శోకతప్త విశాఖ

సముద్రం ఏడుస్తోంది
అలల వెక్కిళ్ళు పెడుతూ
ఈ విశాల సముద్రం ఏడుస్తోంది

యారాడ కొండకేసి తలబాదుకొని
విశాఖ అఖాతం శోకిస్తోంది

కంటి లైట్ హౌస్ ని ఆర్పుకొని
హార్భర్ విశాఖ హోరున విలపిస్తోంది

నిర్జన నిశీథ శిధిలాకాశ క్రూర మేఘ పరిహాసానికి
గాయపడ్డ రామకృష్ణ బీచు
చిమ్మట వలపోతలకు వంతపాడుతోంది

తీరాల ఇసుక చెక్కిళ్ళ మీద
ధారలు కట్టిన దుఃఖపు కెరటాల నురగలతో
అనంత సముద్రం అదేపనిగ ఏడుస్తోంది

కాళ్ళకు నడక నేర్పుతున్న బుడి బుడి అడుగుల బుడ్డోడు
మురిపంగా సాగుతున్న ఆ మూడు కాళ్ళ ముదుసలి జంట
కొండల్ని పిండికొట్టే యమహా ఉడుకురక్తం
బంగరు భవిత ధీమాతో కదులుతున్న పాలబుగ్గల తెల్లకోటు
తుఫాను గాలికి రాలుతున్న పేకమేడలు
ఈ మనిషి కూలుతున్న దృశ్యం చూస్తూ
సముద్రం ఏడుస్తోంది
గాయపడ్డ విశాఖను అలుముకొని
సముద్రం ఏడుస్తోంది

అందాలను ప్రేమించిన విశాఖ
అడవిని ప్రేమించిన విశాఖ
ఆయుధాన్ని ప్రేమించిన విశాఖ
వైవిధ్య జీవ విధాన్ని ప్రేమించిన విశాఖ
సకల చరాచర జీవరాశులు
నిశ్శబ్దంగా రాలిపడుతున్న దృశ్యం చూస్తూ ఏడుస్తోంది

మరోప్రపంచ గీతమై దద్ధరిల్లిన విశాఖ
మహాకవుల నీడల జాడలు చూపుతున్న విశాఖ
కల్లోల కాలంల కరపత్రమై దారి చూపిన విశాఖ
మోహనగరమై నన్నల్లుకున్న నా విశాఖ
విశాఖ దగ్ధగీతమై శోకిస్తోంది

ఇది ఎవరు విసిరిన మోహపు విష బాణమే విశాఖ?
ఇది ఎవరు రాసిన ద్రోహపు కాల జ్ఞానమే విశాఖ?

వూహాన్ పుక్కిలించి ఉమ్మిన
వైరస్ వలలో చిక్కి తనుకులాడుతున్న వేళ
ఊహకందని దయ్యపు గాలి సుడిని తోలిందెవ్వరే విశాఖ?

కడుపునిండా విషం నింపుకున్న పెట్టుబడి పరిష్వంగ పర్యవసానమేనా?
మాల్తూస్ మళ్ళీ లేసొచ్చి చేసిన ప్రయోగ ఫలమేనా?

పుట్టింది యాదాద్రి భువనగిరి జిల్లా బొందుగుల. మెడికల్ కాలేజీ జీవితం నుంచి సీరియస్‌గా కవిత్వం రాస్తున్నారు. రచనలు: 'జలపాత శబ్దంలోకి' (1997), 'ఎన్నాద్రి' (2008), 'ఇడుపు కాయితం' (2015), వైద్య వృత్తి మీద రాసిన 'అందని చందమామ' (దీర్ఘ కవిత 2008), 'ఇరువాలు' (తెలంగాణ సాహిత్య వ్యాసాలు (2013) ప్రచురించారు. ప్రస్తుతం హైదరాబాదులో పిల్లల వైద్యుడిగా పని చేస్తున్నారు.

Leave a Reply