సుశీత

స్కూటీ మీద వెళ్తున్న సుశీతకు ఆ రోడ్డు అకస్మాత్తుగా అపరిచితంగా అనిపించింది. సుశీతకు తాను ఎక్కడుందో కొన్ని క్షణాల వరకు తెలియలేదు. ఆ సందులు దుకాణాలు కొత్తగా కనిపించాయి. చీకటి పడుతున్నది. లైట్ల వెలుతుర్లో దారులన్నీ మరీ కొత్తగా అగుపించాయి. ఈ మధ్య ఇలాంటి గందరగోళం ఎక్కవవుతున్నది. ఇదే విషయం విందుకు చెప్తే సింపుల్ గా నవ్వి “నాక్కూడా చాలా సార్లు అలాగే అనిపిస్తుంటుంది” అంటూ తేలిగ్గా తీసుకుంటుంది.

విందు అసలు పేరు అరవింద. ఇద్దరి స్నేహం చాలా కాలంగా కొనసాగుతున్నది. ఒకరి ఆలోచనల్లోకి మరొకరు జొరబడుతుంటారు. ఎంతగా అంటే ఏదైనా సంఘటన జరుగుతుంటే రన్నింగ్ కామెంటరీలగా దాన్నిఎలా చెప్పాలా అనే ధ్యాసలోకి వెళ్లిపోతారు. చాలా సార్లు ఒకే ఆలోచనకు రెండు వర్షన్స్ లాగా ఉంటారు.
సుశీత ఇంకా ఆ దారితప్పిన ఫీలింగ్ లో నుండి బయట పడలేదు. విందు బహుశా ఇంకా ఇలా అంటుందేమో ‘ఏదో అడవిలో కదా తప్పి పోయినట్లు ఫీల్ కావడాన్ని నీవు కోరుకుంటున్నావు. ఇతరుల కంటే భిన్నమైనదానివని అనుకుంటావు నువ్వు. కానీ అదేం కాదు. కుంచెం భిన్నమైనదానివి’ అని నవ్వుతుంది.

ఎక్కడా చిన్న సందుల్లోకి వెళ్ళకుండా నేరుగా అదే రోడ్డు మీద స్కూటీని పోనిచ్చింది. చివరికి మెయిన్ రోడ్డు వచ్చినప్పుడు తెలిసింది, తాను ఏ దారి గుండా వచ్చానో. రోడ్డు పక్కన స్కూటీ ఆపి మొబైలు తీసి అరవిందకు ఫోన్ చేసింది. తొందరగానే ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆ సమయానికి పాటలు వింటూ వంట చేస్తుంటుంది కాబట్టి అందుబాటులోనే ఉంటుంది. దారి మరిచిన విషయం చెప్పింది. తానేం అనుకుందో, ఆమె ఏం అనగలదో కూడా చెప్పింది. విన్నాక విందు నవ్వింది.
“నేనేం అంటానో కూడా నువ్వే అనుకుని, మళ్ళీ దానికి నువ్వేం అనాలో నువ్వే అనుకుని మహా ఏకాపాత్రాభినయనం చేశాక నాకెందుకు ఫోన్ చేశావ్ పిల్లా, సరే గాని ఇప్పుడు చెప్పు, దేనికో టెన్షన్ పడుతున్నావ్. ఏమైంది ?” అని అడిగింది.
చెప్పాలా వద్దా అని ఆలోచనలో పడింది సుశీత. ఇంతలో నిర్మల నుండి కాల్ వచ్చింది. తన యన్ జీ ఓలో నిర్మల కౌన్సిలర్ గా పనిచేస్తున్నది.

“ఆఫీసు నుండి ఏదో కాల్ వస్తున్నది. ఇప్పుడు చెప్పలేను. ఎప్పడైన వివరంగా మాట్లాడుకుందాం. రేపు ఇంటికి రాగలవా? వద్దులే మన వాకింగ్ పాయింట్ లో కలుసుకుందాం. మర్చిపోకు” అంటూ కట్ చేసి ఆఫీసు కాల్ మాట్లాడింది.
“లేచిపోయిన కేసు మేడమ్. మైనర్ పిల్ల. పోలీసులు పిక్ చేసుకున్నారు. మన దగ్గరికి తీసుకు వచ్చారు. స్వయంగా యస్సై గారు వచ్చారు. మీ రూమ్ లో కూర్చోబెట్టాం” అంది నైట్ షిఫ్ట్ లో ఉన్న నిర్మల. సుశీత ఒక ఎన్‌జి‌ఓ నడుపుతున్నది. ప్రభుత్వ నిధులు వస్తాయి. గృహ హింస కేసులు, రేప్ కేసులు లాంటి మహిళా సంబంధ సమస్యలు చూస్తారు.
“ఐదు నిమిషాల్లో వస్తున్నాను. యస్సై గారికి గ్రీన్ టీ ఇవ్వండి. అమ్మాయికి డ్రస్ ఇవ్వండి. కొంచెం శుభ్రపడమని చెప్పండి” అంటూ ఫోన్ పెట్టేసి స్పీడుగా బయలుదేరింది.
తాను పని చేస్తున్న అవని ఆఫీస్ కు చేరుకునేసరికి పది నిమిషాలయింది. సెక్యూరిటీ గార్డ్ ను దాటుకుని వెళ్ళింది. తన ఛాంబర్ లో యస్సై ఉన్నాడు. విష్ చేసింది. ఆమెను చూస్తూనే కుర్చీలో కొంచెం కదిలి మాస్క్ తీసి నవ్వాడు. తన కుర్చీలో కూర్చుంది. యస్సై ఈ మధ్యనే కొత్తగా వచ్చాడు. ఉద్యోగం లోకి వచ్చి సుమారు నాలుగైదు ఏళ్లు అవుతున్నట్లుంది. ఈ ఊరికి వచ్చి మూడు నెలలవుతున్నది. అతని గురించి ఇప్పటికే విని ఉంది. కమీషన్ల పంపకంలో గొడవలొచ్చి యస్పీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. కొద్ది రోజులు ఖాళీగా కూర్చోబెట్టి ఇప్పుడు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. అతని ముఖంచూసి ‘అగడు మొకపోడు’ అని అనుకుంది. ఈ మాటను వాళ్ళమ్మ ఎక్కువగా వాడేది.
చూసిన ఒక క్షణంలోనే అతన్ని స్కాన్ చేసింది. బట్టల షాప్ బయట ఉండే మగ బొమ్మకు యూనీఫార్మ్ తొడిగినట్లు ఉంది. తన కండలను ఉద్ధేశ్య పూర్వకంగా అసందర్భంగా ప్రదర్శిస్తున్నాడు. తోకల్ని, తోళ్ల రంగుల్ని, ఈకల్ని, వాసనల్ని, శబ్ధాలని ప్రదర్శించే పురాతన వారసత్వాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాడు. అతని వేషాల్ని గమనించీ గమనించనట్లు తన ముందు ఉన్న పేపర్ చూస్తూ ఉంది.

“మీ ఆఫీస్ అంబియన్స్ బాగుంది” అన్నాడు చుట్టూ కలియచూస్తూ.
“అది మా ఫ్రెండ్ టేస్ట్, తాను సీనియర్ అడ్వొకేట్” అంది అతని కళ్ళలోకి చూస్తూ.
“మీ ఫ్రెండ్ ఎవరు” అని అడిగాడు. విందు గురించి చెప్పింది సుశీత.
అంతలో సుమారు పదిహేను, పదహారు సంవత్సరాలు ఉన్న అమ్మాయిని కౌన్సిలర్ నిర్మల తీసుకువచ్చింది. ఆ అమ్మాయిని కూర్చోమ్మన్నది సుశీత. ఆ అమ్మాయి భయం భయంగా యస్సైని చూసి తల కిందికేసి అలాగే నిలబడింది. మళ్ళీ అనేసరికి యస్సై పక్కనుండి కుర్చీని దూరంగా జరుపుకుని కూర్చుంది. ఆ పిల్ల తన పక్కనే కుర్చీలో కూర్చోవడంతో యస్సై ఇబ్బందిగా అటు ఇటు కదిలాడు. కాలు మీద కాలు వేసుకుని దర్పంగా కూర్చున్నాడు.
“మీ పోలీస్ స్టేషన్లో ఇంకా బెంచీలే ఉన్నాయా సార్?” అని నవ్వుతూ అడిగింది సుశీత.
కనుబొమ్మలెగరేసి నిర్లక్ష్యపు నవ్వుతో “ఇప్పుడంతా మాది ఫ్రెండ్లీ పోలిసింగ్” అన్నాడు. సుశీత చేతులు జోడించి తమాషాగా నమస్కరించింది. స్సు స్సు మంటూ ఉల్లాసంగా నవ్వాడు యస్సై.

ఆ అమ్మాయిని వివరాలు అడిగింది. పేరు శంకరి. పదవ తరగతి చదువుతున్నది. తల్లిదండ్రులు కూలి పని చేస్తారు. అక్కకు పెళ్ళయింది. పక్క ఊరిలోనే ఉంటున్నారు. సన్నగా, నలుపు రంగులో ఉంది. కళ్ళు చిన్నగాను, ముక్కు పెద్దగాను ఉంది. ముఖం మీద మొటిమలని గిల్లుకుందేమో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బి ఉన్నాయి. భోజనం చేసిందో లేదో కనుక్కుంది.

ఏమి ఆడక్కుండానే బెదిరించే గొంతుతో “నన్ను జైలుకు పంపించినా సరే గాని, మా అమ్మా బాపుల దగ్గరికి మాత్రం వెళ్ళను” అంది శంకరి.
“జైలుకు పంపడం ఉండదుగానీ రేపు పొద్దున మాట్లాడదాం అన్ని విషయాలు. నువ్వు భయపడకు. ఏ టెన్షన్ పెట్టుకోకు. నిర్మలా, ఈ అమ్మాయి భోజనానికి ఏర్పాట్లు చేయండి” అంటూ ఆమెను లోపలికి పంపించింది.
ఆ అమ్మాయి లోపలికి వెళ్లిందో లేదో నిర్మలను వెనక్కి పిలిచింది. ఇతర వివరాలు కనుక్కుంది. ఆ అమ్మాయి తల్లి దండ్రుల వద్దకు వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఇంటి పక్కనే రమేష్ అనే ఆటో డ్రైవర్ ఉన్నాడు. శంకరికి వరుసకు బావ అవుతాడు. అతనికి పెళ్ళయింది. ఒక కూతురు కూడా ఉంది. భార్య పేరు సోనీ, ఒక సంవత్సర కాలంగా శంకరి అతనితో సన్నిహితంగా ఉంటున్నది. అతడితో క్లోజ్ గా ఉండడం అమ్మాయి వాళ్ళ ఇంటిలో తెలిసింది. గట్టిగా మందలించారు. తల్లి తండ్రిచేయి చేసుకున్నారు. చెప్పరాని మోటు మాటలు అన్నారు. శంకరి భయపడిపోయింది. చివరికి తెగించి అతడితో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వచ్చారు గాని కంప్లయింట్ ఇవ్వలేదు. ఒక్క రోజులోనే వాళ్ళు దొరికారు. నిర్మల చెప్పడం పూర్తయ్యాక “బలుపు” అన్నాడు యస్సై అదో మాదిరి గొంతుతో.

అతని వైపు నిదానంగా చూసింది సుశీత. అతన్ని చదవడానికి ప్రయత్నించింది. పేరు మాత్రమే చదవగలిగింది. అనిల్. బుర్రనో హృదయమో నిల్. అబ్బ, ఈ ప్రాసను విందుకు చెప్పి తీరాలి. చిన్నగా నవ్వుకుంది.
“ఎందుకో నవ్వుతున్నారు. మాస్క్ తీసి నవ్వితే మాకు తెలుస్తుంది మేడమ్” అన్నాడు.
అతని చొరవకు ఆశ్చర్యపడలేదు.
“ఆ అమ్మాయి అంత బక్కగా ఉంటే మీరేమో బలుపు అంటున్నారు” అంది. ఇలాంటి సవరించే తెలివి తేటలు మాత్రం అమోఘం తనకు. ఇలాంటి మాటలకు మొదట్లో వాదులాటకు దిగేది. చేయాలనుకున్న పనిని చేయడం తప్ప వాదులాటకు దిగడం వల్ల ప్రయోజనం ఉండదని తెలుసుకుంది. బలుపు పదాన్ని ఇంకా కొనసాగిస్తాడని తెలుసు. శంకరి వంకతో సమస్త ఆడవాళ్లను హేళన చేసే చొరవ తీసుకోగలడనిపించింది.
అందుకే స్పీడు స్పీడుగా మాటలు కొనసాగించింది. “రేపు డాక్టర్ దగ్గరికి పంపిస్తాం సార్. జనరల్ చెకప్. వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలిపిస్తాం. పోక్సో కింద బుక్ చేస్తారా లేదా అనేది మీరు చూసుకుందురు” అంది.

యస్సై వెళ్లిపోతే బాగుండు అనుకుంది.
ఆమె ఆలోచనలు గమనించినట్లుగా “పెట్రోలింగ్ చేసేటప్పుడు నైట్ అప్పుడప్పుడు ఈ సెంటర్ విజిట్ చేయమని డియస్పీ సార్ చెప్పిండు” అన్నాడు.
మిష్టర్ నిల్ చాలా షార్ప్ అనుకుంది సుశీత.
అతని చూపులు నేమ్ ప్లేట్ పై పడింది. రొటీన్ ప్రశ్నకు సిధ్ధ పడింది.
“మీ పేరు సునీతా?”
“కాదు సుశీత”
“సుశీలా”
“కాదు సుశీత” అంది. ఇంకా ప్రశ్నల్ని తప్పించుకోవడానికి తన పేరు కథ మొత్తం చెప్పింది.
“మా బాపు టీచర్. మా స్కూల్లోనే రంగనాథచారి అని తెలుగు సార్ ఉండేవారు. తనకు కూతురు పుడితే సుశీత అని పేరు పెట్టాలనుకున్నాడు. సుశీత అంటే మంచి గంధం అని అర్థం. పాపం ఆ సార్ కు కొడుకు పుట్టాడు. కానీ ఆ పేరెందుకో మా బాపుకు బాగా నచ్చింది. అందుకే నేను పుట్టగానే ఆ పేరు పెట్టారు. ఈ ప్రశ్న అడగని వాళ్ళు .” పాపాత్ములు అని అనబోయి ఆగింది.
“ఈ ప్రశ్న అడగడానికి మీరు చాలా సమయం తీసుకున్నారు. మీ యస్పీ గారైతే నా పేరు చెప్పిన మరు క్షణమే టీకా తాత్పర్యాలు అడిగారు. చాలా సేపు మాట్లాడారు. నాలాగే ఆయనక్కూడా లిటరేచర్ మీద చాలా ఇంటెరస్ట్ ఉంది” అంటూ కావాలనే యస్పి ప్రస్తావన తీసుకు వచ్చింది. నిజానికి యస్పి తో ఆమె పరిచయం మొక్కుబడిగా జరిగింది. పై అధికారి ప్రస్తావన రావడంతో యస్సై బాడిలాంగ్వేజ్ లో మార్పు వచ్చింది. కాస్సేపు అదీ ఇదీ మాట్లాడి వెళ్ళిపోయాడు.

అతడు వెళ్లిపోయినా గాని అదో మాదిరిగా పలికిన ‘బలుపు’ అనే మాట ఆమె మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఇంటికి వెళ్ళాక కూడా ఆ మాట ఆమెను వదల్లేదు. ఇంటిలోకి వెళ్ళగానే ముందు చేతులు శుభ్రం చేసుకుని బియ్యం కడిగి కుక్కర్ లో పెట్టి స్టౌ వెలిగించింది. బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చింది. పొద్దున చేసిన పప్పు చారు ఉంది. ఆమ్లెట్ వేసి ఇస్తే సరి అనుకుంది. స్టడీ క్లాసులు ముగించుకుని కూతురు ప్రశాంతి వచ్చింది. ఆమె పదవ తరగతి చదువుతున్నది.

ఆ పిల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఒక్క ఇంటిలో ఉన్నప్పుడు తప్ప. తినేటప్పుడు పొద్దుటి పప్పు చారును రాత్రి కూడా పెట్టడంతో ప్రశాంతి కోపానికి హద్దు లేకుండా పోయింది. అరిచేసింది. పాత పాత ముచ్చట్లు ఎత్తిపోసింది. అన్నం ప్లేట్ ను విసురుగా అటు ఇటు జరుపుతుంటే కోప్పడింది సుశీత. అయినా సరే కేవలం ఆమ్లెట్ ను తిని వెళ్ళిపోయింది ప్రశాంతి. ప్లేట్ లో ఇంకా అన్నం అలాగే మిగిలి ఉంది. ఆ అమ్మాయి చేష్టలని, ఆవేశాన్ని చూస్తూ ఉండిపోయింది. ఈ వయసులో తనలో కూడా చాలా అసహనాలు ఉండేవి. కానీ బయటకు ఒద్దికైన అమ్మాయిలా ఉండడానికి ప్రయత్నించేది. అయితే అవి తనను మరింత హింస పెట్టేవి.

సుశీత అనే పేరు తనకు, ప్రశాంతి అని తన కూతురికి పేర్లు పెట్టినందుకు తండ్రిని తిట్టుకోని రోజుండదు. సుశీత అనే పేరుకు తగ్గట్టు మంచి గంధం లాంటి కలర్ కాదు తనది. గంధంలా తాను చల్లగానూ ఉండదు.
ఎమ్మె సోషాలజీ చదివిన సుశీత కొద్ది రోజులు వేరే ఎన్జిఓ లో పనిచేసింది. తరువాత దాని భాగస్వామిగా మారింది. తాను కుదురుకునే వరకు పెళ్లి వాయిదా వేయడానికి పెద్ద పోరాటాలే చేయాల్సి వచ్చింది.

సుశీత తన భర్త రాకపోకల గురించి పెద్దగా పట్టించుకోవడం మానేసింది. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. నామమాత్రపు బిజినెస్ నడిపిస్తాడు. లాభాలు రావు. నష్టాలు లేవు. విలువైన జీవత కాలమంతా తన మీద అతను, అతని మీద తాను గూఢాచార్యం నెరుపుతూ వచ్చాం. ఒకరినొకరు హింసించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు తల్చుకుంటే పరస్పరం కేవలం కాపలా కాసుకుంటూ నిస్సారంగా బతికామనిపిస్తుంది.


సుశీత పొద్దున నాలుగు గంటలకు లేచింది. రోజువారీ పనులు పూర్తి చేసుకుంది. కూతురు పొద్దుటి స్టడీ క్లాసులకు తయారవుతున్నది. చపాతీ ఎగ్ కర్రీ చేసింది. వంట ఇంటి వాసనలకు కూతురు ముఖం వెలిగింది. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దింది. షూస్ వేసుకుని కూతురికి బై చెప్పి బయట పడింది. టైమ్ చూసుకుంది. కరెక్ట్ గా ఐదు గంటలయింది.
ఉదయపు తాజాదనం మనసంతా వ్యాపించింది. బూడిద రంగు ఆకాశం మెల్లగా నీలిరంగులోకి మారుతున్నదీ. తనకు ఇష్టమైన రంగు. కుక్కలు తల పైకెత్తి అనుమానంగా చూస్తున్నాయి. మొదట్లో భయపడేది. ఇప్పుడు ఒక పక్కగా ధైర్యంగా నడుస్తున్నది. చల్లటి గాలి ముఖానికి తాకుతున్నది. నడక వేగం పెంచింది.

స్మార్ట్ సిటీ అందాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. రోడ్డు విశాలమైంది. ఫుట్ పాత్ వచ్చింది. డివైడర్లు, మధ్యలో ఏపుగా పెరిగిన మొక్కలు, రోడ్డు నిండా వెలుతురు పంచుతున్న సెంట్రల్ లైట్లు.. రెండు మూడు సంవత్సరాల్లోనే టౌన్ చాలా మారింది.
పొద్దుటి పూట నడక అనేది ఒక వ్యసనంగా మారింది తనకు. శరీరం, మనస్సు శుభ్రపడతాయి. నడుస్తున్నంత సేపు, పరిగెడుతున్నంతసేపు తనలోని అసహనాలు కోపాలు నశిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది. చెవుల్లో నుండి మనసుల్లోకి సంగీతం వొలుకుతున్నది.

మానేర్ డ్యామ్ చేరుకుంది. వాటర్ టాంక్ దాటుకుని కట్ట ఎక్కింది. ప్రతిసారీ తనకు ఈ పార్ట్ బాగా ఇష్టం. కట్ట ఎక్కగానే ఆవిష్కృతమయ్యే మహా జలధి చిత్రం ఎంత ఇష్టమో. విశాలమైన నీలి నీరు, దాన్ని అలుముకున్న ఆకాశం ఆకస్మాత్తుగా ప్రత్యక్షమవుతుంది. ప్రతిసారీ కొత్తగానే అనిపిస్తుంది ఆ దృశ్యం. ఇక రోజంతా తాజాగా ఉంటుంది.

విచిత్రంగా ఈ రోజు వాకింగ్ ఫ్రెండ్స్ ఎవరూ కలవలేదు. అందరికీ ఒకేసారి ఏమైంది అనుకుంది సుశీత. వేగంగా నడవడం ప్రారంభించింది. పాటలు ఆమెను ముందుకు తోస్తూ ఉన్నాయి. కొంత దూరం వెళ్ళాక అరవింద కనిపించింది. వేగం తగ్గించింది. “యు ఆర్ టూ లేట్ పిల్లా” అంటూ పలకరించింది అరవింద.
నలభై ఐదేళ్ళ అరవింద తెల్లగా సన్నగా ఉంటుంది. ఇద్దరిది సుమారుగా ఒకే వయసైనప్పటికి అరవింద చలాకీగా హుషారుగా ఉంటుంది. “నీకెందుకమ్మా వాకింగూ రన్నింగూ” అంటుంటారు చాలా మంది అరవిందను ఉద్దేశించి. ఓపిక ఉంటే ఒక్కొక్కరికి వారి వారి గ్రహాచారాలను బట్టి జవాభిస్తుంది.
“ఓహో, ఇలాగే స్లిమ్ముగా ఉండి మీ ఆయన్ని ఇంకా అలాగే కొంగుకు ముడేసుకుందామనే” అని గురుడు శుక్రుడు బలహీనమైన స్థానంలోనూ, శని బలమైన స్థానంలో ఉన్నవాళ్ళు ప్రశ్నిస్తే మాత్రం చుట్టుపక్కల వాళ్ళకి పండగే. ఆ రోజు వాళ్ళ దిన గ్రహ రాశి ఫలితాల్లో కాలికి రాయిపోటూ, చెవికి అరవింద పోటూ అని పత్రికల్లో రాసి ఉన్నప్పటికీ అది చూసుకోకుండా రోడ్డెక్కారన్నమాట.
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఎంతమందికి ఆ ముచ్చట చెప్పినా ప్రతీసారీ ఏదో మసాలా దట్టిస్తూ కొత్తగా చెప్తుంది అరవింద.
ఇలా మొదలవుతుంది వాయింపు
“కాబట్టి వాకింగ్ అనేది మీరు ఆరోగ్యం కోసం, నేనేమో మా ఆయన్ని ఆకర్షించడం కోసం చేస్తామన్నమాట. గుడ్. కానీ ఈ మొగుళ్ళని ఐ మీన్ హజ్బెండ్స్ ని ఆకర్షించడం అన్నది చూశారూ, ఇది కొంత గమ్మత్తైన విషయం. మనం మగాళ్లని ఈజీగా పడెయ్యవచ్చు. మన పెళ్ళిళ్ళు జరక్క ముందు మనకు పడనోడు పాపాత్ముడు. ఈ విషయం కాదనరని తెలుసు. పెళ్లయ్యాక కూడా అంతే, కాకపోతే మన హజ్బెండ్స్ ని తప్ప. అయినప్పటికీ వీళ్ళు మనల్నే ఎందుకు పట్టుకుని వేళ్ళాడుతుంటారు? చెప్పండి. చెప్పండి. ఎందుకంటే పెళ్ళో షాదో చేసుకున్నారు కాబట్టి. మనం కన్న పిల్లల తో అటాచ్మెంట్ ఉంది కాబట్టి. అదీ కాకుండా మొగుళ్ళ అసమర్ధతల్ని మనం భరించినట్లు ఎదుటివాళ్ళు భరించలేరనే మహా జ్ఞానం పొందారు కాబట్టి మనతో ఉంటున్నారు. ఇంకోటి కూడా ఉంది, లాస్ట్ అండ్ లీస్ట్ కారణం ఏమిటంటే వాళ్ళ వొంటికి, మన వంటకీ మనం అలవాటు చేసిన ఉప్పు కారం మసాలా నిష్పత్తుల వల్ల. అందువల్ల. అందువల్ల మన మొగుళ్ళు మనతో ఉంటున్నారు తప్ప ఈ వాకింగ్ లు, బ్యూటీ పార్లర్ ల వల్ల మాత్రం కాదండమ్మా.

నిజానికి సన్న వొళ్ళు, కొంటె కళ్ళు స్కీమ్ నిజమే అయితే ఈ బ్యూటీ మాడళ్ల, హీరోయిన్ల బాయ్ ఫ్రెండ్సు మొగుళ్ళూ ఎందుకు ఈ ముద్దుగుమ్మల్ని వదిలి ఇంకో గుమ్మాలను వేళ్ళాడుతుంటారు? ఎందుకంటే సన్న వొళ్ళు కొంటె కళ్ళు స్కీమ్ కొంత కాలమే పనిచేస్తుంటది కాబట్టి. అందుకే వాకింగ్ అనేదానికి ఆరోగ్యం తప్ప మరే ప్రయోజనం లేదని నేను సైతం అందుకోసం మాత్రమే చేస్తున్నానానని సమస్త ప్రజలకు తెలియ చేస్తున్నాను. మరొక లాస్ట్ అండ్ లీస్ట్ విషయం ఏమిటంటే మా ఆయన అందరి మొగుళ్ళలా కాదని, బంగారం అని విన్నవిస్తున్నాను. చివరి లాస్ట్ అండ్ లీస్ట్ విషయం ఏమిటంటే ఎవరికి వారు వాళ్ళ మొగుళ్ళ గురించి అలాగే అంటారని, అనాలని కూడా కోరుకుంటూ ముగిస్తున్నాను”

విందు దెబ్బకి మరుసటి రోజు నుండి వాళ్ళ వాకింగ్ ప్లేస్ మారుతుంది. వాళ్ళు తప్పిపోయి అక్కడికే వచ్చినా అరవిందను చూడగానే ఇంకా ఫాస్ట్ గా అందకుంటా నడుస్తారు. వాళ్ళ నడక స్పీడు చూసి విందు సంబరపడుతుంది. “చూశావా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎంత పెంచుతున్నానో” అంటుంది.
“విందూ, నీ స్టైలే వేరు. ఆడ రజనీకాంత్” అంది సుశీత ఒకసారి.
“నీకెలా తెలుసు పిల్లా, నేను రజనీకాంత్ స్టైల్లో సిగరెట్ తాగుతానని” అంటూ నవ్వింది.
మొదటిసారి వైన్ రుచి చూసింది విందుతోనే. ఒకసారి సిగరెట్ కూడా. కానీ సిగరెట్ ఎందుకో నచ్చలేదు.
సుశీత వాచ్ లో చూసుకుంది. ఆరు కిలోమీటర్లు నడిచింది. అరవిందను ఆగమని సైగ చేసి దగ్గరలో ఉన్న మెట్ల మీద కూర్చుంది. అరవింద ఆమె సమీపంలో కూర్చొని భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కోని వదిలేసింది. సుశీత చెవిలోని ఒక ఇయర్ ఫోన్ తీసుకుని “మీ కన్నడ వాసుదీక్షితా” అంటూ తన చెవిలో పెట్టుకుంది. “ఇదేంటి పిల్లా, త్యాగరాజు నగుమోము కీర్తన వస్తోంది.” అంటూ తిరిగి ఆమె చెవిలో కుక్కింది. అరవిందకు ఆ కీర్తన అంటే చాలా ఇష్టం. కానీ ఇలా రోడ్డు మీద వినదు. ఏడ్చేస్తానేమోనని భయపడుతుంది.
“చెప్పు, ఏదో విషయం చెప్తా అన్నావు” అడిగింది అరవింద.

ఉదయపు తాజాదనం మనసును ఉల్లాసపరుస్తున్నది. మనసులోని అశాంతి శ్వాసతోనూ, శరీరంలోని మాలిన్యం చెమటగాను ఆవిరవుతున్నాయి. అందుకే బరువైన ఏ విషయాలు చెప్పాలనిపించడం లేదు.
“ఏమి లేదు, ఊరికే” అంది సుశీత. ఎందుకు ఈ మధ్య అకారణంగా దుఖఃం కలుగుతున్నది. హార్మోన్స్ సమస్యా? తన మనసులోని భారాన్నంతా దింపుకోవాలని ఉంది. తీరా సమయం వచ్చినప్పుడు మనసు ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీని సరదా ముచ్చట్లతో నింపేస్తుంది.
కానీ అరవింద వదల్లేదు. కొంచెం సేపు ఆలోచించి క్రితం రోజు సంఘటన గురించి చెప్పింది. శంకరి అనే మైనర్ అమ్మాయి లేచిపోవడం, యస్సై తో సంభాషణ వర్ణించి చెప్పింది. యస్సై గురించి చెప్పినప్పుడు అరవింద పడీ పడీ నవ్వింది.

శంకరి గురించి ఆకార విశేషాలతో పాటు రక రకాల వివరాలు అడిగింది.
“ఎందుకో ఈ మధ్య మైనర్ల ఎలోపింగ్ కేసులు ఎక్కువవుతున్నాయి కదా. చాలా కారణాలు ఉండవచ్చు. జనరల్ గా నైతే సెక్స్ పట్ల కుతూహలం, ఇన్ఫీరియారిటీ, ఐడెంటిటీ క్రైసిస్ కారణం అనుకుంటా” అంది అరవింద.

తిరిగి తానే అంది, “వీటి మీద స్టడీ చాలా జరగాలి. అందరం సాధారణ అభిప్రాయాలతో ఉంటున్నాం. ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. ఏం పరిశోధనలు చేస్తారో ఏమో, మన దాకనైతే ఏ వివరం రాదు”
“నీ మీద కూడా రీసర్చి జరగాలి” నవ్వుతూ అంది సుశీత.
“అవును పాపం. మీరంతా ఆర్డినరీ. నేను కొంచెం ఎక్స్ట్రా అని కదా అర్థం. జీవితం అలా కుదిరింది మరి” అంది కన్ను గీటుతూ. అరవింద అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నది. వాళ్ళ నాన్న సీనియర్ లాయర్. తన దగ్గర పని చేసే కరుణాకర్ తో పెళ్లి చేశాడు. తండ్రి ఈ మధ్యనే చనిపోయాడు. కరుణాకర్ కు అరవింద మొదటినుండీ తెలిసి ఉండడం వల్ల, అతనికి ఉండే ఇతర వ్యాపకాల వల్ల వాళ్ళిద్దరి మధ్య కొంత సయోధ్య ఉన్నట్టు కనిపిస్తుంది.
కానీ అది నిజం కాదు. బలవంతపు సయోధ్య అంటుంది అరవింద.
“మా గురువు కూడా మొదట్లో విప్లవాలు లేవదీశాడు కానీ నేనే నిర్ధాక్షణ్యంగా అణచివేసా. మందు మార్గంలో పడదామా, ముక్తి మార్గంలో పడదామా అని కొన్నాళ్ళు సీరియస్ గా ఆలోచించాడు. కానీ ఎందుకో భక్తి మార్గంలో పడ్డాడు” అంది అరవింద.
అరవిందను చూసి చాలా మంది బోల్డ్ అనుకుంటారు. కానీ అది సగమే నిజం. ఫ్రెండ్స్ తో వైన్ తాగే ఫోటోలు ఆమెకు మరింత బోల్డ్ ఇమేజ్ కల్పించాయి. తప్పిపోయి ఏ మగాడైన దగ్గరకు వస్తే మాటలతో హడలగొడుతుంది.
ఒకరకంగా ఆమె ఈ ప్రపంచం మీద ఏదో ప్రతీకారం తీర్చుకునేదానిలా కనిపిస్తుంది. అరవిందతో సుశీత మొదట కొంత విముఖంగా ఉండేది. కానీ ఒకటే కాలనీ కావడం వల్ల చిన్నప్పటి నుండి తెలుసు. ఒకటి రెండు కేసుల్లో లీగల్ సలహా కావలసి వచ్చినప్పుడు కలవాల్సి వచ్చింది. అప్పటి నుండి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.

కొన్నేళ్ళ క్రితం ముచ్చట. ఒకసారి సాయంకాలం నేరుగా సుశీత ఇంటికి వచ్చింది అరవింద. ఇంటిలో సుశీత ఒక్కతే ఉంది. ఏ సమాచారం లేకుండా ఎకాఎకిన వచ్చిన అరవిందను చూసి ఆశ్చర్యపోయింది. వస్తూనే సోఫాలో కూలబడింది. ఆమెను చూస్తుంటే ఏదో గాయపడిన దానిలాగా అగుపించింది. కొద్ది సేపు ఏమి మాట్లాడలేదు. సుశీత భుజం మీద తల ఆనించి అలాగే ఉండిపోయింది. కొంచెం సేపటి తరువాత అరవింద ఏడుస్తున్నట్లుగా గమనించింది. ఏదో విషాదం వాళ్ళను కమ్ముకున్నది. అస్పష్టమైన వేదనాధూపమేదో ఇద్దరినీ అలుముకున్నట్లనిపించింది. సుశీతకు అకస్మాత్తుగా తమ ఇంటిలో జరిగే శుక్రవారం పూజ గుర్తుకు వచ్చింది. పసుపు, బొట్టు, పూలు, కల్లు, గులాల్, పొగ, లక్ష్మీ దేవి, మేక, దాని అరుపు, నీళ్ళు చిలకరించడం, అది జడితి ఇవ్వడం గిర్రున తిరిగాయి. ఆ మేకకు తెలుసా ఏం జరగబోతుందో. తమ కంటే ఎక్కువ ఆసక్తిగా చూసే దాని చూపులు గుర్తుకు వచ్చాయి. వెక్కివెక్కి ఏడ్చింది సుశీత. వాళ్ళిద్దరూ దు:ఖ నదులయ్యారు. ఒకరిలోకి ఒకరు ప్రవహించారు.
ఎవరెందుకు ఏడిచారో ఒకరినొకరు ప్రశ్నించుకోలేదు. ఈ నాటికీ ఆ సంఘటన గురించి మాట్లాడుకోలేదు. నిజానికి ఆ విషయమే మర్చిపోయారు. కానీ అప్పటినుండి వాళ్ళిద్దరు మంచి స్నేహితులయ్యారు.

కట్టపైన మెల్ల మెల్లగా ఎండ పెరుగుతున్నది. మోటార్ సైకిల్ల రాక పోకలు ఎక్కువయ్యాయి.
“ఈ రోజు ఎన్ని కిలోమీటర్లు రన్ చేశావు?” అడిగినది సుశీత.
“నథింగ్. అలవాటుకొద్ది వచ్చా. అంతే” అంది అరవింద.
సుశీత వైపు తిరిగి ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ
“నీకు చెప్పలేదు కద, నిన్న ఛాతిలో నొప్పి అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. కొన్నిటెస్ట్ లు చేశారు. రిపోర్ట్స్ ఇవ్వాళ వస్తాయి” అంది అరవింద. సుశీత ముఖంలో ఆందోళన స్పష్టంగా కనపడింది.
“నాకెందుకు చెప్పలేదు” అడిగింది సీరియస్ గా.
అరవింద లేచి నిలబడి “బీ కూల్ బేబీ, రిపోర్ట్స్ వచ్చాక మాట్లాడుకుందాం” అంటూ కదిలింది.
సుశీత ఏదో చెప్పబోయేంతలో తెలిసిన వాళ్ళు వస్తే ఆగింది. ఆ తెలిసిన వాళ్ళు ఏమి మాట్లాడకుండానే నవ్వులు పంచేసి వెళ్లిపోయారు. టైమ్ ఏడున్నర అవుతున్నది. ఇద్దరికీ పెండింగ్ పనులు గుర్తుకు రావడంతో హడావిడిగా ఇళ్లకు వెళ్లిపోయారు.
ఇంటికి వెళ్ళేసరికి సుశీతకు వంటింటి గద్దెను సీరియస్ గా తుడుస్తూ కనిపించాడు భర్త. ఒకటి రెండు పొడి మాటలు నడిచాయి. సరదా మాటలకు ఏ మాత్రం సందివ్వని జాగ్రత్తపరుడు. ఈ రోజు పొద్దున్నే వంటింట్లోకి జొర బడ్డాడంటే షాప్ కు వెళ్లడన్నమాట. సాయంకాలం అయ్యేసరికి వంటింట్లోకి వెళ్లాలంటే తానే భయపడాల్సి వస్తుంది. అంత శుభ్రంగా మార్చేస్తాడు. షాప్ లో కూడా సామాన్లు సర్దుతూనే ఉంటాడు. ఇంటికొస్తే అదే పని. వాళ్ళమ్మ అందరికీ మురిపెంగా చెప్తుంది కొడుకు పనితనం గురించి. తమ పెళ్ళయిన కొత్తలో అందర్నీ కూర్చోబెట్టి అతడు పనిచేయడాన్ని మాత్రం ఆమె ఓర్చుకోకపోయేది. తాను పని చేస్తే అత్త వెతికే తప్పుల జాబితా చాంతాడంత ఉండేది. నానా మాటలు అనేది. ఒకసారి నోరు జారింది. అప్పటి తన రియాక్షన్ చూసిన తరువాత అందరి నోళ్ళు మూతలు పడ్డాయి. చుట్టు పక్కల ఆడవాళ్ళు తనను ఈర్ష్యగా చూస్తారు. మంచి పనిమంతుడైన భర్త దొరికాడని. తనకేమో బోరింగ్. ఏకాంతంలో కూడా నోరు మెదపడు. అప్పుడు కూడా ఇల్లు సర్దడం మీదనే అతని ఆలోచన ఉంటుందనిపిస్తుంది. చుట్టాలు వస్తే మాత్రం తెగ కులాసాగా ఉంటాడు. అందరి లాగే తామిద్దరి మధ్య సంబంధం సరిగా కుదురుకోలేదేమో. కానీ చాలా మంది తాము తప్ప ప్రపంచమంతా సుఖంగా ఉన్నట్లు భ్రమిస్తారు.
వంటింట్లో ఇక తాను చేసేదేం లేదు కాబట్టి తొందర తొందరగా స్నానం ముగించుకుని క్రీమ్ కలర్ డ్రస్ వేసుకుంది. ఆఫీస్ కు వెళ్ళింది.
* * * *
పని ఒత్తిడి పారిపోదామా అనేటట్లు చేస్తుంది కొన్నిసార్లు. కానీ ఆఫీసుకు రాగానే స్వేచ్ఛగా ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది చాలాసార్లు. ఆఫీసులోకి వెళ్ళగానే మొదట గ్రీన్ టీ తెప్పించుకుంది. వేడి వేడి టీ ని నెమ్మదిగా ఆస్వాదిస్తూ తాగింది. ఎంత ఆలస్యమైనా సరే సాయంకాలం అరవింద ఇంటికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. టైమ్ గడుస్తున్నకొద్ది మెల్లగా పనిలో మునిగి పోయింది. షెల్టర్ లో ఉన్న వారి గురించి ఆరా తీసింది. స్టాఫ్ కు ఒక్కో పని అప్పచెప్పింది.

నిర్మలతో ఆ అమ్మాయి శంకరిని హాస్పిటల్ కు పంపించింది. జనరల్ చెకప్ కు వెళ్ళడానికి శంకరి మొరాయించింది. కానీ పట్టువడాలకుండా నిర్మల ఆ పిల్లకు నచ్చచెప్పి తీసుకువెళ్ళింది. డ్యూటి డాక్టర్ తో మాట్లాడింది. పదిన్నరకు గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ లో అవగాహన సదస్సు ఉంది. షి టీం వాళ్ళు అప్పటికే చేరుకున్నారు. చైల్డ్ అబ్యూజ్ మీద, పోక్సో చట్టం మీద, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద అవగాహన కల్పించాల్సి ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలంటే తనకు చాలా ఇష్టం. పిల్లలతో మాట్లాడడం కంటే మించిన గొప్ప పనేం ఉండదు తన దృష్టిలో.

మీటింగ్ కు వెళ్ళి వచ్చేసరికి పగలు ఒంటిగంట అయ్యింది. ఆఫీస్ కు వెళ్ళి శంకరి రిపోర్ట్ లు ముందేసుకుంది. అనుమానించినట్లుగానే రిపోర్ట్ లో ప్రెగ్నెన్సీ అని ఉంది. పాపం చిన్నపిల్ల. జీవితాంతం ఈ భారాన్ని ఎలా మోస్తుంది. కౌన్సిలర్ నిర్మలను పిలిచింది. గాయపడిన కేసులు, సగం కాలిన దేహాల వంటి ఎన్నో గృహహింస కేసులు చూసినా కూడా సున్నితత్వం కోల్పోని నిర్మల అంటే సుశీతకు వ్యక్తిగతంగా కూడా ఇష్టమే.

శంకరి కేసు వివరాలు చెప్పింది నిర్మల. గర్భం ధరించి ఎనిమిది వారాలయ్యింది. అబార్షన్ చేయొచ్చు అన్నారు డాక్టర్. లీగల్ గా కూడా ప్రాబ్లం కాదు అంది. కాని ఒకసారి సీనియర్ డాక్టర్ సలహా కూడా తీసుకుందామని, లీగల్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకొమ్మని డాక్టర్ అన్నారని చెప్పింది.

శంకరి తల్లిదండ్రులతో మాట్లాడిన విషయం చెప్పింది నిర్మల. వాళ్ళను ఆఫీస్ కు రమ్మంటే బూతులు తిట్టారని, అది చచ్చిన దానితో సమానం అని అరిచారని చెప్పింది. వాళ్ళు కోపంగా ఉన్నారని తెలుస్తూనే ఉంది.
సెక్యూరిటీ గార్డ్ వచ్చి “ఎవరో సోనీ అనే ఆమె మిమ్మల్ని కలుస్తాను అని అంటుంది. లోపలికి పంపమంటారా” అని అడిగింది. శంకరిని లేవదీసుకు పోయిన ఆటో డ్రైవరు భార్య పేరు సోనీ అని నిర్మల చెప్పింది. వాళ్ళను లోనికి పంపమని చెప్పింది. మెరుపుల చీర కట్టుకున్న నడి వయసు స్త్రీ వచ్చి నిలబడింది. ఆమెతో పాటు వెలిసిపోయిన నీలి రంగు చీర కట్టుకున్నఇంకొకామె కూడా ఉంది. ఆమె చంకలో చంటి బిడ్డ ఉంది. కూర్చోమ్మని చెప్పింది. పరిచయం చేసుకున్నారు. మెరుపు చీర కట్టుకున్న స్త్రీ ఆటోడ్రైవరు రమేశ్ తల్లి. చంటి పిల్లను ఎత్తుకున్నావిడ పేరు సోనీ. ఆమె రమేశ్ భార్య.

కూర్చుంటూనే దడదడ మాట్లాడడం మొదలు పెట్టింది రమేశ్ తల్లి.
“నా కొడుకు తప్పు చేయలేదని అంటలేనుగానీ వాడు అమాయకుడు మేడం. శంకరి ముండనే వాని చుట్టూ తిరిగి.. వాన్ని ఎగేసింది. అది ముందే తీట పోరి. ఏం జేసిందో ఎంత మందితో తిరిగిందో గాని ఈన్ని మాత్రం బద్నాం చేసింది. అదేం సూపెట్టిందో, పిట్టసోంటి పోరీల ఈ నప్పతట్లోడు ఏం జూసిండో.. ఇగో నా కోడలు బతుకు మాత్రం అన్యాయం జేసిండు గదరా ఈని నోట్లే మన్నువడ. ఏ మొగోడైన పక్క సూపుల్ చూసెటోడేనయ్యే. దీనికి బుద్ది ఉండద్ధ. సదువుకున్నది కదా. గంత బలుపు ఉంటే అయ్యా అవ్వ దానికి లగ్గం జేసి కాలవెట్టద్ద..” అంటూ ఏడుపు మొదలు పెట్టింది. నోట్లో చెంగు కుక్కుకుని సోనీ కూడా వెక్కి వెక్కి ఏడ్చింది. చంకలో ఉన్నసంటి పిల్ల కీసుమని అరిచింది.

కొంత సేపేయ్యాక ఏడుపు ఆపేశారు.
“మా కొడుకు మీద కేసు పెట్టకండి మేడమ్” చేతులు జోడించి అడిగింది.
“కేసు పెట్టేది పోలీసులు. నేను కాదమ్మా” అంది సుశీత.
“పోలీస్టేషన్ వెళ్తే మీ పేరు చెప్పారమ్మా. శంకరికి అప్పో సప్పో చేసి పదో ఇరవయ్యో ఇస్తాం మేడం. వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒప్పించుకుంటాం. వాళ్ళు కేసు పెట్టకుండా చూసుకుంటాం. మాది మాది ఒకటే కులం కూడా. పెద్ద మనుషుల దగ్గర పంచాయతి తెంపుకుంటాం. మీరు అడ్డం పడకండమ్మా. మీ కాళ్ళు మొక్కుతా” అంది జోడించిన చేతుల్ని ముందుకు చాపుతూ.
“మైనారిటీ తీరని అమ్మాయి మీద చేయి వేయడం రేప్ కింద వస్తది. పైగా ఆ అమ్మాయిని డబ్బులతో కొడదామనుకుంటున్నారు. మనింటి పిల్ల అయితే ఇలా అంటామా” అంది నిర్మల.
నిర్మల వైపు కొర కొర చూస్తూ “రేప్ కిందికి వస్తదా, ఆ ముండచ్చి ఈన్ని ఎగేసి పంటే కూడా కూడా రేప్ చేసినట్లా. నీ ఇంటి ఆడబిడ్డ అయితేనా అంటూ మాట్లాడుతున్నావ్, నా సంగతి సరే, మీ ఆయనే ఇలా చేస్తే అతన్ని గాలికి వదిలేస్తరా” హెచ్చిన గొంతుతో అడిగింది తల్లి. ఆ అకస్మాత్తు మాటకు, స్వరానికి షాక్ తిన్నది నిర్మల.
నిర్మల ఏదో మాట్లాడబోయింది. సుశీత గొంతు విప్పింది.
“చిన్న పిల్లను పక్కలోకి లాగితే మొగుణ్ణి గాలికి కాదు పోలీసుస్టేషన్లో వదిలేస్తాం. సరేనా… ఆ అమ్మాయికి తెలుసో లేదో, తెలిసినా ఆ క్షణాన అన్నీ మరిచిందో, పెద్ద వయసున్న ఇతనికి తెలియాలి కదా. ఏది మంచి ఏది చెడు అని. మనింట్లోనూ పిల్లలున్నారు కదా. మీరు ఆలోచించే పధ్ధతి సరిగ్గా లేదు. పోలీస్ ల వద్దకు వెళ్ళమని ముందు అతనికి చెప్పండి. తప్పు చేశాడో లేదో వాళ్ళు తేలుస్తారు. మీరు శంకరి జోలికి వెళ్ళినా, వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించినా ఇబ్బంది పడతారు. ఇక మీరు వెళ్ళవచ్చు” అంటూ స్థిరమైన గొంతుతో చెప్పింది సుశీత.
వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. కొద్దిసేపు నిర్మల ఏమి మాట్లాడలేదు.

“మేడం, ఒక డోమెస్టిక్ వయొలెన్స్ కేస్ కూడా వచ్చింది. ప్రాసెస్ చేస్తున్నాం. దాన్ని డీల్ చేసేలోపు మీరు శంకరి తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడితే బాగుంటుందేమో. దానికన్నా ముందు శంకరి కి మీ కౌన్సిలింగ్ అవసరం” అంది నిర్మల.
నిర్మల వైపు ఏదో ఆలోచిస్తూ చూసింది.
“మాటి మాటికి చచ్చిపోతా అని అంటున్నది శంకరి. బహుశా బెదిరించడానికో, సింపతీ కోసమో, అటెన్షన్ సీకింగ్ కోసమో కూడా కావచ్చు. కానీ ఎందుకో సూసైడ్ టెండెన్సీ లాగా అనిపిస్తుంది. కొంచెం బెదిరినట్టుగా కూడా ఉంది” అంది నిర్మల. ఇలాంటి సమయాల్లో ఆమె గొంతును ఏదో దైవత్వం ఆవహిస్తున్నట్లు ఉంటుందనిపించింది సుశీతకు.

సుశీత ఎందుకో దీనంగా కనింపించింది. చైల్డ్ అబ్యూజ్ కేసులు, పోక్సో కేసులు వచ్చినప్పుడల్లా మేడం కలత పడతారు, ఆడపిల్ల తల్లి కదా, డిస్టర్బ్ అవడం సహజం అని అనుకుంది నిర్మల.
ఎటో చూస్తూ తనలో తాను మాట్లాడుకున్నట్లుగా సుశీత “చైల్డ్ అబ్యూజ్ పట్ల జ్యూడిషియల్ కి ఒక క్లారిటీ ఉంది. బలవంత పెట్టిన కేసుల విషయంలో సమాజానికి స్పష్టత ఉంది, బాధితుల పట్ల సానుభూతి ఉంది. కానీ మైనర్ అమ్మాయిలు తెలిసో తెలియకో సెక్స్ అనుభవంలోకి వెళితే మాత్రం సమాజం రియాక్షన్ కఠినంగా ఉంటున్నది. అసహ్యించుకుంటున్నది. ఎందుకిలా?” తనను తానే ప్రశ్నించుకున్నది.
తిరిగి తానే మాట్లాడడం మొదలు పెట్టింది “కోరికలు కలగడం సహజం. కానీ ఈ లేచిపోవడాలు, బలవంతపు మరణాలకు కారణం కేవలం స్వంత తప్పిదమేనా? దాంతో పాటు ఈ టెక్నాలజీ, ఈజీ కమ్యూనికేషన్, ప్రైవసీ, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్కూళ్ళు, ఎమోషనల్ మేనేజ్ మెంట్, క్రైసిస్ మ్యానేజ్మెంట్ కల్పించలేని మనమూ కారణం కాదా. పిల్లలనే కాదు, తల్లిదండ్రులను కూడా రీచ్ కాలేకపోతున్నాం. శంకరిని సమర్థించకపోనీ, కొంచెం సానుభూతి, చేయూత అవసరం కదా” అంది.

ఆమె మాటలు వింటూ, చూస్తూ కూర్చుంది నిర్మల. ఇలాంటి పట్టణాలలో తనకు తెలిసిన ఎన్జీఓలు ప్రచారం కోసం, ప్రభుత్వ నిధుల కోసం పనిచేస్తున్నాయి. ఈమె పనిని మొక్కుబడిగా చేయదు. మనసు పెట్టి చేస్తది. దానికి తోడు అరవింద మేడం సపోర్ట్. బహుశా శంకరి బాధ్యత కూడా అరవింద మేడం కు అప్ప చెప్తుందేమో.

ఇంతలో ఫోన్ మోగింది. అటువైపు నుండి ఫోన్లో అరవింద. నిర్మల తన డెస్క్ వద్దకు వెళ్ళిపోయింది.
ఏ ఉపోద్ఘాతం లేకుండా అరవింద “రిపోర్ట్స్ వచ్చాయి. గుండె రెండు వాల్వ్ లు బ్లాక్ అయ్యాయి. అయినా వీళ్ళేం డాక్టర్లే, మన గురించి అన్నీ తెలిసి కూడా మనకే ఆప్షన్స్ ఇస్తారు. కొంత కాలం వెయిట్ చేయొచ్చట. కానీ రిస్క్ ఉంటుందట. స్టెంట్ వేయించుకోవచ్చట. లేదా బైపాస్ ఆపరేషన్ చేయించుకోవచ్చట. నన్నే నిర్ణయించుకొమ్మన్నారు. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చి వదిలేశారు. పోనీ ఏమన్నా హింట్ ఇస్తారా అంటే, లే, స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్ లాగా అస్సలు బయట పడరు. పోనీ స్టెంట్ కు ఒకే చెప్తే దానిలో వెరైటీల గురించి మళ్ళీ మల్టిపుల్ చాయిస్ ఇస్తారట. ఆలోచించి ఆలోచించి గుండెపోటు తెచ్చుకుని ఏమర్జెన్సీ వార్డులో జాయిన్ అయితే కనీసం అప్పుడైనా మీ డాక్టర్లకు నచ్చిన పని చేస్తారా అని అడిగితే అలా చేయరట. అప్పుడు కూడా ఈ ఆప్షన్స్ ను కుటుంబ సభ్యులకు ఇస్తారట” అంది నవ్వుతూ.

సుశీతకు ఒకవైపు బాధ కలుగుతున్నా నవ్వకుండా ఉండలేకపోయింది. “మరి నువ్వు దేనికి టిక్ కొట్టినవ్? అడిగింది.
“పైవన్నీ. అల్ ఎబోవ్. కొద్ది రోజులు వెయిట్ చేయించి, బైపాస్ సర్జరీ చేసి అందులో మాంచి డిజైన్ ఉన్న స్టెంట్ లు వేసుకొమ్మని చెప్పి వచ్చేసిన” నవ్వు వీడని గొంతుతో అంది అరవింద. సుశీత ఎంత ఆందోళన పడుతుందో తెలుసు కాబట్టి మృదువైన గొంతుతో “నువ్వేం పరేషన్ గాకు. నాకేం కాదు” అంది.
“నీకేం కాకూడదు” అని మాత్రమే అనగలిగింది సుశీత.
“నేనంటే నీకెందుకంత ప్రేమ శీతూ” మురిపెంగా అడిగింది అరవింద.
“నువ్వంటే ప్రేమ కాదు. నీ వల్ల ప్రపంచం మీద ప్రేమ కలిగింది. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద వరల్డ్. బికాజ్ ఆఫ్ యూ. అందువల్ల” తడుముకోకుండా చెప్పింది సుశీత. కొంత సేపు నిశ్శబ్ధం. అరవింద ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది.
సుశీత కొద్దిసేపు అలాగే నిశ్చలంగా కూర్చుంది పోయింది. కానీ త్వరగానే తేరుకుంది.

కొంత సేపటి తరువాత శంకరి లోపలికి వచ్చి కూర్చుంది. ఆమె ముఖం తేటగా ఉంది. అయినప్పటికీ దిగులు, భయం ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి.
“భోజనం చేశావా” అడిగింది సుశీత. తల ఊపింది శంకరి.
“ఇక్కడే ఒకటి రెండు రోజులు ఉండవలసి వస్తుంది. టెక్స్ట్ బుక్స్ తెప్పించనా, నీ కిష్టమైన టైమ్ లో చదువుకోవచ్చు. ఊరికే రూమ్ లో ఉంటే బోర్ కొట్టొచ్చు” అడిగింది సుశీత.
“నేను మా ఇంటికి మాత్రం వెళ్లను” స్థిరమైన గొంతుతో అంది శంకరి.
“సరే, నీ ఇష్టం”
“నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను”
“సరే, నీ ఇష్టం”
శంకరి కన్ఫ్యూజ్ అయింది. ఎగతాళి చేస్తున్నట్లనిపించింది.
“మీరు కూడ నన్ను అర్థం చేసుకోడం లేదు మేడం”
“ఎందుకలా అనుకుంటున్నావ్? నీ జీవితం నీ ఇష్టం. నీ ఇష్టమున్న వాళ్ళను పెళ్లి చేసుకునే హక్కు నీకుంది. అయినా నేను ఎ వద్దు అంటానని ఎందుకు అనుకుంటున్నావ్” అడిగింది సుశీత.
“అతనికి ఆల్రెడీ పెళ్లయిందనీ!” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏదో చెప్పబోయింది శంకరి.
మళ్ళీ ఫోన్ మోగింది. కొత్త నంబర్. హలో అంది. అవతలి గొంతును గుర్తుపట్టింది. దూరపు చుట్టం. వరుసకు అన్న అవుతాడు. పరీక్షల కోసం కొద్ది రోజులు తమ ఇంట్లో ఉన్నాడు. అప్పుడు తన వయసు పన్నెండేళ్ళు. చాలా సంవత్సరాల తరువాత మాట్లాడుతున్నాడు. అతడు చెప్పేది సరిగా వినపడడం లేదు. చెంపకు చేయి పెట్టుకుని శంకరి తల వంచి కూర్చుంది. లైటు వెళుతుర్లో ఆమె కన్నీటి చారికలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి సుశీత చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. కానీ ఇప్పుడెందుకో ఆమె చాలా అసహనంగా ఉంది. ఫోన్ కట్ చేసి విసురుగా టేబుల్ మీద పెట్టింది. కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుంది.

“నువ్వు ప్రెగ్నెంట్. ఆ విషయం తెలుసా?” అడిగింది సుశీత.
“తెలుసు మేడం. అందుకే ఇంట్లోంచి వెళ్లిపోయా” కన్నీరు ఉబికింది.
“అసలు సమస్య అతనికి పెళ్లి అయిందని కాదు, పెళ్లి గురించి నిర్ణయం తీసుకునే మెచూరిటీ నీకు లేదని. ఇక ప్రెగ్నెన్సి అంటావా నీ శరరీరం, నీ ప్రెగ్నెన్సి నీ ఇష్టం. కానీ పిల్లలను కని పెంచేంత ఫిజికల్, మెంటల్ మెచూరిటీ నీకు లేదు. కడుపు వచ్చింది కాబట్టి అన్ని దారులు మూసేసుకుని నిర్ణయం తీసుకవడం కరెక్ట్ కాదు. అదొక్కటే నా అభ్యంతరం. నీవు మంచిదానివా, చెడ్డదానివా, నీవు చేసింది తప్పా ఒప్పా ఇలాంటి అభిప్రాయాలు నాకేం లేవు” అంది సుశీత.

“అందరూ నన్ను అసహ్యించుకుంటున్నారు. పోలీసులు ఎన్ని గలీజు మాటలు అన్నరో. మా వాళ్ళు పోలీస్ స్టేషన్ కు వచ్చి నా మొకమ్మీద ఊన్చి పోయిన్రు” అంటూ ఏడ్చేసింది.
“నిజంగా నేను తప్పు చేశాను. నేను చస్తేనే అన్ని సమస్యలు పోతాయి” అంటూ భోరుమని ఏడ్చింది. ఆ పిల్లను కరువు దీరా ఏడవనిచ్చింది.
సుశీత కుర్చీలోంచి లేచి శంకరి దగ్గరికి వెళ్ళింది. శంకరి నిలబడి ఆమెను హత్తుకుని భోరుమని ఏడ్చింది.
“ఒక తప్పు చేస్తే మళ్ళీ అదే తప్పు, తప్పు మీద తప్పు చేయాల్సిందేనా మేడం” వెక్కిళ్ళ మధ్య ఆ మాటలు అస్పష్టంగా వస్తున్నాయి. సుశీత వింటూ ఉంది.
“చావాలని అనుకోలేదు. లేచిపోవాలని కూడా అనుకోలేదు. అబార్షన్ కోసం ఆరెంపీ డాక్టర్ లక్ష్మీనారాయణ దగ్గరికి ఎవ్వలకు తెలవకుంట వెళ్ళిన. డాక్టర్ లోపలికి తీసుకు వెళ్ళి పరీక్ష చేసి ఛాతిని తడుముకుంటా ముందు పడుకొనిస్తేనే అబార్షన్ చేస్తా అన్నడు. భయపడి ఇంటికి ఉరికచ్చిన. రమేష్ బావతోటి చెప్తే ఆ నల్ల మొకపోడు ఒక్క మాట మాట్లాడలే. అప్పుడనిపించింది, అయితే చావాలే, లేకపోతే ఏదో పెళ్లి అయిందనిపించుకొని నా సావు నేను సావాలే” అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది శంకరి.
ఇలాంటి కేసులు ఎన్ని చూస్తున్నా, వింటున్న ప్రతిసారి ఆవేశం కలుగుతుంది. అది కొద్దిసేపే. ఇప్పుడేం చేయాలా అనేదాన్ని ముందేసుకుంటుంది.

మరో వైపు శంకరి దు:ఖం చూస్తుంటే సుశీతకు గుండె పిండేసినట్లయింది. ఎదుగుతున్న వయసు. మొలకలెత్తే కోరికలు. పోటెత్తే శరీరం. తల్లిదండ్రులు కలుసుకోవడం. ఆ చీకటి. కోపం. అసహనం. ఇంటి బయట తిట్లలో వినబడే సెక్సు మాటలు, మెత్తటి స్పర్శ కోసం ఒంటిలోని కొత్త అవయవాలు వెర్రెత్తిపోవడం, సినిమా పాటలు, అందమయిన శరీరాలు, గుంపులో అంటీ అంటని రహస్య స్పర్శలు, ఎవరికి తెలియదని నమ్మకం కుదిరిన సమయాన దొరికిన అయోగ్యుడొకడికి శరీరం అప్పగింతలు, కొత్త స్పర్శ కోసం పెనుగులాటలు, వాడు వద్దనడు, నిలబడడు. చివరికి బలుపని ఈసడింపులతో ప్రపంచం ముందర నిందితులుగా…

“తప్పు నాదే మేడమ్, రమేష్ బావ మీద మాత్రం కంప్లైంట్ ఇవ్వను. తప్పంతా నాదే మేడం. ఏం చేయాలో తెలియడం లేదు. నేను తొందర పడ్డాను మేడం. నాకు భయంగా ఉంది” అంటూ వెక్కుతూనే గొణిగింది శంకరి. ఈ సమస్యను ఎలా హ్యాండిల్ చేయాలో సుశీతకు అర్థమవుతూ వచ్చింది.
“భయపడకు. తప్పు లేదు. ఒప్పు లేదు. ఇది తప్పయితే ప్రపంచం మొత్తం తలవంచుకోవలసిందే. నీ బాధ నాకు తెలుసు. నేను కూడా ఇలాంటి స్థితి నుండి బయట పడినదాన్నే. నన్ను చూడు. కుప్ప కూలలేదు. చదువుకున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాకే నా ఇష్టం వచ్చినట్లు గడుపుతున్నాను. ఇతరుల మీద ఆధార పడేంత కాలం పరాన్నజీవులమే. చదువుకో. చిన్నదో పెద్దదో పని సంపాదించుకో. అప్పుడు వీటి గురించి ఆలోచించు. అందరం నీ వయసులో కోరికల ఒత్తిడిని ఎదుర్కున్నవాళ్ళమే. అచ్చు నీ లాగే అతలాకుతలం అయిన వాళ్ళమే. ధైర్యంగా ఉండు. మేం ఉన్నాం” అంది సుశీత ఆమె భుజాలు పట్టుకుని దూరం జరుపుతూ.

సుశీతకు ఎందుకో దిగులు కలిగింది. భరించలేని దు:ఖమేదో ఆవహించింది. శరీరం వణికింది.
“తొందరపడకు చిట్టితల్లి, ఎందుకంటే స్త్రీత్వాన్ని స్వీకరించగల అర్హుడైన పురుషుడే లేడు ఈ లోకంలో. అందరూ అరకొర మగాళ్ళే” అంటూ వాష్ రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకుని కమోడ్ పై కూలబడి ముఖం మీద చేతులు కప్పుకుని నిశ్శబ్ధంగా కూర్చుంది. ముఖం కడుక్కుంది. శంకరి గుర్తుకు వచ్చింది. ఆ అమ్మాయి ఓ పదేళ్ళ తరువాత మిగతా వాళ్ళాలాగే నిబ్బరంగా గౌరవంగా ఎలా జీవించ బోతున్నదో రూపం ఏర్పరుచుకుంది. అందుకు తానేం చేయాలో తనకు తెలుసు. వెంట్రుకలు సరిచేసుకుంది. అద్దంలో చూసుకుంది. తలుపు తీసి బయటకు వచ్చి శంకరిని చూసి చిరునవ్వు నవ్వింది.

బెజ్జారపు రవీందర్. కథారచయిత. తెలంగాణలోని ప్రస్తుత జగిత్యాల జిల్లా రాయికల్ గ్రామం. ఎం.ఏ, బి.ఈడీ. చదివారు. కరీంనగర్ జిల్లాలో ఉద్యోగం, నివాసం. రచనలు : నిత్యగాయాల నది(కథా సంకలనం), తాటక (నవల).

4 thoughts on “సుశీత

  1. Chala baga rasaru sir.sneham..prema..mamakaram..ammatham kopam dwesham Anni kalagalipina mee Katha adbutham sir..👌👌🙏🙏🙏

Leave a Reply