మనకాలపు విప్లవకర కార్మిక శక్తి వికాస చరిత్ర: సైరన్ నవల

అల్లం రాజయ్యది ఉత్పత్తి సంబంధాలలో నూతన ప్రజాస్వామిక మార్పు కోసం తెలంగాణా పురిటి నెప్పులు తీస్తున్న కాలానికి మంత్రసాని తనం చేసిన తరం. చెలిమలుగా ప్రారంభమై జల ఊరుతూ ఉరుకులు పరుగులు ఎత్తుతున్న ప్రజా పోరాటాల వెంట దాదాపు యాభైఏళ్లుగా నడుస్తున్న అలుపెరుగని యాత్రికుడు. ప్రవాహాన్ని గమనిస్తూ గమన వేగాన్ని, ప్రవాహంలో మునకలేస్తూ లోతులను అర్ధం చేసుకొంటూ ఎన్ని జీవితాలనో, ఎన్ని బాధలనో, ఎందరి చైతన్యాలనో తాను జీవిస్తూ, అనుభవిస్తూ, ఆవాహన చేసుకొంటూ ఆ క్రమంలో ఉద్వేగానికి, కలవరానికి, కల్లోలానికి గురవుతూ ఆ ఒత్తిడి నుండి అనివార్యమైన ఒక ఆచరణగా నవలలు వ్రాస్తున్నాడు. 1978 లో వ్రాసిన తొలి నవల కొలిమంటుకొన్నది నుండి దాదాపు అప్పుడే మొదలు పెట్టి 2020 నాటికి గోదావరి అంతర్జాల పత్రికలో సీరియల్ గా వచ్చి 2021 డిసెంబర్ లో మలుపు ప్రచురణగా వచ్చిన సైరన్ నవల వరకు ఆయనది అదే పద్ధతి.

సింగరేణి కార్మిక వర్గ జీవితాన్ని, దుర్భర పని పరిస్థితులకు, యాజమాన్య వర్గపు దౌర్జన్యా లకు, శ్రమ దోపిడీకి విరుగుడు పోరాటమే అని తెలుసుకొంటూ, సంఘటితం అవుతూ నూతన మానవులు రూపొందుతున్న తీరును చారిత్రక దృశ్యంగా ఆవిష్కరిస్తూ అల్లం రాజయ్య సైరన్ నవలను వ్రాసాడు.1871 లో ఇల్లందులోని సింగరేణి గ్రామం భూగర్భంలో బొగ్గును కనుక్కోవటంతో తెలంగాణాలో కార్మిక వర్గం రూపొందటానికి రంగం సిద్ధమైంది. 1889 నుండి కొత్తగూడెం కేంద్రంగా ఇంగ్లాండుకు చెందిన ఒక కంపెనీ బొగ్గు తవ్వకాలు ప్రారంభించింది.1921 డిసెంబర్ 23 న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గా అది మారింది. 1930ల నాటికి బెల్లంపల్లి మొదలుగా గోదావరి లోయపొడుగునా బొగ్గు తవ్వకం విస్తరించింది. కార్మికుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

యాజమాన్య పెడధోరణులకు, హింసకు వ్యతిరేకంగా చెదురు మదురు తిరుగుబాట్లు కూడా మొదలయ్యాయి. 1940లలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో శేషగిరి చొరవతో కొత్తగూడెం కేంద్రంగా సింగరేణి కార్మికోద్యమం ఒక నిర్మాణ రూపం తీసుకున్నది. ఆ నాటి అసంపూర్ణ విప్లవాన్ని పాతికేళ్ల తరువాత మరింత అభివృద్ధికర రూపంలో కొనసాగించటానికి 1980 లో సింగరేణి కార్మిక సమాఖ్య ఏర్పడింది. అది ఏర్పడే దిశగా ఐదారేళ్ళ ముందు నుండి సింగరేణి కార్మిక జన జీవితంలో వస్తున్న కదలికలను, వాళ్ళ అసంతృప్తులను అవసరాలను సంఘటిత చైతన్యంగా పరివర్తింప చేయటంలో పార్టీ నిర్వహించిన పాత్రను, కార్మికవర్గం ఒక శక్తిగా ఎదిగిన క్రమాన్ని ఇతివృత్తంగా చేసి అల్లం రాజయ్య ఈ నవల వ్రాసాడు.

1.

ఈ నవలలో మొదటి భాగం రైతు బిడ్డ మొగిలి బొగ్గుబావి పని కోసం తన గ్రామంనుండి రెండు బస్సులు మారి రామగుండం లో రైలెక్కి చేరుకొన్న ఆ వూరు బెల్లంపల్లి అయివుండవచ్చు. గజ్జల గంగారాం అనుకొనటానికి వీలున్న గంగాధర్ ది అదే వూరు కావటం, కానాల బస్తీ, కానాల బస్తీ కూడలిలో ప్రజాకంటకుడు అయిన గుండా ను హతమార్చిన ప్రస్తావన అలా అనుకొనటానికి వీలుఇస్తాయి. మొగిలిని శంకరయ్య పని కోసం తీసుకు వెళ్ళింది కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం లీడర్ రాఘవులు దగ్గరకు. “ఇందిరమ్మ ఉన్నంత సేపు కార్మికుల హక్కులు గావాలంటే మనయూనియన్ ముందట బడంది కలువది. లట్టు గాడు పొట్టుగాడు తోకలు మిడకొడ్తే అందరిని ఎమర్జెన్సీ పెట్టి లోపలేసిందా లేదా? ఇందిరమ్మ అంటే ఆడపులి” అని మొగిలికి పని ఇప్పించగలవాడిని తానే అన్నట్లు చెప్పిన రాఘవులు మాటలు అది ఎమర్జన్సీ కాలం అని చెప్తాయి.1975 జూన్ 25 నుండి భారతదేశంలో ఎమర్జెన్సీ అమలులోకి వచ్చింది. కాలరీ పని దొరకక తాత్కాలికంగా అతను లోడింగ్ పనిలో చేరింది ఫిబ్రవరి నెలలో . ఆ తరువాత ఎమర్జెన్సీ ఎత్తేసిన రోజు జరిగిన ఊరేగింపు అతను చూస్తాడు. ఆ వార్త తోటి కార్మికుడు చెప్పగా తెలుసుకొంటాడు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన రోజు 1977 మార్చ్ 21. ఎమర్జెన్సీ చీకటి రోజులు ముగుస్తుండగా ఈ నవలలో కథ మొదలైందన్న మాట.1977 జనవరి ఫిబ్రవరి నెలలో మొదలై మార్చ్ 21 న ఎమర్జన్సీ ఎత్తివేయటం వరకు సాగిన కథ రెండవ భాగంలో మొదలయ్యే అసలు కథకు అవసరమైన భూమికను రూపొందించింది.

మొదటి భాగం కథలో తెలంగాణలో చిన్న సన్నకారు రైతు బిడ్డలు గ్రామీణ మూలాలనుండి పెకిలించుకొని బతుకు తెరువుకు కోరలు చాచిన బొగ్గుబావుల వైపు పరిగెత్తేట్లు చేస్తున్నవి వ్యవసాయ అవసరాల కు అందని నీళ్లు, పండని పంటలు, పండిన పంటను కొనే మార్కెట్ లేకపోవటం, తీర్చాల్సిన అప్పులు. బతుకు మరింత బాగా ఉంటుందేమోనన్న ఆశ. అక్కడ ఉద్యోగాలు పొందటానికి మళ్ళీ అప్పులు చేసి లంచాలు పెట్టటం, భూమి కడుపులోకి పోయి గాలీ వెలుతురూ లేని ప్రాంతాలలో పనిచేయ వలసిరావటం, భూస్వామ్య అధికారమే అక్కడ కూడా తనను ఒక విలువలేని మనిషి అన్నట్లుగా అవమానిస్తుంటే భరించవలసి రావటం,బొగ్గు ధూళి గుండెల కెక్కి అనారోగ్యం పాలు కావటం, పని బరువు ఒత్తిడిని తట్టుకొనటానికి తాగుడుకు అలవాటు పడటం, సంపాదించింది తినటానికి తాగటానికే అయిపోతుంటే అదనపు అవసరాలకు, ఆపదలకు మళ్ళీ అప్పులు చేయటం, అవి తీర్చలేక గుండాల దౌర్జన్యాలకు గురి కావటం, బతుకటానికి రోజూ చేసే సవాలక్ష యుద్ధాలలో తనకు తాను కాకుండా పోవటం, తోటి మనుషులకు దూరం కావటం, ఒక వైపు తాను హింసకు గురి అవుతూ, మరొక వైపు హింసకు కారణమూ కావటం కార్మిక జీవిత విషాదం. ఇంతవరకూ కాస్త అనుభవం, మరి కాస్త పరిశీలనా జ్ఞానం కలవాళ్లెవరైనా వ్రాయగలిగిన కథే. ఈ విధమైన జీవిత విషాద మూలం ఏమిటో తెలుసుకొని విముక్తి చెందే క్రమం ఎంత కష్టభూయిష్టం అయినా ఎంత సత్య సుందరాత్మకమో చారిత్రక చలన వాస్తవాల నుండి గొప్ప అల్లిక పని తో చూపటం అల్లం రాజయ్య వంటి రచయితలే చేయగలరు. నవలలో రెండవ భాగం అంతా అదే.

ఎమర్జన్సీ ఎత్తివేసిన తరువాత తెలంగాణాలో నక్సల్ బరి రాజకీయాల విస్తరణ వేగవంతమైంది. ఎమర్జన్సీ కి ముందే ప్రజా సంఘాల నిర్మాణం తో భూమి కేంద్రంగా వ్యవసాయవిప్లవాన్ని రగుల్కొల్పటానికి మొదలైన ప్రయత్నాలు అరెస్టులతో, నిర్బంధంతో ఆగిపోయాయి. ఎమర్జెన్సీ ఎత్తివేశాక జైళ్ల నుండి విడుదలైన రాడికల్ విద్యార్థులు తిరిగి సంఘటితం అవుతూ పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా విప్లవ నిర్మాణ కృషిలో భాగం అయ్యారు. అలాంటివాళ్లలో ఒకడుగా మొగిలి పెదతండ్రి కొడుకు నాగయ్యను మొదటి భాగంలో అలా దూరం నుండి చూపి రెండవ భాగంలో ఫోకస్ లోకి తీసుకొని వచ్చి అతనిని కేంద్రంగా చేసి సింగరేణి బొగ్గుగనులలో కార్మికోద్యమ నిర్మాణం ఇతివృత్తంగా ఈ నవలను వ్రాసాడు అల్లం రాజయ్య.

నాగయ్య కు గంగాధర్ తో పాటు కోటేశు, దేవేందర్, మీసాల రాజయ్య, రఘు, బక్క వెంకయ్య, మురళి, మోహన్ మొదలైన వాళ్లంతా ఎమర్జెన్సీ కాలంలో జైలు సహచరులు. ఇప్పుడు ఉద్యమ సహచరులు.విప్లవోద్యమ నిర్మాణంలో భాగమై ప్రాణాలు కోల్పోయిన లక్ష్మీరాజం, పోశెట్టి మొదలైన వాళ్ళ ప్రస్తావన కూడా వస్తుంది.వాళ్లంతా తెలంగాణ విప్లవోద్యమ చరిత్రతో సంబంధం ఉన్న వాస్తవ వ్యక్తులే. ఆ రకంగా ఇది మనకాలపు చరిత్ర. రెండవ భాగంలో కథను నడిపిన సూత్రం అదే. 1977 జులై 16 న గోదావరి ఖనిలో జరిగిన పౌర హక్కుల సభ ఈ నవలేతి వృత్తంలో భాగం అయింది. 1978సెప్టెంబర్ 7 నాటి జైగిత్యాల జైత్రయాత్ర, ఆతరువాత వచ్చిన కల్లోలిత ప్రాంతాల ప్రకటన పాత్రల మధ్య సంభాషణలో ప్రసక్తికి వచ్చాయి. సింగరేణిలో కార్మిక సంఘం కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది గానీ నవలలో ఆసంఘం ఏర్పాటు ప్రస్తావన లేదు. 1980 లో గానీ సింగరేణి కార్మిక సమాఖ్య ఏర్పడలేదు కనుక 1977ఫిబ్రవరి నుండి 1979వరకు దాదాపు మూడేళ్ళ కాలం మీద సైరన్ నవల ఇతివృత్తం ప్రవర్తించింది అనుకోవచ్చు.

ఆ కాలం భారత విప్లవోద్యమ చరిత్రలో, ప్రత్యేకించి తెలంగాణాలో చాలా కీలకమైనది. ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్న అవగాహనతో ప్రజలను చైతన్యవంతులను చేసి విప్లవోద్యమంలో వాళ్ళ భాగస్వామ్యాన్ని పెంచటం లక్ష్యంగా ప్రజాసంఘాల నిర్మాణానికి భిన్న ప్రజా జీవన రంగాలకు చొచ్చుకు పోవటం ఈ కాలపు ప్రధాన లక్షణం. రాడికల్ విద్యార్థి సంఘం ఇచ్చిన ‘గ్రామాలకు తరలండి’ కార్యక్రమం వలన కలిగిన క్షేత్ర స్థాయి అనుభవం, స్థానిక సమస్యల గురించిన అవగాహన నుండి విప్లవోద్యమ విస్తరణకు కొత్త వ్యూహాలు రూపొందించుకొంటున్న కాలం అది. రోజువారీ స్థానిక సమస్యలపై ప్రజల తక్షణ ప్రతిచర్యల కు మద్దతుగా నిలబడుతూనే వాళ్ళ ఆగ్రహాన్ని, ఆవేదనను సమష్టి రాజకీయ నిర్మాణంలోకి, ఆచరణలోకి మళ్లించటానికి రాజకీయ తరగతులు నిర్వహించటం వంటి ప్రయోగాలతో దీర్ఘకాలిక పోరాటాలకు శ్రమ శక్తులను సన్నద్ధం చేస్తున్న కాలం అది. అటువంటి చారిత్రక మలుపులో నిలబడి రాజయ్య వ్రాసిన సైరన్ నవల మనలను ఆయా ప్రాంతాలన్నిటా,ఆయా ఘటనల వెంబడి తిప్పుతుంది. వాటి మధ్య సంచరించే కష్టజీవుల స్పర్శ తో పాఠకులు పరిశుద్ధం అయ్యే స్థితిని కలిగిస్తుంది.

2.

నవల ప్రారంభం పల్లెలోనే అయినా, పల్లె వదిలి పని కోసం తొలిసారి సింగరేణి బొగ్గు గని ప్రాంతాలకు వెళ్లిన మొగిలి తో పాటు పాఠకులు కూడా కార్మిక ప్రపంచంలోకి అడుగు పెడతారు. ఆ ప్రపంచం ఎటువంటిది? బొగ్గు పొగ కమ్మి, రోడ్డు పక్క చెట్ల కిందనే జరుగుతున్న మల మూత్ర విసర్జనలతో దుర్గంధం కొడుతున్న పరిసరాలు. వీధి నల్ల దగ్గర నీళ్లు పట్టుకొనటానికి తగాదా పడుతున్న స్త్రీలు. గుడిసెల ముందర తాగి తాగి కడుపులో పేగులు బయటకు వచ్చేంతగా దగ్గే కార్మికులు. సందు గొందులలో ఒక పడ్ఢతి లేకుండా కట్టిన గుడిసెలు. భార్యాభర్తలు ఒకరిమీద ఒకరు విసుగు పడే కాపురాలు. బజారులోకి పోతే పాన్ డబ్బాల ముందు బొగ్గుబావి సినిమా ముచ్చట్లతోనో, ఏజంట్ ఆఫీసు ముందు పడిగాపులు పడుతూ పులి జూదం ఆడుకొంటూనో లోడింగ్ పని ట్రైనింగ్ అయి ఇంకా పని దొరకని యువకులు కనబడతారు. యూనియన్ ఆఫీసుల ముందూ వాళ్ళే . లంచాలు పోసి, ఇంటర్వ్యూ లు చేసి వైద్య పరీక్షలు కానిచ్చుకొని లోడర్ పనికి అర్హులే అనిపించుకుని ట్రైనింగ్ అయి ఇంకా రాని ఉద్యోగాల కోసం తిరుగుతూ వేసారి వదరుతున్న యువకులు. జెనరల్ మేనేజర్ ఆఫీసు ముందు కూడా వాళ్ళే. ఇళ్ళదగ్గర భూములు అమ్ముకొని, పాలిచ్చే బర్లను అమ్ముకొని లంచాలు పెట్టి రాని ఉద్యోగాల కోసం యూనియన్ నాయకుల గుల్లాలు పట్టి గొడవ పడేవాళ్ళు, వాళ్ళనైనా చంపాలి లేదా తామైనా చావాలి అన్న స్థాయికి చేరుతున్నవాళ్ళు. యూనియన్ లీడర్లతో గొడవపడినందుకు నడిబజార్లో గుండాల చేతిలో చావు దెబ్బలు తినేది కూడా ఆ యువకులే. వీళ్లందరినీ చూస్తూ వింటూ భయ సందేహాలకు లోనయిన మొగిలి కి ఎదురైన సమస్య తన అస్తిత్వాన్ని వదిలేసుకొని మరెవరి ఎంప్లాయ్ మెంటు కార్డు మీదనో మరొక- పేరుతో, మరొక తండ్రి కొడుకుగా ఇంటర్వ్యూ కు హాజరు కావలసి రావటం.

ఈ భీభత్సానికి మరొక పరాకాష్ట రూపం పని పరిస్థితులు. శ్రమ దోపిడీ. ఆసుపత్రి దృశ్యంలో గనిలో బొగ్గు పెళ్ల బడి కాలు నొప్పిజేసి పదిరోజులుగా పనికి పోలేకపోతున్న కార్మికుని స్థితిని ఒకటి రెండు మాటల్లోనే రూపు కట్టిస్తాడు. పని చేసే చోట పని వల్లనే గాయపడిన కార్మికుడి వైద్యం సంగతి గానీ, జీతంతో కూడిన సెలవు సంగతి గానీ యాజమాన్యానికి పట్టనిదే. ప్రభుత్వ ఆసుపత్రిలో అలాంటి వాళ్ళ కు సేవలందించే శ్రద్ధ లేకపోవటం తెలుస్తుంది. బొగ్గు బాయిల గర్మిల గాలాడక తాము చస్తుంటే తమకు వైద్యం చేయవలసిన డాక్టర్లు పంఖాల కింద కూరుకొని చాయలు తాగటం ఏమిటన్న విమర్శ కూడా వాళ్లకు ఉన్నట్లు ఈ దృశ్యంలో భాగంగానే చూపుతాడు రాజయ్య.

గనులలో ఉత్పత్తి అయ్యే బొగ్గు కోల్ స్క్రీనింగ్ ప్లాంట్ లో సైజుల వారీగా రవాణాకు సిద్ధం చేయబడుతుంది. లారీలకు ట్రాక్టర్లకు బొగ్గు ఎత్తించే పని కాంట్రాక్ట్ పద్ధతిన జరుగుతుంది. ఆ కాంట్రాక్టు సంపాదించినవాళ్లు కూలీలను పెట్టి బొగ్గు ఎత్తించే పని చేయటానికి కొంతమందిని నియమించుకొంటారు. మొగిలి పని అక్కడే. బొగ్గు తట్టల కెత్తటం ఒకరి పని అయితే తల మీద మోసుకెళ్లి లారీలలో కుమ్మరించే పని మరొకరిది.ఈ పనిలో బొగ్గు పెళ్లలు కాళ్ళమీద పడే ప్రమాదం ఉంది. రాయలింగు అటువంటి ప్రమాదానికే లోనయ్యాడు.అతనిని తమ మనిషిగా కార్మికులలోని యాజమాన్య వ్యతిరేక ధోరణులను కనిపెట్టి చెప్పటానికి ఉపయోగించుకొంటున్నప్పటికీ అతనికి వచ్చిన ఆపద పట్ల అధికారవర్గం ఆపన్న హస్తం చాచలేకపోవటం తోటి పనివాళ్లే ఖర్చులకు అందరూ తలా ఇంత వేసుకొని పదిహేను రూపాయలు జమచేసి అతనిని కంపెనీ ఆసుపత్రికి తీసుకుపోవటం మరొక ఘటన. కార్మికులకు తాము ఎవరో ఎవరితో నడవాలో ఎరుకపరిచే సందర్భాలు ఇవి. అట్లాగే పని చేసే చోట మద్యాహ్నం తెచ్చుకొన్న అన్నాలు తినటానికి ఒక రేకుల షెడ్డు, తాగటానికి మంచి నీళ్ల నల్లా లేకపోవటం పట్ల అసంతృప్తులు లోడింగ్ కార్మికుల మాటల్లో వినిపిస్తాయి. అయితే అవన్నీ ఒంటరి స్వరాలు. అప్పటికప్పుడు లేచి అంతలోనే అణిగిపోయే స్వరాలు.

అలాంటి అసంతృప్త స్వరాలూ, ధిక్కార స్వరాలూ తరచు వినిపిస్తూనే ఉంటాయి. మొగిలికి బొగ్గు రవాణాలో సరుకు లోడింగ్ పని ఇయ్యటానికి తొలగించబడిన కార్మికుడు కాసీం దీ అలాంటి స్వరమే. ఇరవైఏళ్లుగా ఆ పనిలోనే ఉండి పనివల్లనే ఊపిరి తిత్తులు దెబ్బతిని విరామం లేని దగ్గుతో బాధపడుతూ దగ్గులోడు అని పిలవబడే కాసీం ని ఆ రోజుకు ఆరోజు పనిలోనుంచి తీసేసారు. ఎన్నేళ్లు చేసినా కాంట్రాక్టు కూలి పనే. కారుణ్య చెల్లింపులు కానీ, పెన్షన్ లేని పదవీ విరమణ. పని చేసే చోట భద్రత గానీ, పని భద్రతగానీ, ఏ హక్కులు గానీ కల్పించకుండా జవ సత్వాలున్నంతవరకు దోచుకొని సర్వ శక్తులూ ఉడిగిన తరువాత సులభంగా వదిలేసే ఈ పద్ధతి బానిస విధానం కన్నా భిన్నం అనిపించదు. ఇరవై ఏళ్ళు కలిసి పనిచేసిన చోట, కష్టాలు కలిసి అనుభవించిన చోట ఒక్కడన్నా తనవెనక నిలబడి పనిలోనుంచి తీసెయ్యటం ఏమిటి అని కాంట్రాక్టర్లను ప్రశ్నించకపోవటం గురించి కాసీం నిస్సహాయ క్రోధం, ఆక్రందన ఈ నవలలో వినబడుతుంది.

పనిలోనుండి తీసెయ్యబడ్డ కాశిమ్ మర్నాడు తెల్లవారేసరికి ఉరివేసుకొని మరణిం చాడు. అది పని హక్కు నిరాకరించ బడటం పట్ల నిరసన కావచ్చు. అంతవరకు ఉన్న ఆ మాత్రపు అరకొర ఆహారభద్రతకు కూడా హామీ ఉండదన్న భయం వల్ల కావచ్చు. కాశిమ్ బతుకు తెరువు కోల్పోవటం మీద తనకు బతుకుతెరువు దొరకటం బతుకు తెరువు కోల్పోయిన కాసిం బతుకునే కోల్పోవటం మొగిలిని జీవిత మంతా వెంటాడిన నైతిక నొప్పి. లోడింగ్ పనిలో తనతో పనిచేసే వాళ్లంతా చేరినప్పుడు ఇలాగె ఎవరో ఒకడు వురిబెట్టుకొని ఉంటారా అన్న విచారణలు లోలోపల అతనిని వేధించాయి. ఉత్పత్తి సంబంధాలు సరిగా లేని వ్యవస్థలో శ్రమ దోపిడీకి అదనంగా మనుషులుగా తాము కారకులు కాని వాటికి కూడా కారకులమే అని భ్రమింప చేసి ఆత్మన్యూనతకు లోనయ్యేట్లు చేసే దుర్మార్గం ఎలా ఉంటుందో, మనిషి లోపలి విధ్వంసానికి బీజాలు ఎలా పడతాయో చూడటం నేర్చు కోమంటున్నాడు రచయిత.

అయితే సహజ మానవ ప్రతిస్పందనలు అయిన నిరసనల ధిక్కారాల సన్నటి స్వరాలు ఆశించిన దానిని సాధించగల చైతన్య స్థాయికి బలోపేతం అయి నినాదంగా దిక్కులకు వ్యాపించటం సంఘటితం కావటం వల్లనే వాస్తవం అవుతుంది. బొగ్గు బావి ఆఫీసు దగ్గర నల్లా నీళ్లు తాగటాన్ని వారించిన అక్కడి అధికారితో గొడవపడ్డాడని ఒక కార్మికుడికి ఛార్జ్ షీట్ ఇచ్చినప్పుడు దానిని వెనక్కు తీసుకొంటే తప్ప పనిలోకి దిగమని పట్టుబట్టి సాధించుకొన్న సందర్భం వాటిలో మొదటిది. ఇక్కడే కార్మిక రంగంలో ట్రేడ్ యూనియన్ పని స్వభావానికి సంబంధించిన మౌలికమైన ప్రశ్న కూడా లేవనెత్తబడింది. ఛార్జ్ షీట్ తీసుకొని యూనియన్ నాయకుడు రాఘవులు దగ్గరకు పోతే ఆయన కూడా ‘నల్ల దగ్గర నీళ్లేందుకు తాగావ్’ అని తప్పు అతనిదే అన్నట్లు మాట్లాడిన దానిని ప్రస్తావిస్తూ బాధిత కార్మికుడు ‘లీడరొడు బాయోడు ఒకటే మాటంటే ఎట్ల చెప్పు’ అని తన అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. ఈ విధంగా ఉనికిలో ఉన్న సారం కోల్పయిన కార్మిక సంఘాల పట్ల కార్మికులలో ఏర్పడుతున్న అసంతృప్తిని, అసహనాన్ని చూపించటం ద్వారా వాటికి కాలం చెల్లిందని ఆ స్థానంలో నిజంగా కార్మికుల పక్షాన నిలబడి పోరాడగలిగిన సారవంతమైన సంఘం రాకడ అవసరం అని రచయిత సూచించినట్లయింది.

3.

సైరన్ నవలలో వినబడే మరొక నిరసన స్వరం అర్జయ్య. . బొగ్గు లోడ్ చేయించుకొని రవాణా చేసే లారీల డ్రైవర్లు, క్లినర్లు జీతాలు పెరగాలని సమ్మెకు దిగినప్పుడు మనం కూడా కూలీ పెంచాలని సమ్మె చేద్దాం అని చెప్పి తోటి కార్మికులను కదలించ ప్రయత్నించిన వాడతను. అర్జయ్య కంటే ఏడాది ముందు ఇలా గళమెత్తిన కొండడు అయిపు లేకుండా పోతే నెల ముందు నోరెత్తిన పాపానికి మైసయ్య పని నుండి తొలగించబడ్డాడు. లొల్లిబెట్టినందుకు నెత్తుర్లు కారంగా చావు దెబ్బలు తినాల్సి వచ్చింది. కాసీం ని పని నుండి తొలగించటం అతను లొల్లిపెట్టటం నిన్న మొన్నటి విషయాలే .. ఆ వరుసలో వాడే అర్జయ్య. తొలిసారిగా శ్రమ దోపిడీ రాజకీయాల గుట్టు తెలిసి మాట్లాడిన వాడు.

ఒక్కొక్క లారీకి బొగ్గు లోడ్ చేయించినందుకు కాంట్రాక్టు తీసుకొన్నదొరలు వసూలు చేసేది రెండువందల రూపాయలు కాగా ఎండలో మాడి నీళ్లు నిప్పులు దాగుతూ ఒక్కొక్క లారీకి బొగ్గు లోడ్ చేసే ఎనిమిది మంది కార్మికులకు కూలి రూపంలో గిడుతున్నది ఒక్కొక్కరికి 10 రూపాయలైతే ఒకసారి వచ్చి పని అజమాయిషీ చేసే మొఖద్దం కు ఇరవై వస్తుంది. మిగిలిన వంద ఇంటి నుండి కాలు కదపని కాంట్రాక్టర్ ది కావటంలోని అన్యాయం పట్ల ఆవేదన అతనిది. ఆ వంద తమందరి శ్రమ ఫలితమే. దానిని దోచుకొంటున్నది కాంట్రాక్టర్లు. కనుక కలిసి కట్టుగా నిలబడి కూలి పెంచమని అడగటం తమ హక్కు అన్న స్పృహ అతనిలో వ్యక్తావ్యక్తంగా కనిపిస్తుంది.

కలిసి కట్టుగా నిలబడాలని అర్జయ్య అంటే ఎట్లా నిలబడతాం? మనకు ఎవరి సహాయమైనా ఉండాలి కదా అని గంగులు అనే కూలీ అంటే ఎవడుంటాడు అని ప్రశ్నించిన దావూద్ తమకు సహాయంగా ఉండాల్సిన యూనియన్ తమపక్షాన నిలబడదని అనుభవం నుండి చెప్పాడు. అందుకు కారణం కూడా అతనికి తెలుసు. యూనియన్ పెట్టింది దొరే కనుక అది దొర ప్రయోజనాలకే పనిచేస్తుందన్న అవగాహన అతనికి అనుభవం నుండే వచ్చింది. “ముడ్డి మీద తన్నెటోడు పంచాతు జెప్పేటోడు ఒకడేనాయె … దొరేనాయ” అన్న దావూద్ మాటలు అలాంటి మనుషుల ను ఏకంచేసి వాళ్ళ పక్షాన నిలబడగలిగిన కొత్త సంఘం రాకడ అవసరాన్ని సూచించేవే.

అన్నలు తినే షెడ్డు, మంచి నీళ్ల నల్ల, వారానికి ఒక సెలవు, బూట్లు, బొగ్గు పెళ్లలు పడి కాళ్ళు చేతులు విరిగితే నష్టపరిహారం కట్టియ్యటం, లేబర్ రూల్స్ వర్తింప చేసి కంపెనీ ఆసుపత్రిలో వైద్యం పొందే అవకాశం కల్పించటం, ఏ రోజుకు ఆరోజు కాక వారానికి ఒక సారి జీతాలు ఇయ్యటం ఇలాంటి డిమాండ్లు సంఘటిత పడి సాధించుకోవాలన్న ఆలోచనను కార్మికులలో కలిగించటం నేరమై అర్జయ్య హత్యచేయబడి రైలు పట్టాల మీద శవమై తేలాడు. ఆరకంగా జీతాల పెంపుకు తలపెట్టిన సమ్మె ఆరంభం కాకుండానే అణచివేయబడింది. ఈ సందర్భంలో కమ్యూనిస్టు ట్రేడ్ యూనియన్లు కూడా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొనే తీరుగనే ఉన్నాయి తప్ప కార్మికుల పక్షాన నిలబడి పోరాటాన్ని నడిపించగలిగిన చేవను కలిగి లేవన్న విషయం నిరూపితం అయింది. అదే సమయంలో అర్జయ్య మరణానికి సంతాపం ప్రకటిస్తూ అందుకు కారణమైన కృష్ణారావు దొరతో కలిసి కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ నిర్వహిస్తున్న సంస్మరణ సభలో లోలోపలి దుఃఖాలతో, పచ్చి పుండై సలిపే ఆలోచనలతో,పెకలని గొంతులతో, గొంతు తెరిస్తే జరిగే పరిణామాల భయంతో ఉన్న మొగిలి వంటి అనేకానేక మంది కార్మికులకు భరోసా ఇస్తున్నట్లుగా అర్జయ్య హత్యపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రాడికల్స్ ప్రచురించిన కరపత్ర పంపిణీ సింగరేణి బొగ్గుగని కార్మికుల వెనక నిలబడి, పోరాడగలిగిన ఒక శక్తిగా వాళ్ళను నిలబెట్ట గల కొత్త సంఘ నిర్మాణం ఎంతో దూరంలో లేదని సూచిస్తుంది.

4.

సైరన్ నవలలో సింగరేణి బొగ్గు గనులలో ఈ రకమైన కార్మిక సంఘ నిర్మాణానికి నడుము కట్టిన విప్లవ రాజకీయ పార్టీ పేరు ప్రత్యేకంగా చెప్పబడలేదు కానీ సీతారామయ్య నాయకత్వ ప్రస్తావనను బట్టి అది చారుమజుందార్ వారసత్వాన్ని విమర్శనాత్మకంగా అభివృద్ధి పరచుకొని ప్రయోగాత్మక ఆచరణతో ఉన్న మావోయిస్టు పార్టీ అన్నది స్పష్టం. కార్మిక సంఘ నిర్మాణానికి, కార్మికులను పెద్ద ఎత్తున అందులోకి సమీకరించటానికి మొదటి షరతు రాజకీయంగా కార్మిక వర్గాన్ని ఒక శక్తిగా అభివృద్ధి చేయటం. అది ఏ విధంగా సాధ్యం అవుతుంది? వాళ్ళు జీవిస్తున్న భౌగోళిక పరిసరాలు,పరిస్థితులు అధ్యయనం చేయాలి. అవగాహన ఏర్పరచుకోవాలి. వాళ్ళ నిత్య జీవిత సమస్యలను అర్ధం చేసుకోవాలి అంటే వాళ్ళు జీవిస్తున్న జీవితాన్ని తాము జీవించగలగాలి . అది ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ ఏర్పరచుకొనే సంబంధాలవల్లనే సాధ్యం అవుతుంది. ఈ నవలలో నాగయ్య, గంగాధర్, మురళి, రాజయ్య, దేవేందర్ మొదలైన వాళ్ళు సింగరేణి బొగ్గు గని ప్రాంతాల పొడుగునా తిరుగుతూ, ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకొంటూ చేసింది ఆ రకమైన అధ్యయనమే.

ఈ అధ్యయనం వల్ల తెలిసింది ఏమిటి? “సింగరేణిలో ఉత్పత్తివిధానం పెట్టుబడిదారిదే అయినా కూడా పెట్టుబడిదారి ఉత్పత్తి సంబంధాలు లేవు. ఇంకా భూస్వామిక సంబంధాలే కొనసాగుతున్నాయి.” ఇది నవల అంతటా పరచుకొని ఘటనలలోనో, సన్నివేశాలలోనో, సంభాషణల లోనో భాగంగా కనిపిస్తుంది. ఈ నవలలో దొర అని చెప్పబడుతూ వుండే కృష్ణారావు బొగ్గుబావి అధికార వర్గాన్నిప్రభావితం చేయగల ఆర్ధిక బలం, రాజకీయ బలం కలవాడు. ఆర్ధిక బలం అతని భూస్వామ్య పునాదిలో ఉంది. అది సింగరేణిలో అతనిని కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘానికి నాయకుడిని చేసింది. ఆ రెండూ కలిసి సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి బొగ్గు లారీలకు నింపే కాంట్రక్టుతో పాటు సివిల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టులను పొందేట్లు చేశాయి. డబ్బు డబ్బును సృష్టించటం అంటే ఇదే. వడ్డీ వ్యాపారం, చిట్టీలు నడపటం… అతను చెయ్యని వ్యాపారం లేదు. నిత్య జీవితావసర వస్తువులు అమ్మే దుకాణాలు, కూరల మార్కెట్ అన్నీ అతని కనుసన్నలలో నడుస్తుంటాయి. ఈ చక్ర బంధంలో గాయాలు కాకుండా, రక్తం కారకుండా జీవితం గడపటం కార్మికులకు అసాధ్యం అవుతుంది. కార్మికుల జీతం జీతాలు అందుకొన్న రోజే ఏదో ఒక రూపంలో కృష్ణారావు దొర ఖజానాకే చేరుతుంటుంది. ఆ తరువాత అవసరాలకు అతని ఏజంట్ల దగ్గరకే అప్పులకు నడిపిస్తుంది. వడ్డీ కట్టలేని స్థితిలో అవమానాల పాలు చేస్తుంది.

కార్మికులలో ఐక్యత, హక్కులు,సమ్మె మొదలైన ఆలోచనలు ఆచరణ లేకుండా నియంత్రించటానికి, అప్పుల వడ్డీల వసూళ్లకు బలప్రయోగమే పద్ధతిగా పోషించే రౌడీ ముఠాలు ఉన్నాయి. సారా తాగే ప్రతివాడు రౌడీ మామూలు కింద దుకాణంలో ఒక సీసా కు డబ్బు సమర్పించి రావటం వంటి అక్రమ వసూళ్ల భూస్వామ్య పద్ధతి అమలు అవుతున్నది.

గాలి సరిగా ఆడని ప్రాంతాలలో, గనిని తవ్వే మిషన్ల చప్పుళ్ల మధ్య, బొగ్గు ను పేల్చే పెద్ద ధ్వనుల మధ్య, కూలే బొగ్గు నుండి కమ్ముకొనే దుమ్ము మధ్య బొగ్గు ఎత్తి టబ్బులలో పోసి పంపటం, ఎర్రటి ఎండలో లారీలకు బొగ్గు నింపటం వంటి పనుల లో నరాల సత్తువనంతా ధారపోసే కార్మికులకు జీవితం ఎంత హింసాత్మకమో సూచిస్తాయి రాజయ్య బొగ్గు బావిని కొండ చిలువ నోరు తోని, షిఫ్ట్ మొదలవుతుందని హెచ్చరించే సైరన్ కూతను మేకల మంద మీద పడ్డ తోడేలు తోని పోల్చి చేసే వర్ణనలు.

అంత హింసపడే కార్మికులకు బతుకు వేసట మరచి పోవటానికి తాగుడు ఒకటే మార్గం అవుతుంది. హింసకు ప్రతీకారం చెయ్యలేని నిస్సహాయత, ఎక్కడెక్కడ ఎవరెవరి మీదో లోపల పేరుకున్న కోపం వెళ్లగక్కడానికి ఇళ్లల్లో తమకు లోకువగా దొరికే ఆడవాళ్లే గురి అవుతారు. కార్మికులు పనులనుండి ఇళ్లకు తిరిగివచ్చే వేళ చీకటి పడుతున్న విషయాన్ని “ తాగొచ్చి తన్నే మొగుళ్లను ఊహించుకొనే ఇల్లాల్ల మనసులలో లాగా చీకటి గూడు కడుతోంది” అని వర్ణించటం స్త్రీల జీవితంలోని హింసను సూచించేదే. దీనికి తోడు దొర పోషించే గుండాలు విచ్చలవిడిగా తిరుగుతూ . బహిర్భూమి నుండి,మార్కెట్, సినిమాహాలు, నడి బజారు, ఇల్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళ మీద జరిపే అత్యాచారాలు స్త్రీలు ఎదుర్కొనే అదనపు హింస. ప్రేమ రాహిత్యం, హింస రెండూ కలిసి ఆడవాళ్లను పిచ్చివాళ్లను కూడా చేస్తుంటాయి. గని కార్మికుడు శంకరయ్య అతని భార్య లక్ష్మి నెపంగా ఈ ప్రక్రియ అంతా నవల ఇతివృత్తంలో భాగం అయింది.

5.

ఈ పరిస్థితులలో సింగరేణి బొగ్గు గని కార్మికులను రాజకీయంగా ఒక శక్తిగా ఎదిగింపచేయటానికి జరిగిన ప్రయత్నాలు ఎటువంటివి? ఎంబడోల్ల శ్రీను, షరీఫ్ వంటి స్థానిక యువతతో, కార్మికులతో వ్యక్తిగత స్నేహ సంబంధాలను ఏర్పరచుకొని క్షేత్రాన్ని సిద్ధం చేసుకొనటం అప్పటికే ప్రారంభం అయింది కనుకనే కరపత్రాలు వేయగలిగారు. పంచగలిగారు. బంధుత్వ సంబంధాలను అంతకంటే ఉన్నతమైన శ్రామిక వర్గ సంబంధాలుగా పరివర్తింపచేసే ప్రక్రియ ను నాగన్న కేంద్రంగా చూపింది ఈ నవల. ఎమర్జెన్సీ తరువాత విడుదలై వచ్చిన నాగన్నను చూడటానికి మేనమామ ఇంటికి చంద్రకళ లక్ష్మి వచ్చిన సందర్భంలోనే అందుకు బీజం పడింది. విప్లవ రాజకీయాలలోకి నడిచిన నాగన్న అనుభవాలు, నాగన్నను కలవటానికి వచ్చిన అతని స్నేహితుల కలుపుగోలు ముచ్చట్లు, ఏదో సాధించాలన్న ఆశయం, ఆ దిశగా మనుషులను కలుపుకొచ్చుకొనటం గురించిన వాళ్ళ ఆలోచనలు లక్ష్మి భర్త శంకరయ్యలో కదిలికలు తేవటంతో తో ఆ బీజం మొలకెత్తటానికి భూమి పదును సమకూడింది. కాలరీ లో శంకరయ్య ఇంటికి నాగన్న ప్రారంభించిన రాకపోకలతో మొలకలు వేసి, పిలకలు వేసి విస్తరించటం కంటికి కడుతుంది. అతని బావి మీదే, అతని షిఫ్ట్ లోనే పనిచేస్తూ అంతవరకూ అతనికి తెలియని షరీఫ్ ను పరిచయం చేసి శ్రామికవర్గ సంబంధాల అల్లికలో భాగం అయ్యేట్లు చేసింది.

నాగయ్య గంగాధర్ ను తీసుకొని తొలిసారి శంకరయ్య ఇంటికి వచ్చేటప్పటికి లక్ష్మి జీతాలనాడు బజారులో గుండాల అత్యాచారానికి గురికాబోయి కాస్తలో తప్పించుకున్న షాక్ లో ఉంది. మంచంలో పడుకున్నది పడుకున్నట్లే ఏడుస్తూ ఎక్కిళ్లు పెడుతూ దిగులు బరువుతో . ఇంటిపని, వంటపని ధ్యాస లేదు. విషయం తెలుసుకొని లక్ష్మికి తామున్నాము, భయపడవలసిన అవసరం లేదని ధైర్యం చెప్పటమే కాదు, ‘ఎక్కడో పని మొదలు పెట్టాలె’ అంటూగంగాధర్ తో కలిసి వంట చేసాడు, ఇల్లు ఊడ్చాడు, ఖాళీగా ఉన్న నీటి గోలెంలో వీధి నల్ల నుండి నీళ్లు తెచ్చి పొయ్యమని మొగిలికి చెప్పాడు. ఎక్కడో పని మొదలు పెట్టాలి అని నాగయ్య అన్నది లక్ష్మి మూలబడటంతో అడవి లాగైన శంకరయ్య ఇంటిపని గురించి అనిపించవచ్చు గానీ అది అస్తవ్యస్తంగా వున్న కార్మిక వర్గాన్నిసవరించి కూడదీయటం గురించిన పార్టీ కార్యక్రమాన్ని గురించి. మొగిలి ఉద్యోగ సమస్యలు. భార్యను తెచ్చుకొందా మంటే ఇల్లు దొరకని సమస్యలు చెప్పుకొంటూ పోయినప్పుడు సమాజం మార్చటానికి చెయ్య వలసిన ‘లడాయి ఏడనో షురూ చెయ్యాలె గదా’ అని అతనన్న మాట కూడా కార్మిక వర్గ నిర్మాణ విషయమైనదే. అతని గురి అది ఒక్కటే. ఏది చూసినా, చేసినా ఆ గురి నుండి మరలని కమ్యూనిస్టు నీతి అది.

విప్లవ సిద్ధాంతాలు వినటానికి అవసరమైన విశ్వాసం, ఆచరణలోకి దిగటానికి కావలసిన నిబద్ధత కార్మిక వర్గంలో పెరగాలంటే వాళ్ళ అవసరాలను వేటినీ తక్కువగా చూడకపోవడం, వాటిని సాధించుకొనటానికి వాళ్లకు ఆసరా కావటం మొదటి షరతు.అందుకే నాగయ్య, గంగాధర్ అక్కడే పని మొదలు పెట్టారు. లక్ష్మి మనిషి అని ఎవడో తాకాడని రంధిపడుతూ కూర్చొనటం సరైంది కాదని ఎరుక పరచటంలోనూ, స్థలం సంపాదించి తలా ఒక చెయ్యివేసి మొగిలికి వసతి ఏర్పాటు చేయటంలోనూ అదే కీలకమైంది.చంద్రకళ భర్త పోశెట్టి అయినా, శంకరయ్య అయినా ఒకరికి ఒకరం ఆసరాగా ఉండాలని చేయగలిగింది చేసినవాళ్ళే. అది ఒంటరి ఆరాటం. బంధుత్వ సంబంధాలకు పరిమితమైంది. అది తక్కువది కాదు కానీ పాలవాగు ఒడ్డున కార్మికులు గుడిసెలు వేసుకొనేటప్పుడు అందరు కలిసి వాటిని నిలబెట్టుకొనటానికి నిర్ణయించుకున్నప్పుడు అది సంఘటిత శక్తి సారంగా పరివర్తన చెందటం చూస్తాం. అదే సమయంలో శంకరయ్య ఎదో ఒకటి కావలసి దగ్గరయ్యే మనుషులకన్నా తమకంటూ ఏ అవసరం లేకుండానే మనుషులను దగ్గరకు తీసి దగ్గరయ్యే నాగయ్య వంటివాళ్ళ ఔన్నత్యం గురించి ఆలోచనలో పడటం కూడా గమనించవచ్చు. అది తమగురించి మాత్రమే ఆరాటపడే మనుషులల్లోంచి మంది గురించి, సమాజం గురించి ఆలోచించే మనుషులుగా ఎదగడంలో సమకూడిందని ఆ తరువాత అతనికి అర్ధం అయింది.

ప్రేమ రాహిత్య ప్రపంచంలోకి అవ్యాజమైన ప్రేమను మోసుకొచ్చిన వాళ్ల ఈ రకమైన వాళ్ళ రాకపోకలు, వాళ్ళతో సంభాషణలు, వాళ్ళతో కలిసి ఎదో ఒక పనిలో భాగం కావటం, వాళ్ళిచ్చిన ధైర్యం మొదలైనవన్నీ శంకరయ్య, మొగిలి, షరీఫ్ మొదలైన కార్మికులనే కాదు చంద్రకళ, లక్ష్మి, రాజేశ్వరి, రెహానా మొదలైన స్త్రీలను కూడా హృదయాలను ఆవరించిన శూన్యాన్ని ఆశతో, నమ్మకంతో నింపి విప్లవ చైతన్యంతో ఎదిగేలా చేశాయి. జులై 16 న గోదావరి ఖనిలో జరగనున్న పౌరహక్కుల సంఘ సభకు జరుగుతున్న ప్రచార సభలకు అందరూ హాజరయ్యేట్లు చేసిందీ, వేదిక మీద విప్లవ గీతాలు ఆలపించేట్లు చేసింది, విప్లవ విషయాలను, అనుభవాలను, విజయాలను తెలుసుకొనటానికి చదువుల్లో పడేట్లు చేసింది,మొత్తానికి మందిలో మనుషులు అయ్యేట్లు చేసింది గోదావరిఖని సభలో కార్యకర్తలు గా బాధ్యతలు తీసుకొనే స్థాయికి తెచ్చింది ఆ మనుషుల సాహచర్యమే. వాళ్ళు కలగంటున్న ఆదర్శంతో తమ బతుకు విలువలు ముడిపడి ఉన్నాయన్న అవగాహన ఫలితమే. ఈ అనుభవం నుండే పాలవాగు గుడిసెల ఆడవాళ్లు నీళ్ల కోసం సమ్మెకు దిగగలిగారు.జనరల్ మానేజర్ ఆఫీసు వరకు ఊరేగింపు తీసి అనుకొన్నది సాధించగలిగారు. కార్మికవర్గం విప్లవకర శక్తులుగా ఎదిగే క్రమంలో ఇది ఒక దశ.

భూగర్భంలో పనిచేసే కార్మికులు ప్రాధమిక అవసరాలైన గాలి వెలుతురు సరైన మోతాదులో సరఫరా చెయ్యాలని డిమాండ్ తో మూడు రోజుల మెరుపు సమ్మె జరిగిందంటే అది మల్లయ్య వంటి కార్మికులు ఎన్నో ఏళ్లుగా గాలి సరిగా అందని జాగాలలో పని చేస్తూ ఇక భరించలేని స్థితిలో బతుకు భయం కలిగిన క్షణాన తిరగబడటం వల్లనే .. తన బాధాకర అనుభవం నుండి అదే అనుభవంతో ఊపిరాడని బతుకు యాతనలో ఉన్న సాటి కార్మికులను కూడగట్టడం వల్లనే. అయితే ఇలాంటి ఉద్యమాలను సరైన దారిలో నడపటానికి ఉత్పత్తి సంబంధాల చరిత్ర గురించిన అవగాహన, రాజకీయ తాత్విక పరిజ్ఞానంతో నాయకత్వాన్ని కార్మిక వర్గం నుండే అభివృద్ధి చేయవలసి ఉంటుంది. ఇది విప్లవ నిర్మాణంలో మలి ఘట్టం. అందులో భాగమే శంకరయ్య, షరీఫ్ రాజకీయ తరగతులకు హాజరు కావటం.

6.

“సైరన్ నవలకు లెనిన్ ఏమి చేయాలి కరపత్రమే తాత్విక రాజకీయ దిక్సూచి” ( అల్లం రాజయ్య ఎకె ప్రభాకర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ, సారంగ, వెబ్ మ్యాగజిన్, 2022, మార్చ్ 15) ఎమర్జెన్సీ ఎత్తివేశాక జైలు నుండి విడుదలై వచ్చిన నాగన్న ఇంట్లో మీసాల రాజన్న, దేవేందర్, బక్క వెంకన్న, కోటన్న కలిసి ఎమెర్జన్సీ కి ముందరి కామ్రేడ్స్ తో సంబంధాలు పునరుద్దరించు కోవాలని, విద్యార్థులతో సమావేశాలు పెట్టాలని. ఆదిలాబాద్ కరీంనగర్ కు కలిపి రఘును నాయకుడిగా నియమించారని, ఆయనను కలిసే లోగా కొంత గ్రౌండ్ వర్క్ ముఖ్యంగా సింగరేణి కార్మికులలో చేయాలనీ మాట్లాడుకున్నారు. దాని ఫలితమే నాగన్న శంకరయ్య ఇంటికి పోవటం. అక్కడ అతనికి సైదోడు అయినవాడు గంగాధర్.

ఆ తరువాత సింగరేణిలో కార్మికోద్యమ నిర్మాణం గురించి మాట్లాడుకొనటానికి జరిగిన సమావేశాలు మూడు. నాగయ్య ఇంట్లో కొత్తగా నియమించబడినట్లు చెప్పబడిన నాయకుడు రఘు తో జరిగిన సమావేశాలే. మొదటిది గంగాధర్ ఇంట్లో జరిగింది. దానిని మొగిలికి విప్లవ నిర్మాణ అవసరాలను పరిచయం చేయటానికి వాడుకొన్నాడు నాగన్న. దేశదేశాల కార్మిక కర్షక పోరాటాల నుంచి కారల్ మార్క్స్, ఏంగిల్స్, లెనిన్, మావో రూపొందించిన సిద్ధాంతంతో, పద్ధతితో స్థానిక సమస్యలను అర్ధం చేసుకొని అందుకోసం ఏమి చెయ్యాలో నిర్ణయించటానికి జరుగుతున్న ఆలోచనలు, ప్రయత్నాలు తెలిసి వస్తుంటే కార్మికోద్యమ నిర్మాణంలోకి మొగిలి లాంటి కార్మికులు కలిసి వస్తారని నాగన్న భావన.

రెండవ సమావేశం మొగిలి ఇంట్లో జరిగింది. రాజకీయంగా కార్మిక వర్గాన్ని ఒక శక్తిగా అభివృద్ధి చేయటం గురించి, తమతమ వ్యక్తిగత అనుభవాల తీవ్రతలో ఉన్న బొగ్గు గని ప్రాంతాల మహిళలను, బస్తీలల్లోని నిరుద్యోగ యువకులను, కాంట్రాక్ట్ కార్మికులను కూడగట్టాలని చెప్తూ వాళ్లకు సామాజిక అనుభవం, గతితార్కిక ఆలోచన – చారిత్రక దృష్టి కోణం కల్గించటం పార్టీ చెయాయవలసిన పని అని రఘు చెప్తాడు. ప్రజలను సమీకరించుకొని రాజకీయాలు బోధించాలని చెప్తూ లెనిన్ వ్రాసిన ‘ఏమిచేయాలి’ పుస్తకాన్ని ప్రస్తావిస్తాడు. దానిని కార్యకర్తలకు చేరవేయాలని దానిని జాగ్రత్తగా చదివి చర్చించాలని ఆ వెలుగులో దేశీయ పోరాటాలను అధ్యయనం చేయాలనీ చెప్తాడు. ఆతరువాత ఈ పుస్తకం ప్రస్తావన నవలలో అనేకమార్లు వస్తుంది.

మూడవ సమావేశం శంకరయ్య ఇంట్లో జరిగింది.రైతాంగ, కార్మిక ఆదివాసీ ఉద్యమాలలోకి ప్రజలు సమీకృతం కావటంలో జరిగిన పురోగతిని చర్చించారు. పరిణామాత్మక పోరాటాలను గుణాత్మక దశలోకి తీసుకువెళ్లడం గురించి, ఆర్ధిక సాంఘిక యాదృచ్ఛిక పోరాటాలను రాజకీయపోరాటాలుగా అభివృద్ధి చేయటం గురించి, చుట్టూ జరుగుతున్న సంఘటల లోని ఆంతరంగిక సంబంధాలను కనుక్కోవటం గురించి, కార్మికులు ఆర్ధిక పోరాటాల దగ్గర ఆగిపోకుండా ఆ సమస్యలకు మూలమైన ఉత్పత్తి సంబంధాల మార్పు కోసం దోపిడీ, పీడన,ల ఉత్పత్తి సంబంధాలను కాపాడుతున్న రాజ్యాధికారాన్ని కూల్చి కర్షక కార్మిక రాజకీయాధికారం సాధించటం కోసం రాజకీయ పోరాటాలు చేయటానికి కార్మికులను తర్ఫీదు చేయటం గురించి చర్చిన ఆ సమావేశంలో లెనిన్ ‘ఏమిచేయాలి’ పుస్తకం ఉదాహరించబడింది. ఏమిటి ఈ పుస్తకం.

What is to be done ? లెనిన్ 1901లో వ్రాసిన ఒక రాజకీయ కరపత్రం. జీతాల కోసం, పని గంటల కోసం, మెరుగైన పని పరిస్థితుల కోసం యాజమాన్యంతో ఆర్ధిక పోరాటాలు చేసే శ్రామిక వర్గం ఒక్క సారిగా రాజకీయ శక్తిగా ఎదగలేదని, మార్క్సిజం పై అవగాహన కలిగించటానికి నిబద్ధులైన విప్లవకారులతో ఒక రాజకీయ పార్టీ ఉండాలని అంటాడు. రాజకీయాలను అర్ధం చేసుకొనటం అంటే సమాజం మొత్తాన్ని అర్ధం చేసుకొనటం అని భిన్న వర్గాల మధ్య ఉన్న సంబంధాలను అర్ధం చేసుకొనటం అని లెనిన్ నొక్కి చెప్పాడు. సోషలిజం పేరు మీద సంస్కరణ ఉద్యమ స్థాయికి దిగజార్చబడుతున్న సమకాలపు సోషలిస్టు ధోరణులపై చేసిన విమర్శ ఇది. సోషలిస్టు విప్లవంలో సోషల్ డెమోక్రట్ల పాత్రను ఆర్ధిక వాదానికి సంబంధించినదిగా గుర్తించి నిరాకరించాడు. విప్లవ పార్టీ లక్ష్యం, లక్షణం సామాజిక సంస్కరణగా కాక సామాజిక విప్లవంగా ఉండాలని చెప్తూ వర్గ సామరస్య భావనను వ్యతిరేకించాడు.సోషలిస్టు పార్టీలో విమర్శనా స్వేచ్ఛ అవకాశవాద ధోరణికి, సంస్కరణవాదానికి, బూర్జువా భావాలను, బూర్జువా శక్తులను ప్రవేశ పెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది కనుక వ్యతిరేకించాడు. సామాజిక విప్లవం,శ్రామిక వర్గ నియంతృత్వం అన్న భావాలు అర్ధరహితమైనవి అని ప్రకటించటం, వాదించటం కార్మికోద్యమాన్ని వర్గపోరాటాన్ని సంకుచితమైన ట్రేడ్ యూనియనిజానికి అల్ప సంస్కరణల కోసం జరిగే పోరాటానికి దిగజార్చే ప్రమాదం ఉందనీ హెచ్చరించాడు. ఈ తాత్విక సారాన్ని అర్ధం చేసుకొని అన్వయించుకొనటం ద్వారా సమకాలపు కార్మికోద్యమాలలోని ఆర్ధిక వాద సంస్కరణ వాద పరిమితులను గుర్తించటం నేర్చుకోవాలనీ అప్పుడే సంపూర్ణ విశ్వాసంతో కార్మిక వర్గాన్ని ఉత్పత్తి సంబంధాలను అర్ధం చేసుకొంటూ వాటిని మార్చుకొనే చైతన్యాన్ని పొందే నిజమైన విప్లవకర శక్తిగా అభివృద్ధి పరచటం సాధ్యం అవుతుంది అని రఘు చేత పార్టీ లైన్ ను బలంగా చెప్పించాడు రచయిత.

7.

ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ మొదటికి వెళ్లి నవలలోని కథా గమనాన్ని, ఘటనలను, దృశ్యాలను, మొత్తంగా నిర్మాణాన్నిపరిశీలిస్తే శంకరయ్య,లక్ష్మి, మొగిలి, షరీఫ్, రెహానా, చంద్రకళ మొదలైన వాళ్లంతా – అది నల్లా దగ్గర నీళ్లు పట్టుకొనటానికి కోట్లడుకోనే ఆడవాళ్ళ విషయం నుండి తాగివచ్చి కొట్టే మొగుళ్ళ – మగవాళ్ల – విషయం వరకు ఆర్ధిక దోపిడీ నుండి లైంగిక దోపిడివరకు సమస్తాన్నితమ తమ వ్యక్తిగత అనుభవాల తీవ్రతనుండి చూసి విలువ కట్టి, తీర్పులు ఇచ్చి దూరాలు పెంచుకొన్నవాళ్ళే. ఆధిక్యతను ప్రకటించుకొన్నవాళ్ళే. “వ్యక్తిగతమంతా రాజకీయమే” అని అంచలంచెలుగా వాళ్లకు అర్ధం అయ్యేట్లు చేసింది నిబద్ధులులైన విప్లవ కారులున్న రాజకీయ పార్టీ.

కార్మిక వాడాలో తొలిసారి అడుగుపెట్టినప్పుడు నల్ల దగ్గర నీళ్లు పట్టుకొనటానికి కొట్లాడుకొంటున్న ఆడవాళ్లను చూసి “ఒక లెనుక ఒకలు నీళ్లు పట్టుకుంటేందో” అనుకొన్న మొగిలి నవల చివరకు వచ్చేసరికి అది క్రమ శిక్షణకు, సంస్కారానికి సంబంధించిన అంశం కాదని, వనరులు, వసతులు, సమయం అందుబాటులో లేని మనుషులు వాటికోసం ఎవరితో కొట్లాడాలో తెలియని స్థితిలో తమలో తామే కొట్లాడుకొనే దుస్థితి అని తెలుసుకోగలడు. అలాగే తాగివచ్చి తన్నే మొగుడితో యాష్టపడిన లక్ష్మి అతని తాగుడు అతని పని స్వభావ విషాద ఫలితం అని,ప్రపంచపు దగుల్బాజీ తనానికి అవిసిన హృదయపు పలాయనమని తెలుసుకోగలిగింది. మిగిలిన వాళ్ళ ఆలోచనలను, అనుభవాలను ఈ విధంగానే పరిశీలించి తెలుసుకోవచ్చు. ఇదంతా ఉత్పత్తిసంబంధాలు అర్ధమయ్యే కొద్దీ, రాజకీయ చైతన్యం పెరిగేకొద్దీ సాధ్యమైంది. ఇదే కుల మతభేదాల హద్దులను చెరిపేసి ఒక్కటై నిలిచి ఒకే ఆదర్శాన్ని కలగనేట్లు చేసింది. ఇదే స్త్రీ పురుషుల మధ్య ఇదివరకు లేని ప్రేమ బంధాన్ని కొత్తగా చిగురింప చేసి ఒకే ఆచరణలో భాగం చేసింది. మందిలో మనుషులుగా కొత్త అవతారాలు ఎత్తిన మానవులు సమాజాన్ని మార్చే పనికి నిబద్ధులు అవుతారు. యుద్ధానికి, త్యాగాలకు సిద్ధమవుతారు.

“ మనకు ఇష్టమున్న లేకున్నా సమాజం ముందుకే నడుస్తుంది. ఇది ఒక ప్రవాహం. మనం ఇందులో ముందుకే పోవాలె . ఎవలకైనా ఎనకకు పోరాదు. మనం సింగరేణి కాలేరీలో పనిచేస్తున్న డెబ్బై వేల మంది కార్మికులలో ఒకలం. ఇంతకుముందు సింగరేణిలో ఏది ఎందుకు జరుగుతున్నదో ? కారణాలు తెలువది. ఇప్పుడు తెలుస్తున్నయ్…” అని శంకరయ్య లాగే తెలుసుకొన్నవాళ్ళు అందరూ ఎంచుకొనే మార్గం అదే అని చెప్తుంది ఈ నవల. లారీలోడింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె శబిరాలపై దాడి చేసి తగలబెట్టినా తెల్ల వారేసరికి మళ్ళీ శిబిరం సిద్ధంచేసి సమ్మెకొనసాగించాలన్న నిర్ణయం కార్మికులు తీసుకోగలిగారంటే ఈ రాజకీయ చైతన్యం వల్లనే.

చెర చెర ఆకాశం బద్దలై కిందకూలినట్లు పెళపెళ ఉరుములు ఉరిమి నట్లు బొంయ్యి మని కూసే సైరన్ కూతకు బెదిరే సింగరేణి గనుల గుడిసెల మనుషులు ఈ రాజకీయ చైతన్యం వల్లనే ఆర్ధిక పోరాటాల దశను దాటి రాజకీయ సమ్మె కు దిగి యాజమాన్యానికి, రాజ్యానికి ప్రమాద హెచ్చరికలా సైరన్ మోగించ గలిగారు. మొదట్లో శ్రామికుల శ్రమను పిండుకొనటానికి రక్కసి స్వరంతో మోగే సైరన్ ముగింపుకు వచ్చేసరికి ప్రజాస్వామిక విప్లవంకోసం కార్మికులను పోరాటం లోకి సమీకరించే యుద్ధారంభ సంకేతంగా మారిన క్రమం గుణాత్మక పరిణామ గర్భితం. కార్మిక వర్గం ఒక శక్తిగా ఎదగటం, మానవ సంబంధాలు మహోన్నత విలువలతో పునర్నిర్మాణం కావటం గతితార్కికంగా పాఠకుల అనుభవానికి వచ్చేట్లు ఇతివృత్తాన్ని నిర్వహించుకు రావటం రాజయ్య నవలా శిల్పం.

ఈ నవల ఇతివృత్తంలో మానవ సంబంధాలు, స్త్రీపురుష సంబంధాలు, విప్లవోద్యమంలో స్త్రీలు నిర్వహించిన పాత్ర ఎలా భాగం అయ్యాయో మళ్ళెప్పుడైనా ప్రత్యేకంగా పరిశీలించాలి.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

3 thoughts on “మనకాలపు విప్లవకర కార్మిక శక్తి వికాస చరిత్ర: సైరన్ నవల

  1. చాలా బాగా విశ్లేషించారు.
    Thanks

  2. ఈ వ్యాసం నవలకు ముందుమాట గా వస్టే బాగుండేది

  3. అద్భుతమైన విశ్లేషణ కాత్యాయనీ మేడం.

Leave a Reply