శ్రమదోపిడీ, శ్రామిక పరాయీకరణపై ప్రశ్న ‘కొండలు పగలేసినం’

దిగంబర కవిత్వం తెలుగు కవిత్వ చరిత్రలో ఒక సంచలన అధ్యాయం. దిగంబర కవులలో ఒకరైన చెరబండరాజు రచనా జీవనయానం మరో ప్రత్యేకమైన సంచలనాత్మక ఉద్యమ గ్రంథం. విప్లవ సాహితోద్యమ ఉధృతికి, విస్తృతికి పాటను గొప్ప సాధనంగా మార్చుకుని సానబట్టిన స్వరం చెరబండరాజుది. సుద్దాల హనుమంతు ఒరవడిలో విప్లవోద్యమ భావజాల వ్యాప్తికి పాటను బాటగా మలచుకున్న నిబద్ధ సాంస్కృతిక కార్యకర్త చెరబండరాజు. నల్లగొండ జిల్లా బీబీనగర్ దగ్గరగల అంకుశాపురం గ్రామంలో పేదరైతు కుటుంబంలో జన్మించాడు చెరబండరాజు. నిజాం పాలనలో నలిగిపోయిన ప్రాంతంలో, రజాకార్ల దుశ్చర్యలను అనుభవించిన నేల నుండి మొలకెత్తిన ఉద్యమకవి చెరబండరాజు. జానపదుల పాటలు సామాన్యుల ఎదల్ని ఏ విధంగా కదిలిస్తాయో దగ్గర్నుండి చూసిన మనిషి. అందుకే దిగంబరకవి నుండి విప్లవోద్యమ కవిగా కొత్త బాధ్యతను ఎత్తుకున్నప్పుడు పాటను ప్రాణంలా మార్చుకున్నాడు. ఎవరికోసం తాము పోరాడుతున్నామో వారి గుండెగోసల్ని వినిపించడానికి పాటలోకి తన శక్తిని ధారపోసాడు “కొలిమంటుకున్నాది /తిత్తి నిండా గాలి/ పొత్తంగా ఉన్నది/ నిప్పారి పోనీకు – రామన్నా/ పోద్దెక్కి పోనీకు లేవన్నా’ అనే పాటతో విప్లవ కొలిమిని రాజేసాడు. ఆ ఊపులో విప్లవోద్యమ సిద్ధాంతాన్ని మరింత సరళీకృత౦ చేస్తూ సామాన్యుడి చైతన్యాన్ని మరింత పెంపొందించడానికి ‘ కొండలు పగలేసిన౦, బండలనూ పిండినం’ అంటూ డైనమైట్ లాంటి పాటను సృష్టించాడు చెరబండరాజు. 1972లో రాసిన ఈ పాట ఆనాటి విరసం సమావేశాలలో, పౌరహక్కుల సభలలో, జననాట్య మండలి వేదికలమీదా, అనేక ప్రజోపయోగ సభలలో ఒక ఉత్తేజభరితమైన గీతంగా మారుమ్రోగింది. ఈ పాటకు ఒక గొప్పచరిత్ర ఉంది. అటువంటి ఈ పాటలో కవి అందించిన సందేశాన్ని మరోసారి స్మరిద్దా౦.
“కొండలు పగలేసినం
బండలనూ పిండినం
మా నెత్తురు కంకరగా
ప్రాజెక్టులు గట్టినం
శ్రమ ఎవడిదిరో
సిరి ఎవడిదిరో”


ఈ పాటలో కఠినమైన పదాలు, సంక్లిష్టమైన సమాసాలు లేవు. భావం కోసం, అర్ధవివరణ కోసం, నిఘంటువుల్ని చూడనవసరం లేని సరళమైన పాట ఇది. ‘కొండలు పగలేసినం’ అని సులువుగా పాడుకున్నంత సౌఖ్యం కొండలు పగలగొట్టడంలో లేదు. ప్రాణాలను పణంగా పెట్టి క్వారీల్లో, కొండల్లో డైనమెట్లు పెట్టి కూలీలు కొండలు పగలగొడతారు. ఏ మాత్రం ఏమరుపాటుగా వున్నా తమ చావుకు తామే కారకులవుతారు. పగిలిన బండలను బరువైన సుత్తితో చిన్న చిన్న రాళ్లుగా మార్చాలి. అందుకోసం తమ కండలను కరిగించాలి. చెమట ప్రవాహంలా కారిపోవాలి. వొంట్లోని నెత్తురు ఆవిరైపోవాలి. శ్రామికుడి ఇంతటి శ్రమలోంచే గొప్ప గొప్ప బహుళార్ధక సాధక ప్రాజెక్టులు, బహుళ అంతస్థుల సముదాయాలు నిర్మితమవుతాయి. ఆ శ్రామికుడి నిరంతర శ్రమ అభివృద్ధిగా పరిణామం చెందుతుంది. కాని శ్రామికుడి బ్రతుకులో మాత్రం చిన్న కంకరాయంత అభివృద్ధి కూడా చోటు చేసుకోదు. ఈ పరిణామాల పట్ల కలత చెందిన కవి ఆగ్రహంతో ‘శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో’ అనే ఒక మౌలికమైన ప్రశ్నను స౦ధించాడు. ఈ ప్రశ్నలే ఈ పాటకు ప్రధాన ఆయువు.
“ బంజర్లను నరికినం
పొలాలను దున్నినం
మా చెమటలు ఏరులుగా
పంటలు పండించినం
గింజెవడిదిరో
గంజెవడిదిరో”


పాటలోని చివరి రెండు పదాలు లేదా ప్రశ్నల కోసమే పై చరణాలు రాసాడు కవి. వ్యవసాయం చేయడానికి భూమి కావాలి. సాగుకు సాధ్యంకాని నేలను వ్యవసాయానికి అనుగుణంగా రైతు పొలాన్ని రూపొందిస్తాడు. తమ చెమటలను సాగునీరుగా మళ్లించి పంటలు పండిస్తాడు. తాను పండించిన ధాన్యపు గింజలు తనకు కాకుండా ఎవడి గడీలోకో, గరిసెలోకో వెళ్లిపోతాయి. కంటెదుట పంటరాశులున్న పస్తులుండవల్సిన పరిస్థితి సాగురైతుది. తన తనువును ఒక ఉత్పత్తి సాధనాల కేంద్రంగా మార్చుకుని చేసిన శ్రమ తనకు కాకుండా పోయింది. తినడానికి మెతుకులేదు. గంజి నీళ్ళు తాగవల్సిన దుస్థితి. ఈ దోపిడీకి కారణమైన వ్యవస్థల మీద అధిపత్యపు వ్యక్తుల మీద మరో బలమైన ప్రశ్నను విసురుతున్నాడు కవి.
“మగ్గాలను పెట్టినం
పోగు పోగు వడికినం
మా నరాలే దారాలుగ
గుడ్డలెన్నో నేసినం
ఉడుకెవడిదిరో
వణుకెవడిదిరే

సమాజంలో అనేకమంది వృత్తికారులు ఉన్నారు. వీరిలో చేతివృత్తికారుల బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయోఒక చేనేత కార్మికుడి పని ఆధారంగా వర్ణిస్తున్నాడు చెరబండరాజు. సమాజంలో వృత్తికారుల ప్రాధాన్యం అనిర్వచనీయం. కాని వారు తమ వృత్తిని నమ్ముకుని బతుకును దయనీయంగా గడపడం వర్ణనాతీతం. ఒక నేత కార్మికుడు పోగు పోగు వడికి బట్టలు నేసినందుకు వచ్చిన ఫలితం నిరాశజనకం. తన ‘నరాలను దారాలుగా మార్చుకోవడం’ లోని స్వీయ హింసాత్మకశ్రమను చెప్పడంలోనే కవికి వృత్తికారుల పట్ల అభిమాన తీవ్రతను అంచనా వేయవచ్చు. తాను తయారుచేసిన వస్తువే తనకు దొరకకపోవడం, తనను వెక్కిరించడం ఎవరినైనా లోతుగా గాయపరుస్తుంది. తన శ్రమ వస్త్ర్వీకరణతో వచ్చిన పరాయీకరణ మరింతగా బాధిస్తుంది. తాను నేసిన వస్త్రం తన అభిమానాన్ని కాపాడకపోవడం, తను నేసిన వస్త్రంతో ఇంకొకడు ఆర్ధిక ప్రయోజనం పొందడం ఒక వైపరీత్యం. సామాజిక అసమానతలు, శ్రామిక పరాయీకరణ కవిలో ధిక్కారాన్ని, సాహసాన్ని రగుల్కొల్పింది. అందులోంచే వృత్తికారుల వేదనను వినిపించాడు.
“యంత్రాలను తిప్పినం
ఉత్పత్తులు పెంచినం
మాశక్తే విద్యుత్తుగా
ఫ్యాక్టరీలు నడిపినం
మేడెవడిదిరో
గుడిసెవడిదిరో


పారిశ్రామిక ప్రగతికోసం మనిషి యంత్రంగా మారిపోయిన స్థితిలో మనం వున్నాం. ఉత్పత్తులు మానవాళి సంక్షేమం కోసం ఉపయోగపడాలి. వ్యక్తుల ఆస్తులు, అంతస్తులు పెంచుకోవడానికి మానవశక్తి వృధాకకూడదు.మనిషిలోని శారీరక శక్తి, సృజనాత్మక ప్రతిభతో ఫ్యాక్టరీల నిర్మాణం జరిగింది. ఏ పారిశ్రామిక పురోగతైనా సామూహిక స్వప్నసాఫల్య దిశగా పయనించాలి. పెట్టుబడిదారుడి ఆర్ధిక స్థాయి పెంచడం కోసం కార్మికుడు శ్రమిస్తున్నట్లుగా విధానాలు కన్పిస్తున్నాయి. ఒకవైపు నక్షత్రాలను ముద్దాడే మేడల్లో నివసిస్తున్నవారు, మరోవైపు ఎండకు ఎండుతూ వానకు నానుతున్న గుడిసెల్లోని బతుకు చిత్రాల్ని దృశ్యీకరిస్తున్నాడు కవి. మేడల పునాదులు కాదు పెట్టుబడిదారుల వ్యవస్థల మూలాలు కదిలిపోయే ప్రశ్నల ప్రకంపనాలు ఈ పాటలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ వైరుధ్యాలకు గల కారణాలను కవి అన్వేషిస్తున్నాడు. వైరుధ్యాలు లేని లోకం కోసం నిర్మాణాత్మక కృషిని తన పాట ద్వారా అందిస్తున్నాడు.

శ్రీశ్రీ ‘ప్రతిజ్ఞ’ కవితలో మార్క్సిస్ట్ మేనిఫెస్టోను పొందుపరిచినట్లుగా చెరబండరాజు ఈ పాటలో కమ్యూనిస్టు సిద్ధాంతంలోని మూల వాదనలన్ని వినిపిస్తున్నాడు. సమాజంలో కీలకమైన చోదకశక్తులైన వ్యవసాయదారులు, అసంఘటిత రంగ శ్రామికులు, చేతివృత్తి పనివారు, ఫ్యాక్టరీలో కార్మికులు, ఏరోజుకారోజు పని వెతుక్కునే బడుగు కూలీజీవుల శ్రమైక సౌందర్య శక్తిని ప్రదర్శిస్తుంది ఈ గీతం. పాలకవర్గాల పీడనావిధానాలు, పెట్టుబడిదారుల అమానవీయ దోపిడీ విధానాల్ని అంతమొందించే ప్రక్రియలో భాగంగా ఈ గీతన్ని ఇలా ముగిస్తాడు కవి.
“ కారణాలు తెలిపినం
ఆయుధాలు పట్టినం
మా యుద్ధం ఆపకుండ
విప్లవాలు నడిపెదం
చావు మీదిరో
గెలుపు మాదిరో”

చెరబండరాజు చాలా సూటిగా తన దృక్పథాన్ని, తమ పోరాటమార్గాన్ని ప్రకటిస్తున్నాడు. శ్రామికుడు సృష్టించిన వస్తువు శ్రమ విలువను వెక్కిరించినప్పుడు, శ్రామికుడికంటే పెట్టుబడిదారుడు శ్రీమ౦తుడైనప్పుడు యుద్ధం అనివార్యమవుతుంది. పనిముట్లు పట్టిన చేతులే ఆయుధాలు పట్టక తప్పదు. శ్రామికుడి విలువలు తగ్గిపోతూ శ్రీమంతుడికి పెరిగే అదనపు విలువలపై అంతర్యుద్ద౦ మొదలవుతుంది. శ్రామికవర్గం శ్రమ విలువల గొప్పతనాన్ని వివరిస్తూనే వారిని విప్లవ బాటలోకి తీసుకెళ్తున్నాడు. రేపటి గెలుపు కోసం అవసరమైన పోరాట పటిమను నేర్పుతున్నాడు కవి.

చెరబండరాజు కవిత్వం శ్రామికుడి కేంద్రంగా చేసుకుని నడుస్తుంది. ఆ దారిలో ఎదురయ్యే అనేక అవరోధాలను ఎదుర్కోవడంలో రాజ్యానికి కూడా బెదరని కవి. “ప్రపంచ పురోగతి సా౦తం శ్రమజీవి నెత్తుటి బొట్టులోనే ఇమిడివుంది.” అనే చారిత్రక సత్యాన్ని, త్యాగాన్ని గుర్తించిన కవి గొంతులోంచి దుంకిన పాట ఇది. ఒక సామాజిక వాస్తవికతను వర్ణిస్తూనే ఆవేశాన్ని, ధిక్కారాన్ని, సాహసాన్ని నూరిపోసే పోరాట గీతం ఇది. దిగంబర కవిగానే కాదు విప్లవ కవిగా నిబద్ధతతో సాహిత్యాన్ని సృజించిన రచయిత. రాజ్య నిర్భంధాలు, నిషేధాలు, కుట్రలకు ఎదురొడ్డి నిలిచిన యోధుడు. రావిశాస్త్రి అన్నట్లు “తన ప్రతిగేయం నెత్తుటిదీపం” గా వెలిగించి విరసం భావజాల చైతన్యాన్ని విస్తృతపరచడంలో పాటను పదునెక్కిన ఆయుధంగా చెక్కిన కవి చెరబండరాజు.

(కొండలు పగలేసినం) (పూర్తి పాట)


“కొండలు పగలేసినం
బండలనూ పిండినం
మా నెత్తురు కంకరగా
ప్రాజెక్టులు గట్టినం
శ్రమ ఎవడిదిరో
సిరి ఎవడిదిరో”

“బంజర్లను నరికినం
పొలాలను దున్నినం
మా చెమటలు ఏరులుగా
పంటలు పండించినం
గింజెవడిదిరో
గంజెవడిదిరో”

“మగ్గాలను పెట్టినం
పోగు పోగు వడికినం
మా నరాలే దారాలుగ
గుడ్డలెన్నో నేసినం
ఉడుకెవడిదిరో
వణుకేవడిదిరే

“యంత్రాలను తిప్పినం
ఉత్పత్తులు పెంచినం
మాశక్తే విద్యుత్తుగా
ఫ్యాక్టరీలు నడిపినం
మేడేవడిదిరో
గుడిసెవడిదిరో

“కారణాలు తెలిపినం
ఆయుధాలు పట్టినం
మా యుద్ధం ఆపకుండ
విప్లవాలు నడిపెదం
చావు మీదిరో
గెలుపు మాదిరో”

జ‌న‌నం: న‌ల్ల‌గొండ‌. 'ఆధునిక క‌విత్వంలో అస్తిత్వ వేద‌న‌', 'అంతర్ముఖీన క‌విత్వం' అనే అంశాల‌పై ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ ప‌రిశోధ‌న చేశారు. ప్రాథ‌మిక త‌ర‌గ‌తి నుండి డిగ్రీ స్థాయి తెలుగు పాఠ్య పుస్త‌కాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మైన స‌భ్యుడిగా, ర‌చ‌యిత‌గా, సంపాద‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అనేక కవితలు, సమీక్షలు, ముందుమాటలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. పలు పురస్కరాలు అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 'జీవ‌న లిపి'(క‌విత్వం), 'స‌మ‌న్వ‌య‌'(సాహిత్య వ్యాసాలు) ర‌చ‌న‌ల‌తో పాటు వివిధ గ్రంథాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

5 thoughts on “శ్రమదోపిడీ, శ్రామిక పరాయీకరణపై ప్రశ్న ‘కొండలు పగలేసినం’

  1. రఘు గారు…నెలా నెలా ‘వెంటాడే పాట’తో మాలో ఆలోచనల ‘కొలిమి’ని రగిలిస్తున్నారు. ధన్యవాదాలు!

    1. మీరు వ్రాసిన వ్యాఖ్యనము చాలా బాగుంది

  2. ఈ పాట ద్వారా కవి శ్రమ దోపిడీ చేస్తున్న వ్యవస్థపై అనేక మౌలిక ప్రశ్నలు సంధించాడు.

    తరతరాలుగా చేతివృత్తుల వారు అనేక రకాలుగా శ్రమ దోపిడికి గురైన విధానాన్ని , కార్మికుడు శ్రమ పరాయీకరణతో ఆకలినాదాన్ని చంపడానికి తనను తాను హింసించుకొన్న తీరును రచయిత డా.ఎస్.రఘు గారు విశదీకరించిన విదానం బాగుంది. దోపిడికి గురైన శ్రామిక వ్యవస్థ ఎదురు తిరిగే పోరాటంలో రక్తానికి బదులుగా విప్లవ గేయాలు చిందించిందా అన్నట్లుగా ఉన్న ఈ గేయం గొప్పదనాన్ని తనదైన విశ్లేషణాత్మక శైలిలో వివరించి, కవి హృదయంతో చేతివృత్తుల స్వేదయాగానికి జయకేతనం ఎగురవేసినందుకు డా.రఘు గారికి మరొక్కసారి హేట్సాఫ్…..

    సి.వి.శ్రీనివాస్

  3. చేరబండరాజు పాటలపై మీ విశ్లేషణ బాగుంది రఘు గారు…అభినందనలు

  4. మంచి విశ్లేషణ చేశారు బాగుంది సర్.

Leave a Reply