యవ్వనంలోనే తనువు చాలించిన ప్రతిభావంతురాలైన కవయిత్రి: సిల్వియా ప్లాత్

కేవలం సాహిత్య ప్రేమికులను ఒక కుదుపుకు గురి చేయడానికే బహుశా, అపుడపుడూ ఈ భూమ్మీదకు కొందరు కవులు / కవయిత్రులు వొస్తుంటారు. 20 వ శతాబ్దం మిక్కిలి ఆరాధించిన అటువంటి అరుదైన అద్భుతమైన అమెరికన్ కవయిత్రి ‘సిల్వియా ప్లాత్’. అమెరికా సమాజం అప్పటిదాకా మర్యాద మప్పితాల కింద దాచిపెట్టిన అన్ని భావావేశాలను, పచ్చి గాయాల వంటి ప్రతీకలతో, పదబంధాలతో కవిత్వం చేసి, తన తదనంతర ప్రపంచ కవిత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. సిల్వియా ప్లాత్ ప్రతిభావంతులైన విద్యార్థి. ఆమె టీనేజ్‌లో ఉన్నప్పుడే, ఆమె రాసిన కథలు కవిత్వం జాతీయ పత్రికలలో ప్రచురింపబడి ఎన్నో పురస్కారాలను గెలుచుకున్నాయి.

1932 లో బోస్టన్ లో జన్మించి కేవలం 31 యేళ్ళ చిన్న వయసులో బలవన్మరణానికి పాల్పడిన సిల్వియా ప్లాత్ కవిత్వంలో ప్రముఖ కవి ‘టెడ్ హ్యూస్’ తో విఫలమైన తన వివాహ బంధం వలన పుట్టిన నిరాశా నిస్పృహలు, మృత్యువు పట్ల తీవ్ర మమకారం ధ్వనిస్తాయని విమర్శకులు అంటారు. ఆమె తండ్రి అమెరికాకు వలసవచ్చిన జర్మన్ జాతీయుడు. కాలేజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నపుడు తన విద్యార్థిని నే పెళ్లి చేసుకున్నాడు. దురదృష్టవశాత్తూ ఎనిమిదవ యేటనే తండ్రి మరణించడంతో సిల్వియా జీవితం గందరగోళంలో పడిపోయింది. తండ్రితో తన సంబంధానికి సంబంధించిన ఈ దుఃఖమంతా సిల్వియా ప్రఖ్యాత కవిత ‘డాడీ’ మరియు మరికొన్న కవితలలో కనిపిస్తుంది. డిగ్రీ చదివే రోజులలో బయటపడిన మానసిక రుగ్మతల వ్యాధి, మధ్యలో ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసుకునే వరకూ తీసుకువెళ్లి, చివరికి అతి చిన్న వయసులో పొట్టన పెట్టుకున్నది. 2003 లో సిల్వియా టెడ్ హ్యూస్ ల ప్రేమ పెళ్లి మీద ‘సిల్వియా’ పేరుతో ఒక సినిమా కూడా వొచ్చింది. ఆ సినిమా ని విమర్శిస్తూ సిల్వియా కూతురు రాసిన కవిత ఒక సంచలనం.

‘బాల్యంలో ఆధిపత్య భావజాలంతో వ్యవహరించిన తండ్రి జ్ణాపకాలు, కుటుంబ జీవితానికి కావలసిన నమ్మకాన్ని ఇవ్వలేకపోయిన భర్త, ఇద్దరు పిల్లలకు తల్లిగా నిర్వహించవలసిన బాధ్యతలు, అన్నీ కలిసి సిల్వియాను పిచ్చిదాన్ని చేశాయి’ అని స్త్రీవాదులు అంటారు. ఒక విమర్శకుడు మాత్రం ‘ఒక అపురూపమైన అమ్మాయి నుండి కలత చెందిన ఆధునిక మహిళ వరకు, అక్కడి నుండి ప్రతీకారంతో రగిలిపోయిన మంత్రగత్తె వరకు ఆమె కవితా స్వరం ఎదిగింది’ అంటాడు.

//మందలింపు//

నాలుకను చిత్రించడానికి
నీవొక పక్షిని ముక్కలు చేస్తే
పాటలు పాడే గొంతును
కత్తిరిస్తావు

అందమైన మృగం జూలు
అద్భుతం చూడడానికి
దాని చర్మం చెక్కితే
ఆ జూలుకు కారణమైన దాని
మిగతా భాగాలనూ ధ్వంసం చేస్తావు

సున్నితంగా కదిలే హృదయాన్ని
కదిలిస్తున్నదేమిటో కనుగొనడానికి
హృదయాన్ని పెకిలిస్తే
మన ప్రేమ లయల
గడియారాన్ని ఆపివేస్తావు

//మృత జీవులు//

ఇవి బతికే కవితలు కావు
ఈ రోగ నిర్ధారణ సజావుగా లేదు
వీటి కాళ్ళూ చేతులూ సరిగానే పెరిగాయి
వీటి చిన్న నుదురు ఉబ్బిపోయి వుంది
ఇవి మిగిలిన మనుషుల్లా నడవలేకపోతే
కారణం, అమ్మ ప్రేమ లభించక కాదు

అయ్యో!
వీటికి ఏం జరిగిందో నేను మీకు వివరించలేను
కానయితే, యివి సరిగానే ఎదిగాయి
అన్ని భాగాలూ సరిగానే పెరిగాయి
ఇవి నా వైపు చూసి
నవ్వుతూ నవ్వుతూనే వుంటాయి
అయినా ఊపిరితిత్తుల్లో గాలి నిండదు
హృదయం కొట్టుకోవడం మొదలుకాదు

ఇవి చేపలో మరొక జంతువులో కాదు
అయినా అటువంటి వాసనేదో వేస్తాయి
బతికి వుంటే ఎంత బాగుండేది?
కానీ, ఇవి మృత శిశువులు
పరధ్యానంతో వీటి అమ్మ కూడా
సగం చచ్చిపోయింది
ఇవి అమ్మ వైపు మూర్ఖంగా చూస్తాయి గానీ
ఆమె గురించి ఒక్క మాటా మాట్లాడవు

పుట్టింది, పెరిగింది వరంగల్ లో. హైదరాబాద్ లో నివాసం. నాలుగు కవితా సంపుటులు (వాతావరణం, ఆక్వేరియం లో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి) వెలువడినాయి. కొన్ని కథలు, పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు కూడా.

Leave a Reply