శ్రామిక స్త్రీల ఆత్మగీతం, విప్లవోద్యమ మాతృగీతం ‘సిరిమల్లె సెట్టుకింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా’

విప్లవోద్యమంలో పాట గురితప్పని తూట. విప్లవ గీతాల ప్రస్థానంలో గద్దర్ పాట ఆయుధం కంటే శక్తివంతమైంది. విప్లవ భావజాల వ్యాప్తిలో గద్దర్ గళం ఉత్తేజపూరిత పాత్రను పోషించింది. జన నాట్యమండలిని వేదికగా చేసుకుని విప్లవ శ్రేణుల్లో యుద్ధస్ఫూర్తిని పెంపొందించాడు. దారిద్ర్యంతో సహజీవనం చేసి ఇంజనీరింగు విద్యను పూర్తిచేసి బ్యాంకు ఉద్యోగిగా తన బతుకు పోరాటాన్ని ఎందరికో పాఠంగా చూపాడు. అయినా ఏదో తెలియని అసంతృప్తి, ఆవేశం, ఆగ్రహాలు ముసురుకున్న వేళ పాటను తన బాటగా మార్చుకున్నాడు. ఆ బాటలో ఇరువైపులా విప్లవ బీజాలను వెదజల్లుతూ మార్క్సిజం అంతిమ గమ్యంగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ఆ గమనంలో రాసిన పాటలు ఒక్కొక్కటి ఒక ఎర్ర మైలురాయి.

గద్దర్ తాను రాసిన పాటల వెనుక ఒక అశ్రు బిందువు, అగ్నికణాన్ని దాచిపెట్టాడు. “ప్రతి పాట వెనుక ఓ కథ ఉంటుంది. ఆ కథ వెనుక కష్టజీవుల కన్నీళ్ళు, సెమట సుక్కలుంటాయి. ఆ కన్నీళ్లను చెమట సుక్కలు దోచుకునే దొంగలుంటారు. ఆ దొంగలను ఎదురించే వీరులుంటారు” అని తన ప్రతి పాట వెనక ఒక వీరగాథ దాగి ఉంటుందని గద్దర్ సూచిస్తాడు. గద్దర్ పాట ఒక బలమైన సంఘటన, సున్నితమైన దృశ్యం, కదిలించే చిన్న మాట ద్వారా ఆవిర్భవిస్తుంది. అట్లా పుట్టిన ఒక పాట ఒక చారిత్రక నిర్మాణ గాథగా పరిణమిస్తుంది. ‘వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, అమ్మ నీకు వందనం మాయమ్మ ఆలీసమ్మ’, ‘నాసా కింద మీసా కింద నిన్ను జైల్ల బెట్టినారు, నీకు నాకు తేడా లేదాయో ఓ పోలీసన్న’, ప్రజల డాక్టరమ్మో మాయన్నా రామనాథం’. ‘ఓరోరి అమినోడా, ఓరోరి సర్కారోడా పదిలంగా ఉండు కొడుకో, కదిలింది ఎర్రదండు’ అంటూ గద్దర్ ఒక్కటా రెండా వందలాది పాటలు ప్రజల వాడుక మాటలుగా మార్చిన విప్లవ వాగ్గేయకారుడు. సాహిత్యోద్యమ సాగరంలో ప్రజా యుద్ధనౌకగా పయనించిన గాయకుడు గద్దర్. అంతటి భావోద్వేగ తీవ్రత కలిగిన గద్దర్ తన అమ్మను స్మరించుకుంటూ రాసిన “సిరిమల్లె సెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా” పాటలోని సామాజిక, వైయక్తిక ఆర్తిని విందాం.

గద్దర్ ఈ పాట రాయడం వెనుక బలమైన నేపథ్యం ఉంది. విప్లవోద్యమంలో తిరుగుతూ తల్లికి తన జాడ తెలియని పరిస్థితులు అవి. అనుకోకుండా ఒక రోజు రోడ్డుమీద తన ఊర్లోని ఒక పేద రైతు గద్దరుని గుర్తుపట్టాడు. ఆ రైతు సంతోషంతో గద్దర్ ఒల్లంతా నిమురుతూ “ఎంత మంచి వానివి గిట్ల పోయినవ్.. మన ఊరుకు పోదాం. ఊల్లో బత్కుదువ్…. మీ అమ్మ ఆ చింతచెట్టు కింద కూసోని, కొడుకా, కొడుకా అని పక్షి వొలపోసినట్టు వొలపోస్తుంది” అన్న మాటలతో గద్దర్ లోని కవి హృదయం చలించిపోయింది. తను కన్పించినట్టు అమ్మకు చెప్పొద్దని రైతుతో చెప్పాడుగాని గద్దర్ మనస్సు సొంతూరికి వెళ్లిపోయింది. “ఇంటి ముందు చింతచెట్టు కండ్లలో తిరిగింది. అమ్మ అనుభవించిన కష్టాలు, ఈ వయసులో కూడా కూలి తల్లిగా పడుతున్న కష్టాలు అన్నీ కళ్ళముందు తిరిగాయి. అంతే సిరిమల్లె చెట్టుకింద సినబోయిన పాట మొదలయ్యింది.

సిరిమల్లె సెట్టుకింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా
నీవు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా

||సిరి||

ఈ పాటలో సిరిమల్లె చెట్టు కింద చిన్నబోయి కూసుస్నది ఒక్క గద్దర్ తల్లేకాదు, శ్రామికురాలైన ప్రతి తల్లిని తలచుకుంటూ రాసిన విశ్వజనీన మాతృగీతం. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనుల్లోనే కాదు బతుకు పోరులో తన శక్తి కంటే రెండింతలుగా శ్రమించే స్త్రీలందరికీ వర్తించే పాట ఇది. మగవాళ్ళతో సమానంగా పోటీపడుతూ బతుకుబండి కదలడంలో వెనకగావుండి ప్రధాన పాత్ర పోషిస్తున్న అమ్మలందరికి అనువర్తించే గీతంగా రూపొందించాడు. ప్రకృతి ఒడిలో జరుగుతున్న పనులలో వ్యవసాయం ఒక అద్భుత శ్రామిక కావ్యం. ఒక తొమ్మిది చరణాలలో ఒక శ్రామికురాలి బతుకు వేదనను మరచిపోలేని వ్యధాభరిత దృశ్యకావ్యంగా మలిచాడు గద్దర్.

మోకాళ్ల మట్టూకు బురదలో దిగబడి
ఎద్దోలె ఎనుకకు ఒక్కొక్క అడుగేసి
నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మా
నీ నడుములే ఇరిగేన లచ్చుమమ్మో లచ్చుమమ్మా
||సిరి||

మోకాళ్ళ దాక బురదలో దిగబడిన ఎద్దోలె వెనుకకు ఒక్కొక్క అడుగేస్తూ నాట్లేసిందనే కవి వర్ణనలో ఒక యుద్ధక్షేత్రంలో సాహస వీరుడి విన్యాసంలా గోచరిస్తుంది. వ్యవసాయపు పనుల్లో పశువులు ఎంత తీవ్రంగా శ్రమించి కఠినమైన పనులు చేస్తాయో అందరికి తెలుసు. ఆ స్థాయిలో మహిళలు శ్రమిస్తున్నారనే విషయాన్ని కవి కీర్తిస్తున్నారు. అంతేనా ఆ పనులు చేసి చేసి నడుములు విరిగిపోయిన శారీరక బాధామయ స్థితిని చూసి కన్నీరు పెట్టుకుంటాడు.

వ్యవసాయ వృత్తిలో అనేక ప్రమాదాలు పొంచి వుంటాయి. ఇక ప్రకృతి వైపరిత్యాల ద్వారా కలిగే నష్టం వర్ణనాతీతం. పెద్ద పెద్ద పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల్లాగే వ్యవసాయంలోనూ ఎదురవుతాయి. ఈ పాటలోనూ లచ్చుమమ్మ వరి మోపు ఎత్తుకొని బిరబిరా నడుస్తుంటే కాలు జారి పడిపోతుంది. కాలుచేతులు విరిగిపోయి మూలన పడుకోవలసి వస్తుంది. గద్దర్ తల్లికి వచ్చిన కష్టం వ్యవసాయదారులందరికీ వర్తిస్తుంది. వ్యవసాయం కూడా ఒక యుద్ధక్షేత్రమే. ఏదో ఒక రకంగా క్షతగాత్రులు కావలసిందే.

ఈ పాటలో కవి మనిషికి కావల్సిన మౌలికావసరాల ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తున్నాడు. లచ్చుమమ్మ మాసిన తల, చినిగిన రయిక, పేలికల చీర, పాసిపోయిన బువ్వ, మాడిపోయిన గట్కను చూపుతూ గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ కూలీల దైన్య స్థితి కడుపు తరుక్కుపోయేలా పాడుతాడు. వొంటి మీద కప్పుకోవడానికి సరైన బట్టలు కూడా లేని దుస్థితిని చూపుతాడు. ఎంతో బరువైన, కష్టమైన పనులు చేయడానికి కావల్సిన శక్తి ఆహారం ద్వారా అందుతుంది. శక్తి నందించే పౌష్టికాహారం సంగతిని పక్కన పెడదాం. ప్రాణం నిలుపుకోవడానికి అవసరమైన కొద్దిపాటి తిండి కూడా దొరకని పరిస్థితి వ్యవసాయ కూలీలది. దీనికితోడు పాడయిపోయిన తిండి తిని తీవ్రమైన అనారోగ్యాల బారిన పడిపోవడం, ఎన్నోసార్లు ప్రాణాలు పోయిన సందర్భాలను చూస్తున్నాం. ప్రాథమిక అవసరాలు కూడా తీరని బతుకుల్లోని విషాదాన్ని చూసి వెక్కివెక్కి ఏడుస్తున్న కవి స్వరాన్ని మరచిపోలేం.

గాడ్పొచ్చి గుడిసెంత గాలికెగిరీ పాయె
చలికాలమొచ్చింది సాప పింపులు లేవు
బొంతగుడుదామన్న పాత పేల్కలు లేవు
చలికి వొణుకుడు బుట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మా
నీ సంటోడు సచ్చిండ లచ్చుమమ్మో లచ్చుమమ్మా” || సిరిమల్లె ||

శ్రామికుడి జీవనం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. శ్రామికుడు కొంతసేపయిన తన గూడులో విశ్రాంతి తీసుకుందామన్నా అవకాశం లేని పరిస్థితి. బలమైన గాలులకు గుడిసె కప్పు పైకి ఎగిరిపోతుంది. వర్షాకాలం నానిపోతాడు. చలికాలంలో చలినుంచి తప్పించుకుందామన్నాసిన్న సాపసింపులూ కరువైనాయి. పాత పేలికలు కూడా దొరకలేదు. చలికి తట్టుకోలేక పసివాళ్లు బలైపోయిన సంఘటనలు ఎన్నో ఈ పాటలో లచ్చుమమ్మ కంటినించి కారిన దు:ఖం, ఆ గర్భశోకం దారిద్ర్యరేఖకు దిగువనున్న అందరిది. సామాన్య మానవుడి వెతలనన్నింటిని స్పర్శిస్తుంది ఈ పాట.

ఆకలికి పోరగాండ్లు అల్లాడిపోవంగ
అన్నారెడ్డి నువ్వు జొన్న కొయ్యబోతే
జొన్న కొయ్యా దిగి లచ్చుమమ్మో లచ్చుమమ్మో
నీకాలంత ఆసింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ’ || సిరిమల్లె ||

ఇంతకు ముందు చరణంలో చెప్పుకున్న ప్రమాదాలనే కవి మరింత విస్తృతంగా వర్ణిస్తున్నాడు. ఇంట్లో పిల్లల ఆకలికి తట్టుకోలేక కూలికోసం అలవాటు లేని పనుల్లోకీ దిగవలసి వస్తుంది. ఒక్కోసారి అలవాటయిన పనుల్లోనూ ఏదో తప్పు జరిగి గాయపడడం జరుగుతుంది. సూది మొనలాగ వుండే జొన్నకొయ్య కాల్లోకి దిగినప్పుడు కలిగే బాధ, తదనంతర నొప్పులు ఎవరికివారు అనుభవిస్తేనే తెలిసేది. ఎర్ర తేలు కరిచినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. ఎంత జాగ్రత్తగా వున్నా జరిగే ప్రమాదాలు బతుకుని మరింత దుర్భరం చేస్తాయి. దిగజారుస్తాయి. గద్దర్ తన అవ్వ జీవితంలోని గాయాల తీవ్రతను వేదనాభరితంగా గానం చేస్తాడు. గద్దర్ స్వరం నుండి వింటే రాతిహృదయమైనా కరిగి నీరవ్వాల్సిందే.

రెక్కల కష్టం మీద ఆధారపడిన బతుకుల్లో పండుగలు రావడం చాలా అరుదు. క్యాలండర్లో క్రమం తప్పకుండా వచ్చే పండుగలు శ్రామికుల ఇంట్లోకి అడుగు పెట్టడానికి భయపడుతాయి. పేదలకు పండుగంటే ఒక అదనపు ఖర్చు. ఒక రోజు కూలి దొరకని సెలవుదినం పండుగ. దసరాకు కడుపునిండా తినడానికయ్యే వస్తువులను కొనడానికి చేతిలో పైసలుండవు. దీపావళి దీపం వెలిగిద్దామన్నా నూనె లేదాయే. అడవులంటే తలకు రాసుకోవడానికన్నా మించిన పండుగ వుంటుందా? కవి నిరుపేదల బతుకుల్లోని భయానక యథార్థాన్ని నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నాడు.

దసరా పండుగ వచ్చె దమ్మిడీ లేదాయె
దీపావళి వచ్చె దీపంతె లేదాయె
శివరాత్రి ఒచ్చింది ఉపాసముండాలె
నీ బతుకంత శివరాత్రి లచ్చుమమ్మో లచ్చుమమ్మా

శివరాత్రి పండుగ నాడు ఉపవాసముంటే శివుడు అనుగ్రహిస్తాడు. ఎంతో పుణ్యాన్ని మూటగట్టుతాడు అని భక్తుల విశ్వాసం. దాన్ని ఆధారం చేసుకుని కవి లచ్చమ్మ ఆకలి పోరాటాన్ని ఎత్తిచూపుతున్నాడు. నిత్యం కడుపు నింపుకోవడంలో విఫలమై రోజూ ఒక పూటైనా ఉపవాసం ఉంటున్న వాస్తవ గాథలు వారివి. ఆ విధంగా లచ్చుమమ్మల్లాంటి బతుకుల్లో ఉపవాసం అనివార్య దుస్థితి. కాబట్టి ‘నీ బతుకంతా శివరాత్రి’ అంటూ వ్యంగీకరిస్తున్నాడు కవి.

ఏ కర్మమనుకోని ఏడుపాయలెల్లంగ
గాచారమనుకోని నాచారమెల్లంగ
తొవ్వలో దొంగలు లచ్చుమమ్మో లచ్చుమమ్మో
నీ బువ్వ గుంజుకొని లచ్చుమమ్మో లచ్చుమ్మా
……
కూలోల్లకందరికి కూడు దొరకాలని
కొమిరెల్లి కొండల్ల ఎత్తిండ్రు కొడవళ్లు
కొడవండ్లు నూరుకొని లచ్చుమమ్మో లచ్చుమమ్మా
నీ కొడుకులను కలువరా లచ్చుమమ్మో లచ్చుమమ్మా

గద్దర్ ఈ పాట చివరి చరణాల్లో ఒక లక్ష్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు. తన ఆశయాన్ని నిర్భయంగా ప్రకటిస్తున్నాడు. లచ్చుమమ్మల్లాంటి మనుషులందరికి ఒక గమ్యాన్ని నిర్దేశిస్తున్నాడు. అణచివేత, దోపిడీకి గురవుతున్న వారందరికి ఒక పోరాటమార్గాన్ని తన పాట ద్వారా నిర్మిస్తున్నాడు. నోటికాడి ముద్దను గుంజుకుంటున్న దోపిడీ వ్యవస్థను కూలగొట్టాలని పిలుపునిస్తున్నాడు. కండలను కరిగిస్తున్న కూల్లోల పొట్టలు నిండడానికి పిడికిళ్ళు బిగించాలనే ధైర్యాన్ని అందిస్తున్నాడు. చేసులు కోసిన చేతుల్లోని కొడవల్లకు కొత్త పనిని అప్పగిస్తున్నాడు కవి. కొడుకు కోసం ఎదురుచూసే తల్లిని తన దగ్గరకే పిలుచుకుంటున్నాడు. లచ్చుమమ్మలాగ దుఃఖపడుతున్న వారందరిని విప్లవోద్యమాల్లోకి ఆహ్వానిస్తున్నాడు. తిరుగుబాటును, ధిక్కార స్వరాన్ని తన పాటద్వారా నేర్పుతున్నాడు.

బిడ్డా మనం ఏ ఆస్తిలేనోళ్ళం. ఆ దేవుడిచ్చిన ఈ మట్టిచే తులే మనాస్తి, పాసి… ఈ మట్టి రెక్కలు ఇరిసి నీకిస్తున్న వాటిని నమ్ముకొని బతుకు…. ఆ మట్టి చేతులను బురదలో ముంచితే…. బువ్వ దొరుకుతుంది. ఆ మట్టి సేతులతో అ,ఆ,ఇ ఈ లు రాస్తే…. ఆత్మగౌరవం వస్తుంది” అని తన అవ్వ చెప్పిన మాటల స్ఫూర్తితో గద్దర్ ఈ పాటను సృష్టించాడు.

సాహిత్యంలో ‘అమ్మ’ మీద విస్తృతమైన రచనలు వచ్చాయి. ‘అమ్మ’ అనే రెండక్షరాలే ఒక ‘మహాకావ్యం’ గా కవులు అభివర్ణించారు. గద్దర్ ఆ ధోరణిలోకి వెళ్లకుండా విభిన్న స్వరంతో అమ్మకే కాదు స్త్రీ లోకానికంతటికి ఒక సాధికారికతను అందించాడు. విప్లవోద్యమం మహిళల సమస్యలకు, అస్తిత్వ విలువలకు ప్రాధాన్యం ఇచ్చిన పాటగా దీన్ని భావించవచ్చు.గద్దర్ రాసిన పాటలలో ఈ పాట అమ్మ ప్రేమలాగానే అమ్యూలమైంది.

సిరిమల్లె సెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమ్మా

  • గద్దర్

సిరిమల్లె సెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమ్మా
నీవు సినబోయి కూసున్న వెందుకమ్మో ఎందుకమ్మా
మోకాళ్లమట్టూకు బురదలో దిగబడి
ఎద్దోలే ఎనుకకూ ఒక్కొక్క అడుగేసి
అయ్యొ నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మా
నీ నడుములే ఇరిగేనా లచ్చుమ్మమ్మో లచ్చుమమ్మా

|| సిరిమల్లె ||

కాళ్లు గడుపులు మొక్కి దొరకు గొయ్యాబోతె
వరిమోపు ఎత్తుకొని బిరబిర నడువంగ
అయ్యొ కాల్జారి పడ్డావ లచ్చుమమ్మో లచ్చుమమ్మా
నీ కాల్జేయి ఇరిగేన లచ్చుమమ్మో లచ్చుమమ్మా

|| సిరిమల్లె ||

నెత్తంత మాసింది రయికంత శినిగింది
కొత్తది కొననీకి పైసలు లేవాయె
కుంచి పేల్కలు గట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మా
నీవు కూలికె బోయినవ లచ్చుమమ్మో లచ్చుమమ్మా

|| సిరిమల్లె ||

పాసిపోయిన బువ్వ మాడిపోయిన గట్క
సలిగంజి పోసుకొని సప్పదే మింగితే
కక్కడేర్గుడు పెట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మా
నీ డొక్కంత గుంజింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా

|| సిరిమల్లె ||

గాడ్పొచ్చి గుడిసెంత గాలికెగిరీ పాయె
సలికాలమొచ్చింది సాప సింపులు లేవు
సలికి ఒణుకుడుబెట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మా
నీ సంటోడు సచ్చిండ లచ్చుమమ్మో లచ్చుమమ్మా

|| సిరిమల్లె ||

ఆకలికి పొరగాండ్లు అల్లాడిపోవంగ
అన్నా రెడ్డికి నీవు జొన్నకొయ్యాబోతె
అయ్యొ జొన్న కొయ్యాదిగి
నీ కాలంత వాసింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా

|| సిరిమల్లె ||

ఏనె గుండ్ల కింద సవుకారి గుండంల
ఎరువు సల్లాబోతె ఎర్రతేలు కరిసి
పోట్లు మంటలెత్తి లచ్చుమమ్మో లచ్చుమమ్మా
నీవు పొలమంత బొర్లినవ లచ్చుమమ్మో లచ్చుమమ్మా

|| సిరిమల్లె ||

దసరా పండుగ వచ్చె దమ్మిడీ లేదాయె
దీపావళి వచ్చె దీపంతె లేదాయె
శివరాత్రి వచ్చింది ఉపవాసముండాలె
బతుకంత శివరాత్రి లచ్చుమమ్మో లచ్చుమమ్మా
నీ బతుకంత అమవాస లచ్చుమమ్మో లచ్చుమమ్మా

|| సిరిమల్లె ||

ఏ కర్మమనుకోని ఏడుపాయలెల్లంగ
గాచారమనుకోని నాచారమెల్లంగ
తొవ్వలో దొంగలు లచ్చుమమ్మో లచ్చుమమ్మా
నీ బువ్వ గుంజూకొనిర లచ్చుమమ్మో లచ్చుమమ్మా

|| సిరిమల్లె ||

పక్కింటి పోశమ్మ ఎనుకింటి ఎల్లమ్మ
ముందింటి ముత్తమ్మ ఇరుగింటి ఈరమ్మ
కూలోల్లకందరికి కూడు దొరకాలని
కొమిరెల్లి కొండల్లో లచ్చుమమ్మో లచ్చుమమ్మా
వాళ్లు కొలిమి రాజేసిండ్రు లచ్చుమమ్మో లచ్చుమమ్మా

|| సిరిమల్లె ||

ఎన్నాళ్లు ఏడ్చేవు ఎంతాని ఏడ్చేవు
ఏడ్చినా తూడ్చినా ఏమి సాధించేవు
నీ తోటి చెల్లెళ్లు నీతోటి తమ్ముళ్లు
పోరుబాటలోన ఎత్తిండ్రు కొడవళ్లు
కొడవండ్లు నూరుకొని లచ్చుమమ్మో లచ్చుమమ్మా
నీవు కూలి దండులో చేరు లచ్చుమమ్మో లచ్చుమమ్మా

కూలి దండులో చేరు లచ్చుమమ్మో లచ్చుమమ్మా
నీ కొడుకులను కలువే లచ్చుమమ్మో లచ్చుమమ్మా

జ‌న‌నం: న‌ల్ల‌గొండ‌. 'ఆధునిక క‌విత్వంలో అస్తిత్వ వేద‌న‌', 'అంతర్ముఖీన క‌విత్వం' అనే అంశాల‌పై ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ ప‌రిశోధ‌న చేశారు. ప్రాథ‌మిక త‌ర‌గ‌తి నుండి డిగ్రీ స్థాయి తెలుగు పాఠ్య పుస్త‌కాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మైన స‌భ్యుడిగా, ర‌చ‌యిత‌గా, సంపాద‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అనేక కవితలు, సమీక్షలు, ముందుమాటలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. పలు పురస్కరాలు అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 'జీవ‌న లిపి'(క‌విత్వం), 'స‌మ‌న్వ‌య‌'(సాహిత్య వ్యాసాలు) ర‌చ‌న‌ల‌తో పాటు వివిధ గ్రంథాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

One thought on “శ్రామిక స్త్రీల ఆత్మగీతం, విప్లవోద్యమ మాతృగీతం ‘సిరిమల్లె సెట్టుకింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా’

  1. శ్రమజీవులు చేసే బతుకు పోరాటంలో జాలువారిన అశ్రువులను అక్షరాగ్నికణాలుగా మార్చి గళమెత్తిన ప్రజాగాయకుడు గద్దర్. పురుషులతో సమానంగా మహిళా రైతుకూలీలు పొలం పనుల్లో రెక్కలు ముక్కలు చేసుకొని సాగించే శ్రమైక జీవనాన్ని తన పాటలో ఇమిడ్చి విప్లవ బీజాలుగా మలిచి శ్రామికోద్యమానికై అక్షరసేద్యం చేసిన ప్రజా కవి వాగ్గేయకారుడు గద్దర్. నాటికీ నేటికీ మారని మహిళా రైతుకూలీల స్థితిగతులను ప్రతిబింబించే ఈ పాటకు తనదైన ప్రత్యేక విశ్లేషణ ద్వారా డా.రఘు గారు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల అభ్యుదయాన్ని కాంక్షించే రచయితగా మనసుకు హత్తుకునే విశ్లేషణను వెంటాడే పాట ద్వారా మాకు
    అందించినందుకు డా.ఎస్.రఘు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

Leave a Reply