‘సమ్మె’ కథ నేపథ్యం

పేరుకు పెట్టుబడిదారి విధానమైనా సింగరేణిలో 1977 కన్నాముందు ఇటు కార్మికుల్లోనూ, అటు యాజమాన్యం ప్రతినిధులైనా అధికారుల్లోనూ భూస్వామిక భావజాలం ఆచరణ ఉండేది. సింగరేణికి చుట్టుపక్కల ఊళ్లల్లోని దొరలే కార్మిక ప్రాంతాల్లో గుండాలను పోషించేవారు. కార్మిక ప్రాంతంలోని వ్యాపారాన్నంతా అజమాయిషీ చేసేవారు. కార్మిక సంఘాల నాయకులుగా దొరలే చెలామణీ అయ్యేవారు. సింగరేణి విస్తరించి ఉన్న ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్లు, ఖమ్మం జిల్లాలలోని పేద దళితులేక కాకుండా వ్యవసాయం కుప్పకూలిన బహుజనులు, అగ్రకులాలు కార్మికులుగా సింగరేణిలో చేరేవారు. దాదాపు లక్షకు పైగా కార్మికులు పనిచేసేవారు. చాలావరకు చదువులేనివారు సరిపడ ఇంటి వసతి సరిగాలేక చిన్నచిన్న మురికి గుడిసెల్లో, బస్తీలల్లో నివసించేవారు. నీరు, విద్యుత్తు, పాయఖానాలు లాంటి కనీస వసతిలేక, దోమలు, పందులతో కలిసి బతికేవాళ్ళు. కార్మిక సంఘాల సంగతి అంతగా తెలిసేదికాదు.

పై అధికారులు దొరల్లాగా ఏ కార్మికచట్టాలు పాటించకుండా అధికారం చెలాయించేవారు. కార్మిక సంఘాలు ముఖ్యంగా కాంగ్రెసు, కమ్యూనిస్టు అనుబంధ సంఘాలన్నీ దొరల చేతుల్లో ఉండి పైరవీ సంఘాలుగా దాదాపు యాజమాన్యం తొత్తులుగా వ్యవహరించేవారు. బొగ్గు గనిలో దుర్భరమైన పని పరిస్థితులు, గనులకు దూరంగా ఉండే కార్మిక బస్తీల్లో హీనమైన కనీస వసతులు, అధికారుల దౌర్జన్యం, కాలరీ అంతా దోపిడి దౌర్జన్యాల మధ్య సింగరేణి కార్మికులు అసంఘటితంగా, అభద్రతగా భయంభయంగా బతికేవారు. భరించలేనివారు తాగుడుకు బానిసలయ్యేవారు. అన్ని రకాలుగా అమానవీయ పరిస్థితిలో సింగరేణి కాలరీ ప్రాంతం ఉండేది. గుండాలు బస్తీల మీద దాడులుచేసి మహిళలను ఎత్తుకపోయి చెరిచేవారు. కాలరీ వాతావరణమంతా హింసాత్మకంగా, దోపిడీ దౌర్జన్యాలతో ఉండేది.1977 మార్చిలో అత్యయిక పరిస్థితి ఎత్తేసిన తరువాత సింగరేణి చుట్టుపక్కల ప్రాంతాలైన ఆదిలాబాదు, కరీంనగర్ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగ పోరాటాలు ఆరంభమయ్యాయి.

కార్మికులు, కర్షకులు విప్లవోద్యమానికి చోదక శక్తులని విప్లవోద్యమం భావించింది. సింగరేణిలో రాడికల్ విద్యార్థి సంఘం, జన నాట్యమండలి ఏర్పడింది. కార్మిక బస్తీలల్లో గనుల మీద వీళ్లందరు కార్మికులకు తమ హక్కుల గురించి యాజమాన్యం దోపిడీ, పీడన గురించి బోధించసాగారు. క్రమంగా సింగరేణి ప్రాంతంలో కార్మికుల్లో కదలిక మొదలయ్యింది. రాడికల్స్ నాయకత్వంలో భూస్వాముల గుండాలను ఎదురించారు. కనీస వసతులైన నీళ్లకోసం, గుడిసెల కోసం అనేక పోరాటాలు ఆరంభమయ్యాయి. గనుల ప్రాంతంలో కొత్త పాటలు సుళ్లు తిరిగాయి.

బెల్లంపల్లిలో, గోదావరిఖనిలో క్రూరులైన గుండాలను రాడికల్స్ పట్టపగలు హతమార్చారు. మొట్టమొదటిసారిగా సింగరేణి ప్రాంతంలో దొరల ఆధిపత్యానికి దెబ్బతగిలింది. ఆ తరువాత బెల్లంపల్లిలో ఒక కార్మికుని సహచరి అయిన రాజేశ్వరిని అధికారి కొడుకు చెరిచి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రిస్తే నిందితులను శిక్షించాలని మొత్తం గనులు బందయినాయి. మహిళలు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి ఊరేగింపులు, ధర్నాలు చేశారు. పోరాడే శక్తులను సమీకరించి ప్రజా సంఘాల నిర్మాణం ఆరంభమయ్యింది. బస్తీ కమిటీలు, ఫిట్ కమిటీల ఏర్పాటు జరిగింది.

గనుల్లో ప్రమాదకరమైన పని పరిస్థితులు పని పరికరాలు సక్రమంగా యివ్వకపోవడం, పీస్ రేటెడ్ కార్మికులకు సరిగా లెక్కకట్టకపోవడం, లంచగొండితనం గనుల అస్తవ్యస్తంగా ఇష్టారాజ్యంగా ఉండేది. కార్మిక యూనియన్లు యాజమాన్యం తొత్తులుగా వ్యవహరించేవాళ్లు. అలాంటి స్థితిలో తట్టలు, సెమ్మాసులు సప్లై చేయాలని, టబ్బులు సకాలంలో సప్లై చేయాలని ప్రతి గనిలో అనేక సమ్మెలు ఆరంభమయ్యాయి. నీళ్లకోసం, గుడిసెల కోసం, మహిళలు ఆఫీసుల చుట్టుముట్టారు. సింగరేణి కార్మికులు అన్ని రకాల గనుల చట్టాలు తెలుసుకోసాగారు.

తమ దైనందిన సమస్యల మీద ఒంటరిగా ఏ గనికి ఆ గనికి పోరాటాలు చేసిన కార్మికులు ఏకమయ్యారు. కార్మికులకు రాజకీయాలు చెప్పడం కమిటీలల్లో తర్ఫీదు చేయడం ఆరంభమయ్యింది. కార్మికుల నుండి పూర్తికాలపు కార్యకర్తలుగా చాలా మంది విప్లవోద్యమంలోకి వచ్చారు.

అటు గ్రామీణ ప్రాంతాలల్లో పోరాటాలు పెరిగి అనేక దళాల గుండా అవి అడవిలోకి విస్తరించి గెరిల్లా పోరాటాలుగా అభివృద్ధి చెందుతున్న దశ. ఈ దశలో గ్రామీణ ప్రాంతాలల్లో పారా మిలటరీ దళాలు ప్రవేశించి అనేక గ్రామాలల్లో క్యాంపులు పెట్టారు. ఫలితంగా గ్రామాల మీద ఒత్తిడి పెరిగి ఉద్యమంలో పనిచేసే చాలామంది అదివరకే చుట్టిరికం గల్గిన సింగరేణిలోకి రక్షణ కోసం రావడం ఆరంభమయ్యింది.

అంటే గ్రామాలల్లో సింగరేణిలో జరుగుతున్న అనేక పరిణామాత్మక పోరాటాలు లెనిన్ చెప్పినట్లుగా గుణాత్మక పోరాటాలుగా అంటే దోపిడీ, పీడనలేని కార్మిక, కర్షక రాజ్యాధికారం అవగాహనతో ముందుకు సాగాలని విప్లవోద్యమం గుర్తించింది. అందుకు తగిన నిర్మాణాల కోసం కార్మికుల, కర్షకుల పోరాట అనుభవాన్ని గతితార్కిక పోరాట అనుభవంగా, ఆచరణగా రూపొందించే ప్రక్రియ ఆరంభమయ్యింది.

ఇలాంటి ఉద్రిక్తమైన పరిస్థితిలో చరిత్రాత్మకమైన యాభయారు రోజుల సమ్మె ఆరంభమయ్యింది. ‘సింగరేణి కార్మికోద్యమ చరిత్ర’ పుస్తకంలో ఈ సమ్మె గురించి…

జీతాల కోత చట్టాన్ని తిప్పికొడుతూ సి.కా.స. కు జన్మనిచ్చిన చారిత్రాత్మక సమ్మె పోరాటం:
(విప్లవకర ట్రేడ్ యూనియన్ ఉద్యమం)

సింగరేణిలో చట్ట వ్యతిరేక పోరాటాల గనిగా పేరు పొంది, సంఘటిత సమ్మె పోరాటాలకు ప్రాణం పోసిన మందమర్రి కె.కె.2 గనిలోనే భారత బొగ్గు పరిశ్రమలోనే చారిత్రాత్మకమైన సమ్మెగా పేరొందిన సింగరేణి 56 రోజుల సమ్మె కూడా పుట్టి, కొనసాగి, ఆ చారిత్రాత్మకమైన 56 రోజుల సమ్మె నుండే విప్లవకర సంస్థ “సింగరేణి కార్మిక సమాఖ్య” (సి.కా.స) జన్మించింది. కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు అణిచివేత చట్టాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ, సింగరేణి యాజమాన్యపు మెడలు వంచి, విజయం సాధించిన వీరోచిత పోరాటం నుండి సి.కా.స. పుట్టింది.

చట్ట విరుద్ధంగా ఒక రోజు సమ్మె చేస్తే సమ్మె చేసిన కార్మికుల జీతం నుండి 8 రోజుల జీతాన్ని కోత పెట్టే విధంగా 1936లో బ్రిటిష్ ప్రభుత్వం చట్టాన్ని చేసింది. కార్మికులు సమ్మెలకు తలపడకుండా అణచివేసేందుకు బ్రిటిష్ పాలకులు ప్రయోగించిన ఈ ఫాసిస్టు చట్టాన్ని బ్రిటిష్ దోపిడి వర్గ పాలకుల వారసులైన భారత దళారీ పాలకులు సైతం ఆ ఫాసిస్టు చట్టాన్ని పదిలంగా కాపాడుతూ సింగరేణిలో అమలు పెట్టారు. కె.కె.2 (కళ్యాణిఖని రెండవ గని) గనిలో పనిలో గాయపడ్డ కార్మికునికి గాయం మానకముందే బలవంతంగా మెడికల్ ఫిట్‌నెస్ లెటర్ ఇచ్చి పనిలో హాజరు కమ్మని డాక్టర్ చెప్పడమే గాకుండా ఇది అన్యాయమని ఎదిరించినందుకు పోలీసులకు రిపోర్టుచేసి గాయంతో వున్న కార్మికున్ని అరెస్టు చేయించింది.

ఈ అక్రమ అరెస్టును నిరసిస్తూ, కార్మికున్ని బేషరతుగా విడిపించుకు రావాలని కె.కె-2 కార్మికులు గని మేనేజర్ ను కోరితే పోలీసుల అరెస్టుతో మాకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా నిరాకరించాడు. కాగా అక్రమ అరెస్టును నిరసిస్తూ గనిలోని ఒక షిఫ్ట్ కార్మికులు సమ్మెచేయగా మరుసటి రోజు అరెస్టు చేసిన కార్మికున్ని విడిచి పెట్టినప్పటికీ, కార్మికులు చేసిన ఆ సమ్మె చట్ట విరుద్ధమైన సమ్మెగా పేర్కొంటూ, ఆషిణీ కార్మికులందరి జీతం నుండి 8 రోజుల జీతం కోత విధించబడునంటూ మేనేజిమెంటు నోటీసు అంటించి ప్రకటించింది. కాగా ఇది అన్యాయమంటూ జీతాల కోత చట్టాన్ని వ్యతిరేకిస్తూ కెకె2 గని కార్మికుడైన యం.డి. హుస్సేన్, మరియు మరో ఇద్దరి నాయకత్వంలో మరుటి రోజు మూడు షిఫ్ట్ కు చెందిన కోల్ ఫిల్లర్స్ కార్మికులంతా సమ్మెకు పూనుకోగా, అసలు కోత చట్టమే లేక పోయినప్పటికీ కార్మికులను రాడికల్స్ రెచ్చగొట్టి అనవసరంగా సమ్మె చేయిస్తున్నారంటూ దొంగ యూనియన్లు ముఖ్యంగా ఎఐటియుసి, రివిజనిస్టులు రాడికల్స్ పై దుష్ప్రచారం చేసారు. మరొక వైపు మరుసటి రోజు మూడు షిఫ్ట్ కు చెందిన 11 వందల 60 మంది కోల్ ఫిల్లర్స్ కార్మికుల జీతం నుండి 8 మస్టర్లు కోత విధించనున్నట్లు మేనేజిమెంటు ప్రకటించింది.

చట్ట విరుద్ధ సమ్మెల పేరుతో ఒక రోజు సమ్మెకు 8 రోజుల జీతాన్ని కోత విధించే ఈ కోత చట్టాన్ని వ్యతిరేకిస్తూ 1981 ఏప్రిల్ 18 నాడు రాడికల్స్ నాయకత్వంలో కె.కె-2 గనిలో ప్రారంభమైన సమ్మె ఆ గనిలో వారం రోజుల పాటు సాగిన తర్వాత మందమర్రిలోని ఇతర గనులకు వ్యాపించింది. 20 రోజుల తర్వాత రామక్రిష్ణాపురం డివిజన్ కు, నెల రోజుల వరకు శ్రీరాంపురం డివిజన్ కు విస్తరించింది.

సమ్మెను దెబ్బతీసేందుకు దొంగ ట్రేడ్ యూనియన్లు, మేనేజిమెంటు, పోలీసులు కల్సికట్టుగా సకల ప్రయత్నాలు సాగించారు. సమ్మెను దెబ్బతీసేందుకు తమ విభేదాలు విడనాడి దొంగ యూనియన్లన్ని కల్పికట్టుగా వ్యవహరించాయి. రాడికల్స్ తప్పుడు ప్రచారంతో కార్మికుల్ని రెచ్చగొట్టి సమ్మె చేయిస్తున్నారు తప్ప అసలు జీతాల కోత చట్ట మనేదే లేదని మొదట్లో కార్మికుల్ని నమ్మింప చూపారు. చట్టం ఉన్నది నిజమే కాని ఒక్క గనిలో సమ్మెచేస్తే చట్టం అమలు ఆగదన్నారు. సమ్మె అనేక డివిజన్లకు విస్తరించే సరికి ఇది కేంద్ర ప్రభుత్వ చట్టమైనందున ఒక్క సింగరేణిలోనే సమ్మె చేస్తే రద్దు కాదన్నారు. మేనేజిమెంటుతో చర్చలు జరుపుతామన్నారు. కోర్టులో కేసు పెడుతామన్నారు. కార్మికులకు తాగబోయించి పనిలోకి పంపేందుకు ప్రయత్నించారు. మొత్తం వారి డెలిగేట్లను, గూండాలను, చోటా – మోటా లీడర్లందరినీ రంగంలోకి దింపి సమ్మెను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ, విఫలమవుతూ వచ్చారు. మరొకవైపు పోలీసుల అరెస్టులు పెరిగాయి. సమ్మె ప్రారంభమైన రెండవ రోజున్నే ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి సంఘటన జరిగింది. స్వాతంత్ర్య పోరాటంలోని జలియన్ వాలాబాగ్ హత్యాకాండను మరిపించేలా ఇంద్రవెల్లి నెత్తుటిమయమైంది. తమ బతుకు బాధలు చెప్పుకుని, పరిష్కార మార్గాలను తెల్సుకునేందుకు బహిరంగ సభకు ఆదివాసులు జమకావడాన్ని సైతం సహించలేని ఫాసిస్టు పాలకుల పోలీసుల హత్యాకాండకు పదుల సంఖ్యలో అసువులు బాసి, వందల సంఖ్యలో గాయాల పాలైన ఇంద్రవెల్లి మారణకాండ ప్రపంచ ప్రజల దృష్టినాకర్షించింది.

ఇంద్రవెల్లి సంఘటనను ప్రస్తావిస్తూ సమ్మెను విరమించకపోతే ఇంద్రవెల్లిలో లాగే సింగరేణిలో కార్మికుల్ని కాల్చి చంపుతామని మందమర్రిలో పోలీసు అధికార్లు బహిరంగంగా కార్మికుల్ని హెచ్చరించారు. బెదించారు. సమ్మె బెల్లంపల్లి ఏరియాలకు విస్తరించకుండా సకల ప్రయత్నాలు జరిగాయి. సమ్మెను విస్తరింపచేయడానికి, సమ్మె సాగుతున్న గనుల్లో సమ్మె విరమణ గాకుండా కాపాడుకోనీకి విప్లవ శక్తులన్నీ కేంద్రీకరించి పని చేయడం జరిగింది. ప్రతి రోజు వాల్ పోస్టర్లు, వాయిస్లు, చేతి రాత కరపత్రాలు వేస్తూ సమ్మె విచ్చిన్నకుల ప్రయత్నాలను ఎదుర్కొంటూ రావడం జరిగింది. సమ్మె విస్తరణ కోసం రామక్రిష్ణాపురం, శ్రీరాంపురం గనులపైకి పోయి ప్రసంగిస్తున్న రాడికల్స్ ను పోలీసులు అరెస్టు చేయగా అక్కడి కార్మికులు అడ్డగించి విడిపించుకున్నారు. మేరుగు సత్యనారాయణ, యం.డి. హుస్సేన్లు అరెస్టుల నుండి పలు మార్లు తృటిలో తప్పించుకుంటూ సమ్మెను విస్తరింపచేయడానికి కృషి చేస్తూ వచ్చారు. మందమర్రిలో చాలా మంది కార్మికుల్ని అరెస్టు చేసిన పోలీసులు హుస్సేన్ ఇంటిపై పలుమార్లు దాడి చేశారు. సమ్మె ప్రారంభమైన రోజు నుండి తిరిగి మరెప్పుడూ మందమర్రి అంగడి బజార్ లోని తన ఇంటికి హుస్సేన్ పోకుండా రహస్య జీవితాన్ని కొనసాగించాడు.

సమ్మెను గోదావరిఖని ఏరియాకు విస్తరింపచేయడానికి సమ్మె విస్తృంగా కొనసాగుతునండగా, సమ్మె 40 వ రోజుకు చేరుకోగా అదే రోజున “సింగరేణి కార్మిక సమాఖ్య” (సి.కా.స.) బ్యానర్ తో గోదావరిఖనిలో బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మెకు మద్దతుగా కల్సిరావాలని ఆహ్వానించగా ఐఎఫ్ టియు నాయకునితో బాటు, ఒకరిద్దరు క్రాఫ్ట్ సంఘాల నేతలు వేధికపై నుండి ప్రసంగించారు. సమ్మెనాయకులుగా రాడికల్స్ కార్యకర్తలు మహ్మద్ హుస్సేన్ గోదావరి ఖనికి చెందిన కార్మికుడు రజబ్ అలీ ప్రసంగిచారు. 8 మస్టర్ల కోత చట్టాన్ని తిప్పి కొట్టాలని, కోత చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరవధికంగా సాగుతున్న సంఘటిత సమరశీల సమ్మె పోరాటాన్ని విజయవంతం చేసుకునేందుకు గోదావరిఖని ఏరియా కార్మికులు కూడా వెంటనే సమ్మెను ప్రారంభించాలని పిలుపు నిచ్చారు. కాగా మరుసటి రోజు నుండే గోదావరిఖని ఏరియాలో సమ్మె ప్రారంభమై అన్ని గనులకు విస్తరించింది.

సింగరేణి యాజమాన్యపు మొండి వైఖరిని, పాలకుల కుట్రల్ని, దొంగ యూనియన్ల విద్రోహాలను, పోలీసుల నిర్బందాన్ని, అరెస్టుల్ని ఎదుర్కొంటూ సంఘటితంగా, సమరశీలంగా కార్మికుల పోరాటం సాగడంతో బొగ్గు ఉత్పత్తులు, ట్రాన్స్పర్టులు స్థంభించి, బొగ్గు కొరత మూలంగా దాదాపు 700 రైల్లు రద్దు అయ్యాయి. (ఆ కాలంలో బొగ్గుతో రైలు యింజన్లు నడిచేవి). విద్యుత్తు సంస్థల్లో ఉత్పత్తి కుంటుపడింది. బొగ్గు కొరతతో విద్యుత్తు ఉత్పత్తి లేక రాష్ట్రంలోని అనేక పరిశ్రమల్లో ఉత్పత్తులు కుంటుపడనారంభించాయి. పెట్టుబడిదార్లు గంగవెర్రులెత్తసాగారు.

కార్మికుల సంఘటిత సమ్మె పోరాటం రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచింది. కార్మికులంతా మా యూనియన్ల సభ్యులే అయినప్పటికీ మమ్మల్ని కాదని, రాడికల్స్ నేతృత్వంలో సమ్మెలు చేస్తున్నారంటూ బూర్జువా, రివిజనిస్టు పార్టీల నాయకత్వంలోని దొంగ యూనియన్ల నాయకులంతా నిస్సిగ్గుగా, బహిరంగంగా చెప్పుకున్నారు. కార్మికుల సమ్మె డిమాండ్లు పరిష్కరించేందుకు, సమ్మెను విరమింపచేసేందుకు సమ్మెకు నాయకత్వం వహిస్తున్న రాడికల్స్ తో చర్చలు జరిపేందుకు నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టి. అంజయ్య పత్రికా ముఖంగా రాడికల్స్ ను ఆహ్వానించక తప్పలేదు. మరొకవైపు సింగరేణి సమ్మెకు సంఘీభావం తెల్పుతూ హైదరాబాద్ లో బహిరంగ సభ జరిగింది.

ముఖ్యమంత్రి రాడికల్స్ ను చర్చలకు ఆహ్వానించడంతో దొంగ యూనియన్ల పునాదులు కదలినంతగా అదిరిపడ్డారు. రాడికల్స్ తో చర్చించి ఒప్పందం కుదుర్చుకుంటే సింగరేణిలో ఇక మా అస్తిత్వమే దెబ్బతినగలదని ముఖ్యమంత్రి ముందు తమ గోడు వినిపించారు. సింగరేణిలో మావి గుర్తింపు యూనియన్లు అయినందున ప్రభుత్వం పరిష్కరించే డిమాండ్లు ఏవైనా గాని రాడికల్స్ తో గాకుండా యూనియన్లతో మాత్రమే ఒప్పందం జరిగితినే సరిగా ఉంటుందని, రాడికల్స్ తో చర్చలు జరిపితే నక్సలైట్ల ప్రాబల్యం పెరుగగలదని ప్రభుత్వం ముందు దొంగ యూనియన్లు మొర పెట్టుకున్నాయి. ఫలితంగా ముఖ్యమంత్రి తన అభిప్రాయం మార్చుకుని, కార్మికుల సమ్మె డిమాండ్లు ఒప్పుకుంటున్నట్లు ప్రతికా ముఖంగా ప్రకటించి, ఆ విషయాలపై రాత పూర్వకంగా యూనియన్లతో ఒప్పందాలు జరుపుకున్నారు. కాగితాలపై ఎవరు సంతకం పెట్టారనే దానితో సంబంధం లేకుండా కార్మికుల డిమాండ్లు పరిష్కరింపబడటమే ప్రధానంగా భావించిన రాడికల్స్ సమ్మె విరమనకు పిలుపు నివ్వడం జరిగింది. 56 రోజుల పాటు నిరవధికంగా సాగిన చారిత్రాత్మకమైన సమ్మె పోరాటం విజయవంతంగా ముగిసింది.

ప్రభుత్వం ఆమోదించిన సమ్మె డిమాండ్లు:

  1. 8 మస్టర్ల జీతాల కోత చట్టాన్ని అమలు చేయకుండా నిలిపివేయడం
  2. ఆరెస్టు చేసిన వారందరినీ భేషరతుగా వదిలి వేయడం. పోలీసు కేసులు, కంపెనీ ఛార్జిషీట్లు రద్దు చేయడం.
  3. సమ్మె మూలంగా కార్మికులు ఆర్థికంగా నష్టపోయినందున కార్మికులకు అడ్వాన్స్ గా డబ్బులు చెల్లించి, ప్రతినెలా జీతం నుండి కొంత మొత్తంలో వాయిదాలూగా కోత విధించుకోవడం.

ఈ చారిత్రాత్మక సమ్మెతో కార్మికవర్గం పొందిన రాజకీయ ఫలితాలు:

  1. సింగరేణి కార్మికుల్లో సంఘటితత్వం, పోరాట పటిమ మరింతగా పెరిగింది.
  2. విప్లవకర కార్మికయూనియన్ నాయకత్వంలో సంఘటితంగా, సమరశీలంగా పోరాడితే పాలకుల మెడలు వంచి విజయం సాధించవచ్చునని కార్మికులకు మరింతగా అర్థమై పోయింది.
  3. కీలక ‘పరిశ్రమలో నిరవధిక సమ్మె జరిగితే రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఎలాంటి ప్రభావం పడగలదో అర్థమైంది.
  4. బూర్జువా పార్టీల నాయకత్వంలోని దొంగ ట్రేడ్ యూనియన్ల మధ్యన ఎన్ని విభేదాలున్నప్పటికీ కార్మికుల సమరశీల పోరాటలను దెబ్బతీయడంలో, కార్మికవర్గ ప్రయోజనాలను తాకట్టు పెట్టడంలో, విప్లవ సంస్థలను దెబ్బతీసే ప్రయత్నంలో వారంతా ఒక్కటిగా వ్యవహరిస్తారనేది మరింతగా స్పష్టమైంది.
  5. బూర్జువా, రివిజనిస్టు పార్టీల నాయకత్వంలోని ట్రేడ్ యూనియన్లను కాదని, పాలక వర్గ పార్టీలను కాదని సమ్మెలకు తలపడితే ఏమీ సాధించలేమని ఉండే తప్పుడు భావన తొలగిపోయి, తమ సంఘటిత సమ్మె పోరాటాల శక్తి ఎంత గొప్పదో సింగరేణి కార్మికవర్గం గ్రహించింది.
  6. ఈ సంఘటిత సమరశీల సమ్మె పోరాటం విప్లవకర సంస్థ “సి.కా.స’కు జన్మనిచ్చింది. తదనంతర కాలంలో ఇలాంటి సమ్మె పోరాటాలు సి.కా.స. నాయకత్వంలో అనేకం జరిగి భారత కార్మికవర్గానికే సింగరేణి కార్మిక వర్గం ఆదర్శంగా నిలిచింది.
  7. 56 రోజుల చారిత్రాత్మక సమ్మె పోరాటం, 1981 నాటి వరకు ఆదిలాబాద్ జిల్లా గనుల ప్రాంతానికే పరిమితమై వున్న కార్మికోద్యమాన్ని ఇతర జిల్లాల గనుల ప్రాంతాలకు విస్తరింపచేసింది. సింగరేణి పారిశ్రామిక ప్రాంతపు ఆర్గనైజేషన్ను గైడ్ చేసేందుకు విడిగా ఒక కమిటీ వుండాల్సిన ఆవశ్యకతను కల్పించింది. ఆ విధంగా 1981 మధ్యలో జిల్లా కమిటీ స్థాయి గల్గిన “సింగరేణి బెల్ట్ కమిటీ (ఎబిసి) (సిపిఐ – ఎంఎల్ పీపుల్స్ వార్) ఏర్పడింది. ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో విస్తరించివున్న సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి బెల్ట్ కమిటీ (ఎస్ బిసి) గైడెన్స్ లో సి.కా.స (సింగరేణి కార్మిక సమాఖ్య) వి.కా.స. (విప్లవ కార్మిక సమాఖ్య), ఆ.కా.స. (ఆర్టీసి కార్మిక సంఘం) ఆర్ఎస్ యూ (రాడికల్ విద్యార్థి సంఘం), ఆర్‌ వై ఎల్ (రాడికల్ యువజన సంఘం), మహిళా విముక్తి సంఘం, జన నాట్యమండలి – విప్లవ ప్రజా సంఘాల కార్యకలాపాలు కొనసాగుతూ సింగరేణి పారిశ్రామిక ప్రాంతం పోరాటాల గడ్డగా, వృత్తి విప్లవ కారులకు జన్మనిచ్చే వీరమాతల ‘పురిటి గడ్డగా, నెత్తుటి త్యాగాల నేలగా సింగరేణి పారిశ్రామిక ప్రాంతం ఎర్రబారుతూ వచ్చింది.

ఈ సమ్మె జరుగుతుండగానే చాలా కరపత్రాలు, పాటలు వచ్చాయి. ‘సమ్మె’ గొలుసు కథ ‘కార్మిక’ పేరుతో నాలుగు కథల సమాహారంగా వచ్చింది. సమ్మె జరుగుతున్న క్రమంలోనే రాశారు. ఆ నాలుగు కథలు సమ్మె ముగిసిన తరువాత సృజనలో వచ్చాయి.

‘సమ్మె’- వురుగొండ యాదగిరి( పి. చంద్) సృజన సెప్టెంబర్ 1981, ‘విస్తరణ’ – మహమ్మద్ హుస్సేన్. సమ్మెకు నాయకత్వం వహించిన నాయకుడు. ‘నిర్భంధం’ – నల్లా ఆదిరెడ్డి మొత్తంగా సింగరేణి కార్మికోద్యమానికి నాయకత్వం వహించిన నాయకులు. చివరగా ‘విజయం మనదే’ వూరుగొండ యాదగిరి (పి.చంద్) అక్టోబర్, నవంబర్ 1981, జనవరి 1982 సృజనలో ప్రచురించారు. సమ్మెకు సంబంధించిన అంతర్ బాహిర్ చలనాలను ఈ నాలుగు కథలు చిత్రించాయి.

ఈ ‘సమ్మె’లో బెల్లంపల్లి నుండి గోదావరిఖని దాకా అనేక పరిస్థితులల్లో తిరుగుతూ ఆ ఉద్విగ్న, ఉద్రిక్త పరిస్థితుల మధ్యనేను సమ్మె యాభయవ రోజు మొదలేసి యాబై ఒకటో రోజు వరకు ‘సమ్మె’ కథ రాశాను.

సింగరేణిలో ప్రత్యక్ష అనుభవం ఉన్న ఆ నాలుగు కథలు ప్రచురణ తరువాత నా కథ ప్రచురణకివ్వలేదు. నా మొత్తం సాహిత్యం ప్రచురించే క్రమంలో పర్ స్పెక్టివ్ హైదరాబాదు వారు ప్రచురించిన అయిదవ సంకలనంలో ఈ కథ మొదటి సారిగా ప్రచురణ అయ్యింది.

( ‘సమ్మె’ – రచన కాలం: 6 జూన్, 1981)

( తల్లిచేప కథల సంకలనం), ప్రచురణ : ఏప్రిల్, 2017.

పుట్టింది గాజుల ప‌ల్లి, మంథ‌ని తాలూకా, క‌రీంన‌గ‌ర్ జిల్లా. న‌వ‌ల‌లు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా క‌థ‌లు, కొన్ని క‌విత‌లు, పాట‌లు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాట‌కాలు రాశారు. 1979 నుంచి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

Leave a Reply