వాళ్ళకి పేరు ఉంటుంది
కానీ పేరు కోసం వాళ్ళు బతకరు
నిజానికి సమూహ చలనంలో
వాళ్ళ నామవాచకం మాయమైపోతుంది
జీవితమనే వ్యాకరణానికి
కర్మ అనే కార్యాకరణాన్ని ఆపాదిస్తారు వాళ్ళు
వాళ్ళు ఒట్టి మనుషులుగా
మిగిలిపోతారు
జనపధంలో
జానపదంలా కలిసిపోతారు
పిడికెడు మట్టి లాంటి జ్ఞాపకాల్ని
నెత్తుటి పరుగులాంటి నడతనీ
వారి గుర్తులు మిగులుతాయి
చౌరస్తాల్లోనో
నగర కూడళ్ళల్లో
గొంతు పగిలిలే ఇచ్చిన నినాదాల్నీ
ఒకే ఒక్క ఎగశ్వాసతో హృదయం లోకి
ఇంకిపోతుంది మానవుల మీద
వాళ్ళు పెంచుకున్నప్రేమ
మనం ఇక ఆ ప్రేమ పేరుతో గుర్తించబడతాం
వాళ్ళ గుర్తులుగా మిగులుతాం
జీవిగా పుట్టడం దగ్గరే
వాళ్ళ నడక ఆగిపోదు
మానవులుగా బతికి
జనహితులుగా చనిపోతారు
అలాంటి వారికి పేరుతో పనేముందీ
ఊరుతో పనేముంది ఉద్యోగంతో పనేముంది
వాళ్ళ పని పదుగురి కోసం
వయసుని కాలం కొలిమిలో
కాల్చుకుంటూ పోతారు
ఆ క్రమంలో
వాళ్ళ త్యాగాలు మన చేతిలో
ఆయుధాలౌతాయి
మార్పు కోసం వాళ్ళు చేసిన కష్టం
మన మధ్యే కాంతిలా పరుచుకొని ఉంటుంది
వాళ్ళు ఒదిలి వెళ్ళిన దరుల ఇరువైపులా
ఉద్యమ నడకలో మనుషుల బారులా
చెట్లు నిలబడి ఉంటాయి
దారి పొడుగుతా వాళ్ళ నీడని ప్రసరిస్తూ ఉంటాయి
ఇక పేరెందుకూ మనకు
మనుషుల మీద ప్రేమని వారిలాగా
మానులుగా పెంచుదాం
చల్లదనం ఒక్కటే
ఈ లోకంలో మిగిలేలా
జీవిద్దాం
మన జీవితంలో
ఇంకొకరు జీవితాన్ని వెదుక్కునే
సార్థక సాధకులమౌదాం
వారిలా
జన ప్రేమకులమౌదాం
సార్థకతకి నిలువెత్తు నిదర్శనం వాళ్లు. కవి దృక్పథాన్ని ప్రకటించే కవితలు నేటి అవసరం. చాలా మంది సామాజికత ముసుగు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి సబ్జెక్ట్ కు దూరం జరుగుతున్నారు. కనీసం యువకవులైనా ధీరత్వం ప్రదర్శించాలి. కవికి అభినందనలు.