సిరియా యుద్ధ గొంతుకతో ఒక సంభాషణ

అది సోమవారం. పొద్దున్నే ఆఫీస్‌కు పోగానే మా డిపార్ట్‌ మెంట్‌ హెడ్‌ నుండి ఒక ఈమైల్‌ వచ్చింది. ఒక రీసర్చ్‌ ప్రాజెక్ట్‌లో నాకు సహాయం చేయడానికి ఒక కొత్త రీసర్చ్‌ విద్యార్థిని ఇస్తున్నాము అన్నది దాని సారాంశం. మామూలుగా అయితే ఇదేమి పెద్దగా ప్రాధాన్యత కల్గిన విషయం కాదు. ఎందుకంటే కొత్తగా వచ్చే రీసర్చ్‌ విద్యార్థులతో, స్కాలర్స్‌తో కలిసి పనిచేయడం, కొత్త విషయాలు పంచుకోవడం, నేర్చుకోవడం ఎప్పుడూ జరిగే పనే. కాని ఆ మెసేజ్‌ లో చివరన ఆ కొత్తగా వచ్చిన విద్యార్థి సిరియాలో మెడిసిన్‌ పూర్తిచేసి రెండు వారాల క్రితమే అమెరికా వచ్చాడు అని రాశాడు. ఆ ఒక్క మాట నాలో తెలియని ఉత్సాహాన్ని, కొంత అలజడిని లేపింది.

సిరియాలో జరుగుతున్న దుర్మార్గ యుద్ధాన్ని అది మొదలయినప్పటి నుండి వింటున్నాను, చదువుతున్నాను. అక్కడ జరుగుతున్న అమానవీయ సంఘటనలకు భాదపడుతున్నాను. కొన్ని సందర్భాలలో నన్ను నేను సముదాయించుకోవడానికి కవిత్వమై కన్నీరు కార్చాను. అందులోను అప్పుడప్పుడే ట్రంప్‌ వచ్చి ట్రావల్‌ బ్యాన్‌ పెట్టిన దేశాలలో సిరియా కూడ ఒకటి. మరి సిరియా నుండి వచ్చినతను ఎలా వచ్చాడు? అక్కడి పరిస్థితుల గురించి ఏమైనా చెప్పగలడా? అయినా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఇక్కెడికి ఎందుకొచ్చాడు? ఎన్నెన్నో ప్రశ్నలు ఆపుకోవాలనుకున్న ఆగని పరిస్థితి. అయినా బాగా వున్నోడు కాకపోతె ఇప్పుడున్న వాతావరణంలో ఇక్కడి దాక రాలేడు కదా అని అనుకున్నాను. దేశం దాటి పొయ్యే వాళ్ళకు వాళ్ళ వర్గం బట్టి వాళ్ళు పోయే మార్గం, ప్రాంతం నిర్ణయించబడుతాయి కదా! లేనోళ్ళు పడవల్లో దేశం సరిహద్దులు దాటపోయి మార్గమధ్యంలో మునిగి చస్తుండ్రు. ఉన్నోళ్ళు విమానాల్లో ఇక్కడి దాక వస్తుండ్రు. మూసగా ఒక సూత్రీకరణ చేసుకుంటూ ఉండగానె, నా ఆఫీస్‌ డోర్‌ కొట్టిన శబ్దం వినిపించింది.

వెళ్ళి డోర్‌ తీసి చూస్తె, ఎదురుగ దాదాపు ఇరవై ఐదు ఏండ్లున్న ఒక వ్యక్తి నిలబడి వున్నాడు. చాలా హుందాగా మంచి బ్లేజర్‌, దానికి తగ్గట్టుగా తెల్ల షర్ట్‌, బ్లాక్‌ ప్యాంట్‌ వేసుకొని చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. నన్ను చూడగానె తన పేరు చెప్పి, ‘‘మీతో కలిసి పనిచేయడానికి వచ్చాను’’ అన్నాడు. షేక్‌ హాండ్‌ ఇచ్చి, పలకరించి లోపలకి పిలువగానె వచ్చి నాకు ఎదురుగ్గా వున్న కుర్చీలో కూర్చుండు.

వ్యక్తిగత విషయాలలోకి వెళ్ళకుండ సూటిగా నేను చేస్తున్న రీసర్చ్‌ వివరించి తాను ఏ విధంగా అందులో భాగం కాగలడో కాసేపు మాట్లాడుకున్నం. అందులో భాగంగానే ఆ మధ్యాహ్నం నేను కొంత మంది సీనియర్‌ కార్డియాలజిస్టులతో నిర్వహిస్తున్న ఒక మీటింగ్‌ కు రమ్మని పిలిచాను. వస్తానని చెప్పి నేరుగా మీటింగ్‌ రూం దగ్గరికి నాకంటే ముందే చేరుకున్నాడు.

రావాల్సిన వాళ్ళంతా రాగానే ముందుగానే తయారు చేసుకున్న కొన్ని ప్రశ్నలు నేను అడుగుతుంటె ఆ డాక్టర్లు సమాధానం చెప్తున్నారు. వైద్య వృత్తిలో వాళ్ళకు దాదాపు ఇరువై, ముప్పై ఏండ్ల అనుభవం వున్నవాళ్ళు. అందులోను మొత్తం అమెరికాలోనె మెడిసిన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలో పనిచేస్తున్న వాళ్ళు. అందరూ చాలా మర్యాదగా, హుందాగా మాట్లాడుతున్నారు.

అంత గంభీరంగ చర్చ నడుస్తుంటె మధ్యలో నాతో వచ్చిన సిరియా స్కాలర్‌ వాళ్ళను ఎదురు ప్రశ్నలు వేయడం మొదలు పెట్టాడు. వాళ్ళేమో కొంత ఇబ్బందిగా నా వైపు చూస్తున్నారు. అయినా అతని ప్రశ్నలు చాలా ముఖ్యమైనవే అంటూ సమాధానం చెప్తున్నారు. మీటింగ్‌ కాస్త అనుకున్నట్లు జరగకపోయినా ఎదో కొత్తగా అనిపించింది. ఆ స్కాలర్‌ను చూస్తె ముచ్చటేసింది. కొత్త ప్రాంతం, కొత్త మనుషులు, అనుభవం రీత్యా చాలా సీనియర్స్‌ సీరియస్‌గా చేస్తున్న చర్చ. వీటికి దేనికి భయపడకుండ, ఎలాంటి బిడియం, తడబాటు లేకుండ తాను అడగాల్సినవన్నీ ఎంత నిబ్బరంగ అడుగుతున్నాడనిపించింది. మొత్తానికి ఆ మీటింగ్‌ ముగిసింది.
మీటింగ్‌ నుండి వెళ్ళిపోయే ముందు ఒక సీనియర్‌ డాక్టర్‌ నా దగ్గరికి వచ్చి ‘‘నీ ట్రైనీని కాస్తా బాగా ‘ట్రైన్‌ ‘చెయ్యి’’ అని కాస్త మృదువుగానే నిష్టూరంగ సలహా ఇచ్చి నా సమాధానం వినకుండానే వెళ్ళిపోయాడు.

ట్రైన్‌ చెయ్యడం అనే పదం మనుషులకు వాడడం మీదనే నాకు కొంత అభ్యంతరం వుండటం మూలంగ అతని ఉచిత సలహాకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. మనుషులు తమ అనుభవంలోంచి, అధ్యయనం నుండి, తోటి మనుషుల నుండి, సమూహాల నుండి, సామాజిక సంఘర్షణల నుండి, ప్రకృతి నుండి.. ఇంకా అనేక విధాలుగా నేర్చుకుంటారు. కాని ట్రైనింగ్‌ ఇవ్వడం ఏంటి అనిపించింది. అయినా ఇటువంటి కామెంట్స్‌ వాళ్ళకు వృత్తిలో, సంస్థలో వుండే పవర్‌ను చూపించుకోవడానికి, తమ దెబ్బతిన్న అహాన్ని సంతృప్తి పరుచుకోవడానికే అనే విషయం నాకు బాగా తెలుసు. అందుకే పెద్దగా పట్టించుకోక పోగా అతను ఆ మాట అనిన మరు క్షణమే మనుస్సులో ఒక విషయం అనుకున్న ‘‘అతన్ని నేను ట్రైన్‌ చెయ్యడం ఏంటి. అతను యుద్ధ భూమి నుండి వచ్చాడు. నేనే అతని దగ్గర నేర్చుకునేది చాలా వుంది’’ అని.

అందరు వెళ్ళి పోయాక, ‘‘మీటింగ్‌ లో చాలా మంచి ప్రశ్నలు వేశావు. నువ్వు ఇలాగే వుండు. సిరియా నుండి వచ్చావని మా వాళ్ళు చెప్పారు. ఇంత వరకు నేను ఒక్క సిరియన్‌ కూడ కలవలేదు. అక్కడి పరిస్థితులు మీడియా ద్వార తెలుసుకోవడమే తప్ప వేరే మార్గం లేదు. నువ్వు వచ్చి రెండు వారాలే అవుతుంది కదా, అక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నీనుండి నేర్చు కోవాలనుకుంటున్న. నీకు వీలయినప్పుడు ఒక గంట కాఫీకి కలిసి మాట్లాడుకుందామా?’’ అని అడగా.

‘‘అయ్యో మీరు అంతగా అడగాలా, రేపే కలుద్దాం.’’ అని అతను అనగానే ‘‘సరే రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు క్యాంపస్‌లో వున్న కాఫీ షాప్‌ దగ్గర కలుద్దాం’’ అని అనుకొని వెళ్ళిపోయాం.

ఆ మరుసటి రోజు మధ్యాహ్నం సరిగ్గ ఒంటి గంటకు కాఫీ షాప్‌ దగ్గరకు పోయేసరికే అతను అప్పటికే అక్కడ నా కోసం ఎదురుచూస్తున్నాడు. నేను సరిగ్గ సమయానికే పోయాను కాని అతను అప్పటికే అక్కడ వుండడం నాకే ఎందుకో గిల్టీగ అనిపించింది. అప్పటికే ఆ కాఫీ షాప్‌ చాల రద్దీగ వుంది. అంతా గోలగోలగా వుంది. సరిగ్గా సమయానికి ఒక మూల ఒక టేబుల్‌ ఖాళీ అయ్యేసరికి తొందరగా వెళ్ళి కూర్చున్నం. అతను కొత్త్తగా దేశానికి వచ్చాడు కదా, ఎలా సెటిల్‌ అవుతున్నాడు, ఏమైనా సహాయం కావాల అనే విషయాలు మాట్లాడుకున్నం. తర్వాత కాఫీ తాగుతూ సిరియా సంగతులు మొదలు పెట్టినం.

‘‘ముందుగా, ఒక సిరియా పౌరుడిగా జరుగుతున్న యుద్ధం గురించి ఏమనుకుంటున్నవ్‌’’ అని అడిగిన.

అతను వెంటనే, ‘‘సిరియా సమాజమంతా శాంతిని కోరుకుంటోంది. కేవలం బ్రతికే హక్కు కోసం ఎదురు చూస్తోంది. బయటి ప్రపంచంలో మాదిరిగా కాకుండ మాకు బతికే హక్కే పెద్ద రాజకీయ హక్కు. కాని యుద్ధం చేస్తున్న అన్ని శక్తులు కేవలం వాళ్ళ అధికారం కోసం, పెత్తనం కోసం పోటీ పడుతున్నాయి. వాళ్ళకు సిరియా ప్రజల ప్రాణాలంటె లెక్కలేదు. గమ్మత్తు ఏమంటే వాళ్ళందరు సిరియా ప్రజల బాగు గురించే ఈ యుద్ధం చేస్తున్నామని నమ్మబల్కుతున్నారు. కాది అది నిజం కాదు. మా నేల మీద, మా సమాజం మీద మొత్తంగా పెత్తనం కోసం జరుగుతున్న ఈ యుద్ధం మాకు సంబంధించింది కాదు. ఇది మా మీది యుద్ధమే కాని, మా కోసం యుద్ధం కాదు’’ అని రాసుకొని వచ్చి చదివినంత స్పష్టంగా చెప్పాడు.

ఇదే విషయం మీద మరికొంత స్పస్టత కోసం నా ప్రశ్నను పొడిగిస్తు ‘‘నీవు చెప్పేదానిబట్టి నాకు అర్థమయ్యింది ఏమంటే సిరియా ‘సాధారణ ‘ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు, కాని యుద్ధం చేస్తున్న వివిధ శక్తులు అధికారం కోసం దుర్మార్గమైన దాడులు కొనసాగిస్తున్నారు. అంటె అక్కడ శాంతిపై యుద్ధం జరుగుతుందా?’’ అని అడిగాను.

తను వెంటనే ‘‘ఈ దుర్మార్గ యుద్ధం చేసే వాళ్ళు కూడ కొన్ని సందర్భాలలో శాంతి గురించి మాట్లాడుతున్నారు. శాంతిలో అధికారం వుందన్నప్పుడు, దాని ద్వార పెత్తనం చేతికి అందుతుందని భరోసా వున్నప్పుడు మాత్రమే. ప్రజలు శాంతిని సహజీవనం కోసం, హింస, దాడులు లేని సమాజ నిర్మాణం కోసం కోరుకుంటుంటే, వాళ్ళు మాత్రం శాంతిని పెత్తనానికి ఒక సాధనంగా భావిస్తున్నారు. పెత్తనం లేని శాంతి వాళ్ళకు పనికిరాని చెత్తతో సమానం’’ అని సూటిగా చెప్పాడు.

అతను చెప్పేది జాగ్రత్తగా వింటూ ‘‘మరి ప్రజలకు శాంతి అంటే ఏమిటి’’ అని అడిగాను.

‘‘ప్రజలకు శాంతి అంటే సాధారణ జీవితానికి ఆటంకం లేకుండ బ్రతకడం. బడులకు, యూనివెర్సిటీకి పోయే పిల్లలు ఇంటికి క్షేమంగా తిరిగి వస్తారనే గ్యారంటీ ఉండటం. బైటికి పోయిన మనిషి శవమై ఇంటికి రాడనే స్థితి రావడం. ఇంతకు మించి మేము ఏమి కోరుకోవడం లేదు. ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధం మూలంగా మాకు హక్కులు అనగానే సృహకు వచ్చేది కేవలం జీవించే హక్కు మాత్రమే. బైటి ప్రపంచంలో మాదిరిగా రాజకీయ హక్కుల గురించి, మాట్లాడే స్వేచ్ఛ గురించి కూడ అడుగుతలేము. అడుగుతుంది, కేవలం మమ్ముల్ని బ్రతకనీయమని మాత్రమే. మరే హక్కులు మాట్లాడాలన్నా మీము బతికుండాలి కదా!’’

ఇలా కనీస మానవ హక్కులు లేని పరిస్థితిని వివరిస్తున్న అతన్ని అసలు ఈ యుద్ధానికి మూలాలు ఎక్కడున్నవని అడిగిన.

దానికి స్పందిస్తు ‘‘గత 40 సంవత్సరాలుగా మా దేశంలో ఒకే రాజకీయ పార్టీ పరిపాలిస్తుంది. వాళ్ళకు మాత్రమే పాలించే హక్కున్నట్లుగ దుర్మార్గమైన పెత్తనం చేస్తూ వస్తున్నారు. మాకు వనరులు వున్నవి, కాని వాటిలో కనీసం పది శాతం కూడ ప్రజల అవసరాలకు ఎప్పుడు ఉపయోగించలేదు. తొంభైౖ శాతం వనరుల నియంత్రణ మొత్తం కొద్ది మంది రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటూవస్తుంది. వీటిని తరాలుగా భరిస్తున్నారే తప్ప ఎప్పుడు ఎదురు తిరగలేదు. కాని ‘‘అరబ్‌ వసంతం’’ గా పిలువబడే ‘‘విప్లవాల’’ వెల్లువ అరబిక్‌ ప్రపంచంలో మొదలయి దాని ప్రభావం సిరియన్ల మీద పడిరది.

ముఖ్యంగా ఈజిప్ట్‌, తునీషియాలో మొదలయిన పెద్ద ఉద్యమాలు ‘‘స్వేచ్ఛ’’, ‘‘పౌరహక్కులు’’ అనే భావనలు మా నేల మీదికి మీడియా ద్వార రావడం మొదలయినవి. అలా అని మీడియా ప్రసారాలు చూసి ప్రజలు తిరుగుబాటు చేశారని చెప్పను. మా ప్రజలలో చలనం రావడానికి అరబ్‌ వసంతం ఒక వాతావరణాన్ని కలిపిస్తే, దక్షిణ సిరియాలోని ‘‘దర్‌ ఆ’’ అనే పట్టణంలో కొంతమంది అమాయకపు బడిపిల్లలు చేసిన ఒక సంఘటన మొత్తం తిరుగుబాటుకు ఆద్యం పోసింది. ఆ పట్టణంలోని ‘‘అల్‌ బనీన్‌’’ అనే పాఠశాల విద్యార్థులు తాము ప్రతిరోజూ మీడియాలో వింటున్న ‘‘స్వేచ్ఛ’’ అనే పదాన్ని తెలిసో తెలియకనో వాళ్ళ స్కూల్‌ గోడల నిండా రాశారు. అది తుడిచేస్తే పోయేవే కాని నియంత రాజ్యం ఇరవై మూడు మంది బడిపిల్లల పట్టుకెళ్ళి జైల్లో పెట్టింది. వాళ్ళు ఏమి తెలియని పసిపిల్లలు, వాళ్ళను వదిలిపెట్టండి, ఆ రాతలను మేమే తుడిచేస్తామని ఆ పిల్లల తల్లితండ్రులు, బంధువులు అక్కడి గవర్నర్‌ కు మొరపెట్టుకున్నారు. కాని ఫలితం ఏమి దొరకలేదు. వాళ్ళ పిల్లలను విడిపించుకోవడం కోసం మరోదారి లేక వాళ్ళు రోడ్లెక్కి తమ నిరసనను శాంతియుతంగానే ప్రకటించారు. కాని రాజ్యం తుపాకులతో సమాధానం చెప్పింది. దానితో మొత్తం సమాజంలో ఒక చలనం మొదలయ్యింది. ఆ తల్లితండ్రులకు అండగా రోడ్ల మీదికి రావడం మొదలుపెట్టారు.

రాజ్యం రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున కాల్చి చంపడం మొదలుపెట్టింది. ఎంతమందిని చంపితె అంతకు వంద రెట్లు ప్రజలు రోడ్లమీదికి రావడం మొదలయ్యింది. రాజ్యం జరగబోయే ప్రమాదాన్ని అంచనా వేసి దాడిని తీవ్రం చేసింది. నిరసనకారులకు ప్రజల మద్దతు పెరిగి పోతుండడతో దానిని నియంత్రించడానికి రాజ్యం కుట్రపూరిత ప్రకటనలు చేయడం మొదలుపెట్టింది. ‘‘సిరియాలో శాంతియుత జీవితాన్ని, సుస్థిరతను దెబ్బతీసి దేశాన్ని నాశనం చేయడానికి జరుగుతున్న విదేశీ కుట్రలో భాగంగానే నిరసనలు జరుగుతున్నాయి. అవన్నీ ఉగ్రవాద చర్యలే’’ అని రాజ్యం ప్రకటించింది. హక్కులడుగుతె ప్రజలని ఉగ్రవాదులుగా ముద్ర వేసే సరికి ఉద్యమం మరింత తీవ్రమయ్యింది. చిన్న చిన్న గుంపులు కాస్త మహా జనాందోళనగా మారిపోయింది. రాజ్యం లెక్కలేనంత మందిని నిర్బంధించింది. కాల్పుల మోత నిత్య కృత్యమయ్యింది. ఒకరు ఒరిగిపోతె వందల్లో, వేలల్లో జనం వీధుల్లోకి కదిలారు.

జరుగుతున్న దుర్మార్గాన్ని చూసి దేశంలోని ఇతర ప్రాంతాలలో (ముఖ్యంగా హోమస్‌, దేశ రాజధాని దమాస్కస్‌లలో) కూడ ఉద్యమకారులకు మద్దతుగా నిరసనలు మొదలయినాయి. అక్కడా అదే పరిస్థితి పునరావృతమయ్యింది. చిన్న గుంపుగా మొదలయ్యి వీధులలో పోటెత్తే జనసంద్ర మయినయి. క్రూరమైన అణిచివేత అమలులోకి వచ్చింది. అయినా ప్రజలు వెనకడుగు వేయలేదు. రోజు శవాలను మోస్తూనే శాంతియుతంగ తమ నిరసన తెలిపారు.’’

తను ఉద్వేగంగ చెప్పుకుంటు పోతుంటె నాకు ఒక సందేహం వచ్చి అడిగిన ‘‘నలబై ఏండ్లుగా ఒక నియంతృత్వ ప్రభుత్వం ప్రజలకు ప్రజాస్వామ్యం అనే భావన కలగకుండ, ఎలాంటి హక్కులు లేకుండ తన పెత్తనాన్ని అమలుచేసిందని చెప్పావు. హింసే ప్రధాన లక్షణంగా వుండే రాజ్యంలో ప్రజలు ఎలా పోరాటంలోకి వచ్చారు. కళ్ళ ముందు రోజుకు పది మందిని కాల్చేస్తున్నా ఎలా నిలబడగలిగారు. వాళ్ళని నడిపించిన లేదా స్ఫూర్తినిచ్చిన శక్తి ఏంటి?’’ అన్ని ప్రశ్నలు టకటకా అడిగేశ.

తనకి నా ఆతృత అర్థమయినట్లుంది. ఒక చిరునవ్వు నవ్వి ‘‘ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. వాస్తవానికి నియంత అస్సాద్‌, అతని యంత్రాంగాన్ని ఆశ్చర్యపరిచింది కూడ ఇదే. ఇన్నాళ్ళు తొక్కిపట్టిన ఎప్పుడు నోరువిప్పని జనాలు ఇప్పుడెందుకు హక్కులంటూ రోడ్లెక్కుతుండ్రని. దానికి వాళ్ళు కారణాలు దేశం బయట వెతకడం మొదలుపెట్టారు. బైటి శక్తులు నడిపిస్తున్న ఒక కృత్రిమ ఉద్యమం అని నమ్మిండ్రు. ప్రజల ఆకాంక్షలను గుర్తించలేదు. ప్రజలను కదిలించిన ఒకే ఒక్క నినాదం: స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ… అంతకు మించి ఏమి లేదు.

నిజమే, ఈజిప్ట్‌, తునీషియాలో విజయవంతమైన ప్రజాస్వామిక ఉద్యమాలు ఒక గొప్ప వాతావరణాన్ని కల్పించాయి. తొలిదశలో బైటినుండి ఏదైనా ప్రేరణ వుందంటే ఇదే. కాని తర్వాత రాజ్యహింసను భరించలేని ప్రజలు తప్పనిసరిగా తమ రక్షణ కోసమై ఆయుధాలు పట్టారు. వాళ్ళని ఆ స్థితికి నెట్టింది రాజ్యమే. శాంతియుత ఉద్యమాన్ని మిలిటరైజ్‌ చేసింది రాజ్యమే.’’ అతను ఈ మాట అనగానే ‘‘ప్రజలకు ఆయుధాలు ఎక్కడి నుండి వచ్చాయి’’ అని అడిగ. ‘‘ముందు వాళ్ళు వాళ్ళ దగ్గర వున్న సాంప్రదాయ తుపాకులు ఉపయోగించారు. రైతుల దగ్గర అలాంటి తుపాకులు ఉండడం సాధారణ విషయమే. వాటికి తోడు శత్రువు మీద దాడిచేసి లాక్కున్న ఆయుధాలు. తర్వాత కాలంలో విదేశాలనుండి ముఖ్యంగా సౌది అరేబియా, టర్కీ, ఖటార్‌ ల నుండి కూడ కొంత ఆయుధ సాయం అందింది.’’

అంతా వింటూనె ‘‘మీ ఉద్యమానికి సహాయం చేయడంలో వాళ్ళ ప్రయోజనాలు ఏంటి?’’ అని అడిగిన.

‘‘చాలా కారణాలు ఉన్నవి. చాలా గందరగోళం కూడ ఉంది. సౌదీఅరేబియాకు ఇరాన్‌ కు పడదు. ఇరాన్‌లో అధికంగా ఉన్నది షియాలు, సిరియాలో అధికారంలో ఉన్నది 8 శాతం ఉన్న అలవిట్‌ తెగ (షియాలకు దగ్గరగా వుండే తెగ). అందు కోసమే ఇరాన్‌ ప్రభుత్వం సిరియా ప్రజా ఉద్యమాన్ని (సున్నీల ఉద్యమంగ చూస్తు) అణిచివేయడానికి సిరియన్‌ ప్రభుత్వానికి సహాయం చేస్తుంది. ఇరాన్‌కు వ్యతిరేకంగ సౌదీఅరేబియా సిరియాలోని తిరుగుబాటుదారులకు (నిరసనకారులు అప్పటికే తిరుగుబాటుదారులయ్యారు!) సపోర్ట్‌ చేస్తుంది. సిరియాలో మెజారిటీ (90 శాతం) ప్రజలు సున్నీలు. టర్కీలో కూడ. అందుకోసం సున్నీ ప్రజలకు మద్దతుగా టర్కీ వచ్చింది. కేవలం మతం ఒక్కటే కారణం కాదు. ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు కూడ వున్నాయి.

సిరియాకు ఉత్తరాన వున్న మా సిటి అలెప్పో ఎంతో అందమయింది. అక్కడ అనేక రకాల పరిశ్రమలు వున్నాయి. మంచి వాణిజ్య కేంద్రం. దానితో టర్కీ చాలా వ్యాపార వ్యవహారాలు నడుపుతుంది. దాని మీద యుద్ధ ప్రభావం వుండకుండ చూడాలని టర్కీ అనుకుంది. వీటన్నింటికి మించి గత నలబై ఏండ్లుగా టర్కీ తూర్పు-దక్షణ ప్రాంతంలో (అంతే సిరియాకు ఉత్తర భాగాన) కర్డిష్‌లు తాము టర్కీ నుండి విడిపోయి స్వతంత్ర కర్డిస్థాన్‌ గా ఏర్పడాలని సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళకు మద్దతుగా ఉత్తర సిరియాలో ఉన్న సిరియన్‌ కర్డిష్‌లను అణిచివేయాలంటే ఇదొక అవకాశంగా టర్కీ భావిస్తుంది. కాని ప్రపంచానికి చెప్పేది మాత్రం మానవత్వ కారణాలు. ఏది ఏమైన వాళ్ళు సిరియా విప్లవానికి మద్దతుగా వచ్చారు’’ అంటూ వివరించాడు.

‘‘విప్లవం’’ అనే పదాన్ని అతి సాధారణంగా వాడుతుంటె దానిని ఏ అర్థంలో వాడుతుండో వివరించమని అడిగ.

దానికి జవాబుగ ‘‘నువ్వు అడిగేసరికి ‘విప్లవం’ అనే పదాన్ని వాడాలా, వద్దా అనే సందేహం నాకు మొదలయ్యింది. సందేహం పక్కకు పెడితె, ఒక నియంతను తొలిగించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పాలని ప్రజల ఆకాంక్ష. అది చాలా పెద్ద పోరాటం. అందుకే విప్లవం అని అంటున్నాము. మరీ ముఖ్యంగ ప్రజలు తమకు తాముగా సాహసంగా చేసిన ఉద్యమం’’ అని వివరిస్తుండగానే నాలో మరో ప్రశ్న మొదలయ్యింది.

‘‘సరే, అది విప్లవమా, కాదా అనే చర్చ ఇప్పుడు అప్రస్తుతం. కాని విప్లవం విజయవంతం అయితే ఎలాంటి సమాజాన్ని, ఎట్లా నిర్మించుకోవాలో, ఎట్లా ప్రయాణం చేయాలో అనే అంశాలపై ఉద్యమం ఎలాంటి అవగాహనను ఇచ్చింది’’ అని అడిగ.

దానికి స్పందిస్తు ‘‘ఇది చాలా ప్రధానమైన ప్రశ్న. ఉద్యమంలో ఆలోచనకు రాని ప్రశ్న కూడ. అక్కడ ఒక పార్టీకాని, ఒక నిర్మాణంకాని, ఒక సిద్ధాంతంకాని, ఒక సమిష్టి నాయకత్వంకాని ఏమి లేవు. ఉన్నదల్లా సహజమైన తిరుగుబాటు (spontaneous rebellion) మాత్రమె. దాని ముఖ్య ఉద్దేశం అస్సాద్‌ని గద్దె దింపడమె. వాస్తవానికి, తొలుత అది కూడా కాదు. కేవలం మమ్ముల్ని స్వేచ్ఛగ బ్రతకనీయమన్నదే ప్రధాన డిమాండ్‌. అది వీలుకాదని అస్సాద్‌ ప్రజల మీద హింసను కొనసాగిస్తూ చెప్పడంతో, ఇక ‘నిన్ను కొనసాగనీయమని’ ప్రజలు నిర్ణయానికి వచ్చారు. ఏది ఏమైనా ఒక సమిష్టి రాజకీయ పార్టీ లేదా సంస్థ లేకపోవడం మా ప్రజా ఉద్యమంలో అతి పెద్ద లోపం. దీని మూలంగానె అంత పెద్ద ప్రజా ఉద్యమం వివిధ బైటి శక్తులకు ఒక పావుల మారిపోయి మొత్తంగానే నష్టపోయింది’’ అని చెప్పుకొచ్చాడు.

బైటి శక్తులు అనగానే ‘‘పాశ్చాత్య దేశాలు ఉద్యమాన్ని ఎలా ప్రభావితం చేశాయి? లేదా నువ్వన్నట్లే ఎలా పావుగా మార్చుకున్నాయి?’’ అని అడిగ.

‘‘ముందుగ ఎలాంటి ప్రత్యక్ష ప్రభావం కనిపించలేదు. కాకపోతె అమెరికా ఆధ్వర్యంలో పాశ్చాత్య దేశాలు అస్సాద్‌ కొనసాగుస్తున్న దాడిని వివిధ సందర్భాలలో ఖండిరచారు. మొదటిసారిగ ‘‘హమ’’ అనే నగరంలో జులై 8, 2011న (శుక్రవారం) జరిగిన ఒక అతిపెద్ద బహిరంగ నిరసన సభకు అమెరికా, ఫ్రాన్స్‌ రాయబారులు ప్రత్యక్షంగా హాజరయ్యి తమ మద్దతును ప్రకటించారు. ఆ సభ ఎంత పెద్దదంటె ఆ నగరంలో పది లక్షల జనాభా ఉంటె, ఆ సభకు ఐదు లక్షల మంది హాజరయ్యారు. అంటె పిల్లలను, వృద్ధులను మినహాయిస్తె పోవడానికి చేతనయిన దాదాపుగ మొత్తం ప్రజలందరు హాజరయ్యారు. అమెరికా మద్దతు ఉద్యమకారులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. అగ్రదేశం మాతోనే ఉంది, ఇక మాకేమి కాదని భావించారు. కాని, ఆ సభ జరిగిన పది రోజులకె సిరియా ప్రభుత్వం ఆ నగరం మీద ఆర్మీతో దాడి చేసింది. మొదటిసారిగ బాంబులతో, యుద్ధ విమానాలతో నగరాన్ని ధ్వంసం చేసింది. హమాను ధ్వంసం చేసి, తన ఆధీనంలోకి తెచ్చుకుంటె ఉద్యమం ఆగిపోతుందని అస్సాద్‌ కలలు కన్నాడు. కాని ఉద్యమం ‘హాంస్‌’’ (Hams) అనే మరో నగరంలో మొదలయ్యింది. ఆ నగరాన్ని ‘విప్లవానికి గుండెకాయ’ అంటారు..’’

‘‘ఎందుకు’’ అని నేను ప్రశ్నించబోతుండగానే తనే చెప్పడం మొదలుపెట్టాడు.

‘‘అన్ని నగరాలను ఆర్మీ తన ఆధీనంలోకి తెచ్చుకోగల్గింది, ఆ ఒక్క నగరాన్ని తప్ప. ఆ నగరం మీద దాడి జరుగుతున్నప్పుడు మిగిలిన అన్ని నగరాల ప్రజలు ‘ఓ హాంస్‌ మా ప్రాణమున్నంత వరకు మీము నీతోనే వుంటామని’ నినదించారు. కాని అస్సాద్‌ ఆర్మీ ఆ నగరాన్ని ఒక ఇంచు కూడ వడలకుండ కాల్చుకుంటూ పోయి రెబల్స్‌ను ఒక కార్నర్‌ చేసి తర్వాత వాళ్ళతో ఆ నగరం వదిలిపెట్టి ఆయుధాలతో సహా పోయేలా ఒక ఒప్పందం కుదుర్చుకొని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దక్షిణ సిరియాలో అణిచివేస్తె, ఉద్యమం ఉత్తరంలో మొదలయ్యింది. మా పట్టణం అలెప్పోలో ఉధృతమయ్యింది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉద్యమం ఒక నగరం తర్వాత మరో నగరం వ్యాపించడం మూలంగ ప్రభుత్వానికి కూడ ఒకదాని తర్వాత మరోదాన్ని అణిచివేయడం సులభం అయ్యింది. ఇది కూడ సిరియా విప్లవానికి మరో బలహీనత’’

తను చెబుతుండగానె ‘‘ఒక నగరం తర్వాత మరో నగరంలో ఉద్యమం ఊపందుకోవడం ఎదైనా ఎత్తుగడలో భాగమా?’’ అని ప్రశ్నించ.

‘‘కాదు, ఎలాంటి ఎత్తుగడ లేకపోవడమే కారణం. ప్రజలకు రాజ్య వ్యవస్థను మార్చాలనె ఆకాంక్ష వుంది. కాని సరైన నాయకత్వం లేదు. అందుకే బైటి శక్తుల మద్దతు ఎక్కడ దొరికితె అక్కడ ఉద్యమం మొదలుపెట్టినరు’’ అని వివరించిండు.

‘‘అలెప్పో నగరంలో ఉద్యమం మొదలయ్యిందని చెప్పావు కదా, అక్కడ యుద్ధ పరిస్థితులకు సంబంధించి నీ అనుభవాలు ఎమైన చెప్పగలవా?’’ అని అడిగాను.

‘‘మా ఊరు చాలా అందమయ్యింది. ఎంతో ప్రశాంతంగ ఉండేది. ఒక్కసారి ‘అలెప్పో యుద్ధానికి ముందు, తర్వాత’ అని గూగుల్‌ ల్లో కొట్టిచూడు. నేను చెబుతున్నది ఏమిటో అర్థమవుతది. యుద్ధం ఎంత ధ్వంసం చేస్తదో అర్థమవుతది. అలిప్పో ను తూర్పు, పడమరగా విభజిస్తే తూర్పున ఎక్కువగా పేదలు వుంటారు, పడమర కొంత ధనిక కుటుంబాలు వుంటాయి. రెబల్స్‌ గ్రామాల నుండి సహజంగానే తూర్పు నుండి మా పట్టణంలోకి ప్రవేశించారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు పేదల మద్దతు దొరుకుతుంది కాబట్టి. కాని ప్రభుత్వ బలగాలు రెబల్స్‌ను ఎదుర్కొనడానికి పడమర దిశనుండి పట్టణాన్ని తమ ఆధీనం చేసుకున్నాయి. ఇక తూర్పు, పడమరల మధ్య యుద్ధం మొదలయ్యింది. సరిహద్దు రేఖలు పట్టణం మధ్యకి వచ్చాయి. ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకొనే పరిస్థితి వచ్చింది. బడులు, హాస్పిటల్స్‌, యూనివర్సిటీస్‌ అని మినహాయింపు ఏమి లేదు. ఎక్కడ పడితే అక్కడ బాంబుల మోతే.’’

‘‘ప్రభుత్వం, రెబల్స్‌ మధ్య యుద్ధాన్ని అర్థం చేసుకోవడం తేలికగానే వుంది. కాని ఈ యుద్ధంలోకి ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐస్‌) జిహాదీ గ్రూప్స్‌ ఎలా వచ్చాయి’’ అని నాకున్న గందరగోళాన్ని తీర్చమని అడిగిన.

‘‘అది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఎందుకంటే దానికి అనేక సమాధానాలు వున్నాయి. స్థానికంగ బాగ పాపులర్‌ అయిన వాదన ఏమంటే, అక్కడ రెండు రకాల ఐస్‌ తీవ్రవాదులు వున్నారు. ఒకటి అంతర్గత ఐస్‌ గ్రూప్‌. ఆశ్చర్యంగ వుండొచ్చు కాని దీనిని ఏర్పాటు చేసింది అస్సాద్‌ ప్రభుత్వమే. గత 15-20 ఏండ్లుగా తమ జైళ్ళలో వున్న అతి క్రూర నేరచరిత్ర వున్న వాళ్ళకు ట్రైనింగ్‌, ఆయుధాలు ఇచ్చి ఒక్కసారిగా విడుదల చేశాడు. వాళ్ళు బయటకి వచ్చి రెబల్స్‌ కు మద్దతుగా రాజ్యంతో పోరాటం చేస్తమని ప్రకటించి విచ్చలవిడి హింసను కొనసాగించారు. దానిని చూపి రాజ్యం మొత్తం రెబల్స్‌ ను అందరిని తుదిముట్టించే చట్టబద్ధత పొందాలనుకుంది. మీము టెర్రరిస్టులతో పోరాటం చేస్తున్నమని ప్రపంచానికి చెప్పాలని అనుకున్నాడు. అలా నమ్మబల్కడంలో కొంతవరకు ‘విజయం’ సాధించాడు కూడ. కాని త్వరగానే ఆ కుట్ర బయట పడిపోయింది. ఇక మరొక ఐస్‌ గ్రూపు ఇరాక్‌, అఫ్ఘనిస్థాన్‌ నుండి దేశంలోకి తన జిహాదీ అజెండతో వచ్చింది. ముందు కొంతకాలం అస్సాద్‌ రాజ్యంతో పోరాడారు, కాని అతి త్వరలోనే తమ ప్రయోజనాల కోసం ప్రయత్నం మొదలు పెట్టారు. తమ రహస్య అజెండ (ఇస్లామిక్‌ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం) కోసమే సిరియన్‌ అంతర్యుద్ధాన్ని ఒక సాధనంగ వాడుకున్నారు. వాళ్ళకి ప్రజల ప్రయోజనాలతో పనిలేదు.’’

ఇలా చెబుతూ పోతుంటె కొంత క్లారిటి కోసం ‘‘ఐస్‌ గ్రూప్స్‌ మొదటగ రెబల్స్‌తో కలిసి పనిచేశాయా?’’ అని అడిగ.

దానికి జవాబుగా ‘‘అవును మొదట రెబల్స్‌కు సహాయం చేయడానికి, అస్సాద్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికే వచ్చామని చెబితె ప్రజలు కూడ నమ్మారు. వాళ్ళతో కలిసి పని చేశారు కూడ. ఈ క్రమంలో రెబల్స్‌లో కొంత మందికి డబ్బు ఆశ పెట్టి తమలో కలుపుకున్నరు, మరికొందరిని బలవంతంగ తమతో తీసుకొని పోయారు. మొత్తంగా వాళ్ళు బలమైన శక్తిగా మారారు. ఐస్‌ గ్రూప్‌ చాలా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. రెబల్స్‌ సంఖ్య, ప్రభావం బాగా తగ్గిపోయింది. ఇక అప్పటినుండి ఐస్‌ గ్రూప్‌, రెబల్స్‌, ప్రభుత్వం ఒకరిమీద ఒకరు దాడి చేసుకోవడం మొదలు పెట్టారు. కాని రెబల్స్‌ బలం బాగా తగ్గిపోయింది’’ అని చెప్పాడు.

‘‘సరే ఇదంతా అంతర్గతంగ జరుగున్న విషయం. మరి బయటి నుండి యుద్ధంలో భాగమైన రష్యా, అమెరికా సంగతేమిటి’’ అని అడిగాను.

‘‘రష్యా, అమెరికా రెండు కూడ మొదటి నుండి బహిరంగంగ, కోవర్ట్‌ ఆపరేషన్స్‌ ద్వార యుద్ధంలో భాగమవుతూనే వున్నాయి. వాటి ప్రయోజనాలు వాటికున్నాయి. రష్యాకు ప్రధానంగా సిరియాలో వున్న తన నావికా స్థావరాలు (naval base) చాలా ప్రధానమైనవి. వాటి ద్వారానే మొత్తం మెడిటరేనియన్‌ సముద్రం మీద పట్టు ఉంచు కోగలదు. అంతేకాదు, యుద్ధం పడిపోయిన ఆయిల్‌ ధరలను పెంచింది. ఆయుధాలకు గిరాకీ పెరిగింది. వీటికి తోడు తమ సైనిక శక్తిని ప్రపంచానికి చూపించుకునే అవకాశం రష్యాకు దొరికింది. తన దేశంలో ఉన్న అనేక సమస్యలను ఈ యుద్ధం ద్వార ప్రజల దృష్టి నుండి మళ్లించ గల్గింది. ముఖ్యంగా తన దేశంలో పది శాతం వున్న ముస్లింల అణిచివేయడానికి కూడ ఈ యుద్ధం రష్యాకు ఉపయోగపడిరది.’’

తను మాట్లాడం ఆపగానె ‘‘మరి అమెరికా సంగతేంటి?’’ అని మళ్ళీ నా ప్రశ్నను కొనసాగించిన.

తను వెంటనే ‘‘అమెరికాకు ఏ యుద్ధమైన లాభసాటి బేరమే కదా’’ అని నవ్వేసి ఇంకా కొనసాగించాడు. ‘‘అమెరికా ప్రయోజనాలు, ఇజ్రాయిల్‌ ప్రయోజనాలు వేరేగా వుండే అవకాశం లేదు. ఇజ్రాయిల్‌కి ఇరాన్‌కి పోటి వుంది. ఇరాన్‌ అస్సాద్‌కి సహకరిస్తుంది. కాబట్టి ఇజ్రాయిల్‌, అమెరికా రెబల్స్‌ కి సహాయం చేశారు. సైనిక ట్రైనింగ్‌, అయుధ సరఫరా కూడ చేశారు. ఎప్పుడైతే ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూపులు రంగంలోకి వచ్చాయో అప్పటి నుండి మొత్తం యుద్ధ రూపమే మారిపోయింది. అమెరికా ప్రయోజనాలు తెలువాలంటే సిరియాలో అది కంట్రోల్‌ చేస్తున్న ప్రాంతాలను చూడాలి. మొత్తం ఆయిల్‌, నీటి వనరులు ఉన్న ప్రాంతం మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇప్పుడు సిరియా ప్రజలకు మిగిలింది ఎవరి బాంబులకు బలి అవుతమా.. అని ఎదురుచూడడమే’’ అంటూ విషాదంగ ముగించిండు.

కాసింత టాపిక్‌ మార్చడం కోసం తన వ్యక్తిగత అనుభవాలు తెలుసుకుందామని ‘‘ఇంత యుద్ధంలో మెడిసిన్‌ ఎట్లా పూర్తిచేసినవ్‌, ఇక్కడి వరకు ఎట్లా వచ్చినవ్‌’’ అని అడిగిన.

కొంత చిరునవ్వుతో ‘‘అదో పెద్ద కథ. క్లుప్తంగ చెప్త’’ అంటూ మొదలు పెట్టిండు.
‘‘మా అమ్మ, నాన్న ఇద్దరు డాక్టర్లే. ఇంట్లో వున్న వాతావరణం మూలంగ నేను కూడ అదే వృత్తిని ఎంచుకున్నాను. సరిగ్గా నేను మొదటి సంవత్సరంలోకి అడుగుపెట్టగానె యుద్ధం మొదలయ్యింది. ఇక అప్పటి వరకు మంచిగ వున్న జీవితాలు తలకిందులయినయి. దేనికి గ్యారెంటీ లేదు. జీవితానికి భద్రత లేదు. నీళ్ళు, ఆహారం కూడ రోజు దొరికే పరిస్థితి లేదు. ఎప్పుడు బాంబుల మోత. ఆకాశాన్ని చూద్దామంటె భయమేసేది. ఇండ్లన్నీ వరుసగా కూల్చేసిండ్రు. ప్రతిరోజు శిథిóలాల కింద శవాల వెతుకులాటే. ఎవ్వరు ఎలా చస్తారో తెలియదు, కాబట్టి బతికున్నంత వరకైన ఒకరికొకరం తోడుగా వుండాలనుకునే వాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో బ్రతకడం కష్టమని టర్కీలో వున్న మా మామ దగ్గర కొన్ని రోజులు వుందామని అందరం (నేను, అమ్మ, నాన, తమ్ముడు, చెల్లి) వెళ్ళినం. అక్కడ ఉన్న ఆరు నెలలు బాగా చదివిన. కాని పరీక్షలు రాయడానికి నేను తమ్ముడు నాన్నతో కలిసి సిరియా వచ్చాము.

నా మొదటి పరీక్ష రోజు బాగా గుర్తుంది, జనవరి 15, 2013. ఎంతో శ్రద్ధ్దగా పరీక్ష రాస్తుంటె పై నుండి విమానాలు పోతున్న శబ్దం వినిపిస్తావుంది. అది మామూలే అనుకున్నాను. కాని కొద్దిసేపటికే విపరీతమైన బాంబుల శబ్దాలతో మా యూనివర్సిటీ అంతా మారుమోగింది. ఆ దాడిలో దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు చనిపోయారు, కొన్ని వందల మంది గాయపడ్డారు. బైటి మీడియా మాత్రం వంద మందే చనిపోయారని చెప్పింది. మా పరీక్ష హాల్‌ చాలా దూరంలో వున్నా కూడ, మా హాల్‌ అద్దాలు అన్నీ పగిలి మా మీద పడ్డాయి. అయినా కూడ అందరం పరీక్ష పూర్తిచేశాము.’’

నాకు ఆశ్చర్యం అనిపించి ‘‘బాంబులు పడుతుంటే పరీక్ష ఎలా రాయగలిగారు’’ అని అడిగాను.

‘‘బాంబులు కొత్త అయితే భయపడే వాళ్ళం. అంతా దేవుని దయ అనుకొని అలాగే వుండిపోయాము. ఇంకేం చేయగలం?’’ అని నిస్సహాయతను వెలబుచ్చాడు. తనే సమాధానం పూర్తి చెయ్యాలన్నట్లు ‘‘ఇక మాకు యుద్ధం జీవితంలో భాగమయ్యింది. భయం పోయింది కాని జీవితం మీద ఆశ మాత్రం పోలేదు. ఈ యుద్ధం విధించే పరిమితులను ఇక్కడే వుండి జయించలేను, కాబట్టి బయటికి ఎక్కడైన పోవాలని నిర్ణయించుకున్న. మొదట జర్మనీ పోదామనుకున్న ఎందుకంటె అమెరికాతో పోల్చుకుంటె అక్కడ వైద్య వృత్తిలోకి ప్రవేశించడం కాస్త సులభం. కాని, జర్మన్‌ భాష నేర్చుకోవాలి. పట్టుపట్టి ఆరు నెలల్లో జర్మని భాషా పరీక్ష పాస్‌ అయిపోయిన.

నేను మొదటి నుండి అన్ని తరగతులలో మొదటి స్థానంలో వుండేవాడిని. చెబితే నవ్వుతావేమో కాని పదో తరగతిలో నాకు వచ్చిన మార్కులకు అస్సాద్‌ చేతుల మీదుగా మెడల్‌ కూడ తీసుకున్నాను. నా చదువుకు మొత్తం ఖర్చు అతనే భరిస్తనన్నాడు. కాని అదేమి జరగలేదు. ఆ సంగతి అట్లావుంచితే, నా మిత్రులందరు అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యమని బలవంత పెట్టారు. కాని నాకు తెలుసు అక్కడికి పోవాలంటె ఎంత కష్టమో. కాని ఒక్కటి మాత్రం తెలుసు, ఏది కూడ ఈ యుద్ధంలో బ్రతకడం కంటే ఎక్కువ కష్టం కాదు. దాని కోసం ప్రయత్నం మొదలు పెట్టిన.’’

అతను అలా చెబుతుంటేనే నాకు అమెరికాకు వచ్చి వైద్య వృత్తిలో వ్రవేశం పొందాలంటె ఎంత శ్రమ అవసరమో ఆలోచనలోకి వస్తూనే వుంది. తను చెబుతూ ‘‘నిజమే అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరీక్షలకు ప్రిపేర్‌ కావడం ఊహకు అందని విషయమే. యుద్ధభూమిలో కూర్చొని ప్రపంచంలో అవతలి వైపున్న వాళ్ళతో జ్ఞానయుద్ధం చెయ్యాలి. పోటీ కదా!’’ అంటూ నవ్వేశాడు.

తను మళ్ళీ కొనసాగిస్తూ ‘‘చదవడానికి పుస్తకాలైతె వున్నాయి కాని, రాత్రి అయితే కరెంట్‌ లేదు. అందుకోసమని, కొన్నిసార్లు క్యాండిల్స్‌, మరికొన్ని సార్లు పగటి పూట జనరేటర్‌ వున్న మా బంధువు ఇంటికి వెళ్ళి నా ఫోన్‌ మొత్తం చార్జింగ్‌ పెట్టుకొని దాని లైట్‌ వెలుతురులో రాత్రి చదివేవాడ్ని. ఇంకా చెబితే నమ్మలేరేమో కాని. నిజం. ఇంత చదువుతున్నా పరీక్ష అయ్యేవరకు బ్రతికే వుంటామనే నమ్మకం లేదు. అందుకే నేను మా తమ్ముడు ఒక నిర్ణయానికి వచ్చినం. అదేమంటె రాత్రి పడుకున్నప్పుడు ఇంటిమీద బాంబు పడితే అందరం నిద్రలోనె చనిపోతం. అలా ఎలాంటి పలకరింపు లేకుండ చావకూడదు. కాబట్టి నేను పడుకుంటె తమ్ముడు, వాడు పడుకుంటె నేను రాత్రంత మా కిటికి దగ్గర కూర్చొని ఆకాశం మీద నిఘా పెట్టేవాళ్ళం. ఒకవేళ ఏదైన బంబు వేయబడి ఇంటివైపు వస్తుంటె అందరం మేల్కొని ఒకరికి ఒకరం కౌగిలించుకొని వీడ్కోలు చెప్పుకుందాం అని అనుకొని ప్రతి రోజు అలాగే చేశాం. బాంబులకు కాపలా కదా పూర్తిగా మేల్కొని వుండాలి. అలా వుండి పరీక్ష రాస్తే మొత్తం ప్రపంచంలోనె ఎప్పుడు ఎవ్వరికి రానంత స్కోర్‌ నాకొచ్చింది’’ అంటూ అతను వెలిగిపోయే మొఖంతో చెప్తుంటె నేను మాత్రం పెద్ద షాక్‌ గురై అతను చెప్పేది వింటూనే తెలియకుండానే ‘‘ఇంకా’’ అనేసిన.

అతను మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు. ‘‘మంచి స్కోర్‌ అయితే వచ్చింది కాని అమెరికా వెళ్ళాలంటే వీసా కావాలి. ఇంకా రెండు పరీక్షలు రాయాలి. అన్నింటికంటె ముందు సిరియా నుండి బయటపడాలి. ఎందుకంటె 18 ఏండ్లు నిండాక ఏపని చేయకుండ లేదా చదువుకోకుండ వుంటె తప్పనిసరిగా మిలిటరీలో చేరాలి. ఆ యుద్ధ పరిస్థితుల్లో దాని అర్థం చావుకు సిద్ధం కావడమే. అందుకోసం నా మెడిసిన్‌ అయిపోగానే వెంటనే మళ్ళీ టర్కీలో వున్న మా మామ దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడ అమెరికన్‌ ఎంబసీలో సిరియన్లకు వీసా దొరకడం కష్టమని అందరు చెబితె, వీసా కోసమని సూడాన్‌ పోయిన. అక్కడ ఎంబసీలో నా అప్లికేషన్‌ తీసుకున్న ఆఫీసర్‌ ‘ఎందుకు అమెరికా వెళ్ళాలని అనుకుంటున్నవ్‌?’ అని అడిగి నేను సమాధానం మొదలు పెట్టకముందే వీసా రిజెక్ట్‌ చేస్తూ లెటర్‌ టైప్‌ చేయడం మొదలు పెట్టాడు. అయినా నేను ఎదో చెప్తుండగానే నా పాస్‌ పోర్ట్‌ వెనక్కి ఇచ్చేశాడు. అంతా ఇరవై సెకండ్లలోనే జరిగిపోయింది. పట్టరాని నిరాశ. కాని ఏదో విధంగా యుద్ధంతో నెలకొన్న పరిస్థితులను జయించాలని మరోసారి మనస్సులో అనుకున్న. టర్కీ వెళ్ళి జర్మనీకి ప్రయత్నం చేద్దామని అనుకొని బయలుదేరిన.

అయితే దారిలో నా బాధను తొలిగించుకోవడం కోసం ఫేస్‌ బుక్‌లో ఒక సిరియన్‌ గ్రూప్‌లో నాకు వచ్చిన స్కోర్‌, నా కలలు, నా వీసా తిరస్కరించబడిన పద్ధతి అంతా రాసిన. కొంత మనస్సు కుదుటపడిరది. తిరిగి టర్కీ వచ్చిన. నాకంటె అమ్మ చాలా బాధ పడిరది. కాని ఏమిచెయ్యగలం. అమ్మకు జర్మనీ పోవడానికి ప్రయత్నిస్త అని చెప్పి ఓదార్చిన. జర్మనీ కి అప్లై చేయడానికి సిద్ధం అవుతుండగానే ఫేస్‌ బుక్‌లో నేను పెట్టిన పోస్టింగ్‌ వైరల్‌ అయ్యింది. వందలాది మెసేజులు వచ్చాయి. అందులో మన ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న ఒక పెద్ద సిరియన్‌ డాక్టర్‌ ‘నా దగ్గరకు వచ్చి కొంత కాలం రీసర్చ్‌లో పనిచేస్తానంటె మళ్ళీ వీసాకు ప్రయత్నం చేయడానికి సహాయం చేస్తా’ అని మెస్సేజ్‌ పెట్టాడు. అతనే అన్ని కావాల్సిన డాక్యుమెంట్లు పంపిండు. ఒక అమెరికన్‌ సెనెటర్‌ నుండి లెటర్‌ కూడా తీసుకొని పంపిండు.

ఇన్ని చేస్తున్నా నాకు వీసా వస్తదనే నమ్మకం లేదు. అందుకే వాళ్ళకు చెప్పకుండనే జర్మనీ వీసాకి కూడ అప్లై చేసిన. అదృష్టం బాగుందేమో చివరికి అమెరికన్‌ వీసా వచ్చింది. రాగానే జర్మనీ వీసా అప్లికేషన్‌ వెనక్కి తీసుకున్న. ఇక అమెరికా పోదామని సిద్ధం అవుతుండగానే ప్రసిడిరట్‌ ట్రంప్‌ సిరియా మీద ట్రావల్‌ బ్యాన్‌ పెట్టిండు. మళ్ళీ భూమిలోకి కూరుకు పోయినట్లయ్యింది పరిస్థితి. వెనక్కి సిరియా పోలేను, పోతే మిలిటరీలో చేరాలి. టర్కీలో వుండలేను. ఎందుకంటె నేను విజిటర్‌ వీసా మీద వున్నాను. ఆరు నెలలు మించి వుంటె నేరం. దొరికితె జైల్లో పెడుతారు. జర్మనీ అవకాశం లేదు. అమెరికా తలుపులు మూసేసింది. ఇక చేసేది ఏమిలేదు. పిచ్చిగా ఇంటర్నెట్‌ లో అన్ని వార్తలు చదువుతున్నాను. ఎక్కడైనా అవకాశం వుందా అని.

రాత్రి రెండు అవుతుంది. అమెరికన్‌ వార్తలు చూస్తున్నాను. ఒక్కసారిగా బ్రేకింగ్‌ న్యూస్‌ నా మైండ్‌ను కుదిపేసింది. అక్కడి కోర్టు ట్రావల్‌ బ్యాన్‌ను కొట్టిపారేసిందని, వీసా వున్నవాళ్ళు దేశంలోకి రావచ్చని న్యూస్‌ ప్రజెంటర్‌ చెబుతున్నాడు. ఇక ఏమి ఆలోచించలె వెంటనే అమ్మని నిద్రలేపి ‘రేపు పొద్దున్నే అమెరికా వెళ్తున్న’ అని చెప్పిన. అమ్మ నాకు పిచ్చిపట్టింది అనుకుంది. భోరున ఏడ్చింది. మామ కూడ లేసివచ్చి వార్తలు విన్నాడు. ఏమి కాదులే అని అమ్మని సముదాయించిండు. వెంటనే ఆన్‌ లైన్లో టికెట్‌ బుక్‌ చేసిండు. చేతికి అందిన బట్టలు, నా సర్టిఫికెట్లు అన్ని మామ దగ్గర వున్న ఒక పాత సూట్కేస్‌ల పెట్టుకొని ఇస్తాంబుల్‌కు వెంటనే బయలుదేరిన. మూడు గంటల ప్రయాణం. తెల్లవారె సరికి అక్కడి నుండి చికాగో వెళ్ళే విమానం దొరికించుకోవాలి. టైంకు పోతనా లేదా అని టెన్షన్‌ పట్టుకుంది. ఎలాగో అలా విమానం బయలుదేరటానికి ముప్పై నిమిషాలు వుండగా అక్కడికి చేరుకొని విమానం ఎక్కిన. ఆ విమానం ఎక్కిన చివరి ప్రయాణికుణ్ణి నేనె.’’ అంటూ నవ్వేశాడు.

నేను బుద్ధిగా చేతులు కట్టుకొని విద్యార్థిలాగా అతను చెప్పేదంతా వింటూనే ‘‘ఆ తర్వాత ఏమయ్యింది’’ అని అడిగా.

అతను చెప్తూ ‘‘నిజం చెప్పాలంటె నా మొత్తం జీవిత కాలంలో అత్యంత భయంకరమైన ఒత్తిడికి గురైంది భూమికి 30-40 వేల అడుగుల ఎత్తులో విమానంలో వున్నప్పుడె. ఎందుకంటె, కింద భూమి మీద ఏమి జరుగుతుందో తెలియదు. ఒకవేళ మళ్ళీ ట్రావల్‌ బ్యాన్‌ విధిస్తే నా పరిస్థితి ఏంటి? ఒకవేళ బ్యాన్‌ విధించకపోయిన అక్కడ వున్న ఇమిగ్రేషన్‌ ఆఫీసర్‌ నన్ను నిరాకరిస్తే ఏమి చేయాలి? ఈ ప్రశ్నలతో తల మొద్దుబారి పోయింది. అయినా చేసేది ఏమి లేదు. దాదాపు 12 గంటలు నరకం అనుభవించా. చికాగోలో విమానం ఆగగానే మొదట టీవీ వెతుక్కొనిపోయి వార్తలు చూశా. పరిస్థితిలో పెద్ద మార్పు ఏమి లేదని అర్థమయ్యింది. ఇక ఇమిగ్రేషన్‌ ఆఫీసర్‌ కు నమ్మకం కలిగేలా ఎలా చెప్పాలి అని ఆలోచిస్తు అక్కడ వున్న లైన్లో నిలబడ్డ. కొద్దిసేపటికే నా వంతు వచ్చింది. నా డాక్యుమెంట్స్‌ అతని చేతిలో పెట్టి ఊపిరి ఆపకుండ నాకు వచ్చిన అతిపెద్ద స్కోర్‌, నన్ను పిలిపిస్తున్న అతిపెద్ద డాక్టర్‌, అతిపెద్ద హాస్పిటల్‌ గురించి టకాటకా చెప్పేసిన. నా బలమంతా ‘‘పెద్ద’’ అనే పదం మీదనే పెట్టిన. అతను నవ్వుకొని నేను చెప్పినవన్నీ సరి చూసుకొని ‘‘వెల్‌ కం టు అమెరికా!’ అన్నాడు. అప్పుడుకాని నేను భూమి మీదనే నిలబడివున్నానని నమ్మలేదు.’’

అంతా విన్నాక ‘‘ఇప్పుడు ఇక్కడి నుండి సిరియాను చూస్తె ఏమనిపిస్తుంది’’ అని అడిగ.

‘‘చాలా బాధగా వుంటుంది, కాని కన్నీళ్లు రావడటం లేదు. ఎప్పుడో ఇంకిపోయాయి. నాకు కొంత సపోర్ట్‌ వుంది కాబట్టి ఇక్కడి వరకు రాగల్గినాను. నా మిత్రులందరు ఇంకా అక్కడే వున్నారు. నా కుటుంబాన్ని మళ్ళీ ఎప్పుడు చూస్తానో తెలియదు. మనుషులను, సంబంధాలను ధ్వంసం చేసే యుద్ధాలు మాత్రం ఆంతం కావాలని కోరుకుంటున్న’’ అని చెప్పడంతో ఎన్నో విషయాలను పంచుకున్నందుకు అతనికి థాంక్స్‌ చెప్పి మా సంభాషణను ముగించా.

(మే 2018 “అరుణతార”లో ప్రచురితమైన వ్యాసం. ఇప్పుడు సిరియాలో జరుతున్న రాజకీయ మార్పులకు ఒక సంక్షిప్త సందర్భాన్ని ఇస్తుందని మళ్లీ ఇక్కడ ప్రచురిస్తున్నాము.)

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

One thought on “సిరియా యుద్ధ గొంతుకతో ఒక సంభాషణ

  1. చాలా బాగుంది. జీవించే హక్కు కోసమే మనుషులు తన్నుకులాడే పరిస్థితులు హృదయవిదారకంగా,కొందరికి దారుణంగా రోజు రోజుకీ మారిపోతున్నాయి.

Leave a Reply