సముద్రాన్ని రాసినవాడు!

మీరు సముద్రాల్ని చూసారు. సముద్ర ఘోషని విన్నారు. కానీ సముద్రాన్ని చదివారా? అవును. మీకు సముద్రాన్ని చదివే అవకాశం వచ్చింది. వరవరరావు గారు సముద్రాన్ని రాసారు. సముద్రాన్ని రాయాలంటే సముద్రంతో సముద్రమంత సాంగత్యం వుండాలి. సముద్రంతో సన్నిహితంగా తిరిగి వుండాలి. సముద్రం ఆటుపోట్లన్నీ తెలిసి వుండాలి. దాని శక్తి, విస్తృతి, లోతు, బలం…అంతటినీ తెలిసి వుండాలి. ఆయనకవన్నీ తెలుసును కనుకనే “సముద్రం” అనే దీర్ఘ కవితని రాసారు. అది సముద్రం గురించి రాసిన కవిత కాదు. ఏకంగా సముద్రమంత శక్తిమంతమైన కవిత. ఇంతకీ సముద్రమంటే ఏమిటి?

** ** **

వరవరరావు గారి దీర్ఘ కవిత “సముద్రం” చదివినప్పుడు నాకు మూడు సముద్రాల్ని చదివినట్లనిపించింది. ఒకటి – మనందరికీ తెలిసిన భౌతిక సముద్రం. రెండు – సముద్రాన్ని ప్రతీకగా తీసుకున్న విప్లవోద్యమం. మూడు – సముద్రంతో సముద్రమంత సాంగత్యం, అనుభవం వున్న వరవరరావే. ఆయన సముద్రమంతటి ఔదు భాగాల ఈ దీర్ఘ కవితని 1983లో ప్రచురించారు.

వరవరరావుగారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రస్తుతం 80 సంవత్సరాల ఆయన యాభై సంవత్సరాల పై నుండి విప్లవోద్యమంతో ముడిపడ్డ జీవితమే గడుపుతున్నారు. విప్లవం ఊసు లేని ఒక్క రోజు కూడా ఆయన క్యాలెండర్లో వుండదేమో. నక్సల్బరీ వసంత మేఘ గర్జన పిలుపునందుకున్న తొలినాళ్ల మేథో వర్గంలో ఆయనొకరు. 1970లో ఏర్పడిన విప్లవ రచయితల సంఘం (విరసం) ఆవిర్భావ సభ్యుడాయన. ఎన్నో కేసుల్లో అరెస్టయ్యారాయన. ఆయన ఏనాడూ తుపాకీ పట్టి సాయుధ పంథాలో పోరాడకపోయినా ఆ విప్లవాశయం కలిగి వున్నందుకే ఎన్నోసార్లు రాజ్య హింసని ఎదుర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర్యానంతర కాలంలో ఆయనంత సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపిన రచయిత మరొకరు లేరేమో.

ఆయన గురించి ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు చెబుతున్నానంటే విప్లవోద్యమంతో అంతటి గాఢమైన భావోద్వేగానుబంధం కలిగి వున్న ఆయన దాన్నంతటినీ పంచుకోవటానికే “సముద్రం”ని రాసారు అనేకంటే సముద్రం మీద ఇలాంటి కవిత రాయాలంటే అదంతా వుంటే తప్ప సాధ్యం కాదు అనుకోవటం సరైనది. అందుకే ఈ కవితకి విప్లవోద్యమంలో వుండేంతటి తాత్వికత, శక్తి, గాఢత, లోతు వున్నాయి. ఆయన జీవితాన్ని, కార్యాచరణ నేపథ్యాన్ని ఆయన కవిత్వం నుండి వేరు చేసి చూడలేం. “సముద్రం” లోని సాంద్రత అంతా అక్కడి నుండే వచ్చింది.

** ** **

మొత్తం ప్రకృతిలోనే కాదు కోట్లాది సంవత్సరాల నుండి అనేక విస్ఫోటనాలు జరిగింది. మానవజాతి చరిత్రలోనూ అలాంటి విస్ఫోటనాలు జరిగాయి. మనుషుల మధ్య మనుగడ ఘర్షణల్లో పాత సమాజాలు కుప్పకూలాయి. కొత్తవి ఉధ్భవించాయి. మనిషి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతంకి ప్రయాణిస్తూనే కొత్త చరిత్రల్ని సృష్టించాడు. ఉన్న చోటునే ఉద్యమాలు, తిరుగుబాట్లు, విప్లవాలు సృష్టించి కొత్త చరిత్రలకి ప్రాణం పోసాడు. అలాంటి విప్లవోద్యమాలు మన దేశంలో కూడా పుట్టాయి. తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను, ఘర్షణను, జయాపజయాల్ని ఎదుర్కొంటూ సాగుతున్న విప్లవోద్యమాన్ని ఈ భూగోళం మీద అత్యంత శక్తివంతమైన సముద్రంతోనూ, సముద్రానికున్న భౌతిక లక్షణాలన్నింటినీ తాను నిబద్ధుడైన విప్లవోద్యమంతోనూ పోలుస్తూ రాసిన దీర్ఘ కవిత ఇది.

“నేను చూసివచ్చిన సముద్రం ఊసేమని చెప్పనూ
నా టెలివిజన్‌ కన్నుల్లో విను
నా మనసుమీద చెవిపెట్టి చూడు
నేనే క్యాసెట్‌నై రికార్డ్‌ చేసుకొని వచ్చిన
సముద్రం సంభాషణను విను”

ఈ వాక్యాలు విప్లవోద్యమం పట్ల ఆయన మమేకతని, తన కవిత్వంలో విప్లవోద్యమ ప్రతిబింబాన్ని చూప్పైంచాలన్న నిబద్ధతని తెలియచేస్తాయి.

“ఎన్ని యుగాలనుంచి ఎన్ని తరాలనుంచి
ఎన్ని దశలు ఎన్ని అవస్థలు, ఎన్ని వ్యవస్థలు
పడిలేస్తూ నడకలు, పరుగులుగా
సముద్రం నన్ను చూడాలని
సీమాంతాల నుంచో
చీకటి చెల్లిన చోటునుంచో
సముద్రం మొదలైన చోటునుంచో
నడచి వచ్చిందో”
సమాజంలో జరిగే ఏ ఘర్షణ ఐనా ఒక్క రాత్రిలో పుట్టదు. అది సామాజిక చలనశీలతో ఓ భాగం. విప్లవోద్యమాల్ని చారిత్రిక దృక్కోణం నుండే అర్ధం చేసుకోవాలి కదా.

“అలలు అలలుగా
తెరలు తెరలుగా
తరగలు తరగలుగా
ఎగసిపడి కెరటమై వచ్చిందో
చీకటి సముద్రం, నల్లటి సముద్రం
నీలం సముద్రం, ఆకుపచ్చని సముద్రం
మెత్తని తెల్లని
నురుగులాంటి చిరునవ్వుతో నన్ను తాకింది
అన్ని సముద్రాలలో తానై
తనలో అన్ని సముద్రాలై
నా కాలివేళ్లలో మునివేళ్లు పోనిచ్చి పిలిచింది,
వేళ్ల సందులలో నీళ్లు నింపుతూ సముద్రం”

సముద్రం ఎంత శక్తివంతమైనదో అంతటి సున్నితమైనది కూడా. లోలోన ఎంతటి గాంభీరమైన లోతులున్నా తన అంచులలో ముసిముసిగా నురగలతో చుట్టుకున్నే ఆప్యాయత వుంటుంది. ఉద్యమమూ అంతే.

విభజింపబడ్డ భూభాగాన్ని
కలుపుతూ సముద్రం
నిలచిన గులకరాళ్లను అరగదీస్తూ
నా నిలచిన పాదాల కింద
నీళ్ల చక్రాలు తిప్పుతూ
సముద్రం రైలు,
సముద్రం బయలు, సముద్రం మొయిలు
సముద్రం జీవితం స్టయిలు

సముద్రాన్ని, దాన్ని చలనశీలతను పూర్తిగా అర్ధం చేసుకుంటే తప్ప ఈ వాక్యాలు రావు. సముద్రం భూభాగాల్ని విడతీస్తుందని అనుకుంటారు కానీ విడిపోయిన భూభాగాల మధ్య సముద్రం చేరిందని అనుకోరు. విప్లవోద్యమమూ అంతే. విప్లవం అవసరం అయిన భిన్న వర్గాల మధ్య అనుసంధాన కర్తగా ఉద్యమం వుంటుంది. సముద్రాన్ని, విప్లవాన్ని ఒకే స్థాయిలో ఇంతగా ఇంతగా అనుభవించిన, వ్యక్తీకరించిన వాక్యాలు అరుదుగా దొరుకుతుంటాయి. ఉద్యమం, సముద్రాల చలనశీలతను, విస్తృతిని తెలిపే వాక్యాలివి.

బతుకుపోరును
సముద్రం హోరులో విన్నాను
బతుకు లోతును
సముద్ర కెరటంలో
బతుకురీతిని
పరచుకున్న సముద్ర వైవిధ్యంలో
చదువుకున్నాను.

ఏమున్నది సముద్రం
నీళ్లూ, ఉప్పూ
ఉప్పెనా తప్ప

ఏమున్నది జీవితం
చీమూ నెత్తురూ
పోరాటం తప్ప.

జీవితం మాత్రం సముద్రం కంటే ఏం తక్కువని? అదే లోతు. అదే ఘర్షణ, అదే ముంచెత్తటం, అదే సున్నితత్వం. వ్యక్తి జీవితం, సముద్రం, ఉద్యమం… మూడింటిలోనూ కనిపించే సాధారణాంశాలే నీరు, ఉప్పు, ఉప్పెన, గాయాలు, పోరాటం! అంతే కదా?

ఒక్క క్షణం నిలవనీని నిరంతర ఘోష
ఒక్క క్షణం ఆగని నిరంతర చలనం

సముద్రానికి, జీవితానికి, ఉద్యమానికి మధ్య వున్న ఈ చలనశీల పోలికని కేవలం గతి తార్కిక దృష్టి వున్న మార్క్సిస్ట్ కవి మాత్రమే కనుక్కోగలడు.

సముద్రం తప్ప సముద్రాన్ని
ఏ కవిత్వం కళ్లకు కట్టగలదు
పోరాటం తప్ప జీవితాన్ని
ఏ చీకటి వెలుగులు వివరించగలవు

జీవితంతోనూ, కవిత్వంతోనూ గాఢమైన తాత్వికానుబంధం గల కవి మాత్రమే ఇలా ప్రశ్నించగలడు.

తనను చూడమని చెప్పింది సముద్రం
జీవించి పోరమని చెప్పింది సముద్రం
హోరుమని చెప్పింది సముద్రం

సముద్ర హోరును నింపుకున్న వాక్యాలు కావూ ఇవి?

సముద్రం వైరుధ్యాల పుట్ట
సముద్రం వైరుధ్యాల పరిష్కారం
సముద్రం వైవిధ్యాల గుట్టు
సరిహద్దుల్ని చెరిపేసే పరసీమ సముద్రం

ఎక్కడ వైరుధ్యాలుంటాయో అక్కడే పరిష్కారం వుంటుంది. ఘర్షణ నుండే పరిష్కారం వస్తుంది. ఆ పరిష్కారంలో భాగంగానే అప్పటివరకు సంఘర్షించిన శక్తులలో కొన్ని నిర్మూలించబడగా మరి కొన్ని వైవిధ్యాలుగా మారతాయి. అప్పుడు సరిహద్దులు చైపివేయబడతాయి. మార్క్సిజాన్ని కవిత్వం చేస్తే చదవటం సులువేమో గానీ రాయటానికి సముద్రమంత వ్యక్తిత్వముండాలి.

గదిలో కూర్చొని సముద్రాన్ని రాయబోతే
కాళ్ల కింద నీళ్లు
సముద్రపు మంటలాగా
కళ్లల్లో నీళ్లు
ప్రజా సముద్రపు బాధలాగా
గుండెలో సముద్ర ధ్వని
శ్రీకాకుళాన్ని నెమరేసే కరీంనగర్ లాగా

ఇది ఉద్యమాచరణకి సంబంధించిన విషయం. సముద్రాన్ని ఊహించలేవు. గదిలో కూర్చొని ఉద్యమాన్ని శ్లాఘించనూ లేవు. ఊహలకే పరిమితం అయితే సముద్రం, ఉద్యమం కలవర పెట్టగలవు.

ఇవాళ సముద్రం
సామ్రాజ్యవాది మరణశయ్యలాగున్నది
ఇవాళ సముద్రం
కల్లోల నక్సల్బరీలాగున్నది

సముద్రానికి స్వేచ్చ లేదు
నాకూ స్వేచ్చ లేదు
సముద్రం మహా సంక్షోభం లేదు
ఆ సంక్షోభంలో నేనున్నాను

సముద్రం ఆటుపోటుల్లోని
అలను నేను కలను నేను కలతను నేను
గొప్ప శాంతి కోసం మహా సంక్షోభంలో
స్వేచ్చను కోల్పోయిన సముద్రాన్ని నేను
స్వేచ్చను వెతుక్కుంటున్న నీటి చుక్కను నేను

ఈ కాసిన్ని వాక్యాలు కాదు ‘సముద్రం’ని! చదువుకుంటూ పోండి…ఇలాంటి వాక్యాలనేకం కనబడతాయి. మిమ్మల్ని ముంచెత్తుతాయి. మీ వేలిసందుల్లోంచి సముద్ర కెరటం దూసుకుపోయినట్లు అక్షరాలు మీ హృదయంలోకి వెళతాయి. మూడున్నర దశాబ్దాల క్రితం ఎప్పుడో రాసిన “సముద్రం” ఇప్పటికీ గర్జిస్తూనే వున్నది. ఆయన్ని జైల్లో పెట్టినా ఆయన అక్షరాలు, భావాల్ని ఖైదు చేయలేరు. గత రెండు సంవత్సరాల నుండి పుణె జైలులోనే వున్నారు. శరీరం నీరసపడినా ధైర్యం సడలని, చిర్నవ్వులు వాడని ఆ ఎనభయ్యేళ్ల యువకుడి విడుదలని కాంక్షిస్తూ….

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

2 thoughts on “సముద్రాన్ని రాసినవాడు!

  1. అరణ్య కృష్ణ గారూ, మీ “సముద్రాన్ని రాసిన వాడు” రచనతో పాటు వి వి సర్ ఉద్వేగ భరితంగా చదివిన సముద్రం కవితను ఆవిష్కరించిన తీరు అద్భుతం.ఆ రోజంతా చాలామందిమి కలిసి సంతోషంగా గడిపాం! ఆ జ్ఞాపకాల సుడుల్లో ఇప్పటి దుఃఖ సముద్రాలు ఊపిరి తీసుకోనివ్వడం లేదు! మీకూ, నారాయణ స్వామిగారికీ ధన్యవాదాలు!

Leave a Reply