ఏప్రిల్ చివరివారంలో ‘ఆజ్ తక్’ న్యూస్ చానెల్ టాప్ యాంకర్లలో ఒకరైన రోహిత్ సర్దానా కోవిడ్‌తో చనిపోయాడు. చాలామంది ఆయనకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో రాశారు. ముఖ్యంగా, పలువురు బీజేపీ నేతలు, మంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్విటర్‌లో నివాళులర్పించాడు. కారణం స్పష్టమే – ‘గోదీ’ మీడియాగా పేరు గాంచిన చానెల్స్‌లో ఒకటైన ‘ఆజ్ తక్’లో, రోహిత్ సర్దానా ‘దంగల్’ అనే షో నడిపేవాడు. ఆయన వీడియోల్ని యూట్యూబ్‌లో చూస్తే ఆయన చేసిన జర్నలిజం ఎలాంటిదో, ఆయన మరణం పట్ల బీజేపీ శ్రేణులు ఎందుకంత విచారం వెలిబుచ్చాయో అర్థమవుతుంది.
అయితే, ఆ సందర్భంగా సోషల్ మీడియాలో కొందరు ఆయన పట్ల కటువైన, విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. వీళ్లలో రెండు రకాల వాళ్లున్నారు. ఒకరకం వాళ్లు ట్రోల్స్ – తమకు వ్యతిరేకి కాబట్టి అతడి చావు పట్ల ఒక రకమైన ఆనందాన్ని వెలిబుచ్చుతూ, ‘చస్తే చచ్చాడులే’ అన్నట్టుగా అనుచితమైన కామెంట్స్ చేశారు. ఇక మరోరకం వాళ్లు రోహిత్ సర్దానా ఒక జర్నలిస్టుగా తన షోల ద్వారా సమాజానికి చేసిన నష్టాన్ని విమర్శనాత్మకంగా గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే, అతడి షోలన్నీ – ఏ చిన్న మినహాయింపూ లేకుండా – అధికార బీజేపీ విధానాలను ఏకపక్షంగా బలపరుస్తూ, ప్రతిపక్షాలన్నింటినీ నిందిస్తూ, దాదాపు ప్రతి సందర్భంలోనూ మతతత్వాన్ని, హిందూ-ముస్లిం విద్వేషాలను రెచ్చగొడుతూనే ఉండేవి కాబట్టి.
కానీ, ఒక మనిషి చనిపోయాక, ఆయన కుటుంబానికి, ఆప్తులకు సానుభూతిని ప్రకటించాల్సిన సందర్భంలో అసలు ఏ రకమైన విమర్శలైనా చేయడం మంచిదేనా, కాదా అనే సుదీర్ఘ చర్చలు కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో కొనసాగాయి. ఎవరి భావజాలం వారికి ఉంటుంది కదా, అది వారి వ్యక్తిగతం కదా, ఆయన మరణాన్ని ఓ పాత్రికేయుడి మరణంగానే చూడాలి తప్ప ఆయన ‘బాడీ ఆఫ్ వర్క్’ను ఇప్పుడు చర్చకు పెట్టాల్సిన అవసరమేంటి అనేది ఆయన మద్దతుదారులు లేవనెత్తిన చర్చ.
జర్నలిస్టుగా చెలామణీ అవుతూ, మీడియా వేదికగా ఆయన చాటుకున్న రాజకీయాలను, భావజాలాన్ని, పాటించిన విలువల్ని, చేపట్టిన వైఖరుల్ని బతికున్నప్పుడు మాత్రమే విమర్శించాలి తప్ప, చనిపోయాక మాత్రం ఆయన గురించి అంతా మంచే చెప్పాలనే వాదన ఎక్కడిదని విమర్శకులు ప్రశ్నించారు.
సీన్ కట్ చేస్తే, ఇప్పుడు తెలుగు సమాజంలో కూడా సిరివెన్నెల మరణం తర్వాత దాదాపు అలాంటి చర్చలే జరుగుతున్నాయి. సిరివెన్నెల సినీ పాటల రచయితగా తనదైన ముద్రవేశాడు. ఆయన పాటలకు అభిమానులు కోకొల్లలు. సమాజంలో ఉన్న అలజడి, అయోమయం, ఆర్థిక అంతరాలు… వాటి ఫలితంగా మానవ సంబంధాల్లో, కుటుంబాల్లో మనం వివిధ రూపాల్లో చూస్తున్న సంక్షోభం కారణంగా ఆయన రాసిన కొన్ని పాటలు లేదా కొన్ని చరణాలు చాలామంది హృదయాలను తాకి ఉండొచ్చు. ఊరటనిచ్చి ఉండొచ్చు.
కానీ, మొత్తంగా చూస్తే, సారాంశంలో ఆయన పాటలు ఏ విలువల్ని ఎత్తిపట్టాయి? ఏ భావజాలానికి బాసటగా నిలిచాయి? వర్గాలుగా చీలిపోయిన నేటి సమాజంలో కొనసాగుతున్న శ్రమదోపిడీ, సామాజిక అణచివేత, వివిధ రకాల వివక్ష, కులాధిపత్యం, పితృస్వామ్యం, మతతత్వం వీటన్నింటి పట్ల ఆయన తన పాటల ద్వారా ఏం చెప్పాడు? సినీ గేయకారుడిగా తన పాతికేళ్ల కెరీర్‌లో వివిధ కీలక సందర్భాల్లో ఎటు వైపు నిలబడ్డాడు? ఏ వైఖరి తీసుకున్నాడు? ఏ వర్గాల వారికి దన్నుగా మాట్లాడాడు/రాశాడు? అనే ప్రశ్నలు వేసుకుంటే తప్ప సిరివెన్నెలపై మనం సరైన అంచనాకు రాలేం.
సిరివెన్నెల కేవలం పాటల రచయిత మాత్రమే కాదు. లేదా సాధారణ రచయిత మాత్రమే కాదు. ఒక స్పష్టమైన భావజాలంతో, తన మాటల్లోనే చెప్పాలంటే బాల్యంలోనే ఆర్ఎస్ఎస్ శాఖల్లో చేరి దేశభక్తి, జాతీయవాదానికి సంబంధించిన పాటలు రాయటం ద్వారా సాహిత్యకృషిని మొదలుపెట్టిన వ్యక్తి. అంటే, ఉగ్గుపాలతోనే హిందూరాజ్య స్థాపన అనే మతతత్వ భావజాలాన్ని నరనరానా నింపుకున్న వ్యక్తి. పైగా, ఆయన దాన్ని ఎక్కడా దాచే ప్రయత్నం కూడా చేయలేదు. వేర్వేరు వేదికలపైన ఆయన తన తాత్విక/భావజాలపరమైన వైఖరుల్నే కాదు, తన రాజకీయ పక్షపాతాన్ని కూడా ఎలాంటి అనుమనాలకు తావులేకుండా విడమర్చి ప్రకటించుకున్నాడు.
ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా చేసిన అనేక ప్రసంగాలు వీడియోలుగా యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో మచ్చుకు ‘భారతమాత ఫౌండేషన్’ వారి సభలో చేసిన ప్రసంగంలో…
‘తరతరాలుగా, యుగయుగాలుగా చరిత్రకందని కాలం నుంచి ఎంతోమంది మహనీయుల పాదధూళితో పునీతమైన ఈ పవిత్రగడ్డలో జన్మించి, మహత్తరమైన సనాతన ధర్మానికి వారసత్వానికి ప్రతీకలుగా నిలిచి ఈరోజు మళ్లీ భారతదేశంలో, భారతమాత విశిష్టతను, విశ్వగురు పీఠాన్ని మరొకసారి ప్రపంచానికంతటికీ చాటుతున్న నరనారాయణులు అని చెప్పదగిన నరేంద్రమోదీ, అమిత్‌షాల నేతృత్వంలో భారతదేశం మళ్లీ తన పునర్వైభవాన్ని పునశ్చరణ చేసుకుంటోంది.’
2021 జనవరి 26న సిరివెన్నెల ఈ ప్రసంగం చేశాడు. అప్పటికి రెండు నెలలుగా సాగు చట్టాల రద్దు కోసం రైతులు ఉద్యమం చేస్తున్న సందర్భం అది. రైతు సంఘాలు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడం, ఎర్రకోటపై రైతులు జెండా ఎగురెయ్యడం, ఓ రైతు మృతి… సరిగ్గా ఇవన్నీ జరిగిన రోజునే సాయంత్రం పూట జరిగిన సభలో సిరివెన్నెల పై వ్యాఖ్యలు చేశారన్నది గుర్తుంచుకోవాలి. ఆయన నరనారాయణులుగా అభివర్ణిస్తున్న నరేంద్ర మోదీ, షాలు ముందుగా ఆర్డినెన్సుల రూపంలో, ఆ తర్వాత పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే, ప్రజాస్వామ్య విరుద్ధంగా, కేవలం మెజారిటీ బలంతో ఆ రైతు వ్యతిరేక చట్టాలను ఆమోదింపజేశారు. దానికి ఓ ఏడాది ముందు, ‘పౌరసత్వ సవరణ చట్టం’ పేరుతో ఓ ముస్లిం వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చి దేశంలో చిచ్చుపెట్టారు. దానిపై దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమం రాజుకోవడంతో, ‘నరనారాయణుల్లో’ ఒకరేమో నాటకీయంగా ఆ చట్టాన్ని జాతీయ పౌరసత్వ జాబితా (ఎన్ఆర్‌సీ) జోడిస్తామని ప్రకటించగా, మరొకరేమో దానికీ, దీనికీ అసలు సంబంధమే లేదని బుకాయించిన నేపథ్యంలో సిరివెన్నెల తన ప్రసంగంలో వారిపై పొగడ్తల వర్షం కురిపించారని గుర్తుంచుకోవాలి.
ఆ అప్రజాస్వామిక చట్టాలకు వ్యతిరేకంగా షాహీన్‌బాగ్ మహిళలు, సింఘూ/టిక్రీ బార్డర్ రైతులు ప్రజాఉద్యమ చరిత్రలో కొత్త అధ్యాయాల్ని రచిస్తూ, దేశప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్న సందర్భంలో, సిరివెన్నెల ‘సనాతనధర్మం’ అంటూ పాత, రోత భావజాల పారాయణం చేస్తున్నాడు. ఆ ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతూ, వాటిని దెబ్బతీసేందుకు సామ, దాన, భేద, దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్న ‘నరనారాయణులను’ ఆయన భారతదేశాన్ని విశ్వగురువు స్థానానికి తీసుకెళ్లగల సమర్థులంటూ ప్రశంసిస్తున్నాడు.
అంతకన్నా ఆరు నెలలు ముందు, కశ్మీర్‌కు ఉన్న నామమాత్రపు ‘స్వయంప్రతిపత్తి’ని కూడా దొంగదెబ్బ తీస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేసిందీ, ఓ ఏడాదిన్నర పాటు దాదాపు కోటి మంది ప్రజలకు ఫోన్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ లేకుండా చేసి, వీధుల్లోకి సైతం రానివ్వకుండా, రాత్రింబవళ్లు ఎడతెగని కర్ఫ్యూని విధించిందీ, వారిపై ఉక్కుపాదాన్ని మోపిందీ కూడా ఈ ‘నరనారాయణుల’ ద్వయమేనని కూడా గుర్తు చేసుకోవాలి. ఆ సభలో సిరివెన్నెల ఆవేశపూరితంగా ఇంకా ఇలా అన్నాడు: ‘ఇవాళ్టి పరిస్థితేంటంటే… రాముడు అనే మాట అన్ని మతాలకూ అతీతమైంది. రాముడంటే మర్యాద పురుషోత్తముడు. మనిషి చేరవల్సిన అత్యున్నత స్థితి రాముడు. దేశాలు గానీ, భాషలు గానీ, ఎల్లలు గానీ, ఏవీ లేకుండా విశ్వశాంతికి తపస్సు చేసిన ఈ మహత్తరమైన దేశానికి, మానవ జీవితానికి ప్రయాణించడానికి, పరిణించడానికి, ప్రగతి చెండటానికి, పరిపూర్ణం అవటానికీ… ఏది కొలమానం, ప్రమాణం అంటే, రాముడు అని చెప్పిన మహత్తరమైన భారసత్వానికి వారసులమైన మనమందరం కూడా.’
సిరివెన్నెల ఈ తేనెలూరే చిలుకపలుకులు పలకడానికి ముందూ, ఆ తర్వాతా కూడా ‘జై శ్రీరాం అంటావా, చస్తావా’ అంటూ దేశంలో లెక్కలేనన్ని చోట్ల ముస్లింలపై దాడులు చేసి, కొట్టి చంపిన ఘటనలు జరిగాయి. రాముడు ఇక ఏ మాత్రం ఇళ్లల్లో భక్తిగా దండం పెట్టుకునే దేవుడిగానే లేడు.. రాముడు ‘జై శ్రీరాం’ అనే ఉన్మాద నినాదంగా, ద్వేషాగ్ని రాగంగా మారిపోయిన సందర్భం అది. ఆ నిర్దిష్ట నేపథ్యంలోనే సిరివెన్నెల రాముడంటే మర్యాద పురుషోత్తముడనే తేనెపూసిన కత్తి లాంటి పలుకులు పలికాడు. రాముడంటే మర్యాద పురుషోత్తముడన్న నోటితో, రాముడి పేరుతో ఒకరిపై దౌర్జన్యానికి, విద్వేష దాడికి దిగటం తప్పని మాటవరుసకైనా సిరివెన్నెల తన ప్రసంగంలో సూచించలేదని కూడా మనం తప్పక గుర్తించుకోవాలి.
సిరివెన్నెల ప్రసంగం ఇంకా ఇలా సాగింది: ‘ఈనాడు, దురదృష్టవశాత్తు, విస్మృతివశాత్తు, నేను భారతీయుణ్ని, నేను హిందువుని, ఈ జాతికి వారసున్ని, ప్రపంచానికి, మానవజాతికి మార్గదర్శిని కాగలిగిన స్ఫూర్తిని కలిగిన వాన్ని అనే స్వాభిమానాన్ని మర్చిపోతున్న ఈ కాలంలో… ఆ నిరాశలో రాసిన మాట – అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా అని రాసిన నేను… నా జీవిత కాలంలోనే మళ్లీ పూర్వపు స్వర్ణ వైభవాన్ని చూపించినటువంటి నరేంద్రమోదీ రాజ్యంలోకి రాగలిగాం.’
ఆసక్తికరంగా, సిరివెన్నెల మాటలకు, కంగనా రనౌత్ ఇటీవల దేశ స్వాంతంత్ర్యం గురించి చేసిన హాస్యాస్పద వ్యాఖ్యలకు ఎంత దగ్గరి పోలిక ఉందో చూడొచ్చు. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా హిందూ మతతత్వ (లేదా హిందూత్వ) భావజాలాన్ని ప్రచారం చేయడమే కాకుండా, రాజకీయంగా కూడా నరేంద్ర మోదీ రాజ్యాన్ని ఆకాశానికెత్తుతున్నాడు. అదే అసలైన స్వాతంత్ర్యం అని పరోక్షంగా సూచిస్తున్నాడు. గత ఏడేళ్ల మోదీ పాలనలో దేశంలో పౌరహక్కుల హననం, మైనారిటీలపై దాడులు, దళితులపై దాడులు, విద్యాసంస్థలపై దాడులు, విద్యార్థులపై దాడులు, మహిళలపై, పాత్రికేయులపై పెరిగిన దాడులు, రైతు ఉద్యమ అణచివేత, కశ్మీర్/బస్తర్ వంటి చోట్లలో సాగుతున్న ఉద్యమాల అణచివేత… ఇవేవీ సిరివెన్నెలకు పట్టవు. డీమానిటైజేషన్, జీఎస్టీ, పబ్లిక్ రంగ సంస్థల్ని కార్పొరేట్ కంపెనీలకు తెగనమ్మడం వంటి విధానాలు ప్రజల పాలిటి శాపాలుగా మారిపోయానేది వాస్తవం కాగా, సిరివెన్నెలకు మాత్రం ఇదంతా ‘పునర్వైభవం’గా కనిపిస్తోంది.
సిరివెన్నెల తన ప్రసంగంలో సనాతన ధర్మం గురించి పదే పదే ప్రస్తావించాడు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఆయన సనాతన ధర్మం దళితులకు, నిమ్న కులాలకు ఇచ్చే స్థానమేంటి? మహిళలకు కల్పించే హోదా ఏంటి? సనాతన ధర్మాన్ని ఇప్పుడు ముందుకు తేవాలనుకుంటున్న కారణమేంటి? ఇవేవీ అందులో ఆయన చెప్పకున్నా ఆయన ప్రసంగాన్నంతా వింటే ఆయన ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవడం కష్టం కాదు. అంతేకాదు, ఆయన మరొక వీడియోలో వేదపాఠాలు కింది కులాల వారికి ఎందుకు వద్దన్నారో స్పష్టంగా కాకున్నా, న్యుయాన్స్‌డ్‌గా వివరించే ప్రయత్నం చేశాడు. అందులో, రాజ్యాంగ రచనకు వక్రభాష్యం చెప్పటమే కాకుండా, అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లే కులతత్వానికి కారణమనే తప్పుడు సూత్రీకరణ చేసే దుస్సాహసానికి సైతం పాల్పడ్డాడు. ఇంకా రిజర్వేషన్లేంటి అనే ఈసడింపును కూడా కనబర్చాడు. కాబట్టి తాను ఏ వైపు, ఎవరి వైపు నిలబడ్డాడనే విషయాన్ని సిరివెన్నెల చాలా స్పష్టంగానే చెప్పుకున్నాడు. దాన్ని బల్లగుద్ది మరీ చాటుకున్నాడు కూడా.
ఆయన పోగానే, సహజంగానే, చాలా మంది సాధారణ ప్రజలు, ఆయన అభిమానులు, సినీరంగ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. నివాళులర్పించారు. కానీ అభ్యుదయ/ప్రగతిశీల, విప్లవ శిబిరం అని చెప్పుకునే వారు స్పందించిన తీరు మాత్రం చర్చనీయాంశంగా మారింది. సిరివెన్నెల కవిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తుతూ, ఆయన పాటలు అద్భుతం అంటూ నివాళులర్పించడం వివాదంగా మారింది. తమ సంతాప వాక్యాల్లో, వీడియోల్లో కనీసం చనిపోయిన వ్యక్తితో తమకున్న భావజాలపరమైన దూరాన్ని, రాజకీయ విభేదాన్ని మాట మాత్రంగా కూడా పేర్కొనకుండా, అసలు ఆయనో తిరోగమనవాద భావజాలాన్ని మోసి, రాసి, ప్రచారం చేసిన వ్యక్తి అనే స్పృహే లేకుండా, వారు ఆయనను ఆకాశానికెత్తడంపై సోషల్ మీడియాలో చాలానే దుమారం లేచింది. ఆయన అనుసరించిన భావజాల వైఖరులపైన, ఆయన చేసిన సాహిత్య సృష్టిపైన విమర్శతో కూడిన స్పందన కనబర్చాల్సిందిపోయి, ‘పోయినోళ్లు అందరూ మంచోళ్లు’ అనే పచ్చి భావవాద, అరాజకీయ (apolitical) వైఖరిని తీసుకోవడం పట్ల చాలా మంది అభ్యంతరం లేవనెత్తారు.
ఇక దీనిపై వాడి, వేడి చర్చ, పదునైన విమర్శలు మొదలవటంతో వారు తమ తప్పును గుర్తించకుండా డొంక తిరుగుడు సమాధానాలతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆయన ఆర్ఎస్ఎస్ వాడని మాకు తెలియదని కొందరంటే, ఆయన భావజాలం ఏదైతేనేం అని లేదా అది ఆయన వ్యక్తిగతం అని బుకాయిస్తూ వివరణ ఇచ్చే ప్రయత్నం మరి కొందరు చేశారు. మరి కొందరు ఇంకాస్త దూరం వెళ్తూ, ‘ఆయన నరేంద్రమోదీ/అమిత్‌షాల అభిమాని అయితే మాత్రం తప్పేంటి, అది ఆయన వ్యక్తిగతం’ అని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ, ‘ఆయన పాటలే మాకు కావాల్సింది, ఆయనది ఏ భావజాలమైతే మాకేం’ అన్నట్టుగా ఆయనను సొంతం చేసుకునే ప్రయత్నం చేసిన వాళ్లు కూడా ఆయన పాటల్లో అసలు ఉన్నదేంటి అని ప్రశ్నించినప్పుడు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. పైగా ఆయన పాటలకు, మాటలకు సంబంధం లేదనే విపరీత సూత్రీకరణలకు కూడా మరి కొందరు ప్రయత్నించారు.
సిరివెన్నెల సృష్టించిన సాహిత్యాన్ని, ఆచరించిన భావజాలాన్ని, తన ప్రసంగాల్లో ఆకాశానికెత్తుకున్న సామాజిక-ఆర్థిక-రాజకీయ నమూనాని, వాటన్నింటి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా అర్థం చేసుకోలేకపోవడమే లేదా ఆ ప్రయత్నం చేయకపోవడమే ఈ గందరగోళానికి అసలు కారణం. బహుశా ఆయన సాహిత్యసృష్టికి, ప్రసంగాలకు నేపథ్యంగా ఉన్న స్థల, కాల పరిస్థితులు చాలా సంక్లిష్టమైనవి కావటం కూడా దీనికి ఓ కారణం కావచ్చు. ఇది ఫాసిస్టు పోకడల కాలం. ఫాసిస్టు పాలన పూర్తిస్థాయిలో మొదలవడానికి ముందు ప్రజల మెదళ్లను నియంత్రించే ప్రయత్నం ఒక్కోసారి బాహాటంగా, చాలాసార్లు చాపకింద నీరులా పథకం ప్రకారం సాగుతుంది. ఇప్పుడదే జరుగుతోంది. చరిత్రలో ఫాసిస్టులు సాధించిన విజయాలకు, వాళ్లు అధికారంలో ఉండటం మాత్రమే కారణం కాదు, గణనీయమైన స్థాయిలో వాళ్లకు లభించిన ప్రజామోదం కూడా కారణమే. కాబట్టి, మనం చరిత్రని పునరావృతం కానివ్వకుండా చూడాలి. దేన్ని ప్రేమించాలో మాత్రమే కాదు, దేన్ని ద్వేషించాలనే దానిపై కూడా పూర్తి స్పష్టతతో, అప్రమత్తతతో ఉండటం నేటి అవసరం.
చాలా స్పష్టంగా చెప్పారు. ప్రగతి శీల వాదులు అని చెప్పుకునే వారే ఆయన్ని వెనుకేసు రావడం సోచనియం!! వీరి ప్రగతివాదంతో నే దేశం చాలా ముందుకు పోతుందా? ప్రగతి అంటే మనువాద ప్రగతేమో! అయివుండొచ్వు!
👍🙏
Maa Satyam
“సనాతనధర్మ పారాయణమే సిరివెన్నెల సాహిత్య అంతస్సారం” రాసిన రమాసుందరి గారికి అభినందనలు. వ్యాసం లోని అంతరార్థం సమాజంలోని ప్రతి ఒక్కరిని క్రింద పేర్కొన్న
ఈ వాక్యాలు
“ఆయన పాటలు ఏ విలువల్ని ఎత్తిపట్టాయి? ఏ భావజాలానికి బాసటగా నిలిచాయి? వర్గాలుగా చీలిపోయిన నేటి సమాజంలో కొనసాగుతున్న శ్రమదోపిడీ, సామాజిక అణచివేత, వివిధ రకాల వివక్ష, కులాధిపత్యం, పితృస్వామ్యం, మతతత్వం వీటన్నింటి పట్ల ఆయన తన పాటల ద్వారా ఏం చెప్పాడు? సినీ గేయకారుడిగా తన పాతికేళ్ల కెరీర్‌లో వివిధ కీలక సందర్భాల్లో ఎటు వైపు నిలబడ్డాడు? ఏ వైఖరి తీసుకున్నాడు? ఏ వర్గాల వారికి దన్నుగా మాట్లాడాడు/రాశాడు? అనే ప్రశ్నలు వేసుకుంటే తప్ప సిరివెన్నెలపై మనం సరైన అంచనాకు రాలేం.”
నిజమే! హిందూమత తీవ్రవాదుల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో చారిత్రక దృష్టితో గతితార్కిక పరిశీలనతో లోతైన నూతన విశ్లేషణతో ఆలోచింప చేస్తుంది.
Very clear —nothing is wrong -truth is there
Well written Rama garu
ప్రగతిశీల మేధావులు అనే వాళ్ళూ,ఆయన తాత్విక దృక్పథం వ్యక్తిగతం అనడం ఒక విషాదం.
దేశమంటే మట్టి కాదోయ్ దేదేశమంటే మనుషులోయ్…
అన్నారు గురజాడ అప్పారావు గారు. ఆయన ఆ మాట అనే అప్పటికే కులం, మతం అనే establishments ఉన్నాయి. వాటికి మానసిక బానిసలు గా బతకాలా, లేక కేవలం మనిషి ని మనిషిగా చూసే మనుషులుగా బ్రతకాలా అనేది వ్యక్తిగత నిర్ణయం. తిండి, బట్ట, నీడ, చదువు లాంటి వాటికి ఏ లోటు లేని సమాజంలో పెద్దలు, మధ్య తరగతి వాళ్ళు కూడా ఈ బానిసత్వాన్ని కొనసాగిస్తూ, నిమ్న వర్గాల పైనా, మైనారిటీ ల పైనా జరిగే అకృత్యాలని ధర్మ రక్షణ అనటం, అలానే ప్రచారాలు చేయటం ఎంత దౌర్భాగ్యం అసలు!
ఎక్కడా నీళ్లు నమలకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పారు రమ గారూ. 👍
మరణంతో గతం సమాధి అయిపోదు. మంచి అయినా చెడు అయినా అది నమోదు అయ్యే ఉంటుంది. మరణానంతరం మంచిని మాత్రమే చూడాలి అనుకోవడం చరిత్రకి ద్రోహం చేయడమే. విమర్శనాత్మకంగా ఉండడం అవసరం. ఈ వ్యాసం మంచి ముసుగులు తొలగించింది. రమాసుందరి గారిలా ఇప్పుడు కూడా మాట్లాడక పోతే భవిష్యత్తుకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాము. ఇటువంటి అభిప్రాయాలు ప్రకటించినప్పుడు వివిధ రూపాల్లో దాడులు కూడా మొదలు అవుతాయి. ఇటువంటి రచయితలకు బాసటగా గొంతు పెగల్చడం కూడా అవసరం.
చాలా అవసరమైన వ్యాసం..సిరివెన్నెల వెనుక దాగున్న కొండచిలువనుస్పష్టంగా పట్టిచూపింది…
సందిగ్ధంలో ఉన్నవారికి తగిన అవగాహనకు తోడ్పడే విశ్లేషణ ఇది. ఈ రోజున జరుగుతున్నది రొటీన్ రాజకీయయుద్ధం కాదు,; ఈ దేశం ఎటువెళ్ళాలో మరోసారి తేల్చుకోవాల్సిన అవసరాన్ని కల్పించిన తీవ్ర భావజాల యుద్ధం. ఆ సంగతిని గుర్తించినప్పుడే ఇలాంటి సందిగ్ధాలు, కప్పదాట్లు కొంతవరకు తగ్గవచ్చు. ఈ భావజాల యుద్ధ తీవ్రతను గుర్తింప చేయడంలో వైఫల్యం కూడా ఈ పరిస్థితికి కొంత కారణం. ఈ వ్యాసం ఆ గుర్తింపుకు సాయపడుతుంది.
హిందుత్వాన్ని మనం అంతో ఇంతో మోస్తున్నామని, అది సాహిత్యం పేరుతో, తోటి సృజనాత్మక కవి, రచయిత పేరుతో మనం సంబరపడిపోతాము.
ఆ సృజనాత్మక కవి, రచయిత ఏ వర్గ కుల దృక్పథంతో ఎవరి సుఖం కోరుకుంటూ, ఏం భావాజాలంతో ఆ రచనలు
చేశాడో చర్చంచకుండానే గుడ్డిగా వారిని, వారి రచనలను కీర్తించడం నేటి కవులు, రచయితల దౌర్భాగ్యం.
అసలు సిరివెన్నెల సినిమాలో ‘సరసస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిదే’ అని రాసిన పాటలోనే తన సాహిత్య అంతస్సారాన్ని … దీన్నే మనం ‘మచ్చు తునక’ అంటామనుకుంటా.. ప్రపంచానికి బయటికి తీసి సీతారామశాస్త్రి నిస్సిగ్గుగానే ప్రదర్శించాడు. ‘నిగ్గదీసి అడుగు .. ఈ సిగ్గు లేని జనాన్ని’ అని ఎంతో ఆగ్రహంగా ఓ పాటలో ఆవేశపడ్డ రోజే అనుకున్నాను, అసలు తనకుందా , ఆ సిగ్గనేదని. రమాసుందరి గారు ఎంతో ఆత్మీయ అధికారంతో నా చేత చదివించి, స్పందించకుండా ఉండలేని పరిస్థితి కల్పించినందుకు కృతజ్ఞతలు. You left no stone unturned. आपका विश्रीलेषण तारीफ के लायख है।
It’s true. Good analysis
So detailed information.
చాలా స్పష్టంగా వివరించారు.
విశ్లేషణ బాగుంది
చాలా బాగా చెప్పారు. సీతా రామ శాస్త్రి గురించి చాలా కచ్చిత మయిన అంచనా వేశారు.
అతని తాత్విక చింత నే కాదు, వ్యక్తిగతం గా కూడా వ్యస నాల కు బానిస.
Good analysis! Such analyses are needed nowadays.
And I want to discuss about criticism for the benefit of gathering progressive lot.
When we are in a debate we should not assume that all progressive debaters are equally knowledgeable on workings of class societies. There will always be different levels in grasping things in class outlook. Particularly revolutionary cadres have to always strive to increase their flock by suitably making known ‘others’ about pitfalls of taking literary works of people like SIRIVENNELA on their face value, without proper outlook. Harsh criticism can’t always be the sure medicine. Harsh criticism can be used with equals and higher ups (in knowledge) but not with new entrants and confused minds.
It is true that there are opportunists who imitate progressiveness. It doesn’t mean that we can weigh each and every debater on the scale of class awareness. If we keep our cool by tirelessly debating with valid points such opportunists invariably get tired and stop imitating and show their true colors. Which means we should not try to forcibly tear down their opportunistic mask. Cause, we may be trying to tear down non-existing mask of the debater who turns out to be actually a confused progressive person.
When people like Sirivennela could attract these innocent progressives by successfully inciting all types of human sensibilities (like love, hate, friendship, blood relation, anger, dignity, indignity, fraternity and what not) through their literary skills, and cajole them into believing that there was no relation between one’s political philosophy and his writings…. is it advisable to resort to harsh criticism and throw them out of the progressive circle? We should think about it carefully.
At the same time, people should be ready to receive criticism in their stride. We do not get praises always. Unless we are ready to face criticism it is better to stop writing and commenting. Criticism will be in several forms. Figurative words in critical writings can not be understood in their actual meaning. If you are described as ‘పుస్తకాల పురుగు’ does that mean you are ‘పురుగు’, I wonder?
సనాతనధర్మ మని ఆయన ప్రతిపాదించేది వేల సంవత్నుసరాల వెనక్కి నెట్టే నీచమైన మనుధర్మశాస్త్రాన్నే..మరణించినప్పటికీ తిరోగమన సాహిత్యాన్ని క్రీటికల్ గా చూడాల్సిందే. ఇక వెనకేసుకొచ్చేవాళ్ళ గురించి ” మూలం( మౌలికంగానే బేధాలున్నప్పుడు వాదనలెందుకు” అని పెద్దలు చెప్పినట్లు వాళ్ళనుకూడా విమర్శనాత్మకంగా నే చూడాలి
చాలా స్పష్టంగా చెప్పారు.
Superb analysis
అర్థవంతంగా, శషభిషలేమీ లేకుండా చక్కగా రాశారు. సిరివెన్నెల సీతారామశాస్ర్తి రాసిన పాటల్లో ఆశావాదాన్ని ప్రబోధించేవి గొప్పగా ఉంటాయి. నిజమే. ఆయన రచనలపై ప్రశంసలు కురిపించేటప్పుడు ఆయన రాజకీయ అభిప్రాయాలనూ, భావాలనూ పరిగణనలోకి తీసుకుని తగినంత క్రిటికల్ గా ఉండాల్సిందే. కనీసం ఇది వామపక్షవాదుల కర్తవ్యం.
రమా సుందరి గారికి అభినందనలు…. విశ్లేషణ బాగుంది