరికదా తెగించి పోరాడిండ్లు… కాని మలిదశ తెలంగాణ ఉద్యమంలో నాయకులు ఆత్మహత్యల డ్రామాలు ఆడి నిరాశ నిస్పృహలతో ఉన్న వందలాది మంది యువకులు ఆత్మహత్యలు చేసకునేలా ప్రేరేపించిండ్లు. ఏమైతేనే సుదీర్ఘ పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

తెలంగాణ రాష్ట్రం రానైతే వచ్చింది కాని ప్రజల ఆశలు నెరవేరకుండా పోయింది. రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వాటిని భర్టీ చేయక నిరుద్యోగుల నోల్లల్లో మట్టి కొట్టిండ్లు… తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్లు… దొంగలు, దోపిడి దారులదే రాజ్యమై పోయింది.

ఆ ఈనకాల్చినక్కల పాలు చేసినట్టు అయిపోయి, తెలంగాణ ప్రజలు మరో సారి మోసపోయిండ్లు…

**

నేను అక్కడికి పోయే సరికి స్థూపం కాడ పెద్దలొల్లి జరుగుతుంది. ఒక వైపు వందలాది మంది పోలిసులు మరో వైపు జనం ఎదురు బదురుగా నిల్చోని ఘర్షణ పడుతున్నారు.

జనం ముందు నిలబడి ఎయస్పి చేతిలో రివాల్వర్‍ను తిప్పికుంటూ “ఎవరు మందుకు రావద్దు, వస్తే కాల్చి పారేస్తా” అంటూ కోపంతో అరుస్తున్నాడు. ఎయస్పి గంగాధర్‍ను చూసే సరికి నా కడుపులో కోపం రగిలి పోయింది.

ఇరువై ఏండ్ల క్రింద కొత్తగా యస్‍.ఐ. గా వచ్చినప్పుడు ఉద్యమం తీవ్రంగా ఉండేది. ఆ రోజుల్లో పోలీసులు ప్రజల మీద చేయని దౌర్జన్యం లేదు. అంటువంటి వారిలో గంగాధర్‍ మరింత క్రూరంగా వ్యవహరించేవాడు. ఒక్కసారి వాని చేతికి చిక్కితే బ్రతికి బట్టకట్టడం కష్టమయ్యేది. ఒకసారి వానికి చిక్కి వాడు పెట్టిన చిత్రహింసలు ఇప్పటికి నన్ను బాధిస్తూనే ఉన్నాయి. అయిలన్నను ఎన్‍కౌంటర్‍ చేయటంలో వానిదే ప్రముఖ పాత్ర. అటువంటి వాడు తెలంగాణ వచ్చిన తరువాత అడిషనల్‍ యస్‍.పి. గా ప్రమోషన్‍ పొంది మళ్ళీ జనం మీద అదే దౌర్జన్యం చేస్తున్నాడు.

“ఏం మేం ఎందుకు పోవాలి… ఇరువై ఏండ్లుగా మేం ఈ భూములు సాగు చేసుకుంటున్నాం… మీరు పొమ్మనగానే ఎట్లా పోతాం” అంటూ ఒక రైతు ఎదురు నిల్చిండు.

“పోకుంటే ఏం చేస్తావ్‍?… ఇదేమన్న మీ అయ్య సంపాదించిన భూమారా” అంటూ ఎయస్పి కోపంతో ఊగిపోయిండు.

“మేం పోరాడి సాధించుకున్న భూమి” అన్నారు ఒకరు మందిలో నుండి.

“ఎవడ్రా ఆ మాట అన్నది” అంటూ జనంలోకి కొర కొర చూసిండు. కాని ఎవడన్నడో అర్థంకాలే. “బిడ్డా గుండాయిజం చేసి భూములు ఆక్రమిస్తే అవి మీవై పోతాయా?” అన్నాడు కోపంగా.

“ఇన్ని ఏండ్లుగా సాగు చేసుకుంటానం. ఇప్పుడు పొమ్మంటే ఏట్లా పోతం…” అంది ఒక స్త్రీ.

“ఇన్నేండ్లకానుంచి లేంది ఇదేం లొల్లి” అన్నారు మరొకరు.

“ఇన్ని రోజులు మీ దౌర్జన్యం సాగింది… ఇప్పుడిక సాగదు. తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది.” అన్నాడు ఎయస్పి కటువుగా.

“కొత్త చట్టమా? అదేం చట్టం” అన్నరొకరు.

“అవును భూమి ఎవరి పేరు మీదుంటే వాళ్ళకే భూమి చెందుతుంది” అన్నడు ఎయస్పి.

“అంటే నెత్తురు ధారపోసి దొరలకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న భూములు మా నోట్లో మట్టికొట్టి మళ్ళీ దొరలకు అప్పచెప్తారా”

“భూమి ఎవరి పేరు మీద ఉంటే వానికే చెందుతుంది” అన్నాడు ఎయస్పి మళ్ళీ.

“ఇది పచ్చి మోసం” అన్నారు జనం.

“అదంతా మాకు తెల్వదు ప్రభుత్వ రూల్స్ అమలు చేయటమే మా పని” అంటూ కటువుగా సమాధానం ఇచ్చిండు ఎయస్పి.

“అంటే ఇన్నేండ్ల భూమి కోసం జరిపిన పోరాటాలు, సాగించిన రక్త తర్పణాలు, అయిలన్న లాంటి అమరుల త్యాగాలు ఒక కలం పోటుతో రద్దు చేసి దొరల భూములు మళ్ళీ దొరలకు అప్పజెప్పారా?”

“ఎవడ్రా వాడు ఎక్కువ మాట్లాడుతాండ్లు” అంటూ జనంలోకి చూసిండు.

“చూడబోతే ఎనకట రోజులు మళ్ళీ వచ్చినయ్. నిజాం వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగసాయుధ పోరాటం చేసి ఆక్రమించుకున్న భూములను స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సర్కారు సైన్యాలు దొరలనెత్తిన గాంధిటోపి పెట్టి మళ్ళీ ఊర్లలో వాళ్ళ భూములు వాళ్ళకు అప్పగించి మళ్ళీ దొరల రాజ్యం నెలకొల్పినట్టే ఉంది” అన్నాడో పెద్దమనిషి.

“ఒక్క కలం పోటుతో ప్రజలు స్వాధీనం చేసుకున్న భూములు మళ్ళీ దొరలకు అప్పజెప్తాంది నేటి ప్రభుత్వం” కోపంతో జనం కుతకుత లాడుతాండ్లు.

“చట్టం తన పని తను చేసుకపోతుంది. చట్టాన్ని ఎవ్వరైనా వ్యతిరేకిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్న జనం ఇక్కడి నుంచి కదిలిపోకుంటే తీవ్ర పరిణామాలుంటాయి.” అంటూ ఎయస్పి హెచ్చరించిండు.

అయినా జనం కదిలేదిలేదు అన్నట్టుగా భీష్మించుకుని కూచొని పెద్ద ఎత్తున నినదించ సాంగిండ్లు. నినాదాల హోరెత్తింది.

“ప్రాణాలు పోయినా భూములు వదిలేది లేదు”
“అయిలన్న అమర రహే”
“ఇదేం రాజ్యం ఇదేం రాజ్యం
దోపిడి రాజ్యం దొంగల రాజ్యం…”

కోపంతో రగిలి పోయిన ఎయస్పి “చార్జ్” అంటూ అరిచిండు.

దాంతో ఒక్కసారిగా వందలాది మంది పోలీసులు లాఠీలు ఆడిస్తూ జనం మీద పడ్డారు.

అరుపులు కేకలతో జనం పరుగుపెట్టిండ్లు.

సాయుధ పశుబలం ముందు జనం బలం అంతకంతకు క్షీణించింది. చూస్తుండగానే అక్కడ ఎవ్వరు లేకుండా జనం పరుగులు పెట్టిండ్రు. దూరం దూరంగా పరిగెట్టి నిలబడి పోయిండ్లు…

దూరంగా కారులో కూచున్న చిన్న దొరలు చిర్నవ్వులు చిందిస్తుంటే ఎయస్పి గంగాధర్‍ హుషారుగా చేయెత్తి ఈల వేసిండు. ఆ వెంటనే ఆయన “చూస్తారేందిరా పని కానియ్యండీ” అంటూ బుల్డోజర్ డ్రయివరకు పురమాయించిండు.

దాంతో అంత వరదాక ప్రజల ఆశలను, ఆక్షాంక్షలను సగర్వంగా ఎత్తి పట్టిన అయిలన్న ఎర్రటి స్థూపం నేలకూలుతుంటే దూరంగా నిలబడి పోయిన జనం కన్నీళ్ళతో కోపంతో రగిలిపోయిండ్లు.

ఆ దారుణం చూడలేక పడమటికి వంగిన సూర్యుడు చిందించే సంధ్యారుణ కాంతిలో కోపంతో కుతకుతలాడుతున్న జనం అంతా ఎర్రబారిండ్లు.

రచయిత. తెలుగు సాహిత్యంలో పి.చందు గా సుపరిచితుడు. అసలు పేరు ఊరుగొండ యాదగిరి. వరంగల్ ఉర్సులో 1954 సెప్టెంబరు 24 న వీరమ్మ, మల్లయ్య దంపతులకు జన్మించారు. ఎల్.బి. కాలేజీలో బి.కాం చదివారు. సింగరేణిలో ఉద్యోగ విరమణ చేశారు. "శేషగిరి", "నల్లమల", "భూదేవి", "నెత్తుటిధార", "శృతి", "బొగ్గులు" తదితర పదిహేను నవలలు రాశారు. సుమారు వంద కథలు రాసి "భూ నిర్వాసితులు", "జులుం", "గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు", "సమ్మె కథలు" కథా సంపుటాలు ప్రచురించారు.

Leave a Reply