ఇవ్వాళ దేశవ్యాప్తంగా ఒక భయానక వాతావరణం ఏర్పడింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్లని భారత ప్రభుత్వం దేశద్రోహులుగా ముద్రవేసి జైలుకు పంపిస్తుంది. పదకొండేళ్ళ బాలిక మొదలుకొని 80 ఏళ్ల వృద్ధుల వరకు ఈ సెడిషన్ కేసులకు బలవుతున్నారు. ఈ కేసులు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. రచయితలు ఏది రాసినా, హక్కుల ఉద్యమకారులు ఏమిమాట్లాడినా, ఆఖరికి చిన్నపిల్లలు నాటకం వేసినా, ఈ ప్రభుత్వాలు గడగడ వణుకుతున్నాయి. తమ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజాస్వామ్య వాదుల మీద తప్పుడు కేసులను పెడుతోంది. ఈ విధానాన్ని విద్యావంతులు, హక్కుల ఉద్యమకారులు, సాహితీ వేత్తలు, లౌకిక వాదులు నిర్ద్వందంగా ఖండిస్తున్నారు. ఇట్లా ప్రకటన చేసిన వారిని దేశ ద్రోహులుగా తీర్మానించి జైలుకు పంపిస్తున్నారు. ప్రశ్నించే వారిని, నిలదీసే వారిని జైలుకు పంపించినట్లయితే తమకు ఎదురుండబోదని వీరి భావన.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఎవరికి వారు, ఎక్కడి కక్కడ నిరసనలను చేపట్టిండ్రు. ప్రజాస్వామ్యయుతంగా, దేశభక్తి పాటలు పాడుతూ ధర్నాలు చేస్తున్నారు. ఒక్క ఢిల్లీలోని షాహీన్బాగే కాదు ఇప్పుడు దేశమంతటా వేలాది షాహీన్‌బాగ్ లు ఏర్పాటయ్యాయి. ధర్నా కేంద్రాల్లో అన్ని మతాలకు చెందిన ప్రజలు ఐక్యంగా వంతుల వారిగా, తమ కర్తవ్యంగా నిరసనను వ్యక్తం చేస్తున్నారు. దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నంత నిష్టగా ఈ ధర్నాల్లో పాల్గొంటున్నారు. ఇందులో పాల్గొనే మహిళలను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతో హిందూత్వ వాదులు వారిపై కాల్పులు జరుపుతున్నారు. ‘గోలిమారో…లొంకో’ అనేది వారి ఊతపదమయింది. చట్టాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎంపీలు, ఎమ్మేల్యేలు సైతం దేశ మౌళిక సూత్రమైన లౌకిక పంథాను కాపాడాలి అని నినదించే వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు. డిసెంబర్ 11న పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత సాహిత్య, కళా రంగాల్లో పనిచేసే సృజన కారులపై ఎక్కువగా సెడిషన్ కేసు నమోదవుతున్నాయి. భారత రాజ్యాంగాన్ని, దేశ సమగ్రతను కాపాడుతామని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఇవ్వాళ ఒక మతస్థులను టార్గెట్ చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. డిల్లీలో అదే జరిగింది. ఈ అల్లర్లకు లోపాయకారిగా మద్ధతిచ్చిన ప్రభుత్వాలు జరిగిన హింసాకాండపై మొసలి కన్నీరు కారుస్తున్నాయి. పంతాలకు,పట్టింపులకు పోయి ప్రపంచ దేశాల ముందు భారత పరువు, మర్యాదను మంటగలిపే విధంగా సిఎఎ, ఎన్పిఆర్, ఎన్నార్సీను అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ డిల్లీలో జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు నిరసన ప్రదర్శన చేసినప్పుడు పోలీసులు విచక్షణా రహితంగా లాఠీచార్జి చేసి వారిని తీవ్రంగా గాయపరిచిండ్రు. ఈ లాఠీచార్జిలో గాయపడి ఒక విద్యార్థి తన కన్నును శాశ్వతంగా కోల్పోయిండు. లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై కూడా లాఠీలు ఝులిపించారు. అమ్మాయిలని కూడా చూడకుండా బాత్రూమ్ల్లోంచి బయటికి గుంజి వారిపై దాడికి తెగబడ్డారు. అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులపై కూడా ఇలాంటి దాడే జరిగింది. ఈ హేయమైన దాడిని ఖండిస్తూ కాన్పూర్‌లోని ఐఐటి విద్యార్థులు డిసెంబర్ 17న అక్కడ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు కూడా పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీలో విద్యార్థులు ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ‘హమ్ దేఖేంగే’ కవితను గానం చేసిండ్రు. 1977లో పాక్ నియంత జియాఉల్ హక్ కు వ్యతిరేకంగా రాసిన కవితను సిఎఎ సందర్భంగా గానం చేసినందుకు వారిపై యూఎపిఎ కింద సెడిషన్ కేసులను నమోదు చేసిండ్రు. అయితే ఈ సంఘటనలపై ఐఐటి ప్రొఫెసర్ రవీంద్ర అగర్వాల్ అధ్యక్షతన ఏర్పాటైన విచారణ కమిటీ తన నివేదికను సమర్పిస్తూ ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ కవితను చదివి ఉండాల్సింది కాదు అని తేల్చి చెప్పింది. అంటే కవిత్వానికి ఎంత శక్తి ఉందో దీని వల్ల అర్థమైతుంది. అరుణ్ గ్రోవర్ రాసిన ‘కాగజ్ నహీ దిఖాయింగే’, అమీర్ అజీజ్ రాసిన ‘సబ్ యాద్ రఖేంగే’ కవితలు కూడా అంతే పాపులర్ అయ్యాయి.
1870 ఆ ప్రాంతంలో బ్రిటీష్ వారు ఇండియాపై తమ ఆధిపత్యాన్ని నిరంతరం కొనసాగించడానికి తీసుకొచ్చిన సెడిషన్ చట్టాన్ని తర్వాతి ప్రజాస్వామిక ప్రభుత్వాలు మరింత పదును పెట్టాయి. 2002లో ‘పోటా’ చట్టాన్ని తీసుకొచ్చినారు. ఇప్పుడున్న ఉపా చట్టం 1967 నుంచి అమల్లో ఉంది.
లఖ్నోలో పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ర్యాలీ తీసినందుకు సదాఫ్ జాఫర్ అనే కాంగ్రెస్ నాయకురాలు, ఉద్యమకారిణిపై యోగి ప్రభుత్వం దేశద్రోహ కేసు నమోదు చేసింది. అరెస్టు చేసింది. అలాగే ఈ ర్యాలికి మద్ధతిచ్చినందుకు ఇంట్లో ఉన్న పోలీసు అధికారి ఎస్. ఆర్ ధారాపురిని కూడా అరెస్టు చేసిండ్రు. 77 ఏడేండ్ల యూపి మాజీ ఇన్స్పెకర్ జనరల్ అయిన ధారాపురి రిటైరైన తర్వాత దళిత, బహుజన, ఆదివాసీ, ముస్లిం ఉద్యమాలతో మమేకమై నడుస్తున్నాడు. అక్కడి పియుసిల్ సంస్థకు బాధ్యుడిగా ఉన్నాడు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో లఖ్నో నుంచి పోటీ చేసిండు. జనవరి చలిలో వణుకుతున్నప్పటికీ కనీసం ఆయనకు చద్ధర్ కూడా ఇవ్వకుండా, కుటుంబ సభ్యులను కలువకుండా చేసి జైలుకు పంపించిండ్రు. అట్లాగే మరో హక్కుల కార్యకర్త దీపక్ కబీర్‌ని కూడా ప్రభుత్వం అరెస్టు చేసింది. కబీర్‌ని లాకప్‌లో తీవ్రంగా కొట్టిండ్రని ఆయన భార్య ఆరోపించింది. మరో ఉద్యమకారుడు రిహాల్ మంచ్ స్థాపకుడు మొహమ్మద్ షోయెబ్, ప్రముఖ ముస్లిం మత బోధకుడు కాల్బె సాదిక్ కొడుకు కాల్బె సిబ్తె నూరిలను ప్రభుత్వం అరెస్టు చేసింది. వీరందరిపై దేశద్రోహ కేసుని నమోదు చేసింది.
డిసెంబర్ 19న జరిగిన ర్యాలీలో చాలా మంది సిఎఎ వ్యతిరేకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న హింసలో ఆస్తి నష్టం జరిగింది. అయితే యోగి ప్రభుత్వం 57మంది వ్యక్తుల నుంచి ఒక కోటి 55 లక్షల నష్టపరిహారాన్ని వసూలు చేసేందుకు నోటీసులు జారీ చేసింది. అంతే కాదు ఈ కేసులో అనుమానితులుగా ఉన్న సదాఫ్ జాఫర్, దీపక్ కబీర్, ఎస్.ఆర్. ధారాపురి తదితరుల ఫొటోలతో హోర్డింగ్‌లను లఖ్నో నగరమంతా ఏర్పాటు చేసిండ్రు. ఇందులో వీరందరి అడ్రసులు కూడా పేర్కొన్నారు. వందలు, వేల కోట్ల రూపాయలకు బ్యాంకులను ముంచిన, వికిలీక్స్లో పేర్కొన్న అవినీతి పరుల జాబితాలను ఎక్కడా ప్రదర్శించకుండా ప్రజల హక్కు కోసం, ప్రజాస్వామిక పాలన కోసం కొట్లాడిన వారి పేర్లను దోషులుగా/దొంగలుగా చూపిస్తూ హోర్డింగ్‌లను ఏర్పాటు చేసింది. దీంతో తమ వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఉద్యమకారులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కోర్టు వారికి అండగా నిబడుతూ హోర్డింగ్‌లను రెండ్రోజుల్లో తీసెయ్యాని తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ మోడి ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. అంటే ఇప్పటికీ ఈ ఉద్యమకారులను దోషులుగా, దొంగలుగా చూపిస్తూ లఖ్నో నగరంలో దాదాపు 125 హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి.
ఇండియాలో అందరికన్నా ఎక్కువగా సిఎఎ వల్ల అస్సామీలకు అన్యాయం జరుగుతుందని చెబుతూ అక్కడ హక్కుల కోసం కొట్లాడుతున్న సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత 80 ఏండ్ల హిరేన్ గొహెయిన్పై దేశద్రోహ కేసుని నమోదు చేసిండ్రు. పౌరసత్వ సవరణ చట్టం అస్సామ్ ఒప్పందానికి విఘాతం కలిగిస్తుందంటూ ఆయన దాని రద్దు కోసం సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అస్సామ్‌లో నిరసలను నిర్వహించినందుకు గాను ప్రభుత్వం 124(ఎ), 120(బి) సెక్షన్ల కింద హిరేన్‌పై దేశద్రోహ కేసులని నమోదు చేసింది. ఈయనతో పాటు సుప్రసిద్ధ జర్నలిస్టు మంజిత్ మహంతా, హక్కుల ఉద్యమకారుడు, రైతు నాయకుడు అఖిల్ గోగోయ్‌పై కూడా సెడిషన్ కేసును నమోదు చేసిండ్రు.
ఇందుకు భిన్నంగా కర్నాటక పోలీసులు ఒక 11 ఏండ్ల విద్యార్థిని తల్లిపై దేశద్రోహ కేసుని నమోదు చేసిండ్రు. బీదర్‌లోని షాహిన్ ప్రయిమరీ స్కూల్ విద్యార్థులు జనవరి 21న ఒక నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకంలోని పాత్రధారులందరూ తొమ్మిది నుంచి 12 ఏండ్లలోపు బాలలే! ఈ నాటకంలో ఒక దగ్గర ‘చెప్పుల’ ప్రస్తావన వస్తది. దాన్ని చెప్పుతో కొట్టండి అనే విధంగా ప్రచారం చేసి, ఈ విషయం అభ్యంతరకరమని అందుకు బాధ్యులైన పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని హిందూత్వ వాదులు డిమాండ్ చేసిండ్రు.
అయితే ఈ నాటకంలో ఇంకో విషయం కూడా ఉన్నది. అది అంతగా ప్రచారంలోకి రాలేదు.‘‘నా కాగితాలన్నీ ఎలుకలు కొరికేసినాయి, ఆ ఎలుకలను పిల్లులు తిన్నాయి. మరి ఆ పిల్లులను వీధి కుక్కలు బలి తీసుకున్నాయి. ఇప్పుడా కుక్కలన్నీ మీ మున్సిపాలిటీ లోనే ఉన్నాయి కాబట్టి.. ఇగ మేము కాగితాలు చూపెట్టేది లేదు’ అని కూడా నాటకంలో భాగంగా డైలాగులున్నాయి. వాటిని అలాగే ప్రదర్శించారు. ఈ నాటకాన్ని స్థానిక జర్నలిస్టు మొహమ్మద్ యూసుఫ్ రహీమ్ ఫేసుబుక్‌లో లైవ్ పెట్టిండు. అయితే ‘చెప్పల్’తో కొట్టాలే అనే అంశం వైరల్ కావడంతో పోలీసు ముందుగా ఈ నాటకంలో పాత్రధారి అయిన 11 ఏండ్ల బాలిక తల్లి 46 యేండ్ల నజిబున్సీసాను, ప్రధానోపాధ్యాయిని ఫరీదా బేగమ్‌ను అరెస్టు చేసి వారిపై సెడిషన్ కేసుని నమోదు చేసిండ్రు. ఈ నాటకంలో రెచ్చగొట్టే పదాలను అమ్మాయి తల్లి జోడించిందని ఆమెపై కేసును నమోదు చేసిండ్రు. సింగిల్ పేరెంట్ అయిన నజీబున్నీసా అరెస్టు కావడముతో అమ్మాయి బాగోగులు ఎవరు చూస్తారు అనే దానిపై కూడా చర్చ జరిగింది. వీరిపై భారతీయ శిక్షా స్మృతిలోని 124 (ఎ), 153 (ఎ), 504 సెక్షన్ల కింద కేసులను నమోదు చేసిండ్రు. అట్లాగే షాహీన్ గ్రూప్ స్కూల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాదర్, హెడ్మాస్టర్ అల్లాఉద్దీన్, పాఠశాల పాలక మండలిలోని ముగ్గురు సభ్యులపై కూడా కేసు పెట్టి వారిని జైలులో వేయడం జరిగింది. అయితే నిరంతర కోర్టు కేసులు, వాదనల తర్వాత వారిని బెయిల్‌పై విడుదల చేసిండ్రు.
ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఈ మూడు సంఘటనలు వరుసగా ఉత్తరప్రదేశ్, అస్సామ్, కర్నాటక రాష్ట్రాల్లో జరిగాయి. ఈ మూడు కూడా బిజెపి పాలిత ప్రాంతాలే. అంతకుముందు ఢిల్లీలో విద్యార్థులపై దాడి జరిగింది. ఈ దాడికి కూడా బిజెపి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతమైన డిల్లీలో పోలీసులు నేరుగా కేంద్ర హోంమత్రి ఆధ్వర్యంలో పనిచేస్తారు.
ఉపా చట్టాన్ని తమకు నచ్చని వారిపై, లేదా తమ పక్కలో బల్లెం లాగా తయారైన ప్రజాస్వామిక వాదులను నాలుగు గోడల మధ్యన నిర్బంధించేందుకు వినియోగిస్తున్నారు. నిజానికి 2014 నుంచి 2019 మధ్య కాలంలో నమోదైన ఉపా కేసుల్లో కేవలం నాలుగింటిలోనే నేరాలు రుజువయ్యాయి. అంటే ఈ చట్టం ఎంత దుర్వినియోగానికి గురవుతుందో తెలుస్తుంది. భారత రాజ్యాంగంపై చేతులు పెట్టి ప్రమాణం చేసే రాజకీయ నాయకులు ఆచరణలో మాత్రం దానికి ఏ మాత్రం విలువ నివ్వడం లేదు. అడుగడుగునా రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నారు. రాజ్యాంగానికి ఆత్మ లాంటి ప్రవేశికలో లౌకిక అనే పదమున్నది. అయితే ఇవ్వాళ ప్రభుత్వాలు లౌకిక విలువలకు తిలోదకాలిస్తూ, ముస్లిం కాందీశీకులకు ఈ దేశంలో స్థానం లేదు అని చట్టాన్ని తీసుకొచ్చారు. ‘వసుధైక కుటుంబం’ అని భారతీయ జనతాపార్టీ ఇన్నేండ్లు చెబుతూ వచ్చింది. ఇప్పుడు ఆ వసుధైక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా, ప్రపంచ దేశాల్లో భారత పరువు, గౌరవ, మర్యాదలకు భంగం కలిగే విధంగా చట్టాన్ని తీసుకొచ్చింది. తాము తీసుకొచ్చిన అమానవీయ చట్టాన్ని కాపాడుకోవడానికి ప్రజాస్వామ్య వాదుల్ని, లౌకిక శక్తుల్ని అరెస్టు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పంతాలకు, కక్ష సాధింపుకు తావులేదు. అందుకే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారత ప్రజల ఉద్యమాను గౌరవించి సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. యథాతథ స్థితిని కొనసాగించాలి. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే వారిపై దేశద్రోహ కేసు నమోదు చేయకూడదని చట్టం చెబుతుంది. రాజ్యానికి వ్యతిరేకంగా, కుట్ర పన్ని, ఆయుధాలతో కూలదోయడానికి ప్రయత్నించినప్పుడు, సాక్ష్యాలు, ఆధారాలు ఉంటేనే ‘సెడిషన్’ కేసు అదీ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుల్లో మాత్రమే పెట్టాలి. అయితే ఈ నిబంధనలకు నీళ్ళొదిలి ప్రభుత్వం ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నది. ఇకనైనా ఈ ధోరణిని ప్రభుత్వం మార్చుకోవాలి. సంయమనంతో వ్యవహరించాలి.