సాహిల్ రావాలి!

‘సాహిల్ వస్తాడు’ అని అఫ్సర్ అంటున్నాడు. ఎవరీ ‘సాహిల్’? కేవలం ఒక భారతీయ ముస్లిమా? సాహిల్ ఎక్కడికి వెళ్ళాడు? దేనికోసం వెళ్ళాడు? ఏమిటి అతని వివరాలు? వేల సంవత్సరాల పురాతన జీవనం నుండి ఆధునిక కాలపు పోకడల వరకు కాలగమనంలో అతని కుటుంబం, భాష, సంస్కృతి, అస్తిత్వాల పాత్ర ఏమిటి?

** ** **

మెజారిటీ పాఠకులకు అఫ్సర్ కవిగానే పరిచయం. అఫ్సర్ కవిత్వం చాలా విస్తృతమైనది. తన కవిత్వంలో అతను తన అంతరంగం నుండి బాహ్య సమాజం వరకు అనేకానేక అంశాలను అనిర్దిష్టత నుండి నిర్దిష్టత వరకు స్పష్టంగానూ, అస్పష్టంగానూ ప్రయాణించాడు. ఇంకా ప్రయాణం చేస్తూనే వున్నాడు. కానీ ఆయన ఒక సీరియస్ కథా రచయిత అని అతన్ని ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుసు. గత పాతికేళ్ళుగా ఆయన ఒక పాతిక కథలు రాసుంటాడేమో. అందులోని ఒక పదకొండు కథలు ఎంపిక చేసి ఇప్పుడు “సాహిల్ వస్తాడు” అనే కథా సంపుటిని వెలువరించాడు.

అఫ్సర్ లోని సాహితీకారుడికున్న సీరియస్ కోణం ఆయనలోని కథకుడు. సాధారణంగా కవులందరూ పెద్దగా కథలు రాయరు. ఎందుకంటే కవిత్వంలో వున్న కళాత్మక స్వేచ్ఛ కథా రచనలో వుండదు. కవిత్వం నాకర్థంకావటం లేదని ఏ పాఠకుడైనా అంటే కవి అతడిని జాలిగా చూసే హక్కుని కలిగి వుంటాడు. కవి ఏం చెప్పైనా తప్పించుకోగలడు. నెపాన్ని కాసేపు పాఠకుడి వెనకబాటుతనం మీదకి తోసేసి చిర్నవ్వగలడు. కానీ కథ విషయంలో అతనికి ఆ సౌలభ్యం వుండదు. కథకైనా కవిత్వానికైనా జీవితం, అది అందించిన భావోద్వేగాలే ప్రధాన భూమిక అయినా కవిత్వంలో కంటే కథల్లో జీవిత్యం తాలూకు రక్త మాంసాల స్పర్శ మరింత స్పష్టంగా వుంటుంది. కవిత్వం చదవటంలో వున్న మొహమాటం పాఠకుడికి కథలు చదవటంలో వుండదు. ఇక్కడ ఏ మేధో దేవతావస్త్రాలకి అవకాశం వుండదు. ఎంత గొప్ప మేధస్సున్న కథకుడైనా పాఠకుడిని పూర్తిగా విశ్వాసంలోకి తీసుకొని రాయకపోతే ఆ రాయటమే ఒక నిష్ఫల కసరత్తుగా మిగిలిపోతుంది. కవిత్వం రాయటంలోని కళాత్మక స్వేచ్ఛకి అలవాటుపడ్డ వారు కనుక సాధారణంగా కవులు (నాతో సహా) కథల జోలికి వెళ్ళరు. అఫ్సర్, విమల, కొండేపూడి నిర్మల, హనీఫ్ వంటి కవులుగా పేరొందినవారు కొంతమంది మాత్రం కథలు కూడా రాసే సాహసం చేస్తుంటారు. సఫలం అవుతుంటారు. అఫ్సర్ కథలు అప్పుడప్పుడూ చదువుతూనే వున్నా అతనివి ఇన్ని కథలు ఒకేసారి చదవటం ఒక గొప్ప అనుభూతిని, ఒక సాహితీకారుడిగా అతని పట్ల వున్న గౌరవాన్ని మరింత ఇనుమడింప చేసింది.

“సాహిల్ వస్తాడు”లో వున్న కథల్లో రెండు కథల మినహా మిగతా తొమ్మిది కథలు తెలుగు సమాజంలోని ముస్లిం అస్తిత్వం ఆధారంగా రాసిన కథలే. ముస్లింలందరూ సాధారణ భారతీయులే అయినప్పుడు ఏమిటి వారి ప్రత్యేక అస్తిత్వం అనే ప్రశ్న వస్తుంది. ఒక మైనారిటీ మతం, వేరే భాష, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, ఆ ప్రత్యేక సంస్కృతిలోని కుటుంబ బంధాలు మాత్రమే వారి అస్తిత్వాన్ని ప్రత్యేకం చేయవు. మెజారిటీ మతం మెజారిటేరియనిజం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నప్పుడు మైనారిటీల అస్తిత్వంలోని ఈ భూమ్మీద నిలబడగల సాధికారత, స్వంతదనం ప్రశ్నించబడతాయి. అలా ప్రశ్నించబడిన అస్తిత్వం తాలూకు నొప్పిని, ఘర్షణని వెల్లడి చేసే కథలే ఇవి. లోతుగా చర్చించుకుంటే హిందూత్వలా ఇస్లాం స్థానిక మతం కాదు. అది అంతర్జాతీయ మతం. ప్రపంచవ్యాప్తంగా భిన్న భౌగోళిక ప్రాంతాల్లో, రాజకీయ వ్యవస్థల్లో వున్న మతం. అగ్ర రాజ్యాల కుయుక్తులకి అనుగుణంగా సమిధగా మారిన మతం ఇస్లాం. అత్యంత సంపన్న గల్ఫ్ దేశాలు, అత్యంత నిరుపేద ఆఫ్రికన్ దేశాల్లోను ప్రజలు అనుసరిస్తున్న మతం ఇస్లాం. ప్రపంచాన్నిశాసించే పెట్రో డాలర్ ప్రభావాలకి ఎక్కువగా గురైన మతం ఇస్లాం. అందుకే కొన్ని దేశాల్లో పెట్రో డాలర్ కోసం జరిగే ఘర్షణల ఫలితమే అంతర్జాతీయ టెర్రరిజం.

ప్రపంచ రాజకీయాల ప్రభావం మన దేశం మీద కూడా పడతాయి. ప్రపంచంలో ఎక్కడ ఇస్లాం పేరిట ఏ ఘాతుకం జరిగినా అది ఇక్కడ గొడుగులు బాగు చేసుకు బతికే ముస్తఫా మీదనో, పూలమ్ముకునే మస్తాన్ మీదనో, మాంసం కొట్టు నడుక్పుకునే ఇబ్రహీం మీదనో పడొచ్చు. దేశంలోనో ఇస్లాం పేరిట ఏ దారుణ కాండ జరిగినా ప్రతి ముస్లీం దానికి సంజాయిషీ ఇవ్వాలన్నట్లో లేదా నిందితుడిగానో చూడబడే సంస్కృతి ఒకటి విపరీతింగా అభివృద్ధి చెందింది. అసలు ఆ మతమే ఒక విధ్వంసక మతంగా, ఆ మతాన్ని అనుసరించే వాళ్ళు ఉన్మాదులుగా చూడబడుతున్నది. బాబ్రీ మశీదు విధ్వంసానంతరం ముస్లింల అస్తిత్వంలోకి అభద్రత కూడా ఒకటి ప్రవేశించింది. అంతకుముందు లేనంత ఛాందసాన్ని ఆ మతంలోని వారు అలవరుచుకోవటం జరిగింది. ఆ రకంగా వాళ్ళు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది వారి సామాజిక సంబంధాల మీదనే కాదు, కుటుంబ సంబంధాల మీద కూడా ప్రభావం చూపిస్తున్నది.

అఫ్సర్ కథలు సరిగ్గా ఈ సంక్షుభిత సందర్భాన్నే పట్టుకున్నాయి. అయితే ఇవి కేవలం ముస్లిం అస్తిత్వ ప్రకటనని ఉద్దేశించిన కథలు కావు. ఇంటా, బైటా ముస్లిం అస్తిత్వంలోని నొప్పిని, వేదనని వర్ణించిన, పంచిన కథలు. ఈ సంపుటిలోని కథలలో ప్రధానంగా పేద, దిగువ మధ్యతరగతి ముస్లిం జీవన విధానంలో భాగమైన నమ్మకాలు, ఆచార వ్యవహారాలు, భాష, నుడికారం, ఇళ్ళ నిర్మాణం, కుటుంబ నిర్మాణం, అందులోని బంధాలు, వారి మధ్య ఆప్యాయతలు, ఘర్షణలు, ఆహార్యం, వారి ఆర్థిక పరిస్థితులు, గ్రామీణ జీవితం, పట్టణాలకు వలసలు, వారి వృత్తులు, మిగతా సమాజంతో వారి ఇంటరాక్షన్… అన్నీ గాఢంగా ప్రతిఫలిస్తాయి.

ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఒక దేవతో లేదా ఒక దేవుడినో వెలియింప చేయటం, ద్వారా ఒక రాజకీయ పలుకుబడిని, ఆర్ధిక లాభాన్ని సంపాదించుకోవటం మనం చూస్తూనే వుంటాం. అలా తన ఇంటి ముందే కొత్తగా దేవుడు వెలిసాడన్న నెపంతో తన కుటుంబ జీవితాన్ని అతలాకుతలం చేయటం మీద, తన హక్కుల కోసం పోరాడిన కథ “గోరీమా”ది. ఈ సంపుటిలోని పెద్ద కథ ఇది. మెజారిటీ “బ్రూట్ ఫోర్స్” తో జరిగిన పోరాటంలో ఓడిపోయినా గోరీమా చివరికి బిచ్చం ఎత్తుకునే దశలో కూడా తనకి వేసిన బిచ్చాన్ని నిలబెట్టుకోవాలనే విఫల యత్నం చేయటం మెలి పెడుతుంది. ఈ కథలో ఆధిపత్య రాజకీయాల అమానవీయ ముఖాన్ని, బాధితుల దైన్యాన్ని ప్రభావవంతంగా చూపించటం జరిగింది. జీవన గమనానికి అవసరమైన చిన్న చిన్న ఆస్తుల కోసం ఘర్షణ పడే కుటుంబ సంబంధాలు కూడా కనబడతాయి. మెజారిటేరియనిజం నెత్తి మీద కత్తిలా వేలాడే వేలాడి మత వైషమ్యాలు ఏ విధంగా పసి హృదయాల్ని కలుషితం చేస్తుందో, పెద్దల సంకుచిత బుద్ధి ఎంత నిర్దాక్షిణ్యంగా తయారు అవుతుందో “చెంకీ పూల గుర్రం”, “తెలంగీ పత్తా” కథల్లో స్పష్టమవుతుంది. “సాహిల్ వస్తాడు” అన్న టైటిల్ కథ విస్తరిస్తున్న అర్బన్ నక్సలైట్ అనే కాన్సెప్ట్ ని నగ్నంగా చూపించేది. రాజ్యాన్ని ప్రశ్నించేవాడు మైనారిటీ వాడైతే ఆ రిస్క్ మరింత పెద్దది. ముస్లిం కుటుంబాల్లోని అంతర్గత ప్రజాస్వామిక రాహిత్యాన్ని ఎత్తి చూపించే కథలు కూడా వున్నాయి. అందులో “సహేలి”, “ఛోటీ దునియా” ముఖ్యమైనవి.

ఈ సంపుటిలో నాకు అమితంగా నచ్చిన కథల్లో “సహేలి”, “అడవి”, “తెలంగీ పత్తా” ముఖ్యమైనవి. అడవి నాన్-ముస్లిం కథ. నిరుపేద గ్రామీణులు కేవలం బతకటం కోసం వచ్చినప్పుడు వారి జీవన సంక్షోభాన్ని కళ్ళకు కట్టినట్లు రాసిన కథ “అడవి” మనం పట్టించుకోవాలే కానీ చిరునామాల్లేని నిరుపేద జీవితాలు ఏ మల్టీప్లెక్సుల ముందున్న చెట్టు కింద కూడా కనబడొచ్చు. రాత్రికి రాత్రి ఆ కుటుంబాలు ఎటో కొట్టుకుపోవచ్చు. చెట్టుకొకరు పుట్టకొకరు కూడా కావొచ్చు. అడవిలో జంతువుల ఆటవిక న్యాయానికి ఒక హేతుబద్ధత వుండొచ్చు. కానీ ఆ ఆటవిక న్యాయం నాగరికుడైన మనిషి జీవితంలో వుండటం అమానుషం. అఫ్సర్ కథల్లో కేవలం మైనారిటీ అస్తిత్వం మాత్రమే లేదు. ఆయన ఆ పరిమితిని దాటి కులాన్ని కూడా స్పర్శించాడు. అది “ధేడీ”లో కనబడుతుంది. గడ్డ కట్టిన ఛాందస కుటుంబ సంబంధాలు కలగచేసే ఉక్కపోత “సహేలి”లో కనిపిస్తుంది. అక్క చెల్లెళ్ళలో ఒకరు పెళ్ళయ్యాక కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ పోగా, మరొకరు లెస్బియన్ అవటం కథాంశం. అమెరికా పోయినా ఒక ముస్లీం పేరు ఉగ్రవాదానికి కజిన్ గా చూసే అవమానాన్ని ఎదుర్కొన్నవాడు కదా కథకుడు అక్కడి బాధల్ని వివరంగా రాసిన కథ “ఛోటీ దునియా” ముస్లిం జీవన విధానంలోని మార్మిక ఆధ్యాత్మికతని ప్రతిఫలించిన కథ “ముస్తఫా మరణం”.

అఫ్సర్ కథన శైలి భిన్నంగా వుంటుంది. అనేక కథల్లో ప్రధాన పాత్ర ఒక షాక్ కి గురైన సందర్భం నుండి మొదలవుతుంది. అక్కడి నుండి కథంతా ఒక ప్రయాణంలా జరుగుతుంటుంది. కథకుడు తన వేలు పట్టుకోమని పాఠకుడికి చేయందించినట్లుంటుంది. ఒక్కో పాత్ర పరిచయం సమగ్రంగా వుండి ఆ పాత్ర ప్రవర్తన పట్ల పాఠకుదికి అవగాహన కల్పిస్తాడు. అనేక సందర్భాల్లో ప్రధాన పాత్రల అంతర్మధనం ఒక కవితాత్మక ప్రవాహంలా తోస్తుంది. పాత్రల అంతరంగా ఆవిష్కరణ అఫ్సర్ కథన బలంగా చెప్పొచ్చు.

ఈ సంపుటిలోని ప్రతి కథలో ఒక సంవేదన అంతర్లీనంగా ప్రవహిస్తుంటుంది. ఒక గాయపడిన మనిషి ఘోష వినపడుతుంటుంది. పరిస్థితిని అర్థం చేసుకున్నా నిస్సహాయంగా నిలిచిపోయే వ్యక్తులుంటారు. ఎంతటి కఠోర పరిస్థితులైనప్పటికీ స్పష్టంగా ఆలోచిస్తూ మద్దతుగా నిలిచే స్నేహితులుంటారు. ఒక మానవీయ సంఘర్షణ ప్రధానంగా సాగిన కథలు ఇవి.

** ** **

అఫ్సర్ గొప్ప కవే కావొచ్చు. కానీ అంతకు మించిన కథకుడని “సాహిల్ వస్తాడు” నిరూపిస్తుంది. చదవండి.

(“సాహిల్ వస్తాడు” కథా సంపుటి. రచన: అఫ్సర్. ప్రచురణ “ఛాయ”, హైదరాబాద్. వెల రూ. 180/-. ప్రతులకు: 9848023384.)

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

Leave a Reply