దశాబ్దాల భౌగోళిక అస్తిత్వ వేదన సైమా అఫ్రీన్ కవిత్వం

కలకత్తాలో రేరాణి పూల వాసనలని పీలుస్తూ, అనేక భాషలను నేర్చుకుంటూ మాట్లాడుతూ పెరిగింది సైమా. ఊపిరి పీల్చడానికి కవిత్వం మధిస్తుంది. జీవిక కోసం జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. సైమా కవితలు అనేక పత్రికల్లో ప్రచురించబడ్డాయి. సైమా ఫోటోగ్రఫి లో కూడా నిష్ణాతురాలు. తన ఫోటోగ్రఫి తో కవిత్వం చిత్రిస్తుంది.

తన ప్రజల భౌగోళిక అస్తిత్వ వేదనను, కొన్ని దశాబ్దాలుగా తీవ్రమైన నిర్బంధానికి, చిత్రహింసలకు లోనవుతున్న వారి ప్రాచీన చరిత్ర నుండి ఆధునిక సామాజిక సంక్షోభం వరకూ తన పదాల్లో, పద చిత్రాల్లో, కవితావాక్యాల్లో అద్భుతంగా ప్రతిఫలించిన సైమా ఇటీవలే ‘అర్థాల పాపాలు’ (Sins of Semantics) అనే కవితా సంకలనం ప్రచురించింది. అత్యంత శక్తివంతమైన కవితలు మూలస్తంభాలుగా కల ఈ సంకలనం అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పొందింది.

కశ్మీర్ లో నిన్న గాక మొన్న ఒక గర్భిణీ స్త్రీ సకాలం లో వైద్యసహాయం అందక తన గర్భస్థ శిశువును కోల్పోయిన సంఘటన నేపథ్యం లో ఈ కవిత మరింత ప్రాసంగికత సంతరించుకున్నది.
ఈ కవిత మొత్తం చదివినంక కనుకొలకుల్లో నీరు నిలవకుండా ఉండదు. అత్యంత వేదనాభరితంగా, శక్తివంతంగా కశ్మీర్ లో మృతగర్భాల్లో జన్మించిన పసిపాపల వేదనను ప్రతిఫలించిన ఈ కవిత మీ కోసం:

ఒక కశ్మీర్ పసిపాప కోసం
– సైమా ఆఫ్రీన్

పాపా చూడు

ఒకప్పుడు మీ అమ్మ
నీ చిన్నారి కలల కన్నీటి చుక్కను,
తన కళ్ళలో మెరిసిన మిణుగురునూ
పదిలంగా ఉంచిన ఊదారంగు నీటిమీద

నిర్దాక్షిణ్యంగా నరకబడ్డ
జోలపాటల మధ్య
చిన్ని కాగితం పడవ
ఒకటి ఊగుతోంది

లెక్కలేనన్ని తూటాలు
కరిగిపోయిన చందమామ
ముఖాన్ని చిల్లులు చేస్తాయి

నీ చిన్నారి ప్రపంచం
శ్వేతరక్తసిక్తమై
నీ లేలేత అరచేతుల్లో శోకిస్తుంది.

పాపా
చందమామ కోసం
మరీ ఎక్కువగా తండ్లాడకు

ఈ రాత్రి
దాన్ని ‘శాంతి’ సంరక్షకులైన ఖాకీ తోడేళ్లు
దహనం చేస్తారు

వాళ్ళ బూట్ల టకటకలు
మన శోకాల్ని
కర్కశంగా తొక్కేస్తాయి

ఎర్ర తివాచీల్లా రక్తం తో
పరుచుకున్న వీధులమీద
కర్ణకఠోరంగా ప్రతిధ్వనిస్తాయి.

ముక్కుతో నీలి రెక్కలు
సవరించుకుంటున్న పక్షి లాంటి
రాత్రి
నిశ్శబ్ద మృత్యువు భూతాల్లా
బారులు తీరిన పోప్లార్ చెట్ల నుండి
పగిలి ముక్కలైన ధ్వనులై
బొట్లు బొట్లుగా రాలుతుంటుంది

పాపా
యేడవకు

శిరచ్ఛేదమైన నీ బొమ్మకు
అనాధ ఆర్తారావాలు
భీకరంగా శోకించే చీకటి కూపాల్లో
ఎక్కడో ఒక చోట
ఓ సమాధి దొరుకుతుంది

పాపా
చిన్నాభిన్నమైన పుర్రెల మధ్యనుండి
పచ్చని గడ్డి మొలకెత్తడం చూసినా
నువ్వు నలిగిపోయిన సీతాకోకచిలుక
ముకమలు రెక్కల్ని మాత్రం
గట్టిగా పొదివిపట్టుకో

పాపా విను
దగ్ధమైన గులాబీల నిషాత్ బాగ్ నుండి
నెత్తురోడుతున్న హృదయాల్లా వికసిస్తున్న
వసంత గీతాలను
పొగ దయ్యాలు పాడుతున్నాయి…

పాపా
ఈ నేలమీద
ఇంక నీకు రంగు రంగుల బొకే లు
ఎవరూ అందివ్వరు
విరిగిపోయిన నీ క్రేయాన్ చేతివేళ్ళ కు కూడా ….
పాపా
ఇదిగో చూడు

ఇప్పుడు కశ్మీర్లో మిగిలిన రంగులు మూడే
బూడిద. నలుపు. ఎరుపు.
నీ క్యాండీ లో నారింజ రంగు మర్చిపో ఇంక.

క్రూరమైన నల్లటి రాత్రి
ఎరుపు రంగు తప్ప
అన్ని రంగుల్నీ చెరిపేస్తుంది.

వేల ఉదయాల నిప్పుల్లో కాలి
బొగ్గులైన శరీరాల బూడిదల్లో ముంచిన వేళ్ళతో
హెలికాప్టర్ లో ఎగిరే రాక్షసుడు
తెల్లని గాలి రెక్కలపై రాసిన
కవితావాక్యాలను చెరిపేస్తుంటాడు
నిర్దాక్షిణ్యంగా

అగ్ని
పాము నాలుకలతో
నీ కథల పుస్తకాల్లోని
అందమైన గంధర్వులను
మింగేస్తుంది.

వర్షపు సూదులపై
నిప్పుకణికలు బుసకొడతాయి

పాపా
వెళ్లిపో
నీ సుకుమారమైన కంటిపాపల
ద్రవపుటద్దాల మీద
వణికే వేగుచుక్కను
భయంకర నరకం
చుట్టుముడుతోంది.

నీ ఎరుపెక్కిన లేలేత
చెవుల్ని కప్పుకో
అద్భుతకథలూ,
ప్రాస పాటలూ
చప్పట్లూ
అన్నీ ఇప్పుడు కరిగిపోయిన సీసపు చుక్కలు

నెత్తుటితో తడిసిన కథలు
నీ చర్మపు వాల్ పేపర్ మీద పువ్వుల్ని నాకుతూ
గబ్బిలాల్లా రెక్కలు టపటపలాడిస్తాయి.

గాయపడ్డ ఎర్రటి సూర్యుణ్ణి
ఏవో అపరిచిత హస్తాలు
నవ్వుల్ని చిత్రవధచేసిన
నల్లటి చెరువులో విసిరేస్తాయి

వక్రీకృత భౌగోళిక పటాల్లో
జోస్యపు మృతనేత్రం
తన్ను తాను కోల్పోతుంది

చూడు పాపా
మీ అమ్మ కప్పుకునే
చిరిగిపోయిన ఆకాశపు శాలువా ను
అడవుల సువాసనలు కుట్టే
ప్రయత్నం చేస్తున్నాయి.

మాసిపోయిన నీలపు బట్ట పేలికలు
చినార్ చెట్ల కింద గోరీల పై
వాలతాయి.

పాపా
ఒక్కటి చెప్పు
మృతగర్భంలో
ఊపిరితీసుకోవడం
ఎట్లా ఉంటుందో
ఈ ప్రపంచానికెప్పుడైనా
తెలుస్తుందా?


తెలుగు: నారాయణస్వామి వెంకటయోగి

పుట్టింది సిద్ధిపేట‌, చదివింది జిల్లా ప‌రిష‌త్‌ హై స్కూల్ లచ్చపేట, స‌ర్వేల్‌, హైద‌రాబాద్‌ పబ్లిక్ స్కూల్, జేఎన్‌టీయూ, ఓ యూ. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా, అమెరికాలో గత 20 ఏండ్లుగా ఐటీలో, 14 ఏండ్లు విరసం సభ్యుడు. మూడు కవితా సంకలనాలు 'కల్లోల కలల మేఘం', 'సందుక', 'వానొస్తదా'?,  ఒక కవితా ప్రయాణ జ్ఞాపకాలు 'నడిసొచ్చిన తొవ్వ' – ఇప్పటిదాకా ప్రచురణలు. 'ప్రజాకళ', 'ప్రాణహిత'లతో సన్నిహిత సంబంధం.

21 thoughts on “దశాబ్దాల భౌగోళిక అస్తిత్వ వేదన సైమా అఫ్రీన్ కవిత్వం

  1. ప్రపంచానికి తెలిసినా తెలియని గుడ్డిదై కళ్ళు అప్పగించి చూడడం తప్ప ఎం చెయ్యలేదు … మారిపోయిన శిథిలాల రంగుల్ని చూడకుండా ఉండడమే మంచిది ఆ బంగారు బొమ్మ 👏🌺💐🌼ప్రతి లైన్లో పదప్రయోగం చాలా బాగుంది సర్ 🌺💐🌼అభినందలు 🌺💐🌼

  2. పాపా
    ఈ నేలమీద
    ఇంక నీకు రంగు రంగుల బొకే లు
    ఎవరూ అందివ్వరు
    విరిగిపోయిన నీ క్రేయాన్ చేతివేళ్ళ కు కూడా ….
    పాపా
    ఇదిగో చూడు

    ఇప్పుడు కశ్మీర్లో మిగిలిన రంగులు మూడే
    బూడిద. నలుపు. ఎరుపు.
    నీ క్యాండీ లో నారింజ రంగు మర్చిపో ఇంక.

    Excellent translation Sir.. This is the most poetic way of an expression for Kashmir! Great poem totally indeed!

  3. సైమా కవిత బాగుంది. ఊహలను దట్టంగా పరిచింది, సాంద్రంగా అల్లింది. మీరన్నట్టు కలచి వేసే కవిత. ఇలా వివిధ ప్రాంతాల కవులను పరిచయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు.

  4. పద పదంలో వేదన కనబడుతుంది. గొప్ప కవిత్వం సార్

  5. థాంక్యూ స్వామి గారు.సైమా ఆఫ్రీన్ కవిత చాలా బాగుంది.

  6. గొప్ప కవితను అందించారు సర్

  7. స్వామీ, కదిలించే కవిత, హృదయానికి హత్తుకునే పరిచయం.. కృతజ్ఞతలు

  8. Excellent rendition sir….. its a great poem. any poem with soul will always kindle hearts. Great translation. congratulations sir… thank you

  9. బలమైన సైమా అక్షర గళానికి, మీ అనువాదం మా గుండెలను తడి చేసింది.అద్భుతం సర్💐

Leave a Reply