సూపర్ మామ్ సిండ్రోమ్

“సుమతి సూర్యుణ్ణి ఆపేసినట్లు, అనూరాధ కాలచక్రాన్ని నిలిపివేసిందా! అనుకున్నాడు సూర్యారావు ఉలిక్కిపడి పక్కమీద నుంచి లేచి కూర్చుంటూ.

“కాలచక్రం ఏం ఆగిపోలేదు. అనూరాధే ఆగిపోయింది” అన్నట్లు గోడ గడియ తొమ్మిది గంటలు కొట్టింది. అనూరాధ లేచి సగం పనులు పూర్తి చేస్తేగానీ సూర్యుడు ఉదయించడు. వంట ఇల్లు మేల్కోదు. వాకిట్లో ముగ్గు పడదు. వంట ఇల్లు ఈలలతో గోలలతో చైతన్యవంతం కాదు. ఒకటేమిటి – లోకమే సుషుప్తిలో నుంచి చైతన్యంలోకి రాదు. అటువంటి అనూరాధ ఇంకా దుప్పటి ముసుగుతన్ని పడుకోవడం ఏమిటో సూర్యారావుకి అర్థం కాలేదు. ఆమె బాధ్యతలేని గృహిణి ఏమాత్రం కాదు.

రోజూ అయిదింటికి ఠంచనుగా నిద్రలేచి సందు చివరదాకా నడచి వెళ్ళి పాల ప్యాకెట్లు తెస్తుంది. పాలు తెచ్చే మనిషి ఈ మధ్య ప్యాకెట్టుకి పది రూపాయలు చేసిందగ్గర్నుంచి అనూరాధ మార్నింగ్ వాక్ మొదలు పెట్టింది. నెలకి ముప్ఫై రూపాయలు ఆదా చేస్తుంది. తెల్లవారేసరికల్లా వచ్చి వాకిలి వూడ్చి ముగ్గులు వేసే మనిషిని పెట్టుకుంది. అప్పుడే గిన్నెలు కడిగి పెట్టి వెడుతుంది ఆవిడ. ఎందుకంటే అనూరాధకి ఎనిమిదిన్నరకు పనైపోవాలి. ఆవిడనిప్పుడు డౌన్ టౌన్ బ్రాంచికి మార్చారు. టౌన్ చాలా రద్దీగా వుంటుంది. రిక్షా ఎక్కితే చాలా ఖర్చౌతుంది. ఆటో అంటే మాటలు కాదు. అందుకని మోపెడ్ కొనుక్కుంది. ఆ మోపెడ్ కొనుక్కున్నప్పుడు ఆమె వయస్సు నలభై అయిదు సంవత్సరాలు. రద్దీగా ఉండి ఒక క్రమంలేని ట్రాఫిక్ లో డ్రయివ్ చెయ్యడం కష్టం గనుక ముప్పావు గంట ముందే బయలుదేరుతుంది. మరలాంటిది తొమ్మిది గంటలదాకా నిండా ముసుగు పెట్టుకుని పడుకుందంటే – వంట్లో బాగాలేకపోయి వుండాలి. అనూరాధకి వంట్లో బాగాలేకపోవడం సూర్యారావు ఎప్పుడూ చూడలేదు ఈమధ్య.

సూర్యారావు ఆమె మొహం మీద కప్పుకున్న దుప్పటి లాగి పడేశాడు. కళ్ళు పెద్దవి చేసి, నోటి మీద చెయ్యి వేసుకుని, తూలిపడబోయి, గోడ కానుకుని నిలబడ్డాడు. అనూరాధ శరీరమంతా తెల్లగా సున్నం కొట్టినట్లు మారిపోయింది. కళ్ళు తెరుచుకుని వున్నాయి. కట్టిన చీరె కట్టినట్లే వుంది. కానీ చేతులూ, కాళ్ళూ సీమ సున్నంతో చేసినట్లయిపోయాయి. కళ్ళూ జుత్తూ తప్ప శరీరం అంతా అలాగే వుంది. కళ్ళు ప్రశాంత నిర్మలంగా ఎన్నడూ లేనంతగా మెరుస్తున్నాయి.

రాత్రి పన్నెండు దాకా ఆమె మామూలుగానే వుంది. ఏడాది నుంచి క్రమం తప్పకుండా ప్రతీరోజూ చూసే హిందీ సీరియల్ చూసింది. ఈపూట కోసం ఇడ్లీ పప్పు గ్రయిండ్ చేసి పెట్టింది. మంచినీళ్ళు కాచి ఫిల్టర్లో పోసింది. ఒకటేమిటి లక్షన్నర పన్లు చేసింది. ఆమెకు చాలా ముందుచూపు. ఇవ్వాళ్టి కోసం నిన్ననే చాలా ఏర్పాట్లు చేసింది. ఇప్పుడేమో ఇలా తెల్లగా సున్నపు బొమ్మలా మారిపోయింది. ఇలాంటి జబ్బు చెయ్యగా ఇంతవరకూ ఎవర్నీ చూడలేదు సూర్యారావు. ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూశాడు. శ్వాస నిలిచిపోయింది. గుండె మీద తల ఆన్చి చూశాడు. స్పందన లేదు. ఉలిక్కిపడ్డాడు. అనూరాధ చచ్చిపోయిందా! అనూరాధ చచ్చిపోవడం ఏమిటి? సూర్యారావు చెమటతో తడిసిపోయాడు. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి స్నేహితుడు సుబ్బారావుకి ఫోన్ చేసి డాక్టర్ని వెంటబెట్టుకు రమ్మన్నాడు. అనూరాధకి వచ్చిన జబ్బేమిటో డాక్టర్ కి అర్థం కాలేదు కానీ ఆమె చచ్చిపోయిందని మాత్రం ధృవపరిచాడు. క్షణాల మీద అనూరాధ మరణవార్త వీధంతా పాకింది. ఇరుగుపొరుగు గబగబా కాఫీలు కాచేసుకుని తాగేసి, మంచినీళ్ళు గట్రా పట్టేసుకుని సూర్యారావు ఇంటికి వచ్చారు.

శవాన్ని క్రిందికి దించి తల దగ్గర దీపం పెట్టాలంది ప్రక్కింటి మామ్మగారు.

వరండాలో చాపవేసి దానిమీదికి చేర్చారు. “పిల్లలకి ఫోన్ చెయ్యి సూర్యారావు” అన్నాడు సుబ్బారావు. సూర్యారావు తడవకీ ఐఎస్డీలు చేసేస్తున్నాడని ఆ సౌకర్యాన్ని తీసేయించింది అనూరాధ. పిల్లల ఫోన్ నెంబర్లూ, డబ్బూ యిచ్చి సుబ్బారావుని ఆ పనికి పురమాయించాడు సూర్యారావు. అతనింకా పళ్ళు తోముకోలేదు. నిద్రలేస్తూనే అతను పళ్ళు తోముకుని వచ్చే వేళకి పెద్ద మగ్గునిండా ఆవిర్లు కక్కే కాఫీ సిద్ధంగా పెడుతుంది అనూరాధ. రెండు మగ్గుల కాఫీకి ఎంత పొడి వెయ్యాలో, ఎన్ని పాలు పొయ్యాలో, ఎలా వెచ్చచెయ్యాలో ఆమెకి తెలిసినట్లు ఎవరికీ తెలీదు.

సుబ్బారావుకి అనూరాధ శరీరాన్ని ఒకసారి ముట్టుకుని చూడాలని వుంది. మంచం మీద నుంచి దించేటప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు గానీ కాళ్ళ మీద చీర కుచ్చెళ్లున్నాయి. ఆమె శరీరం సున్నంగా ఎలా మారిపోయిందో అది నిజంగా సున్నమా లేక ఇంకేమైనానా తెలుసుకోవాలని చాలా కుతూహలంగా వుంది. కానీ ఆ శరీరం అతని స్నేహితుని భార్యాది. అతని వస్తువు కదా? శవమైనా అతనిదే కదా దాని మీద అధికారం. ముట్టుకుంటే ఊరుకుంటాడో లేదో?

ఎవరో చనువుగా ఇంట్లోకి చొరబడి కాఫీ చేసి తెచ్చి సూర్యారావుని బ్రతిమిలాడి యిచ్చారు. మరీ శవం ప్రక్కన కూర్చుని త్రాగడం ఇష్టంలేక అవతల గదిలోకి వెళ్ళాడతాను. ఇదే అదననుకుని ఆమె కాలి దగ్గర కొంచెం గిల్లి, తెల్లని చిన్నముక్క ఒకటి జేబులో వేసుకుని ఫోన్ చెయ్యడానికి వెళ్ళాడు సుబ్బారావు.

“మామాని నేనొచ్చేదాకా వుంచండి. ఏదో ఒక ఫ్లయిట్ కి ఎలాగోలా వచ్చి వాల్తాను. ఒ.కే” అంది సూర్యారావు కూతురు న్యూజర్సీ నుంచి.

కొడుకు ఫోన్లోనే ఏడ్చేశాడు. అతగాడికి ఇండియా వస్తే మళ్ళీ వీసా రెన్యూ అవడు కష్టం. “మామా ఎందుకిలా వెళ్ళిపోయిందంకుల్ – వాట్ హాపెన్డ్” అని ఆక్రోశించాడు.

వాణ్ణెలాగైనా స్టేట్స్ పంపాలని కంకణం కట్టుకుంది అనూరాధే. నయానా భయానా చదివించి, బోలెడు డబ్బు ఖర్చు పెట్టి వాణ్ణి స్టేట్స్ తరిమింది కూడా అనూరాధే. బ్యాంక్ లో అందరూ ఆవిడ వంక చాలా అభినందనపూర్వకంగా చూస్తారు. ‘నీ పిల్లలు రత్నాలు అంటారు. అలా అంతా అనాలని ఆవిడ ఆశించింది. ఆవిడ కోరిక ఫలించింది. “బట్ ఫర్ మమా హి కుడన్ట్ హావ్ మేడిట్. కానీ ఇప్పుడు తను మామాని చూడలేడు. హి కాన్ట్ మేకిట్….”

“బాడీని ఐస్ మీద వుంచాలేమో – అమ్మాయి వచ్చేదాకా ఇలా వుంచితే చెడిపోతుంది అన్నారు ఎవరో.

“ఇది మామూలు శవం కాదు. ఇదంతా సున్నంలా వుంది. ఐస్ మీద పెడితే కరిగిపోదా?” అన్నారు ఇంకొకరు.

“పోని శవం చుట్టూ ఏదైనా మందు చల్లండి” అని ఇంకొకరు సలహా ఇచ్చారు.

ఫోన్లు చెయ్యడం పూర్తి చేసుకున్న సుబ్బారావు పనిలో పనిగా తనింటికి వెళ్ళి టిఫిన్ తినేసి, తన జేబులో టాబ్లెట్ లాంటి వస్తువు తీసి అతని కూతురు చేతిలో పెట్టి అనూరాధ మరణోదంతం ఏకరువు పెట్టాడు. ఆ పిల్ల చటుక్కున దాన్ని పర్సులో వేసుకుని దగ్గరలో వున్న లేబొరేటరీకి పరిగెత్తింది. వాళ్ళు ఆ సున్నం ముక్కని తలనెప్పికి వేసుకునే ఆస్ప్రిన్ టాబ్లెట్ అని చెప్పారు.

“నేనూ అక్కడికొస్తాను నాన్నా” అని లెన్స్ ఒకటి పుచ్చుకుని సూర్యారావు ఇంటికి వచ్చింది సుబ్బారావు కూతురు. ఆ అమ్మాయి పేరు సుశీల. ఆ వీధిలో అనూరాధని తెలీని వాళ్ళెవరూ లేరు. ఆమె రాకపోకల్ని బట్టి గడియారాలు సరిచేసుకునేవాళ్ళు. ఆమెను చూసి ఇళ్ళు తీర్చిదిద్దుకునేవాళ్ళు. ఆమెని అనేక విషయాల్లో అనుకరించేవాళ్ళు, అలా ఎందరో! సుశీల జనాన్ని తప్పించుకుని వచ్చి అనూరాధ చేతిమీద లెన్స్ పెట్టి చూసింది. ఆమె శరీరం సున్నంలా కాదు మారిపోయింది. ఆమె శరీరం మొత్తం రకరకాల టాబ్లెట్లు అతుకు పెట్టినట్లు వుంది. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. కొన్ని లేత గులాబిరంగువి. కొన్ని గుండ్రనివి. కొన్ని పలకలవి. ఇలా రకరకాల టాబ్లెట్లు అతికించి చేసిన బొమ్మలా వుంది అనూరాధ.

“చీమలొస్తున్నాయండీ” అందొకావిడ కంగారుగా.

“అవును అందులో కొన్ని షుగర్ కోటెడ్ టాబ్లెట్స్ వుండి వుండవచ్చు గద” అంది సుశీల.

“అవును షుగర్ కోటెడ్ టాబ్లెట్స్ తనూ ఇచ్చాడు కొన్ని ఆమెకి’ అనుకున్నాడు సూర్యారావు.

సుశీల చేతిలో నుంచి లెన్స్ లాక్కుని చూస్తున్నారు. సూర్యారావు చూడకుండా ఆమె చేతుల్నీ, కాళ్ళనీ గిల్లి చూస్తున్నారు ఇంకా కొందరు.

చాప మీద నుంచి ఆమె శరీరాన్ని ఒక బల్ల మీదికి చేర్చారు. చుట్టూ చీమల మందు చల్లారు. కూతురు వచ్చేవేళకి ఆమె శరీరాన్ని ఒక్కొక్కరే గిల్లీ గిల్లీ మాయం చేసేస్తారేమోననిపించింది సూర్యారావుకి. “శవాన్ని పడకగదిలోకి తరలించండి” అన్నాడు ఉన్నట్టుండి.

“తప్పు నాయనా అలా పెట్టకూడదు. ఏం నక్షత్రమో ఏమో” అంది పక్కింటి మామ్మగారు.

“ఫరవాలేదు మామ్మగారూ! ఈ ఇల్లు ఆవిడ కట్టింది. ఈ ఇంటికోసం ప్రతీ రక్తం బొట్టూ వెచ్చించింది. అందుకోసం ఆమె శరీరం ఎక్కడన్నా పెట్టవచ్చు” అని అనూరాధ శరీరాన్ని దాచి పెట్టేశాడు సూర్యారావు.

ఇరవై ఎనిమిదేళ్ళ సాహచర్యం. అన్నీ ఇచ్చింది. స్నేహం – ప్రేమ – ధనం – సేవ – ఆఖరికి ఇప్పుడు ప్రాణం.

ఇల్లంతా జనంతో నిండిపోయింది. ఇంట్లో ఇంతమంది జనం అనూరాధ కిష్టం వుండదు. తను వేయించుకున్న మార్బుల్ రాళ్ళు మాసిపోతే సబ్బు పెట్టి తుడుచుకునేది – బాత్ రూంలు కడుక్కునేది. వచ్చినవాళ్ళు తళతళలాడే అనూరాధ గ్యాస్ పొయ్యి మీద పాలు మరగపెట్టి పొంగించేస్తున్నారు – సోఫాలన్నీ విరగదొక్కుతున్నారు. అనూరాధ ప్రాణం ఎంత విలవిలలాడిపోయేదో! సూర్యారావు నిస్సహాయుడు. అతనికేం చేతకాదు. హవుస్ కీపింగ్ దగ్గర్నుంచీ మనీ మానేజ్ మెంట్ దాకా – ఆమే , కొనడం, అమ్మడం, బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి బంగారం కొనడం, ఒకటేమిటి – ఇవ్వాళ సూర్యారావు సంసారం ఇంత పైకి రావడానికి కారణం ఆవిడే కదా?

“ఐయామ్ సోసారీ పాపా” అంటూ కూతురు వచ్చేసింది.

కూతురికి అమెరికా సంబంధం చెయ్యడానికి అనూరాధ ఎంత కష్టపడిందో సూర్యారావుకి తెలుసు. అల్లుడి తల్లి కోరిన సవాలక్ష కోర్కెలు తీర్చడానికి ఎంత అవస్థపడిందో తెలుసు – ఆ కూతురు కడుపుతో వుంటే తాను పురుడు పొయ్యడానికి అమెరికా వెళ్ళాలని ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటోంది. టికెట్ ఎలాగూ కూతురు కొనిస్తుంది. కానీ తనకీ కొన్ని డాలర్లు కావాలి కదా! అందుకోసం ఈ మధ్య మరీ పిసినారిలా డబ్బు దాస్తోంది.

కూతురికి పిల్లల్ని కనడానికింకా టైం వుంది. ఆమె, ఆమె భర్తా వాడుకునే కార్లకి చేసిన అప్పులు – కొన్న ఇంటికి కట్టాల్సిన ఇన్‌స్టాల్‌మెంట్స్ వగైరాలన్నీ ఒకదారికి వస్తేగానీ పిల్లల్ని కనడానికి కుదరదు. పూర్ మామా. అప్పుడే పిల్లల్ని కనమంటుంది అని నవ్వుకునేది – పూర్ మామా వెళ్ళిపోయింది స్టేట్స్ లో కూతురు వైభవం చూడకుండానే. షి కుడన్ట్ మేకిట్. కానీ ఈ జబ్బేమిటో క్వయట్ ఎమేజింగ్.

“అల్లుడు రాలేదేవమ్మా” అన్నాడు సూర్యారావు.

“రవికి సెలవు దొరకలేదు పాపా – హి వజ్ సో సారీ – హి కుడన్ట్ మేకిట్” అంది. ఆ అమ్మాయి పేరు రజని. “పోయింది మీ అమ్మ కదా – నువ్వు వెడుదూ! వస్తూ మీ పాపాని తీసుకురా ఇక్కడికి” అన్నాడతను.

“శవానికి స్నానం కానివ్వండి” అన్నారు. బంధువులు. “స్నానం చేయిస్తే టాబ్లెట్లన్ని కరిగిపోతాయి. తగలెయ్యడానికేం వుండదు. పసుపునీళ్ళు చల్లి పవిత్రం చెయ్యండి” అన్నాడొకాయన.

“శవానికి స్నానం చేయించకపోతే పుణ్యలోకాలకి పోదు” అన్నది ప్రక్కింటి మామ్మగారు. పవిత్ర స్నానమా, పసుపునీళ్ళా అని తర్జనభర్జన జరిగింది కాసేపు. చివరికి పసుపునీళ్ళకే ఓట్లు పడ్డాయి. “ఇంతకీ శవం కళ్ళు ముయ్యలేదు” అన్నారు ఎవరో. “ఐకాన్ట్ డు ఇట్” అంది రజని.

సూర్యారావు ప్రయత్నించాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. ఆమె బ్రతికి వుండగా ఎన్నోసార్లు మూయగలిగేడు.

ఇప్పుడా కళ్ళు మూసుకోడం లేదు. ఎంచేత? శవం బయలుదేరుతుండగా రొప్పుతూ వచ్చాడు. పెథాలజీ ప్రొఫెసర్ ప్రకాశరావు. అతను అనూరాధకి పెద్దమ్మ కొడుకు. ఏవో పరికరాలు వెంటబెట్టుకొచ్చాడు.

“నా భార్య శవం మీద నీ పరిశోధనలకి నేను చచ్చినా వొప్పుకోను” అన్నాడు సూర్యారావు. అతనికి ప్రకాశరావంటే చాలా కోపం – అనూరాధకి అతనంటే యిష్టం కనుక.

“నా భార్యని సకల లాంఛనాలతో స్వర్గానికి పంపాల్సిన బాధ్యత నాది. ఆమె శరీరానికి వచ్చిన ఈ కళంకానికే నేను గుండె పగిలి చస్తున్నాను. ఇంకా ఇదొకటా” అన్నాడు సూర్యారావు.

“అది కాదు సూర్యం. ఇది వైద్య ప్రపంచానికే ఒక వింత సవాలు. ఇదిలా ఎందుకు సంభవించిందో తెలుసుకోవడం మన విధి. ఇది చాలా అవసరం మనకి” అని మొండికేశాడు ప్రకాశరావు. అనూరాధ శవం టాబ్లెట్లుగా మారిపోయి, ఆమె చనిపోయిన విషయం అన్ని పత్రికల స్ట్రింగర్లకి తెలిసిపోయింది. ఆ
జిల్లాలో జరిగే వింతలు విశేషాలు ముక్కలుగా వీడియో తీసి ఒక ఛానెల్ కి అమ్మే వీడియోగ్రాఫర్ కి కూడా తెలిసింది. వీళ్ళంతా రాకముందే శవదహనం జరిగితే బావుండిపోయేదనుకున్నాడు సూర్యారావు.

“మామయ్యని చూడనియ్ పాపా” అంది రజని. ప్రకాశరావు ఒక అరగంట సేపు అనూరాధ శరీరాన్ని పరీక్షచేసి నోట్స్ రాసుకున్నాడు. ఈలోగా కొంతమంది ఫోటోలు తీసుకున్నారు. “ఇదంతా అమ్మ శవానికే కదా పాపా – ఆవిడ ఆత్మ ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయింది” అని తండ్రిని సముదాయించింది రజని.

ఎట్టకేలకు అనూరాధ శవం కట్టెల మీదకి వెళ్ళింది.

“ఆ! ఏం శరీరం లెద్దూ! అందులో చాలా భాగాలు లేవు. నాలుగేళ్ళ నాడు గర్భసంచీ తీసేశారు. దానితోపాటు ఓవరీస్ కూడా తీశారు. పనిలో పనిగా ఎపెండిక్స్ కూడా తీశారు. ఇహ మిగతా రక్తం కండలూ అంతా మాత్రల క్రింద మారిపోయాయి. ఉంటే మెదడూ – గుండే వుండి వుండాలి” అన్నాడు సూర్యారావు కళ్ళు తుడుచుకుని. అనూరాధ శరీరం రంగురంగుల మంటలతో మండుతోంది. టాబ్లెట్స్ లోని కెమికల్స్ లో నుంచి వచ్చే రంగులు. ఉన్నట్లుండి ఏదో పగిలిన శబ్దం వచ్చింది. చితిలోంచి ఒక ఆకుపచ్చగా పాచి పట్టిన పదార్థం ఎగిరివచ్చి సూర్యారావు పాదాల దగ్గర పడింది. ‘ఇదేమిటి’ అని ఉలిక్కిపడ్డాడతను. ప్రకాశరావు దాన్ని చేతిలోకి తీసుకుని చాకుతో పాచినంతా శుభ్రంగా గీరాడు. అందులో తళతళలాడుతూ వుంది అనూరాధ మెదడు. దాన్ని గుర్తుపట్టాడు సూర్యారావు. పెళ్ళయిన కొత్తలో తనతో చెస్ ఆడిన మెదడు. బ్యాంక్ టెస్ట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకున్న మెదడు. ఇదేమిటిలా పాచిపట్టిపోయింది.

ప్రకాశరావు నవ్వి “మీ ఇంట్లో సింకులూ – బాత్రూంలూ తళత మెరిసేలా కడిగేది కదా! ఆ పాచంతా వాటిల్లోంచి ఈవిడ మెదడులోకి చేరిపోయింది” అన్నాడు.

అలా అనూరాధ శరీరం అగ్నికి అర్పించి స్నానాలు చేసి ఇంటికి వచ్చి ఆమె ఫోటోల్లో
అనువైన దాన్ని వెతికి లామినేట్ చేయించే కార్యక్రమానికి ఉపక్రమించిన సూర్యారావుతో “నే వెళ్ళిస్తానోయ్” అన్నాడు ప్రకాశరావు.

“నేనూ నీతో వస్తా నంకుల్” అంది సుబ్బారావు కూతురు సుశీల.

“నాతో ఏం పనమ్మా నీకు” అన్నాడు పెథాలజీ ప్రొఫెసర్ ప్రకాశరావు. అతను అనూరాధని స్వంత చెల్లిలా చూసుకునేవాడు. ఎన్నోసార్లు ఎన్నో అడగని సలహాలిచ్చి ఆమెచేత చివాట్లు తిన్నాడు.

“అనూరాధ ఆంటీకి వచ్చిన జబ్బేమిటో మీరు నాకు చెప్పాలి” అంది సుశీల.

“నాకూ చెప్పు అంకుల్. మా మామాకి వచ్చిన జబ్బు నాకు తెలియకపోతే ఎలా? అంటూ వచ్చింది రజని. ప్రకాశరావు నవ్వి “దీన్ని సూపర్ మామ్ సిండ్రోమ్ అంటారమ్మా” అన్నాడు.

“నిజంగా మా మామ్ సూపర్ మామే అంకుల్” అంది కళ్ళు తుడుచుకుంటూ రజని.

“అదేనమ్మా ఆవిడ జబ్బు” అన్నాడతను.

“అదేమిటో ఎలా వచ్చిందో చెప్పండి అకుంల్ చంపకుండా” విసుక్కుంది సుశీల.

“మా అనూరాధకి ఈ ప్రపంచంలో వున్న ఆడవాళ్ళందరికన్నా తను చాలా తెలివిగల దాన్ననీ, సమర్థురాలననీ గట్టి నమ్మకం. ఆవిడ దృష్టిలో తెలివీ సమర్థతా అంటే మంచి ఇల్లు కట్టుకోవడం, దాన్ని తళతళలాడేలా వుంచుకోడం. తగినంత డబ్బు దాచుకోడం, కష్టపడి పని చెయ్యడం, పిల్లల్ని గొప్పవాళ్ళని చెయ్యడం – గొప్పవాళ్ళని చెయ్యడం అంటే డాక్టర్లనో, ఇంజనీర్లనో చేసి స్టేట్స్ కి పంపడం – అదీ ఇదీ కుదరకపోతే నీలా అమెరికాలో వుండే అబ్బాయికిచ్చి పెళ్ళి చేసి పంపడం – ఇదే ఈవిడ జీవిత ధ్యేయం. ఆ ధ్యేయసాధనకి ప్రతీ క్షణం శ్రమించింది. ఆవిడ యాంబిషన్ సిద్ధించింది” అని ఆగాడు ప్రకాశరావు.

“దానికీ ఈ జబ్బుకీ లంకేమిటి?” అంది రజని విసుగ్గా.

“ఉంది నాన్నా – ఈ ధ్యేయసాధనలో మీ అమ్మ తన మనసుకేం కావాలో శరీరానికేం కావాలో చూసుకోలేదు. రకరకాల వంటలు చేసుకు తినడం, మంచి చీరెలు గంజి పెట్టి కట్టుకోడం, స్నేహితులలో, బంధువులలో ప్రత్యేకంగా కనబడడం ఇదే తనకి కావాలనుకున్నది. డబ్బు ఆదా చేయడం కోసం మీ అమ్మ యంత్రంలా పనిచేసేది. శుభ్రం కోసం ఎవర్నీ చెయ్యనిచ్చేది కాదు. మీ నాన్నని సోమరిపోతులా కూర్చోబెట్టి కాఫీ చేతికిచ్చేది – ఎక్కువ డబ్బు పెట్టి పనివాళ్ళని పెట్టుకుంటే ఎలాగని పన్లన్నీ తనే చేస్తూ, తాను చేసుకుంటేనే తనకి బాగుంటుందని నచ్చజెప్పుకునేది. సాయంత్రానికి విపరీతమైన అలసట. బ్యాంకులో క్యాష్ మార్చుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా పనిచెయ్యాలో నీకు తెలుసుగదా! అక్కడలా పనిచేసి వస్తూ దారిలో కూరలూ, సరుకులూ మోసుకొచ్చేది. ఇంటికి రాగానే ఇల్లు శుభ్రం, వంట. ఈ అలసటకి తట్టుకోలేక రోజూ సాయంత్రం తలనొప్పి మాత్ర వేసుకునేది. అలా పదిహేనేళ్ళుగా ఎన్ని తలనెప్పి మాత్రలు వేసుకుందో చూడు. అదలా వుండగా ఈవిడకి తాను అనుకున్న ప్లాను ప్రకారం పనులు జరిగిపోవాలి. అలా జరగాలంటే శరీరంలో ఎలాంటి చికాకులూ వుండకూడదు. జ్వరం వస్తే ఓ క్రోసిన్ టాబ్లెట్ మింగడం, నడుము నొప్పికి ఇంకేదో మింగడం. అలా స్వంత వైద్యం చాలా వుండేది. ఇదికాక పండగలకి, పబ్బాలకి, పెళ్ళిళ్ళకి, వ్రతాలకి హాజరు కావాలంటే ఆ సమయంలో బహిష్టు కాకూడదు. దాన్ని రెండు మూడు రోజులు ఆపడానికి మాత్రలు వాడేది. అలా ఎన్ని వాడిందో లెక్కలేదు. మీ చదువులప్పుడు మీ పరీక్షల్లో మీకు కాపలా కూర్చునేది. నిద్ర రాకుండా మాత్రలు వాడేది. ఒక్కోసారి ఎంత రాత్రయినా నిద్రరాక నిద్రమాత్ర వాడేది. ఇలాంటి అవకతవక వైద్యాలతో మితిమీరిన పనిలో, ఆవిడ షేర్లు కొనడం, అమ్మడాలు, స్థలాలు కొనడాలు, అమ్మడాలు, బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి బంగారం కొని ఆ వాయిదాలు కట్టడాలు. జీతంలో నుంచి వీలైనంత డబ్బు మిగల్చడానికి మిగిలిన అన్నాలతో పులిహోరలు చేసుకు తినడాలు – ఒకటేమిటి – ఇదిగో ఇవ్వాళ మీరంతా ఇలా ఉండడానికి ఆవిడ చాలా చాలా మాత్రలు మింగింది. సరేనా – ఆ పరిస్థితుల్లో ఏడెనిమిదేళ్ళనాడు ఓవర్ బ్లీడింగ్ అవడం మొదలైంది. అది చిరాకు కదా! ఓ డాక్టరు ‘సంచీ కోసి పారేయించు హాయిగా వుంటావు’ అని సలహా యిచ్చాడు. గర్భసంచీ తీసేయించింది. ఓవరీస్లో ఏదో వుందని అదీ తీసేశారు.

‘అమ్మయ్య ఇక నేను మీ మగవాళ్ళల్లా నెలకి ముప్పై రోజులూ పనిచేస్తాను’ అని విర్రవీగింది. నాలుగేళ్ళు బాగానే గడిచాయి. ఇంతలో ఏవో కాంప్లికేషన్లొచ్చాయి. హార్మోన్ సప్లిమెంట్సివ్వాలన్నారు. అవీ మాత్రలే. మరి నీరసానికి ఈ విడంతట ఈవిడే ప్రతిరోజూ బీకాంప్లెక్స్ మాత్ర వేసుకునేది. నలభై అయిదు దాటగానే చత్వారంతో పాటు బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చింది. దానికి రోజూ రెండు మాత్రలు – పిల్లలు కడతేరారు. కొడుకుని ఇంజనీర్ని చేసి స్టేట్స్ లో వేసింది. నీకు అమెరికా పెళ్ళికొడుకుని తెచ్చి ఆ అప్పులన్ని తీర్చింది.

ఇప్పుడేమిటంటే ఏడాది నుంచి ఓ ఛానెల్ లో హిందీ సీరియల్ ఒకటి ప్రతీరోజు రాత్రి పదకొండున్నరకి వస్తుంది. అది అమిత ఉత్కంఠభరితమైన సీరియల్. అది చూసేదాకా ఈవిడ నిద్రపోదు. ఆ సీరియల్ పన్నెండుదాకా నడుస్తుంది. పన్నెండు దాటిన తరువాత అంత సస్పెన్స్ తో ఆ సీరియల్ ఆగిపోయాక ఈవిడకిక నిద్రరాదు. తప్పనిసరిగా మాత్ర వేసుకోవాలి. మళ్ళా అయిదింటికి లేవాలి. ఇదమ్మా ఆ జబ్బు” ప్రకాశరావు తాను రాసుకున్న నోట్సు సంచిలో పెట్టేసుకుని కళ్ళజోడు తీసి తుడిచి మళ్ళీ కళ్ళకి పెట్టుకున్నాడు.

“ఇదంతా నాకసలు తెలీదు – ఇటీజ్ క్వయట్ ఎమేజింగ్ అంకుల్. ఐ డిడిన్ట్ నో – హౌ శాడ్” అంది రజని.

“అవునమ్మా. యు డిడిన్ట్ నో. ఎందుకంటే నువ్వు ఎప్పుడెప్పుడు అమెరికా మొగుణ్ణి కట్టుకుని డాలర్లు రుచి చూద్దామా అనే ఆతృతతో వున్నావు. అమ్మని పట్టించుకునే టైం నీకెక్కడిదీ! పైగా మీ అమ్మకి భిన్నమైన ఆలోచన మాత్రం నీకెక్కడిదీ!” అన్నాడు ప్రకాశరావు గేటు దాటుతూ.

సుశీల కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ నిలబడినదల్లా గబగబ ఇంటికేసి పరిగెత్తింది. ఆ పిల్లకి వాళ్ళమ్మని కౌగలించుకుని భోరుమని ఏడవాలనిపించింది. ఆవిణ్ణి రక్షించుకోవాలనిపించింది.

సుప్రభాతం, 20 జూన్ 1996,
(కథ 1996)

తెనాలి పక్క వుండే కొలకలూరు లో పుట్టి పెరిగి అక్కడ  హైస్కూల్  లో చదివి ఆపైన  ఎం.ఎ ఇంగ్లీష్ చేశారు. విజయవాడ లో అధ్యాపకురాలిగా పనిచేశారు. నాలుగు కథా సంకలనాలు వెలువడ్డాయి. వాటిలోని 40 కథలు ఎంపిక చేసి "సత్యవతి కథలు" గా ఇటీవల విశాలాంధ్ర ప్రచురించింది. హైదరాబాదు బుక్ ట్రస్టు కు 'ముహమ్మద్ ప్రవక్త జీవితం',  'మానాయనబాలయ్య',  'ఒక హిజ్రా ఆత్మ కథ' ( రేవతి జీవితం), అనేక రామాయణాలు అనువాదం చేశారు. రేవతి ఆత్మకథకు ఈ సంవత్సరం సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వచ్చింది. ప్రపంచంలోని ఏడు అత్యున్నత శిఖరాలలో ఆరింటిని అధిరోహించిన చిన్నారి పూర్ణ కథను ఇంగ్లీష్ లో అపర్ణ తోట రాస్తే తెలుగు చేశారు. రెంటినీ ప్రిజం ప్రచురించింది. విజయవాడ లో వుంటారు.

2 thoughts on “సూపర్ మామ్ సిండ్రోమ్

  1. చాలా కదిలించేలా రాశారు సత్యవతి గారు తనదయిన శైలి లో. పిల్లల కోసం ఆవిడ పడిన శ్రమని “దీన్ని సూపర్ మామ్ సిండ్రోమ్ అంటారమ్మా”

  2. నాకు చాలా ఇష్టమైన కథ, స్త్రీ పురుషుల ఇద్దరికి వాళ్ళ వాళ్ళ కోణాల్లోనుంచి , వాళ్ళ కున్న లోపాల్లోనుంచి, సంఘం, పిల్లలు, భర్త నా అనుకున్న వాళ్ళు తననెలా చూస్తున్నారో అని ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకుంటే ఈ కథ సమాధానంగా కనబడుతుంది.ఆధునిక మహిళ ఒత్తిడిని వస్తువుగా తీసుకుని రాసిన ఈ కథ కేవలం మనకే కాదు యావత్ ప్రపంచం లోని స్త్రీలు అందరికి వర్తిస్తుంది

Leave a Reply