సత్యం

“నా కెందుకనో బుగులుగున్నది…. ఎనుకటి నుంచి బతుకుతలేమా? ఎడినుంచి ఏడికత్తదో? ఇసప్పురుగుతోని సెలగాట్కమాడుతండ్లు- ఎవల సిరసు మీన గొడ్తదో గదా!” పున్నమ్మ గడుప మీన కూర్చుండి మొగన్ని చూస్తూ ఇలాగా చాలా సేపటి నుంచి సణుగుతోంది.

మొగుడు నారాయణ. భార్య పున్నమ్మ ముఖంలోకి తలెత్తి ఒక నిముషం చూశాడు… తల దించుకొని గ్యాసునూనెలో గుడ్డముక్క ముంచి చేతులున్న తుపాకిని తుడుస్తున్నాడు.

“నా మాటకు సిన్నమెత్తు ఇలువ లేకుంటయిపోయింది. అప్పటి నుంచి లడలడ నేనే అదురుతున్న- మాట్లాడ్తే నోటి ముచ్చాలు రాలిపోతాయా? సంఘాలు గింగాలని నువ్వు దిరిగి మా నోట్లే మన్ను బోత్తవుగని బర్రెమీన గురిసిన ఆన… ఉలకవు పలుకవు…”

“అయ్యిందా? ఇంకేమన్నా ఉందా?” అప్పుడు నారాయణ నోరు విప్పాడు.

తల్లిని తండ్రిని చూస్తూ కూర్చున్న కృష్ణకు వాళ్ళ మాటలు అర్థం కాలేదు. కుంపటి తిత్తి ఒదిలి పెట్టి తండ్రి దగ్గరికి జరిగాడు… గుడిసె బయట కూర్చున్న క్రిష్ణ తమ్ముడు సత్యం గూటికి చేరుతున్న కోడిపిల్లలతో ఆడుతున్నాడు.

“నాయిన్నా గిదీన్నే మంటరే…?” క్రిష్ణ తుపాకి చివర బొడిపె చూయిస్తూ అడిగాడు.

“నిశానంటర్రా-”

“గిదేం పని జేత్తది?”

“ఇగో గీడున్న రింగుల నుంచి నిశానును మనం కొట్టేదాన్ని మూడిటిని ఒక్క లైనుకు బెట్టి సూసి దెబ్బగొడితే తప్పిపోదు.”

క్రిష్ణ తనో గుడ్డముక్క తీసుకొని తుపాకిని తుడువసాగిండు…-

“నేనే మడుగుతను- నువ్వేం మాట్లాడన్నవ్- ఆఖరుకు” పున్నమ్మ కోపంగా లేచి నిలబడ్డది. ఆమె ముఖంలోకి రక్తం చిమ్ముకొచ్చింది. ఎర్రరాయి ముక్కుపుడక మరింత ఎర్రగా మెరిసింది…

“మీ నోట్లె ఇషం బోత్తనంటవ్… అంతేగదా” నారాయణ తుపాకి పూర్తిగా క్రిష్ణకిచ్చేసి చేతులు గుడ్డతో తుడుచుకుంటూ అన్నాడు.

ఇండ్లకు చేరుతున్న పశువులు బజారులో అరుస్తున్నాయి. దుమ్ము వాసన వేస్తోంది. గోధూళితో బజారు నిండిపోయింది…

నారాయణ లేచి నిలబడి గుడిశె ముందటి కొచ్చాడు… పశువుల వెనుక ఈడ్చుక పోయిన మొఖాలతో, దుమ్ము నిండిన ఒళ్ళుతో, చింపిరి గుడ్డల పశువుల కాపర్లు పశువుల నదిలిస్తూ నడుస్తున్నారు. ఆవులు లేగల కోసం ఒర్లుతున్నాయి.

ఎక్కడినుండో లేగ గొంతు ఆకలితో చాలా హృదయవిదారకంగా అరుస్తోంది. తూరుపు ఆకాశం మీద చుక్కొకటి మినుకు మినుకు మంటోంది.

పున్నమ్మ దీపం ముట్టించి అడ్డగోడ మీద పెట్టింది. దీపం వెలుగులో పున్నమ్మ ముక్కుపుడక ఎర్రరాయి కాంతివంతంగా మెరుస్తోంది.

నారాయణ చూరుకింది నులకమంచం వాల్చుకొని చేతులు తలకింద బెట్టుకొని వెల్లికిలా పండుకొని చింతల మీద నిలిచిపోయిన మబ్బు తునకల వేపు చూసిండు.

పున్నమ్మ గుడిశె బయటకొచ్చింది. గొంతు తగ్గించి–

“ఎవలెక్కడ బోతె మనకేంది? ‘బలీరె మన్నెపోడా! అంటే బండిగీరె మీనేసుకొని సచ్చిండంట’ నీ అసొంటోడు. మనకండ్ల ముంగట సింతకింది పోశన్న కొడుకు లచ్చిం మల్లు సంఘంల జేరిండని దొరేం జేసిండు? నోట్లెకచ్చిన జొన్నసేను గొడ్ల మేపిచ్చిండు. పోశన్నను జేలుకు పట్టించిండు. నిన్నగాక మొన్న పనులు బందుబెట్టిన పాలేరోల్లను పోలీసుల బిలిపిచ్చి తన్నిచ్చిండు. నామాటిను. దొర నిన్నింకా తన మనిషే అనుకుంటండు. నువ్వు గిట్లని తెలిసిందా? మామకాలం లిచ్చిన ఇనాం భూమి గుంజు కుంటడు. మనకు గీ ఊళ్ళేమున్నది? సేసుకుంటే తిన్నట్టు లాపోతే పన్నట్టు- దొరే కాదంటే నీతో నగలు నట్రా ఎవలు సేయించుకుంటరు? దొరను కాదని మనం బతుకలేం.”

“ఎప్పటికి నీ ముచ్చట నీదేగని- కూసంత ఇసారం జేసేవా? దొర భూమి మనకు పుణ్యానికియ్యలే- ముప్పయేండ్ల నుంచి నగలు జేసిచ్చినం- సిన్నపనికి, పెద్దపనికి కుక్కతీర్గ ఎంట తిర్గిన- అయినా గభూమి ముప్పయేండ్ల నుంచి మనమే కాస్తుజేస్తన్నం, ఆడెవ్వడు మజ్జెన గుంజుకోను? దొరలు పుట్టినప్పుడే బూములు భుజానేసుకొని పుట్టలే! ఊరు ఊరంతా కాష్నాల గడ్డయిపోతుంటే నీ ఏడుపునీదే- రేప్పొద్దుగాల నువ్వు వాని సెప్పులు నాకినా ఇడిసి పెట్టడు- ఝాడిచ్చి ముడ్డిమీన తంతడు. పిస్సదానా గాలత్తె అన్ని సెట్లను, ఆకులను ఊపుతది. నేనూగనని ఏ ఆకు మూలక్కూసున్నా అది ఇడిసి పెట్టది.”

“ఓ నారన్న. అతారే రడీ జేసినావే. ఇయ్యాల దొర, అమీన్ సాబ్ మాలెగట్టుకు సికారు బోతరట. నన్ను తుపాకి పట్టుకరమ్మన్నాడు.” తెనుగు గట్టయ్య వచ్చి వాకిట్లో నిలుచున్నాడు.

ఏదో చెప్పాలని నోరుతెరిచిన పున్నమ్మ నోరు మూసుకొని కూర్చున్నది.

“ఇగో ఇప్పుడే సాపుజేసి గిట్ల నడుంవాల్సిన- నువ్వు రానే వత్తివి. నేనే తెత్తామనుకుంటన్న… ఏదీ… ఈమజ్జన కన్పిత్తలేనే లేవ్ ఎటన్నబోయినవా? కూకో… పున్నీ గట్టన్నకు జరన్ని మంచి నీల్లు దెచ్చియ్యి..” నారాయణ మంచంలో లేచి కూర్చున్నాడు.

గట్టయ్య వాకిట్లో నేలమీద కూర్చుండి షికారు సంగతులు చెప్పుకొస్తున్నాడు. తను ఎన్నెన్ని జింకల, ఆడివి పందుల, మేకల ఎట్లెట్ల గురి చూసి కొట్టింది చెప్పుకొస్తున్నాడు.

“అయితే… దొరగారు నీకెప్పుడన్న ఏటమాంసంల కూసంతన్న ఇచ్చిండా?” నారాయణ.

గట్టయ్య “ఓసి నీకు ధీంత తెల్వదా?” అన్నట్టు నవ్విండు. నవ్వి…

“దొర ఏటకూర నాకెందుకిత్తడు?”

“నువ్వు కొట్టినప్ గన్క.”

“తుపాకి దొరదేగద…”

నారాయణ మాట్లాడలేదు…

“కూరగాదు- కూట్లెమన్ను బొయ్యకుంటే అంతే సాలు… ఇన్నొద్దులు సెరువు ఏలం నన్నూరుండేది. ఇయ్యేడు ఎయ్యిన్నర జేసిండు. జిమ్మల బట్టి అమ్ముక బతికేటోల్లం గన్ని పైసలెక్కన్నుంచి తెత్తమ్… కాదు కక్కుసమంటే పొరుగూరోల్లను దీసుకొత్తడట – ఆడికి ఏటా మేం గోసుకుని గుడిసెలు గప్పుకునే తుంగ కోపిచ్చి అమ్ము కున్నడు… దొరలు గిట్ల కోతుకం జేత్తే ఏడ బతుకుతం?…మాట్లాడ్తే ఖస్సుబుస్సు మంటండ్లు. దొర ఊళ్లె ఎవలిని నమ్ముతలేడు. మనం మొదటి నుంచి ఆఖరు దనుక దొరను నమ్ముక బతికినోల్లం! గిప్పుడు దొరను కాదని సంఘంగింగమని బతుకుతాం! దొరే ఇసారం జేయాలేగని.”

నారాయణ గట్టయ్యను చూసిండు. దీపం వెలుగు చారలా అతని మీద పడుతోంది. కండలు దిరిగిన శరీరం, బాన కడుపు. బుగ్గమీసాలు- మనిషి సెత్త దున్నపోతు సెత్తె-మెదడు గంతే! ఏం భాగ్గెం! మనసులో అనుకొని పైకి మాత్రం….”ఔనిచ్చమే… దేనికైనా దమ్ముండాలె గట్టన్నా…” అన్నాడు.

“ఇగనేం బోత. ఆలిశ్యమైతే దొర తిట్ల పంచాంగ మిప్పుతడు” గట్టయ్య లేచి నిలుచున్నడు.

“కిట్టన్నా గ తుపాకిదెచ్చి మామకియ్యి” నారాయణ…

లోపలి నుండి జవాబు లేదు.

“కిట్టా”

పున్నమ్మ గుడిశె లోపల తిడుతోంది.

“నెగులబుట్టనిపోడా! తుపాకంత ఇచ్చి కుప్పబెట్టినావ్.” ఆ తరువాత వీపుమీద దెబ్బవేసినట్టున్నది. కొంచెం సేపటికి క్రిష్ణ తుపాకి గుండులా గుడిశెలనుండి దూసుకవచ్చి బజారు వెంట పరుగెత్తసాగిండు. అన్న వెంటపడి సత్యం పరుగందుకున్నడు.

నారాయణ గొనుగుతూ లోపలికి నడిచిండు. లోపల తుపాకి ఏ కీలు కా కీలు విప్పదీసి ఉన్నది.

“చూడవోతే వీడు తుపాకీ తయారు చేసేట్టుగున్నది” నారాయణ.

“అయ్య తాళ్ళతొవ్వబడితే-కొడుకు ఈదుల తొవ్వన్నబట్టడా?” పున్నమ్మ.

మరో పది నిమిషాల్లో నారాయణ తుపాకి సరిచేసి గట్టయ్య చేతికిచ్చాడు.

** ** **

చాకల్ది ఊరు తిరిగిపోయింది. ఆకాశంలో చుక్కలను కప్పేస్తూ కర్రావు పొదుగోలె మబ్బులు-చిమ్మంజీకటి. చాలా గుడిశల్లో దీపాలు వెలగడంలేదు. ఊరి చివరనున్న మాదిగ గూడెంలో కుక్కొకటి ఉండి ఉండీ నీరంగా మొరుగుతోంది. ఎవడో భూలక్ష్మి పందిరికింద దుమ్ములో కూలబడిపోయి జీరగొంతుతో “లెల్లేలెల్లేలెల్లాయిలో డంగులు గొట్టి బంగులలు గట్టినమని” పాట పాడుతున్నడు. ఊరి మధ్యలో ఒక స్త్రీ ఎప్పుడూ తెగిపోని గొంతుతో ఏడుస్తోంది. ఆ ఏడుపులో రాగం తప్ప మాటలులేవు. తెనుగు గట్టయ్య బాగా తాగి తూలుతూ ఊరు పేరు లేకుండ తిట్టుకుంటూ ఎటో పోతున్నాడు.

“బతుకవ్వను కుక్కల్….., ఏం బతుకు. గరీబోడు బతుకద్దు… ఆని గొంతికె లింత ఎండ్రిన్ బొయ్యిండ్రి. వారీ! గట్టిగ నీ బతుకేం బతుకోంటా? ఊరుతోని గలువవు. ఆళ్ళ సెప్పులు నాక్కుంట తిరుగుతవ్. ఛత్తెరి. నాకేందిర ఊరుతోని పని. నా తల్లి కల్లులొట్టి సల్ల గుంటే సాలు.

ఎవడాడు కల్లుముంతో మాయమ్మ తల్లీ! నిన్ను మరువ జాలనే. ఎందుకేడుత్తన్నవే? నా తీరు బతుకుతే గీ తిప్పలచ్చేనా? దొరంటే దొరగాడు ధరినికి దొర! దొరకెదురు తిరుగుతే ఏమయ్యింది? ఊకో బిడ్డా! ఊకో” ఇలాగా వదురుతూ నడుస్తున్నాడు.

ఎవరో బక్కపలుచటి మనిషి ఎదురుగా వచ్చినవాడు కాండ్రకిచ్చి ఉమ్మేస్ తప్పుకొని కదిలిపోయిండు. గట్టయ్య నిలదొక్కుకొని ఏదో అనాలనుకున్నాడు… కాని ట పెకలకముందే దారిలో చింతవేరు తట్టుకొని ముక్కు మూసుక పడిపోయిండు. లేవాలని చాలా సేపు ప్రయత్నించి లేవలేక దుమ్ములో కా సేపు పొర్లి అక్కడే నిద్ర పోయాడు.

చీకటి మరింత చిక్కబడ్డది…. ఊరులుకు మగ్గిపోయింది. గుడిశెల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఒక్కొక్కరే తలనిండా ముసుగు పెట్టుకొని చెరువు కట్టవేపు నడుస్తు వారు. చెరువుకట్ట మధ్యలో ఉన్న గంగరావి చెట్టుకింద కుప్పకూడిండ్లు.

చెట్టుమొదట లచ్చయ్య కూర్చుండి గడ్డం బరుకూ బరుకున గోక్కుంటున్నవాడు ఏదో ఆలోచిస్తూ “రావాల్సినోల్లంత అచ్చినట్టేనా?” అన్నాడు. దూరంగా కూలబడుతూ వెంకటనర్సు “ఆఁ అందరచ్చినట్టే…” అన్నాడు.

చెరువులో కొత్త నీరు చీకట్లో కన్పించడంలేదు. అలలు కట్టకేసి కొట్టుకొని విరిగి పడుతున్ననప్పుడు మాత్రం విన్పిస్తోంది.

“బొండిగెల దనుక నీల్లచ్చినయ్. ఎనుకదారి బందయిపోయింది. మళ్ళింక ఉన్న దొక్కటే దారి-సావయినా రేవయినా ముంగటికే పోవుడు. మన సంఘ పెద్ద భీమన్నను పోలీసోల్లు పట్టుకపోయిండ్లు- ఎనకా ముంగట ఇసారం జేసుకోవాలే మనమే. ఊళ్ళెజొచ్చి పోలీసోల్లు అదునుకు దొరికి నోన్నల్ల మోటరెక్కిచ్చుక పోయిండ్లు- జమానతు పడి ఆళ్ళ నిడిపిచ్చుక రావాలె-అదట్లుంచుండ్లి! గిట్ల జేసుడు దొరకు బనావు గాదని రేపు పిల్లా జిల్లా అందరం ఊరేగింపు తియ్యాలె-ఇవారకే పది దినాలయ్యింది. పనులు బందు పెట్టి-మొగ కయికిలి అయిదు రూపాయలు ఆడకయికిలి మూడు రూపాయలు ఇచ్చేదనుక అన్ని పనులు బందే. ఇంకోటి సుత ఉన్నది” – లచ్చయ్య కా సేపాగాడు.

“లచ్చన్న మామా నీబాంచెన్…… ఆడ అయినను ఏంజెత్తండ్లో – పోలీసోల్ల సేతికి దొరుకుడంటె ఎములోల్ల సేతికి దొరికినట్లే…” భీమన్న భార్య రాజేశ్వరి కొంచెం ముంగటికి జరిగి చెప్పింది.

“నువ్వేం బుగులు పడకే బిడ్డా! భీమన్న పానానికి మాపానం ఎదురిత్తం” రాములు రాయేశ్వరి తలమీద చేయేసి దువ్విండు.

“గియ్యన్ని ఓఎత్తు… సెరువు ముంగటి పరంపోగుల నాగండ్లు కట్టటం ఒక ఎత్తు” సాంబయ్య.

“దేమో!గండ్లీం బండుతయి. అట్టి బొక్కలకు కోండ్రిగాడు దెబ్బలుదిన్నట్లు కులం సేత్తా సుఖం దక్కాలే- సెర్యెనుక అందరు పొలంలనే నాగండ్లు కట్టాలె-గది సాకలోల్ల మాన్నెంగద దొర సానేండ్లనుంచి దున్నుకుంటుండు.” రంగయ్య చిరబురు లాడిండు.

“ఎక్కనుంచచ్చిందిరో తెలివి. మందిని ముంచేతెలివి గాదు గదా!’ సాంబయ్య.

రంగయ్య చీకట్లోనే చేతులు తిప్పుతూ. “నిచ్ఛమే నేను దొరపాలేరోనే. గొప్పటినుంచే సంఘంల జేరుదామనచ్చిన.”

“బిడ్డా! నువ్వూ గరీబోనివే కాదన-కని గీడిమాట పొక్కిందో ఏరికేగదా! మ కడుపు మండిపోతంది” లచ్చయ్య.

“గసొంటి పనికెత్తుకుంటే నేను మా అయ్యకు బుట్టనట్టే” రంగయ్య. “ఒట్లుగాదు మాగ్గావలసింది పని” నారాయణ. “నీ కెర్కలేదానే నారన్న నా సంగతి” రంగయ్య.

“సరే! పరంపోగు దున్నాలె” లచ్చయ్య కా సేపాగి “ఊరేగింపు రేప్పొద్దుగాల కాకుంట మాపున తీత్తాము. పొద్దుగాల నాగండ్లు గడదాం. నారయ్య నువ్వు సాంబయ్య మున్సోక చీరుకు బోండ్లి. ఆడ మన మనుషులు గలుత్తరు. మేం ఈడిపని జూసుకుంటం” లచ్చయ్య..

కాసేపు తర్జన భర్జనలు జరిగినయ్. అంతవరదాకా మౌనంగా ఉన్న ఆకాశం గడగడలాడింది.

“ఛక్, ఛక్” మని మెరుపులు మెరిశాయి. కా సేపటికి టపటప చినుకులు రాలాయి. మబ్బుల్లాగా దడదడలాడున్న గుండెలతో, మెరుపుల్లాంటి ఆశలతో కొందరు-వర్షంలాగా మౌనంగా ఏడుస్తూ మరికొందరు గుడిశెలు చేరుకున్నారు.

ఆ రాత్రంతా వర్షం కురుస్తూనే ఉన్నది. నారాయణ మంచంలో వెల్లకిలా పండుకొని ఆలోచిస్తూనే ఉన్నాడు. పున్నమ్మ ఇద్దరు పిల్లలను గుండెల కదుముకొని చప్పుడు కాకుండా ఏడుస్తూనే వున్నది.

“పున్నీ! ఇవ్వార్ధనుక ముందటికి అచ్చే పనిబట్లే! మనోల్లంత జేల్ల కూకున్నరు. రాయేశ్వరక్క గొట్టొర్రినట్టు ఒర్రుతంది. నాకే మయ్యిందని సచ్చినోని కేడ్సినట్టేడుత్తన్నవ్. ఆ దినం బిడ్డ పెండ్లికి బంగారుగాజులు యాల్లకు అందియ్యలేదని జెరంతోనున్ననని సూడకుంట పెయ్యంత పెట్టన పేల గొట్టిన్నాడు ఏమన్నవో గుర్తుకు దెచ్చుకో? మంచినీల్ల బాయి కాడ నువ్వు గీ ఊరచ్చిన కొత్తల దొర కొంగు బట్టిన్నాడు నువ్వు ఏమన్నవో గుర్తుకు దెచ్చుకో?మన బతుకుల దొరెంత మన్నువోసిండో నా నోటి మీనికెళ్లేందుకు సెప్పిత్తవు? అయినా నీ పిచ్చి గాని నేను లేకుంటే సంఘపోల్లు ఊకుంటారా? అరదనీల్లు సాగినయ్. అండ్ల మనం గల్సుడేగని, మనంలేకుంటే గ నీల్లు ఆగుతాయే” – నారాయణ రాత్రంతా ఇలాగా గొనుగుతూనే ఉన్నాడు.

సత్యం కండ్లు చికిలించి చీకట్లోకి చూస్తూ వరపుచప్పుడు తండ్రి మాటలు
వారు. కాని వాళ్ళకేమి అర్థంగాలేదు.

*** *** ***

పనిమీద పోయిన నారాయణ గుడిశె చేరుకునేసరికి సూర్యుడు పడమటికి పోయాడు. తలుపు కతుక్కపోయి పున్నమ్మ ఎదురు చూస్తోంది.

నారాయణ ఇంట్లో అడుగు పెట్టడంతోటే పున్నమ్మ గడగడ చెప్పడం సాగించింది.

నాగండు గట్టబోయిన సంఘపోల్ల మీనికి దొర పట్నంనుంచి లాగులోల్ల చి, తోలిచ్చిండు. పదిమంది పుర్రెలు బలిగినయ్. గుడిసెల్ల జొచ్చి పిల్లాజెల్లా సలీముతకా అని సూడకుంట గుంజి కొట్టిండ్లు. ఊరంత కొట్టుకోల్లు, మొత్తుకోళ్ళు, ఏడ్పులు, పెడబొబ్బలు – ఆని ఉప్పాత మూడ్సుకపోను. లోపు సెల్లిచ్చు కుండు. సెడి సెల్లిచ్చుకున్నోల్లంత సెర్లకేపోతరు” పున్నమ్మ గుండెలు కోపంతో ఎగిరిపడుతున్నాయి.

నారాయణ కా సేపు భార్య ముఖంలోకి చూశాడు. పున్నమ్మ ఇంకా చెప్పుతూనే – ఉన్నది. నారాయణ వినుకుంటూనే కాళ్లు చేతులు కడుక్కొని కుండలో నీళ్ళు ముంచుక తాగిండు.

సాంభయ్య ఎగపోసుకుంటూ ఉరికచ్చిండు.

“నారన్న సత్తెనాశిడమయ్యింది” అన్నాడు సాంభయ్య “ఆడు సే సేపని ఆడు జేత్తడు. జనం తెగిచ్చిన్నాడు సూడు” నారాయణ.

ఇంతలోకే సుంకరోడు గజ్జెలకట్టె ఊపుకుంటూ పరుగెత్తుకొచ్చి సాంభయ్యను చూసి నీళ్ళు నములుతూ నిలుచున్నాడు.

“ఏం దుర్గన్నా సంగతేంది?” నారాయణ. “దొర నిన్ను జరూరుగ తోలుక రమ్మన్నడు.” “అత్తన్నపా.” నారాయణ గుడిశెలో నుండి బయటకొచ్చాడు. “గిప్పుడెందుకు?” సాంభయ్య. “అన్నా అద్దని సెప్పు” పున్నమ్మ

“నువ్వు లచ్చన్నను గలుపు. నేను ఇక్కడున్నట్టె అత్త.” నారాయణ బజారులోకి నడిచాడు.

పున్నమ్మ కెటూపాలుపోలేదు. చాలా సేపు నారాయణ వెళ్ళినవే పే చూస్తూ నిలుచున్నది… మొదట తనూ వెళ్లాలనుకొని వాకిలి దాటి వెనుకకు తిరిగి క్రిష్ణను పిలిచి “నాయన్నెంటవో- ఆడేమన్న జర్దేదుంటే జరూరుగ ఉరికిరా!” అని చెప్పింది.

క్రిష్ణ రివ్వున దొరింటివేపు దూసుకపోయాడు.

నారాయణ దొరింట్లో అడుగు పెట్టేసరికి దొర వెంకట్రావు పులితోలు కుర్చీలో పులిలాగే గురగుర లాడూ కూర్చున్నాడు. అతని కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి. అతని కణతల దగ్గర నరాలుబ్బి ఉన్నాయి.

“నారిగా నీకు మదమెక్కిందిబే… నా ఉప్పుదిని నామీనికే తయారయినవా? బంచత్ నేను తలుసుకుంటే-ఒరే : లంజకొడుకుల్లా, మిమ్ముల మీ సంఘాన్ని సీమల నలిపినట్లు నలిపిపారేత్త ఏమనుకున్నారో?” దొర గాండ్రిస్తున్నాడు…

నారాయణ తల వంచుకున్నాడు తలెత్తి దొరకళ్ళల్లోకి చూశాడు. నిజంగా ఆ చూపులకే శక్తుంటే దొర-దొరకుర్చీ మాడి మసై పోవాల్సిందే. అట్లా మసికాలేదు కనుక తాడు తెగిన బానం బర్డోలె దొర కుర్చీలో నుండి లేచాడు…. కాలు చెప్పుతీసి ఝాడిచ్చి నారాయణ దవడ మీద కొట్టాడు… నారాయణ చేతులు బిగుసుకున్నాయి… మరోమారు కొట్టడానికి లేపిన చేతిని దించుకున్నాడు దొర…

క్రిష్ణ పెద్దరువాజ దగ్గరే పిడికిల్లు బిగించి తలుపులను బాదుతున్నాడు… దొర మొరుగుతూనే ఉన్నాడు.

నారాయణ నోట్లో ఊరిన నెత్తురు ఉంచిండు…. నెత్తురు సూసి దొర కండ్లు ఇంకా ఎరుపెక్కాయి…

“గీ దెబ్బకు జవాబు సూపే దినమత్తది దొరా! నారాయణ గిప్పుడు నీ గులాం గాదు. సంఘపు మనిషి.” నారాయణ గిరుక్కున వెను దిరిగి పెద్ద పెద్ద అంగలేస్తూ బయటకు నడిచాడు…

“గట్టిగా దొర గావుకేక పెట్టిండు. గట్టయ్య పరుగెత్తు కొచ్చేసరికే నారాయణ మూల మలుపు తిరిగాడు.

“ఏడికి బోతడు లంజకొడుకు – తొండముదిరి ఊసురవెల్లయ్యింది వారీ! పున్నిని గుంజినపుడు కాల్లు గడ్పులు పెట్టుకుంటవి గదరా! ఇగో గట్టిగ ఇయ్యల్ల మాపున్న ఈని ఎకరం పొలంల నాగండ్లు గట్టుమను” తిడుతూనే ఉన్నాడు.

గట్టయ్య ఎటూ అర్థంగాక చేతులు నలుపుకుంటూ నిలుచుండిపోయాడు.

నారాయణ భూలచ్చిమి దగ్గెరికి వచ్చేసరికి అతనికి ఎదురుగా ఊరేగింపు వస్తోంది. దెబ్బలు తిన్నవాళ్ళు ముందు నిలుచున్నారు. ఎవడో బాగా పొట్టిగున్నవాడు ముందు ఛాతి చరుచుకుంటూ వంగుతూ లేస్తూ అరుస్తున్నాడు. ఇంకెవడో నం మధ్య చేతికర్రకు ఎర్ర రుమాలు కట్టి ఎగుర వేశాడు.

రేగింపు ముందు క్రిష్ణ చిన్నారి గొంతు చిరిగిపోయేటట్లు ఆగకుంట అరుస్తున్నాడు.

ఊరేగింపు వెనుక బలహీనంగా జనం గొంతులో గొంతు కలుపుతూ పున్నమ్మ నడుస్తోంది.

ఊరేగింపు నారాయణను చేరింది. పొంగిన నారాయణ దవడ ‘ఏంజరిగిందో?’ సాంభయ్యకు చెప్పింది.

నారాయణ ఊరేగింపులో కలిశాడు. అతని కంఠం విచ్చుకుంది.

ఆ “దొరల జులుం నశించాలె.”

“దున్నేవానికే” నారాయణ.

“భూమి” పుడమి దద్దరిల్లింది.

ఆకాశంలో మబ్బులు గడ గడ లాడాయి.

ఇందాకటి కురచ మనిషి ఏదో పాట ఎత్తుకున్నాడు. అందరూ ఆ పాటతో శ్రుతి కలిపారు.

ఊరేగింపు వాడవాడలు దిరిగి దొరింటి ముందటి కొచ్చింది. దొరగడి తలుపులు మూసున్నాయి.

“తన్నుండ్లి పీకుండ్లి” ఎవరో గుంపులో నుండి అరుస్తున్నారు.

“నీ సేతులకు జెట్టలు-నరుప్పలు బుట్ట-మా ముసలోన్ని సంపుతివి గదరో దొరోడా: నీ మందికి మారగాలం రాను: మా మీన ఇడిసి పెడితివి గదరో దోరోడా:” ముసలి స్త్రీ వణికే గొంతుతో భూమిని చరుస్తూ గోళ్ళతో మట్టిగీకి తలుపుల కేసి కొడుతున్నది.

“దమ్ముంటే తలుపులు దీసి మాట్లాడు.” నారాయణ గావుకేక పెట్టాడు. పున్నమ్మ వణికే కాళ్ళతో ఉరుకొచ్చి నారాయణ ఎత్తిన చేతిని పట్టుకున్నది.

కృష్ణ అప్పుడే తలుపుల ఎగబాకుతున్నాడు.

ఈడికి పదిపారీలు తన్నులు గుద్దులు తిన్నం. ఇంటికొగన్ని జేల్లకు తోలిండు. ఏం సంగతో అరుసుకుందాం నడువుండి” – ఎవరో బొంగురు గొంతు రైతు పండ్లు గొరుకుతూ అన్నాడు.

“ని కుక్క రంగన్ని సింతకు గట్టేసినం.” ఇంకెవడో మొత్తుకున్నాడు.

బంగళా పొంచున్న పెద్దపులి తీరుగ సడీసప్పుడు లేకుంటున్నది. పడమటివేపు సూర్యుడు నెత్తురు కక్కుతున్నాడు. ఎర్ర రుమాలు రెపరెపలాడుతోంది.

క్రిష్ణ తలుపుల మీదెక్కి కూర్చున్నాడు.

“నేను గొళ్లెంతీత్త” క్రిష్ణ తలుపుల మీద నుండే అరుస్తున్నాడు. క్రిష్ణ ఆవలివైపు జారిండు బంగళా కిటికీ తలుపులు తెరుచుకున్నాయి. క్రిష్ణ తలుపు గొళ్ళెం తీయడం, జనం తలుపులు తోసుకుని ప్రవాహంలా లోపలికి నడవడం ఒకేసారి జరిగాయి. కిటికి తలుపుల్లో నుండి తుపాకి మొరిగింది. క్రిష్ణ పక్కకు పల్టీ కొట్టాడు. క్రిష్ణకోసం ఉరికిన నారాయణకు గుండు దెబ్బ తగిలింది.

భల్లున నెత్తురు చిమ్మింది. “దున్నేవానికే భూమి” నారాయణ నెత్తురు మడుగులో గిలగిల కొట్టుకుంటున్నాడు.

ఇటు తిరిగిన క్రిష్ణ కళ్ళు నిలబడిపోయాయి. తుపాకి మొరుగుతూనే ఉన్నది.

కాల్పులాగిపోయినయ్. జనం మౌనంగా శవం మోసుకొని వెళ్ళిపోయారు. మబ్బుల ముఖాలమీద నెత్తురు పులిమి సూర్యుడు అస్తమించాడు. మూల మలుపు తిరిగిన తరువాత పున్నమ్మ గొంతు తెగిపోయింది. క్రిష్ణ తండ్రి శవాన్నే చూస్తూ మౌనంగా నడుస్తున్నాడు. అతని కళ్ళల్లో తాను తుడిచిన తుపాకి పొగలు కక్కుతూ కన్పిస్తోంది. తనవెంట నడుస్తున్న జనం కనిపించడం లేదు.

*** *** ***

ప్రభుత్వం ఆ తాలూకాను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. గ్రామం నిండా పోలీసులు దిగిపోయారు. ఒంట్లో సత్తువున్నవాళ్ళు గ్రామం విడిచి పారిపోయారు. పారిపోలేని ముసలివాళ్ళు జేల్లకుపోయారు. ఆ ఊళ్ళో స్త్రీలు పిల్లలు మాత్రమే మిగిలిపోయారు.

క్రిష్ణ రోజూ పోలీసులు టెంటు దగ్గరికి పోతున్నాడు. పోలీసులకు పిట్టకథలు చెప్పి నవ్విస్తున్నాడు. బూట్లు పాలిష్ చేసి యిస్తున్నాడు. తుపాకులు తుడుస్తూ-గుడ్లు తేలేసి ఒక్కొక్క భాగాన్నే పరిశీలిస్తున్నాడు.

దొర ట్రాక్టరుతో మనుషులను పట్నం నుండి తీసుకొచ్చుకొని భూములు దున్నిస్తున్నాడు. కిర్రు చెప్పులేసుకొని ఊళ్ళో తిరుగుతూనే ఉన్నాడు. పున్నమ్మ ఒకనాడు దొర గడీకి ఈడ్చుక పోబడింది. కొన ఊపిరితో ఉదయాన్నే గుడిశె చేరుకుంది. పిల్లలను దగ్గరికి తీసుకొని పగలంతా ఏడ్చింది. రాత్రి గుడిసెలు రవులుకుంటాయి. రేపటి మంట కోసం చితికిన గుండెలు సమాయత్తమౌతాయి. “రేపు” పోలీసుల కరుకు బూట్ల కింద నిర్దాక్షిణ్యంగా నలిగి పోతుంది. మరో స్త్రీ దొరింటికి బలవంతంగా ఈడ్చుక పోబడుతుంది. పోలీసులు గుడిశెలు గాలిస్తారు. గూళ్ళల్లో నిద్రిస్తున్న కోళ్ళను పట్టుకపోతారు. మంచాలమీద నిద్రిస్తున్న స్త్రీలను చెరుస్తారు. రోజూ గుడిశెలు రవులుకుంటూనే ఉంటాయి. తెల్లవారుతూనే ఉంటుంది…


*** *** ***

ఊరు నిశ్శబ్దంగా రాత్రి కడుపులోకి ఒదిగిపోయింది. పున్నమ్మ కుక్కి మంచంలో తెలివొచ్చి ఏడుస్తోంది. ఆ స్పష్టంగా ఏవేవో మాటలు వినిపించి తల తిప్పి చూసింది. దీపం వెలుగులో క్రిష్ణ సుత్తితో బొద్దు మీద పెట్టి దేన్నో కొడుతున్నాడు. సత్యం పొయ్యిలో ఎగుస్తున్న నిప్పుల్ని చూస్తూ తిత్తి పిసుకుతున్నాడు.

పున్నమ్మ లేచి కొడుకుల దగ్గరి కొచ్చింది. క్రిష్ణ పట్టుకారుతో ఇనుపముక్కను సాగకొడు తున్నాడు. అతని పక్క తుపాకి, దాని పక్క నాలుగైదు సైకిల్ గొట్టాలున్నాయి.

“గిదేం పనిరా కిట్టా” పున్నమ్మ

“తుపాకే అవ్వా: తుపాకి జేత్తన్న.” పని ఆపకుండ ఇనుప ముక్కను కొడుతూనే ఉన్నాడు. కంకబద్దలాంటి అతని చేయి వేగంగా కదులుతోంది. క్షౌరం లేక చెవుల మీద కంటా పెరిగిన వెంట్రుకల నుండి నల్లటి చెంపల మీద చెమట కారుతోంది. సత్యం కండ్లు నిద్రమత్తుతో మూతలు పడుతున్నాయి. అతని చిరిగిన లాగంతా తడిసిపోయింది.

పున్నమ్మ నోట మాటరాక కూర్చుండిపోయింది.

ఇనుపముక్క మీద నీళ్లు పోసి తుపాకికి ఒక పక్క పెట్టి బెజ్జం గొట్టి ఆ ముక్కను దాని కతికించి మొలకొట్టాడు.

“తుపాకి జేసి ఏం జేత్తవురా?” పున్నమ్మ “దొరను సంపుత.” తల్లివేపు చూడకుండానే అన్నాడు క్రిష్ణ.

పున్నమ్మ క్రిష్ణను ఒళ్ళోకి తీసుకొంది. సత్యం తల్లిని కావలించుకొని- కాసేపటికి నిద్రపోయాడు.

ఆ రాత్రంతా క్రిష్ణ తుపాకి తయారు చేయడం గురించి తల్లికి చెప్పుతూనే ఉన్నాడు- పున్నమ్మ “అద్దురా” అనలేకపోయింది.

సత్యం నిదురలో కలువరిస్తున్నాడు. తొలికూడి కూసింది. క్రిష్ణ అలా చెప్పుతూనే నోరుతెరిచి నిద్రపోయాడు. మలికోడి కూసింది. పున్నమ్మ లేచి కొడుకు చేసిన తుపాకి చేతి లోనికి తీసుకొని చూసింది. సైకిల్ గొట్టాలు కర్రముక్క అదేదో పిల్లలు ఆడుకునే కర్ర తుపాకి లాగానే తోచింది. ఇంకా దానికి చాలా పనిచేయవలసి ఉన్నదని పున్నమ్మకు తెలియదు. తీసి చూరులో పెట్టింది. ఆమెకు తుపాకి తుడుస్తున్న నారాయణ కళ్ళల్లో మెదిలాడు. గుబగుబ కండ్లనిండా నీరు నిలిచింది.

*** *** ***

మిట్ట మధ్యాహ్నం- ఉత్తరకార్తె ఎండ చిటపటలాడిస్తోంది. వెంకట్రావు పెరడి దగ్గర ట్రాక్టర్ గుడగుడలాడుతోంది. తాలూకాకుపోయే రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. దూరంగా పోలీస్ టెంట్లో నుండి ఏదో బూతుపాట రేడియోలో నుండి సన్నగా వినిపిస్తుంది. పడమటి వేపు మబ్బు కుదురుకుంటోంది. రోడ్డు పక్కకున్న చింతచెట్టు కొసల్లో ఉన్న సత్యం రెండు వేళ్లు నోట్లో పెట్టి ఈల గొట్టాడు. ఆ చింతకు వంద గజాల దూరంలోనున్న చింతకొమ్మల్లోనుండి జవాబుగా ఈల వినవచ్చింది.

వెంకట్రావుదొర గట్టయ్య గొడుగు పట్టుకోగా ఏదో మాట్లాడుతూ కిర్రుచెప్పుల మోతతో రోడ్డు మీది నుండి వస్తున్నాడు. రోడ్డు దిగి అడ్డదారిలో ఓ రెండువందల గజాలు నడిస్తే అతని పెరడువస్తుంది. ఆ పెరడు మార్గంలోనే ఉన్నాయి రెండు చింతలు. వెంకట్రావు మొదటి చింత దాటి యాభయి గజాలు నడిచాడు… మొదటి చింతమీది నుండి రెండుసార్లు ఈల వినిపించింది.


“ఎవర్రా ఈలలు గొట్టేది?” వెంకట్రావు మెడ రిక్కించి అటూ యిటూ చూశాడు.

“పోలీసోల్ల టికాన్ల నుండి గావచ్చు బాంచెన్- కుషీలుండి ఎవలో ఈలగొట్టి నట్టున్నది బాంచెన్…..” గట్టయ్య….

“మందిసొమ్ము మంగళారతి- పీక్కతింటండ్లు లల్లికొడుకులు. ఇంకో వారం పదిరోజులు సూసి- ఏడిదాడ సల్లబడితే లల్లి కొడుకుల ఎల్లగొట్టాలె. ఔరా గట్టిగ ఏన్నన్న సప్పుడినబడందా? లమిడి కొడుకులు పత్తకు లేకుంట దెంకపోయిండు.”

“మళ్ళింక ఏ మొఖం బెట్టుకొని ఊళ్ళోకత్తరు బాంచెన్… ఊళ్ళెకత్తె సున్నంలకు ఎముక లేకుండ నలుసుక తినరు-” గట్టయ్య.

“ఏదో లమిడి కొడుకులు పిచ్చిలేసినట్టు జేసిరి. పనిజేసుక బతుకుతే కాదన్నానురా” దొర.

దొర చింతకింది కొచ్చాడు.

“థాం”మ్మని తుపాకి పేలింది. దొర కుడిచేతి మనికట్టుల నుండి దెబ్బ దూసుకు మంది. గొడుగు పారేసి గట్టయ్య పరుగందుకున్నడు. దొర నెత్తురు కారే చేతితోనే ముందు కురికిండు.

అయిదు నిమిషాలు చప్పుడేమీలేదు. పడమటి మబ్బు ఉరిమింది.

పోలీసుల బూట్లు టకటకలాడినయ్. పోలీసులు ట్రాక్టరు వెనుక దాక్కున్న ఇగ దగరి కురికారు. దొర బెదిరే గుండెలతో చింతచెట్టును చూయించిండు. పోలీసులు భయం భయంగా అడుగులో అడుగేసుకుంటూ- చింతమీదికి నాలుగురౌండ్లు కాల్పులు ఎరిపారు. సడీసప్పుడు లేదు. చింతకింది కొచ్చారు. కొమ్మల్లోకి భయం భయంగా చూశారు. కొమ్మల చాటుకు తుపాకి పట్టుకొని పదేండ్ల క్రిష్ణ అతని చేతిలో తుపాకి….

ఒక పోలీసు గురిచూసి తుపాకి ఎక్కుపెట్టాడు. అంతలోనే ఎస్.ఐ. పడుతూ లేస్తూ ఉరికొచ్చాడు. ఎక్కు పెట్టిన తుపాకిని దించమన్నాడు.

“దిగిరా! దిగిరాకుంటే సస్తవ్” – యస్.ఐ. అరిచిండు.

“నేను రాను” క్రిష్ణ అరిచిండు.

“తుపాకి కింద పారేయ్”

“నేను పారేయ”

“సస్తవ్”

క్రిష్ణ కాసేపు మాట్లాడలేదు. ఏమనుకున్నాడో ఏమో? మెల్లెగా కిందికి దిగొచ్చాడు. అతని చేతిలోని తుపాకి ఒక పోలీసు గుంజుకున్నాడు. అదే తుపాకి చేతులుమారి క్రిష్ణను వంగదీస్తే వెన్నుమీద గుద్దింది. క్రిష్ణ ఏడవలేదు. క్రిష్ణను అరెస్టు చేశారు.

వందగజాల దూరంలోనున్న చింతకింది నుండి ఎనిమిదేండ్ల సత్యం పరుగెత్తు తున్నాడు. అతని వెంట ఇద్దరు పోలీసులు పడ్డారు. జింకపిల్లలా సత్యం చేలగట్ల మీదిగుండా, పొలాల మధ్యనుండి కొండవేపుకు పరుగెత్తాడు. పోలీసులు తలలు వేళ్లాడేసుకొని తిరిగి వచ్చారు.

మూడు సంవత్సరాలుగా విచారణ లేకుండా క్రిష్ణ జైల్లో, సత్యాన్ని తలచు కుంటూనే గడుపుతున్నాడు.

పున్నమ్మ చిరిగిపోయిన గుడ్డలతో కంపలా రేగిన తలతో గుడ్డల మూట చంకనబెట్టు కొని దేశంమీద పడి తిరుగుతోంది. కనిపించిన వారినల్లా “మా సత్యం కనిపించిండా?” అని అడుగుతుంది. గొడ్లగాసే పిల్లల్లో, బరువులు మోసే పిల్లల్లో, బూట్లు పాలిష్చేసే పిల్లల్లో, మోటార్లు తుడిసే పిల్లల్లో, జేబులుగొట్టే పిల్లల్లో, మిల్లుల్లో పనిచేసే పిల్లల్లో, అడుక్క తినే పిల్లల్లో సత్యంకోసం వెతుకుతుంది. కాని అక్కడెక్కడా ఆమెకు సత్యం కనిపించడు.

సత్యం –

పదకొండు సంత్సరాల సత్యం

తన అన్న విముక్తి కోసం ఏ కొండల్లో తుపాకులు తయారు చేస్తున్నాడో ? ? ?

(ఆధారం : ఆయుధాల చట్ట కింద అరెస్టు చేయబడి కరీంనగర్ సబ్ జైల్లో వున్న ఒక బాల నేరస్తుడు- అతను తయారుచేసిన తుపాకి)

(‘సృజన’ మాస పత్రిక, అక్టోబరు 1980)

పుట్టింది గాజుల ప‌ల్లి, మంథ‌ని తాలూకా, క‌రీంన‌గ‌ర్ జిల్లా. న‌వ‌ల‌లు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా క‌థ‌లు, కొన్ని క‌విత‌లు, పాట‌లు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాట‌కాలు రాశారు. 1979 నుంచి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

Leave a Reply