సూర్యకాంతి, పూల పరిమళం, పని – మేడే

సూర్యకాంతిని చూడాలి మేం, పూల పరిమళాన్ని ఆఘ్రాణించాలి మేం
ఎనిమిది గంటలు మాకోసం, భగవత్సంకల్పం అది అని నమ్ముతాం మేం
ఓడరేవులలో, కర్మాగారాలలో మా శక్తులన్నిటినీ కూడగడుతున్నాం మేం
ఎనిమిది గంటలు పని కోసం, ఎనిమిది గంటలు విశ్రాంతి కోసం, ఎనిమిది గంటలు మాకోసం
ఎనిమిది గంటలు పని కోసం, ఎనిమిది గంటలు విశ్రాంతి కోసం, ఎనిమిది గంటలు మాకోసం

-ఎనిమిది గంటల పనిదినం కోసం 1860ల నాటి కార్మిక గీతం

వేసవి కాలం, 1930. స్పెయిన్ దేశం. 1929 మహాసంక్షోభం ప్రభావంలో ప్రపంచదేశాలు కునారిల్లుతున్నాయి. నిరాశ నీలి మేఘాలు దట్టంగా ఆవరించుకున్న ఆ సందర్భంలో మాడ్రిడ్ రాజధాని నగరంలో ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ ఒక ఉపన్యాసం ఇచ్చాడు. ‘మనవళ్లు, మనవరాళ్ల కాలంలో సంభవించబోయే ఆర్ధిక పరిణామాలు’ అన్నది ఆ ఉపన్యాసం పేరు. ‘ఇప్పుడు ఆర్ధిక నిరాశావాదం మనల్ని కుంగదీస్తున్నది’ అని అంగీకరిస్తూ కీన్స్ తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు. కీన్స్ ఆశావాదిగా మాట్లాడాడు. ‘మనం ఇప్పుడు అనుభవిస్తున్న బాధ వయసు మీదబడిన వార్ధక్యపు కీళ్ళ నొప్పుల బాధలాంటిది కాదు. అతి శీఘ్రంగా సాగుతున్న ఎదుగుదల నుంచీ, ఒక ఆర్ధిక దశ నుంచి మరొక ఆర్ధిక దశలోకి మారుతున్న పరిణామాలతో బాధాకరంగా సర్దుకుపోవాల్సిన పరిస్థితి నుంచీ ఉత్పన్నమైన బాధ ఇది. సాంకేతిక సామర్ధ్యం కార్మికులని ఇముడ్చుకోగలిగిన దానికంటే శరవేగంగా పెరుగుతూవుంది. జీవన ప్రమాణాలలో అభివృద్ధి కూడా అత్యంత వేగంగా కొనసాగుతున్నది.’ ఇంకా, ‘ప్రస్తుతం కొనసాగుతున్న ప్రపంచ స్థాయి సంక్షోభం, కాంక్షా భరిత ప్రపంచంతో పొసగని నిరుద్యోగపు మహా అసంగతత్వం, మనం చేసిన ప్రమాదకరమైన పొరపాట్లు, ఇవన్నీ పైపైన కనిపించేదానికి భిన్నంగా లోపల కొనసాగుతున్న వాస్తవిక ధోరణులని గుర్తించకుండా చేస్తున్నాయి… వర్తమానాన్నో, సమీప భవిష్యత్తునో పరిశీలించడం నా వ్యాసం ఉద్దేశ్యం కాదు. స్వల్పకాలిక ధోరణులనుండి దూరంగా జరిగి భవిష్యత్తులోకి రెక్కలు చాచి ఎగరడమే నా వ్యాసపు లక్ష్యం. ఇప్పటినుంచి వంద సంవత్సరాల తర్వాత ఎటువంటి ఆర్ధిక జీవన స్థాయిని మనం ఆశించవచ్చు? మన మనవళ్లు, మనవరాళ్ల కాలంలో ఎలాంటి ఆర్ధిక పరిణామాలు సంభవించే అవకాశం ఉంది?’ వంద సంవత్సరాల తర్వాత, అంటే 2030 నాటికి, సంభవించే ఆర్ధిక పరిణామాన్ని కీన్స్ ఇలా ఊహించాడు. మానవ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా నిజమైన, శాశ్వతమైన సమస్య మనిషి ముందుకు వస్తుంది. అది, ఆర్ధిక అవసరాల వత్తిడి నుంచి మనిషి స్వేచ్ఛ లభించాక, విశ్రాంతి సమయాన్ని గడపడం ఎలా అన్న సమస్య. విజ్ఞాన శాస్త్రమూ, చక్రవడ్డీ ఈ రెండూ మనిషికి విజయాన్ని సాధించిపెట్టాయి. ఈ విజయంతో లభించే తీరిక సమయాన్ని ఎలా గడపాలి, తెలివిగా, సరిగ్గా, చక్కగా ఎలా జీవించాలి అన్నదే మనిషి ముందుండే నిజమైన, శాశ్వతమైన సమస్య. 2030 నాటికి, మనుషులు వారానికి కేవలం పదిహేను గంటలు మాత్రమే పనిచేయాల్సి వస్తుందని కీన్స్ ఊహించాడు. ‘మనిషిలోని తొలి మానవుడిని సంతృప్తి పరచడానికి మనలో అత్యధికులకు రోజుకు మూడు గంటల పని మాత్రం సరిపోతుంది.’

కీన్స్ ఊహ సరియైనదేనా కాదా, లేదంటే ఆయన ఎక్కడ పొరపడ్డాడు అని చర్చించడం ఈ వ్యాసం ఉద్దేశ్యం కాదు. వంద సంవత్సరాల కాలంలో సాంకేతిక అభివృద్ధి, పర్యవసానంగా జీవన ప్రమాణాల మెరుగుదల ఫలితంగా రోజుకు మూడు గంటలు లేదా వారానికి పదిహేను గంటలు మాత్రమే పనిచేసే పరిస్థితి ఏర్పడుతుందని 1930లో ఒక ప్రఖ్యాత ఆర్థికవేత్త ఊహించాడన్న విషయం మనకి ఆసక్తి కలిగిస్తుంది. అయితే, తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత, మనం వారానికి డెబ్బై గంటలు పనిచేయాలని పిలుపులు ఇప్పుడు బిగ్గరగా వినిపిస్తున్నాయి.

పనిదినంలో రోజుకు ఎన్ని గంటలు పని చేయాలి, చేయవచ్చు అనే ప్రశ్నని పలువురు చరిత్రకారులు, ఆర్థికవేత్తలు చర్చించారు. ఈ ప్రశ్నకి సమాధానాలు మారుతూ వచ్చాయి. ఎందుకంటే, పని, పని దినం, విశ్రాంతి, గడియారపు కాలం మొదలైన విషయాలపై ఆలోచనలు కూడా పరిణామం చెందుతూ వచ్చాయి. ఇది కేవలం, ఆలోచనలు, భావాలకి సంబంధించిన అంశం కాదు కూడా. పధ్నాలుగవ శతాబ్దానికి చెందిన ఆంగ్ల రచయిత ఛాసర్ రచన కాంటర్బరీ టేల్స్ లో అనాదికాలపు సహజ కాల సూచికగా కోడిపుంజును పేర్కొంటాడు. పద్దెనిమిదవ శతాబ్దానికి వచ్చేసరికల్లా, గడియారం సమయ సూచికగా కీలక స్థానం ఆక్రమించేసింది. ‘1300 సంవత్సరంలో ఇంగ్లీషు రైతు తన జీవిక కోసం ఒక ఏడాదిలో మొత్తం 1500 గంటలు పనిచేస్తే సరిపోయేది. అదే, పందొమ్మిదవ శతాబ్దంలో జాన్ స్టువర్ట్ మిల్ కాలానికి వచ్చేసరికి ఒక ఫ్యాక్టరీ కార్మికుడు బ్రతకాలంటే, అంతకు రెండింతలు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చింది.’ (రట్జర్ బ్రెగ్మన్, ఉటోపియా ఫర్ రియలిస్ట్స్ పుస్తకం). పారిశ్రామిక సమాజంగా పరివర్తన దానితో పాటు పనికి సంబంధించిన అలవాట్లలో అనేక మార్పులను తీసుకు వచ్చింది. అందుకు శ్రామిక ప్రజలని బలవంతంగా నియంత్రించాల్సి వచ్చింది. ‘క్రమశిక్షణ’లో పెట్టాల్సి వచ్చింది. ‘శ్రమ విభజన, శ్రామికుల నియంత్రణ, జరిమానాలు, గంటలు, గడియారాలు, నగదు ప్రోత్సాహకాలు, ప్రబోధాలు, పాఠశాలలు, వీటితో పాటు ఆటలని, సంతలని అదుపుచేయడం’ ఇలాంటి పద్ధతులు, సాధనాలని అన్నిటినీ ఉపయోగించి శ్రామికులకు నూతన అలవాట్లని రూపొందించారని చరిత్రకారుడు ఇ పి థాంప్సన్ అంటాడు (ఇ పి థాంప్సన్, టైం, వర్క్ డిసిప్లిన్ అండ్ ఇండస్ట్రియల్ క్యాపిటలిజం వ్యాసం).

నవ్య సాంప్రదాయ (నియో క్లాసికల్) ఆర్థికవేత్తలు పనిదినం లేదా పనిగంటలని వ్యక్తులు తమకు తాము నిర్ణయించుకుంటారని భావిస్తారు. తమ అవసరాలకి తగిన ఆదాయాన్ని ఆర్జించే పని, తాము కోరుకునే తీరిక సమయం ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకుని వ్యక్తులు తాము ఎన్నిగంటలు పనిచేయాలో ఎంచుకుంటారని నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తల అవగాహన. సామాజిక నియమాలు, వ్యవస్థాగతమైన ఏర్పాట్లే పనిదినపు వ్యవధిని, అంటే, పనిగంటలని నిర్ధారిస్తాయని వ్యవస్థాగత ఆర్థికవేత్తలు (ఇన్స్టిస్ట్యూషనలిస్టులు) చెబుతారు. జీవన ప్రమాణాల పెరుగుదల, ఉత్పాదకతలో అభివృద్ధి – ఇవి రెండూ పనిగంటలని కుదిస్తాయని అంటారు. అయితే, ఈ రెండింటిలో ప్రధాన పాత్ర దేనికనే అంశంపై తేడాలు వ్యక్తమౌతుంటాయి. అందుకు భిన్నంగా, పెట్టుబడిదారులు, కార్మికుల మధ్య శతాబ్దాల వర్గ సంఘర్షణ ఫలితమే సాధారణ పనిదినపు వ్యవధిని నిర్ణయిస్తుందని కార్ల్ మార్క్స్ అంటాడు. అంటే, జీవన ప్రమాణాల పెరుగుదల, ఉత్పాదకతలో అభివృద్ధి కాక, వర్గ పోరాటమే పనిదినపు వ్యవధిని నిర్ణయిస్తుంది.

మార్క్స్ ఇలా వివరిస్తాడు. ‘”పనిదినం అంటే ఏమిటి? శ్రమశక్తి రోజువారీ విలువని కొనుగోలు చేసే పెట్టుబడి ఆ శ్రమశక్తిని ఎంత కాలం పాటు వినియోగించుకోవచ్చు? శ్రమశక్తిని పునరుత్పత్తి చేయడానికి అవసరమైన పని వ్యవధిని దాటి, పనిదినాన్ని ఎంతవరకూ పొడిగించవచ్చు?” ఈ ప్రశ్నలకు పెట్టుబడి ఇలా సమాధానమిస్తుందని గమనించవచ్చు. పనిదినంలో 24 గంటలు పూర్తిగా ఉంటాయి. ఏ విశ్రాంతి లేకుంటే శ్రమశక్తి తిరిగి తన సేవలను అందించడానికి నిరాకరిస్తుందో, ఆ మేరకు ఆ విశ్రాంతి కోసం అందులో కొద్దిపాటి గంటలను మినహాయించాలి. కాబట్టి, శ్రామికుడు అంటే తన జీవితమంటిలోనూ శ్రమశక్తి తప్పితే మరేమీ కాదన్నది సుస్పష్టం. కాబట్టి, శ్రామికుడు వెచ్చించగల కాలమంతా ప్రకృతి సిద్ధంగానూ, చట్టబద్ధంగానూ పెట్టుబడి స్వయం విస్తరణకి అంకితమయ్యే శ్రమ కాలమే. విద్యకీ, బౌద్ధిక అభివృద్ధికి, సామాజిక విధుల నిర్వహణకి, సామాజిక సంబంధాలకీ, అతని శారీరక, మానసిక కార్యకలాపాల స్వేచ్ఛా నిర్వహణకి, ఆదివారం నాటి విశ్రాంతి కాలానికి సైతం (అదీ ఆదివారాన్ని పవిత్ర దినంగా యెంచేవారి దేశంలో) అవసరమైన కాలం – ఇదంతా తెలివిమాలిన మాట! అయితే అదనపు శ్రమ కోసం పెట్టుబడి తన వెర్రి, అవధులులేని కాంక్షలో తన తోడేలు ఆకలిలో పని దినపు నైతిక హద్దుల్నే కాక, భౌతిక హద్దుల్ని సైతం అతిక్రమిస్తుంది. అది శరీరం ఎదుగుదలకి, అభివృద్ధికి ఆరోగ్యకర నిర్వహణకి అవసరమైన సమయాన్ని స్వాహా చేస్తుంది. తాజాగాలినీ, సూర్యరశ్మినీ అనుభవించడానికి అవసరమైన కాలాన్ని అది దొంగిలిస్తుంది. అది భోజనాల వేళ విషయంలో కొసరు బేరాలాడుతుంది. సాధ్యమైన చోటల్లా దాన్ని ఉత్పత్తి ప్రక్రియలో కలిపివేస్తుంది. ఆరకంగా బాయిలర్ కి బొగ్గు అందించినట్టూ, యంత్రానికి గ్రీజూ, ఆయిలూ అందించినట్టూ, ఉత్పత్తి సాధనాలకి అందించినట్టే కార్మికులకి కూడా ఆహారాన్నందిస్తుంది. శారీరక శక్తులు తిరిగి పనిచేయడానికి, పునరుద్దరించడానికి, సేద దీరటానికి అవసరమైన గాఢ నిద్రను, పూర్తిగా శక్తి ఉడిగిపోయిన జీవి పునరుద్ధరణకు తప్పనిసరి అవసరమైన కొన్ని గంటల జడత్వంగా కుదిస్తుంది. పనిదినపు వ్యవధి పరిమితుల్ని నిర్ణయించేది శ్రమశక్తిని సుస్థితిలో వుంచే అవసరాలు కాదు. అది బాధాకరమైనా, రోగపీడితమైనా, నిర్బంధమైనా, సాధ్యమైనంత ఎక్కువగా శ్రమశక్తి రోజువారీ వ్యయమే కార్మికుని విశ్రాంతి వ్యవధి పరిమితుల్ని నిర్ణయిస్తుంది. శ్రమశక్తి జీవిత కాలాన్ని గురించి పెట్టుబడి ఏ మాత్రం పట్టించుకోదు. ఒక పనిదినంలో రాబట్టడానికి వీలైన అత్యధిక శ్రమ శక్తిని మాత్రమే అది సూటిగా పట్టించుకుంటుంది. దురాశాపరుడైన రైతు భూసారాన్ని నష్టపరుస్తూ భూమినుండి ఎక్కువ పంటను గుంజుకున్నట్టు పెట్టుబడిదారుడు కార్మికుని ఆయుస్సును క్షీణింపజేస్తూ ఈ లక్ష్యాన్ని సాధిస్తాడు. ఆ రకంగా పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం (ముఖ్యంగా అదనపు విలువ ఉత్పత్తి, అదనపు శ్రమను పీల్చుకోవడం) అనేది పని దినాన్ని విస్తరించడంతో మానవ శ్రమశక్తి శారీరక అభివృద్ధికి, క్రియా శీలతకూ అవసరమైన మామూలు నైతిక, భౌతిక పరిస్థితులను దోచుకోవడం ద్వారా ఉత్పత్తి చేసేది దాని క్షీణతని మాత్రమే గాదు. స్వయంగా ఈ శ్రమశక్తి అకాల అశక్తతనూ, మరణాన్నీ ఉత్పత్తి చేస్తుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం కార్మికుని వాస్తన ఆయుస్సును తగ్గించడం ద్వారా ఒక నిర్ణీత కాలపరిమితిలో అతని ఉత్పత్తి కాలాన్ని పొడిగిస్తుంది ’(కార్ల్ మార్క్స్, పెట్టుబడి).

పనిదినపు వ్యవధిని లేదా పనిగంటలని తగ్గించడం అన్నది కార్మికవర్గపు నిరంతర పోరాటాల మూలంగానే సాధ్యపడిందని చరిత్ర రుజువు చేసింది. క్రిస్టోఫ్ హెర్మన్ అనే పరిశోధకుడు పనిగంటల కుదింపులో వచ్చిన మార్పులని విశ్లేషించి, ఇందులో నాలుగు దశలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ‘పందొమ్మిదో శతాబ్దపు ద్వితీయార్ధభాగం మొదటి దశ. ఈ దశలో పది గంటల పనిదినాన్ని ప్రవేశపెట్టారు. రెండవదశ, పందిమ్మిదో శతాబ్దపు చివరి భాగం నుండి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేదాకా కొనసాగింది. ఈ రెండవ దశలో ఎనిమిది గంటల పనిదినం, లేదా వారానికి 48 గంటల పని అనే విధానం స్థిరపడింది. మూడవదశ, 1930లలో మొదలయింది. ఈ దశలో కొన్ని దేశాలలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలు కాకమునుపు, మరికొన్ని దేశాలలో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే వారానికి 40 గంటల పని విధానాన్ని అమలుచేశారు. యుద్ధంలో చితికిపోయిన అత్యధిక యూరోపియన్ దేశాలు ఇందులో వెనుకబడిపోయాయి. అలాంటి దేశాలలో 1960లు, 1970లలో మాత్రమే వారానికి 40 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టారు. పనిగంటల కుదింపులో నాలుగవదశ, 1980లు, 1990లలోనే ముందుకొచ్చింది. ఈ దశలో వారానికి 35 గంటల పని విధానాన్ని అతి కొద్ది దేశాలలో మాత్రమే ప్రవేశపెట్టారు’ (క్రిస్టోఫ్ హెర్మన్ , క్యాపిటలిజం, పొలిటికల్ ఎకానమీ ఆఫ్ వర్క్ టైమ్ పుస్తకం).

ఇరవైయవ శతాబ్ది చివరలో నయా ఉదారవాదం ప్రాబల్యంలోకి వచ్చింది. పనిదినం వ్యవధిని, పనిగంటలని కుదించడం సామాజిక ప్రగతికి నిదర్శనం అనే భావనను నయాఉదారవాద స్రవంతి తిరస్కరిస్తుంది. ఉద్యోగాల కల్పనకు, రక్షణకు పనిగంటలని పొడిగించడమే మార్గమని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. 2003లో జర్మనీలోని కొలోన్ ఇన్స్టిస్ట్యూట్ ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్ సంస్థ ఒక బహిరంగ చర్చను ప్రారంభించింది. జర్మనీలో పనిదినాన్ని రోజుకు ఒక గంట పెంచితే అది 60,000 అదనపు ఉద్యోగాలను సృష్టిస్తుందని అందులో వాదించారు. 2002లో ఫ్రాన్స్ లో మితవాద ప్రభుత్వం వారానికి 35 గంటల పని విధానాన్ని మార్చదలుచుకుంది. మితవాద ప్రభుత్వం తాను తీసుకురాదలచుకున్న మార్పులని సమర్ధించుకోవడం కోసం, ‘ఎక్కువసేపు పనిచేద్దాం, ఎక్కువ సంపాదిద్దాం, ఎక్కువ ఉద్యోగాలని సృష్టిద్దాం’ అనే నినాదాన్ని ఇచ్చింది. నయా ఉదారవాద ప్రాబల్యం ప్రపంచ వ్యాపితంగా పనిగంటల తగ్గింపు విధానాలను వెనక్కి తిప్పింది. క్రమంగా పనిగంటలు పెరగడం ప్రారంభమైంది. మనం వారానికి 70 గంటలు పనిచేయాలనే పిలుపులను ఈ నేపథ్యంలోనే చూడాలి. లేబర్ కోడ్స్ ద్వారా పనిదినాన్ని రోజుకు 8 గంటలనుంచి 12 గంటలకి పెంచిన విధానాలు, వారానికి 70 గంటల పని పిలుపులూ ఒకేసారి వస్తున్నాయి.

పనిగంటల పెంపులో మరొక ముఖ్యమైన కోణం ఉంది. పనిగంటలు పెరగడం మాత్రమే కాదు, పనిలో వేగం, తీవ్రత కూడా పెరిగింది. 1977 నుండి 1997 మధ్య కాలంలో అమెరికా దేశంలో పనిలో తీవ్రత పెరిగిపోయిందని, ప్రధానంగా పనిలో సంక్లిష్ట కార్యకలాపాలు పెరిగిపోవడమే దీనికి కారణమనీ డేవిడ్ మామ్, డేవిడ్ పర్సెల్ అనే పరిశోధకులు నిర్ధారించారు. యూరప్ దేశాలలో యూరోపియన్ వర్కింగ్ కండిషన్స్ సర్వే 1990 లో ప్రారంభమైంది. ఆ తర్వాత కాలంలో పనిలో తీవ్రత నిరంతరంగా పెరిగిపోతూనే ఉందని పరిశీలనలు తెలుపుతున్నాయి. పనిగంటల పెంపుదల, పనిలో తీవ్రత పెరిగిపోవడంతో పనికీ, విశ్రాంతికీ మధ్య, పనికీ, వైయక్తిక జీవితానికీ మధ్యన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. యూరప్, ఆసియా, అమెరికా దేశాలలో మేనేజర్లు, నిపుణులైన ఉద్యోగులు వారానికి ఎనభై నుంచి తొంభై గంటల పాటు పని చేయడమో, పనులను పర్యవేక్షించడమో, లేదా అందుబాటులో ఉండడమో చేస్తున్నారని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పరిశీలన తెలియజేసింది. ఆధునిక సాంకేతిక విజ్ఞానం దీనికి దోహదం చేసిందని ఆ పరిశీలన తెలిపింది. స్మార్ట్ ఫోన్ల మూలంగా సగటు ఉద్యోగి వారానికి పదకొండు గంటలు అదనంగా పనిచేస్తున్నారని ఒక కొరియన్ పరిశోధన వెల్లడి చేసింది. ఒకవైపు పని గంటలు, పనిలో తీవ్రత పెరిగిపోతూ ఉంటే, కార్మికుల వేతనాలు మాత్రం ఎలాంటి ఎదుగుదల లేకుండా నిలిచిపోయాయి. కొన్ని సందర్భాలలో తగ్గిపోయాయి కూడా.

సుదీర్ఘమైన పనిదినం, పనిలో పెరుగుతున్న వేగం, తీవ్రత కార్మికుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ‘మితిమీరిన పనిగంటలు కార్మికుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కార్మికుల స్వస్థతనీ, ఆయుర్దాయాన్నీ నష్టపరుస్తున్నాయని అనేక పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.’ సుదీర్ఘమైన పని గంటలు, మితిమీరిన పని మూలంగా రక్తపోటు, గుండె జబ్బులు, మానసిక సమస్యలు, సంతాన లేమి వంటి సమస్యలు తరచుగా తలెత్తుతున్నాయి. ఈ ఆరోగ్య సమస్యలతో బాధ పడేది వ్యక్తులు మాత్రమే కాదు, వారి కుటుంబాలు కూడా. అంతిమంగా, వైద్యానికై చేసే ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. (రాబర్ట్ లాయునెస్, వర్క్ టైం రెగ్యులేషన్ యాజ్ ఎ సస్టెయినబుల్ ఫుల్ ఎంప్లాయ్ మెంట్ స్ట్రాటజీ: ది సోషల్ ఎఫెక్ట్ బార్గెయిన్ వ్యాసం).

‘సోమరితనాన్నీ, వ్యభిచారాన్నీ, అసభ్యతనీ నిర్మూలించడం కోసం, పారిశ్రామిక స్ఫూర్తిని పెంపొందించడం కోసం, తయారీ పరిశ్రమలలో కార్మికుల వేతనాలని తగ్గించడం కోసం, భూములలో పేదల వత్తిడిని తగ్గించడం కోసం, బికారుల కోసం ఆదర్శవంతమైన శ్రామిక గృహాలని (వర్క్ హౌస్) ఏర్పాటు చేయాలని 1770లలో ప్రతిపాదనలు వచ్చాయి. అటువంటి శ్రామిక గృహాలని, నిరుపేదల ఆశ్రయంగా గాక ‘బీభత్స గృహాలుగా’ (హౌస్ ఆఫ్ టెర్రర్) రూపొందించాలని ప్రతిపాదించారు. కడుపునిండా తిండి పెట్టి, మంచి వెచ్చటి బట్టలు ఇచ్చి, పని లేకుండా కూర్చోబెట్టడానికి బదులుగా, బీభత్స గృహాలలో పేదలు రోజుకి 14 గంటలు పని చేయాలి. భోజనానికి సమయాన్ని మినహాయిస్తే, పనికి ఖచ్చితంగా 12 గంటలు మిగులుతాయి… పెట్టుబడిదారీ ఆత్మ ఈ బీభత్స గృహాన్ని 1770లో కలగన్నది. కొద్ధి సంవత్సరాల తర్వాత, పారిశ్రామిక కార్మికుల విషయంలో ఒక ‘మహా శ్రామిక గృహం’ రూపంలో ఆ కల సాకారమైంది. దానికి ఫ్యాక్టరీ అనే పేరుపెట్టారు. వాస్తవం ముందు ఆ కల వెలవెలబోయింది.’ (కార్ల్ మార్క్స్, పెట్టుబడి). పనిదినాన్ని రోజుకు 8 గంటలనుంచి 12 గంటలకు పెంచే చర్యలు, ప్రయత్నాలు, వారానికి 70 గంటల పని అనే పిలుపులు – ఇవన్నీ మారిన పరిస్థితులలో ఆ ‘ఆదర్శ శ్రామిక గృహాలనీ’/ ‘బీభత్స గృహాలనీ’ నెలకొల్పాలనే ప్రయత్నాలలో భాగం. లాభాలకోసం పెట్టుబడి తోడేలు ఆకలి ఎన్నటికీ తీరనిది. అది అంతులేనిది. లాభాలవేటలో పనిదినపు భౌతిక పరిమితులను అది గరిష్టంగా పొడిగిస్తూ ఉంటుంది.

కార్ల్ మార్క్స్ ఒక కాలాన్ని, సమాజాన్ని ఊహించాడు. అందులో ప్రతి ఒక్కరికీ ‘ఉదయం పూట వేట, మధ్యాహ్న వేళలో చేపలు పట్టడం, సాయంత్రం పశు పాలన, రాత్రి భోజనం తర్వాత విమర్శ చేసే అవకాశం ఉంటుంది. ఏ ఒక్కరూ వేటగాడిగానో, చేపలు పట్టేవాడిగానో, పశు పాలకుడుగానో, విమర్శకుడిగానో వృత్తికి పరిమితం కాకుండా, అందరికీ ఆయా పనులు చేసే అవకాశం ఉంటుంది.’ బీభత్స గృహాలని ఊహించిన పెట్టుబడి కలలతో దీనిని పోల్చి చూడండి. సూర్యకాంతిని ఆస్వాదించాలనీ, పూల పరిమళాన్ని ఆఘ్రాణించాలనీ కోరుకునే మనుషుల కోరిక ఒక తీరని కల కానే కాదు. ‘ఎనిమిది గంటలు పని కోసం, ఎనిమిది గంటలు విశ్రాంతి కోసం, ఎనిమిది గంటలు మాకోసం’ అన్న మాట ప్రస్తుత వాస్తవం ముందు వెలవెలబోయే వట్టి ఆదర్శం కాదు, కాబోదు. వర్తమాన వాస్తవానికి వ్యతిరేకంగా పోరాడి, దానిని మార్చాలనే కృషిని మేడే మనకు గుర్తు చేస్తుంది.

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

3 thoughts on “సూర్యకాంతి, పూల పరిమళం, పని – మేడే

  1. పరిశోధకులకు, విమర్శకులకు, మార్పు సాధించాలనుకునే కార్యకర్తలకు ఇలా చరిత్రలో వివిధ అంశాల పట్ల సమాచారం అవసరం!… సుధాకిరణ్ కు అభినందనలు, కృతజ్ఞతలు!

  2. మే డే సందర్భంగా వచ్చి రొటీన్ వ్యాసాలకు భిన్నంగా కొత్త విషయాలతో చాలా ఆసక్తికరంగా ఉంది. రచయితకు అభినందనలు.

Leave a Reply